143. నూట నలువది మూడవ అధ్యాయము

గంధమాదనయాత్రలో పాండవులపై గాలితో కూడిన జడివాన.

వైశంపాయన ఉవాచ
తే శూరాస్తతథన్వానః తూణవంతః సమార్గణాః ।
బద్ధగోధాంగులిత్రాణాః ఖడ్గవంతోఽమితౌజసః ॥ 1
పరిగృహ్య ద్విజశ్రేష్ఠాన్ జ్యేష్ఠాః సర్వధనుష్మతామ్ ।
పాంచాలీసహితా రాజన్ ప్రయయుర్గంధమాదనమ్ ॥ 2
పిమ్మట ధనుర్ధారులలో శ్రేష్ఠులైన పాండవులు ధనుస్సు, బాణాలు, డాలు, కత్తి, వ్రేళ్ళకు తొడుగులు ధరించి బ్రాహ్మణులతో ద్రౌపదితో గంధమాదన పర్వతంవైపు బయలుదేరారు. (1,2)
సరాంసి సరితశ్చైవ పర్వతాంశ్చ వనాని చ ।
వృక్షాంశ్చ బహులచ్ఛాయాన్ దదృశుర్గిరిమూర్ధని ॥ 3
సరస్సులు, నదులు, పర్వతాలు, వనాలు దాటి గంధమాదన వనం మీది వృక్షచ్ఛాయలను తనివితీరా చూశారు. (3)
నిత్యపుష్పఫలాన్ దేశాన్ దేవర్షిగణసేవితాన్ ।
ఆత్మన్యాత్మానమాధాయ వీరా మూలఫలాశినః ॥ 4
చేరురుచ్చావచాకారాన్ దేశాన్ విషమసంకటాన్ ।
పశ్యంతో మృగజాతాని బహూని వివిధాని చ ॥ 5
ఫలపుష్పాదులతో నిండిన ఇలాంటి ప్రదేశాన్ని వారు ఇంతకుముందు చూడలేదు. ఈ పర్వతంపై దేవర్షుల సముదాయం నివసిస్తోంది. పాండవులు పరమాత్మ చింతనలో మనస్సు లగ్నం చేసి నిమ్నోన్నత ప్రదేశాల్లో ఫలాలను తింటూ ముందు సాగారు. ఆ మార్గంలో చాలరకాల మృగాలు ఉన్నాయి. వాటి సంఖ్య కూడ ఎక్కువగా ఉంది. (4,5)
ఋషి సిద్ధామరయుతం గంధర్వాప్సరసాం ప్రియమ్ ।
వివిశుస్తే మహాత్మానః కిన్నరాచరితం గిరిమ్ ॥ 6
ఋషులు, సిద్ధులు, దేవతలు అక్కడ సంచరిస్తున్నారు. గంధర్వాప్సరసలకు ఇష్టమై కిన్నరగణంచే సేవింపబడే ఆ పర్వతానికి పాండవులు చేరారు. (6)
ప్రవిశత్స్వథ వీరేషు పర్వతం గంధమాదనమ్ ।
చండవాతం మహద్ వర్షం ప్రాదిరాసీత్ విశాంపతే ॥ 7
పాండవులు గంధమాదనం పై కాలుమోపగానే పెద్దగాలితో గొప్పవర్షం కురవసాగింది. (7)
తతో రేణుః సముద్భూతః సపత్రబహులో మహాన్ ।
పృథివీం చాంతరిక్షం చ ద్యాం చైవ సహసాఽఽవృణోత్ ॥ 8
అటుపైన ఆకులతో కలిసిన ధూళి ఎక్కువగా ఎగిరి భూమిని, ఆకాశాన్ని, స్వర్గాన్ని ఒక్కసారిగా ఆవరించింది. (8)
న స్మ ప్రజ్ఞాయతే కించిత్ ఆవృతే వ్యోమ్ని రేణునా ।
న చాపి శేకుస్తత్ కర్తుమ్ అన్యోన్యస్యాభిభాషణమ్ ॥ 9
న చాపశ్యంస్తతోఽన్యోన్యం తమసావృతచక్షుషః ।
ఆకృష్యమాణా వాతేన సాశ్మచూర్ణేన భారత ॥ 10
ధూళిచే ఆకాశం కప్పబడగా కొంచెం కూడ ఎదుట వస్తువు కనబడటం లేదు. ఒకరితో ఒకరికి మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. గాఢాంధకారం కన్నులనావరించి ఒకరినొకరు చూడలేకపోయారు. రాళ్ళచూర్ణంతో కూడి గాలి తలోవైపుకి లాగివేస్తోంది. (9,10)
ద్రుమాణాం వాతభగ్నానాం పతతాం భూతలేఽనిశమ్ ।
అన్యేషాం చ మహీజానాం శబ్దః సమభవన్మహాన్ ॥ 11
ప్రచండవాయువేగానికి విరిగి, భూమిపై పడిన చెట్లధ్వనులతో ఆ పర్వతప్రాంతం మారుమ్రోగింది. (11)
ద్యౌఃస్విత్ పతతి కిం భూమిః దీర్యతే పర్వతో ను కిమ్ ।
ఇతి తే మేనిరే సర్వే పవనేనాపి మోహితాః ॥ 12
ఆకాశం ఈ వేగానికి క్రిందపడుతోందా? పర్వతం చీలిపోతోందా? అని ఆ గాలిని చూసి మోహితులై పాండవులు అనుకొన్నారు. (12)
తే పతానంతరాన్ వృక్షాన్ వల్మీకాన్ విషమాణి చ ।
పాణిభిః పరిమార్గంతః భీతా వాయోర్నిలిల్యిరే ॥ 13
పిమ్మట వాఱి దారిలో పడిన వృక్షాలను, పుట్టలను చేతితో తప్పించుకొంటూ భయపడి, బాగా గాలివీచినప్పుడు అక్కడక్కడ దాగి, ముందుకు పోయారు. (13)
తతః కార్ముకమాదాయ భీమసేనో మహాబలః ।
కృష్ణామాదాయ సంగమ్య తస్థావాశ్రితయ్ పాదపమ్ ॥ 14
ఆ సమయాన బలశాలి అయిన భీమసేనుడు చేతితో ధనుస్సుగైకొని ద్రౌపదిని తన సమీపంలో ఉంచుకొని ఆ ప్రదేశంలోని చెట్టును ఆశ్రయించి నిలబడ్డాడు. (14)
ధర్మరాజశ్చ ధౌమ్యశ్చ నిలిల్యాతే మహావనే ।
అగ్నిహోత్రాణ్యుపాదాయ సహదేవస్తు పర్వతే ॥ 15
ధర్మరాజు, ధౌమ్యుడు అగ్నిహోత్రసామగ్రి తీసికొని ఆ వనంలో ఎక్కడో దాగారు. సహదేవుడు పర్వతంపై సురక్షిత స్థానంలో దాగాడు. (15)
నకులో బ్రాహ్మణాశ్చాన్యే లోమశశ్చ మహాతపాః ।
వృక్షానాసాద్య సంత్రస్తాః తత్ర తత్ర నిలిల్యిరే ॥ 16
నకులుడు, ఇతర బ్రాహ్మణులు, లోమశుడు చెట్లను ఆశ్రయిమ్చి భయపడి అక్కడక్కడ దాగి ఉన్నారు. (16)
మందీభూతే తు పవనే తస్మిన్ రజసి శామ్యతి ।
మహద్భిర్జలధారౌఘైః వర్షమభ్యాజగామ హ ॥ 17
భృశం చటచటాశబ్దః వజ్రాణాం క్షిప్యతామివ ।
తతస్తాశ్చంచలాభాసః చేరురభ్రేషు విద్యుతః ॥ 18
క్రమంగా గాలి తగ్గి, ధూళి శమించి గొప్పజలధారలతో వర్షం పడసాగింది. శీఘ్రంగా ఛటఛటాశబ్దంతో వజ్రపాతంతో సమానంగా మేఘమాలలు, అన్నివైపుల చంచలంగా ప్రకాశించే మెరుపుతీగలు సంచరించసాగాయి. (17,18)
తతోఽశ్మసహితా ధారాః సంవృణ్వంత్యః సమంతతః ।
ప్రపేతురనిశం తత్ర శీఘ్రవాతసమీరితాః ॥ 19
వడగళ్ళతో కూడిన వర్షధారలు అన్ని దిక్కులూ కప్పివేస్తూ శీఘ్రమైన గాలిచే గెంటబడసాగాయి. (19)
తత్ర సాగరగా హ్యాపః కీర్యమాణాః సమంతతః ।
ప్రాదురాసన్ సకలుషాః ఫేనవత్యో విశాంపతే ॥ 20
అక్కడ నాలుగువైపుల నుంచి జలం సముద్రగామినులైన నదులరూపంగా కనిపిస్తోంది. మట్టితో, నురుగుతో కలిసి ఉంది. (20)
వహంత్యో వారి బహులం ఫేనోడుపపరిప్లుతమ్ ।
పరిసస్రుర్మహాశబ్దాః ప్రకర్షంత్యో మహీరుహాన్ ॥ 21
నురుగుపడవలతో నిండి అగాధజలం ప్రవహిస్తూ నదులు విరిగిపడుతున్న చెట్లతో ధ్వనిచేస్తూ వేగంగా ప్రవహిస్తున్నాయి. (21)
తస్మిన్నుపరతే శబ్దే వాథే చ సమతాం గతే ।
గతే హ్యంభసి నిమ్నాని ప్రాదుర్భూతే దివాకరే ॥ 22
నిర్జగ్ముస్తే శనైః సర్వే సమాజగ్ముశ్చ భారత ।
ప్రతస్థిరే పునర్వీరాః పర్వతం గంధమాదనమ్ ॥ 23
కొంతసేపటికి ధ్వని, వాయువు తగ్గిపోగా నీరు లోతైన ప్రదేశాలకు చేరింది. సూర్యుడు ఉదయించాడు. వీరులమ్దరు వారివారి స్థానాల నుమ్చి బయటకు వచ్చి గంధమాదన పర్వతానికి బయలుదేరారు. (22,23)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 143 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశము అను నూట నలువది మూడవ అధ్యాయము. (143)