149. నూట నలువది తొమ్మిదవ అధ్యాయము

హనుమంతుడు యుగధర్మాలు వర్ణించుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తో మహాబాహుః భీమసేనః ప్రతాపవాన్ ।
ప్రణిపత్య తతః ప్రీత్యా భ్రాతరం హృష్టమానసః ॥ 1
ఉవాచ శ్లక్ష్ణయా వాచా హనూమంతం కపీశ్వరమ్ ।
మయా ధన్యతరో నాస్తి యదార్యం దృష్టవానహమ్ ॥ 2
వైశంపాయనుడు పలికాడు - హనుమంతుడు పలికిన మాటలకు భీమునికి చాలా ఆనందం కలిగింది. నమస్కరించి ఆనంద పరవశత్వంతో హనుమంతుని గూర్చి మధురంగా మాట్లాడుతూ "నాకంటె ధన్యుడు వేరొకడు లేడు. కపిశ్రేష్ఠుడవు, పూజ్యుడవు అయిన నీ దర్శనం నాకు దక్కింది. (1,2)
అనుగ్రహో మే సుమహాన్ తృప్తిశ్చ తవ దర్శనాత్ ।
ఏకం తు కృతమిచ్ఛామి త్వయాద్య ప్రియమాత్మనః ॥ 3
నీవు నాపై ఎంతో దయచూపావు. నీ దర్శనంతో నాకు చాలా తృప్తి కలిగింది. నేను నీ ద్వారా నాకిష్టమైన పనిని పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నాను. (3)
యత్ తే తదాఽసీత్ ప్లవతః సాగరం మకరాలయమ్ ।
రూపమప్రతిమం వీర తదిచ్ఛామి నిరీక్షితుమ్ ॥ 4
సముద్రం దాటినప్పటి సాటిలేని నీ రూపాన్ని చూడాలని భావిస్తున్నాను. (4)
ఏవం తుష్టో భవిష్యామి శ్రద్ధాస్యామి చ తే వచః ।
ఏవముక్తః స తేజస్వీ ప్రహస్య హరిరబ్రవీత్ ॥ 5
నాకు సంతృప్తి కలుగుతుంది. నీ మాటలపై నాకు నమ్మకం ఏర్పడుతుంది." ఇలా పలికిన వెంటనే నవ్వి తేజోవంతుడైన హనుమంతుడు భీమునితో అన్నాడు. (5)
న తచ్ఛక్యం త్వయా ద్రష్టుం రూపం నాన్యేన కేనచిత్ ।
కాలావస్థా తదా హ్యన్యా వర్తతే సా న సాంప్రతమ్ ॥ 6
నీవు నా పూర్వరూపాన్ని చూడలేవు. ఇతరులు ఎవరూ కూడ చూడలేరు. ఇప్పటి సమయానికి అప్పటి సమయానికి చాలా తేడా ఉంది. (6)
అన్యః కృతయుగే కాలః త్రేతాయాం ద్వాపరే పరః ।
అయం ప్రధ్వంసనః కాలః నాద్య తద్ రూపమస్తి మే ॥ 7
భూమిర్నద్యో నగాః శైలాః సిద్ధా దేవా మహర్షయః ।
కాలం సమనువర్తంతే యథా భావా యుగే యుగే ॥ 8
బలవర్ష్మప్రభావా హి ప్రహీయంత్యుద్భవంతి చ ।
తదలం బత తద్ రూపం ద్రష్టుం కురుకులోద్వహ ।
యుగం సమనువర్తామి కాలో హి దురతిక్రమః ॥ 9
కృతయుగ సమయం వేరు, త్రేతాయుగ, ద్వాపరాల్లో వేరు, ఇది అన్ని వస్తువుల్ని నాశనం చేసే సమయం. అలాంటి రూపం నాకు కూడా ఇప్పుడు లేదు.
భూమి, నదులు, పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు ఆనాడు కాలాన్ని అనుసరించారు. యుగాన్ని, కాలాన్ని అనుసరించి శరీరం, బలం, ప్రభావాల్లో తేడా గోచరిస్తుంది. పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. నీవు ఆరూపం చూడాలని పట్టుపట్టవద్దు. నేను కూడ యుగ ధర్మాన్ని అనుసరిస్తాను. కాలాన్ని అతిక్రమించటం ఎట్టి వానికైనా అసాధ్యం. (7-9)
భీమ ఉవాచ
యుగసంఖ్యాం సమాచక్ష్వ ఆచారం చ యుగే యుగే ।
ధర్మకామార్థభావాంశ్చ కర్మవీర్యే భవాభవౌ ॥ 10
భీముడు అన్నాడు - యుగాలు ఎన్ని? వాటి ఆచారాలు ఏవి? ధర్మ, అర్థ, కామ తత్త్వములు, శుభాశుభ కర్మములు, వాని ప్రభావాలు, ఉత్పత్తి వినాశాల గురించి తెలియజెయ్యి. (10)
హనూమానువాచ
కృతం నామ యుగం తాత యత్ర ధర్మః సనాతనః ।
కృతమేవ న కర్తవ్యం తస్మిన్ కాలే యుగోత్తమే ॥ 11
హనుమంతుడు పలికాడు - అన్నింటికంటె మొదటిది కృతయుగం. అప్పుడు ధర్మం పరిపూర్ణంగా ఉంది. ఆ ఉత్తమయుగంలోని ప్రజలు వారి కర్తవ్యాల్ని చక్కగా ఆచరించారు. వారు చెయ్యాల్సిన పనులు మిగలలేదు. కావున కృతయుగం అను పేరు వచ్చింది. (11)
న తత్ర ధర్మాః సీదంతి క్షీయంతి న చ వై ప్రజాః ।
తతః కృతయుగం నామ కాలేన గుణతాం గతమ్ ॥ 12
ఆ యుగంలో ధర్మాలు క్షీణించలేదు. పిల్లలు తల్లిదండ్రులుండగా చనిపోలేదు. కొంత కాలానికి ఆ యుగంలో ప్రాధాన్యత తగ్గసాగింది. (12)
దేవదానవగంధర్వయక్షరాక్షసపన్నగాః ।
నాసన్ కృతయుగే తాత తదా న క్రయవిక్రయః ॥ 13
దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు నాగులు వీరికి పరస్పరం భేదభావం లేదు. 'అమ్ముట - కొనుట' అనే వ్యవహారమే లేదు. (13)
న సామబుగ్యజుర్వర్ణాః క్రియా నాసీచ్చ మానవీ ।
అభిధ్యాయ ఫలం తత్ర ధర్మః సన్న్యాస ఏవ చ ॥ 14
ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల, మంత్ర, అక్షరాలలో విభాగం లేదు. వ్యవసాయాదులు లేవు. చింతనధ్యానం చేతనే అందరికీ ఆ ఫలం వచ్చేది. సత్యయుగంలో ఒకే ధర్మం ప్రధానం. అది త్యాగం. సన్న్యాసం. (14)
న తస్మిన్ యుగసంసర్గే వ్యాధయో నేంద్రియక్షయః ।
నాసూయా నాపి రుదితం న దర్పో నాపి వైకృతమ్ ॥ 15
ఆ యుగంలో జ్వరాదులు, ఇంద్రియనాశం, అసూయ, దుఃఖాల వల్ల వచ్చే రోదనలు, గర్వం, వికారం కూడా లేవు. (15)
న విగ్రహః కుతస్తంద్రీ న ద్వేషో న చ పైశునమ్ ।
న భయం నాపి సంతాపో న చేర్ష్యా న చ మత్సరః ॥ 16
యుద్ధాలు, సోమరితనం, ద్వేషం, చాడీలు చెప్పటం, భయం, దుఃఖం, ఈర్ష్య, పరోత్కర్ష చూడలేకపోవటం లేవు. (16)
తతః పరమకం బ్రహ్మ సా గతిర్యోగినాం పరా ।
ఆత్మా చ సర్వభూతానాం శుక్లో నారాయణస్తదా ॥ 17
యోగులకు ఆశ్రయం, శ్రేష్ఠమైన బ్రహ్మ స్వరూపుడు, సర్వప్రాణుల అంతరాత్మ అయిన నారాయణుడు శుక్ల వర్ణంతో ఆ యుగంలో ప్రకాశించాడు. (17)
వి॥సం॥ కృత త్రేతా ద్వాపర కలియుగాలలో క్రమంగా శుక్ల, రక్త, పీత, కృష్ణవర్ణాలతో నారాయణుడుంటాడు. (నీల)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ కృతలక్షణాః ।
కృతే యుగే సమభవన్ స్వకర్మనిరతాః ప్రజాః ॥ 18
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు స్వభావసిద్ధం అయిన శుభ లక్షణాలు కలిగి ఉన్నారు. ఈ యుగంలో ప్రతివారు తమతమ కర్తవ్యాలు నిర్వహించటంలో తత్పరులై ఉన్నారు. (18)
సమాశ్రయం సమాచారం సమజ్ఞానం చ కేవలమ్ ।
తదా హి సమకర్మాణో వర్ణా ధర్మానవాప్నువన్ ॥ 19
పరమాత్మయే అందరికీ ఆశ్రయింపతగినవాడు అయ్యాడు. అతనిని పొందటానికి సదాచారాలు పాటించాలి. అందరూ పరమాత్మ జ్ఞానాన్ని పొంది తీరాలి. పరబ్రహ్మను ఉద్దేశించే వారు సత్కర్మల్ని ఆచరించాలి. ఇలా ఉత్తమ ధర్మాలఫలం లభించింది. (19)
ఏకదేవసదాయుక్తా ఏకమంత్రవిధిక్రియాః ।
పృథగ్ధర్మాస్త్వేకవేదా ధర్మమేకమనువ్రతాః ॥ 20
ఆ యుగంలోని ప్రజలు పరమాత్మయందే మనస్సులు లగ్నం చేశారు. ఒకే నామమంత్రాన్ని, విధుల్ని ఆచరించేవారు. వర్ణాశ్రమాల్ని బట్టి వేరువేరుగా ధర్మాలు ఉన్నా ఒకేవేదాన్ని ఒకే మంత్రాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధులై ఉండేవారు. (20)
చాతురాశ్రమ్యయుక్తేన కర్మణా కాలయోగినా ।
అకామఫలసంయోగాత్ ప్రాప్నువంతి పరాం గతిమ్ ॥ 21
సత్యయుగంలో ప్రజలు సకాలంలో చేసే నాలుగు ఆశ్రమాలకూ సంబంధించిన అనుష్ఠానం ఆచరించి కర్మఫలాల పట్ల ఆసక్తి కోరిక లేకపోవడం వల్ల ఉత్తమగతుల్ని పొందారు. (21)
వి॥సం॥ ప్రత్యగాత్మయొక్కడే దైవం, ప్రణవమొక్కటే మంత్రం, వేదాంత శ్రవణాదిక మొక్కటే విధి, ధ్యానాదులే క్రియ (నీల)
ఆత్మయోగసమాయుక్తః ధర్మోఽయం కృతలక్షణః ।
కృతే యుగే చతుష్పాదః చాతుర్వర్ణ్యస్య శాశ్వతః ॥ 22
చిత్తవృత్తుల్ని పరమాత్మపై నిలిపి అతనితో ఆత్మను అనుసంధానం చేసే ధర్మం కృతయుగంలో ఉంది. చాతుర్వర్ణ్యానికి ధర్మం నాలుగు పాదాలతో సంపూర్ణంగా ఉంది. (22)
ఏతత్ కృతయుగం నామ త్రైగుణ్యపరివర్జితమ్ ।
త్రేతామపనిబోధత్వం యస్మిన్ సత్రం పవర్తతే ॥ 23
ఇది సత్త్వరజస్తమోగుణ ప్రాబల్యం లేని కృతయుగం. త్రేతాయుగాన్ని గురించి విను. ఈ యుగంలోనే యజ్ఞాలు ప్రారంభం అయ్యాయి. (23)
పాదేనహ్రసతే ధర్మః రక్తతాం యాతి చాచ్యుతః ।
సత్యప్రవృత్తాశ్చ నరాః క్రియాధర్మపరాయణాః ॥ 24
ఈ యుగంలో ధర్మం యొక్క ఒక పాదం నశించింది. అచ్యుతుడు ఎఱ్ఱటిరంగులో ఉంటాడు. ప్రజలు సత్యతత్పరులు, యధావిధిగా యాగాలు, ధర్మం ఆచరించేవారు అవుతారు. (24)
తతో యజ్ఞాః ప్రవర్తమ్తే ధర్మాశ్చ వివిధాః క్రియాః ।
త్రేతాయాం భావ సంకల్పాః క్రియాదానఫలోపగాః ॥ 25
త్రేతాయుగంలో యజ్ఞధర్మాలు, సత్కర్మలు ప్రారంభం అయ్యాయి. ప్రజలకు తమ సంకల్పానుసారం వేదోక్త కర్మలు, దానం ద్వారా అభీష్టాల్ని పొందేవారు. (25)
వి॥సం॥ కృతయుగంలో సంకల్పసిద్ధులు ద్వాపరంలో భావసంకల్వులు మాత్రమే. ఈ పని చేసి ఇటువంటి ఫలితాన్ని పొందాలి అని భావించి క్రియ ద్వారా సిద్ధి పొందేవారు. (నీల)
ప్రచలంతి న వై ధర్మాత్ తపోదానపరాయణాః ।
స్వధర్మస్థాః క్రియావంతః నరాస్త్రేతాయుగేఽభవన్ ॥ 26
త్రేతాయుగంలో మనుష్యులు ధర్మ, తపో, దానాదుల నుంచి చలించకుండా ఆచరించారు. స్వధర్మ పరాయణులై క్రియాపరులై ప్రవర్తించారు. (26)
ద్వాపరే చ యుగే ధర్మః ద్విభాగోనః ప్రవర్తతే ।
విష్ణుర్వై పీతతాం యాతి చతుర్ధా వేద ఏవ చ ॥ 27
ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలతో నడిచింది. విష్ణువు పచ్చటి రంగు కలిగి ఉన్నాడు. వేదం నాలుగు రకాలుగా ఋగ్యజుస్సామాధర్వలుగా ఏర్పడింది. (27)
తతోఽన్యే చ చతుర్వేదాః త్రివేదాశ్చ తథాపరే ।
ద్వివేదాశ్చైకవేదాశ్చాప్యనృచశ్చ తథాపరే ॥ 28
కొన్ని రోజులు నాలుగు వేదాలు తెలిసినవారు, కొంతమంది మూడువేదాలు తెలిసినవారు, రెండువేదాలు తెలిసినవారు ఒక వేదమే తెలిసినవారు, కొంతమంది కొన్ని ఋక్కులు కూడ తెలియనివారై ఉన్నారు. (28)
వి॥సం॥ చతుర్వేదులు = వేదత్రయంలో చెప్పిన జ్యోతిష్టో మాదులను, అధర్వణోపనిషత్తు చెప్పిన ధ్యానాదులను కూడా ఆచరించేవారు.
త్రివేదులు = కేవలం కర్మపరులు
ద్వివేదులు = తమ శాఖలో విదించిన సంధ్యావందనాది కర్మలను ధ్యానాన్ని అనుష్ఠించేవారు,
ఏక వేదులు = ధ్యానాన్ని మాత్రం పాటించేవారు
అనృచులు = ధ్యానం మీద కూడా విరక్తిగలవారు. (నీల)
ఏవం శాస్త్రేషు భిన్నేషు బహుధా నీయతే క్రియా ।
తపోదానప్రవృత్తా చ రాజసీ భవతి ప్రజా ॥ 29
శాస్త్రాలు భిన్నభిన్నాలు కాగా క్రియలు కూడ అనేకరకాలు అయ్యాయి. తపస్సు, దానమందే ప్రజలు ప్రవర్తించటం చేత ప్రవృత్తి ఏర్పడింది. (29)
ఏకవేదస్య చాజ్ఞానాద్ వేదాస్తే బహవః కృతాః ।
సత్త్వస్య చేహ విభ్రంశాత్ సత్యే కశ్చిదవస్థితాః ॥ 30
ద్వాపరంలో ఒక్కవేదజ్ఞానమూ పూర్తిగా లేనందున వేదాలు అనేకంగా విభాగం పొందాయి. ఈ యుగంలో సాత్త్వికబుద్ధి లోపించి నందువల్ల సత్యమందు కొద్దిమందే నిలిచారు. (30)
సత్యాత్ ప్రచ్యవమానానాం వ్యాధయో బహవోఽభవన్ ।
కామాశ్చోపద్రవాశ్చైవ తదా వై దైవకారితాః ॥ 31
సత్యం పలకకపోవడం వలన వ్యాధులు అనేకం పుట్టాయి. కోరికలు, ఉపద్రవాలు దైవసంబంధాలై పీడించసాగాయి. (31)
యైరర్ద్యమానాః సుభృశం తపస్తప్యంతి మానవాః ।
కామకామాః స్వర్గకామాః యజ్ఞాంస్తన్వంతి చాపరే ॥ 32
ప్రజలంతా మిక్కిలి పీడితులై తపస్సు ఆచరించారు. కోరికలు తీర్చుకోవడానికి స్వర్గప్రాప్తి కోసం ఇతరులు యజ్ఞాలు చేశారు. (32)
ఏవం ద్వాపరమాసాద్య ప్రజాః క్షీయంత్యధర్మతః ।
పాదేనైకేన కౌంతేయ ధర్మః కలియుగే స్థితః ॥ 33
ఇలా ద్వాపరయుగం వచ్చిన మీదట అధర్మపరులై ప్రజలు క్షీణించసాగారు. కలియుగంలో మాత్రం ధర్మం ఒక్క పాదమే మిగిలి ఉంది. (33)
తామసం యుగమాసాద్య కృష్ణో భవతి కేశవః ।
వేదాచారాః ప్రశామ్యంతి ధర్మయజ్ఞక్రియాస్తథా ॥ 34
తామసయుగ ప్రభావం చేత కృష్ణుడు నల్లబడినాడు. వేదాచారాలు, ధర్మయజ్ఞ క్రియలు సన్నగిల్లాయి. (34)
ఈతయో వ్యాధయస్తంద్రీ దోషాః క్రోధాదయస్తథా ।
ఉపద్రవాః ప్రవర్తంతే ఆధయః క్షుద్భయం తథా ॥ 35
ఈతి బాధలు, వ్యాధులు, సోమరితనం, క్రోధాది ఉపద్రవాలు, మనోవ్యధలు, ఆకలిబాధలు ఒక్కసారిగా విజృంభిస్తాయి. (35)
యుగేష్వావర్తమానేషి ధర్మో వ్యావర్తతే పునః ।
ధర్మే వ్యావర్తమానే తు లోకో వ్యావర్తతే పునః ॥ 36
యుగాలు మళ్ళీ మారుతుండగా ధర్మం పెరుగుతుంది. తరుగుతుంది, ధర్మం క్షీణమైతే లోకం క్షీణిస్తుంది. (36)
లోకే క్షీణే క్షయం యాంతి భావా లోకప్రవర్తకాః ।
యుగక్షయకృతా ధర్మాః ప్రార్థనాని వికుర్వతే ॥ 37
లోకం నశిస్తే దానివల్ల కలిగే భావాలు నశిస్తాయి. యుగనాశం వల్ల ఏర్పడిన ధర్మాలు మనుష్యుల అభీష్టాలకు విపరీతఫలాన్ని ఇస్తాయి. (37)
ఏతత్ కలియుగం నామ అచిరాద్ యత్ ప్రవర్తతే ।
యుగానువర్తనం త్వేతత్ కుర్వంతి చిరజీవినః ॥ 38
ఇదే కలియుగవర్ణన, అచిరకాలంలో వస్తుంది. చిరంజీవులైనా ఈ విధంగా యుగధర్మాన్ని అనుసరించితీరాలి. (38)
యచ్చ తే మత్పరిజ్ఞానే కౌతూహలమరిందమ ।
అనర్ధకేషు కో భావః పురుషస్య విజానతః ॥ 39
నీవు నా పురాతన రూపాన్ని చూడడానికి కుతూహలం చూపావు. అది సరికాదు. తలివైనవాడికి నిష్ర్పయోజన విషయాలపై ఆసక్తి ఉండదు. (39)
ఏతత్ తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
యుగసంఖ్యాం మహాబాహో స్వస్తి ప్రాప్నుహి గమ్యతామ్ ॥ 40
యుగాల సంఖ్య విషయంలో నీవు దేన్ని గురించి అడిగావో దానికి సమాధానంగా ఇదంతా నీకు చెప్పాను. నీకు కళాణమగుగాక, నీవు వెళ్లిరా. (40)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం కదలీషండే హనుమద్భీమసంవాదే ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 149 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అరటితోపులో హనుమద్భీమ సంవాదము అను నూట నలువది తొమ్మిదవ అధ్యాయము. (149)