159. నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము
ఆర్ ష్టిషేణుడు యుధిష్ఠిరునకు ఉపదేశము చేయుట.
వైశంపాయన ఉవాచ
యుధిష్ఠిరస్తమాసాద్య తపసా దగ్ధకిల్బిషమ్ ।
అభ్యవాదయత ప్రీతః శిరసా నామ కీర్తయన్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
తపస్సుచేత పాపాలు దహించుకుపోయిన ఆ రాజర్షిని సమీపించి సంతోషంతో యుధిష్టిరుడు పేరు చెప్పుకొని తలవంచి నమస్కరించాడు. (1)
తతః కృష్ణా చ భీమశ్చ యమౌ చ సుతపస్వినౌ ।
శిరోభిః ప్రాప్య రాజర్షిం పరివార్యోపతస్థిరే ॥ 2
తరువాత ద్రౌపది, భీముడు, తపస్వులయిన నకులసహదేవులు తలలు వంచి రాజర్షి చుట్టూ చేరారు. (2)
తథైవ ధౌమ్యో ధర్మజ్ఞః పాండవానాం పురోహితః ।
యథాన్యాయముపాక్రాంతః తమృషిం సంశితవ్రతమ్ ॥ 3
అలాగే పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు నియమపరుడైన ఆ ఋషిని సంప్రదాయబద్ధంగా సమీపించాడు. (3)
అన్వజానాత్ స ధర్మజ్ఞః మునిర్దివ్యేన చక్షుషా ।
పాండోః పుత్రాన్ కురుశ్రేష్ఠాన్ ఆసత్యామితి చాబ్రవీత్ ॥ 4
ధర్మము నెరిగిన ఆ ముని దివ్యదృష్టితో కురుశ్రేష్ఠులైన పాండవులను గుర్తించి కూర్చుండుడన్నాడు. (4)
కురూణామృషభం పార్థం పూజయిత్వా మహాతపాః ।
సహ భ్రాతృభిరాసీనం పర్యపృచ్ఛదనామయమ్ ॥ 5
గొప్ప తపస్వియైన ఆ రాజర్షి సోదరులతో కూర్చున్న కురుశ్రేష్ఠుడైన ధర్మరాజును పూజించి కుశలమడిగాడు. (5)
నానృతే కురుషే భావం కచ్చిద్ ధర్మే ప్రవర్తసే ।
మాతాపిత్రోశ్చ తే వృత్తిః కచ్చిత్ పార్థ న సీదతి ॥ 6
అసత్యమున నీ మనసు తగుల్కొనుటలేదు కదా! ధర్మమునందే ప్రవర్తించుచున్నావా? ధర్మరాజా! తల్లిదండ్రుల సేవకు లోపము కలుగుట లేదు కదా! (6)
కచ్చిద్ తే గురవః సర్వే వృద్ధా వైద్యాశ్చ పూజితాః ।
కచ్చిన్న కురుషే భావం పార్థ పాపేషు కర్మసు ॥ 7
నీ గురువులందరు, వృద్ధులూ, వైద్యులూ గౌరవించబడుతున్నారా? పాపపుపనులందు నీకు ఆసక్తి కలుగుట లేదుకదా! (7)
సుకృతం ప్రతికర్తుం చ కచ్చిద్ధాతుం చ దుష్కృతమ్ ।
యథాన్యాయం కురుశ్రేష్ఠ జానాసి న వికత్థసే ॥ 8
కురుశ్రేష్ఠా! ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుట, అపకారమునకు ఉపేక్షించుట ఇవి ఎరిగినవాడవే కదా! నిన్ను నీవు పొగడుకొనుట లేదుకదా! (8)
యథార్హం మానితాః కచ్చిత్ త్వయా నందంతి సాధవః ।
వనేష్వసి వసన్ కచ్చిద్ ధర్మమేవానువర్తసే ॥ 9
సజ్జనులు తగినవిధముగా నీచే గౌరవించబడి ఆనందిస్తున్నారా! అడవులలో నున్నప్పటికీ ధర్మమునే అనుసరిస్తున్నావు కదా! (9)
కచ్చిద్ ధౌమ్యస్త్వదాచారైః న పార్థ పరితప్యతే ।
దానధర్మతపఃశౌచైః ఆర్జవేన తితిక్షయా ॥ 10
పితృపైతామహం వృత్తం కచ్చిత్ పార్థానువర్తసే ।
కచ్చిద్ రాజర్షియాతేన పథా గచ్ఛసి పాండవ ॥ 11
కుంతీకుమారా! నీ ప్రవర్తనల చేత ధౌమ్యుడు బాధపడుట లేదు కదా! దానము, ధర్మము, తపస్సు, శుచిత్వము, ఋజుప్రవర్తన, ఓర్పు ఈ విషయాల్లో తాతలు, తండ్రుల నుండి సంక్రమించిన పద్ధతినే అనుసరిస్తున్నావు గదా. ధర్మరాజా! రాజర్షుల మార్గముననే సాగుచున్నావు గదా! (10,11)
స్వే స్వే కిల కులే జాతే పుత్రే నప్తరి వా పునః ।
పితరః పితృలోకస్థాః శోచంతి చ హసంతి చ ॥ 12
కిం తస్య దుష్కృతేఽస్మాభిః సంప్రాప్తవ్యం భవిష్యతి ।
కించాస్య సుకృతేఽస్మాభిః ప్రాప్తవ్యమితి శోభనమ్ ॥ 13
పితృలోకమందున్న పితృదేవతలు తమతమ వంశమున కుమారులు, మనుమల పుట్టుకకు వారి చెడుపనివల్ల మనమేం పొందాల్సి ఉంటుందో? అని దుఃఖిస్తారు. వాడి మంచి పని వల్ల మనకేం మంచి లభిస్తుందో అని సంతోషిస్తారు. (12,13)
పితా మతా తథైవాగ్నిః గురురాత్మా చ పంచమః ।
యస్యైతే పూజితాః పార్థ తస్య లోకావుభౌ జితౌ ॥ 14
ధర్మరాజా! తండ్రి, తల్లి, అగ్ని, గురువు (ఐదవదైన) తాను ఎవరిచే పూజింపబడతారో వాడు ఇహపరలోకాలు రెంటిని జయించినవాడౌతాడు. (14)
యుధిష్ఠిర ఉవాచ
భగవన్నార్య మాహైతద్ యథావద్ ధర్మనిశ్చయమ్ ।
యథాశక్తి యథాన్యాయం క్రియతే విధివన్మయా ॥ 15
యుధిష్ఠిరుడు అంటున్నాడు - భగవన్! ఆర్యా! ధర్మనిర్ణయమేదో దానినే మీరు నన్నడిగారు. శక్తికి తగ్గట్లు, న్యాయాన్ననుసరించి, శాస్త్రోక్తం గానే ఆచరిస్తున్నాను. (15)
ఆర్ ష్టిషేణ ఉవాచ
అబ్భక్షా వాయుభక్షాశ్చ ప్లవమానా విహాయసా ।
జుషంతే పర్వతశ్రేష్ఠమ్ ఋషయః పర్వసంధిషు ॥ 16
ఆర్ ష్టిషేణుడు చెపుతున్నాడు - పర్వదినముల సంధికాలంలో నీటినే గ్రహిస్తూ గాలినే భుజించే ఋషులు ఈ శ్రేష్ఠమైన పర్వతమునే సేవిస్తున్నారు. (16)
కామినః సహ కాంతాభిః పరస్పరమనువ్రతాః ।
దృశ్యంతే శైలశృంగస్థా యతా కింపురుషా నృప ॥ 17
రాజా! కింపురుషులవలె ఒకరినొకరు అనుసరిస్తూ ప్రేయసీప్రియులు కొండపైభాగములలో కనబడుతున్నారు. (17)
అరజాంసి చ వాసామ్సి వసానాః కౌశికాని చ ।
దృశ్యంతే బహవః పార్థ గంధర్వాప్సరసాం గణాః ॥ 18
ధర్మరాజా! నిర్మల వస్త్రములు, పట్టువస్త్రములు ధరించే గంధర్వులు, అప్సరసల సమూహములూ ఎన్నో కనబడుతున్నాయి. (18)
విద్యాధరగణాశ్చైవ స్రగ్విణః ప్రియదర్శనాః ।
మహోరగగణాశ్చైవ సుపర్ణాశ్చోరగాదయః ॥ 19
విద్యాధరుల సమూహాలు కూడ పూలమాలలను ధరించి చూడముచ్చటగా నున్నారు. పెద్దపాముల సమూహాలు, సుపర్ణజాతిపక్షులు, పాములు మొదలైనవి కనబడుతున్నాయి. (19)
అస్య చోపరి శైలస్య శ్రూయతే పర్వసంధిషు ।
భేరీపణవశంఖానాం మృదంగానాం చ నిః స్వనః ॥ 20
పర్వదినముల సంధికాలంలో ఈ కొండమీద ఢక్కా, గోముఖ, శంఖ, మృదంగములధ్వని వినబడుతోంది. (20)
ఇహస్థైరేవ తత్ సర్వం శ్రోతవ్యం భరతర్షభాః ।
న కార్యా వః కథంచిత్ స్యాత్ తత్రాభిగమనే మతిః ॥ 21
భరతవంశశ్రేష్ఠులారా! ఇక్కడే ఉండి దానినంతా వినండి. అక్కడికి వెళ్ళాలనే భావం ఎలాగైనా మీకు తగదు. (21)
న చాప్యతః పరం శక్యం గంతుం భరతసత్తమాః ।
విహారో హ్యత్ర దేవానామ్ అమానుషగతిస్తు సా ॥ 22
భరతవంశశ్రేష్ఠులారా! ఇంతకన్న ముందుకు వెళ్లటం కుదరదు. అది దేవతల విహారభూమి. అది మానవులు వెళ్ళలేని చోటు. (22)
ఈషచ్చపలకర్మాణం మనుష్యమిహ భారత ।
ద్విషంతి సర్వభూతాని తాడయంతి చ రాక్షసాః ॥ 23
ధర్మరాజా! ఏ కొంచెం చాపల్యంతోనైనా ఆ పనిచేసే మానవుని ఇక్కడ ప్రాణులన్నీ ద్వేషిస్తాయి. రాక్షసులూ కొడతారు. (23)
అస్యాతిక్రమ్య శిఖరం కైలాసస్య యుధిష్ఠిర ।
గతిః పరమసిద్ధానాం దేవర్షీణాం ప్రకాశతే ॥ 24
యుధిష్ఠిరా! ఈ కైలాసశిఖరాన్ని దాటితే పరమసిద్ధులైన దేవర్షుల మార్గం కనబడుతుంది. (24)
చాపలాదిహ గచ్ఛంతం పార్థ యానమితః పరమ్ ।
అయః శూలాదిభిర్ఘ్నంతి రాక్షసాః శత్రుసూదన ॥ 25
కుంతీకుమారా! ఇక్కడ చాపల్యంతో వెళ్ళేవానిని, ఈ ప్రాంతం దాటివెళ్ళేవానిని రాక్షసులు ఇనుపశూలాలతో పొడిచి చంపుతారు. (25)
అప్సరోభిః పరివృతః సమృద్ధ్యా నరవాహనః ।
ఇహ వైశ్రవణస్తాత పర్వసంధిషు దృశ్యతే ॥ 26
పర్వకాలసంధి సమయములందిక్కడ అప్సరసలతో కూడి, వైభవంతో మానవునిఎక్కి కదిలే కుబేరుడు కనబడుతుంటాడు. (26)
శిఖరస్థం సమాసీనమ్ అధిపం యక్షరక్షసామ్ ।
ప్రేక్షంతే సర్వభూతాని భానుమంతమివోదితమ్ ॥ 27
శిఖరం మీద చక్కగా కూర్చుని, యక్ష, రాక్షసుల అధిపతియైన కుబేరుని ఉదయించే సూర్యుని లాగా ప్రాణులన్నీ చూస్తున్నాయి. (27)
దేవదానవసిద్ధానాం తథా వైశ్రవణస్య చ ।
గిరేః శిఖరముద్యానమ్ ఇదం భరతసత్తమ ॥ 28
ఈ కొండ పైభాగం దేవ, దానవ, సిద్ధులకు అలాగే కుబేరునికి క్రీడామైదానము. (28)
ఉపాసీనస్య ధనదం తుంబురోః పర్వసంధిషు ।
గీతసామస్వనస్తాత శ్రూయతే గంధమాదనే ॥ 29
నాయనా! పర్వకాలసంధిసమయాలలో ఈ గంధమాదనపర్వతం మీద కుబేరుని ఉపాసించే తుంబురుని సామగానధ్వని వినబడుతోంది. (29)
ఏతదేవంవిధం చిత్రమ్ ఇహ తాత యుధిష్ఠిర ।
ప్రేక్షంతే సర్వభూతాని బహుశః పర్వసంధిషు ॥ 30
యుధిష్ఠిరా! ఈ విధంగా చిత్రమైన అద్భుతదృశ్యాలకు ఎన్నో ఇక్కడ పర్వకాలసంధిసమయాల్లో ప్రాణులంతా చూస్తున్నారు. (30)
భుంజానా మునిభోజ్యాని రసవంతి ఫలాని చ ।
వసధ్వం పాండవశ్రేష్ఠా యావదర్జునదర్శనాత్ ॥ 31
పాండవశ్రేష్ఠులారా! అర్జునుడు కనబడేవరకు మునులు తినే రసవంతములైన పండ్లను తింటూ నివసించండి. (31)
న తాత చపలైర్భావ్యమ్ ఇహ ప్రాప్తైః కథంచన ।
ఉషిత్వేహ యథాకామం యథాశ్రద్ధం విహృత్య చ ।
తతః శస్త్రజితాం తాత పృథివీం పాలయిష్యసి ॥ 32
నాయనా! ఇక్కడకు చేరుకున్నవారు ఏవిధమైన చాపల్యానికి లోనుకారాదు. కోరుకున్న విధంగా ఇక్కడ ఉంటూ, శ్రద్ధగా విహరించు. తరువాత శస్త్రములతో జయించిన భూమిని పాలిస్తావు. (32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి ఆర్ ష్టిషేణయుధిష్ఠిర సంవాదే ఏకోనషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 159 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున ఆర్ ష్టిషేణ యుధిష్ఠిరసంవాదమను నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము. (159)