170. నూట డెబ్బదియవ అధ్యాయము
అర్జునుడు నివాతకవచులతో యుద్ధమొనర్చుట.
అర్జున ఉవాచ
తతో నివాతకవచాః సర్వే వేగేన భారత ।
అభ్యద్రవన్ మాం సహితాః ప్రగృహీతాయుధా రణే ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు - భారతా! తరువాతనివాతకవచులందరూ కలిసికట్టుగా ఆయుధాలు తీసుకుని యుద్ధభూమిలో వేగంగా నామీద పడ్డారు. (1)
ఆచ్ఛాద్య రథపంథానమ్ ఉత్క్రోశంతో మహారథాః ।
ఆవృత్య సర్వతస్తే మాం శరవర్షైరవాకిరన్ ॥ 2
ఆ మహారథులు రథమార్గాన్ని కప్పి భయంకరంగా అరుస్తూ అన్నిప్రక్కల నుండి నా మీద బాణాల వాన కురిపించారు. (2)
తతోఽపరే మహావీర్యాః శూలపట్టిశపాణయః ।
శూలాని చ భుశుండీశ్చ ముముచుర్దానవా మయి ॥ 3
మరికొందరు గొప్ప పరాక్రమవంతులైన దానవులు శూలాల్ని బడిసెల్ని పట్టుకొని నాపై విసిరారు. (3)
తచ్ఛూలవర్షం సుమహద్ గదాశక్తిసమాకులమ్ ।
అనిశం సృజ్యమానం తైః అపతన్మద్రథోపరి ॥ 4
అన్యే మామభ్యధావంత నివాతకవచా యుధి ।
శితశస్త్రాయుధా రౌద్రాః కాలరూపాః ప్రహారిణః ॥ 5
వారిచేత నిరంతరం సృష్టించబడే ఆ శూలవర్షం నారథంపై పడుతోంది. దానికి తోడు గదలు, శక్తి ఆయుధాలు దెబ్బతీస్తున్నాయి. పదునైన శస్త్రాలు ఆయుధాలుగా గల్గి, నేర్పరులై భయంకరులై, నల్లని ఆకారాలు గల మరికొందరు నివాతకవచులు యుద్ధంలో నావైపు పరుగుతీశారు. (4,5)
తానహం వివిధైర్బాణైః వేగవద్భిరజిహ్మగైః ।
గాండీవముక్తైరభ్యఘ్నమ్ ఏకైకం దశభిర్మృధే ॥ 6
యుద్ధంలో నేను వాళ్ళల్లో ఒక్కొక్కడిని గాండీవ ధనుస్సుతో సూటిగా వేగంగల పదేసి బాణాలతో కొట్టాను. (6)
తే కృతా విముఖాః సర్వే మత్ప్రయుక్తైః శిలాశితైః ।
తతో మాతలినా తూర్ణం హయాస్తే సంప్రచోదితాః ॥ 7
వాళ్ళపై నేను విడిచిన బాణాలతో వారంతా పరారయ్యారు. అప్పుడు మాతలి వెంటనే ఆ రథ అశ్వాలను వేగంగా తోలాడు. (7)
మార్గాన్ బహువిధాంస్తత్ర విచేరుర్వాతరంహసః ।
సుసంయతా మాతలినా ప్రామథ్నంత దితేః సుతాన్ ॥ 8
వాయువేగం గల ఆ గుర్రాలు అక్కడ అనేక విధాలుగా పరుగెడుతూ పోతున్నాయి మాతలిచే అదుపు చెయ్యబడుతూ దితికుమారులైన ఆ రాక్షసుల్ని చిలికేశాయి. (8)
శతం శతాస్తే హరయః తస్మిన్ యుక్తా మహారథే ।
శాంతా మాతలినాయత్తాః వ్యచరన్నల్పకా ఇవ ॥ 9
విశాలమైన ఆ అర్జునుడి రథానికి పదివేల గుర్రాలు పూన్చబడ్డాయి. మాతలి అదుపులో ఉండటంచేత కొద్ది సంఖ్య కలిగినట్లు శాంతంగా కదులుతున్నాయి. (9)
తేషాం చరణపాతేన రథనేమిస్వనేన చ ।
మమ బాణనిపాతైశ్చ హతాస్తే శతశోఽసురాః ॥ 10
ఆ గుర్రాల పాదాల క్రింద నలిగిపోవటం చేత, రథ చక్రాల చప్పుడు చేత నా బాణాలతాకిడిచేత ఆ రాక్షసులు వందలకొలదిగా చంపబడ్డారు. (10)
గతాసవస్తథైవాన్యే ప్రగృహీతశరాసనాః ।
హతసారథయస్తత్ర వ్యకృష్యంత తురంగమైః ॥ 11
అక్కడ కొంతమంది ధనుస్సు బాణాలు చేతిలో పట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు సారథులూ చంపబడ్డారు. ఆ పరిస్థితిలో గుర్రాలు వారినీడ్చుకొని వెళ్లుతున్నాయి. (11)
తే దిశో విదిశః సర్వే ప్రతిరుధ్య ప్రహారిణః ।
అభ్యఘ్నన్ వివిధైః శస్త్రైః తతో మే వ్యథితం మనః ॥ 12
అనేక రకాల శస్త్రాలతో దెబ్బతీస్తూ వారంతా దిక్కుల్ని, మూలల్ని కప్పేస్తూ నన్ను కొట్టసాగారు. దానివల్ల నామనసు కలత చెందింది. (12)
తతోఽహం మాతలేర్వీర్యమ్ అపశ్యం పరమాద్భుతమ్ ।
అశ్వాంస్తథా వేగవతః యదయత్నాదధారయత్ ॥ 13
ఆ సమయంలో మాతలియొక్క అద్భుతమైన శక్తిని గమనించాను అతడు సాటిలేని వేగం గల గుర్రాల్ని అలవోకగా అదుపుచేశాడు. (13)
తతోఽహం లఘుభిశ్చిత్రైః అస్త్రైస్తానసురాన్ రణే ।
చిచ్ఛేద సాయుధాన్ రాజన్ శతశోఽథ సహస్రశః ॥ 14
ఏవం మే చరతస్తత్ర సర్వయత్నేన శత్రుహన్ ।
ప్రీతిమానభవద్ వీరో మాతలిః శక్రసారథిః ॥ 15
రాజా! అప్పుడు నేను యుద్ధభూమిలో ఆయుధాలు కలిగి వందలుగా, వేలుగా ఉన్న ఆ రాక్షసుల్ని చురుకుగా తాకే అనేక రకాలైన అస్త్రాలతో చెల్లా చెదరు చేశాను. ఇలా అన్నివిధాలుగా ప్రయత్నించి ఆ యుద్ధభూమిలో తగిన ప్రతాపం ప్రదర్శించే నాపట్ల వీరుడు, ఇంద్రసారథీ అయిన మాతలి ప్రీతికలవాడయ్యాడు. (14,15)
వధ్యమానాస్తతస్తైస్తు హయైస్తేన రథేన చ ।
అగమన్ ప్రక్షయం కేచిద్ న్యవర్తంత తథా పరే ॥ 16
అప్పుడు వారిలో కొందరు ఆ గుర్రాల వల్ల, ఆ రథం చేత చంపబడ్డారు. అలాగే ఇతరులు యుద్ధభూమిని విడిచిపోయారు. (16)
స్పర్థమానా ఇవాస్మాభిః నివాతకవచా రణే ।
శరవర్షైః శరార్తం మాం మహద్భిః ప్రత్యవారయన్ ॥ 17
తతోఽహం లఘుభిశ్చిత్రైః బ్రహ్మాస్త్రపరిమంత్రితైః ।
వ్యధమం సాయకైరాశు శతశోఽథ సహస్రశః ॥ 18
యుద్ధభూమిలో మాతో పోటీపడుతున్నట్లుగా నివాతకవచులు బాణాలతో బాధించబడ్డ నన్ను బాణాల భారీవర్షాలతో అడ్డుకున్నారు. అప్పుడు నేను వేగంగా తాకే అనేక బాణాలను బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి వదిలాను దానివల్ల వెంటనే వందలు, వేలుగా రాక్షసులు సంహరించబడ్డారు (17,18)
తతః సంపీడ్యమానాస్తే క్రోధావిష్టా మహారథాః ।
అపీడయన్ మాం సహితాః శరశూలాసివృష్టిభిః ॥ 19
అలా బాధించబడ్డ మహారథులైన ఆ దానవులు కోపంతో కలిసికట్టుగా బాణాలు, శూలాలూ కత్తులూ వర్షంలా నాపై ప్రయోగించి బాధించారు. (19)
తతోఽహమస్త్రమాతిష్ఠం పరమం తిగ్మతైజసమ్ ।
దయితం దేవరాజస్య మాధవం నామ భారత ॥ 20
అప్పుడు నేను ప్రచండమైన తేజస్సుగల శ్రేష్ఠమైన దేవరాజుకు ఇష్టమైన మాధవమనే అస్త్రాన్ని ఆశ్రయించాను. (20)
తతః ఖడ్గాంస్త్రిశూలాంశ్చ తోమరాంశ్చ సహస్రశః ।
అస్త్రవీర్యేణ శతధా తైర్ముక్తానహమచ్ఛిదమ్ ॥ 21
ఆ అస్త్రం యొక్క ప్రభావం వల్ల వారు వదిలిన వేలకొలది కత్తులు, త్రిశూలాలు, తోమరాలను వందల ముక్కలుగా చేశాను. (21)
ఛిత్త్వా ప్రహరణాన్యేషాం తతస్తానపి సర్వశః ।
ప్రత్యవిధ్యమహం రోషాద్ దశభిర్దశభిః శరైః ॥ 22
వారి ఆయుధాల నన్నింటిని ముక్కలు చేసిన తరువాత నేను వారిని కూడా కోపంతో పదిపది బాణాలతో గాయపరిచాను. (22)
గాండీవాద్ధి తదా సంఖ్యే యథా భ్రమరపంక్తయః ।
నిష్పతంతి మహాబాణాః తన్మాతలిరపూజయత్ ॥ 23
యుద్ధభూమిలో అప్పుడు గాండీవం నుండి తుమ్మెదల వరుసల్లా పెద్దపెద్ద బాణాలు వెలువడుతున్నాయి. మాతలి దాన్ని మెచ్చుకున్నాడు.(23)
తేషామపి తు బాణాస్తే తన్మాతలిరపూజయత్ ।
అవాకిరన్ మాం బలవత్ తానహం వ్యధమం శరైః ॥ 24
వచ్చి నన్ను బలంగా తాకుతున్న ఆ దానవుల బాణాలను మాతలి మెచ్చుకున్నాడు. వాటిని నేను నా బాణాలతో వమ్ము చేశాను. (24)
వధ్యమానాస్తతస్తే తు నివాతకవచాః పునః ।
శరవర్షైర్మహద్భిర్మాం సమంతాత్ పర్యవారయన్ ॥ 25
అలా చంపబడుతున్న ఆ నివాతకవచులు మళ్ళీ శ్రేష్ఠమైన బాణాలతో చుట్టూ నన్ను ముట్టడించారు. (25)
శరవేగాన్నిహత్యాహమ్ అస్త్రైరస్త్రవిఘాతిభిః ।
జ్వలద్భిః పరమైః శీఘ్రైః తానవిధ్యం సహస్రశః ॥ 26
నేనప్పుడు అస్త్రాలను నశింపచేసే అస్త్రాలతో వారి బాణాల వేగాన్ని అదుపుచేసి మంటలు కక్కుతూ వేగంగా వెళ్ళే శ్రేష్ఠములైన బాణాలతో వేలరాక్షసుల్ని గాయపరచాను. (26)
తేషాం ఛిన్నాని గాత్రాణి విసృజంతి స్మ శోణితమ్ ।
ప్రావృషీవాభివృష్టాని శృంగాణ్యథ ధరాభృతామ్ ॥ 27
పిమ్మట వర్షాకాలంలో వాననీటిని జాళువార్చే కొండలశిఖరాలలాగ తెగిన వారి అవయవాళు రక్తాన్ని ధారలుగా స్రవిస్తున్నాయి. (27)
ఇంద్రాశనిసమస్పర్శైః వేగవద్భిరజిహ్మగైః ।
మద్బాణైర్వధ్యమానాస్తే సముద్విగ్నాః స్మ దానవాః ॥ 28
వేగంగా సూటిగా వెళ్తూ, ఇంద్రుడి వజ్రాయుధంలా తాకే, నాబాణాలతో చంపబడుతున్న ఆ దానవులు భయంతో కలతచెందారు. (28)
శతధా భిన్నదేహాస్తే క్షీణప్రహరణౌజసః ।
తతో నివాతకవచా మామ్ అయుధ్యంత మాయయా ॥ 29
వారి శరీరాలు ముక్కలు చెయ్యబడ్డాయి. ఆయుధాలూ ఉత్సాహమూ క్షీణించాయి. అప్పుడు నివాతకవచులు నాతో మాయా యుద్ధానికి దిగారు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి సప్హత్యధికశతతమోఽధ్యాయః ॥ 170 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున నివాతకవచయుద్ధమను నూటడెబ్బదియవ అధ్యాయము. (170)