172. నూట డెబ్బది రెండవ అధ్యాయము
అర్జునుడు నివాతకవచులను సంహరించుట.
అర్జున ఉవాచ
అదృశ్యమానాస్తే దైత్యాః యోధయంతి స్మ మాయయా ।
అదృశ్యేనాస్త్రవీర్యేణ తానప్యహమయోధయమ్ ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు - ఆ దానవులు మాయచేత కనబడకుండా యుద్ధం చెయ్యసాగారు. నేను కూడా కనబడని అస్త్రబలంతో వారితో యుద్ధం చెయ్యసాగాను. (1)
గాండీవముక్తా విశిఖాః సమ్యగస్త్రప్రచోదితాః ।
అచ్ఛిందన్నుత్తమాంగాని యత్ర యత్ర స్మ తేఽభవన్ ॥ 2
చక్కగా అస్త్రములచే అభిమంత్రించబడి గాండీవం నుండి విడువబడ్డ బాణాలు వారెక్కడెక్కడుంటే అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళ తలలను తెగగొట్టాయి. (2)
తతో నివాతకవచా వధ్యమానా మయా యుధి ।
సంహృత్య మాయాం సహసా ప్రావిశన్ పురమాత్మనః ॥ 3
నాచేత యుద్ధంలో చంపబడుతున్న నివాతకవచులప్పుడు మాయను ఉపసంహరించి వెంటనే తమనగరంలో ప్రవేశించారు. (3)
వ్యపయాతేషు దైత్యేషు ప్రాదుర్భూతే చ దర్శనే ।
అపశ్యం దానవాంస్తత్ర హతాన్ శతసహస్రశః ॥ 4
దైత్యులు పారిపోగా, వెలుగువల్ల చూడగలిగి అక్కడ వందలు వేలుగా చంపబడ్డ దానవులను చూశాను. (4)
వినిప్పిష్టాని తత్రైషాం శస్త్రాణ్యాభరణాని చ ।
శతశః స్మ ప్రదృశ్యంతే గాత్రాణి కవచాని చ ॥ 5
హయానాం నాంతరం హ్యాసీత్ పదాద్ విచలితుం పదమ్ ।
ఉత్పత్య సహసా తస్థుః అంతరిక్షగమాస్తతః ॥ 6
అక్కడ వాళ్ళ శస్త్రాలు, ఆభరణాలు, శరీరాలు, కవచాలు వందలుగా ముక్కలు చెయ్యబడి కనబడుతున్నాయి. గుర్రాలకు అడుగు తీసి అడుగువెయ్యటానికి చోటు లేకపోయింది. అప్పుడు అంతరిక్షంలో వెళ్ళే ఆ గుర్రాలు ఒక్క దూకు దూకి ఆకాశంలో నిలచాయి. (5,6)
తతో నివాతకవచా వ్యోమ సంఛాద్య కేవలమ్ ।
అదృశ్యా హ్యత్యవర్తంత విసృజంతః శిలోచ్చయాన్ ॥ 7
తరువాత నివాతకవచులు కనబడకుండా ఆక్రమించి ఆకాశాన్ని మాత్రం కప్పేసి రాళ్ళు కురిపించసాగారు. (7)
అంతర్భూమిగతాశ్చాన్యే హయనాం చరణాన్యథ ।
వ్యగృహ్ణాన్ దానవా ఘోరాః రథచక్రే చ భారత ॥ 8
భారతా! కొంతమంది భయంకరులైన దానవులు భూమిలోపల ఉండి గుర్రాల కాళ్లను రథచక్రాలను పట్టుకున్నారు. (8)
వినిగృహ్య హరీనశ్వాన్ రథం చ మమ యుధ్యతః ।
సర్వతో మామవిధ్యంత సరథం ధరణీధరైః ॥ 9
యుద్ధం చేస్తున్నప్పుడు నా పచ్చని గుర్రాలను రథాన్ని కదలకుండా చేసి అన్నిప్రక్కలా కొండలతో రథంతోపాటు నన్ను గాయపరచారు (9)
పర్వతైరుపచీయద్భిః పతమానైస్తథాపరైః ।
స దేశో యత్ర వర్తామ గుహేవ సమపద్యత ॥ 10
క్రింద పడ్డ కొండలు పేరుకుపోతున్నాయి. వేరేవి పైన వచ్చి పడుతున్నాయి. అప్పుడు మేమున్న ఆ చోటు గుహలా తయారైంది. (10)
పర్వతైశ్ఛాద్యమానోఽహం నిగృహీతైశ్చ వాజిభిః ।
అగచ్ఛం పరమామార్తిం మాతలిస్తదలక్షయత్ ॥ 11
పర్వతాలతో నేను కప్పబడుతున్నాను. నా గుర్రాలను పట్టుకొన్నారు. నేనెంతో బాధను పొందాను. మాతలి ఆ పరిస్థితిని గుర్తించాడు. (11)
లక్షయిత్వా చ మాం భీతమ్ ఇదం వచనమబ్రవీత్ ।
అర్జునార్జున మా భైస్వం వజ్రమస్త్రముదీరయ ॥ 12
భయానికి లోనైన నన్ను గుర్తించి అర్జునా! నీవు భయపడకు వజ్రాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. (12)
తతోఽహం తస్య తద్ వాక్యం శ్రుత్వా వజ్రముదీరయమ్ ।
దేవరాజస్య దయితం భీమాస్త్రం నరాధిప ॥ 13
రాజా! నేనప్పుడు అతని మాటలు వినిదేవరాజుకు ఇష్టమైన, భయంకరమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాను. (13)
అచలం స్థానమాసాద్య గాడీవమనుమంత్య్ర చ ।
అముంచ వజ్రసంస్పర్శాన్ ఆయసాన్ నిశితాన్ శరాన్ ॥ 14
కదలనిచోటున నిలబడి గాండీవధనుస్సును వజ్రాస్త్రంతో అభిమంత్రించి వజ్రం (పిడుగు) లా తాకే పదునైన ఇనుపబాణాలను వదిలాను. (14)
తతో మాయాశ్చ తాః సర్వా నివాతకవచాంశ్చ తాన్ ।
తే వజ్రచోదితా బాణాః వజ్రభూతాః సమావిశన్ ॥ 15
తరువాత వజ్రాస్త్రాన్ని అభిమంత్రించి వదిలిన ఆ బాణాలు వజ్రాల్లాగా (పిడుగుల్లాగా) అయి ఆ మాయలన్నింటినీ, ఆ నివాతకవచులనూ చొచ్చుకుపోయాయి. (15)
తే వజ్రవేగవిహతా దానవాః పర్వతోపమాః ।
ఇతరేతరమాశ్లిష్య న్యపతన్ పృథివీతలే ॥ 16
పిడిగుపాటు వేగంతో కొట్టబడ్డ ఆ పర్వతాల్లాంటి దానవులు ఒకరినొకరు కౌగిలించుకొని నేల మీద పడిపోయారు. (16)
అంతర్భూమౌ చ యేఽగృహ్ణాన్ దానవా రథవాజినః ।
అనుప్రవిశ్య తాన్ బాణాః ప్రాహిణ్వన్ యమసాదనమ్ ॥ 17
భుమిలోపల ఉండి రథం గుర్రాలను పట్టుకున్నదానవుల లోకి చొచ్చుకుపోయి బాణాలు వారిని యమలోకానికి పంపాయి. (17)
హతైర్నివాతకవచైః నిరస్తైః పర్వతోపమైః ।
సమాచ్ఛాద్యత దేశః స వికీర్ణ్రైరివ పర్వతైః ॥ 18
పర్వతాల్లాగా ఉన్న నివాతకవచులు చంపబడి ఇటూ అటూ విసరబడటం చేత ఆ చోటు వెదజల్లబడ్డ పర్వతాలతో కప్పబడ్డట్టుంది. (18)
న హయానాం క్షతిః కాచిద్ న రథస్య న మాతలేః ।
మమ చాదృశ్యత తదా తదద్భుతమివాభవత్ ॥ 19
అప్పుడు గుర్రాలకు గాని, రథానికి గాని, మాతలికి గాని, నాకు గాని ఎలాంటి హాని జరిగినట్లు కనబడలేదు. అది అద్భుతంగా ఉంది. (19)
తతో మాం ప్రహసన్ రాజన్ మాతలిః ప్రత్యభాషత ।
నైతదర్జున దేవేషు త్వయి వీర్యం యదీక్ష్యతే ॥ 20
రాజా! అప్పుడు మాతలి నవ్వుతూ అర్జునా! నీలో కనబడుతున్న ఈ పరాక్రమం దేవతల్లో కూడా లేదు అని నాతో అన్నాడు. (20)
హతేష్వసురసంగేషు దారాస్తేషాం తు సర్వశః ।
ప్రాక్రోశన్ నగరే తస్మిన్ యథా శరది సారసాః ॥ 21
ఆ రాక్షసమూహాలు చంపబడగానే వారి భార్యలందరూ ఆ నగరంలో శరత్కాలంలో బెగ్గురుపక్షుల్లా ఏడ్చారు. (21)
తతో మాతలినా సార్ధ అహం తత్ పురమభ్యయామ్ ।
త్రాసయన్ రథఘోషేణ నివాతకవచస్త్రియః ॥ 22
తరువాత మాతలితో కలిసి రథం చప్పుడుతో నివాతకవచుల స్త్రీలను బెదరగొడుతూ ఆ దైత్యనగరానికి వెళ్ళాను (22)
తాన్ దృష్ట్వా దశసాహస్రాన్ మయూరసదృశాన్ హయాన్ ।
రథం చ రవిసంకాశం ప్రాద్రవన్ గణశః స్త్రియః ॥ 23
నెమళ్ళలాగా అందంగా ఉన్న ఆ పదివేల గుర్రాలను, సూర్యుడిలా ఉన్న ఆ రథాన్ని చూసి స్త్రీలు గుంపులుగా పరుగెత్తారు (23)
తాభిరాభరణైః శబ్దః త్రాసితాభిః సమిరితః ।
శిలానామివ శైలేషు పతంతీనామభూత్ తదా ॥ 24
భయకంపితులై పారిపోయే ఆ దానవ స్త్రీల ఆభరణాల శబ్దం అప్పుడు కొండల మీద రాళ్ళుపడుతుంటే చప్పుడౌతున్నట్లుంది. (24)
విత్రస్తా దైత్యనార్యస్తాః స్వాని వేశ్మాన్యథావిశన్ ।
బహురత్నవిచిత్రాణి శాతకుంభమయాని చ ॥ 25
భయపడి పారిపోయే ఆ దైత్యస్త్రీలు అనేక రత్నాలతో విచిత్రంగా ఉన్న, బంగారు మయమైన తమ భవనాల్లో ప్రవేశించారు. (25)
తదద్భుతాకారమహం దృష్ట్వా నగరముత్తమమ్ ।
విశిష్టం దేవనగరాద్ అపృచ్ఛ మాతలిం తతః ॥ 26
దేవతల నగరం కన్న శ్రేష్ఠమై, అద్భుతమైన ఆకారంతో ఉన్న ఉత్తమమైన ఆ నగరాన్ని చూసి తరువాత నేను మాతలి నడిగాను. (26)
ఇదమేవంవిధం కస్మాద్ దేవా నావాసయంత్యుత ।
పురందరపురాద్ధీదం విశిష్టమితి లక్షయే ॥ 27
ఇలాంటి నగరంలో ఎందువల్ల దేవతలు నివసించటం లేదు? ఇంద్రుడి పట్టణం కన్న ఇది శ్రేష్ఠమైనదిగా తోస్తోంది. (27)
మాతలిరువాచ
ఆసీదిదం పురా పార్థ దేవరాజస్య నః పురమ్ ।
తతో నివాతకవచైః ఇతః ప్రచ్యావితాః సురాః ॥ 28
మాతలి చెపుతున్నాడు - కుంతీకుమారా! పూర్వమీపట్టణం మన దేవరాజు అధికారంలోనే ఉండేది. తరువాత నివాతకవచులచేత ఇక్కడి నుండి దేవతలు తొలగించబడ్డారు. (28)
తపస్తప్త్వా మహత్ తీవ్రం ప్రసాద్య చ పితామహమ్ ।
ఇదం వృతం నివాసాయ దేవేభ్యశ్చాభయం యుధి ॥ 29
నివాతకవచులు గొప్ప తీవ్రమైన తపస్సుచేసి బ్రహ్మను మెప్పించి తాము నివసించటానికి ఈ నగరాన్నీ, యుద్ధంలో దేవతల వల్ల భయం లేకుండా ఉండాలని కోరారు. (29)
తతః శక్రేణ భగవాన్ స్వయంభూరితి చోదితః ।
విధత్తాం భగవానంతమ్ ఆత్మనో హితకామ్యయా ॥ 30
అప్పుడు ఇంద్రుడు భగవంతుడైన బ్రహ్మతో భగవంతుడా! మామేలు కోసం వీరిని హతమార్చండి అని వేడుకున్నాడు. (30)
తత ఉక్తో భగవతా దిష్టమత్రేతి భారత ।
భవితాంతస్త్వమప్యేషాం దేహేనాన్యేన శత్రుహన్ ॥ 31
అప్పుడు భారతా! దైవనిర్ణయమిది. శత్రుసంహారకా! నీవు మరియొక శరీరంతో వీరిని అంతమొందిస్తావని భగవంతుడైన బ్రహ్మ చెప్పాడు. (31)
తత ఏషాం వధార్థాయ శక్రోఽస్త్రాణి దదౌ తవ ।
న హి శక్యాః సురైర్హంతుం య ఏతే నిహతాస్త్వయా ॥ 32
అందువల్ల వీళ్ళను చంపటానికి ఇంద్రుడు నీకు అస్త్రాలనిచ్చాడు. నీచేత చంపబడ్డ వీళ్ళు దేవతల వల్ల చావరు. (32)
కాలస్య పరిణామేన తతస్త్వమిహ భారత ।
ఏషామంతకరః ప్రాప్తస్తత్ త్వయా చ కృతం తథా ॥ 33
భారతా! అందువల్ల కాలం యొక్క మార్పు చేత వీళ్ళను చంపేందుకే నీవిక్కడకు వచ్చావు. అలా చేశావు. (33)
దానవానాం వినాశాయ అస్త్రాణాం పరమం బలమ్ ।
గ్రాహితస్త్వం మహేంద్రేణ పురుషేంద్ర తదుత్తమమ్ ॥ 34
పురుషులలో ఉత్తముడా! దానవుల వినాశం కోసం ఉత్తమమూ, శ్రేష్ఠమూ అయిన అస్త్రబలాన్ని ఇంద్రుడు నీకు కలిగించాడు. (34)
అర్జున ఉవాచ
తతః ప్రశామ్య నగరం దానవాంశ్చ నిహత్య తాన్ ।
పునర్మాతలినా సార్ధమ్ అగచ్ఛం దేవసద్మ తత్ ॥ 35
అర్జునుడు చెపుతున్నాడు - ఆ దానవుల్ని చంపిన తరువాత ఆ నగరాన్ని శాంతింపజేసి మాతలితో కలిసి తిరిగి ఆ దేవలోకానికి వెళ్ళాను. (35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి నివాతకవచయుద్ధే ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 172 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున నివాతకవచసంహారమను నూట డెబ్బది రెండవ అధ్యాయము. (172)