180. నూట ఎనుబదియవ అధ్యాయము

ధర్మరాజు నహుషుని ప్రశ్నలకు సమాధానములొసంగుట.

వైశంపాయన ఉవాచ
యుధిష్ఠిరస్తమాసాద్య సర్పభోగేన వేష్టితమ్ ।
దయితం భ్రాతరం ధీమాన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు పాముపడగచే చుట్టబడిన తన సోదరుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు (1)
కుంతీమాతః కథమిమామ్ ఆపదం త్వమవాప్తవాన్ ।
కశ్చాయం పర్వతాభోగప్రతిమః పన్నగోత్తమః ॥ 2
స ధర్మరాజమాలక్ష్య భ్రాతా భ్రాతరమగ్రజమ్ ।
కథయామాస తత్ సర్వం గ్రహణాది విచేష్టితమ్ ॥ 3
కుంతీకుమారా! నీవెలా ఈ ఆపదలో చిక్కుకున్నావు? పర్వతమంత పొడవు వెడల్పులతో ఉన్న ఈ సర్పశ్రేష్ఠమెవరు? అన్న ధర్మరాజును చూసి తమ్ముడైన ఆ భీముడు తానెలా ఆ పాముకు చిక్కుకున్నాడో ఆ విషయమంతా చెప్పసాగాడు. (2,3)
భీమ ఉవాచ
అయమార్య మహాసత్త్వః భక్షార్థం మాం గృహీతవాన్ ।
నహుషో నామ రాజర్షిః ప్రాణవాణివ సంస్థితః ॥ 4
భీముడుచెపుతున్నాడు - ఆర్యా! ఇతడు గాలిని భక్షించే పామురూపంలో ఉన్న గొప్ప శక్తిమంతుడైన నహుషుడనబడే రాజర్షి. నన్ను ఆహారంగా గ్రహించాడు. (4)
యుధిష్ఠిర ఉవాచ
ముచ్యతామయమాయుష్మాన్ భ్రాతా మేఽమితవిక్రమః ।
వయమాహారమన్యం తే దాస్యామః క్షున్నివారణమ్ ॥ 5
యుధిష్ఠిరుడు చెపుతున్నాడు.
ఈ చిరంజీవి నా తమ్ముడు. అంతులేని పరాక్రమం గల ఈ నా సోదరుని విడిచిపెట్టండి. మీ ఆకలిని పోగొట్టే వేరే ఆహారాన్ని మేము మీకిస్తాము. (5)
సర్ప ఉవాచ
ఆహారో రాజపుత్రోఽయం మయా ప్రాప్తో ముఖాగతః ।
గమ్యతాం నేహ స్థాతవ్యం శ్వో భవానపి మే భవేత్ ॥ 6
పాము చెపుతున్నది - ఈ రాజకుమారుడు నానోటి దగ్గరకు వచ్చి ఆహారమయ్యాడు. వెళ్ళు. ఇక్కడ ఉండరాదు. రేపు నీవైనా నాకు ఆహారం కావచ్చు. (6)
వ్రతమేతన్మహాబాహో విషయం మమ యో వ్రజేత్ ।
స మే భక్షో భవేత్ తాత త్వం చాపి విషయే మమ ॥ 7
నా దగ్గరకు వచ్చినవాడు నాకు ఆహారమౌతాడు. ఇది నానియమము. నాయనా! నీవు కూడా నా దగ్గరకు వచ్చావు. (7)
చిరేణాద్య మయాఽఽహారః ప్రాప్తోఽయమనుజస్తవ ।
నాహమేనం విమోక్ష్యామి న చాన్యమభికాంక్షయే ॥ 8
చాలాకాలానికి ఈ నీ తమ్ముడు నాకు ఆహారమయ్యాడు. నేనితనిని విడువను. అంతేకాదు. వేరేవానిని కోరను. (8)
యుధిష్ఠిర ఉవాచ
దేవో వా యది వా దైత్యః ఉరగో వా భవాన్ యది ।
సత్యం సర్ప వచో బ్రూహి పృచ్ఛతి త్వాం యుధిష్ఠిరః ।
కిమర్థం చ త్వయా గ్రస్తః భీమసేనో భుజంగమః ॥ 9
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - సర్పమా! యుధిష్ఠిరుడు నిన్నడగుతున్నాడు. నిజమైన మాట చెప్పు. నీవు దేవుడివా? దైత్యుడివా? లేక భుజంగమా! భీమసెనుడినెందుకు ఆహారంగా గ్రహించావు? (9)
కిమాహృత్య విదిత్వా వా ప్రీతిస్తే స్యాద్ భుజంగమ ।
కిమాహారం ప్రయచ్ఛామి కథం ముంచేద్ భవానిమమ్ ॥ 10
భుజంగమా! నీకు ఏం తెచ్చిస్తే, లేదా ఏం తెలిపితే ప్రీతి కలుగుతుంది. ఎలాంటి ఆహారాన్నివ్వను. నీవెలా వీనిని విడిచిపెడతావు? (10)
సర్ప ఉవాచ
నహుషో నామ రాజాహమ్ ఆసం పూర్వస్తవానఘ ।
ప్రథితః పంచమః సోమాద్ ఆయోః పుత్రో నరాధిప ॥ 11
పాము చెపుతోంది - అనఘా! నేను నీకు పూర్వికుడనైన నహుషుడనే రాజును. చంద్రుడి నుండి ఐదోవాడైన ఆయువు కుమారుడను. (11)
క్రతుభిస్తపసా చైవ స్వాధ్యాయేన దమేన చ ।
త్రైలోక్యైశ్వర్యమవ్యగ్రం ప్రాప్తోఽహం విక్రమేణ చ ॥ 12
యాగాలు ఆచరించటం, తపస్సు, వేదాధ్యయనం, ఇంద్రియనిగ్రహం, పరాక్రమం- వీని వల్ల నేను ముల్లోకాలపై ఆధిపత్యాన్ని పొందాను. (12)
తదైశ్వర్యం సమాసాద్య దర్పో మామగమత్ తదా ।
సహస్రం హి ద్విజాతీనామ్ ఉవాహ శిబికాం మమ ॥ 13
ఐశ్వర్యమదమత్తోఽహమ్ అవమన్య తతో ద్విజాన్ ।
ఇమామగస్త్యేన దశామ్ ఆనీతః పృథివీపతే ॥ 14
న తు మామజహాత్ ప్రజ్ఞా యావదద్యేతి పాండవ ।
తస్యైవానుగ్రహాద్ రాజన్ అగస్త్యస్య మహాత్మనః ॥ 15
ఆ ఐశ్వర్యాన్ని పొందిన నాకు అప్పుడు గర్వం కలిగింది. వేయిమంది బ్రాహ్మణులచేత నాపల్లకిని మోయించాను.
మహారాజా! తరువాత ఐశ్వర్యగర్వంతో మత్తెక్కిన నేను బ్రాహ్మణులనవమానించి అగస్త్యుడి శాపంవల్ల ఈదశకు చేరుకున్నాను. పాండవా! మహాత్ముడైన ఆ అగస్త్యుడి అనుగ్రహం వల్లే జ్ఞాపకశక్తి నేటివరకు నన్ను వీడలేదు. (13-15)
షష్ఠే కాలే మయాఽహారః ప్రాప్తోఽయమనుజస్తవ ।
నాహమేనం విమోక్ష్యామి న చాన్యదపు కామయే ॥ 16
ఈ నీ తమ్ముడు రోజుయొక్క ఆరోభాగంలో నాకాహారమయ్యాడు. నేనితనిని విడువను. వేరేదీ కూడ కోరను. (16)
ప్రశ్నానుచ్చారితానద్య వ్యాహరిష్యసి చేన్మమ ।
అథ పశ్చాద్ విమోక్ష్యామి భ్రాతరం తే వృకోదరమ్ ॥ 17
నేనడిగిన ప్రశ్నలకిప్పుడు సమాధానాలు చెప్పినట్లయితే, అటు తరువాత నీతమ్ముడైన భీముని విడిచిపెడతాను. (17)
యుధిష్ఠిర ఉవాచ
బ్రూహి సర్ప యథాకామం ప్రతివక్ష్యామి తే వచః ।
అపి చేచ్ఛక్నుయాం ప్రీతిమ్ ఆహర్తుం తే భుజంగమ ॥ 18
యుధిష్ఠిరుడడుగుతున్నాడు.
సర్పమా! భుజంగమా! నీ ఇష్టము వచ్చినట్లు అడుగు. నీకు ప్రీతి కలిగించటానికి సమర్థుడనయితే నీమాటలకు బదులిస్తాను. (18)
వేద్యం చ బ్రాహ్మణేనేహ తద్ భవాన్ వేత్తి కేవలమ్ ।
సర్పరాజ తతః శ్రుత్వా ప్రతివక్ష్యామి తే వచః ॥ 19
సర్పరాజా! బ్రాహ్మణుడు ఈ తన జన్మలో తెలియవలసిన దానిని నీవెరుగుదువో లేదో విని తరువాత నీమాటలకు బదులిస్తాను. (19)
సర్ప ఉవాచ
బ్రాహ్మణః కో భవేద్ రాజన్ వేద్యం కిం చ యుధిష్ఠిర ।
బ్రవీహ్యతిమతిం త్వాం హి వాక్యైరనుమిమీమహే ॥ 20
పాము అడుగుతోంది.
రాజా! చెప్పు. బ్రాహ్మణుడెవడు? యుధిష్ఠిరా! తెలియదగినదేది? నీమాటలతో చాలా బుద్ధిమంతుడివిగా నిన్ను ఊహిస్తున్నాం. (20)
యుధిష్ఠిర ఉవాచ
సత్యం దానం క్షమా శీలమ్ ఆనృశంస్యం తపో ఘృణా ।
దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 21
నాగేంద్రా! ఎవడియందు సత్యము, దానగుణము, ఓర్పు, సత్ప్రవర్తన, అక్రూరత, తపస్సు, దయ కనబడతాయో అతడు బ్రాహ్మణుడుగా చెప్పబడుతున్నాడు. (21)
వేద్యం సర్ప పరం బ్రహ్మ నిర్దుఃఖమసుఖం చ యత్ ।
యత్ర గత్వా న శోచంతి భవతః కిం వివక్షితమ్ ॥ 22
సర్పమా! తెలియదగినది పరబ్రహ్మమే. అది సుఖదుఃఖములకతీతమైనది. దాన్ని చేరుకుంటే (తెలుసుకుంటే) శోకాన్ని అధిగమిస్తారు. నీవేం చెప్పాలనుకుంటున్నావు? (22)
సర్ప ఉవాచ
చాతుర్వర్ణ్యం ప్రమాణం చ సత్యం చ బ్రహ్మ చైవ హి ।
శూద్రేష్వపి చ సత్యం చ దానమక్రోధ ఏవ చ ।
ఆనృశంస్యమహింసా చ ఘృణా చైవ యుధిష్ఠిర ॥ 23
సర్పం చెపుతోంది - యుధిష్ఠిరుడా! నాలుగువర్ణాల వారికి సత్యము, వేదము - భూతములు - మేలు చేకూర్చేవే. శూద్రులయందు కూడ సత్యము, దానగుణము, కోపంలేకపోవడం, క్రూరస్వభావం లేకపోవడం, హింసాగుణం లేకపోవడం దయ ఉన్నాయి. (23)
వేద్యం యచ్చాత్ర నిర్దుఃఖమ్ అసుఖం చ నరాధిప ।
తాభ్యాం హీనం పదం చాన్యద్ న తదస్తీతి లక్షయే ॥ 24
రాజా! సుఖదుఃఖాలకతీతమైనది ఇక్కడ తెలియదగిన తత్త్వముగా నీవు చెప్పావు. ఆ రెండూలేని మరొక వస్తువున్నట్లు నేను గుర్తించటం లేదు. (24)
యుధిష్ఠిర ఉవాచ
శూద్రే తు యద్ భవేల్లక్ష్మ ద్విజే తచ్చ న విద్యతే ।
న వై శూద్రో భవేచ్ఛూద్రః బ్రాహ్మణో న చ బ్రాహ్మణః ॥ 25
యత్రైతల్లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణః స్మృతః ।
యత్రైతన్న భవేత్ సర్ప తం శూద్రమితి నిర్దిశేత్ ॥ 26
యుధిష్ఠిరుడు చెపుతున్నాడు - శూద్రుడియందు పైన చెప్పిన సత్యము మొదలైనవి ఉండి బ్రాహ్మణునిలో లేనిచో ఆ శూద్రుడు శూద్రుడుకాడు. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. సర్పమా! సత్యాదులు ఎవనియందుండనో అతడు బ్రాహ్మణుడు. ఎవని యందాగుణములు లేవో అతనిని శూద్రుడనవలెను. (25,26)
యత్ పునర్భవతా ప్రోక్తం న వేద్యం విద్యతీతి చ ।
తాభ్యాం హీనమతోఽన్యత్ర పదమస్తీతి చేదపి ॥ 27
ఏవమేతన్మతం సర్ప తాభ్యాం హీనం న విద్యతే ।
యథా శీతోష్ణయోర్మధ్యే భవేన్నోష్ణం న శీతతా ॥ 28
ఏవం వై సుఖదుఃఖాభ్యాం హీనమస్తి పదం క్వచిత్ ।
ఏషా మమ మతిః సర్ప యథా వా మన్యతే భవాన్ ॥ 29
సుఖదుఃఖాలు లేని వేరేతత్త్వమే లేదని, అందువలనే తెలియదగినది లేదని నీచేత చెప్పబడినది. సర్పమా! సుఖదుఃఖాలు లేని తత్త్వము లేదు అని గదా అభిప్రాయము. శీతోష్ణముల మధ్య చల్లదనము - వెచ్చదనముల మధ్య ఉష్ణముండదు. శీతత ఉండదు. అలాగే సుఖదుఃఖాలకు అతీతమైన (సుఖాదుఃఖాలు లేని) స్థానమొకటి ఉన్నదని నా అభిప్రాయం. సర్పమా! నీవేమనుకొనుచున్నావు? (27-29)
సర్ప ఉవాచ
యది తే వృత్తతో రాజన్ బ్రాహ్మణః ప్రసమీక్షితః ।
వృథా జాతిస్తదాఽఽయుష్మన్ కృతిర్యావన్న విద్యతే ॥ 30
పాము చెపుతోంది - రాజా! ప్రవర్తనచేతనే బ్రాహ్మణుని నిర్ధారించవలెననీ నీ అభిప్రాయమైతే చిరంజీవీ! నీవు పేర్కొన్న ప్రకారము ప్రవర్తించనంతవరకు జాతి వ్యర్థమగును. (30)
యుధిష్టిర ఉవాచ
జాతిరత్ర మహాసర్ప మనుష్యత్వే మహామతే ।
సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్ష్యేతి మే మతిః ॥ 31
యుధిష్ఠిరుడు చెపుతున్నాడు - బుద్ధిమంతుడా! మనుష్యలలో అన్నివర్ణాల మధ్య సాంకర్యం వల్ల జాతిని నిర్ధారించటం కష్టమని నాఅభిప్రాయము. (31)
సర్వే సర్వాస్వపత్యాని జనయంతి సదా నరాః ।
వాఙ్ మైథునమథో జన్మ మరణం చ సమం నృణామ్ ॥ 32
ఇదమార్షం ప్రమాణం చ యే యజామహ ఇత్యపి ।
తస్మాచ్ఛీలం ప్రధానేష్టం విదుర్యే తత్త్వదర్శినః ॥ 33
మానవులందరూ అన్నిజాతుల స్త్రీలందు సంతానమును పుట్టించుచున్నారు. మనుష్యులకు మాట, దాంపత్యము, పుట్టుక, చావు సమానముగానుండును. జాతినిర్ణయించలేని దైనందున "యజ్ఞము చేయుచున్నవారము" అని వేదము జాతిని చెప్పక అందరికీ సాధారణముగా చెప్పుట ఆర్థప్రమాణము. కాబట్టి ప్రవర్తన ప్రధానమని తత్త్వవేత్తలు ఇష్టపడతారు. (32,33)
ప్రాఙ్ నాభివర్ధనాత్ పుంసః జాతకర్మ విధీయతే ।
తత్రాస్య మాతా సావిత్రీ పితా త్వాచార్య ఉచ్యతే ॥ 34
శిశువుకు బొడ్డుకోయక ముందు 'జాతకర్మ' అను సంస్కారము చేయబడుతుంది. ఆ సమయంలో ఆ శిశువు తల్లి సావిత్రి అని, తండ్రి ఆచార్యుడని చెప్పబడతారు. (34)
తావచ్ఛూద్రసమో హ్యేష యావద్ వేదే న జాయతే ।
తస్మిన్నేవం మతిద్వైధే మనుః స్వాయంభువోఽబ్రవీత్ ॥ 35
కృతకృత్యాః పునర్వర్ణా యది వృత్తం న విద్యతే ।
సంకరస్త్వత్ర నాగేంద్ర బలవాన్ ప్రసమీక్షితః ॥ 36
జాతిగురించి సంశయము కలిగినప్పుడు స్వాయంభువమనువు "సంస్కారము చేసి వేదాధ్యయనము చేయించనంతవరకు శూద్రుడని" చెప్పాడు. వేదం చెప్పిన ప్రకారం సంస్కరించి వేదాధ్యయనాదులు చేయించినా బ్రాహ్మణాదివర్ణముల వారియందు ఆశించిన సత్ప్రవర్తన లేనిచో నాగేంద్రా! వారి విషయమున వర్ణసాంకర్యం బలంగా ఉందని నిర్ణయించబడింది (35,36)
యత్రేదానీం మహాసర్ప సంస్కృతం వృత్తమిష్యతే ।
తం బ్రాహ్మణమహం పూర్వముక్తవాన్ భుజగోత్తమ ॥ 37
ఇప్పుడు ఎవరిలో వేదోక్తసంస్కారముతో పాటు సత్ప్రవర్తన చోటుచేసుకుంటున్నాయో అతడు బ్రాహ్మణుడని నేనింతకుమునుపే చెప్పాను. (37)
సర్ప ఉవాచ
శ్రుతం విదితవేద్యస్య తవ వాక్యం యుధిష్ఠిర ।
భక్షయేయమహం కస్మాద్ భ్రాతరం తే వృకోదరమ్ ॥ 38
పాము చెపుతోంది.
యుధిష్ఠిరా! తెలియవలసినది ఏదో తెలిసిన నీ మాటలు విన్నాను. నేనెలా నీసోదరుడైన భీముని తినగలను? (38)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి యుధిష్ఠిరసర్పసంవాదే అశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 180 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అజగరపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరసర్పసంవాదమను నూట ఎనుబదియవ అధ్యాయము. (180)