182. నూట ఎనుబది రెండవ అధ్యాయము
(మార్కండేయ సమాస్యాపర్వము)
పాండవులు ద్వైతవనము నుండి కామ్యకవనము చేరుట.
వైశంపాయన ఉవాచ
నిదాఘాంతకరః కాలః సర్వభూతసుఖావహః ।
తత్రైవ వసతాం తేషాం ప్రావృట్ సమభిపద్యత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్న సమయంలో గ్రీష్మాన్ని అంతరింపజేసి సర్వప్రాణులకు సుఖప్రదమయిన వానకాలం వచ్చింది. (1)
ఛాదయంతో మహాఘోషాః ఖం దిశశ్చ బలాహకాః ।
ప్రవవర్షుర్దివారాత్రమ్ అసితాః సతతం తదా ॥ 2
అప్పుడు కారుమబ్బులు పెద్దగా ఉరుముతూ ఆకాశాన్నీ, దిక్కులనూ కప్పి వేస్తూ రేబవళ్ళు నిరంతరాయంగా వర్షించాయి. (2)
తపాత్యయనికేతాశ్చ శతశోఽథ సహస్రశః ।
అపేతార్కప్రభాజాలాః సవిద్యుద్విమలప్రభాః ॥ 3
వందలు వేలుగా ఉన్న ఆ మబ్బులు వర్షాకాలపు గుడారాల్లా కనిపిస్తున్నాయి. అవి సూర్యకాంతులను నిరోధిస్తూ మెఱుపుల నిర్మలకాంతులను ధరించి ఉన్నాయి (3)
విరూఢశష్పా ధరణీ మత్తదంశసరీసృపా ।
బభూవ పయసా సిక్తా శాంతా సర్వమనోరమా ॥ 4
నేలంతా గడ్డి మొలిచింది. మదించిన అడవిదోమలు, పాములు తిరుగాడ సాగాయి. నీట తడిసిన భూమి ప్రశాంతంగా సర్వమనోరంజకంగా ఉంది. (4)
న స్మ ప్రజ్ఞాయతే కించిద్ అంభసా సమవస్తృతే ।
సమం వా విషమం వాపి నద్యో వా స్థావరాణి చ ॥ 5
మిట్టపల్లాలు తెలియకుండా నేలకూ నదులకూ తేడా తెలియకుండా నేలనంతా నీరు ఆవరించింది. (5)
క్షుబ్ధతోయా మహావేగాః శ్వసమానా ఇవాశుగాః ।
సింధనః శోభయాంచక్రుః కాననాని తపాత్యయే ॥ 6
వర్షాకాలపు నదులు పరవళ్ళు త్రొక్కే నీటితో బాణాల వలె మహావేగంతో అల్లకల్లోలంగా ప్రవహిస్తూ అడవులను శోభిల్లజేశాయి. (6)
నదతాం కాననాంతేషు శ్రూయంతే వివిధాః స్వనాః ।
వృష్టిభిశ్చ్ఛాద్యమానానాం వరాహమృగపక్షిణామ్ ॥ 7
వర్షంలో తడిసి అరుస్తున్న వరాహాలు, మృగాలు, పక్షుల వివిధ ధ్వనులు అడవుల్లో వినిపిస్తున్నాయి. (7)
స్తోకకాః శిఖినశ్చైవ పుంస్కోకిలగణైః సహ ।
మత్తాః పరిపతంతి స్మ దర్దురాశ్చైవ దర్పితాః ॥ 8
మదించిన చాతకపక్షులు, నెమళ్ళు, మగకోయిలల సమూహాలతో కలిసి ఎగిరెగిరిపడుతున్నాయి. పొగరెక్కిన కప్పలు కూడా అటూ ఇటూ ఎగిరిపడుతున్నాయి. (8)
తథా బహువిధాకారా ప్రావృణ్మేఘానునాదితా ।
అభ్యతీతా శివా తేషాం చరతాం మరుధన్వసు ॥ 9
పాండవులు ఇంకా మరుప్రదేశంలోనే సంచరిస్తున్నారు. పైన చెప్పినట్లు వివిధరూపాలతో, మేఘగర్జనలతో కనిపించిన వర్షర్తువు శుభప్రదమై గడిచిపోయింది. (9)
క్రౌంచహంససమాకీర్ణా శరత్ ప్రముదితాభవత్ ।
రూఢకక్షవనప్రస్థా ప్రసన్నజలనిమ్నగా ॥ 10
విమలాకాశనక్షత్రా శరత్ తేషాం శివాభవత్ ।
మృగద్విజసమాకీర్ణా పాండవానాం మహాత్మనామ్ ॥ 11
ఆపై ఆనందహేతువైన శరదృతువు సంక్రమించింది. క్రౌంచపక్షులు, హంసలు అంతటా సంచరింపసాగాయి. అడవులలో కొండ చరియలపై గడ్డీగాదం బాగా పెరిగాయి. నదుల జలం నిర్మలమయింది. ఆకాశం నిర్మలమై నక్షత్రాలు కాంతివంతాలయ్యాయి. జంతువులు, పక్షులతో నిండిన ఆ శరత్తు మహానుభావులయిన పాండవులకు మంగళకరమైంది. (10-11)
దృశ్యంతే శాంతరజసః క్షపా జలదశీతలాః ।
గ్రహనక్షత్రసంఘైశ్చ సోమేన చ విరాజితాః ॥ 12
రాత్రులు ధూళి లేకుండా నిర్మలంగా ఉన్నాయి. మేఘాల వలె చల్లగా ఉన్నాయి. గ్రహనక్షత్ర సమూహాలతో, చంద్రునితో వెలుగొందసాగాయి. (12)
కుముదైః పుండరీకైశ్చ శీతవారిధరాః శివాః ।
నదీః పుష్కరిణీశ్చైవ దదృశుః సమలంకృతాః ॥ 13
చల్లని నీటితో నిండి శుభప్రదంగా ఉన్న నదులు, చెరువులు కలువలతో, తామరలతో అలంకరింపబడి ఉండటాన్ని (పాండవులు) చూశారు. (13)
ఆకాశనీకాశతటాం తీరవానీరసంకులామ్ ।
బభూవ చరతాం హర్షః పుణ్యతీర్థాం సరస్వతీమ్ ॥ 14
పయనిస్తున్న పాండవులు పవిత్రతీర్థాలు గల సరస్వతీ నదిని చూచి ఆనందించారు. ఆ నదీతీరాలు ఆకాశం వలె నిర్మలంగా ఉన్నాయి. ఆ రెండు తీరాలలో పేము తీగలు ఏపుగా పెరిగి ఉన్నాయి. (14)
తే వై ముముదిరే వీరాః ప్రసన్నసలిలాం శివామ్ ।
పశ్యంతో దృఢధన్వానః పరిపూర్ణాం సరస్వతీమ్ ॥ 15
మేటివిండ్లు గల వీరులయిన ఆ పాండవులు పవిత్ర నిర్మలజలంతో నిండుగా ఉన్న ఆ సరస్వతీనదిని చూచి ఆనందించారు. (15)
తేషాం పుణ్యతమా రాత్రిః పర్వసంధౌ స్మ శారదీ ।
తత్రైవ వసతామాసీత్ కార్తికీ జనమేజయ ॥ 16
జనమేజయా! పాండవులు అక్కడ ఉన్నప్పుడే పర్వసంధిలో పవిత్రమయిన కార్తీకమాసంలో శరత్పూర్ణిమ వచ్చింది. (16)
పుణ్యకృద్భిర్మహాసత్త్వైః తాపసైః సహ పాండవాః ।
తత్ సర్వే భరతశ్రేష్ఠాః సమూహుర్యోగముత్తమమ్ ॥ 17
భరతశ్రేష్ఠులయిన ఆ పాండవులు పుణ్యాత్ములై, సత్త్వసంపన్నులయిన తాపసులతో కలిసి ఆ ఉత్తమయోగాన్ని సఫలం చేసికొన్నారు. (17)
తమిస్రాభ్యుదయే తస్మిన్ ధౌమ్యేన సహ పాండవాః ।
సూతైః పౌరోగవైశ్చైవ కామ్యకం ప్రయయుర్వనమ్ ॥ 18
కృష్ణపక్షం ప్రారంభం కాగానే పాండవులు ధౌమ్యునితో, సూతులతో, పురోహితులతో కలిసి కామ్యకవనం వైపు పయనించారు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి కామ్యకవనప్రవేశే ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 182 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున కామ్యకవనప్రవేశమను నూట యెనుబది రెండవ అధ్యాయము. (182)