184. నూట ఎనుబది నాలుగవ అధ్యాయము

మార్కండేయుడు విప్రమాహాత్మ్యమును చెప్పుట.

వైశంపాయన ఉవాచ
మార్కండేయం మహాత్మానమ్ ఊచుః పాండుసుతాస్తదా ।
మాహాత్మ్యం ద్విజముఖ్యానాం శ్రోతుమిచ్ఛామ కథ్యతామ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
పాండుకుమారులు మహనీయుడైన మార్కండేయునితో "బ్రాహ్మణోత్తముల మాహాత్మ్యాన్ని వినగోరుతున్నాం. చెప్పండి" అని పలికారు. (1)
ఏవముక్తః స భగవాన్ మార్కండేయో మహాతపాః ।
ఉవాచ సుమహాతేజాః సర్వశాస్త్రవిశారదః ॥ 2
వారు అలా అడగగానే సర్వశాస్త్రవిశారదుడు, తేజస్వి, మహాతపస్వి అయిన మార్కండేయుడు ఇలా అన్నాడు. (2)
మార్కండేయ ఉవాచ
హైహయానాం కులకరః రాజా పరపురంజయః ।
కుమారో రూపసంపన్నః మృగయాం వ్యచరద్ బలీ ॥ 3
మార్కండేయుడిలా అన్నాడు.
హైహయవంశకరుడు, శత్రుసంహారకుడు, యువకుడు, అందగాడు అయిన బలి వేటకు వెళ్ళాడు. (3)
చరమాణస్తు సోఽరణ్యే తృణవీరుత్సమావృతే ।
కృష్ణాజినోత్తరాసంగం దదర్శ మునిమంతికే ॥ 4
గడ్డి, లతలు దట్టంగా ఉన్న అరణ్యంలో సంచరిస్తూ బలి సమీపంలో ఒక మునిని చూచాడు. ఆయన మృగచర్మాన్ని కప్పుకొని ఉన్నాడు. (4)
స తేన నిహతోఽరణ్యే మన్యమానేన వై మృగమ్ ।
వ్యథితః కర్మ తత్ కృత్వా శోకోపహతచేతనః ॥ 5
ఆ మునిని మృగంగా భావించి బలి ఆయనను సంహరించాడు. తెలియక తాను చేసిన తప్పును గ్రహించి దుఃఖంతో మూర్ఛిల్లాడు. (5)
జగామ హైహయానాం వై సకాశం ప్రథితాత్మనామ్ ।
రాజ్ఞాం రాజీవనేత్రోఽసౌ కుమారః పృథివీపతిః ।
తేషాం చ తద్ యథావృత్తం కథయామాస వై తదా ॥ 6
కమలాక్షుడైన బలి తెప్పరిల్లుకొని ప్రసిద్ధనరపాలురయిన హైహయుల దగ్గరకు వెళ్ళి, జరిగిన దానిని యథాతథంగా వారికి చెప్పాడు. (6)
తం చాపి హింసితం తాత మునిం మూలఫలాశినమ్ ।
శ్రుత్వా దృష్ట్వా చ తే తత్ర బభూవుర్దీనమానసాః ॥ 7
నాయనా! కందమూలాలు తినే ఆ ముని మరణాన్ని విని, చూచి ఆ హైహయులు దీనమనస్కులయ్యారు. (7)
కస్యాయమితి తే సర్వే మార్గమాణాస్తతస్తతః ।
జగ్ముశ్చారిష్టనేమ్నోఽథ తార్ క్ష్యస్యాశ్రమమంజసా ॥ 8
వారంతా చనిపోయిన ఆ ముని ఎవరికుమారుడో తెలిసికొనాలను విచారిస్తూ వెంటనే కశ్యపసుతుడైన అరిష్టనేమి ఆశ్రమానికి వెళ్ళారు. (8)
తేఽభివాద్య మహాత్మానం తం మునిం నియతవ్రతమ్ ।
తస్థుః సర్వే స తు మునిః తేషాం పూజామథాహరత్ ॥ 9
నియతవ్రతుడు, మహాత్ముడూ అయిన ఆ మునికి నమస్కరించి వారంతా నిలిచారు. ఆ ముని వారికి ఆతిథ్యాన్ని అందించాడు. (9)
తే తమూచుర్మహాత్మానం న వయం సత్క్రియాం మునే ।
త్వత్తోఽర్హాః కర్మదోషేణ బ్రాహ్మనో హింసితో హి నః ॥ 10
"మునీ! మేము నీ సత్కారానికి తగిన వారము కాము. మేము ఒక చెడ్డ పని చేశాము. ఒక బ్రాహ్మణుని హత్య చేశాము" అని వారు ఆ మునితో పలికారు. (10)
తానబ్రవీత్ స విప్రర్షిః కథం వో బ్రాహ్మణో హతః ।
క్వ చాసౌ బ్రూత సహితాః పశ్యధ్వం మే తపోబలమ్ ॥ 11
అది విని ఆ మహర్షి " మీరు బ్రాహ్మణుని ఎలా చంపారు? ఆయనెక్కడ? చెప్పండి. అందరూ కలిసి నా తపోబలాన్ని చూడగలరు" అని వారితో అన్నాడు. (11)
తే తు తత్ సర్వమఖిలమ్ ఆఖ్యాయాస్మై యథాతథామ్ ।
నాపశ్యంస్తమృషిం తత్ర గతాసుం తే సమాగతాః ॥ 12
వారు జరిగినదంతా యథాతథంగా ఆ మునికి చెప్పి ఆయనను హత్యాస్థలానికి తీసికొని పోయారు. అయితే అక్కడ ఆ బ్రాహ్మణుని శవం కనిపించలేదు. (12)
అన్వేషమాణాః సవ్రీడాః స్వప్నవద్గతచేతనాః ।
తానబ్రవీత్ తత్ర మునిః తార్ క్ష్యః పరపురఞ్జయ ॥ 13
ప్యాదయం బ్రాహ్మణః సోఽథ యుష్మాభిర్యో వినాశితః ।
పుత్రో హ్యయం మమ నృపాః తపోబలసమన్వితః ॥ 14
పరపురంజయా! వారు సిగ్గుపడి ఆ శవానికై వెదుకసాగారు. వారికది కలలా ఉంది. వారు చైతన్యాన్ని కోల్పోయారు. అప్పుడు అరిష్టనేమి " మీరు చెప్పిన బ్రాహ్మణుడు నాకొడుకే అయి ఉండవచ్చు. రాజులారా! అతడు గొప్ప తపోబలం గలవాడు" అని వారితో అన్నాడు. (13,14)
తే చ దృష్ట్వైవ తమృషిం విస్మయం పరమం గతాః ।
మహదాశ్చర్యమితి వై తే బ్రువాణా మహీపతే ॥ 15
రాజా! మరల బ్రతికిన ఆ మునిని చూచి వారు పరమాశ్చర్యానికి లోనయ్యారు. 'ఇది చాలా ఆశ్చర్యకర'మని అరిష్టనేమితో అన్నారు. (15)
మృతో హ్యమముపానీతః కథం జీవితమాప్తవాన్ ।
కిమేతత్ తపసో వీర్యం యేనాయం జీవితః పునః ॥ 16
"మరణించిన ఇతనిని ఎలా కొనిరాగలిగారు? తిరిగి ఎలా బ్రతికాడు? ఇదంతా తపోబలమేనా? (16)
శ్రోతుమిచ్ఛామహే విప్ర యది శ్రోతవ్యమిత్యుత ।
స తానువాచ నాస్మాకం మృత్యుః ప్రభవతే నృపాః ॥ 17
బ్రాహ్మణా! ఇదంతా వినాలనుకొంటున్నాము. వినదగినదయితే చెప్పండి" అని వారు అడిగారు.
అరిష్టనేమి వారితో ఇలా అన్నాడు.
"రాజులారా! మాకు మరణం లేదు. (17)
కారణం వః ప్రవక్ష్యామి హేతుయోగసమాసతః ।
(మృత్యుః ప్రభవనే యేన నాస్మాకం నృపసత్తమాః ।
శుద్ధాన్నాః శుద్ధసుధనా బ్రహ్మచర్యవ్రతాన్వితాః ।)
సత్యమేవాభిజానీమో నానృతే కుర్మహే మనః ।
స్వధర్మమనుతిష్ఠామః తస్మాన్మృత్యుభయం న నః ॥ 18
దానికి కారణాన్ని మీకు హేతుపూర్వకంగా చెపుతాను. మాకు మరణమెందుకు లేదో చెప్తాను. వినండి. మేము పవిత్రమైన ఆచారం కలవారము. మాకు అశ్రద్ధ లేదు. సంధ్యోపాసన తత్పరులం పవిత్రమైన అన్నమే తింటాము. పవిత్రమార్గంలోనే ధనాన్ని సంపాదిస్తాం. బ్రహ్మచర్యాన్ని స్వీకరించి పాటిస్తాం. మాకు సత్యమే తెలుసు. అసత్యంవైపు మనసు కూడా పోదు. స్వధర్మాన్ని ఆచరిస్తాం. అందుకే మాకు మృత్యుభయం లేదు. (18)
యద్ బ్రాహ్మణానాం కుశలం తదేషాం కథయామహే ।
నైషాం దుశ్చరితం బ్రూమః తస్మాన్మృత్యుభయం న నః ॥ 19
అతిథీనన్నపానేన భృత్యానత్యశనేన చ ।
సంభోజ్య శేషమశ్నీమః తస్మాన్మృత్యుభయం న నః ॥ 20
బ్రాహ్మణుల మంచితనాన్ని గురించే మాటాడుతాం. వారి చెడును ప్రస్తావించం. అందుకే మాకు మృత్యుభయం లేదు.
అతిథులను అన్నపానాలతో ఆదరిస్తాం. సేవకులకు కడుపునిండా అన్నం పెడతాం. మిగిలిన దానినే మేము తింటాం. కాబట్టి మాకు మృత్యుభయం లేదు. (19,20)
శాంతా దాంతాః క్షమాశీలాః తీర్థదానపరాయణాః ।
పుణ్యదేశనివాసాచ్చ తస్మాస్మృత్యుభయం న నః ।
తేజస్విదేశవాసాచ్చ తస్మాన్మృత్యుభయం న నః ॥ 21
మేము శాంతులము. జితేంద్రియులము. సహనశీలులము. తీర్థదానాలు చేసేవారము. పుణ్యదేశాలలో నివసిస్తాం. కాబట్టి మాకు మృత్యుభయం లేదు. మేము తేజోమూర్తులు నివసించే చోట నివసిస్తాం. అందువలన మాకు మృత్యుభయం లేదు. (21)
ఏతద్ వై లేశమాత్రం నః సమాఖ్యాతం విమత్సరాః ।
గచ్ఛధ్వం సహితాః సర్వే న పాపాద్ భయమస్తి నః ॥ 22
ఈర్ష్యలేని రాజులారా! మీకు లేశమాత్రంగా ఇదంతా చెప్పాను. మీరంతా కలిసి వెళ్ళండి. హత్యాపాపాన్ని గురించి భయపడవద్దు. (22)
ఏవమస్త్వితి తే సర్వే ప్రతిపూజ్య మహామునిమ్ ।
స్వదేశమగమన్ హృష్టాః రాజానో భరతర్షభ ॥ 23
భరతశ్రేష్ఠా! అలాగే అని చెప్పి వారంతా ఆ మహామునిని పూజించి ఆనందంగా స్వదేశానికి వెళ్ళిపోయారు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణమాహాత్మ్యకథనే చతురశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 184 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణమాహాత్మ్యకథనమను నూట యెనుబది నాలుగవ అధ్యాయము. (184)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 24 1/2 శ్లోకాలు.)