192. నూట తొంబది రెండవ అధ్యాయము
శల,దలుల, చరిత్ర; వామదేవ మాహాత్మ్యము.
వైశంపాయన ఉవాచ
భూయ ఏవ బ్రాహ్మణమహాభాగ్యం
వక్తుమర్హసీత్యబ్రవీత్ పాండవేయో మార్కండేయమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
"మరలా బ్రాహ్మణుల మహాభాగ్యాన్ని వివరించి చెప్పండి" అని యుధిష్ఠిరుడు మార్కండేయుని అడిగాడు. (1)
అథాచష్ట మార్కండేయోఽపూర్వమిదం
శ్రూయతాం బ్రాహ్మణానాం చరితమ్ ॥ 2
మార్కండేయుడిలా చెప్పాడు. బ్రాహ్మణుల అపూర్వచరితాన్ని ఇదిగో చెపుతున్నా వినండి. (2)
అయోధ్యాయామిక్ష్వాకుకులోద్వహః
పార్థివః పరిక్షిన్నాను మృగయామగమత్ ॥ 3
అయోధ్యానగరంలో ఇక్ష్వాకువంశశ్రేష్ఠుడైన పరీక్షిన్మహారాజు ఉండేవాడు. ఒకసారి వేటకు వెళ్ళాడు. (3)
తమేకాశ్వేన మృగమనుసరంతం మృగో దూరమపాహరత్ ॥ 4
అధ్వని జాతశ్రమః క్షుత్తృష్ణాభిభూతశ్చైకస్మిన్
దేశే నీలం గహనం వనఖండమపశ్యత్ ॥ 5
ఒంటరిగా గుర్రమెక్కి మృగం వెంటబడిన ఆ పరిక్షిత్తును ఆ మృగం చాలా దూరం లాగికొనిపోయింది.
మార్గంలో ఆయన అలసిపోయాడు. ఆకలిదప్పులు కలిగాయి. అప్పుడు ఒక ప్రాంతంలో నల్లగా, దట్టంగా ఉన్న వనప్రదేశాన్ని చూచాడు. (5)
తచ్చ వివేశ తతస్తస్య వనఖండస్య మధ్యేఽతీవ
రమణీయం సరో దృష్ట్వా సాశ్వ ఏవ వ్యగాహత ॥ 6
అందులో ప్రవేశించాడు. ఆ వనఖండం మధ్యలో ఒక రమణీయ సరస్సును చూచి గుర్రంతోపాటు దానిలో దిగాడు. (6)
అథాశ్వస్తః స బిసమృణాలమశ్వాయాగ్రతో
నిక్షిప్య పుష్కరిణీతీరే సంవివేశ ।
తతః శయానో మధురం గీతమశృణోత్ ॥ 7
కొంత కుదుటపడి ఆ పరీక్షిత్తు కొన్ని తామరతూళ్ళను గుర్రం ముందు వేసి పుష్కరిణీతీరంలో విశ్రమించాడు. పడుకొన్న తర్వాత మధురగీతాన్ని విన్నాడు. (7)
స శ్రుత్వా చింతయన్నేహ మనుష్యగతిం
పశ్యామి కస్య ఖల్వయం గీతశబ్ద ఇతి ॥ 8
విని "ఇక్కడ మనుష్యసంచారం లేదు. ఈ గానమెవరిదో" అని ఆలోచింపసాగాడు. (8)
అథాపశ్యత్ కన్యాం పరమరూపదర్శనీయాం
పుష్పాణ్యవచిన్వంతీం గాయంతీం చ ।
అథ సా రాజ్ఞః సమీపే పర్యక్రామత్ ॥ 9
ఆపై పూలుకోస్తూ పాటపాడుతున్న పరమరమణీయ కన్యను చూచాడు. అప్పుడు ఆమె రాజుకు దగ్గరలోనే తిరుగుతోంది. (9)
తామబ్రవీద్ రాజా కస్యాపి భద్రే కా వా త్వమితి ।
సా ప్రత్యువాచ కన్యా స్మీతి తాం రాజోవాచార్థీ త్వయాహమితి ॥ 10
"నీవెవర్తెవు? ఎవరి కుమార్తెవు" అని రాజు ఆమెను అడిగాడు. 'నేను కన్యను' అని ఆమె బదులిచ్చింది. "నేను నిన్ను కోరుతున్నాను" అని రాజు ఆమెతో అన్నాడు. (10)
అథోవాచ కన్యా సమయేనాహం శక్యా త్వయా
లబ్ధుం నాన్యథేతి రాజా తాం సమయమపృచ్ఛత్ ।
కన్యోవాచ నోదకం మే దర్శయితవ్యమితి ॥ 11
"ఒకమాట ఇస్తేనే నన్ను నీవు పొందగలవు. లేకపోతే లేదు" అని ఆ కన్య పలికింది. రాజు ఆ మాటను చెప్పమన్నాడు. "నాకెప్పుడూ నీటిని చూపించకూడదు" అని ఆమె అన్నది. (11)
స రాజా తాం బాఢమిత్యుక్త్వా తాముపయేమే ।
కృతోద్వాహశ్చ రాజా పరిక్షిత్ క్రీడమానో ముదా
పరమయా యుక్తస్తూష్ణీం సంగమ్య తయా సహాస్తే ॥ 12
రాజు దాని కంగీకరించి ఆమెను వెళ్ళాడాడు. పెండ్లిచేసికొన్న పరీక్షిత్ రాజు పరమానందంగా ఆమెతో క్రీడించి, ఏకాంతంలో ఆమెను కలిసి మౌనంగా కూర్చొని ఉన్నాడు. (12)
తతస్తత్రైవాసీనే రాజని సేనాన్వగచ్ఛత్ ॥ 13
రాజు అలా ఉండగానే ఆయనసేన అక్కడకు వచ్చింది. (13)
సా సేనోపవిష్టం రాజానం పరివార్యాతిష్ఠత్ ।
పర్యాశ్వస్తశ్చ రాజా తయైవ సహ శిబికయా
ప్రాయాదవఘోటితయా స స్వం
నగరమనుప్రాప్య రహసి తయా సహాస్తే ॥ 14
ఆసేన రాజు చుట్టూ చేరింది. రాజు బాగా సేదదీరి తెరలుగల మేనాలో ఆమెతో కలిసి కూర్చొని తన నగరానికి వెళ్లి, ఆమెతో కూడా ఏకాంతంగా ఉన్నాడు. (14)
తత్రాభ్యాశస్థోఽపి కశ్చిన్నాపశ్యదథ
ప్రధానామాత్యోఽభ్యాశచరాస్తస్యస్త్రియోఽపృచ్ఛత్ ॥ 15
అక్కడ రాజు సన్నిహితంగా వచ్చినా ఎవరికీ దర్శనం కూడా దొరకలేదు. ఒకరోజు ప్రధానమంత్రి రాజుదగ్గరుండే ఆడవారినిలా అడిగాడు. (15)
కిమత్ర ప్రయోజనం వర్తతే ఇత్యథాబ్రువంస్తాః స్త్రియః ॥ 16
"ఇక్కడ మీకేమి పని?" అప్పుడు ఆ స్త్రీలు ఇలా అన్నారు. (16)
అపూర్వమివ పశ్యామ ఉదకం నాత్ర నీయత
ఇత్యథామాత్యోఽనుదకం వనం కారయిత్వోదారవృక్షం
బహుపుష్పఫలమూలం తస్య మధ్యే ముక్తాజాలమయీం
పార్శ్వే వాపీమ్ గూఢాం సుధాసలిలలిప్తాం స
రహస్యుపగమ్య రాజానమబ్రవీత్ ॥ 17
"మాకిక్కడ ఒక అద్భుతమైన పని ఉన్నది. ఇక్కడకు నీళ్ళు తేకుండా చూడటం". అప్పుడు మంత్రి జలాశయాలు లేని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయించి అందమైన పెద్దపెద్ద చెట్లు దానిలో ఉండేలా చూచాడు. పూలు, పండ్లు, దుంపలు అక్కడ ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో ఒక బావిని ముత్యాలజాలరులతో నిర్మింపజేశాడు. సుధాస్వచ్ఛమైన జలం దానిలో ఉన్నది. ఆ బావిని మూసి ఉంచాడు. ఆ తర్వాత రాజు దగ్గరకు పోయి ఇలా అన్నాడు. (17)
వనమిదముదారకం సాధ్వత్ర రమ్యతామితి ॥ 18
ఇది మంచి ఉద్యానవనం. దీనిలో చక్కగా విహరించండి. (18)
స తస్య వచనాత్ తయైవ సహ దేవ్యా తద్ వనం ప్రావిశత్ ।
స కదాచిత్ తస్మిన్ కాననే రమ్యే తయైవ
సహ వ్యవాహరదథ క్షుత్తృష్ణార్దితః
శ్రాంతోఽతిముక్తకాగారమపశ్యత్ ॥ 19
రాజు మంత్రిమాట విని భార్యతో కలిసి ఆ వనంలో ప్రవేశించాడు. ఒకరోజు అందమైన ఆ తోటలో ఆమెతో విహరిస్తూ ఆకలి దప్పులతో బాగా అలసిపోయాడు. అతిముక్తలతలతో తయారుచేసిన మండపాన్ని చూచాడు. (19)
తత్ ప్రవిశ్య రాజా సహ ప్రియయా సుధాకృతాం
విమలాం సలిలపూర్ణాం వాపీమపశ్యత్ ॥ 20
పరీక్షిత్తు భార్యతో సహా ఆ మండపంలోనికి ప్రవేశించి అమృతనిర్మలమయిన నీటితో నిండిన బావిని చూచాడు. (20)
దృష్ట్వైవ చ తాం తస్యాశ్చ తీరే సహైవ తయా దేవ్యాతిష్ఠత్ ॥ 21
దానిని చూచి రాణితోపాటు దానితీరంలో నిలిచాడు. (21)
అథ తాం దేవీం స రాజాబ్రవీత్ సాధ్వవతర వాపీసలిలమితి ।
సా తద్వచః శ్రుత్వావతీర్య వాపీం న్యమజ్జన్న పునరుదమజ్జత్ ॥ 22
"జాగ్రత్తగా ఈ దిగుడుబావి నీటిలోనికి దిగు" అని ఆమెతో అన్నాడు. ఆమె ఆయన మాటవిని నీటిలో మునిగింది. కానీ పైకిరాలేదు. (22)
తాం స మృగయమాణో రాజా నాపశ్యద్ వాపీమథ
నిఃస్రావ్య మండూకం శ్వభ్రముఖే దృష్ట్వా క్రుద్ధ ఆజ్ఞాపయామాస స రాజా ॥ 23
పర్వత్ర మంసూకవధః క్రియతామితి యో మయార్జీ స మాం
మృతమండూకోపాయనమాదాయోపతిష్ఠేదితి ॥ 24
రాజు ఆమెకై వెదకినా ఆమె కనిపించలేదు. బావిలోని నీటినంతా తోడించాడు. అక్కడొక బిలంలో ఒక కప్పను చూచి కోపంతో ఇలా ఆదేశించాడు. "ఎక్కడెక్కడి కప్పలను చంపండి. నా దర్శనం కోరేవారు చచ్చిన కప్పను కానుకగా తెచ్చి, నా దగ్గరికి రావాలి". (23,24)
అథ మండూకవధే ఘోరే క్రియమాణే
దిక్షు సర్వాసు మండూకాన్ భయమావివేశ ।
తే భీతా మండూకరాజ్ఞే యథావృత్తం న్యవేదయన్ ॥ 25
రాజాదేశాన్ని అనుసరించి భీకరంగా మండూకవధ ప్రారంభమైంది. అన్ని దిక్కులలోని కప్పలకూ భయం కలిగింది. కప్పలన్నీ భయపడి మండూకరాజుతో జరిగినదంతా చెప్పాయి. (25)
తతో మండూకరాట్ తాపనవేషధారీ
రాజానమభ్యగచ్ఛదుపేత్య చైనమువాచ ॥ 26
అప్పుడు మండూకరాజు తాపసవేషాన్ని ధరించి పరీక్షిత్తు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. (26)
మా రాజన్ క్రోధవశం గమః ప్రసాదం కురు నార్హసి
మండూకానామనపరాధినాం వధం కర్తుమితి
శ్లోకౌ చాత్ర భవతః ॥ 27
"రాజా! కోపం వద్దు. అనుగ్రహించు. ఏ తప్పు ఎరుగని కప్పలను చంపవద్దు. ఈ విషయమై రెండు శ్లోకాలు కూడా ఉన్నాయి. (27)
మా మండూకాన్ జిఘాంస త్వం కోపం సంధారయాచ్యుత
ప్రక్షీయత్ ధనోద్రేకః జనానామవిజానతామ్ ॥ 28
అచ్యుతాః కప్పలను చంపవద్దు. కోపాన్ని ఆపుకో. అవివేకంలో ప్రవర్తించే వారి ధనం నశిస్తుంది. (28)
ప్రతిజానీహి నైతాంస్త్వం ప్రాప్య క్రోధం విమోక్ష్యసి ।
అలం కృత్వా తవాధర్మం మండూకైః కిం హతైర్హి తే ॥ 29
ఈ కప్పలను చంపుతూ భార్యామూలకమైన కోపం విడవటం లేదు. ఈ అధర్మమిక చాలు. కప్పలను చంపితే లాభమేమిటి? (29)
తమేవంవాదినమిష్టజనశోకపరీతాత్మా రాజాథోవాచ ॥ 30
రాణి కనిపించకుండా పోయిందని శోకిస్తున్న రాజు ఆ రీతిగా మాటాడుతున్న కప్పలరాజుతో ఇలా అన్నాడు. (30)
న హి క్షమ్యతే తన్మయా హనిష్యామ్యేతా
నేతైర్దురాత్మభిః ప్రియా మే భక్షితా సర్వథైవ
మే వధ్యా మండూకా నార్హసి విద్వన్ మాముపరోద్ధుమితి ॥ 31
నేను క్షమించలేను. కప్పలను చంపి తీరుతాను. ఈ దుర్మార్గపు కప్పలే నారాణిని భక్షించాయి. కాబట్టి కప్పలు నాకు చంపదగినవే. పండితుడా! కప్పలను చంపకుండా నన్ను ఆపవద్దు. (31)
స తద్ వాక్యముపలభ్య వ్యథితేన్ర్దియమనాః ప్రోవాచ
ప్రసీద్ రాజన్నహ మాయుర్నామ మండూకరాజో మమ
సా దుహితా సుశోభనా నామ
తస్యా హి దౌఃశీల్యమేతద్
బహవస్తయా రాజానో విప్రలబ్ధాః పూర్వా ఇతి ॥ 32
ఆ మాటతో మనుసు, ఇంద్రియాలు కలతపడగా ఆ మండూకపతి ఇలా అన్నాడు - మహారాజా! ప్రసన్నుడవు కమ్ము. నా పేరు ఆయువు. నేను మండూక రాజును. ఆమె నా కూతురు సుశోభన. నిన్ను వీడివెళ్ళటం ఆమె దుష్ప్రవర్తన. ఇంతకు ముందు ఇలా రాజులను ఎందరినో మోసగించింది. (32)
తమబ్రవీద్ రాజా తయాఽఽసమర్థీ సా మే దీయతామితి ॥ 33
నేను నీ కుమార్తెను కోరుతున్నాను. ఆమెను నాకివ్వు" అని పరీక్షిత్తు ఆయువుతో అన్నాడు. (33)
అథైనాం రాజ్ఞే పితాదాదబ్రవీచ్చైనామేనం రాజానం శుశ్రూషస్వేతి ॥ 34
స ఏవముక్త్వా దుహితరం క్రుద్ధః శశాప
యస్మాత్ త్వయా రాజానో విప్రలబ్ధా
బహవస్తస్మాదబ్రహ్మణ్యాని తవాపత్యాని
భవిష్యంత్యానృతికత్వాత్ తవేతి ॥ 35
అప్పుడు ఆయవు ఆమెను పరీక్షిత్తున కప్పగించి 'రాజును సేవించు' అని ఆమెతో అన్నాడు. ఆమె చెసిన అపరాధాన్ని గుర్తుచేసికొని ఆమె ఇలా శపించాడు -
"నీవు రాజులనెందరినో మోసగించావు. నీ అసత్యప్రవర్తన వలన నీ పిల్లలు బ్రాహ్మణ విరోధులవుతారు. (34,35)
స చ రాజా తాముపలభ్య తస్యాం సురతగుణ
నిబద్ధహృదయో లోకత్రయైశ్వర్యమివోపలభ్య హర్షేణ
బాష్పకలయా వాచా ప్రణిపత్యాబిపూజ్య
మండూకరాజమబ్రవీదనుగృహీతోఽస్మీతి ॥ 36
స చ మండూకరాజో దుహితరమనుజ్ఞాప్య
యథాగతమగచ్ఛత్ ॥ 37
ఆమె శృంగారగుణాలకు కట్టుబడిన పరీక్షిత్తు ఆమెను పొంది త్రిలోకాధిపత్యాన్ని పొందినట్టు భావించాడు. ఆనందబాష్పాలు విడుస్తూ మండూకరాజుకు నమస్కరించి పూజించి హర్షగద్గదవచనంతో "అనుగ్రహింపబడితిని" అన్నాడు. మండూకరాజు తన కూతురిని విడిచి వచ్చినదారినే వెళ్లాడు. (36,37)
అథ కస్యచిత్ కాలస్య తస్యాం కుమారాస్త్రయస్తస్య
రాజ్ఞః సంబభూవుః 'శలో దలో బలశ్చేతి'
తతస్తేషాం జ్యేష్ఠం శలం సమయే పితా
రాజ్యేఽభిషిచ్య తపసి ధృతాత్మా వనం జగామ ॥ 38
ఆ తర్వాత కొంతకాలానికి వారికి శలుడు, దలుడు, బలుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. యుక్తవయస్సులో పరీక్షిత్తిజ్యేష్ఠుడైన శలుడికి పట్టాభిషేకం జరిపించి తపస్సుపై మనస్సు నుంచి వనానికి వెళ్ళాడు. (38)
అథ కదాచిచ్ఛలో మృగయామనుచరన్
మృగమాసాద్య రథేనాన్వధావత్ ॥ 39
సూతం చోవాచ శీఘ్రం మాం వహస్వేతి స తథోక్తః
సూతో రాజానమబ్రవీత్ ॥ 40
న క్రియతామనుబంధో నైష శక్యస్త్వయా
మృగోఽయం గ్రహీతుం యద్యపి తే రథే
యుక్తౌ వామ్యౌ స్యాతామితి ॥
తతోఽబ్రవీద్ రాజా సూతమాచక్ష్వ మే వామ్యౌ
హన్మి చ త్వామితి । స ఏవముక్తో
రాజభయభీతః సూతో వామదేవశాపభీతశ్చ
సన్ నాచఖ్యౌ రాజ్ఞే । తతః పునః స రాజా
ఖడ్గముద్గమ్య శీఘ్రం కథయస్వేతి తమాహ
హనిష్యే త్వామితి । స తదాఽఽహ
రాజభయభీతః సూతో వామదేవస్యాశ్వౌ వామ్యౌ
మనోజవావితి ॥ 41
ఆ తరువాత ఒకసారి శలుడు వేటకు పోయి, ఒక మృగాన్ని చూచి, రథమెక్కి దాన్ని అనుసరించాడు. త్వరగా రథాన్ని నడుపుమని సారథిని ఆధేశించాడు. అప్పుడు సూతుడు రాజుతో ఇలా అన్నాడు.
పంతానికి పోవద్దు. ఆ మృగాన్ని నీవు పట్టుకొనలేవు. నీ రథానికి వామ్యశ్వాలుంటే మృగాన్ని పట్టుకొనవచ్చు. వెంటనే రాజు "వమ్యశ్వాలంటే ఏవో చెప్పు. లేకపోతే నిన్ను చంపివేస్తాను" అని సూతునితో అన్నాడు. రాజుమాటకు, వామదేవశాపానికీ భయపడిన సూతుడు మిన్నకున్నాడు. ఆ రాజు మరల కత్తినెత్తి "తొందరగా చెప్పు. లేకుంటే నిన్ను చంపివేస్తా" అని భయపెట్టాడు. రాజు చేష్టతో భయపడిన సూతుడు వామదేవుని గుర్రాలే వాములనీ, అవి మనోవేగం కలవనీ చెప్పాడు. (39-41)
అథైనమేవం బ్రువాణమబ్రవీద్ రాజా వామదేవాశ్రమం
ప్రయాహీతి స గత్వా వామదేవాశ్రమం
తమృషిమబ్రవీత్ ॥ 42
సూతుడిలా అనగానే వామదేవాశ్రమానికే రథాన్ని నడిపించమని సూతుడు ఆదేశించాడు. వామదేవాశ్రమానికి పోయి ఆ మునితో రాజు ఇలా అన్నాడు. (42)
భగవన్ మృగో మే విద్ధః పలాయతే
సంభావయితుమర్హసి వామ్యౌ దాతుమితి ।
తమబ్రవీదృషిర్దదాని తే వామ్యౌ కృతకార్యేణ భవతా
మమైవ వామ్యౌ నిర్యాత్యౌ క్షిప్రమితి । స చ తావశ్వౌ ప్రతిగృహ్యానుజ్ఞాప్య ఋషిం
ప్రాయాద్ వామీప్రయుక్తేన రథేన మృగం
ప్రతిగచ్ఛంశ్చాబ్రవీత్ సూతమశ్వరత్నావిమావయోగ్యౌ
బ్రాహ్మణానాం వైతౌ ప్రతిదేయౌ
వామదేవాయేత్యుక్త్వా మృగమవాప్య
స్వనగరమేత్యాశ్వావంతఃపురేఽస్థాపయత్ ॥ 43
"స్వామీ! నాబాణం దెబ్బతిని ఒకమృగం పారిపోయింది. వామ్యశ్వాలను నాకిచ్చి అనుగ్రహించండి" అన్నాడు. ఋషి "నీకు వామ్యశ్వాలను ఇస్తాను. పని ముగిసిన వెంటనే వాటిని నా దగ్గరకు చేర్చాలి" అన్నాడు ముని. పరీక్షిత్తు వామ్యశ్వాలను స్వీకరించి, ముని అనుమతి పొంది నిష్క్రమించాడు. వాములను పూన్చిన రథంపై మృగాల్ని అనుసరిస్తూ "ఈ మేలిగుర్రాలు బ్రాహ్మణులకు అనవసరం. వీటిని తిరిగి ఇవ్వకూడదు" అని సారథితో పలికి, మృగాన్ని పట్టుకొని, తన నగరానికి వెళ్ళి, ఆ గుర్రాలను అంతఃపురంలో కట్టిపెట్టాడు. (43)
అథర్షిశ్చింతయామాస తరుణో రాజపుత్రః
కల్యాణం పత్రమాసాద్య రమతే న
ప్రతినిర్యాతయత్యహో కష్టమితి ॥ 44
అక్కడ వామదేవమహర్షి "యువకుడైన రాజకుమారుడు మేలిగుర్రాలను తీసికొనిపోయి విహరిస్తున్నాడు. తిరిగి తెచ్చి ఇవ్వలేదు. అయ్యో!" అని చింతించసాగాడు. (44)
స మనసా విచింత్య మాసి పూర్ణే శిష్యమబ్రవీత్ ॥ 45
గచ్ఛాత్రేయ రాజానం బ్రూహి యది పర్యాప్తం
నిర్యాతయోపాధ్యాయవామ్యావితి ।
స గత్వైవం తం రాజానమబ్రవీత్ తం రాజా
ప్రత్యువాచ రాజ్ఞామేతద్వాహనమనర్హా
బ్రాహ్మణా రత్నానామేవం విధానాం కిం
బ్రాహ్మణానామశ్వైః కార్యం సాధు గమ్యతామ్ ॥ 46
వామదేవుడలా మథనపడి నెలతర్వాత శిష్యుడితో ఇలా అన్నాడు.
"ఆత్రేయా! వెళ్ళి పనిపూర్తి అయిఉంటే గురువుగారి గుర్రాలను తెచ్చి ఇవ్వండి" అని రాజుతో చెప్పు "అతడు రాజుతో ఆ రీతిగానే చెప్పాడు. రాజు ఆ శిష్యునితో ఇలా అన్నాడు." ఈ వాహనాలు రాజులకు తగినవే కానీ బ్రాహ్మణులు ఇటువంటి రత్నాలను ఉంచుకొనకూడదు. అయినా బ్రాహ్మణులకు అశ్వాలతో పని ఏమిటి? ఇక వెళ్ళు." (45,46)
స గత్వైతదుపాధ్యాయాయాచష్ట తచ్ఛ్రుత్వా
వచనమప్రియం వామదేవః
క్రోధపరీతాత్మా స్వయమేవ
రాజానమభిగమ్యాశ్వార్థమచోదయన్న చాదదద్ రాజా ॥ 47
ఆత్రేయుడు వెళ్ళి గురువుగారికది చెప్పాడు. అప్రియమయిన ఆ మాట విని వామదేవుడు కోపంతో తానే రాజు దగ్గరకు పోయి అశ్వాల నిమ్మన్నాడు. కానీ పరీక్షీత్తు ఇవ్వలేదు. (47)
వామదేవ ఉవాచ
ప్రయచ్ఛ వామ్యౌ మమ పార్థివ త్వం
కృతం హి తే కార్యమాభ్యామశక్యమ్ ।
మా త్వా వధీద్ వరుణో ఘోరపాశైః
బ్రహ్మక్షత్రస్యాంతరే వర్తమానమ్ ॥ 48
వామదేవుడిలా అన్నాడు. రాజా! నా వామ్యశ్వాలనిమ్ము. వీటితో నీ అవసరం తీరిపోయింది. నీవిప్పుడు బ్రాహ్మక్షాత్రాల విరోధాన్ని చూస్తున్నావు. ఘోరపాశాలతో వరుణుడు నిన్ను చంపకుండా చూచుకో. (48)
రాజోవాచ
అనడ్ వాహౌ సువ్రతౌ సాధు దాంతౌ
ఏతద్ విప్రాణాం వాహనం వామదేవ ।
తాభ్యాం యాహి త్వం యత్ర కామో మహర్షే
ఛందాంసి వై త్వాదృశం సంవహంతి ॥ 49
రాజు ఇలా అన్నాడు.
వామదేవా! ఇవిగో ఈ రెండు ఎద్దులు. మంచి స్వభావం గలవి. నియంత్రణ గలవి. ఇవి బ్రాహ్మణులకు తగిన
వాహనాలు. వీటిని బండికి కట్టుకొని ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. వేదాలే మీ వంటివారి భారాన్ని మోస్తాయి. (49)
వామదేవ ఉవాచ
ఛందాంసి వై మాదృశం సంవహంతి
లోకేఽముష్మిన్ పార్థివ యాని సంతి ।
అస్మింస్తు లోకే మమ యానమేతద్
అస్మద్విధానామపరేషాం చ రాజన్ ॥ 50
వామదేవుడిలా అన్నాడు.
రాజా! వేదాలన్నీ మావంటి బ్రాహ్మణుల భారాన్ని మోయటంలో అనుమానం లేదు. కానీ అది పరలోకంలో, ఈ లోకంలో మావంటివారికైనా, మరెవరికైనా అశ్వాలే వాహనాలు. (50)
రాజోవాచ
చత్వారస్త్వాం వా గర్దభాః సంవహంతు
శ్రేష్ఠాశ్వతర్యో హరయో వాతరంహాః ।
తైస్త్వం యాహి క్షత్రియస్యైష వాహః
మమైవ వామ్యౌ న తవైతౌ హి విద్ధి ॥ 51
రాజు ఇలా అన్నాడు. అయితే నాలుగు గాడిదలను, లేదా వాయువేగం గల నాలుగు మనోహరమైన, శ్రేష్ఠములైన కంచరగాడిదలను నీకు వాహనంగా ఇస్తా. వాటితో నీవు ప్రయాణించు. ఈ వామ్యశ్వాలు మాత్రం నాకే. నీకివ్వను. తెలుసుకో. (51)
వామదేవ ఉవాచ
ఘోరం వ్రతం బ్రాహ్మణస్యైతదాహుః
ఏతద్ రాజన్ యదిహాజీవమానః ।
అయస్మయా ఘోరరూపా మహాంతః
చత్వారో వా యాతుధానాః సురౌద్రాః ।
మయా ప్రయుక్తాస్త్వద్వధమీప్సమానాః
వహంతు త్వాం శితశూలాశ్చతుర్ధా ॥ 52
వామదేవుడిలా అన్నాడు. రాజా! బ్రాహ్మణుల సొమ్మును దోచుకొని ఉపయోగించుకొనటం ఘోరకృత్యం. నా వామ్యశ్వాలను తిరిగి ఇవ్వకపోతే నేను నలుగురు రాక్షసులను నీపై ప్రయోగిస్తాను. ఘోరరూపులు, లోహశరీరులు, భయంకరులు అయిన వారు చేతిలో త్రిశూలాలను ధరించి, నిన్ను చంపదలచి, నాలుగు ముక్కలు చేసి, తలా ఒక ముక్క్ తీసికొనిపోతారు. (52)
రాజోవాచ
యే త్వాం విదుర్ర్బాహ్మణం వామదేవ
వాచా హంతుం మనసా కర్మణా వా ।
తే త్వాం సశిష్యమిహ పాతయంతు
మద్వాక్యనున్నాః శితశూలాసిహస్తాః ॥ 53
రాజు ఇలా అన్నాడు. వామదేవా! నీవు బ్రాహ్మణుడవు. కానీ మనస్సుతో, మాటతో, కర్మతో నన్ను చంపదలచుకొంటున్నావు. నేను నా సేవకులకు ఇది తెలిపితే శూలాలను, కత్తులను చేతబట్టి శిష్యసహితంగా నిన్ను చంపి పారవేస్తారు. (53)
వామదేవ ఉవాచ
మమైతౌ వామ్యౌ ప్రతిగృహ్య రాజన్
పునర్దదానీతి ప్రపద్య మే త్వమ్ ।
ప్రయచ్ఛ శీఘ్రం మమ వామ్యౌ త్వమశ్వౌ
యద్యాత్మానం జీవితుం తే క్షమం స్యాత్ ॥ 54
వామదేవుడిలా అన్నాడు. రాజా! నా వామ్యశ్వాలను తీసికొని తిరిగి ఇస్తానని మాట ఇచ్చి ఉన్నావు. నీకు జీవించాలని ఆశ ఉంటే వెంటనే నా గుర్రాలను నా కివ్వు. (54)
రాజోవాచ
న బ్రాహ్మణేభ్యో మృగయా ప్రసుతా
న త్వానుశాస్మ్యద్యప్రభృతి హ్యసత్యమ్ ।
తవైవాజ్ఞాం సంప్రణిధాయ సర్వాం
తథా బ్రహ్మన్ పుణ్యలోకం లభేయమ్ ॥ 55
రాజు ఇలా అన్నాడు. వేట బ్రాహ్మణుల కోసం పుట్టింది కాదు. నీవు అసత్యాలు చెప్తున్నావు. అయినా నిన్ను దండించటం లేదు. నేటి నుండి తప్పు చేసినా నిన్ను క్షమిస్తాను. నీ ఆదేశాలనన్నింటినీ పాటిస్తాను. (55)
వామదేవ ఉవాచ
నానుయోగా బ్రాహ్మణానాం భవంతి
వాచా రాజన్ మనసా కర్మణా వా ।
యస్త్వేవం బ్రహ్మ తపసాన్వేతి విద్వాన్
తేన శ్రేష్ఠో భవతి హి జీవమానః ॥ 56
వామదేవుడిలా అన్నాడు. మనోవాక్కాయకర్మలలో దేనితో కూడా బ్రాహ్మణుల నెవ్వరూ అనుశాసించలేరు. దీనినెరిగి కష్టపడి బ్రాహ్మణుల సేవించినవాడు ఆ సేవద్వారా శ్రేష్ఠుడై జీవిస్తాడు. (56)
మార్కండేయ ఉవాచ
ఏవముక్తే వామదేవేన రాజన్
సముతస్థూ రాక్షసా ఘోరరూపాః ।
తైః శూలహస్తైర్వధ్యమానః స రాజా
ప్రోవాచేదం వాక్యముచ్చైస్తదానీమ్ ॥ 57
మార్కండేయుడిలా అన్నాడు.
వామదేవుడలా అనగానే ఘోరరూపం ధరించిన రాక్షసులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు శూలాలను చేతబట్టి రాజుపై దాడిచేశారు. అప్పుడు రాజిలా అన్నాడు. (57)
ఇక్ష్వకవో యది వా మాం త్యజేయుః
విధేయా మే యది చేమే విశోఽపి ।
నోత్ర్సక్ష్యేఽహం వామదేవస్య వామ్యౌ
నైవంవిధా ధర్మశీలా భవంతి ॥ 58
ఇక్ష్వాకువంశస్థులు, నా ఆదేశాన్ని అనుసరించే నా ప్రజలు అందరూ నన్ను వీడినా నేను వామదేవుని వామ్యశ్వాలను ఇవ్వను. ఇటువంటివారు ధర్మాత్ములు కారు. (58)
ఏవం బ్రువన్నేవ స యాతుధానైః
హతో జగామాశు మహీం క్షితీశః ।
తతో విదిత్వా నృపతిం నిపాతితమ్
ఇక్ష్వాకవో వై దలమభ్యషించన్ ॥ 59
రాజు ఇలా మాటాడుతుండగానే ఆ రాక్షసులు రాజును చంపివేశారు. ఆయన నేలగూలాడు. రాజు మరణించినట్లు విని ఇక్ష్వాకువంశస్థులు దలునకు రాజ్యాభిషేకం జరిపించారు. (59)
రాజ్యే తదా తత్ర గత్వా స విప్రః
ప్రోవాచేదం వచనం వామదేవః ।
దలం రాజానం బ్రాహ్మణానాం హి దేయమ్
ఏవం రాజన్ సర్వధర్మేషు దృష్టమ్ ॥ 60
వామదేవుడు మరల రాజ్యానికి పోయి దలరాజుతో ఇలా అన్నాడు -
"రాజా! బ్రాహ్మణుల వస్తువులను బ్రాహ్మణులకివ్వాలి. సర్వధర్మాలలోనూ ఇది కనిపిస్తుంది. (60)
బిభేషి చేత్ త్వమధర్మాన్నరేంద్ర
ప్రయచ్ఛ మే శీఘ్రమేవాద్య వామ్యౌ ।
ఏతచ్ఛ్రుత్వా వామదేవస్య వాక్యం
స పార్థివః సూతమువాచ రోషాత్ ॥ 61
నీవు అధర్మానికి భయపడేవాడవయితే వెంటనే నా వామ్యశ్వాలను నాకివ్వు". వామదేవుని మాట విని దలుడు కోపంతో సూతునితో ఇలా అన్నాడు. (61)
ఏకం హి సాయకం చిత్రరూపం
దిగ్ధం విషేణాహర సంగృహీతమ్ ।
యేన విద్ధో వామదేవః శయీత
సందశ్యమానః శ్వభిరార్తరూపః ॥ 62
విషదిగ్ధమైన అద్భుతబాణాన్ని ఒకదాన్ని తీసికొనిరా! దానితో గాయపడి వామదేవుడు నేలపై పడాలి. కుక్కలు ఆయనను పీకుతుంటే దీనంగా ఆక్రోశించాలి. (62)
వామదేవ ఉవాచ
జానామి పుత్రం దశవర్షం తవాహం
జాతం మహిష్యాం శ్యేనజితం నరేంద్ర ।
తం జహి త్వం మద్వచనాత్ ప్రణున్నః
తూర్ణం ప్రియం సాయకైర్ఘోరరూపైః ॥ 63
వామదేవుడిలా అన్నాడు.
రాజా! నీ రాణియందు నీకు పుట్టిన పదియేండ్ల కొడుకు శ్యేనజిత్తు ఉన్నాడు. నీవు నామాటమన్నించి నీ భయంకర బాణాలతో అతనిని వెంటనే చంపు. (63)
మార్కండేయ ఉవాచ
ఏవముక్తో వామదేవేన రాజన్
అంతఃపురే రాజపుత్రం జఘావ ।
స సాయకస్తిగ్మతేజా విసృష్టః
శ్రుత్వా దలస్తత్ర వాక్యం బభాషే ॥ 64
మార్కండేయుడిలా అన్నాడు.
వామదేవుడిలా అనగానే భీకరమయిన ఆ బాణం ధనుస్సు నుండి వెలువడి అంతఃపురంలో ఉన్న రాజకుమారుని చంపింది. అది విని దలుడు ఇలా అన్నాడు. (64)
రాజోవాచ
ఇక్ష్వాకవో హంత చరామి వః ప్రియం
నిహన్మీమం విప్రమద్య ప్రమథ్య ।
ఆనీయతామపరస్తిగ్మతేజాః
పశ్యధ్వం మే వీర్యమద్య క్షితీశాః ॥ 65
ఇక్ష్వాకువంశస్థులారా! మీకిష్టమైన పనిచేస్తాను. ఈ విప్రుని ఇప్పుడు కొట్టి చంపుతాను. మరొకబాణాన్ని తీసుకొనిరండి. రాజులారా! నాపరాక్రమాన్ని ఇప్పుడు చూడండి. (65)
వామదేవ ఉవాచ
యత్ త్వమేనం సాయకం ఘోరరూపం
విషేన దిగ్ధం మమ సందధాసి ।
న త్వేతం త్వం శరవర్షం విమోక్తుం
సంధాతుం వా శక్యసే మానవేంద్ర ॥ 66
వామదేవుడిలా అన్నాడు. రాజా! నన్ను చంపటానికి నీవు విషదిగ్ధమయిన భీకరబాణాన్ని సంధించబోతున్నావు. కానీ నీవు ఆ బాణాన్ని ఎక్కుపెట్టలేవు. శరవర్షాన్ని కురిపించనూ లేవు. (66)
రాజోవాచ
ఇక్ష్వాకవః పశ్యత మాం గృహీతం
న వై శక్నోమ్యేష శరం విమోక్తుమ్ ।
న చాస్య కర్తుం నాశమభ్యుత్సహామి
ఆయుష్మాన్ వై జీవతు వామదేవః ॥ 67
రాజు ఇలా అన్నాడు. ఇక్ష్వాకులారా! చూడండి. నేను లొంగిపోయాను. బాణాన్ని విడువలేకున్నాను. ఇతనిని చంపాలనిపించటం లేదు. వామదేవుడు ఆయుష్మంతుడు. బ్రతుకుతాడు. (67)
వామదేవ ఉవాచ
సంస్పృశ్యైనాం మహిషీం సాయకేన
తతస్తస్మాదేనసో మోక్ష్యసే త్వమ్ ।
తతస్తథా కృతవాన్ పార్థివస్తు
తతో మునిం రాజపుత్రీ బభాషే ॥ 68
"రాజా! నీవు ఈ బాణంతో మహారాణిని చంపుము. అపుడు బ్రహ్మహత్యా పాపం నుమ్డి బయటపడతావు" దలుడు ఆ విధంగా చేశాడు. అప్పుడు రాజకుమారి వామదేవునితో ఇలా అన్నది. (68)
రాజపుత్ర్యువచ
యథా యుక్తా వామదేవాహమేనం
దినే దినే సందిశంతీ నృశంసమ్ ।
బ్రాహ్మణేభ్యో మృగయతీ సూనృతాని
తథా బ్రహ్మన్ పుణ్యలోకం లభేయమ్ ॥ 69
రాజకుమారి ఇలా అన్నది. విప్రా! క్రూరస్వభావం గల ఈ నా భర్తకు నేను ప్రతిదినమూ తగినరీతిగా హితబోధ చేస్తాను. బ్రాహ్మణసేవకై వెదుకులాడుతుంటాను. కాబట్టి నేను పుణ్యలోకాలను పొందాలి. (69)
వామదేవ ఉవాచ
త్వయా త్రాతం రాజకులం శుభేక్షణే
వరం వృణీష్వాప్రతిమం దదాని తే ।
ప్రశాధీమం స్వజనం రాజపుత్రి
ఇక్ష్వాకురాజ్యం సుమహచ్చాప్యనింద్యే ॥ 70
వామదేవుడిలా అన్నాడు. శుభేక్షణా! రాజకుమారీ! రాజవంశాన్ని నీవు రక్షించావు. సాటిలేని వరాన్ని కోరుకో! నేను ఇస్తాను. నీ వారినీ, విశాలమైన ఇక్ష్వాకురాజ్యాన్నీ పరిపాలించు. (70)
రాజపుత్ర్యువాచ
వరం వృణే భగవంస్త్వేవమేష
విముచ్యతాం కిల్బిషాదద్య భర్తా ।
శివేన చాధ్యాహి సపుత్రబాంధవం
వరో వృతో హ్యేష మయా ద్విజాగ్ర్య ॥ 71
రాజకుమారి ఇలా అన్నది. స్వామీ! వరాన్ని కోరుకొంటున్నాను. నా భర్త నేడే పాపవిముక్తుడు కావాలి. సపుత్రబాంధవంగా క్షేమంగా ఉండేటట్లు చూడు. విప్రోత్తమా! ఇదే నేను కోరే వరం. (71)
మార్కండేయ ఉవాచ
శ్రుత్వా వచః స మునీ రాజపుత్ర్యాః
తథాస్త్వితి ప్రాహ కురుప్రవీర ।
తతః స రాజా ముదితో బభూవ
వామ్యౌ చాస్మై ప్రదదౌ సంప్రణమ్య ॥ 72
మార్కండేయుడిలా అన్నాడు. కురుశ్రేష్ఠా! రాజకుమారి మాట విని వామదేవుడు 'తథాస్తు' అన్నాడు. రాజు ఆనందించాడు. నమస్కరించి వామదేవునకు వామ్యశ్వాలను ఇచ్చాడు. (72)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి మండూకోపాఖ్యానే ద్వినవత్యధికశతతమోఽధ్యాయః ॥ 192 ॥
ఇది శ్రీ మహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున మంఢూకోపాఖ్యానమను నూట తొంబది రెండవ అధ్యాయము. (192)