194. నూట తొంబది నాలుగవ అధ్యాయము

రాజమహిమ విషయమై శిబి సుహోత్రుల ప్రశంస.

వైశంపాయన ఉవాచ
తతః పాండవాః పునర్మార్కండేయమూచుః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు పాండవులు మార్కండేయుని మరలా అడిగారు. (1)
కథితం బ్రాహ్మణమహాభాగ్యం
రాజన్యమహాభాగ్యమిదానీం శుశ్రూషామహ ఇతి
తానువాచ మార్కండేయో మహర్షిః
శ్రూయతామితి ఇదానీం రాజన్యానాం మహాభాగ్యమితి ।
కురూణామన్యతమః సుహోత్రో నామ రాజా
మహర్షీనభిగమ్య నివృత్య రథస్థమేవ
రాజానమౌశీనరం శిబిం దదర్శాభిముఖం తౌ
సమేత్య పరస్పరేణ
యతావయః పూజాం ప్రయుజ్య గుణసామ్యేన
పరస్పరేణ తుల్యాత్మానౌ
విదిత్వాన్యోన్యస్య పంథానం న దదతుస్తత్ర
నారదః ప్రాదురాసీత్ కిమిదం భవంతౌ
పరస్పరస్య పంధానమావృత్య తిష్ఠత ఇతి ॥ 2
"బ్రాహ్మణ మాహాత్మ్యాన్ని చెప్పారు. క్షత్రియుల మాహాత్మ్యాన్ని ఇప్పుడు వినాలనుకొంటున్నాము."
"అయితే ఇప్పుడు క్షత్రియుల మాహాత్మ్యాన్ని చెపుతా వినండి" అని మార్కండేయమహర్షి వారితో అన్నాడు. కురువంశస్థులలో సుహోత్రుడను రాజు... ఒకడు. ఆయన ఒకమారు మహర్షులను సందర్శించి మరలి వస్తూ తనకు దగ్గరగా రథంపై ఉన్న ఉశీనరపుత్రుని - శిబిని చూచాడు. ఒకరినొకరు ఎదురుపడగానే వయస్సుననుసరించి పరస్పరం గౌరవించుకొన్నారు. కానీ గుణాలను బట్టి ఇరువురూ సమానులనుకొని ఎవ్వరూ తప్పుకొని దారి ఇవ్వలేదు. అప్పుడు అక్కడకు నారదుడు వచ్చాడు. "ఇద్దరూ దారినడ్డగించి నిలిచారేమిటి?" అని వారి నడిగాడు. (2)
తావూచతుర్నారదం నైతద్ భగవన్
పూర్వకర్మకర్ర్తాదిభిర్విశిష్టస్య పంథా ఉపదిశ్యతే
సమర్థాయ వా ఆవాం చ సఖ్యం పరస్పరేణోపగతౌ
తచ్చావధానతోఽత్యుత్కృష్టమధరోత్తరంపరిభ్రష్టం
నారదస్త్వేవముక్తః శ్లోకత్రయమపఠత్ ॥ 3
వారు నారదునితో ఇలా అన్నారు. "స్వామీ! అదేమీ లేదు. తనకన్న విశిష్టునకు కానీ, శక్తిమంతునకు కానీ దారి ఇవ్వాలని ధర్మశాస్త్రనిర్ణయం. మేమిద్దరం స్నేహభావంతో కలిశాం. మాలో ఎవరు శ్రేష్ఠులో ఎవరు తక్కువ వారో తెలియలేదు".
వారి మాటలు విని నారదుడు మూడు శ్లోకాలు చెప్పాడు. (3)
క్రూరః కౌరవ్య మృదవే మృదుః క్రూరే చ కౌరవ ।
సాధుశ్చాసాధవే సాధుః సాధవే నాప్నుయాత్ కథమ్ ॥ 4
"కౌరవా! తనతో మృదువుగా మాటాడేవారితో క్రూరుడైనా మృదువుగా ఉంటాడు. క్రూరులతో క్రూరంగానే ఉంటాడు.
సజ్జనుడు చెడ్డవారితో కూడా మంచిగా ఉంటాడు. ఇక మంచివారితో మంచిగా ఎందుకుండడు? ఉంటాడు. (4)
కృతం శతగణం కుర్యాత్ నాస్తి దేవేషు నిర్ణయః ।
ఔశీనరః సాధుశీలః భవతో వై మహీపతిః ॥ 5
ఉపకారికి వందరెట్లు ప్రత్యుపకారం చేయాలి. ఇది దేవతలకే పరిమితమన్న నిర్ణయం లేదు. శిబి నీకన్న మంచివాడు. (5)
జయేత్ కదర్యం దానేన సత్యేనానృతవాదినమ్ ।
క్షమయా క్రూరకర్మాణం అసాధుం సాధునా జయేత్ ॥ 6
నీచుని దానంతో వశం చేసికోవాలి. అసత్యభాషిని సత్యంతో లొంగదీయాలి. క్రూరుని ఓర్పుతో, చెడ్డవానిని మంచితనంతో గెలవాలి. (6)
తదుభావేవ భవంతావుదారౌ య ఇదానీం
భవద్భ్యామన్యతమః సోఽపసర్పతు ఏతద్ వై
నిదర్శనమిత్యుక్త్వా తూష్ణీం
నారదో బభూవ । ఏతచ్ర్ఛుత్వా తు కౌరవ్యః
శిబిం ప్రదక్షిణం క్ఱుత్వా పంథానం దత్త్వా
బహుకర్మభిః ప్రశస్య ప్రయయౌ ॥ 7
"మీరిద్దరూ ఉదారులే. మీ ఇద్దరిలో మరీ ఉదారుడైనవాడే తప్పుకోవాలి. అదే ఉదారతకు నిదర్శనం" అని చెప్పి నారదుడు మిన్నకున్నాడు. అది విని సుహోత్రుడు శిబికి ప్రదక్షిణం చేసి, దారి నిచ్చి, ఆ శిబిచేసిన సత్కార్యాలను ప్రశంసించి వెళ్ళిపోయాడు. (7)
తదేతద్ రాజ్ఞో మహాభాగ్యమప్యుక్తవాన్ నారదః ॥ 8
ఈ రీతిగా నారదమహర్షియే రాజైన శిబి యొక్క మాహాత్మ్యాన్ని వర్ణించాడు. (8)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి శిబిచరితే చతుర్నవత్యధికశతతమోఽధ్యాయః ॥ 194 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున శిబిచరితమను నూట తొంబది నాలుగవ అధ్యాయము. (194)