199. నూట తొంబది తొమ్మిదవ అధ్యాయము
ఇంద్రద్యుమ్నుని వృత్తాంతము.
వైశంపాయన ఉవాచ
మార్కండేయమృషయః పాండవాః పర్వపృచ్ఛన్నస్తి
కశ్చిద్ భవతశ్చిరజాతతర ఇతి ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఋషులు పాండవులు మార్కండేయుని ఇలా అడిగారు - నీకన్నా ముందు పుట్టి ఉన్న వారెవరైనా ఉన్నారా? (1)
స తానువాచాస్తి ఖలు రాజర్షిరింద్రద్యుమ్నో
నామ క్షీనపుణ్యస్త్రిదివాత్ ప్రచ్యుతః కీర్తిస్తే
వ్యుచ్ఛిన్నేతి స మాముపాతిష్ఠదథ ప్రత్యభిజానాతి
మాం భవానితి ॥ 2
ఆయన వారితో ఇలా అన్నాడు - ఇంద్రద్యుమ్నుడనే రాజర్షి ఉన్నాడు. ఒకప్పుడు పుణ్యం నశించి, "నీకీర్తి ముగిసింది" అని స్వర్గం నుండి గెంటివేయబడ్డాడు. ఆయన నా దగ్గరకు వచ్చి "నీవు నన్ను గుర్తించగలవా" అని అడిగాడు. (2)
తమహమబ్రువం కార్యచేష్టాకులత్వాన్న వయం
వసాయనికా గ్రామైకరాత్రవాసినో న
ప్రత్యభిజానీమోఽప్యాత్మనోఽర్థానామనుష్ఠానం
న శరీరోపతాపేనాత్మనః
సమారభామోఽర్థానామనుష్ఠానమ్ ॥ 3
నేను ఆయనతో ఇలా అన్నాను - "మేము పుణ్యంకోసం, జపతపాదులతో వ్యగ్రులమై ఉంటాము. చెట్లనీడలలో ఉంటూ ఎక్కడా స్థిరంగా నిలువము. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రాత్రి నివసిస్తాము. మా పనులనే మేము మరచిపోతుంటాము. శరీరాన్ని కృశింపజేస్తున్నందువల్ల మా అనుష్ఠానాలనే మేము ప్రారంభించలేకపోతుంటాము. నిన్నెక్కడ గుర్తించుకొనగలం" (3)
(ఏవముక్తో రాజర్షిరింద్రద్యుమ్నః పునర్మామబ్రవీద్
అథాస్తి కశ్చిత్ త్వత్తశ్చిరం జాతతర ఇతి ॥)
(తం పునః ప్రత్యబ్రవమ్) అస్తి ఖలు హిమవతి
ప్రావారకర్ణో నామోలూకః ప్రతివసతి । స
మత్తశ్చిరజాతో భవంతం యది జానీయాదితః ప్రకృష్టే
చాధ్వని హిమవాంస్తత్రాసౌ ప్రతివసతీతి ॥ 4
అలా అనగానే రాజర్షియైన ఇంద్రద్యుమ్నుడు మరల ఇలా అడిగాడు -
'నీకన్న ముందు పుట్టిన వారెవరయినా ఉన్నారా?' అతనితో మరల ఇలా చెప్పాను.
హిమాలయపర్వతంపై ప్రావారకర్ణుడను పేరుగల గుడ్లగూబ నివసిస్తోంది. అది నాకన్నముందు పుట్టినది. దానికి నీవు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ నుండి చాలా దూరం వెళితే హిమాలయం వస్తుంది. అక్కడ అది నివసిస్తోంది. (4)
తతః స మామశ్వో భూత్వా తత్రావహద్ యత్ర
బభూవోలూకః । అథైవం స రాజా ప్రపచ్ఛ ప్రతిజానాతి
మాం భవానితి ॥ 5
అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అశ్వరూపాన్ని ధరించి అక్కడకు నన్ను తీసికొనిపోయాడు. "నీకు నేను తెలుసా?" అని రాజు ఆ గ్రుడ్లగూబను అడిగాడు. (5)
స ముహూర్తమివ ధ్యాత్వాబ్రవీదేనం నాభిజానామి
భవంతమితి స ఏవముక్త ఇంద్రద్యుమ్నః
పునస్తములూకమబ్రవీద్ రాజర్షిః ॥ 6
అది కొంతసేపు ఆలోచించి "నిన్ను నేనెరుగను" అని చెప్పింది. ఆ రాజర్షి మరల గుడ్లగూబను ఇలా అడిగాడు. (6)
అథాస్తి కశ్చిద్ భవతః సకాశాచ్చిరజాత ఇతి
స ఏవముక్తోఽబ్రవీదస్తి ఖల్వింద్రద్యుమ్నం
నామ సరస్తస్మిన్ నాడీజంఘో నామ బకః
ప్రతివసతి సోఽస్మత్రశ్చిరజాతతరస్తం పృచ్ఛేతి తత
ఇంద్రద్యుమ్నో మాం చోలూకమాదాయ తత్ సరోఽ
గచ్ఛద్ యత్రాసౌ నాడీజంఘో నామ బకో బభూవ ॥ 7
"నీకన్న ముందుపుట్టిన చిరంజీవి ఎవరైనా ఉన్నారా?" అపుడు గుడ్లగూబ" ఉన్నది. ఇంద్రద్యుమ్నమనే సరస్సు ఉన్నది. అక్కడ నాడీజంఘుడు అనే పేరు గల కొంగ నివసిస్తోంది. నాకన్న ముందు పుట్టిన దది. వెళ్లి దానినడుగు" అన్నది. అపుడు ఇంద్రద్యుమ్నుడు నన్నూ, గుడ్లగూబనూ కూడా వెంటబెట్టుకొని నాడీజంఘుడు నివసించే సరస్సు దగ్గరకు వెళ్ళాడు. (7)
సోఽస్మాభిః పృష్టో భవానిమమింద్రద్యుమ్నం
రాజానమభిజానాతీతి స ఏవం ముహూర్తం
ధ్యాత్వాబ్రవీన్నాభిజానామ్యహమింద్రద్యుమ్నం
రాజానమితి । తతః సోఽస్మాభిః పృష్టః
కశ్చిద్ భవతోఽన్యశ్చిరజాతతరోఽస్తీతి ।
స నోఽబ్రవీదస్తి ఖల్వస్మిన్నేవ సరస్యకూపారో
నామ కచ్ఛపః ప్రతివసతి ।
స మత్తశ్చిరజాతతరః । స యది
కథంచిదభిజానీయాదిమం రాజానం
తమకూపారం పృచ్ఛధ్వమితి ॥ 8
"ఈ ఇంద్రద్యుమ్నరాజును నీవెరుగుదువా" అని మేము దాన్ని అడిగాము. అది కొంతసేపు ఆలోచించి "ఇంద్రద్యుమ్నుని నేనెరుగను" అన్నది. నీకన్నా ముందు పుట్టినవారెవరైనా ఉన్నారా?" అని మేము దానిని అడిగాము." ఈ సరస్సులోనే అకూపారమను పేరుగల తాబేలు ఉన్నది. అది నాకన్న ముందు పుట్టినది. ఏదోరీతిగా దానికి ఈ రాజు తెలిసి ఉండవచ్చు. వెళ్ళి ఆ అకూపారన్ని అడగండి" అని నాడీజంఘుడు చెప్పాడు.
తతః స బక స్తమకూపారం కచ్ఛపం
విజ్ఞాపయామాస అస్మాకమభిప్రేతం భవంతం
కించిదర్ధమభిప్రష్టుం సాధ్వాగమ్యతాం తావదితి
తచ్ర్ఛుత్పా కచ్ఛపస్తస్మాత్సరసః
ఉత్ధాయాభ్యగచ్ఛద్ యత్ర తిష్ఠామో వయం
తస్య సరసస్తీరే ఆగతం చైనం వయమపృచ్ఛామ
భవానింద్రద్యుమ్నం రాజనమభిజానాతీతి ॥ 9
అప్పుడు ఆ కొంగ ఆకూపారమనే ఆ తాబేటితో "మా కవసరమయిన ఒక విషయాన్ని నిన్ను అడగాలని వచ్చాము. బయటకు రా" అన్నది. అది విని ఆ తాబేలు సరస్సు నుండి లేచి మేము నిలచియున్న ఒడ్డు దగ్గరకు వచ్చింది. రాగానే "నీవు ఇంద్రద్యుమ్న రాజును ఎరుగుదువా?" అని మేము దానిని అడిగాము. (9)
స ముహూర్తం ధ్యాత్వా బాష్పసంపూర్ణనయన
ఉద్విగ్నహృదయో వేపమానో
విసంజ్ఞకల్పః ప్రాంజలిరబ్రవీత్। కిమహమేనం
న ప్ర్రత్యభిజ్ఞాస్యామీహ హ్యనేన
సహస్రకృత్వశ్చితిషు యూపా ఆహితాః ॥ 10
ఆ తాబేలు ముహూర్తకాలం చింతించి, కన్నులలో నీరు నింపుకొని, ఉద్విగ్నహృదయంతో వణుకుతూ చైతన్యాన్ని కోల్పోయినట్లు నిలిచి, చేతులు జోడించి "ఇతనిని నేనెరుగనా? ఇతడు వేయిసార్లు అగ్ని చితులయందు యూపస్తంభాలను ప్రతిష్ఠించాడు. (10)
సరశ్చేదమస్య దక్షిణాభిర్దత్తాభిర్గోభిరతిక్రమమాణాభిః
కృతమ్। అత్ర చాహం ప్రతివసామీతి ॥ 11
ఇతడు యాగదక్షిణగా ఇచ్చిన గోవుల రాకపోకల వలన ఈ సరస్సు ఏర్పడింది. దానిలో నేను నివసిస్తున్నాను" అని పలికింది. (11)
అథైతత్ సకలం కచ్ఛపేనోదాహృతం శ్రుత్వా
తదనంతరం దేవలోకాద్ దేవరథః
ప్రాదురాసీద్ వాచశ్చాశ్రూయంతేంద్రద్యుమ్నం
ప్రతి ప్రస్తుతస్తే స్వర్గో యథోచితం స్థానం
ప్రతిపద్యస్వ కీర్తిమానస్యవ్యగ్రో యాహీతి ॥ 12
తాబేలు చెప్పిన ఈ విషయమంతా వినగానే దేవలోకం నుండి దేవరథం వచ్చింది."రాజా! నీవు స్వర్గానికి రావచ్చు. అక్కడ నీవు తగిన స్థానాన్ని పొందవచ్చు. నీవు కీర్తిశాలివి. నిశ్చింతగా స్వర్గంవైపు పయనించు" అన్న మాట కూడా వినిపించింది. (12)
భవంతి చాత్ర శ్లోకాః
దివం స్పృశతి భూమిం చ
శబ్దః పుణ్యస్య కర్మణః ।
యావత్ స శబ్దో భవతి
తావత్ పురుష ఉచ్యతే ॥ 13
ఈ విషయంలో ఈ శ్లోకాలు కనిపిస్తున్నాయి. పుణ్యకర్మల శబ్దం భూలోక దేవలోకాలను తాకుతుంది. ఆ ధ్వని విన్పించినంతకాలం ఆ పురుషుడు స్వర్గనివాసి అవుతాడు. (13)
అకీర్తిః కీర్త్యతే లోకే
యస్య భూతస్య కస్యచిత్ ।
స పతత్యధర్మాన్ లోకాన్
యావచ్ఛబ్దః ప్రకీర్త్యతే ॥ 14
ఎవని అపకీర్తి లోకంలో ప్రస్తావనకు వస్తుంటుందో అతడు ఆ అపకీర్తిధ్వని వినిపించినంతకాలం అధోలోకాలలో పడి ఉంటాడు. (14)
తస్మాత్ కల్యాణవృత్తః స్యాద్
అనంతాయ నరః సదా ।
విహాయ చిత్తం పాపిష్ఠం
ధర్మమేవ సమాశ్రయేత్ ॥ 15
కాబట్టి నరుడు అనంత కీర్తి కోసం ఎప్పుడూ మంచిపనులనే చేస్తుండాలి. పాపబుద్ధిని విడనాడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. (15)
ఇత్యేతచ్ర్ఛుత్వా స రాజాబ్రవీత్ తిష్ఠ తావద్
యావదిమౌ వృద్ధౌ యథాస్థానం
ప్రతిపాదయామీతి ॥ 16
దేవదూత మాటవిని రాజు "ఈవృద్ధులను యథాస్థానంలో నిలిపేదాకా ఆగు" అని అన్నాడు. (16)
స మాం ప్రావారకర్ణం చోలూకం యథోచితే
స్థానే ప్రతిపాద్య తేనైవ యానేన సంస్థితో
యథోచితం స్థానం ప్రతిపేదే । తన్మయానుభూతం
చిరజీవినేదృశమితి పాండవానువాచ
మార్కండేయః ॥ 17
ఆ మాట పలికి రాజు నన్ను, ప్రావారకర్ణుడను పేరుగల ఆ గుడ్లగూబను తగినస్థానంలో నిలిపి, ఆ రథంలోనే పయనించి తనకు తగిన స్థానానికి చేరుకొన్నాడు. ఇదంతా చిరంజీవినైన నా అనుభవం లోనికి వచ్చిన సంగతి" అని మార్కండేయమహర్షి పాండవులతో అన్నాడు. (17)
పాండవాశ్చోచుః సాధు శోభనం భవతా కృతం
రాజానమింద్రద్యుమ్నం స్వర్గలోకాచ్చ్యుతం
స్వేస్థానే ప్రతిపాదయతేత్య థైతానబ్రవీదసౌ నను
దేవకీపుత్రేణాపి కృష్ణ్న నరకే
మజ్జమానో రాజర్షిర్నృగస్తస్మాత్ కృచ్ర్ఛాత్ పునః
సముద్ధృత్య స్వర్గం ప్రాపిత ఇతి ॥ 18
పాండవులిలా అన్నాడు. స్వర్గభ్రష్టుడైన ఇంద్రద్యుమ్న మహారాజును తన స్థానానికి పంపించి మంచి పని చేశారు తమరు. అది విని మార్కండేయుడు ఇలా అన్నాడు.
"దేవకీనందనుడైన ఈ కృష్ణుడు కూడా నరకంలో మునిగి ఉన్న నృగుని ఆ కష్టం నుండి ఉద్ధరించి మరల స్వర్గానికి పంపించాడు." (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఇంద్రద్యుమ్నోపాఖ్యానే నవనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 199
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున
ఇంద్రద్యుమ్నోపాఖ్యానమను నూట తొంబది తొమ్మిదవ అధ్యాయము. (199)