201. రెండు వందల ఒకటవ అధ్యాయము

ధుంధుమారోపాఖ్యానము.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తు రాజా రాజర్షేః ఇంద్రద్యుమ్నస్య తత్ తథా ।
మార్కండేయాన్మహాభాగాత్ స్వర్గస్య ప్రతిపాదనమ్ ॥ 1
యుధిష్ఠిరో మహారాజ పప్రచ్ఛ భరతర్షభ ।
మార్కండేయం తపోవృద్ధం దీర్ఘాయుషమకల్మషమ్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! భరతశ్రేష్ఠా! మహానుభావుడైన మార్కండేయుడు ఇంద్రద్యుమ్నరాజర్షి మరల స్వర్గానికి వెళ్లిన వృత్తాంతాన్ని చెప్పగా విని, యుధిష్ఠిరుడు తపోవృద్ధుడు, దీర్ఘాయువు, పాపరహితుడైన మార్కండేయుని ఇలా అడిగాడు. (1,2)
విదితాస్తవ ధర్మజ్ఞ దేవదానవరాక్షసాః ।
రాజవంశాశ్చ వివిధా ఋషివంశాశ్చ శాశ్వతాః ॥ 3
ధర్మజ్ఞా! దేవదానవరాక్షసులు, వివిధరాజవంశాలు, సనాతనఋషివంశాలు నీకు తెలిసినవే! (3)
న తేఽస్త్యవిదితం కించిద్ అస్మిన్ లోకే ద్విజోత్తమ ।
కథాం వేత్సి మునే దివ్యాం మనుష్యోరగరక్షసామ్ ॥ 4
దేవగంధర్వయక్షాణాం కిన్నరాప్సరసాం తథా ।
ద్విజోత్తమా! ఈ లోకంలో నీవెరుగనిది ఏదీలేదు. మహర్షీ! మనుష్య, నాగ, రాక్షస, దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, అప్సరల కథలన్నీ నీకు తెలుసు. (4 1/2)
ఇదమిచ్ఛామ్యహం శ్రోతుం తత్త్వేన ద్విజసత్తమ ॥ 5
కువలాశ్వ ఇతి ఖ్యాతః ఇక్ష్వాకురపరాజితః ।
కథం నామవిపర్యాసాద్ ధుంధుమారత్వమాగతః ॥ 6
ద్విజశ్రేష్ఠా! ఈ విషయాన్ని యథాతథంగా నేను వినగోరుతున్నాను. ఇక్ష్వాకువంశప్రసిద్ధుడైన కువలాశ్వుడు ఓటమి నెరుగనివాడై కూడా ఏ వైపరీత్యం వలన ధుంధుమారుడయ్యాడు? (5,6)
ఏతదిచ్ఛామి తత్త్వేన జ్ఞాతుం భార్గవసత్తమ ।
విపర్యస్తం యథా నామ కువలాశ్వస్య ధీమతః ॥ 7
భారతశ్రేష్ఠా! ధీమంతుడైన కువలాశ్వుడు పేరు మార్చుకొనటానికి గల యథార్థకారణాన్ని తెలియగోరుతున్నాను. (7)
వైశంపాయన ఉవాచ
యుధిష్ఠీరేణైవముక్తః మార్కండేయో మహామునిః ।
ధౌంధుమారముపాఖ్యానం కథయామాస భారత ॥ 8
వైశంపాయనుడిలా అన్నాడు.
భారతా! యుధిష్ఠిరుడు ఇలా అడగగానే మార్కండేయమహర్షి ధుంధుమారోపాఖ్యానాన్ని చెప్పాడు. (8)
మార్కండేయ ఉవాచ
హంత తే కథయిష్యామి శృణు రాజన్ యుధిష్టిర ।
ధర్మిష్ఠమిదమాఖ్యానం ధుంధుమారస్య తచ్ఛృణు ॥ 9
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! యుధిష్ఠిరా! విను. ధర్మిష్ఠమైన ధుంధుమారోపాఖ్యానాన్ని వినిపిస్తాను. విను. (9)
యథా స రాజా ఇక్ష్వాకుః కువలాశ్వో మహీపతిః ।
ధుంధుమారత్వమగమత్ తచ్ఛృణుష్వ మహీపతే ॥ 10
రాజా! ఇక్ష్వాకురాజైన కువలాశ్వమహారాజు ధుంధుమారుడైన విధానాన్ని చెపుతాను విను. (10)
మహర్షిర్విశ్రుతస్తాత ఉత్తంక ఇతి భారత ।
మరుధన్వసు రమ్యేషు ఆశ్రమస్తస్య కౌరవ ॥ 11
నాయనా! భారతా! ఉత్తంకుడని ప్రసిద్ధముని ఉండేవాడు. రమ్యమైన మరుప్రదేశంలో ఆయన ఆశ్రమముండేది. (11)
ఉత్తంకస్తు మహారాజ తపోఽతప్యత్ సుదుశ్చరమ్ ।
ఆరిరాధయిషుర్విష్ణుం బహూన్ వర్షగణాన్ విభుః ॥ 12
మహారాజా! శక్తిశాలి అయిన ఉత్తంకుడు విష్ణువును ఆరాధింపగోరి అనేక సంవత్సరాలు కఠినతపస్సు నాచరించాడు. (12)
తస్య ప్రీతః స భగవాన్ సాక్షాద్ దర్శనమేయివాన్ ।
దృష్ట్వైవ చర్షిః ప్రహ్వస్తం తుష్టావ వివిధైః స్తవైః ॥ 13
ఆయనతపస్సులతో సంతోషించి విష్ణుభగవానుడు సాక్షాత్కరించాడు. ఆయనను చూడగానే ఆ ఋషి వినయంగా వివిధస్తోత్రాలతో ఆయనను సంతోషపెట్టాడు. (13)
ఉత్తంక ఉవాచ
త్వయా దేవ ప్రజాః సర్వాః ససురాసురమానవాః ।
స్థావరాణి చ భూతాని జంగమాని తథైవ చ ॥ 14
ఉత్తంకుడిలా అన్నాడు.
స్వామీ! దేవరాక్షసమానవులతో సహా సమస్త ప్రజలను, స్థావరజంగమాత్మకాలైన ప్రాణులను నీవు సృష్టించావు. (14)
బ్రహ్మ వేదాశ్చ వేద్యం చ త్వయా సృష్టం మహాద్యుతే ।
శిరస్తే గగనం దేవ నేత్రే శశిదివాకరౌ ॥ 15
నిఃశ్వాసః పవనశ్చాపి తేజోఽగ్నిశ్చ తవాచ్యుత ।
బాహవస్తే దిశః సర్వాః కుక్షిశ్చాపి మహార్ణవః ॥ 16
ఊరూ తే పర్వతా దేవ ఖం నాభిర్మధుసూదన ।
పాదౌ తే పృథివీ దేవీ రోమాణ్యోషధయస్తథా ॥ 17
తేజస్వీ! బ్రహ్మను, వేదాలను, తెలియదగిన సమస్తపదార్థాలనూ నీవే సృష్టించావు.
దేవా! ఆకాశమే నీ శిరస్సు. సూర్యచంద్రులే నీ కళ్ళు. నిశ్వాసమే గాలి. తేజస్సు అగ్ని. అచ్యుతా! నీ బాహువులే సర్వదిక్కులూ. నీ ఉదరమే మహాసాగరం.
దేవా! నీ తొడలే పర్వతాలు. మధుసూదనా! నీ నాభియే ఆకాశం. నీ పాదాల్ భూదేవి. నీ రోమాలే ఓషధులు. (15-17)
ఇంద్రసోమాగ్నివరుణాః దేవాసురమహోరగాః ।
ప్రహ్వాస్త్వాముపతిష్ఠంతి స్తువంతో వివిధైః స్తవైః ॥ 18
ఇంద్రుడు, సోముడు, అగ్ని, వరుణుడు, దేవతలు, అసురులు, నాగులు వినయంతో వివిధస్తోత్రాలతో నిన్ను సేవిస్తారు. (18)
త్వయా వ్యాప్తాని సర్వాణి భూతాని భువనేశ్వర ।
యోగినః సుమహావీర్యాః స్తువంతి త్వాం మహర్షయః ॥ 19
భువనేశ్వరా! సర్వప్రాణుల యందు నీవున్నావు. యోగులు, మహాతేజస్వులు అయిన మహర్షులు నిన్ను స్తుతిస్తారు. (19)
త్వయి తుష్టే జగత్ స్వాస్థ్యం త్వయి క్రుద్ధే మహద్ భయమ్ ।
భయానామపనేతాసి త్వమేకః పురుషోత్తమ ॥ 20
పురుషోత్తమా! నీవు ఆనందిస్తే జగత్తు సుఖంగా ఉంటుంది. నీవు కోపిస్తే మహాభయంకరంగా ఉంటుంది. భయాలను పోగొట్టగలవాడవు నీవొక్కడవే. (20)
దేవానాం మానుషాణాం చ సర్వభుతసుఖావహః ।
త్రిభిర్వికమణైర్దేవ త్రయో లోకాస్త్వయా హృతాః ॥ 21
దేవతలకు, మానవులకు, సమస్తజీవులకు సుఖాలను కల్పించువాడవు నీవే. మూడు పాదాలతో మూడులోకాలను ఆక్రమించినవాడవు నీవు. (21)
అసురాణాం సమృద్ధానాం వినాశశ్చ త్వయా కృతః ।
తవ విక్రమణైర్దేవాః నిర్వాణమగమన్ పరమ్ ॥ 22
బలవంతులయిన అసురులను నీవే నశింపజేశావు. నీ ఆక్రమణల చేతనే దేవతలు పరమశాంతిని పొందగలిగారు. (22)
పరాభూతాశ్చ దైత్యేంద్రాః త్వయి క్రుద్ధే మహాద్యుతే ।
త్వం హి కర్తా వికర్తా చ భూతానామిహ సర్వశః ॥ 23
ఆరాధయిత్వా త్వాం దేవాః సుఖమేధంతి సర్వశః ।
మహాతేజశ్వీ! నీవు కోపిస్తే రాక్షసేంద్రులంతా ఓడిపోతారు. సర్వప్రాణులకు కర్తవు నీవే. వికర్తవు నీవే. నిన్ను ఆరాధించియే దేవతలందరూ సుఖాన్ని పెంపొందించుకొంటారు. (23 1/2)
ఏవం స్తుతో హృషీకేశః ఉత్తంకేన మహాత్మనా ॥ 24
ఉత్తంకమబ్రవీద్ విష్ణుః ప్రీతస్తేఽహం వరం వృణు ।
మహాత్ముడైన ఉత్తంకునిచే ఈవిధంగా స్తుతింపబడిన విష్ణువు "నేను ప్రసన్నుడనైనాను. వరాన్ని కోరుకో" అని ఉత్తంకునితో అన్నాడు. (24 1/2)
ఉత్తంక ఉవాచ
పర్యాప్తో మే వరో హ్యేషః యదహం దృష్టవాన్ హరిమ్ ॥ 25
పురుషం శాశ్వతం దివ్యం స్రష్టారం జగతః ప్రభుమ్ ।
ఉత్తంకుడిలా అన్నాడు. నీవు సర్వజగత్తుకూ సృష్టికర్తవు, దివ్యుడవు, సనాతన పురుషుడవు, శ్రీహరివి. అటువంటి నిన్ను చూడగలగటమే గొప్పవరం. నాకిది చాలు. (25 1/2)
విష్ణురువాచ
ప్రీతస్తేఽహమలౌల్యేన భక్త్యా తవ చ సత్తమ ॥ 26
అవశ్యం హి త్వయా బ్రహ్మన్ మత్తో గ్రాహ్యో వరో ద్విజ ।
విష్ణువు ఇలా అన్నాడు.
సజ్జనశ్రేష్ఠా! నీ భక్తికీ, నీ అలోలుపత్వానికీ సంతసించాను. బ్రహ్మజ్ఞానీ! నీవు తప్పక నానుండి వరాన్ని పొందాలి. (26 1/2)
మార్కండేయ ఉవాచ
ఏవం స ఛంద్యమానస్తు వరేణ హరిణా తదా ॥ 27
ఉత్తంకః ప్రాంజలిర్వవ్రే వరం భరతసత్తమ ।
మార్కండేయుడిలా అన్నాడు. భరతసత్తమా! ఈ రీతిగా పూజ్యుడయిన విష్ణువు వరం కోరుకొమ్మని పట్టుపట్టగా ఉత్తంకుడు చేతులు జోడించి వరాన్ని కోరుకొన్నాడు. (27 1/2)
యది మే భగవన్ ప్రీతః పుండరీకనిభేక్షణ ॥ 28
ధర్మే సత్యే దమే చైవ బుద్ధిర్భవతు మే సదా ।
అభ్యాసశ్చ భవేద్ భక్త్వా త్వయి నిత్యం మమేశ్వర ॥ 29
స్వామీ! పుండరీకాక్షా! నాపై ప్రసన్నత కలిగితే నాకు నిత్యమూ ధర్మంపై, సత్యంపై, దమంపై బుద్ధినిలిచేటట్లు వరమిమ్ము. ఈశ్వరా! నీ భజనయందే నాకు నిత్యం అభ్యాసం కలిగేటట్లు చూడు. (28,29)
శ్రీభగవానువాచ
సర్వమేతద్ధి భవితా మత్ర్పసాదాత్ తవ ద్విజ ।
ప్రతిభాస్యతి యోగశ్చ యేన యుక్తో దివౌకసామ్ ॥ 30
త్రయాణామపి లోకానాం మహత్ కార్యం కరిష్యసి ।
విష్ణుమూర్తి ఇలా అన్నాడు. ద్విజా! నా అనుగ్రహం వలన నీవు కోరినదంతా నీకు లభిస్తుంది. యోగవిద్యకూడా నీ హృదయంలో ప్రతిభాసిస్తుంది. దానితో నీవు దేవతలకు, ముల్లోకాలకూ సంబంధించిన మహాకార్యాలను సాధించగలవు. (30 1/2)
ఉత్సాదనార్థం లోకానాం ధుంధుర్నామ మహాసురః ॥ 31
తపస్యతి తపో ఘోరం శృణు యస్తం హనిష్యతి ।
ధుంధువనే మహారాక్షసుడు లోకాలను నాశనం చేయాలను ఘోరతపస్సు చేస్తున్నాడు. అతనిని ఎవరు చంపుతారో చెపుతాను విను. (31 1/2)
రాజా హి వీర్యవాంస్తాత ఇక్ష్వాకురపరాజితః ॥ 32
బృహదశ్వ ఇతి ఖ్యాతః భవిష్యతి మహీపతిః ।
తస్య పుత్రః శుచిర్దాంతః కువలాశ్వ ఇతి శ్రుతః ॥ 33
నాయనా! ఇక్ష్వాకువంశంలో ఓటమి నెరుగని పరాక్రమవంతుడు బృహదశ్వుడను రాజు పుడతాడు. ఆయనకు కువలాశ్వుడనుకొడుకు జన్మిస్తాడు. అతడు పవిత్రుడు, జితేంద్రియుడు. (32,33)
స యోగబలమాస్థాయ మామకం పార్థివోత్తమః ।
శాసనాత్ తవ విపర్షే ధుంధుమారో భవిష్యతి ।
ఏవముక్త్వా తు తం విప్రం విష్ణురంతరధీయత ॥ 34
ఆ రాజశ్రేష్ఠుడు నీ ఆదేశాన్ని అనుసరించి, నా యోగబలాన్ని ఆశ్రయించి, ధుంధువును చంపి, ధుంధుమారుడవుతాడు. ఉత్తంకునకు ఆ మాట చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. (34)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ధుంధుమారోపాఖ్యానే ఏకాధికద్విశతతమోఽధ్యాయః ॥ 201 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ధుంధుమారోపాఖ్యానమను రెండువందల యొకటవ అధ్యాయము. (201)