210. రెండువందల పదవ అధ్యాయము
సత్సాంగత్యము - బ్రహ్మవిద్యావర్ణనము.
మార్కండేయ ఉవాచ
ఏవముక్తస్తు విప్రేణ ధర్మవ్యాధో యుధిష్ఠిర ।
ప్రత్యువాచ యథా విప్రం తచ్ఛృణుష్వ నరాధిప ॥ 1
మార్కండేయ మహర్షి అన్నాడు - యుధిష్ఠిరా! బ్రాహ్మణుడు ఇలా అడగగా ధర్మ వ్యాధుడు చెప్పిన సమాధానం విను. (1)
వ్యాధ ఉవాచ
విజ్ఞానార్థం మనుష్యాణాం మనః పూర్వం ప్రవర్తతే ।
తత్ ప్రాప్య కామం భజతే క్రోధమ్ చ ద్విజసత్తమ ॥ 2
వ్యాధుడు ఇలా అన్నాడు - బ్రాహ్మణోత్తమా! ఇంద్రియాల ద్వారా ఏ విషయమైనా తెలియటానికి మనస్సు ముందుగా ప్రవర్తిస్తుంది. విషయం తెలిసిన తరువాత మనస్సుకు దానిమీద రాగంగాని ద్వేషంగాని కలుగుతుంది. (2)
తతస్తదర్థం యతతే కర్మ చారభతే మహత్ ।
శిష్టానాం రూపగంధానామ్ అభ్యాసం చ నిషేవతే ॥ 3
అప్పుడు మనుష్యుడు దానిని పొందటానికి ప్రయత్నిస్తాడు. దానికోసం పెద్దపెద్ద పనులు ప్రారంభిస్తాడు. కావలసిన రూపరస గంధాదులు లభిస్తే వాటిని మాటిమాటికి అనుభవిస్తాడు. (3)
తతో రాగః ప్రభవతి ద్వేషశ్చ తదనంతరమ్ ।
తతో లోభః ప్రభవతి మోహశ్చ తదనంతరమ్ ॥ 4
తరువాత ఆ విషయం మీద రాగం కలుగుతుంది. అది లభించకపోతే ద్వేషం కలుగుతుంది. దాని తరువాత కావలసిన వస్తువుకై లోభం ఏర్పడుతుంది. ఆ తరువాత మోహం కలుగుతుంది. (4)
తతో లోభాభిభూతస్య రాగద్వేషహతస్య చ ।
న ధర్మే జాయతే బుద్ధిః వ్యాజాద్ ధర్మం కరోతి చ ॥ 5
ఇలా లోభం ఆక్రమించగా రాగద్వేషాలతో పీడితుడైన వాడి బుద్ధి ధర్మం మీదికి పోదు. ఒకవేళ ధర్మాచరణం చేసినా అది లోకవంచన మాత్రమే అవుతుంది. (5)
వ్యాజేన చరతే ధర్మమ్ అర్థం వ్యాజేన రోచతే ।
వ్యాజేన సిద్ధ్యమానేషు ధనేషు ద్విజసత్తమ ॥ 6
తత్రైవ రమతే బుద్ధిః తతః పాపం చికీర్షతి ।
ద్విజశ్రేష్ఠా! కపటంగా ధర్మం ఆచరిస్తాడు. దాన్ని అడ్డంపెట్టుకొని డబ్బు సంపాదించగోరుతాడు. వంచన వల్ల ధనాదులు రావటం మొదలయ్యాక వాడిబుద్ధి వాటి మీదనే ఆసక్తమవుతుంది. అందువల్ల పాపం చేయగోరుతాడు. (6 1/2)
సుహృద్ధిర్వార్యమాణశ్చ పండితైశ్చ ద్విజోత్తమ ॥ 7
ఉత్తరం శ్రుతిసంబద్ధం బ్రవీత్యశ్రుతియోజితమ్ ।
మేలుకోరే మిత్రులు, పండితులు వారిస్తే అతడు తన పనిని సమర్థించుకోటానికి వేదవిరుద్ధమైన సమాధానం చెపుతూ అది వేదప్రతిపాదితమని అంటాడు. (7 1/2)
అధర్మస్త్రివిధస్తస్య వర్తతే రాగదోషజః ॥ 8
పాపం చింతయతే చైవ బ్రవీతి చ కరోతి చ ।
తస్యాధర్మప్రవృత్తస్య గుణా నశ్యంతి సాధవః ॥ 9
రాగం అనే దోషం వల్ల మూడు రకాల అధర్మం ఏర్పడుతుంది. అది కలిగినవాడు మనస్సులో పాపపు ఆలోచనలు చేస్తాడు. పాపపు మాటలు మాట్లాడుతాడు. పాపపు పనులు చేస్తాడు. అలాంటి అధర్మవర్తనం వల్ల అతని మంచిగుణాలు నశిస్తాయి. (8,9)
ఏకశీలైశ్చ మిత్రత్వం భజంతే పాపకర్మిణః ।
స తేన దుఃఖమాప్నోతి పరత్ర చ విపద్యతే ॥ 10
పాపాత్ములు తమతో సమానమైన వారితోనే స్నేహం చేస్తారు. అతడు ఆ పాపం వల్ల ఇహలోకంలో దుఃఖపడతాడు. పరలోకంలో ఆపదల పాలుఅవుతాడు. (10)
పాపాత్మా భవతి హ్యేవం ధర్మలాభం తు మే శృణు ।
యస్త్వేతాన్ ప్రజ్ఞయా దోషాన్ పూర్వమేవానుపశ్యతి ॥ 11
కుశలః సుఖదుఃఖేషు సాధూంశ్చాప్యుపసేవతే ।
తస్య సాధుసమారంభాద్ బుద్ధిర్ధర్మేషు రాజతే ॥ 12
ఇలా పాపాత్ముడు అవుతాడు. ఇక ధర్మాన్ని ఎలా పొందుతాడో విను. సుఖదుఃఖాలను తెలుసుకోవటంలో నేర్పరి తన బుద్ధితో ఈ విషయదోషాలను ముందుగానే
గుర్తిస్తాడు. వాటిని తొలగించుకొని మంచివారితో మైత్రి చేస్తాడు. సత్సాంగత్యం వల్ల అతని బుద్ధి ధర్మంతో వెలుగొందుతుంది. (11,12)
బ్రాహ్మణ ఉవాచ
బ్రవీషి సూనృతం ధర్మ్యం యస్య వక్తా న విద్యతే ।
దివ్యప్రభావః సుమహాన్ ఋషిరేవ సమోఽసి మే ॥ 13
బ్రాహ్మణుడన్నాడు - నీవు ధర్మయుక్తమైన మంచి విషయాలు చెపుతున్నావు. ఇటువంటివి చెప్పేవాడు ఉండడు. నివు దివ్యప్రభావం గల మహర్షి వని నాకు అనిపిస్తున్నది. (13)
వ్యాధ ఉవాచ
బ్రాహ్మణా వై మహాభాగాః పితరోఽగ్రభుజః సదా ।
తేషాం సర్వాత్మనా కార్యం ప్రియం లోకే మనీషిణా ॥ 14
ధర్మవ్యాధుడు ఇలా చెప్పాడు - మహాభాగులు, ధర్మాత్ములైన బ్రాహ్మణులు, పితృదేవతలు ఎల్లప్పుడూ ముందుగా భోజనం చేయదగినవారు. కాబట్టి బుద్ధిమంతుడు ఇహలోకంలో వారికి అన్నివిధాలా ఇష్టమైన వాటినే చేయాలి. (14)
యత్ తేషాం చ ప్రియం తత్ తే వక్ష్యామి ద్విజసత్తమ ।
నమస్కృత్వా బ్రాహ్మణేభ్యః బ్రాహ్మీం విద్యాం నిబోధ మే ॥ 15
ద్విజోత్తమా! వారికి ఏది ఇష్టమో దానిని చెపుతాను. ముందుగా వారికి నమస్కరించి బ్రాహ్మీ విద్యను చెపుతాను విను. (15)
ఇదం విశ్వం జగత్ సర్వం అజయ్యం చాపి సర్వశః ।
మహాభూతాత్మకం బ్రహ్మ నాతః పరతరం భవేత్ ॥ 16
పంచమహాభూతాత్మకమైన ఈ చరాచర జగత్తు అంతా అన్నివిధాలా అజేయమైన బ్రహ్మస్వరూపం. పర బ్రహ్మకంటె ఉత్కృష్టమైనది ఇంక ఏమీ లేదు. (16)
మహాభూతాని ఖం వాయుః అగ్నిరాపస్తథా చ భూః ।
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ తద్గుణాః ॥ 17
ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి అనేవి పంచమహాభూతాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అయిదూ క్రమంగా వాటి గుణాలు. (17)
తేషామపి గుణాః సర్వే గుణవృత్తిః పరస్పరమ్ ।
పూర్వపూర్వగుణాః సర్వే క్రమశో గుణిషు త్రిషు ॥ 18
ఆ ఆకాశాదుల గుణాలకు అధికత్వమూ గంభీరత్వమూ మొదలైనవి అన్నీ ఉన్నవి. ఆ గుణాలకు పరస్పరం సంక్రమణం గూడా ఉన్నది. మొదటి మొదటి భూతాల గుణాలు క్రమంగా తరువాత ఉన్న గుణవంతమైన భూతాలు మూడింటిలో (అగ్ని, నీరు , భూములలో) ఉన్నవి. అంటే అగ్నిలో శబ్ద స్పర్శ రూపాలు, నీటిలో శబ్దస్పర్శ రూపరసాలు, భూమిలో శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నవి. (18)
షష్ఠస్తు చేతనా నామ మన ఇత్యభిధీయతే ।
సప్తమీ తు భవేద్ బుద్ధిః అహంకారస్తతః పరమ్ ॥ 19
ఈ పంచభూతాలే కాక ఆరవ తత్త్వం చేతన ఉన్నది. దీనినే మనస్సు అంటారు. ఏడవ తత్త్వం బుద్ధి. అహంకారం ఎనిమిదవ తత్త్వం. (19)
ఇంద్రియాణి చ పంచాత్మా రజః సత్త్వం తమస్తథా ।
ఇత్యేష సప్తదశకః రాశిరవ్యక్తసంజ్ఞకః ॥ 20
ఇవే కాక ఐదు జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, సత్త్వరజస్తమస్సులు అనే పదిహేడు తత్త్వాల సమూహాన్ని అవ్యక్తం అంటారు. (20)
సర్వైరిహేంద్రియార్థైస్తు వ్యక్తావ్యక్తైః సుసంవృతైః ।
చతుర్వింశక ఇత్యేష వ్యక్తావ్యక్తమయో గుణః ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 21
ఐదు జ్ఞానేంద్రియాల, మనోబుద్ధుల వ్యక్త విషయాలు, అవ్యక్త విషయాలు బుద్ధిగుహలో దాగి ఉంటాయి. వాటిని అన్నిటిని కలిపితే 24 తత్త్వాలు అవుతాయి. ఈ తత్త్వాల సముదాయమే వ్యక్తావ్యక్తరూపమైన గుణాలు. ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలే. బ్రాహ్మణా! ఇదంతా నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలని అనుకొంటున్నావు? (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణమాహాత్మ్యే దశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 210 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణమాహాత్మ్యమను రెండువందల పదవ అధ్యాయము. (210)