215. రెండువందల పదునైదవ అధ్యాయము

ధర్మవ్యాధుని పూర్వజన్మ వృత్తాంతము.

మార్కండేయ ఉవాచ
గురుం నివేద్య విప్రాయ తౌ మాతాపితరావుభౌ ।
పునరేవ స ధర్మాత్మా వ్యాధో బ్రాహ్మణమబ్రవీత్ ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - యుధిష్ఠిరా! ధర్మాతుడైన వ్యాధుడు కౌశికునికి తన గురువులైన తల్లిదండ్రుల దర్శనం చేయించి మళ్ళీ ఇలా అన్నాడు. (1)
ప్రవృత్తచక్షుర్జాతోఽస్మి సంపశ్య తపసీ బలమ్ ।
యదర్థముక్తోఽసి తయా గచ్ఛ త్వం మిథిలామితి ॥ 2
పతిశుశ్రూషపరయా దాంతయా సత్యశీలయా ।
మిథిలాయాం వసేద్ వ్యాధః స తే ధర్మాన్ ప్రవక్ష్యతి ॥ 3
తల్లిదండ్రులసేవయే నా తపస్సు. దాని ప్రభావం చూడు. నాకు దివ్యదృష్టి కలిగింది. పతిసేవాపరాయణ, ఇంద్రియ నిగ్రహం కలిగి సదాచారతత్పర అయిన ఆ పతివ్రత ఈ మహత్త్వం వలననే 'మిథిలానగరంలో ఉండే వ్యాధుడు నీకు ధర్మోపదేశం చేస్తాడు. అక్కడికి వెళ్ళు' అని నీకు చెప్పింది. (2,3)
బ్రాహ్మణ ఉవాచ
పతివ్రతాయాః సత్యాయాః శీలాఢ్యాయా యతవ్రత ।
సంస్కృత్య వాక్యం ధర్మజ్ఞ గుణవానసి మే మతః ॥ 4
బ్రాహ్మణుడన్నాడు. నియతమైన వ్రతం కలవాడా! సత్యశీల యిన పతివ్రత యొక్క వాక్యాన్ని వినియే నీవు ధర్మజ్ఞుడూ, సద్గుణవంతుడవూ అయ్యావని నా అభిప్రాయం. (4)
వ్యాధ ఉవాచ
యత్ తదా త్వం ద్విజశ్రేష్ఠ తయోక్తో మాం ప్రతి ప్రభో ।
దృష్టమేవ తయా సమ్యక్ ఏకపత్న్యా న సంశయః ॥ 5
వ్యాధుడు అన్నాడు - ద్విజశ్రేష్ఠా! ఆ పతివ్రత చెప్పినదంతా నీవు చూశావు. ఇంక సందేహం ఏముంది? (5)
త్వదనుగ్రహబుద్ధ్యా తు విప్రైతద్ దర్శితం మయా ।
వాక్యం చ శృణు మే తాత యత్ తే వక్ష్యే హితం ద్విజ ॥ 6
నీపైన అనుగ్రహబుద్ధి కలగటం వలననే ఇదంతా నీ ఎదుట ఉంచాను. నీకు మేలు కలిగించే విషయం చెపుతాను విను. (6)
త్వయా వినికృతా మాతా పితా చ ద్విజసత్తమ ।
అనిసృష్టోఽసి నిష్ర్కాంతః గృహాత్ తాభ్యామనిందిత ॥ 7
వేదోచ్చారణకార్యార్థమ్ అయుక్తం తత్ త్వయా కృతమ్ ।
తవ శోకేన వృద్ధౌ తౌ అంధీభూతౌ తపస్వినౌ ॥ 8
నీ తల్లిదండ్రులను ఉపేక్షించావు. వారి అనుమతి తీసుకోకుండానే ఇంటినుంచి బయటికి వచ్చావు. వేదాధ్యయనం కోసమే అయినా నీవు చేసింది అనుచితం. నీవు దూరం కావటం వల్ల కలిగిన బాధతో వృద్ధులైన వారు గ్రుడ్డివారు అయినారు. (7,8)
తౌ ప్రసాదయితం గచ్ఛ మా త్వాం ధర్మోఽత్యగాదయమ్ ।
తపస్వీ త్వం మహాత్మా చ ధర్మే చ నిరతః సదా ॥ 9
వారిని సంతోషపెట్టటానికి ఇంటికి వెళ్ళు. ఇలా చేస్తే నీధర్మం నష్టం గాదు. నీవు తపస్వివి, మహాత్ముడవు, ఎల్లప్పుడు ధర్మతత్పరుడవు. (9)
సర్వమేతదపార్థం తే క్షిప్రం తౌ సంప్రసాదయ ।
శ్రద్ధధస్వ మమ బ్రహ్మన్ నాన్యథా కర్తుమర్హసి ।
గమ్యతామద్య విప్రర్షే శ్రేయస్తే కథయామ్యహమ్ ॥ 10
పితృసేవకు దూరం కావటం వల్ల నీ ధర్మానుష్ఠానం అంతా వ్యర్థం. త్వరగా వెళ్ళి వారిని ప్రసన్నులను చేసుకో. నామాటమైన శ్రద్ధ ఉంచు. ఇంకో విధంగా చేయటం తగదు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళు. నీకు మేలు కలిగేది చెపుతున్నాను. (10)
బ్రాహ్మణ ఉవాచ
యదేతదుక్తం భవతా సర్వం సత్యమసంశయమ్ ।
ప్రీతోఽస్మి తవ భద్రం తే ధర్మాచారగుణాన్విత ॥ 11
బ్రాహ్మణుడు అన్నాడు - ధర్మం, సదాచారం, మంచిగుణాలు గల వ్యాధా! నీవు చెప్పింది అంతా నిస్సందేహంగా సత్యమే. నీకు మేలు కలుగుగాక. నాకు సంతోషం కలిగింది. (11)
వ్యాధ ఉవాచ
దైవతప్రతిమో హి త్వం యస్త్వం ధర్మమనువ్రతః ।
పురాణం శాశ్వతం దివ్యం దుష్ర్పాప్యమకృతాత్మభిః ॥ 12
వ్యాధుడు అన్నాడు - బ్రాహ్మణశ్రేష్ఠా! పురాతనమై, సనాతనమై, దివ్యమై, పుణ్యాత్ములకు కూడ పొందవీలుగాని ధర్మాన్ని అనుసరించే నీవు దేవతుల్యుడవు. (12)
మాతాపిత్రోః సకాశం హి గత్వా త్వం ద్విజసత్తమ ।
అతంద్రితః కురు క్షిప్రం మాతాపిత్రోర్హి పూజనమ్ ।
అతః పరమహం ధర్మం నాన్యం పశ్యామి కంచన ॥ 13
నీవు తల్లిదండ్రుల వద్దకు త్వరగా వెళ్ళి ఎలామ్టి పరాకులేకుండా వారిసేవలో నిమగ్నుడివి కావలసింది. ఇంతకంటే గొప్పధర్మం నాకు కన్పించదు. (13)
బ్రాహ్మణ ఉవాచ
ఇహాహమాగతో దిష్ట్యా దిష్ట్యా మే సంగతం త్వయా ।
ఈదృశా దుర్గభా లోకే నరా ధర్మప్రదర్శకాః ॥ 14
బ్రాహ్మణుడన్నాడు - నా అదృష్టం వల్ల ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం వల్లనే నీ సాంగత్యం లభించింది. ధర్మమార్గాన్ని చూపించే ఇటువంటి మనుష్యులు దుర్లభులు. (14)
ఏకో నరసహస్రేషు ధర్మవిద్ విద్యతే న వా ।
ప్రీతోఽస్మి తవ సత్యేన భద్రం తే పురుషర్షభ ॥ 15
వేలమంది మానవులలో ధర్మం తెలిసిన వాడు ఒకడైనా ఉంటాడో, ఉండడో! నరశ్రేష్ఠా! నీ నిజాయితీకి సంతోషించాను. నీకు మేలు కలుగుగాక! (15)
పతమానోఽద్య నరకే భవతాస్మి సముద్ధృతః ।
భవితవ్యమథైవం చ యద్ దృష్టోఽసి మయానఘ ॥ 16
పుణ్యాత్మా! నరకంలో పడుతున్న నన్ను ఉద్ధరించావు. నీ దర్శనం వల్ల, నీ ఉపదేశాన్ని అనుసరించి ఇక ముందు నడుచుకొంటాను.
రాజా యయాతిర్దౌహిత్రైః పతితస్తారితో యథా ।
సద్భిః పురుషశార్దూల తథాహం భవతా ద్విజః ॥ 17
స్వర్గాన్నుంచి నేలమీద పడిన యయాతి మహారాజును ఆయన పుత్రికాపుత్రులు - అష్టకాదులు ఉద్ధరించినట్లు ద్విజుడనైన నన్ను నీవు ఉద్ధరించావు. (17)
మాతాపితృభ్యాం శుశ్రూషాం కరిష్యే వచనాత్ తవ ।
నాకృతాత్మా వేదయతి ధర్మాధర్మవినిశ్చయమ్ ॥ 18
నీ మాటను అనుసరించి మాతాపితృసేవ చేస్తాను. అంతః కరణం పరిశుద్ధం కానివాడు ధర్మాధర్మనిర్ణయాన్ని చక్కగా చెప్పలేడు. (18)
దుర్ జ్ఞేయః శాశ్వతో ధర్మః శూద్రయోనౌ హి వర్తతే ।
స త్వాం శూద్రమహం మన్యే భవితవ్యం హి కారణమ్ ॥ 19
శూద్రజాతిలో జన్మించినవానికి సనాతనమైన ధర్మం తెలియటం చాలా కష్టం. నిన్ను శూద్రునిగా నేను అనుకోను. దీనికి ఏదో ప్రత్యేకకారణం ఉంటుంది. (19)
యేన కర్మవిశేషేణ ప్రాప్తేయం శూద్రతా త్వయా ।
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం తత్త్వేన హి మహామతే ।
కామయా బ్రూహి మే సర్వం సత్యేన ప్రయతాత్మనా ॥ 20
ఏ పూర్వజన్మ కర్మవిశేషం వల్ల నీకు ఈ శూద్రజన్మ కలిగిందో నేను యథార్థంగా తెలుసుకోవాలి అని అనుకొంటున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో నిజాన్ని అంతా స్వేచ్ఛగా చెప్పవలసింది. (20)
వ్యాధ ఉవాచ
అనతిక్రమణీయా వై బ్రాహ్మణా మే ద్విజోత్తమ ।
శృణు సర్వమిదం వృత్తం పూర్వదేహే మమానఘ ॥ 21
ధర్మవ్యాధుడు చెప్పాడు - ద్విజోత్తమా! బ్రాహ్మణులను నిరాదరించటం నాకు తగదు. నాకు పూర్వజన్మలో కలిగిన శరీరం వల్ల సంభవించిన విషయం చెపుతాను. (21)
అహం హి బ్రాహ్మనః పూర్వమ్ ఆసం ద్విజవరాత్మజః ।
వేదాధ్యాయీ సుకుశలః వేదాంగానాం చ పారగః ॥ 22
పూర్వజన్మలో నేను బ్రాహ్మణకూమారుడను. వేదాధ్యయన సంపన్నుడైన బ్రాహ్మణుడను. వేదాంగవిషయాలు కూడా బాగా తెలుసుకొన్నవాడిని. మంచి ప్రతిభాశాలిని. (22)
ఆత్మదోషకృతైర్ర్బహ్మన్ అవస్థామాప్తవానిమామ్ ।
కశ్చిద్ రాజా మమ సఖా ధనుర్వేదపరాయణః ॥ 23
సంసర్గాద్ ధనుషి శ్రేష్ఠః తతోఽహమభవం ద్విజ ।
స్వయంకృతాపరాధం వలననే నాకు ఈ దురవస్థ ఏర్పడ్డది. పూర్వజన్మలో నాకు ధనుర్వేదపారంగతుడైన ఒకరాజు మిత్రుడు అయినాడు. అతనితో సహవాసం వలన నేను ధనుర్విద్యలో నిపుణుడిని అయినాను. (23 1/2)
ఏతస్మిన్నేవ కాలే తు మృగయాం నిర్గతో నృపః ॥ 24
సహితో యోధముఖ్యైశ్చ మంత్రిభిశ్చ సుసంవృతః ।
తతోఽభ్యహన్ మృగాంస్తత్ర సుబహూనాశ్రమం ప్రతి ॥ 25
ఈ సమయంలోనే రాజు మంత్రులతో, ప్రధాన యోధులతో వేటకు వెళ్ళాడు. ఆయన ఒక మహర్షి ఆశ్రమ సమీపంలో అనేక క్రూరమృగాలను చంపినాడు. (24,25)
అథ క్షిప్తః శరో ఘోరః మయాపి ద్విజసత్తమ ।
తాడితశ్చ ఋషిస్తేన శరీణానతపర్వణా ॥ 26
అపుడు నేను భయంకరమైన, వంకరములికి గల బాణాన్ని వదిలాను. ఆ బాణం ఒక మునికి తగిలింది. (26)
భూమౌ నిపతితో బ్రహ్మన్ ఉవాచ ప్రతినాదయన్ ।
నాపరాధ్యామ్యహం కించిత్ కేన పాపమిదం కృతమ్ ॥ 27
బాణం తగలగానే ఆయన నేలపై పడి దిక్కులు ప్రతిధ్వనించేటట్లు 'అయ్యో! నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ఈ పాపకార్యం ఎవరు చేశారు?' అని అరిచాడు. (27)
మన్వానస్తం మృగం చాహం సంప్రాప్తః సహసా ప్రభో ।
అపశ్యం తమృషిం విద్ధం శరేణానతపర్వణా ॥ 28
నేను అది క్రూరమృగం అనుకొని త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వేసిన ఆ వంకరములికి గల బాణం తగిలిన ఆయనను చూశాను. (28)
అకార్యకరణాచ్చాపి భృశం మే వ్యథితం మనః ।
తముగ్రతపసం విప్రం నిష్టనంతం మహీతలే ॥ 29
అకార్యం చేయటం వలన నా మనస్సు చాలా వ్యథకు లోనైంది. బాధతో భూమిమీద మూల్గుతున్న ఆ మహాతపస్విని చూశాను. (29)
అజానతా కృతమిదం మయేత్యహమథాబ్రువమ్ ।
క్షంతుమర్హసి మే సర్వమితి చోక్తో మయా మునిః ॥ 30
'మహాత్మా! నేను తెలియక ఈ తప్పు చేశాను. నన్ను క్షమించవలసింది' అని అన్నాను. (30)
తతః ప్రత్యబ్రవీద్ వాక్యమ్ ఋషిర్మాం క్రోధమూర్ఛితః ।
వ్యాధస్త్వం భవితా క్రూర శూద్రయోనావితి ద్విజ ॥ 31
నా మాట విని ఆ ముని కోపంతో పరవశుడై 'క్రూరత్మా! నీవు శూద్రజాతిలో జన్మిమ్చి వ్యాధుడివి అవుతావు.' అని (శాపంతో) సమాధానం చెప్పాడు. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే పంచదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 215 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల పదునైదవ అధ్యాయము. (215)