222. రెండువందల ఇరువది రెండవ అధ్యాయము

సహుడు అను అగ్ని జలప్రవేశము; అథర్వాంగిరసుని వలన అగ్ని ప్రకటితమగుట.

మార్కండేయ ఉవాచ
ఆపస్య ముదితా భార్యా సహస్య పరమా ప్రియా ।
భూపతిర్భువభర్తా చ జనయత్ పావకం పరమ్ ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - ధర్మజా! జలంలో నివసించటం చేత ప్రసిద్ధుడైన సహాగ్నికి బాగా ఇష్టురాలైన భార్యపేరు ముదిత. భూలోకానికి భువర్లోకానికి అధిపతి ఐన సహుడు ఆమె వలన 'అద్భుతుడు' అనే గొప్ప అగ్నిని కన్నాడు. (1)
భూతానాం చాపి సర్వేషాం యం ప్రాహుః పావకం పతిమ్ ।
ఆత్మా భువనభర్తేతి సాన్వయేషు ద్విజాతిషు ॥ 2
అద్భుతుడు అనే అగ్ని అన్నిప్రాణులకు అధిపతి అని వంశపరంపరాక్రమంలో బ్రాహ్మణులు అందరూ చెపుతారు. ఆయనే అన్నింటికి ఆత్మ, లోకాలకు అధిపతి. (2)
మహతాం చైవ భూతానాం సర్వేషామిహ యః పతిః ।
భగవాన్ స మహాతేజాః నిత్యం చరతి పావకః ॥ 3
ఆయనే లోకంలో అన్ని మహాభూతాలకు అధిపతి. ఆయనలో పూర్తిగా ఐశ్వర్యం వెలుగొందుతుంటుంది. మహాతేజస్వి అయిన ఆ అగ్నిదేవుడు ఎల్లప్పుడూ అంతటా సంచరిస్తుంటాడు. (3)
అగ్నిర్గృహపతిర్నామ నిత్యం యజ్ఞేషు పూజ్యతే ।
హుతం వహతి యో హవ్యమ్ అస్య లోకస్య పావకః ॥ 4
'గృహపతి' అనే పేరుతో ఎల్లప్పుడు యజ్ఞంలో పూజింపబడుతూ, హోమహవిస్సును దేవతలకు చేర్చే అద్భుతాగ్నియే ఈ లోకాన్ని పవిత్రం చేసేవాడు. (4)
అపాం గర్భో మహాభాగః సత్త్వభుగ్ యో మహాద్భుతః ।
భూపతిర్భువభర్తా చ మహతః పతిరుచ్యతే ॥ 5
ఆపుడు అనే పేరుగల సహునిపుత్రుడు, మహాత్ముడు, సత్త్వభోక్త, భూలోకాన్ని పాలించేవాడు, భువర్లోకానికి ప్రభువు అయిన అద్భుతాగ్ని బుద్ధితత్త్వానికి అధిపతి అని చెపుతారు. (5)
దహన్ మృతాని భూతాని తస్యాగ్నిర్భరతోఽభవత్ ।
అగ్నిష్టోమే చ నియతః క్రతుశ్రేష్ఠో భరస్య తు ॥ 6
'అద్భుతుడు లేక గృహపతి' అనే ఆయనకు అగ్నిస్వరూపుడయిన ఒక పుత్రుడు కలిగాడు. ఆయనపేరు భరతుడు. ఆయన మరణించిన ప్రాణుల శరీరాలను దహిస్తాడు. అగ్నిష్టోమమనే యజ్ఞంలో నిత్యమూ ఉంటాడు. ఇందువల్ల ఆయనను నియతుడు అని కూడా అంటారు. నియతుని సంకల్పం ఉత్తమం. (6)
స వహ్నిః ప్రథమో నిత్యం దేవైరన్విష్యతే ప్రభుః ।
ఆయాంతం నియతం దృష్ట్వా ప్రవివేశార్ణవం భయాత్ ॥ 7
మొదటి అగ్ని అయిన సహుడు గొప్పప్రభావం గలవాడు. ఒకప్పుడు దేవతలు ఆయనను వెతుకుతున్నారు. ఆయనతో పాటు ఆయన మనుమడు (పౌత్రుడు) నియతుడు కూడా రావటం చూచి (ఆయన తనను స్పృశిస్తాడేమో అనే) భయంతో సముద్రంలో దాక్కున్నాడు. (7)
దేవాస్తత్రాపి గచ్ఛంతి మార్గమాణా యథాదిశమ్ ।
దృష్ట్వా త్వగ్నిరథర్వాణం తతో వచనమబ్రవీత్ ॥ 8
అప్పుడు దేవతలు అన్నిదిక్కుల్లో ఆయనను వెతుకుతూ ఎక్కడ ఉంటే అక్కడకు చేరుకోసాగారు. ఒకనాడు అథర్వుని (అంగిరసుని) చూచి అగ్ని ఇలా అన్నాడు. (8)
దేవానాం వహ హవ్యం త్వమ్ అహం వీర సుదుర్బలః ।
అథ త్వం గచ్ఛ మధ్వక్షం ప్రియమేతత్ కురుష్వ మే ॥ 9
'వీరా! నీవు దేవతల వద్దకు వారి హవిస్సును చేర్చు. నేను ఇనుమిక్కిలిగా బలహీనుడిని అయినాను. ఇప్పుడు నీవే అగ్నిపదవిని అలంకరించు. నాకిష్టమయిన ఈ పనిని చేయి.' (9)
ప్రేష్య చాగ్నిరథర్వాణమ్ అన్యం దేశం తతోఽగమత్ ।
మత్స్యాస్తస్య సమాచఖ్యుః క్రుద్ధస్తానగ్నిరబ్రవీత్ ।
భక్ష్యా వై వివిధైర్భావైః భవిష్యథ శరీరిణామ్ ॥ 10
ఇలా అథర్వుని పంపించి అగ్నిదేవుడు ఇంకొకచోటికి వెళ్ళాడు. కాని చేపలు అథర్వునికి ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాయి. ఇందువల్ల కోపించిన అగ్ని శాపాన్ని ఇస్తూ ఇలా అన్నాడు - 'మీరు ప్రాణులకు ఆహారం అవుతారు' అని. (10)
అథర్వాణం తథా చాపి హవ్యవాహోఽబ్రవీద్ వచః ॥ 11
అనునీయమానో హి భృశం దేవవాక్యాద్ధి తేన సః ।
నైచ్ఛద్ వోఢుం హవిః సోఢుం శరీరం చాపి సోఽత్యజత్ ॥ 12
తరువాత అగ్ని అథర్వునితో మళ్ళీ అదేమాట అన్నాడు. అప్పుడు దేవతలు చెప్పగా అథర్వముని సహుడు అనే అగ్నిని చాలా ఎక్కువ వినయంతో ప్రార్థించాడు. అయినా ఆయన హవిస్సును భరించటానికి ఇష్టపడలేదు. అంతేకాక ఆయన తన చిక్కిపోయిన శరీరాన్ని గూడా భరించలేకపోయాడు. చివరకు ఆయన ఆ శరీరాన్ని వదిలేశాడు. (11,12)
స తచ్ఛరీరం సంత్యజ్య ప్రవివేశ ధరాం తదా ।
భూమిం స్పృష్ట్వాసృజద్ ధాతూన్ పృథక్ పృథగతీవ హి ॥ 13
అప్పుడాయన తన శరీరాన్ని వదిలి భూమిలో లీనమయినాడు. భూమిని స్పృశించి అనేక ధాతువులను (భిన్న భిన్నమయిన ఖనిజాలను) సృష్టించాడు. (13)
పూయాత్ స గంధం తేజశ్చ అస్థిభ్యో దేవదారు చ ।
శ్లేష్మణః స్ఫాటికం తస్య పిత్తాన్మారకతం తథా ॥ 14
సహుడు అనే అగ్ని తన చీము రక్తాల నుండి గంధకాన్ని తైజసధాతువులను (వీర్యం, బంగారం) సృజించాడు. ఆయన ఎముకల నుండి దేవదారు వృక్షాన్ని వెలువరించాడు. కఫం (తెమడ, కళ్ళె) నుంచి స్ఫటికాన్ని, పిత్తం నుంచి (పైత్యం - ధాతువిశేషం - పైత్యరసం) మరకతాన్ని వ్యక్తం చేశాడు. (14)
యకృత్ కృష్ణాయసం తస్య త్రిభిరేవ బభుః ప్రజాః ।
నఖాస్తస్యాభ్రపటలం శిరాజాలాని విద్రుమమ్ ॥ 15
ఆయన యకృత్తు (కడుపులో నీరుతిత్తి క్రింద నుండెడు మాంసపు ముద్ద) నుంచి నీలాయసము (నల్లనియినుము) కలిగినది. కాష్ఠం - పాపాణం - లోహం అనే మూడింటి వల్లనే ప్రజలు వెలుగుతారు. ఆయన గోళ్ళు మేఘాలు అవుతవి. నాడులు పగడాలు అయినవి. (15)
శరీరాద్ వివిధాశ్చాన్యే ధాతవోఽస్యాభవన్ నృప ।
ఏవం త్యక్త్వా శరీరం చ పరమే తపసి స్థితః ॥ 16
రాజా! సహాగ్ని శరీరం నుంచి ఇంకా అనేకవిధాలయిన ధాతువులు ఉత్పన్నం అయ్యాయి. ఇలా శరీరాన్ని వదలి ఆయన మహత్తర తపస్సులో లగ్నమయినాడు. (16)
భృగ్వంగిరాదిభిర్భూయః తపసోత్థాపితస్తదా ।
భృశం జజ్వాల తేజస్వీ తపసాఽఽప్యాయితః శిఖీ ॥ 17
భృగువు, అంగిరసుడు మొదలైన మునులు మళ్ళీ ఆయనను తపస్సు నుండి విరమింపజేశారి. అప్పుడు వారి తపస్సుతో పరిపుష్టుడైన అగ్ని చాలా ఎక్కువగా ప్రజ్వరిల్లసాగాడు. (17)
దృష్ట్వా ఋషిం భయాచ్చాపి ప్రవివేశ మహార్ణవమ్ ।
తస్మిన్ నష్టే జగద్ భీతమ్ అథర్వాణమథాశ్రితమ్ ।
అర్చయామాసురేవైనమ్ అథర్వాణం సురాదయః ॥ 18
ఆయన ఎట్టఎదుట అంగిరసుని చూచి భయంతో మహాసముద్రంలో ప్రవేశించాడు. ఇలాగా అగ్ని అదృశ్యం కాగా జగత్తు అంతా భయపడి అథర్వుడయిన అగ్నిని ఆశ్రయించింది. అంతట దేవతలు అథర్వుని పూజించారు. (18)
అథర్వా త్వసృజల్లోకాన్ ఆత్మనాఽఽలోక్య పావకమ్ ।
మిషతాం సర్వభూతానామ్ ఉన్మమాథ మహార్ణవమ్ ॥ 19
అప్పుడు అథర్వుడు సర్వప్రాణులూ చూస్తూ ఉండగా సముద్రాన్ని మథించాడు. పుట్టిన అగ్నిని చూచి లోకులకు ఉపయోగపడుమని ఆదేశించాడు. (19)
ఏవమగ్నిర్భగవతా నష్టః పూర్వమథర్వణా ।
ఆహూతః సర్వభూతానాం హవ్యం వహతి సర్వదా ॥ 20
ఇలా పూర్వకాలంలో అదృశ్యమైన అగ్నిని అంగిరుడు మళ్ళీ పిలిచాడు. అందువల్ల వ్యక్తమైన అగ్ని అన్ని ప్రాణూల హవిస్సును వహిస్తున్నాడు. (20)
ఏవం త్వజనయద్ ధిష్ణ్యాన్ వేదోక్తాన్ విబుధాన్ బహూన్ ।
విచరన్ వివిధాన్ దేశాన్ భ్రమమాణస్తు తత్ర వై ॥ 21
అనేక స్థానాలలో తిరుగుతూ సహాగ్ని ఇలాగే వేదం చెప్పిన దేవతలను, వారి స్థానాలను కలిగించాడు. (21)
సింధునదం పంచనదం దేవికాథ సరస్వతీ ।
గంగా చ శతకుంభా చ సరయూర్గండసాహ్వయా ॥ 22
చర్మణ్వతీ మహీ చైవ మేధ్యా మేధాతిథిస్తదా ।
తామ్రవతీ వేత్రవతీ నద్యస్తిస్రోఽథ కౌశికీ ॥ 23
తమసా నర్మదా చైవ నదీ గోదావరీ తథా ।
వేణోపవేణా భీమా చ వడవా చైవ భారత ॥ 24
భారతీ సుప్రయోగా చ కావేరీ ముర్మురా తథా ।
తుంగవేణా కృష్ణవేణా కపిలా శోణ ఏవ చ ॥ 25
ఏతా నద్యస్తు ధిష్ణ్యానాం మాతరో యాః ప్రకీర్తితాః ।
సింధునదం, పంచనదం, దేవిక, సరస్వతి, గంగ, శతకుంభ, సరయు, గండకి, చర్మణ్వతి, మహి, మేధ్య, మేధాతిథి, తామ్రవతి, వేత్రవతి, కౌశికి, తమస, నర్మద, గోదావరి, వేణ, ఉపవేణ, భీమ, బడబ, భారతి, సుప్రయోగ, కావేరి, ముర్ముర, తుంగవేణ, కృష్ణవేణ, కపిల, శోణభద్ర అనే నదీనదాలను అగ్నుల ఉత్పత్తి స్థానాలుగా చెప్పారు. (22-25 1/2)
అద్భుతస్య ప్రియా భార్యా తస్య పుత్రో విభూరసిః ॥ 26
యావంతః పావకాః ప్రోక్తాః సోమాస్తావంత ఏవ తు ।
అత్రేశ్చాప్యన్వయే జాతాః బ్రహ్మణో మానసాః ప్రజాః ॥ 27
అద్భుతుని ప్రియభార్యకు 'విభువు' అనే పుత్రుడు కలిగాడు. అగ్నులసంఖ్యయే సోమయాగాలకూ ఉన్నది. ఆ అగ్నులు అన్నీ బ్రహ్మదేవుని మానసిక సంకల్పం వల్ల అత్రివంశంలో ఆయన సంతానంగా కలిగారు. (26,27)
అత్రి పుత్రాన్ స్రష్టుకామః తానేవాత్మన్యధార్యత్ ॥ 28
తస్య తద్ర్బహ్మణః కార్యాత్ నిర్హరంతి హుతాశనాః ।
అత్రిమహర్షికి ప్రజాసృష్టి చేయవలెననే కోరిక కలగగానే ఆయన ఆ అగ్నులను తనహృదయంలో ధరించాడు. ఆ బ్రహ్మర్షిశరీరం నుంచి భిన్నమైన అగ్నులు అవతరించాయి. (28 1/2)
ఏవమేతే మహాత్మానః కీర్తితాస్తేఽగ్నయో మయా ॥ 29
అప్రమేయా యథోత్పన్నాః శ్రీమంతస్తిమిరాపహాః ।
ఈ విధంగా లెక్కించటానికి వీలులేనివి, చీకటిని పోగొట్టేవి, మిక్కిలి ప్రకాశవంతాలు, గొప్పవి అయిన అగ్నులు ఉత్పత్తి అయిన క్రమాన్ని వర్ణించాను. (29 1/2)
అద్భుతస్య తు మాహాత్మ్యం యథా వేదేషు కీర్తితమ్ ॥ 30
తాదృశం విద్ధి సర్వేషామ్ ఏకో హ్యేషు హుతాశనః ।
అద్భుతాగ్ని మాహాత్మ్యాన్ని వేదాలు వర్ణించిన విధంగానే అన్ని అగ్నులకు మహత్త్వం ఉన్నదని తెలుసుకోవాలి. వీటిలో అన్నిటిలో అగ్నితత్త్వం సమానంగానే ఉన్నది. (30 1/2)
ఏక ఏవైష భగవాన్ విజ్ఞేయః ప్రథమోఽంగిరాః ॥ 31
బహుధా నిఃసృతః కాయాద్ జ్యోతిష్టోమః క్రతుర్యథా ।
జ్యోతిష్టోమం అనే యజ్ఞం ఉద్భిదం మొదలైన అనేక రూపాల్లో వ్యక్తమయినట్లుగానే ఒకే అగ్నితత్త్వం సమానంగానే ఉన్నది. (30 1/2)
ఏక ఏవైష భగవాన్ విజ్ఞేయః ప్రథమోఽంగిరాః ॥ 31
బహుధా నిఃసృతః కాయాద్ జ్యోతిష్టోమః క్రతుర్యథా ।
జ్యోతిష్టోమం అనే యజ్ఞం ఉద్భిదం మొదలైన అనేక రూపాల్లో వ్యక్తమయినట్లుగానే ఒకే అగ్నితత్త్వం ప్రజాపతి శరీరం నుంచి అనేక రూపాల్లో అవతరించింది. ఇదే అంగిరసుడు అని చెప్పే మొదటి అగ్ని. (31 1/2)
ఇత్యేష వంశః సుమహాన్ అగ్నీనాం కీర్తితో మయా ।
యోఽర్చితో వివిధైర్మంత్రైః హవ్యం వహతి దేహినామ్ ॥ 32
ఈ విధంగానే నేను మహత్తరమైన అగ్నివంశాన్ని ప్రతిపాదించాను. ఆ అగ్నిదేవుని వివిధవేద మంత్రాలతో అర్చిస్తే దేహధారులు ఇచ్చే హవిస్సును దేవతలకు చేరుస్తాడు. (32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యా పర్వణి ఆంగిరసోపాఖ్యానేఽగ్నిసముద్భవే ద్వావింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 222 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమున అగ్నిసముద్భవమను రెండువందల ఇరువది రెండవ అధ్యాయము. (222)