232. రెండువందల ముప్పది రెండవ అధ్యాయము
స్కందుని ప్రసిద్ధనామములను జెప్పుట, ఆయన స్తుతి.
యుధిష్ఠిర ఉవాచ
భగవన్ శ్రోతుమిచ్ఛామి నామాన్యస్య మహాత్మనః ।
త్రిషు లోకేషు యాన్యస్య విఖ్యాతాని ద్విజోత్తమ ॥ 1
యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు -
మహాత్మా! బ్రాహ్మణశేష్ఠా! మూడులోకాలలో ప్రసిద్ధమైన కార్తికేయుని నామాలను వినగోరుతున్నాను. (1)
వైశంపాయన ఉవాచ
ఇత్యు క్తః పాండవేయేన మహాత్మా ఋషిసంనిధౌ ।
ఉవాచ భగవాంస్తత్ర మార్కండేయో మహాతపాః ॥ 2
వైశంపాయనుడన్నాడు - జనమేజయా! పాండురాజపుత్రుడైన యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించగా మహాతపస్వి, మహాత్ముడు అయిన మార్కండేయమహర్షి ఈవిధంగా చెప్పాడు. (2)
మార్కండేయ ఉవాచ
ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః ।
మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః ॥ 3
కామజిత్ కామదః కాంతః సత్యవాగ్ భువనేశ్వరః ।
శిశుః శీఘ్రః శుచిశ్చంచః దీప్తవర్ణః శుభాననః ॥ 4
అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా ।
దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్ కూటమోహనః ॥ 5
షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః ।
కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః ॥ 6
ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః ।
సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః ॥ 7
ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః ।
విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా ॥ 8
నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ ।
స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః ॥ 9
మార్కండేయమహర్షి ఇలా చెప్పారు. ఆగ్నేయుడు, స్కందుడు, దీప్తకీర్తి, అనామయుడు, మయూరకేతువు, ధర్మాత్ముడు, భూతేశుడు మహిషాసురమర్దనుడు, కామజిత్తు, కామదుడు, కాంతుడు, సత్యవాక్కు, భువనేశ్వరుడు, శిశువు, శీఘ్రుడు, శుచి, చండుడు, దీప్తవర్ణుడు, శుభాననుడు, అమోఘుడు, అనఘుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్ముడు, భద్రకృత్తు, కూటమోహనుడు, షష్ఠీప్రియుడు, ధర్మాత్ముడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, కన్యాభర్త, విభక్తుకు, స్వాహేయుడు, రేవతీసుతుడు, ప్రభువు, నేత విశాఖుడు, నైగమేయుడు, సుదుశ్చరుడు, సువ్రతుడు, అలితుడు, బాలక్రీడనక ప్రియుడు, ఆకాశచరుడు, బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్రప్రియుడు, దేవసేనాప్రియుడు అనే ఈ నామాలను పఠించేవాడు స్వర్గాన్ని, కీర్తిని, ధనాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. (3-9)
స్తోష్యామి దేవైర్ ఋషిభిశ్చ జుష్టం
శక్త్యా గుహం నామభిరప్రమేయమ్ ।
షడాననం శక్తిధరం సువీరం
నిబోధ చైతాని కురుప్రవీర ॥ 10
కురువంశవీరా! దేవతలు, మహర్షులు సేవించేవాడు లెక్కలేనన్ని నామాలు కలవాడు, అపారశక్తిసంపన్నుడు, శక్తి అనే అస్త్రం దాల్చిన వీరశ్రేష్ఠుడు, షడాననుడు అయిన గుహుని స్తుతిస్తున్నాను. శ్రద్ధగా విను. (10)
బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ
బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః ।
బ్రహ్మప్రియో బ్రాహ్మణసవ్రతీ త్వం
బ్రహ్మజ్ఞో వఒ బ్రాహ్మణానాం చ నేతా ॥ 11
స్కందదేవా! నీవు బ్రాహ్మణుల మేలు కోరేవాడవు, బ్రహ్మాత్మజుడవు, బ్రహ్మవేత్తవు, బ్రహ్మనిష్ఠుడవు, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడవు, బ్రాహ్మణప్రియుడవు, బ్రాహ్మణులతో సమానమైన వ్రతాలు గలవాడవు, బ్రహ్మజ్ఞుడవు, బ్రాహ్మణ నాయకుడవు. (11)
స్వాహా స్వధా త్వం పరమం పవిత్రం
మంత్రస్తుతస్త్వం ప్రథితః షడర్చిః ।
సంవత్సరస్త్వమృతవశ్చ షడ్ వై
మాసార్ధమాసావయనం దిశశ్చ ॥ 12
స్వాహవు, స్వధవు నీవే, పరమపవిత్రుడవు, మంత్రాలు స్తుతించే ప్రసిద్ధమైన ఆరుజ్వాలలతో గూడినవాడవు (అగ్నివి), సంవత్సరం, ఆరుఋతువులు పక్షాలు, మాసాలు, అయనాలు, దిక్కులను నీవే! (12)
త్వం పుష్కరాక్షస్త్వరవిందవక్ర్తః
సహస్రవక్త్రోఽసి సహస్రబాహుః ।
త్వం లోకపాలః పరమం హవిశ్చ
త్వం భావనః సర్వసురాసురాణామ్ ॥ 13
నీవు కమలాల వంటి కన్నులు గల వాడవు, కమలముఖుడవు, సహస్రకరుడవు, సహస్రవదనుడవు, సహాస్రబాహుడవు, లోకపాలకుడవు, సర్వోత్తమ మగు హవిస్సువు, దేవాసురులను అందరిని రక్షించేవాడవు. (13)
త్వమేవ సేనాధిపతిః ప్రచండః
ప్రభుర్విభుశ్చాప్యథ శత్రుజేతా ।
సహస్రభూస్త్వం ధరణీ త్వమేవ
సహ్రసతుష్టిశ్చ సహస్రభుక్ చ ॥ 14
నీవే సేనాపతివి, మహాకోపివి, ప్రభువువు, విభుడవు, శత్రువులను జయించేవాడవు, సహస్రభువుడవు (అనేకమైనవాడవు), భూమివి నీవే, అనేక ప్రాణులకు సంతోషదాయకుడవు, సహస్రభోక్తవు నీవే. (14)
సహస్రశీర్షస్త్వమనంతరూపః ।
సహస్రపాత్ త్వం గుహ శక్తిధారీ ।
గంగాసుతస్త్వం స్వమతేన దేవ
స్వాహామహీకృత్తికానాం తథైవ ॥ 15
అనేక శీర్షాలు గలవాడవు, అనంతరూపుడవు, వేలపాదాలు గలవాడవు, గుహా! శక్తిధారివి, నీ ఇచ్ఛనుసారమే గంగకు, స్వాహాదేవికి, భూమికి, కృత్తికలకు సుతుడవుగా అవతరించావు. (15)
త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన
యథేష్టనానావిధకామరూపీ ।
దీక్షాసి సోమో మరుతః సదైవ
ధర్మోఽసి వాయురచలేంద్ర ఇంద్రః ॥ 16
షడాననా! నీవు కోడితో ఆడుకొంటావు. ఇష్టానుసారం నానావిధాల సుందరరూపాలు ధరిస్తావు. నీవు ఎల్లప్పుడు దీక్ష, సోమం, మరుద్గణం, ధర్మం, వాయువు, శైలేంద్రుడవు, ఇంద్రుడవు అగుదువు. (16)
సనాతనానామపి శాశవ్తస్త్వం
ప్రభుః ప్రభూణామపి చోగ్రధన్వా ।
ఋతస్య కర్తా దితిజాంతకస్త్వం
జేతా రిపూణాం ప్రవరః సురాణామ్ ॥ 17
సనాతనులలో సనాతనుడవు, ప్రభుడవు, నీధనుస్సు భయంకరం, సత్యప్రవర్తకుడవు, దైత్యసంహారం చేసేవాడవు, శత్రువిజేతవు, దేవశ్రేష్ఠుడవు. (17)
సూక్ష్మం తపస్తత్ పరమం త్వమేవ
పరావరజ్ఞోఽసి పరావరస్త్వమ్ ।
ధర్మస్య కామస్య పరస్య చైవ
తత్తేజసా కృత్స్నమిదం మహాత్మన్ ॥ 18
అన్నిటికన్న గొప్పదైన సూక్ష్మతపస్సు నీవే. కార్యకారణతత్త్వం తెలిసినవాడవు. కార్యకారణస్వరూపుడవు నీవే. ధర్మకామాలు, ఈ రెండింటి కన్నా పరమైన మోక్షతత్త్వం తెలిసినవాడవు నీవే. ఈ జగత్తు అంతయు మీ తేజస్సుతో వెలుగొందుతున్నది. (18)
వ్యాప్తం జగత్ సర్వసురప్రవీర
శక్త్యా మయా సంస్తుత లోకనాథ ।
నమోఽస్తు తే ద్వాదశనేత్రబాహో
అతః పరం వేద్మి గతిం న తేఽహమ్ ॥ 19
సర్వదేవతాశ్రేష్ఠా! నీశక్తితో ఈ జగత్తు అంతా వ్యాప్తమైయున్నది. లోకేశ్వరా! నేను యథాశక్తిగా మిమ్ము స్తుతించాను. పన్నెండుకన్నులు, చేతులతో శోభిల్లే నీకు సమస్సులు. దీనికి అతీతమైన మీస్వరూపం నేను ఎరుగను. (19)
స్కందస్య య ఇదం విప్రః పఠేజ్జన్మ సమాహితః ।
శ్రావయేద్ బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్ వా ద్విజేరితమ్ ॥ 20
ధనమాయుర్యశో దీప్తం పుత్రాన్ శత్రుజయం తథా ।
స పుష్టితుష్టీ సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ ॥ 21
ఏకాగ్రమైన మనస్సుతో స్కందుని ఈ జన్మవృత్తాంతాన్ని చదివే బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు వినిపించేవాడు, బ్రాహ్మణుని వలన వినేవాడు సంపదను, ఆయువును, మహత్తరయశస్సును, సంతతిని, శత్రువిజయాన్ని, తుష్టిని, పుష్టిని పొంది తుదకు స్కందలోకాన్ని చేరతాడు. (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే కార్తికేయస్తవే ద్వాత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 232 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగీరసోపాఖ్యానమున కార్తికేయస్తోత్రము అను రెండు వందల ముప్పది రెండవ అధ్యాయము. (232)