235. రెండువందల ముప్పది అయిదవ అధ్యాయము

శ్రీకృష్ణగమనము.

వైశంపాయన ఉవాచ
మార్కండేయాదిభిర్విప్రైః పాండవైశ్చ మహాత్మభిః ।
కథాభిరనుకూలాభిః సహ స్థిత్వా జనార్దనః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
జనార్దనుడు మార్కండేయాది మహర్షులతో, మహాత్ములైన పాండవులతో కలిసి తనకు నచ్చిన విషయాలు ప్రస్తావిస్తూ కొంతకాలం గడిపాడు. (1)
తతస్తైః సంవిదం కృత్వా యథావన్మధుసూదనః ।
ఆరురుక్షూ రథం సత్యామ్ ఆహ్వయామాస కేశవః ॥ 2
జనార్దనుడు అందరితో ఎప్పటివలె మాటాడి, సెలవు తీసికొని, రథాన్నెక్కి బయలుదేరబోతూ సత్యభామను పిలిపించాడు. (2)
సత్యభామా తతస్తత్ర స్వజిత్వా ద్రుపదాత్మజామ్ ।
ఉవాచ వచనం హృద్యం యథాభావం సమాహితమ్ ॥ 3
అప్పుడు అక్కడ సత్యభామ ద్రౌపదిని కౌగిలించి, తన మనోగతికి తగినట్లుగా, సావధానంగా, మనోహరంగా ఇలా అన్నది. (3)
కృష్ణే మా భూత్ తవోత్కంఠా మా వ్యథా మా ప్రజాగరః ।
భర్తృభిర్దేవసంకాశైః జితాం ప్రాప్స్యసి మేదినీమ్ ॥ 4
ద్రౌపదీ, నీవు ఉత్కంఠకు గురికావద్దు. కలతపడవద్దు. జాగరణలు చేయవద్దు. నీభర్తలు దేవసమానులు. వారిద్వారా మరల రాజ్యాన్ని పొందగలవు. (4)
న హ్యేవం శీలసంపన్నాః నైవం పూజితలక్షణాః ।
ప్రాప్నువంతి చిరం క్లేశం యథా త్వమసితేక్షణే ॥ 5
నీలలోచనా! నీవు అనుబవిస్తున్నట్టి కష్టాలను నీవలె శీలసంపదా, ఉత్తమలక్షణాలు గల స్త్రీలు పెద్దకాలం అనుభవించరు. (5)
అవశ్యం చ త్వయా భూమిః ఇయం నిహతకంటకా ।
భర్తృభిః సహ భోక్తవ్యా నిర్ద్వంద్వేతి శ్రుతం మయా ॥ 6
నీవు నీ భర్తలతో కలిసి ఈ భూమిని నిష్కంటకంగా, నిర్ద్వంద్వంగా తప్పక అనుభవిస్తావని నేను విని ఉన్నాను. (6)
ధార్తరాష్ట్రవధం కృత్వా వైరాణి ప్రతియాత్య చ ।
యుధిష్ఠిరస్థాం పృథివీం ద్రక్ష్యసి ద్రుపదాత్మజే ॥ 7
ద్రుపదకుమారీ! ధార్తరాష్ట్రులను చంపి, శత్రుత్వానికి బదులు తీర్చికొని, యుధిష్ఠిరాదులు రాజ్యాన్ని చేపడతారు. త్వరలోనే నీవు దాన్ని చూడగలవు. (7)
యాస్తాః ప్రవ్రజమానాం త్వాం ప్రాహసన్ దర్పమాహితాః ।
తాః క్షిప్రం హతసంకల్పాః ద్రక్ష్యసి త్వం కురుస్త్రియః ॥ 8
నీవు వనవాసానికి వెళ్తున్న సమయంలో గర్వమోహంతో నిన్ను పరిహసించిన వారి ఆశలన్నీ నీరుగారిపోతాయి. ఆ స్థితిలో వారిని నీవు త్వరలోనే చూస్తావు. (8)
తవ దుఃఖోపపన్నాయాః యైరాచరితమప్రియమ్ ।
విద్ధి సంప్రస్థితాన్ సర్వాన్ తాన్ కృష్ణే యమసాదనమ్ ॥ 9
ద్రౌపదీ! కష్టాలలో ఉన్న నీకు అప్రియంగా ప్రవర్తించినవారంతా యమలోకానికి వెళ్ళినట్టే అనుకో. (9)
పుత్రస్తే ప్రతివింధ్యశ్చ సుతసోమస్తతావిధః ।
శ్రుతకర్మార్జునిశ్చైవ శతానీకశ్చ నాకులిః ॥ 10
సహదేవాచ్చ యో జాతః శ్రుతసేనస్తవాత్మజః ।
సర్వే కుశలినో వీరాః కృతాస్త్రాశ్చ సుతాస్తవ ॥ 11
ధర్మజసుతుడు ప్రతివింధ్యుడు, భీమనందనుడు సుతసోముడు, అర్జునునికొడుకు శ్రుతకర్మ, నకులుని కొడుకు శతానీకుడు, సహదేవ సుతుడు శ్రుతసేనుడు వీరంతా వీరులు, అస్త్రవిద్యానిపుణులు. ద్వారకలో క్షేమంగా ఉన్నారు. (10,11)
అభిమన్యురివ ప్రీతా ద్వారవత్యాం రతా భృశమ్ ।
త్వమివైషాం సుభద్రా చ ప్రీత్యా సర్వాత్మనా స్థితా ॥ 12
వారంతా అభిమన్యుని వలె ఆనందంగా ఉన్నారు. ద్వారకపై ఆసక్తితో ఉన్నారు. సుభద్ర కూడా నీవలెనే వారందరితో అన్నివిధాలుగా ప్రేమపూర్వకంగా ఉంటుంది. (12)
ప్రీయతే తవ నిర్ద్వంద్వా తేభ్యశ్చ విగతజ్వరా ।
దుఃఖితా తేన దుఃఖేన సుఖేన సుఖితా తథా ॥ 13
సుభద్ర ఏ భేదభావమూ లేక నీవంటే ఇష్టంగా ఉంటుంది. ఆ పిల్లలను ప్రేమగా చూస్తుంది. వారు బాధపడితే తాను బాధ పడుతుంది. వారు సుఖంగా ఉంటే తాను సుఖంగా ఉంటుంది. (13)
భజేత్ సర్వాత్మనా చైవ ప్రద్యుమ్నజననీ తథా ।
భానుప్రభృతిభిశ్చైనాన్ విశినష్టి చ కేశవః ॥ 14
ప్రద్యుమ్నుని తల్లి రుక్మిణి కూడా వారిని సర్వవిధాలా బాగా చూసుకొంటోంది. శ్రీకృష్ణుడు కూడా భానువు మొదలుగా గల తన కొడుకుల కన్న మిన్నగా వారిని ఆదరిస్తాడు. (14)
భోజనాచ్ఛాదనే చైషాం నిత్యం మే శ్వశురః స్థితః ।
రామప్రభృతయః సర్వే భజంత్యంధకవృష్ణయః ॥ 15
మా మామగారు వారి భోజనవస్త్రాలను గురించి ఎప్పుడూ పరిశీలిస్తుంటారు. బలరాముడు మొదలయిన వృష్ణి, అంధక వంశస్థులందరూ వారిని గమనిస్తూ ఉంటారు. (15)
తుల్యో హి ప్రణయస్తేషాం ప్రద్యుమ్నస్య చ భావిని ।
ఏవమాది ప్రియం సత్యం హృద్యముక్త్వా మనోఽమగమ్ ॥ 16
గమనాయ మనశ్చక్రే వాసుదేవరథం ప్రతి ।
తాం కృష్ణాం కృష్ణమహిషీ చకారాభిప్రదక్షిణమ్ ॥ 17
భావినీ! వారందరికీ, ప్రద్యుమ్నుడికీ కూడా నీ కొడుకులపై సమానమైన ప్రేమ. ప్రియం, సత్యం, మనోహరం, మనోనుగతమైన ఇటువంటి మాట చెప్పి కృష్ణుని పట్టమహిషి అయిన సత్యభామ వాసుదేవరథం దగ్గరకు బయలుదేరబోతూ ద్రౌపదికి ప్రదక్షిణం చేసింది. (16,17)
ఆరురోహ రథం శౌరేః సత్యభామాథ భావినీ ।
స్మయిత్వా తు యదుశ్రేష్ఠః ద్రౌపదీం పరిసాంత్వ్య చ ।
ఉపావర్త్య తతః శీఘ్రైః హయైః ప్రాయాత్ పురం స్వకమ్ ॥ 18
ఆపై భావిని అయిన సత్యభామ రథమెక్కింది. శ్రీకృష్ణుడు నవ్వుతూ ద్రౌపదిని ఊరడించి, వెనుదిరిగి వేగగాములయిన గుర్రాలతో తననగరానికి బయలుదేరాడు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీసత్యభామాసంవాదపర్వణి కృష్ణగమనే పంచత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 235 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీ సత్యభామాసంవాదపర్వమను ఉపపర్వమున కృష్ణగమనమను రెండు వందల ముప్పది అయిదవ అధ్యాయము. (235)