239. రెండువందల ముప్పది తొమ్మిదవ అధ్యాయము
ధృతరాష్ట్రుని అనుమతితో దుర్యోధనుడు బయలుదేరుట.
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రం తతః సర్వే దదృశుర్జనమేజయ ।
పృష్ట్వా సుఖమథో రాజ్ఞః పృష్టా రాజ్ఞా చ భారత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
భారతా! జనమేజయా! ఆ తరువాత కర్ణశకుని దుర్యోధనులు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళారు. పరస్పరం కుశలప్రశ్నలు వేసికొన్నారు. (1)
తతస్తైర్విహితః పూర్వం సమంగో నామ బల్లవః ।
సమీపస్థాస్తదా గావః ధృతరాష్ట్రే న్యవేదయత్ ॥ 2
వారు సమంగుడనే పేరు గల గొల్లవానిని అంతకుముందే ఏర్పాటుచేసికొని ఉన్నారు. వాడు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి "మనగోవులు దగ్గరకే వచ్చి ఉన్నాయి" అని చెప్పాడు. (2)
అనంతరం చ రాధేయః శకునిశ్చ విశాంపతే ।
ఆహతుః పార్థివశ్రేష్ఠం ధృతరాష్ట్రం జనాధిపమ్ ॥ 3
రాజా! అప్పుడు కర్ణుడు, శకుని రాజశ్రేష్ఠుడూ, నరపతి అయిన ధృతరాష్ట్రునితో ఇలా అన్నారు. (3)
రమణీయేషు దేశేషు ఘోషాః సంప్రతి కౌరవ ।
స్మారణే సమయః ప్రాప్తః వత్సానామపి చాంకనమ్ ॥ 4
కౌరవా! ఇప్పుడు గొల్లపల్లెలన్నీ రమణీయంగా ఉన్నాయి. గోవులను, దూడలను లెక్కించటానికి, వివరాలు సేకరించటానికి ఇది తగిన సమయం. (4)
మృగయా చోచితా రాజన్ అస్మిన్ కాలే సుతస్య తే ।
దుర్యోధనస్య గమనం సమనుజ్ఞాతుమర్హసి ॥ 5
రాజా! ఈ సమయంలో నీకుమారుడు వేటకు వెళ్ళటం కూడా యుక్తమే. దుర్యోధనుని ప్రయాణానికి అనుమతించు. (5)
ధృతరాష్ట్ర ఉవాచ
మృగయా శోభనా తాత గవాం హి సమవేక్షణమ్ ।
వీశ్రంభస్తు న గంతవ్యః వల్లవానామితి స్మరే ॥ 6
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
'నాయనా! వేట మంచిదే. గోవుల పర్యవేక్షణ కూడా మంచిదే. కానీ గొల్లవారి మాటలు నమ్మకూడదంటారు. అదే ఆలోచిస్తున్నా. (6)
తే తు తత్ర నరవ్యాఘ్రాః సమీప ఇతి నః శ్రుతమ్ ।
అతో నాభ్యనుజానామి గమనం తత్ర వః స్వయమ్ ॥ 7
నరశ్రేష్ఠులయిన ఆ పాండవులు అక్కడకు దగ్గరగానే ఉంటున్నట్లు వింటున్నాను. అందువలన నా అంతట నేను మీరు వెళ్ళటానికి అనుమతించలేను. (7)
ఛద్మనా నిర్జితాస్తే తు కర్శితాశ్చ మహావనే ।
తపోనిత్యాశ్చ రాధేయ సమర్థాశ్చ మహారథాః ॥ 8
కర్ణా! వారిని మోసంతో ఓడించాం. అరణ్యంలో నివసిస్తూ వారు కష్టాలు పడుతున్నారు. నిత్యమూ తపస్సు నాచరిస్తూ వారు శక్తిని కూడా పెంచుకొని మహారథులయ్యారు. (8)
ధర్మరాజో న సంక్రుద్ధ్యేద్ భీమసేనస్త్వమర్షణః ।
యజ్ఞసేనస్య దిహితా తేజ ఏవ తు కేవలమ్ ॥ 9
ధర్మరాజుకు కోపం రాకపోవచ్చు. కానీ భీమసేనుడు కోపిష్ఠి. ద్రౌపది సాక్షాత్తు నిప్పురవ్వయే. (9)
యూయం చాప్యపరాధ్యేయుః దర్పమోహసమన్వితాః ।
తతో వినిర్దహేయుస్తే తపసా హి సమన్వితాః ॥ 10
అహంకారంతో, మోహంతో మీరు కూడా అక్కడ పొరపాట్లు చేయవచ్చు. దానితో తపశ్శక్తి సంపన్నులైన వారు మిమ్ము తగులబెట్టవచ్చు. (10)
అథవా సాయుధా వీరాః మన్యునాభిపరిప్లుతాః ।
సహితా బద్ధనిస్త్రింశాః దహేయుః శస్త్రతేజసా ॥ 11
వేదా వారు సాయుధులైన వీరులు. మీమీద తీవ్రకోపంగలవారు. కత్తులు కట్టుకొని ఉన్నారు. కలిసి ఉన్నవారు. శస్త్రశక్తితో మిమ్ము దహించవచ్చు. (11)
అథ యూయం బహుత్వాత్ తాన్ అభియాత కథంచన ।
అనార్యం పరమం తత్ స్యాద్ అశక్యం తచ్చ వై మతమ్ ॥ 12
మీరు ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి ఏదో ఒకరీతిగా వారిని ఎదిరించగలిగినా అది కూడా పెద్దతప్పుగానే కనిపిస్తుంది. వాళ్ళను గెలవటం అంత తేలిక కాదు. (12)
ఉషితో హి మహాబాహుః ఇంద్రలోకే ధనంజయః ।
దివ్యాన్యస్త్రాణ్యవాప్యాథ తతః ప్రత్యాగతో వనమ్ ॥ 13
మహాబాహువయిన అర్జునుడు ఇంద్రలోకంలో కూడా కొంతకాలమున్నాడు. దివ్యాస్త్రాలను పొంది మరలా అరణ్యానికి వచ్చాడు. (13)
అకృతాస్త్రేణ పృథివీ జితా బీభత్సునా పురా ।
కిం పునః స కృతాస్త్రోఽద్య న హన్యాద్ వో మహారథః ॥ 14
ఏ అస్త్రాలు లేనప్పుడే అర్జునుడు గతంలో భూమిని జయించాడు. ఇప్పుడు అస్త్రాలు కూడా సంపాదించాడు. ఇక చెప్పేదే ముంది? ఆ మహారథుడు మిమ్ము చంపి తీరుతాడు. (14)
అథవా మద్వచః శ్రుత్వా తత్ర యత్తా భవిష్యథ ।
ఉద్విగ్నవాసో విశ్రంభాద్ దుఃఖం తత్ర భవిష్యతి ॥ 15
అయినా నామాట విని మీరంతా మీ నివాసాలలోనే సావధానులై ఉండండి. స్వతః వారు మంచివారైనా వనవాసక్లేశం వలన ఉద్విగ్నులయిన వారిద్వారా దుఃఖం కలుగవచ్చు. (15)
అథవా సైనికాః కేచిద్ అపకుర్యుర్యుధిష్ఠిరమ్ ।
తదబుద్ధికృతం కర్మ దోషముత్పాదయేచ్చ వః ॥ 16
అథవా నీ సైనికులలో కొందరు యుధిష్ఠిరునకు అపకారం చేయవచ్చు. ఆ అజ్ఞానచేష్ట మీకు ఇబ్బందులను కలిగించవచ్చు. (16)
తస్మాద్ గచ్ఛంతు పురుషాః స్మారణాయాస్తకారిణః ।
న స్వయం తత్ర గమనం రోచయే తవ భారత ॥ 17
కాబట్టి భారతా! ఆప్తులయిన వేరెవరినయినా గోపరిగణనకోసం పంపు. నీవే వెళ్ళటం నాకంతగా ఇష్టం లేదు. (17)
శకునిరువాచ
ధర్మజ్ఞః పాండవో జ్యేష్ఠః ప్రతిజ్ఞాతం చ సంసది ।
తేన ద్వాదశ వర్షాణి వస్తవ్యానీతి భారత ॥ 18
శకుని ఇలా అన్నాడు. భారతా! ధర్మరాజు ధర్మజ్ఞుడు. పైగా పండ్రెండు సంవత్సరాలు వనవాసం చేస్తామని సభలో ప్రతిజ్ఞచెసి ఉన్నాడు. (18)
అనువృత్తాశ్చ తే సర్వే పాండవా ధర్మచారిణః ।
యుధిష్ఠిరస్తు కౌంతేయః న నః కోపం కరిష్యతి ॥ 19
ధర్మవర్తనులయిన మిగిలిన పాండవులు ధర్మరాజును అనుసరించేవారే. కుంతీనందనుడైన యుధిష్ఠిరుడు మనపై కోపించడు. (19)
మృగయాం చైవ నో గంతుమ్ ఇచ్ఛా సంవర్తతే భృశమ్ ।
స్మారణం తు చికీర్షామః న తు పాండవదర్శనమ్ ॥ 20
వేటకు వెళ్ళాలన్న కోరిక మాకు బాగా ఉంది. గోపరిగణననే చేయాలనుకొంటున్నాం కానీ పాండవులను చూడాలనుకోవటం లేదు. (20)
న చానార్యసమాచారః కశ్చిత్ తత్ర భవిష్యతి ।
న చ తత్ర గమిష్యామః యత్ర తేషాం ప్రతిశ్రయః ॥ 21
మార్గం తప్పిన వృత్తాంత మేదీ అక్కడ జరగదు. అసలు పాండవులున్న చోటునకు వెళ్ళనే వెళ్ళం. (21)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః శకునినా ధృతరాష్ట్రో జనేశ్వరః ।
దుర్యోధనం సహామాత్యమ్ అనుజజ్ఞే న కామతః ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు. శకుని ఇలా అనగానే ధృతరాష్ట్రనరపతి ఇష్టం లేకపోయినా అమాత్యులతో సహా వెళ్ళటానికి దుర్యోధనునకు అనుమతి నిచ్చాడు. (22)
అనుజ్ఞాతస్తు గాంధారిః కర్ణేన సహితస్తదా ।
నిర్యయౌ భరతశ్రేష్ఠః బలేన మహతా వృతః ॥ 23
తండ్రి అనుమతి పొంది దుర్యోధనుడు కర్ణునితో కూడి, పెద్దసైన్యం వెంటరాగా బయలుదేరాడు. (23)
దుఃశాసనేన చ తథా సౌబలేన చ ధీమతా ।
సంవృతో భ్రాతృభిశ్చాన్యైః స్త్రీభిశ్చాపి సహస్రశః ॥ 24
బుద్ధిమంతుడైన శకుని, దుశ్శాసనుడు, ఇతర సోదరులు, వేలకొలదిగ స్త్రీలు దుర్యోధనుని వెంట ఉన్నారు. (24)
తం నిర్యాంతం మహాబాహుం ద్రష్టుం ద్వైతవనం సరః ।
పౌరాశ్చానుయయుః సర్వే సహదారా వనం చ తత్ ॥ 25
దుర్యోధనుడు బయలుదేరగా, ద్వైతవనాన్నీ, ఆపేరుగల సరస్సును, చూడాలన్న కోరికతో పౌరులు కూడా భార్యలతో సహా ఆయన ననుసరించారు. (25)
అష్టౌ రథసహస్రాణి త్రీణి నాగాయుతాని చ ।
పత్తయో బహుసాహస్రాః హయాశ్చ నవతిః శతాః ॥ 26
దుర్యోధనుని వెంట ఎనిమిదివేల రథాలు, ముప్పయివేల ఏనుగులు, ఎన్నో వేల సైనికులు, తొమ్మిదివేల గుర్రాలు నడిచాయి. (26)
శకటాపణవేశాశ్చ వణిజో వందినస్తథా ।
నరశ్చ మృగయాశీలాః శతశోఽథ సహస్రశః ॥ 27
బండ్లు, దుకాణాలు, గుడారాలు, దుర్యోధనుని వెంట వెళ్ళాయి. వణిజులు, వందిమాగధులు, వేటపై మోజుగల మనుజులు వందలు, వేలసంఖ్యలో బయలుదేరారు. (27)
తతః ప్రయాణే నృపతేః సుమహానభవత్ స్వనః ।
ప్రావృషీవ మహావాయోః ఉద్ధతస్య విశాంపతే ॥ 28
రాజా! వర్షాకాలంలోని ఝంఝావాతధ్వనిలాగా, దుర్యోధనుని ప్రయాణంలో మహాకోలాహలధ్వని వినిపించింది. (28)
గవ్యూతిమాత్రే వ్యవసద్ రాజా దుర్యోధనస్తదా ।
ప్రయాతో వాహనైః సర్వైః తతో ద్వైతవనం సరః ॥ 29
నగరానికి రెండుక్రోసుల దూరంలో దుర్యోధనరాజు గుడారాలు వేయించాడు. ఆపై అక్కడ నుండి సర్వవాహనాలతో ద్వైతవనం వైపు, సరస్సువైపు పయనించాడు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనప్రస్థానే ఏకోనచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 239 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనప్రస్థానమను రెండు వందల ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (239)