253. రెండు వందల యేబది మూడవ అధ్యాయము
కర్ణ దిగ్విజయము.
జనమేజయ ఉవాచ
వసమానేషు పార్థేషు వనే తస్మిన్ మహాత్మసు ।
ధార్తరాష్ట్రా మహేష్వాసాః కిమకుర్వత సత్తమాః ॥ 1
జనమేజయుడిలా అడిగాడు. మహాత్ములయిన పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు మేటివిలుకాండ్రు, నరశ్రేష్ఠులయిన ధార్తరాష్ట్రులు ఏం చేస్తున్నారు? (1)
కర్ణో వైకర్తనశ్చైవ శకునిశ్చ మహాబలః ।
భీష్మద్రోణకృపాశ్చైవ తన్మే శంసితుమర్హసి ॥ 2
సూర్యనందనుడైన కర్ణుడు, మహాబలుడయిన శకుని, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు - వీరంతా ఏం చేస్తున్నారు? దాన్ని నాకు వివరంగా చెప్పు. (2)
వైశంపాయన ఉవాచ
ఏవం గతేషు పార్థేషు విసృష్టే చ సుయోధనే ।
ఆగతే హాస్తినపురం మోక్షితే పాండునందనైః ॥ 3
భీష్మోఽబ్రవీన్మహారాజ ధార్తరాష్ట్రమిదం వచః ।
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజా! పాండునందనులు సుయోధనుని విడిపించి వదలిపెట్టగా సుయోధనుడు హాస్తినపురానికి వచ్చాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో ఇలా అన్నాడు. (3 1/2)
ఉక్తం తాత యథా పూర్వం గచ్ఛతస్తే తపోవనమ్ ॥ 4
గమనం మే న రుచితం తవ తత్ర కృతం చ తే ।
నాయనా! ముందు నీవు తపోవనానికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పానో ఇప్పుడూ అదే చెప్తున్నాను. నీవు అక్కడకు వెళ్ళటం కానీ, అక్కడ చేసిన పని కానీ నాకు నచ్చలేదు. (4 1/2)
తతః ప్రాప్తం త్వయా వీర గ్రహణం శత్రుభిర్బలాత్ ॥ 5
మోక్షితశ్చాపి ధర్మజ్ఞైః పాండవైర్న చ లజ్జసే ।
వీరా! శత్రువులు అక్కడ నిన్ను బలవంతంగా బందీని చేశారు. ధర్మజ్ఞులయిన పాండవులు నిన్ను విడిపించారు. అయినా నీవు సిగ్గుపడవు. (5 1/2)
ప్రత్యక్షం తవ గాంధారే ససైన్యస్య విశాంపతే ॥ 6
సూతపుత్రోఽపయాద్ భీతః గంధర్వాణాం తదా రణాత్ ।
గాంధారీనందనా! నరపతీ! గంధర్వులతో యుద్ధం చేసేవేళలో కర్ణుడు భయపడి సైన్యంతో సహా పారిపోవటం నీ కళ్ళ ఎదుటే జరిగింది. (6 1/2)
క్రోశతస్తవ రాజేంద్ర ససైన్యస్య నృపాత్మజ ॥ 7
దృష్టస్తే విక్రమశ్చైవ పాండవానాం మహాత్మనామ్ ।
రాజేంద్రా! రాజకుమారా! నీవు సనైన్యంగా ఆక్రోశిస్తుంటే మహాత్ములయిన పాండవులు ప్రదర్శించిన పరాక్రమాన్నీ నీవు చూశావు. (7 1/2)
కర్ణస్య చ మహాబాహో సూతపుత్రస్య దుర్మతేః ॥ 8
న చాపి పాదభాక్ కర్ణః పాండవానాం నృపోత్తమ ।
ధనుర్వేదే చ శౌర్యే చ ధర్మే వా ధర్మవత్సల ॥ 9
నృపోత్తమా! మహాబాహూ! దుర్మతి అయిన కర్ణుని పరాక్రమాన్నీ నీవు చూశావు. ధర్మవత్సలా! ధనుర్వేదంలో కానీ, శౌర్యంలో కానీ, ధర్మంలో కానీ కర్ణుడు పాండవులలో పావువంతుకు కూడా సరిపోడు. (8,9)
తస్మాదహం క్షమం మన్యే పాండవైస్తైర్మహాత్మభిః ।
సంధిం సంధివిదాం శ్రేష్ఠ కులస్యాస్య వివృద్ధయే ॥ 10
కాబట్టి సంధివేత్తలలో శ్రేష్ఠుడా! ఈ వంశవృద్ధికోసం మహాత్ములయిన పాండవులతో సంధిచేసికోవటమే తగినదని నేను భావిస్తున్నాను. (10)
ఏవముక్తశ్చ భీష్మేణ ధార్తరాష్ట్రో జనేశ్వరః ।
ప్రహస్య సహసా రాజన్ విప్రతస్థే ససౌబలః ॥ 11
రాజా! భీష్ముడలా అనగానే రాజైన దుర్యోధనుడు పెద్దగా నవ్వి, శకునితో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. (11)
తం తు ప్రస్థితమాజ్ఞాయ కర్ణదుఃశాసనాదయః ।
అనుజగ్ముర్మహేష్వాసాః ధార్తరాష్ట్రం మహాబలమ్ ॥ 12
మహాబలి, దుర్యోధనుడు వెళ్ళిపోయాడని తెలిసికొని మేటివిలుకాండ్రయిన కర్ణదుశ్శాసనాదులు ఆయనను అనుసరించారు. (12)
తాంస్తు సంప్రస్థితాన్ దృష్ట్వా భీష్మః కురుపితామహః ।
లజ్జయా వ్రీడితో రాజన్ జగామ స్వం నివేశనమ్ ॥ 13
రాజా! వారు వెళ్ళిపోవటాన్ని చూసి కురుపితామహుడైన భీష్ముడు సిగ్గుతో కుదించుకొనిపోయి, తన నివాసానికి వెళ్ళిపోయాడు. (13)
గతే భీష్మే మహారాజ ధార్తరాష్ట్రో జనేశ్వరః ।
పునరాగమ్య తం దేశమ్ అమంత్రయత మంత్రిభిః ॥ 14
మహారాజా! భీష్ముడు నిష్క్రమించగానే దుర్యోధననరపతి మరల అక్కడకు వచ్చి, మంత్రులతో కలిసి ఆలోచించసాగాడు. (14)
కిమస్మాకం భవేచ్ఛ్రేయః కిం కార్యమవశిష్యతే ।
కథం చ సుకృతం తత్ స్యాత్ మంత్రయామోఽద్య యద్ధితమ్ ॥ 15
మనకు ఏది మేలు చేస్తుంది? ఇక మిగిలిన కర్తవ్యమేమిటి? ఎలా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి? మనకు హితమైన దేది? అది ఇప్పుడు ఆలోచించాలి. (15)
కర్ణ ఉవాచ
దుర్యోధన నిబోధేదం యత్ త్వాం వక్ష్యామి కౌరవ ।
భీష్మోఽస్మాన్ నిందతి సదా పాండవాంశ్చ ప్రశంసతి ॥ 16
కర్ణుడిలా అన్నాడు.
'కౌరవా! దుర్యోధనా! నేను చెప్తున్నాను గ్రహించు. భీష్ముడెప్పుడూ మనలను నిందిస్తూ' పాండవులను ప్రశంసిస్తుంటాడు. (16)
త్వద్ ద్వేషాచ్చ మహాబాహో మమాపి ద్వేష్టుమర్హతి ।
విగర్హతే చ మాం నిత్యం త్వత్సమీపే నరేశ్వర ॥ 17
మహాబాహూ! నిన్ను దేషిస్తూ ఉంటాడు. కనుక నాకు కూడా ఆయన ద్వేషింపదగినవాడే నరేశ్వరా! నీసన్నిధిలో నన్నెప్పుడూ నిందిస్తూనే ఉంటాడు. (17)
సోఽహం భీష్మవచస్తద్ వై న మృష్యామీహ భారత ।
త్వత్సమక్షం యదుక్తం చ భీష్మేణామిత్రకర్షణ ॥ 18
పాండవానాం యశో రాజన్ తవ నిందాం చ భారత ।
అనుజానీహి మాం రాజన్ సభృత్యబలవాహనమ్ ॥ 19
భారతా! ఆ కారణంగా భీష్మవచనాలను నేను సహించలేను. భారతా! రాజా! శత్రుసంహారా! నీ సమక్షంలోనే పాండవుల యశస్సును కీర్తిస్తూ, నిన్ను నిందిస్తూ భీష్ముడు మాటాడడం నేను భరించలేను. సేవకులు, సేనలు, వాహనాలతో నేను వెళ్ళటానికి అనుమతి నివ్వు. (18,19)
జేష్యామి పృథివీం రాజన్ సశైలవనకాననామ్ ।
జితా చ పాండవైర్భూమిః చతుర్భిర్బలశాలిభిః ॥ 20
తామహం తే విజేష్యామి ఏక ఏవ న సంశయః ।
సంపశ్యతు సుదుర్బుద్ధిః భీష్మః కురుకులాధమః ॥ 21
రాజా! పర్వత వన కాననాలతో సహా భూమండలాన్ని జయిస్తాను. బలశాలులయిన పాండవులు నలుగురు కలిసి గెలుచుకొన్న భూమిని నేను నీకోసం ఒంటరిగానే గెలుచుకొని వస్తాను. కురుకులాధముడు, దుర్మతి అయిన భీష్ముడు దానిని చక్కగా చూస్తాడు. (20,21)
అనింద్యం నిందతే యో హి అప్రశంస్యం ప్రశంసతి ।
స పశ్యతు బలం మేఽద్య ఆత్మానం తు విగర్హతు ॥ 22
ఎప్పుడూ నిందకు తగనివానిని నిందిస్తూ, పొగడ్తకు తగని దానిని పొగుడుతూ ఉంటాడు. ఈ రోజు నా బలాన్ని చూసి తనను తాను అసహ్యించుకొంటాడు. (22)
అనుజానీహి మాం రాజన్ ధ్రువో హి విజయస్తవ ।
ప్రతిజానామి తే సత్యం రాజన్నాయుధమాలభే ॥ 23
రాజా! నన్ను అనుమతించు. తప్పనిసరిగ గెలుపు నీదే. ఆయుధాన్ని పట్టి, సత్యం మీద ఒట్టివేస్, ప్రతిజ్ఞ చేస్తున్నా.' (23)
తచ్ఛ్రుత్వా తు వచో రాజన్ కర్ణస్య భరతర్షభ ।
ప్రీత్యా పరమయా యుక్తః కర్ణమాహ నరాధిపః ॥ 24
భరతర్షభా! రాజా! కర్ణుని మాట విని పరమానందపడి దుర్యోధనుడు కర్ణునితో ఇలా అన్నాడు. (24)
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే త్వం మహాబలః ।
హితేషు వర్తసే నిత్యం సఫలం జన్మ చాద్యమే ॥ 25
నేను ధన్యుడను. నీ ఆదరణకు పాత్రుడను. నీవంటి మహాబలుడు నిత్యమూ నా హితాన్ని కోరి పనిచేయటం అదృష్టం. నేడు నా జన్మ సఫలమయినది. (25)
యదా చ మన్యసే సర్వశత్రునిబర్హణమ్ ।
తదా నిర్గచ్ఛ భద్రం తే హ్యనుశాధి చ మామితి ॥ 26
వీరా! సర్వశత్రువులను చంపగలనని నీవనుకొంటే అలాగే కానీ, బయలుదేరు. నీకు శుభం జరుగుతుంది. నేనేం చేయాలో ఆదేశించు. (26)
ఏవముక్తస్తదా కర్ణః ధార్తరాష్ట్రేణ ధీమతా ।
సర్వమాజ్ఞాసయామాస ప్రాయాత్రికమరిందమ ॥ 27
అరిందమా! ధీమంతుడైన దుర్యోధనుడు అలా అనగానే కర్ణుడు ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించమని ఆదేశించాడు. (27)
ప్రయయౌ చ మహేష్వాసః నక్షత్రే శుభదైవతే ।
శుభే తిథౌ ముహూర్తే చ పూజ్యమానో ద్విజాతిభిః ॥ 28
మంగలైశ్చ శుభైః స్నాతః వాగ్భిశ్చాపి ప్రపూజితః ।
నాదయన్ రథఘోషేణ త్రైలోక్యం సచరాచరమ్ ॥ 29
మేటివిలుకాడైన కర్ణుడు మంగళస్నానం చేసి, బ్రాహ్మణుల ఆశీర్వాదవచనాలచే సత్కరింపబడి, ప్రశంసలనందుకొని శుభనక్షత్రంలో, శుభతిథిలో, శుభముహూర్తంలో రథఘోషతో స్థావరజంగమసహితంగా మూడులోకాలను ప్రతిధ్వనింపజేస్తూ బయలుదేరాడు. (28,29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి కర్ణదిగ్విజయే త్రిపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 253 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున కర్ణదిగ్విజయమను రెండు వందల యేబది మూడవ అధ్యాయము. (253)