282. రెండు వందల ఎనుబది రెండవ అధ్యాయము
సీతాన్వేషణము - హనుమంతుడు లంకకు వెళ్లి తిరిగివచ్చుట.
మార్కండేయ ఉవాచ
రాఘవః సహసౌమిత్రిః సుగ్రీవేణాభిపాలితః ।
వసన్ మాల్యవతః పృష్ఠే దదృశే విమలం నభః ॥ 1
సుగ్రీవుని సంరక్షణలో రాముడు లక్ష్మణునితో కలిసి మాల్యవంతపర్వతం యొక్క పృష్ఠ భాగంలో నివసిస్తూ ఆకాశం నిర్మలంగా ఉండడం చూశాడు. (1)
స దృష్ట్వా విమలే వ్యోమ్ని నిర్మలం శశలక్షణమ్ ।
గ్రహనక్షత్రతారాభిః అనుయాతమమిత్రహా ॥ 2
కుముదోత్పలపద్మానాం గంధమాదాయ వాయునా ।
మహీధరస్థః శీతేన సహసా ప్రతిబోధితః ॥ 3
(శరత్కాలంనాటి) నిర్మలమైన ఆకాశంలో గ్రహనక్షత్ర తారకలతో కూడిన స్వచ్ఛమైన చంద్రుని చూస్తూ ఉన్నాడు రాముడు. శత్రుమర్దనుడైన రాముని తెల్లకలువల, నల్లకలువల, పద్మాల సుగంధాన్ని మోసుకొస్తున్న చల్లని వాయువు అకస్మాత్తుగా మేలు కొలిపింది. (2,3)
ప్రభాతే లక్ష్మణం వీరమభ్యభాషత దుర్మనాః ।
సీతాం సంస్కృత్య ధర్మాత్మా రుద్ధాం రాక్షసవేశ్మని ॥ 4
ధర్మాత్ముడైన శ్రీరామునికి ఉదయాన్నే రాక్షసుని ఇంటిలో బందీగా ఉన్న సీత గుర్తుకు వచ్చి మనసులో దుఃఖపడ్డాడు. అతడు వీరుడైన లక్ష్మణునితో ఇలా అన్నాడు. (4)
గచ్ఛ లక్ష్మణ జానీహి కిష్కింధాయాం కపీశ్వరమ్ ।
ప్రమత్తం గ్రామ్యధర్మేషు కృతఘ్నం స్వార్ధపండితమ్ ॥ 5
"లక్ష్మణా! కిష్కింధలో సంసార భోగాలలో బాగా మత్తిల్లి ఉన్నాడు, సుగ్రీవుడు, కృతఘ్నుడై, స్వార్థాన్ని సాధించుకోవడంలో పండితుడా వానరరాజు సుగ్రీవుడు. అతడు ఏం చేస్తున్నాడో వెళ్లి తెలుసుకో. (5)
యోఽసౌ కులాధమో మూఢః మయా రాజ్యేఽభిషేచితః ।
సర్వవానరగోపుచ్ఛాః యమృక్షాశ్చ భజంతి వై ॥ 6
ఆ వానరకులాధముని, మూఢుని నేనే రాజ్యాభిషిక్తుని చేశాను. కనుకనే సమస్తవానరులు, లాంగూలురు, ఋక్షాలు అతనిని సేవిస్తున్నారు. (6)
యదర్థం నిహతో వాలీ మయా రఘుకులోద్వహ ।
త్వయా సహ మహాబాహో కిష్కింధోపవనే తదా ॥ 7
మహాబాహూ, రఘుకుల తిలకా! ఆ నాడు నీతో కలిసి కిష్కింధకు సమీపంలోని వనంలో అతనికొరకే వాలిని నేను వధించాను. (7)
కృతఘ్నం తమహం మన్యే వానరాపసదం భువి ।
యో మామేవంగతో మూఢః న జానీతేఽద్య లక్ష్మణ ॥ 8
ఆ నీచవానరుడైన సుగ్రీవుని ఈ భూలోకానికి సరిపడినంత కృతఘ్నుడని నేను అనుకొంటున్నాను. లక్ష్మణా! ఈ నాడు ఈ దశకు చేరుకొని ఆ మూఢుడు నన్ను గుర్తించడం లేదు. (8)
అసౌ మన్యే న జానీతే సమయప్రతిపాలనమ్ ।
కృతోపకారం మాం నూనమ్ అవమన్యాల్పయా ధియా ॥ 9
ఉపకారం చేసిన నన్ను అల్పబుద్ధితో అవమానించి, చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవాలని అతడు తెలుసుకోవడం లేదని అనుకొంటున్నాను. (9)
యది తావదనుద్యుక్తః శేతే కామసుఖాత్మకః ।
నేతవ్యో వాలిమార్గేణ సర్వభూతగతిం త్వయా ॥ 10
కామసుఖాసక్తుడై, సీతాన్వేషణకు ఏమీ ప్రయత్నం చేయకుండా నిద్రపోతుంటే వాలిమార్గంలోనే సకలప్రాణులు పొందే గతినే (మరణాన్ని) అతనికి నీవు కలిగించు. (10)
అథాపి ఘటతేఽస్మాకమ్ అర్థే వానరపుంగవః ।
తమాదాయైవ కాకుత్ స్థ త్వరావాన్ భవ మా చిరమ్ ॥ 11
ఒకవేళ ఆ వానరపుంగవుడు మనకోసం పనిచేస్తున్నట్లయితే లక్ష్మణా! అతనిని వెంటపెట్టుకొని త్వరగా రా. ఆలస్యం చేయకు" అన్నాడు. (11)
ఇత్యుక్తో లక్ష్మణో భ్రాత్రా గురువాక్యహితే రతః ।
ప్రతస్థే రుచిరం గృహ్య సమార్గణగుణం ధనుః ॥ 12
అని అన్న పలుకగానే పెద్దలమాటయందు, వారికి మేలు, చేయడంలోను తత్పరుడైన లక్ష్మణుడు బాణంతో అల్లెత్రాడు కూర్చిన అందమైన ధనుస్సును తీసుకొని బయలుదేరాడు. (12)
కిష్కింధాద్వారమాసాద్య ప్రవివేశానివారితః ।
సక్రోధ ఇతి తం మత్వా రాజా ప్రత్యుద్యయౌ హరిః ॥ 13
కిష్కింధా ద్వారాన్ని చేరుకొని అడ్డు లేకుండా లోపలికి ప్రవివేశించాడు. అతడు క్రోధంతో ఉన్నాడని తెలుసుకొని రాజు అయిన సుగ్రీవుడు ఎదురువెళ్లాడు. (13)
తం సదారో వినీతాత్మా సుగ్రీవః ప్లవగాధిపః ।
పూజయా ప్రతిజగ్రాహ ప్రీయమాణస్తదర్హయా ॥ 14
తమబ్రవీద్ రామవచః సౌమిత్రిరకుతోభయః ।
భార్యాసహితుడై వానరరాజు సుగ్రీవుడు వినయంగా లక్ష్మణుని పూజించి తోడ్కొని వెళ్లాడు. ఎవరికీ భయపడని సౌమిత్రి ఆ పూజతో ప్రసన్నుడై రాముడు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పాడు. (14 1/2)
స తత్ సర్వమశేషేణ శ్రుత్వా ప్రహ్వః కృతాంజలిః ॥ 15
సభృత్యదారో రాజేంద్ర సుగ్రీవో వానరాధిపః ।
ఇదమాహ వచః ప్రీతో లక్ష్మణం నరకుంజరమ్ ॥ 16
రాజేంద్రా! అతడు అదంతా పూర్తిగా విని వినయంతో చేతులు జోడించాడు. భార్యతో అనుచరులతో కలిసి వానరాధిపుడయిన సుగ్రీవుడు మానవ శ్రేష్ఠుడయిన లక్ష్మణునితో ప్రీతుడై ఇలా అన్నాడు. (15,16)
నాస్మి లక్ష్మణ దుర్మేధాః నాకృతజ్ఞో న నిర్ఘృణః ।
శ్రూయతాం యః ప్రయత్నః మే సీతాపర్యేషణే కృతః ॥ 17
"లక్ష్మణా! నేను దుర్బుద్ధినికాను. కృతజ్ఞత లేనివాడిని కాను. దయలేని వాడిని కాను. సీతాన్వేషణకోసం నేను చేసిన ప్రయత్నం గురించి విను. (17)
దిశః ప్రస్థాపితాః సర్వే వినీతా హరయో మయా ।
సర్వేషాం చ కృతః కాలో మాసేనాగమనం పునః ॥ 18
వినీతులయిన వానరులను నేను అన్నిదిక్కులకూ పంపాను. ఒకనెల రోజులకు తిరిగి రావాలని వారందరికి సమయావధిని విధించాను. (18)
యైరియం సవనా సాద్రిః సాగరాంబరా ।
విచేతవ్యా మహీ వీర సగ్రామనగరాకరా ॥ 19
వీరుడా! వీరందరీ అడవులు, కొండలు, పట్టణాలు, గ్రామాలకు నగరాలకు నిలయమై; సముద్రమే వసనంగా గల భూమి నంతటినీ సీతకోసం అన్వేషిస్తారు. (19)
స మాసః పంచ రాత్రేణ పూర్ణో భవితుమర్హతి ।
తతః శ్రోష్యసి రామేణ సహితః సుమహత్ ప్రియమ్ ॥ 20
ఆ మాసం కూడా ఇక ఐదురాత్రులలో పూర్తి కావస్తోంది. రామునితో కూడి అప్పుడు ప్రియమైన వార్తను వింటావు". (20)
ఇత్యుక్తో లక్ష్మణస్తేన వానరేంద్రేణ ధీమతా ।
త్వక్త్యా రోషమదీనాత్మా సుగ్రీవం ప్రత్యపూజయత్ ॥ 21
బుద్ధిమంతుడయిన వానరేంద్రుడు ఇలా అనగానే లక్ష్మణుడు రోషాన్ని విడిచి ఉదారహృదయుడై సుగ్రీవుని తిరిగి పూజించాడు. (గౌరవించాడు) (21)
స రామం సహసుగ్రీవః మాల్యవత్పృష్ఠమాస్థితమ్ ।
అభిగమ్యోదయం తస్య కార్యస్య ప్రత్యవేదయత్ ॥ 22
అతడు సుగ్రీవునితో కలిసి మాల్యవంత పర్వతం యొక్క పృష్ఠభాగంలో ఉన్న రాముని సమీపించి, సీతాన్వేషణమనే ఆ కార్యం ప్రారంభ మయిందని తెలియచేశాడు. (22)
ఇత్యేవం వానరేంద్రాస్తే సమాజగ్ముః సహస్రశః ।
దిశస్తిస్రో విచిత్యాథ న తు యే దక్షిణాం గతాః ॥ 23
మూడు దిక్కులకు వెదకడానికి వెళ్లిన వేలకొద్దీ ఆ వానరవీరులందరూ నెల పూర్తికాగానే తిరిగి అక్కడికి చేరుకొన్నారు. కేవలం దక్షిణ దిక్కుకు వెళ్లినవారు మాత్రం రాలేదు. (23)
ఆచఖ్యుస్తత్ర రామాయ మహీం సాగరమేఖలామ్ ।
విచితాం న తు వైదేహ్యా దర్శనం రావణస్య వా ॥ 24
సముద్రపర్యంతం ఉన్న భూమినంతటినీ వెదికినా సీతగాని, రావణుడు గాని కనపడలేదని వారు రామునికి చెప్పారు. (24)
గతాస్తు దక్షిణామాశాం యే వై వానరపుంగవాః ।
ఆశావాంస్తేషు కాకుత్ స్థః ప్రాణానార్తోఽభ్యధారయత్ ॥ 25
దక్షిణదిశకు వెళ్లిన వానర శ్రేష్ఠులమీదనే ఆశపెట్టుకొన్న కాకుత్థ్సుడు ఆర్తుడైనప్పటికీ ప్రాణాలను నిలిపి ఉంచుకొన్నాడు. (25)
ద్విమాసోపరమే కాలే వ్యతీతే ప్లవగాస్తతః ।
సుగ్రీవమభిగమ్యేదం త్వరితా వాక్యమబ్రువన్ ॥ 26
రెండు నెలల కాలం ముగుస్తూ ఉండగా వానరులు కొందరు వడివడిగా సుగ్రీవుని సమీపించి ఇలా అన్నారు. (26)
రక్షితం వాలినా యత్ తత్ స్ఫీతం మధువనం మహత్ ।
త్వయా చ ప్లవగశ్రేష్ఠ తద్ భుంక్తే పవనాత్మజః ॥ 27
"వానరరాజా! వాలీ! నీవూ కూడా రక్షిస్తూ ఉన్న సమృద్ధమయిన మధువనాన్ని పవనాత్మజుడయిన హనుమంతుడు ఉపభోగిస్తున్నాడు. (రాజాజ్ఞలేకుండానే) (27)
వాలిపుత్రోఽంగదశ్చైవ యే చాన్యే ప్లవగర్షభాః ।
విచేతుం దక్షిణామాశాం రాజన్ ప్రస్థాపితాస్త్వయా ॥ 28
రాజా! వాలి పుత్రుడయిన అంగదుడు, ఇంకా వెదకడానికి దక్షిణదిక్కుకు మీరు పంపిన వానరశ్రేష్ఠులు కూడా ఉన్నారు". (28)
తేషామపనయం శ్రుత్వా మేనే స కృతకృత్యతామ్ ।
కృతార్థానాం హి భృత్యానామ్ ఏతద్ భవతి చేష్టితమ్ ॥ 29
వారి అవినయాన్ని గురించి విని సుగ్రీవుడు వారు వెళ్లిన పనిలో కృతకృత్యులయ్యారని భావించాడు. కృతార్థులయిన సేవకులు మాత్రమే ఇటువంటి చేష్టలు చేస్తారు కదా! (29)
న తద్ రామాయ మేధావీ శశంస ప్లవగర్షభః ।
రామశ్చాప్యనుమానేన మేనే దృష్టాం తు మైథిలీమ్ ॥ 30
మేధావి అయిన ఆ వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు రామునికి తన నిశ్చయాన్ని తెలిపాడు. వారు మైథిలిని చూశారని రాముడు కూడా తలచాడు. (30)
హనుమత్ప్రముఖాశ్చాపి విశ్రాంతాస్తే ప్లవంగమాః ।
అభిజగ్ముర్హరీంద్రం తం రామలక్ష్మణసంనిధౌ ॥ 31
హనుమంతుడు మొదలైన ఆ వానరవీరులందరూ విశ్రాంతి తీసుకొన్నాక రామలక్ష్మణుల సన్నిధిలో ఉన్న ఆ కపీంద్రుని సుగ్రీవుని సమీపించారు. (31)
గతిం చ ముఖవర్ణం చ దృష్ట్వా రామో హనూమతః ।
అగమత్ ప్రత్యయం భూయో దృష్టా సీతేతి భారత ॥ 32
భారతా! హనుమంతుని యొక్క నడక తీరును, ముఖ కవళికను చూచిన రామునికి "ఇతడు సీతను చూశాడు" అనే విశ్వాసం కలిగింది. (32)
హనుమత్ప్రముఖాస్తే తు వానరాః పూర్ణమానసాః ।
ప్రణేముర్విధివద్ రామం సుగ్రీవం లక్ష్మణం తథా ॥ 33
సఫలమనోరథులయిన హనుమంతుడు మొదలైన ఆ వానరవీరులందరూ విధ్యుక్తంగా రామునికి, సుగ్రీవునికి, లక్ష్మణునికి నమస్కరించారు. (33)
తానువాచానతాన్ రామః ప్రగృహ్య సశరం ధనుః ।
అపి మాం జీవయిష్యధ్వమ్ అపి వః కృతకృత్యతా ॥ 34
రాముడు ధనుర్బాణాలు చేతపట్టి, తనకు ప్రణమిల్లిన వారినుద్దేశించి "మీరు నన్ను బ్రతికిస్తున్నారా లేదా ? మీరు కృతకృత్యులయ్యారా? (34)
అపి రాజ్యమయోధ్యాయాం కారయిష్యామ్యహం పునః ।
నిహత్య సమరే శత్రూన్ ఆహృత్య జనకాత్మజామ్ ॥ 35
శత్రువులను యుద్ధంలో ఓడించి సీతాదేవిని తీసికొని వచ్చి మళ్లీ నేను అయోధ్యలో రాజ్యం చేస్తానా? (35)
అమోక్షయిత్వా వైదేహీమ్ అహత్వా చ రణే రిపూన్ ।
హృతదారోఽవధూతశ్చ నాహం జీవితుముత్సహే ॥ 36
వైదేహిని విడిపించకుండా యుద్ధంలో శత్రువులను చంపకుండా, భార్యను కోల్పోయి అవధూతనై జీవించడానికి నేను ఇష్టపడడంలేదు" అన్నాడు. (36)
ఇత్యుక్తవచనం రామం ప్రత్యువాచానిలాత్మజః ।
ప్రియమాఖ్యామి తే రామ దృష్టా సా జానకీ మయా ॥ 37
అని పలుకుతున్న రాముని ఉద్దేశించి హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు - "రామా! నీకు నేను ప్రీతి కలిగించే విషయం చెపుతున్నాను. ఆ జనకాత్మజను నేను చూశాను. (37)
విచిత్య దక్షిణామాశాం సపర్వతవనాకరామ్ ।
శ్రాంతాః కాలే వ్యతీతే స్మ దృష్టవంతో మహాగుహామ్ ॥ 38
కొండలు, అడవులు, గనులతో సహితంగా దక్షిణదిక్కునంతా వెదికి అలసిపోయాము. కాలం గడువు తీరిపోయింది. అప్పుడు మేము ఒక మహాగుహను చూశాము. (38)
ప్రవిశామో వయం తాం తు బహుయోజనమాయతామ్ ।
సాంధకారం సువిపినాం గహనాం కోటసేవితామ్ ॥ 39
గత్వా సుమహదధ్వానమ్ ఆదిత్యస్య ప్రభాం తతః ।
దృష్టవంతః స్మ తత్రైవ భవనం దివ్యమంతరా ॥ 40
మేము ఆ గుహను ప్రవేశించాము. అది అనేక యోజనాల పొడవు ఉంది. చీకటిగా ఉంది. అందులో దట్టమైన అడవులున్నాయి. కీటకాలు తిరుగుతున్నాయి. అలా చాలా దూరం వెళ్లాక అప్పుడు సూర్యకాంతి కనపడింది. ఆ గుహలోపలే అక్కడ ఒక దివ్యమైన భవనం ఉంది. (39,40)
మయస్య కిల దైత్యస్య తదాసీద్ వేశ్మ రాఘవ ।
తత్ర ప్రభావతీ నామ తపోఽతప్యత తాపసీ ॥ 41
రాఘవా! ఆ భవనం మయుడనే దైత్యునిదట. అక్కడ ప్రభావతి అనే తాపసి తపస్సు చేసుకొంటోంది. (41)
తయా దత్తాని భోజ్యాని పానాని వివిధాని చ ।
భుక్త్వా లబ్ధబలాః సంతః తయోక్తేన పథా తతః ॥ 42
నిర్యాయ తస్మాదుద్దేశాత్ పశ్యామో లవణాంభసః ।
సమీపే సహ్యమలయౌ దర్దురం చ మహాగిరిమ్ ॥ 43
ఆమె ఇచ్చిన ఆహారాన్ని, రకరకాల పానీయాలను తిని త్రాగి, తిరిగి బలాన్ని పొందాము. ఆమె చెప్పిన మార్గం గుండా ఆ ప్రదేశాన్నుండి బయటపడి లవణ సముద్రతీరాన్ని చేరుకొన్నాము. అక్కడ సహ్య, మలయ పర్వతాలను, పెద్ద దర్దుర పర్వతాన్ని చూశాము. (42,43)
తతో మలయమారుహ్య పశ్యంతో వరుణాలయమ్ ।
విషణ్ణా వ్యథితాః ఖిన్నాః నిరాశా జీవితే భృశమ్ ॥ 44
మలయ పర్వతాన్ని ఎక్కి సముద్రాన్ని చూస్తున్న మాకు విచారం కలిగింది. వ్యగ్రులమైనాము, ఖిన్నులమయ్యాం. జీవితం పట్ల చాలా నిరాశ కలిగింది. (44)
అనేకశతవిస్తీర్ణం యోజనానాం మహోదధిమ్ ।
తిమినక్రఝషావాసం చింతయంతః సుదుఃఖితాః ॥ 45
అనేకవందల యోజనాల విస్తీర్ణం కలిగి, తిమింగిలాలకు, మొసళ్లకు, చేపలకు నివాసమైన ఆ మహాసముద్రాన్ని గూర్చి, ఆలోచిస్తేనే మాకు మిక్కిలి దుఃఖం కలిగింది. (45)
తత్రానశనసంకల్పం కృత్వాఽఽసీనా వయం తదా ।
తతః కథాంతే గృధ్రస్య జటాయోరభవత్ కథా ॥ 46
అక్కడ ప్రాయోపవేశం చేయాలనే సంకల్పం పూని మేమంతా కూర్చున్నాం. అప్పుడు మాటలమధ్యలో పక్షిరాజు జటాయువు యొక్క ప్రసంగం వచ్చింది. (46)
తతః పర్వతశృంగాభం ఘోరరూపం భయావహమ్ ।
పక్షిణం దృష్టవంతః స్మ వైవతేయమివాపరమ్ ॥ 47
కొండశిఖరంలా ఘోరమైన రూపంతో భయం కొలిపేలా ఉన్న రెండవ గరుడునిలా ఉన్న పక్షి ఒకటి కనిపించింది. (47)
సోఽస్మానతర్కయద్ భోక్తుమ్ అథాభ్యేత్య వచోఽబ్రవీత్ ।
భోః క ఏష మమ భ్రాతుః జటాయోః కురుతే కథామ్ ॥ 48
సంపాతిర్నామ తస్యాహం జ్యేష్ఠో భ్రాతా ఖగాధిపః ।
అన్యోన్యస్పర్దయారూఢౌ ఆవామాదిత్యసత్పదమ్ ॥ 49
అతడు మమ్మల్ని తినివేయాలనే అనుకొన్నాడు. అయినా మాదగ్గరకు వచ్చి "ఓరీ! ఎవడురా నా తమ్ముడు జటాయువు గురించి మాటలాడుతున్నది? అతని అన్నను పక్షిరాజును నేను. నాపేరు సంపాతి. మేము ఒకరితో ఒకరు పోటీపడి సూర్యమండలాన్ని చేరుకోవాలని ఎగిరాము. (48,49)
తతో దగ్దానిమౌ పక్షౌ న దగ్ధౌ తు జటాయుషః ।
తదా మే చిరదృష్టః స భ్రాతా గృధ్రపతిః ప్రియః ॥ 50
నిర్దగ్ధపక్షః పతితః హ్యహమస్మిన్ మహాగిరౌ ।
అప్పుడు నా ఈ రెక్కలు కాలిపోయాయి. జటాయువు రెక్కలు కాలిపోలేదు. నాకు సోదరుడు, ఇష్టుడు అయిన ఆ పక్షిరాజును అప్పుడు చూశాను. చాలాకాలమయింది. రెక్కలు కాలిపోయి నేను ఈ పెద్దకొండ మీద పడిఉన్నాను". (50 1/2)
తస్యైవం వదతోఽస్మాభిః హతో భ్రాతా నివేదితః ॥ 51
వ్యసనం భవతశ్చేదం సంక్షేపాద్ వై నివేదితమ్ ।
అలా చెప్తున్న అతనికి తమ్ముని చావును గురించి తెలియచేశాం. మీ ఈ కష్టాన్ని గురించి కూడా సంక్షిప్తంగా చెప్పాం. (51 1/2)
స సంపాతిస్తదా రాజన్ శ్రుత్వా సుమహదప్రియమ్ ॥ 52
విషణ్ణచేతాః పప్రచ్ఛ పునరస్మానరిందమ ।
కః స రామః కథం సీతా జటాయుశ్చ కథం హతః ॥ 53
ఇచ్ఛామి సర్వమేవైతత్ శ్రోతుం ప్లవగసత్తమాః ।
రాజా! అప్పుడు మిక్కిలి అప్రియమయిన వార్తను విని, ఆ సంపాతికి మనసంతా విషాదంతో నిండిపోయింది. శత్రుసూదనా! అతడు మళ్లీ మమ్మల్ని ఇలా అడిగాడు. "వానరశ్రేష్ఠులారా! ఆ రాముడెవరు? సీత ఎలా ఉంటుంది? జటాయువు ఎలా చనిపోయాడు? ఇదంతా వినాలని ఉంది" అన్నాడు. (52,53 1/2)
తస్యాహం సర్వమేవైతద్ భవతో వ్యసనాగమమ్ ॥ 54
ప్రాయోపవేశనే చైవ హేతుం విస్తరశోఽబ్రువమ్ ।
అప్పుడు నేను అతనికి మీకు వచ్చిన కష్టం; మేము ప్రాయోపవేశం చేయడానికి గల కారణాన్ని అంతటినీ వివరంగా చెప్పాను. (54 1/2)
సోఽస్మానుత్థాపయామాస వాక్యేనానేన పక్షిరాట్ ॥ 55
రావణో విదితో మహ్యం లంకా చాస్య మహాపురీ ।
దృష్టా పారే సముద్రస్య త్రికూటగిరికందరే ॥ 56
భవిత్రీ తత్ర వైదేహీ న మేఽస్త్యత్ర విచారణా ।
అప్పుడు పక్షిరాజు సంపాతి మాకు ఉత్సాహాన్నిచ్చి లేపుతూ ఇలా అన్నాడు. "రావణుడు నాకు తెలుసు. అతని రాజధానీ నగరం లంకను కూడా నేను చూశాను. అది సముద్రానికి ఆవల త్రికూట పర్వతకందరంలో ఉంది. వైదేహి అక్కడే ఉండవచ్చు. నాకు ఇంకొక ఆలోచన లేదు". (55 56 1/2)
ఇతి తస్య వచః శ్రుత్వా వయముత్థాయ సత్వరాః ॥ 57
సాగరక్రమణే మంత్రం మంత్రయామః పరంతపః ।
పరంతపా! అతడు చెప్పిన ఈ మాటలన్నీ విని మేము వెంటనే లేచి సముద్రాన్ని దాటడానికి ఉపాయాన్ని ఆలోచించసాగాము. (57 1/2)
నాధ్యవాస్యద్ యదా కశ్చిత్ సాగరస్య విలంఘనమ్ ॥ 58
తత్ర సీతా మయా దృష్టా రావణాంతఃపురే సతీ ।
శతయోజనవిస్తీర్ణం నిహత్య జలరాక్షసీమ్ ॥ 59
ఎవరూ కూడా సాగరాన్ని దాటడానికి సాహసించలేదు. అప్పుడు నేను తండ్రిని ఆవేశించి (తండ్రి అయిన వాయువు రూపాన్ని ఆవేశించి) జలాలలో ఉండే రాక్షసిని చంపి, వందయోజనాల విస్తీర్ణం కలిగిన ఆ మహాసాగరాన్ని తరించాను. (58,59)
తత్ర సీతా మయా దృష్టా రావణాంతఃపురే సతీ ।
ఉపవాసతపఃశీలా భర్తృదర్శనలాలసా ॥ 60
అక్కడ రావణాంతఃపురంలో ఉన్న సాధ్వి సీతాదేవిని నేను చూశాను. భర్తను చూడాలనే కోరికతో ఆమె ఉపవాసాలు, చేస్తోంది. తపస్సు తన స్వభావంగా చేసుకొంది. (60)
జటిలా మలదిగ్ధాంగీ కృశా దీనా తపస్వినీ ।
నిమిత్తైస్తామహం సీతామ్ ఉపలభ్య పృథగ్విధైః ॥ 61
ఉపసృత్యాబ్రువం చార్యామ్ అభిగమ్య రహోగతామ్ ।
సీతే రామస్య దూతోఽహం వానరో మారుతాత్మజః ॥ 62
ఆమె జుట్టు జడలు కట్టి ఉంది. శరీరం అంతా దుమ్ముకొట్టుకొని ఉంది. ఆ తపస్విని దీనురాలై కృశించిపోయింది. చాలా కారణాల వలన నేను ఆమెను సీతగా తెలుసుకొని రహస్యంగా ఆమె దగ్గరకు వెళ్లి, సమీపించి "సీతా! రాముని దూతను నేను. మారుతాత్మజుడను వానరుడను. (61,62)
త్వద్దర్శనమభిప్రేప్సుః ఇహ ప్రాప్తో విహాయసా ।
రాజపుత్రౌ కుశలినౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 63
నీ దర్శనం కోరి ఇక్కడకు ఆకాశమార్గాన వచ్చాను. అన్నదమ్ములయిన ఆ రాజకుమారులు రామలక్ష్మణులు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. (63)
సర్వశాఖామృగేంద్రేణ సుగ్రీవేణాభిపాలితౌ ।
కుశలం త్వాబ్రవీద్ రామః సీతే సౌమిత్రిణా సహ ॥ 64
వారు సమస్తవానరులకు రాజు అయిన సుగ్రీవుని రక్షణలో ఉన్నారు. సీతా! లక్ష్మణునితో పాటు రాముడు తాను క్షేమంగా ఉన్నట్లు నీకు చెప్పమన్నాడు. (64)
సఖిభావాచ్చ సుగ్రీవః కుశలం త్వానుపృచ్ఛతి ।
క్షిప్రమేష్యతి తే భర్తా సర్వశాఖామృగైః సహ ॥ 65
ప్రత్యయం కురు మే దేవి వానరోఽస్మి న రాక్షసః ।
స్నేహం కారణంగా సుగ్రీవుడు కూడా నీ క్షేమం గురించి అడుగుతున్నాడు. వానరులందరితో కలిసి నీభర్త శీఘ్రంగానే ఇక్కడకు వస్తాడు. దేవీ! నన్ను విశ్వసించు నేను వానరుడను. రాక్షసుడను కాను" అన్నాడు. (65 1/2)
ముహూర్తమివ చ ధ్యాత్వా సీతా మాం ప్రత్యువాచ హ ॥ 66
అవైమి త్వాం హనూమంతమ్ అవింధ్యవచనాదహమ్ ।
అవింధ్యో హి మహాబాహో రాక్షసో వృద్ధసమ్మతః ॥ 67
క్షణకాలం ఆలోచించి సీత నాకు ఇలా బదులిచ్చింది. "అవింధ్యుని మాటల వలన నిన్ను హనుమంతునిగా నేను గుర్తించాను. మహాబాహూ! అవింధ్యుడు రాక్షసుడే అయినా వృద్ధుడు, ఆదరణీయుడుసుమా! (66,67)
కథితస్తేన సుగ్రీవః త్వద్విధైః సచివైర్వృతః ।
గమ్యతామితి చోక్త్వా మాం సీతా ప్రాదాదిమం మణిమ్ ॥ 68
ధారితా యేన వైదేహీ కాలమేతమనిందితా ।
ప్రత్యయార్థం కథాం చేమాం కథయామాస జానకీ ॥ 69
నీవంటి మంత్రులతో సుగ్రీవుడు కలిసిఉన్నాడని అతడు చెప్పాడు. ఇక నీవు వెళ్లు. అని నాకు ఈ మణిని ఇచ్చింది. ఇంతకాలం సాధ్వి అయిన ఆమె దీనిని ధరించియే కాలం వెళ్లపుచ్చింది. నమ్మకం కుదరడానికి ఈ కథను కూడా జానకి చెప్పింది. (68,69)
క్షిప్తామిషీకాం కాకాయ చిత్రకూటే మహాగిరౌ ।
భవతా పురుషవ్యాఘ్ర ప్రత్యభిజ్ఞానకారణాత్ ॥ 70
పురుష సింహమా! చిత్రకూట మహాపర్వతముపై నివసించినపుడు ఒక కాకిపై మీరు ఒక ఈనెపుల్లను అస్త్రంగా చేసి వదిలారు. దుష్టచిత్తుడైన ఆ కాకికి ఒక కన్ను గుడ్డిదైపోయింది. ఈ ప్రసంగం మీ గుర్తుకోసమే చెప్పబడింది. (70)
(ఏకాక్షివికలః కాకః సుదుష్టాత్మా కృతశ్చ వై ।)
గ్రాహయిత్వాహమాత్మానం తతో దగ్ధ్వా చ తాం పురీమ్ ।
సంప్రాప్త ఇతి తం రామః ప్రియవాదినమార్చయత్ ॥ 71
నా అంతట నేను రాక్షసులకు పట్టుబడి ఆ లంకాపురిని కాల్చి ఇక్కడికి వచ్చాను" అని చెప్పిన ప్రియవాది అయిన అతనిని రాముడు ఎంతగానో ఆదరించాడు. (71)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి హనుమత్ప్రత్యాగమనే ద్వశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 282 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున హనుమంతుడు తిరిగివచ్చుట అను రెండు వందల ఎనుబది రెండవ అధ్యాయము. (282)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకం కలిపి మొత్తం 71 1/2 శ్లోకాలు.)