290. రెండు వందల తొంబదియవ అధ్యాయము

రామరావణుల యుద్ధము - రావణ వధ.

మార్కండేయ ఉవాచ
తతః క్రుద్ధో దశగ్రీవః ప్రియే పుత్రే నిపాతితే ।
నిర్యయౌ రథమాస్థాయ హేమరత్నవిభూషితమ్ ॥ 1
స వృతో రాక్షసైర్ఘోరైః వివిధాయుధపాణిభిః ।
అభిదుద్రాన రామం స యోధయన్ హరియూథపాన్ ॥ 2
తన ప్రియమిత్రుడు చనిపోగా క్రుద్ధుడైన దశగ్రీవుడు సువర్ణరత్నాలతో అలంకరింపబడిన రథాన్ని ఎక్కి లంకానగరం నుండి బయలుదేరాడు. వివిధాయుధాలను చేత ధరించిన భయంకరులైన రాక్షసులు అతని చుట్టూ ఉన్నారు. అతడు వానర యూధపతులతో యుద్ధం చేస్తూ రామునివైపు వేగంగా కదిలాడు. (1,2)
తమాద్రవంతం సంక్రుద్ధం మైందనీలనలాంగదాః ।
హనూమాన్ జాంబవాంశ్చైవ ససైన్యాః పద్యవారయన్ ॥ 3
మహాక్రోధంతో వస్తున్న అతనిని మైందుడు, నీలుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు సైన్యసహితులై ముట్టడించారు. (3)
తే దశగ్రీవసైన్యం తద్ ఋక్షవానరపుంగవాః ।
ద్రుమైర్విధ్వంసయాంచక్రుః దశగ్రీవస్య పశ్యతః ॥ 4
ఆ ఋక్ష వానరపుంగవులు రావణాసురుడు చూస్తూ ఉండగానే అతని సైన్యాన్ని చెట్లతో విధ్వంసం చేయసాగారు. (4)
తతః స సైన్యమాలోక్య వధ్యమానమరాతిభిః ।
మాయావీ చాపృజన్మాయాం రావణో రాక్షసాధిపః ॥ 5
రాక్షసరాజయిన రావణుడు మాయావి కూడా. శత్రువులు తన సైన్యాన్ని వధించడం చూసి మాయను కల్పించాడు. (5)
తస్య దేహవినిష్ర్కాంతాః శతశోఽథ సహస్రశః ।
రాక్షసాః ప్రత్యదృశ్యంత శరశక్త్వృష్టిపాణయః ॥ 6
అతని శరీరం నుండి వెలువడిన వందలు వేల రాక్షసులు బాణాలు, శక్తులు, ఋష్టులు చేత ధరించి కనిపించారు. (6)
తాన్ రామో జఘ్నివాన్ సర్వాన్ దివ్యేనాస్త్రేణ రాక్షసాన్ ।
అథ భూయోఽపి మాయాం స వ్యదధాద్ రాక్షసాధిపః ॥ 7
ఆ రాక్షసులందరినీ రాముడు దివ్యాస్త్రంతో సంహరించాడు. అయినా ఆ రాక్షసాధిపుడు తిరిగి మాయను సృష్టించాడు. (7)
కృత్వా రామస్య రూపాణి లక్ష్మణస్య చ భారత ।
అభిదుద్రావ రామం చ లక్ష్మణం చ దశాననః ॥ 8
భారతా! రామలక్ష్మణుల యొక్క రూపాలను ధరించి రావణుడు రామలక్ష్మణులను ఎదిరించాడు. (8)
తతస్తే రామమార్ఛంతః లక్ష్మణం చ క్షపాచరాః ।
అభిపేతుస్తదా రామం ప్రగృహీతశరాసనాః ॥ 9
అనంతరం ఆ రాక్షసులందరూ ధనుస్సులు దాల్చి రామలక్ష్మణులను బాధిస్తూ వారిపై విరుచుకుపడినారు. (9)
తాం దృష్ట్వా రాక్షసేంద్రస్య మాయామిక్ష్వాకునందనః ।
ఉవాచ రామం సైమిత్రిః అసంభ్రాంతో బృహద్ వచః ॥ 10
రాక్షసరాజు యొక్క ఆ మాయను చూచి ఇక్ష్వాకు నందనుడైన లక్ష్మణుడు ఏమాత్రం చలించకుండా రామునితో గట్టిగా ఇలా అన్నాడు. (10)
జహీమాన్ రాక్షసాన్ పాపాన్ ఆత్మనః ప్రతిరూపకాన్ ।
జఘాన రామస్తాంశ్చాన్యాన్ ఆత్మనః ప్రతిరూపకాన్ ॥ 11
"మీ ప్రతిరూపాలను ధరించిన పాపాత్ములైన ఈ రాక్షసులను సంహరించు", ఇది విని రాముడు తన ప్రతిరూపాలైన వారిని ఇంకా ఇతర రాక్షసులను కూడా సంహరించాడు. (11)
తతో హర్యశ్వయుక్తేన రథేనాదిత్యవర్చసా ।
ఉపతస్థే రణే రామం మాతలిః శక్రసారథిః ॥ 12
ఆ సమయంలో ఇంద్రసారథి అయిన మాతలి పచ్చని గుఱ్ఱాలు కట్టబడి సూర్యునిలా ప్రకాశిస్తున్న రథంతో యుద్ధభూమిలో రాముని వద్దకు వచ్చాడు. (12)
మాతలిరువాచ
అయం హర్యశ్వయుగ్ జైత్రో మఘోనః స్యందనోత్తమః ।
అనేన శక్రః కాకుత్ స్థ సమరే దైత్యదానవాన్ ॥ 13
శతశః పురుషవ్యాఘ్ర రథోదారేణ జఘ్నివాన్ ।
తదనేన వరవ్యాఘ్ర మయా యత్తేన సంయుగే ॥ 14
స్యందనేన జహి క్షిప్రం రావణం మా చిరం కృథాః ।
మాతలి అంటున్నాడు - "పురుషశ్రేష్ఠా! రామా! ఆకు పచ్చని గుఱ్ఱాలతో విజయాన్ని సాధించే ఈ ఉత్తమమైన రథం ఇంద్రునిది. ఈ రథంతోనే ఇంద్రుడు యుద్ధంలో వందలకొద్దీ దైత్యదానవులను సంహరించాడు. కాబట్టి నరవరా! నేను నడిపే ఈ రథంతో యుద్ధంలో రావణుని వెంటనే చంపు. ఆలస్యం చేయకు". (13,14 1/2)
ఇత్యుక్తో రాఘవస్తథ్యం వచోఽశంకత మాతలేః ॥ 15
మాయైషా రాక్షసస్యేతి తమువాచ విభీషణః ।
నేయం మాయా వరవ్యాఘ్ర రావణస్య దురాత్మనః ॥ 16
మాతలి ఇలా అనగానే రాఘవుడు అతని మాటలను "ఇది రాక్షసమాయ" అని శంకించాడు. కాని విభీషణుడు అతనితో - "నరోత్తమా! ఇది దుర్మార్గుడైన రావణుని మాయ కాదు. (15,16)
తదాతిష్ఠ రథం శీఘ్రమ్ ఇమమైంద్రం మహాద్యుతే ।
తతః ప్రహృష్టః కాకుత్ స్థః తథేత్యుక్త్వా విభీషణమ్ ॥ 17
రథేనాభిపపాతాథ దశగ్రీవం రుషాన్వితః ।
మహాద్యుతీ! ఈ ఇంద్ర రథాన్ని శీఘ్రంగా అధిరోహించు" అన్నాడు. అంతట ప్రసన్నచిత్తుడై రాఘవుడు విభీషణునితో సరే అని చెప్పి రథం ఎక్కి రోషానిష్టుడైన దశగ్రీవుని ఎదిరించాడు. (17 1/2)
హాహాకృతాని భూతాని రావణే సమభిద్రుతే ॥ 18
సింహనాదాః సపటహాః దివి దివ్యాస్తథానదన్ ।
దశకంధరరాజసూన్వోః తథా యుద్ధనుభూన్మహత్ ॥ 19
శ్రీరాముడు రావణుని ఎదుర్కొగానే ప్రాణులన్నీ "హాహా" కారాలు చేశాయి. స్వర్గంలో దేవతల సింహనాదాలు, భేరీనాదాలు హోరెత్తాయి. అప్పుడు దశగ్రీవునికి, రాజకుమారుడైన శ్రీరామునికి మధ్యఘోరమైన యుద్ధం జరిగింది. (18,19)
అలబ్ధోపమమన్యత్ర తయోరేవ తథాభవత్ ।
స రామాయ మహాఘోరం విససర్జ విశాచరః ॥ 20
శూలమింద్రాశనిప్రఖ్యం బ్రహ్మదండమివోద్యతమ్ ।
తచ్ఛూలం పత్వరం రామః చిచ్ఛేద విశితైః శరైః ॥ 21
లోకంలో పోల్చడానికి వీలు లేని యుద్ధం వారిమధ్య జరిగింది. నిశాచరుడైన రావణుడు ఇంద్రుని వజ్రాయుధంలా ఎత్తబడిన బ్రహ్మదండంలా భయంకరమైన శూలాన్ని విసిరాడు. కాని రాముడు వెంటనే దానిని వాడి బాణాలతో ఖండించి వేశాడు. (20,21)
తద్ దృష్ట్వా దుష్కరం కర్మ రావణం భయమానిశత్ ।
తతః క్రుద్ధః ససర్జాశు దశగ్రీవః శితాన్ శరాన్ ॥ 22
దుష్కరమైన ఆ కార్యాన్ని చూచి రావణునికి మనసులో భయం కలిగింది. అయినా కుపితుడై వాడి బాణాలను కురిపించాడు. (22)
సహస్రాయుతశో రామే శస్త్రాణి వివిధాని చ ।
తతో భుశుండీః శూలాని ముసలాని పరశ్వధాన్ ॥ 23
శక్తీశ్చ వివిధాకారాః శతఘ్నీశ్చ శితాన్ క్షురాన్ ।
అప్పుడు రామునిపై భుశుండులు, శూలాలు, ముసలాలు, గండ్రగొడ్డళ్లు, శక్తులు, వివిధాకృతులు కల శతఘ్నులు, వాడి అయిన బాణాలు ఇలా రకరకాల ఆయుధాలు వేలుగా లక్షలుగా కురిశాయి. (23 1/2)
తాం మాయాం వికృతాం దృష్ట్వా దశగ్రీవస్య రక్షసః ॥ 24
భయాత్ ప్రదుద్రువుః సర్వే వానరాః సర్వతోదిశమ్ ।
రాక్షసుడైన దశగ్రీవునియొక్క ఆ వికృతమైన మాయను చూచి వానరులందరూ భయంతో అన్ని దిక్కులకు పరుగులు తీశారు. (24 1/2)
తతః సుపత్రం సుముఖం హేమపుంఖం శరోత్తమమ్ ॥ 25
తూణాదాదాయ కాకుత్ స్థః బ్రహ్మాస్త్రేణ యుయోజ హ ।
తం బాణవర్యం రామేణ బ్రహ్మాస్త్రేణానుమంత్రితమ్ ॥ 26
జహృషుర్ధేవగంధర్వా దృష్ట్వా శక్రపురోగమాః ।
అల్పావశేషమాయుశ్చ తతోఽమన్యంత రక్షసః ॥ 27
బ్రహ్మాస్త్రోదీరణాచ్ఛత్రోః దేవదానవకిన్నరాః ।
అంతట రాముడు బంగారుపుంఖం, చక్కని ములికి మంచి పత్రం కల శ్రేష్ఠమైన బాణాన్ని అమ్ములపొది నుండి తీసి బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించాడు. అది చూచి ఇంద్రుడు మొదలైన దేవతలు, గంధర్వులు మిక్కిలి సంతోషించారి. తన శత్రువైన ఆ రాక్షసునిపై రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టడం వలన అతని ఆయువు ఇక కొద్దిసేపు మాత్రమే అని వారంతా భావించారు. (25-27 1/2)
తతః ససర్జ తం రామః శరమప్రతిమౌజసమ్ ॥ 28
రావణాంతకరం ఘోరం బ్రహ్మదండమివోద్యతమ్ ।
అనంతరం రాముడు ఎత్తబడిన బ్రహ్మదండంలా భయంకరంగా ఉన్న, సాటిలేని తేజస్సు కలిగి రావణుని అంతమొందించగల ఆ బాణాన్ని రావణునిపైకి వదిలాడు. (28 1/2)
ముక్తమాత్రేణ రామేణ దూరాకృష్టేన భారత ॥ 29
స తేన రాక్షస శ్రేష్ఠః సరథ సాశ్వసారథిః ।
ప్రజజ్వాల మహాజ్వాలేనాగ్నినాభిపరిప్లుతః ॥ 30
యుధిష్ఠిరా! రాముడు వింటిని బాగా లాగి బాణాన్ని వేయగానే రాక్షసశ్రేష్ఠుడైన రావణుడు ఆ బాణం తగిలి రథంతో, గుర్రాలతో, సారథితో చెలరేగుతున్న మంటలు గల అగ్ని చుట్టుముట్టి కాలిపోయాడు. (29,30)
తతః ప్రహృష్టాస్త్రిదశాః సహగంధర్వచారణాః ।
నిహతం రావణం దృష్ట్వా రామేణాక్లిష్టకర్మణా ॥ 31
సునాయాసంగా పనులు చేయగల రాముడు ఈ రీతిగా రావణుని సంహరించగానే గంధర్వులతో చారణులతో సహితంగా దేవతలందరూ మిక్కిలి సంతోషించారు. (31)
తత్యజుస్తం మహాభాగం పంచ భూతాని రావణమ్ ।
భ్రంశితః సర్వలోకేభ్యః స హి బ్రహ్మాస్త్రతేజసా ॥ 32
మహాభాగుడైన ఆ రావణుని పంచభూతాలు వదిలివేశాయి. బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వలన అతడు అన్నిలోకాల నుండి భ్రష్టుడైపోయాడు. (32)
శరీరధాతవో హ్యస్య మాంసం రుధిరమేవ చ ।
నేశుర్ర్బహ్మాస్త్రనిర్దగ్ధాః న చ భస్మాప్యదృశ్యత ॥ 33
అతని శరీరంలోని ధాతువులు, మాంసం, రక్తం కూడా బ్రహ్మాస్త్రం చేత దగ్ధమై నశించిపోయాయి. చివరికి బూడిద కూడా కనపడలేదు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి రావణవధే నవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 290 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున రావణవధ అను రెండువందల తొంబదియవ అధ్యాయము. (290)