302. మూడువందల రెండవ అధ్యాయము

దేవేంద్రుని నుండి శక్తిని గ్రహించి కవచకుండలముల నిచ్చుటకు కర్ణుడు అంగీకరించుట.

కర్ణ ఉవాచ
భగవంతమహం భక్తః యథా మాం వేత్థ గోపతే ।
తథా పరమతిగ్మాంశో నాస్త్యదేయం కథంచన ॥ 1
కర్ణుడిలా అన్నాడు.
సూర్యదేవా! నేను తమ భక్తుడను. అది తమరెరిగినదే. ప్రచండ కిరణా! తమకివ్వరానిది ఏ రీతిగానూ నా దగ్గరలేదు. (1)
న మే దారా న మే పుత్రా న చాత్మా సుహృదో న చ ।
తథేష్టా వై సదా భక్త్యా యథా త్వం గోపతే మమ ॥ 2
సూర్యదేవా! నాకు భార్యకానీ, పిల్లలుకానీ, మిత్రులు కానీ, నా శరీరం కానీ తమవలె ఇష్టమైనవి కావు. నా భక్తికి సదా ఆశ్రయస్థానం తమరే. (2)
ఇష్టానాం చ మహాత్మానః భక్తానాం చ న సంశయః ।
కుర్వంతి భక్తిమిష్టాం చ జానీషే త్వం చ భాస్కర ॥ 3
భాస్కరా! మహాత్ములు తమ ప్రియభక్తులమీద ప్రీతిని ప్రదర్శిస్తారు. ఇందులో సందేహంలేదు. ఇది తమరెరుగనిదీ కాదు. (3)
ఇష్టో భక్తశ్చ మే కర్ణః న చాన్యద్ దైవతం దివి ।
జానీత ఇతి వై కృత్వా భగవానాహ మద్ధితమ్ ॥ 4
కర్ణుడు నా ప్రియభక్తుడు. స్వర్గలోకంలో కూడా అతనికి మరొక దేవుడు లేడు అని తెలిసియేగా తమరు నా మేలుకోరి చెప్తున్నది. (4)
భూయశ్చ శిరసా యాచే ప్రసాద్య చ పునః పునః ।
ఇతి బ్రవీమి తిగ్మాంశో త్వం తు మే క్షంతుమర్హసి ॥ 5
చండకిరణా! మరొకసారి తలవాల్చి, ప్రసన్నులను చేసికొని పలుమార్లు క్షమను కోరుతున్నాను. నేను చెప్పబోవు మాటలకు నన్ను క్షమించాలి. (5)
బిభేమి న తథా మృత్యోః యథా బిభ్యేఽనృతాదహమ్ ।
విశేషేణ ద్విజాతీనాం సర్వేషాం సర్వదా సతామ్ ॥ 6
ప్రదానే జీవితస్యాపి న మేఽత్రాస్తి విచారణా ।
నేను అసత్యానికి భయపడినట్లు మృత్యువుకు కూడా భయపడను. విశేషించి ఎల్లప్పుడూ సజ్జనులయిన విప్రుల కందరకూ భయపడతాను. వారికై ప్రాణాలనివ్వవలసి వచ్చినా నేను ఆలోచించను. (6 1/2)
యచ్చ మామాత్థ దేవ త్వం పాండవం ఫాల్గునం ప్రతి ॥ 7
వ్యేతు సంతాపజం దుఃఖం తవ భాస్కర మానసమ్ ।
అర్జునప్రతిమం చైవ విజేష్యామి రణేఽర్జునమ్ ॥ 8
దేవా! తమరు అర్జునుని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. భాస్కరా! సంతాపం వలన ఏర్పడిన మనోదుఃఖాన్ని తొలగించుకోండి. కార్తవీర్యుని వంటి పరాక్రమం గల అర్జునుని అయినా యుద్ధంలో గెలుస్తాను. (7,8)
తవాపి విదితం దేవ మమాప్యస్త్రబలం మహత్ ।
జామదగ్న్యాదుపాత్తం యత్ తథా ద్రోణాన్మహాత్మనః ॥ 9
దేవా! నా దగ్గరున్న అస్త్రబలమెంతో తమకు తెలుసు. పరశురాముని నుండి, మహాత్ముడైన ద్రోణుని నుండి అస్త్రవిద్యాబలాన్ని పొందాను. (9)
ఇదం త్వమనుజానీహి సురశ్రేష్ఠ వ్రతం మమ ।
భిక్షతే వజ్రిణే దద్యామ్ అపి జీవితమాత్మనః ॥ 10
సురోత్తమా! నా వ్రతాన్ని కొనసాగించటానికి అనుమతించండి. ఇంద్రుడు యాచిస్తే నా జీవితాన్ని అయినా ఇస్తాను. (10)
సూర్య ఉవాచ
యది తాత దదాస్యేతే వజ్రిణే కుండలే శుభే ।
త్వమప్యేనమథో బ్రూయాః విజయార్థం మహాబలమ్ ॥ 11
నియమేన ప్రదద్యాం తే కుండలే వై శతక్రతో ।
సూర్యుడిలా అన్నాడు -
నాయనా! శుభప్రదాలైన కుండలాలను ఇంద్రునకు ఇవ్వాలనే నిర్ణయమైతే, నీ గెలుపుకోసం, మహాబలుడయిన ఇంద్రునితో ఒకనియమం మేరకు కుండలాలను ఇస్తానని చెప్పు. (11 1/2)
అవధ్యో హ్యసి భూతానాం కుండలాభ్యాం సమన్వితః ॥ 12
అర్జునేన వినాశం హి తవ దానవసూదనః ।
ప్రార్థయానో రణే వత్స కుండలే తే జిహీర్షతి ॥
కుండలాలు ధరించిన నిన్ను ఏ ప్రాణికూడా చంపలేదు. నాయనా! దేవేంద్రుడు అర్జునుడి ద్వారా యుద్ధంలో నిన్ను చంపించగోరి నీ కుండలాలను అపహరించదలచాడు. (12,13)
స త్వమప్యేనమారాధ్య సూనృతాభిః పునః పునః ।
అభ్యర్థయేథా దేవేశమ్ అమోఘార్థః పురందరమ్ ॥ 14
కాబట్టి నీవు పదే పదే మంచి మాటలతో దేవేంద్రుని ఆరాధించి, ఆ పురందరుని నుండి అమోఘశక్తిని అభ్యర్థించు. (14)
అమోఘాం దేహి మే శక్తిమ్ అమిత్రవినిబర్హిణీమ్ ।
దాస్యామి తే సహస్రాక్ష కుండలే వర్మ చోత్తమమ్ ॥ 15
సహస్రాక్షా! నాకు శత్రుసంహారం చేయగల అమోఘశక్తినిస్తే కుండలాలను ఉత్తమకవచాన్ని ఇస్తాను. (15)
ఇత్యేవ నియమేన త్వం దద్యాః శక్రాయ కుండలే ।
తయా త్వం కర్ణ సంగ్రామే హనిష్యసి రణే రిపూన్ ॥ 16
ఆ నియమంతోనే నీవు దేవేంద్రునకు కుండలాల నిమ్ము. కర్ణా! ఆ శక్తితో నీవు రణరంగంలో శత్రువులను చంపవచ్చు. (16)
నాహత్వా హి మహాబాహో శత్రూనేతి కరం పునః ।
సా శక్తిర్దేవరాజస్య శతశోఽథ సహస్రశః ॥ 17
మహాబాహూ దేవేంద్రుడు ఇచ్చే ఆ శక్తి వందలు, వేలుకొలదిగ శత్రువులను చంపకుండా తిరిగి నీ చేతికి రాదు. (17)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా సహస్రాంశుః సహసాంతరధీయత ।
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ రీతిగా చెప్పి సూర్యుడు వెంటనే అదృశ్యమయ్యాడు. (17 1/2)
(కర్ణస్తు బుబుధే రాజన్ స్వప్నాంతే ప్రవదన్నివ ।
ప్రతిబద్ధస్తు రాధేయః స్వప్నం సంచింత్య భారత ॥
చకార నిశ్చయం రాజన్ శక్తర్థ్యం వదతాం వరః ।
యది మామింద్ర ఆయాతి కుండలార్థం పరంతపః ॥
శక్త్యా తస్మై ప్రదాస్యామి కుండలే వర్మ చైవ హ ।
స కృత్వా ప్రాతరుత్థాయ కార్యాణి భరతర్షభ ॥
బ్రాహ్మణాన్ వాచయిత్వాథ యథాకార్యముపాక్రమత్ ।
విధినా రాజశార్దూల ముహూర్తమజపత్ తతః ॥)
రాజా! కల చెదిరిపోగానే కర్ణుడు పలవరిస్తూ మేలొన్నాడు. భారతా! మేల్కొన్న తర్వాత వాగ్మి అయిన రాధేయుడు ఆలోచించి శక్తికి సంబంధించి ఇలా నిర్ణయించుకొన్నాడు. "పరంతపుడైన ఇంద్రుడు నా దగ్గరకు కుండలాలు కోరివస్తే శక్తికి బదులుగానే కుండలాలను, కవచాన్ని ఇస్తాను." భరతశ్రేష్ఠా తెల్లవారి లేచి ప్రాతఃకాల కృత్యాలు ముగించి బ్రాహ్మణుల స్వస్తివచనాలు స్వీకరించి సమయోచితకార్యాలు శాస్త్రోక్తంగా ముగించాడు. రాజశార్దూలా! ఆ పై రెండుఘడియలు జపం చేశాడు.
తతః సూర్యాయ జప్యాంతే కర్ణః స్వప్నం న్యవేదయత్ ॥ 18
యథాదృష్టం యథాతత్త్వం యథోక్తముభయోర్నిశి ।
తత్ సర్వమానుపూర్వ్యేణ శశంసాస్మై వృషస్తదా ॥ 19
జపావసానంలో కర్ణుడు తన కలను సూర్యునకు నివేదించాడు. తాను చూసినదీ, ఆ రాత్రి తామిరువురూ మాటాడుకొన్నదీ అంతా యథాతథంగా, యథాక్రమంగా కర్ణుడు సూర్యునకు చెప్పాడు. (18,19)
తచ్ఛ్రుత్వా భగవాన్ దేవః భానుః స్వర్భానుసూదనః ।
ఉవాచ తం తథేత్యేవ కర్ణం సూర్యః స్మయన్నివ ॥ 20
అది విని రాహునిహంత అయిన సూర్యభగవానుడు నవ్వుతూ 'అదంతా సత్యమే' అని కర్ణునితో అన్నాడు. (20)
తతస్తత్త్వమితి జ్ఞాత్వా రాధేయః పరవీరహా ।
శక్తిమేవాభికాంక్షన్ వై వాసవం ప్రత్యపాలయత్ ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆఫై పరవీరసంహారకుడైన కర్ణుడు అదంతా సత్యమని గ్రహించి శక్తిని అభిలషిస్తూ, దేవేంద్రునికై ఎదురుచూడసాగారు. (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి సూర్యకర్ణసంవాదే ద్వ్యధికత్రిశతతమోఽధ్యాయః ॥ 302 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున సూర్యకర్ణసంవాదమను మూడువందల రెండవ అధ్యాయము. (302)
(దాక్షిణాత్య అధికపాఠం 4 శ్లోకాలతో కలిపి మొత్తం 25 శ్లోకాలు.)