2. రెండవ అధ్యాయము
భీమార్జునులు విరాటనగరములో తాము చేయుపనులను తెలుపుట.
భీమసేన ఉవాచ
పౌరోగవో బ్రువాణోఽహం వల్లవో నామ భారత।
ఉపస్థాస్యామి రాజానం విరాటమితి మే మతిః॥ 1
భీము డిట్లు చెప్పాడు. నేను వంటవాడి ననీ, నా పేరు వల్లవుడనీ చెపుతీ విరాటరాజును చేరాలని నా ఉద్దేశం. (1)
సూపానస్య కరిష్యామి కుశలోఽస్మి మహానసే।
కృతపూర్వాణి యాన్యస్య వ్యంజనాని సుశిక్షితైః॥ 2
తాన్యప్యభిభవిష్యామి ప్రీతిం సంజనయన్నహమ్।
నేను వంటలలో నేర్పరిని. పూర్వం సుశిక్షితు లయిన వారు చేసిన వంటకాలను మించి రుచికరంగా చేసి ఆ విరాటునికి సంతోషం కలిగిస్తాను. (2 1/2)
ఆహరిష్యామి దారూణాం నిచయాన్ మహతోఽపి చ॥ 3
యత్ ప్రేక్ష్య విపులం కర్మ రాజా సంయోక్ష్యతే స మామ్।
అమానుషాణి కుర్వాణః తాని కర్మాణి భారత॥ 4
పెద్దపెద్ద కట్టెలమోపులను సయితం మోసి తీసుకువస్తాను. మానవాతీతాలయిన ఆ పనులు చూసి రాజు అటువంటి పనులకు నన్నే నియోగిస్తాడు. (3,4)
రాజ్ఞస్తస్య పరే ప్రేష్యాః మంస్యంతే మాం యథానృపమ్।
భక్ష్యాన్నరసపానానాం భవిష్యామి తథేశ్వరః॥ 5
ద్విపా వా బలినో రాజన్ వృషభా వా మహాబలాః।
వినిగ్రాహ్యా యది మయా నిగ్రహీష్యామి తానపి॥ 6
రాజసేవకులు విరాటుని రాజు అనుకుంటారు. అలాగే నేను భక్ష్యాన్నాలకూ, రసపానీయాలకూ అధిపతి నవుతాను. బలిష్ఠాలైన ఏనుగుల్ని కానీ, ఎద్దుల్నిగానీ ఎదుర్కొనవలసివస్తే వాటిని ఎదుర్కొంటాను. (5,6)
యే చ కేచి న్నియోత్స్యంతి సమాజేషు నియోదకాః।
తానహం హి నియోత్స్యామి రతిం తస్య వివర్ధయన్॥ 7
మల్లయుద్ధం చేయగోరిన మల్లులు ఎవరయినా వస్తే వారితో నేను యుద్ధం చేసి మహారాజుయొక్క కోరిక తీరుస్తాను, ఉత్సాహం వృద్ధిపరుస్తాను. (7)
న త్వేతాన్ యుద్ధ్యమానాన్ వై హనిష్యామి కథంచన।
తథైతాన్ పాతయిష్యామి యథా యాస్యంతి న క్షయమ్॥ 8
అంతేకాని వారితో యుద్ధం చేస్తూ వారిని చంపను. చనిపోకుండా, ఊపిరిమాత్రం మిగిల్చి పడగొడతాను. (8)
ఆరాలికో గోవికర్తా సూపకర్తా నియోధకః।
ఆసం యుధిష్ఠిరస్యాహమ్ ఇతి వక్ష్యామి పృచ్ఛతః॥ 9
రాజు అడిగితే పూర్వం నేను ధర్మరాజు దగ్గర మత్తగజాలకు మావటీడుగానూ, పొగరుబోతుగిత్తలను విడదీసే వాడిగానూ, వంటచేసేవాడుగానూ, మల్లుని గానూ ఉండేవాడనని చెపుతాను. (9)
ఆత్మానమాత్మనా రక్షన్ చరిష్యామి విశాంపతే।
ఇత్యేతత్ ప్రతిజానామి విహరిష్యామ్యహం యథా॥ 10
మహారాజా! "నన్ను నేను రక్షించుకొంటూ సంచరింపగల" నని తెలిసి సంచరిస్తాను. (10)
యుధిష్ఠిర ఉవాచ
యమగ్నిర్బ్రాహ్మణో భూత్వా సమాగచ్ఛన్నృణాం వరమ్।
దిధక్షుః ఖాండవం దావం దాశార్హసహితం పురా॥ 11
మహాబలం మహాబాహుమ్ అజితం కురునందనమ్।
సోఽయం కిం కర్మ కౌంతేయః కరిష్యతి ధనంజయః॥ 12
ధర్మరాజు ఇట్లు అన్నాడు. అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి కృష్ణసహితుడయిన అర్జునుని ఖాండవవనం దహించటానికి వర మడిగాడు గదా! అటువంటి బలవంతుడూ, ఆజానుబాహువూ జయింపశక్యం కాని వాడూ అయిన అర్జునుడు ఇపుడు విరాటుని దగ్గర ఏ పని చేస్తాడు? (11,12)
యోఽయ మాసాద్య తం దావం తర్పయామాస పావకమ్।
విజిత్యైకరథేనేంద్రం హత్వా పన్నగరాక్షసాన్॥ 13
వాసుకేః సర్పరాజస్య స్వసారం హృతవాంశ్చ యః।
శ్రేష్ఠో యః ప్రతియోధానాం సోఽర్జునః కిం కరిష్యతి॥ 14
నాగులనూ, రాక్షసులనూ చంపి, రథమాత్ర సహాయంతో ఇంద్రుని జయించి, దావాగ్నితో అగ్నిహోత్రుని సంతృప్తిపరచినవాడు అర్జునుడు. సర్పరాజయిన వాసుకి యొక్క చెల్లెలు ఉలూపి(మనసు)ని హరించిన యోధాగ్రేసరుడు అర్జునుడు. ఇపుడు విరాటునికి ఎలా సేవ చేస్తాడు? (13,14)
సూర్యః ప్రతపతాం శ్రేష్ఠః ద్విపదాం బ్రాహ్మణో వరః।
ఆశీవిషశ్చ సర్పాణామ్ అగ్నిస్తేజస్వినాం వరః॥ 15
ఆయుధానాం వరం వజ్రం కకుద్మీ చ గవాం వరః।
హ్రదానాముదధిః శ్రేష్ఠః పర్జన్యో వర్షతాం వరః॥ 16
ధృతరాష్ట్రశ్చ నాగానాం హస్తిష్వైరావణో వరః।
పుత్రః ప్రియాణామధికః భార్యా చ సుహృదాం వరా॥ 17
(గిరీణాం ప్రవరో మేరుః దేవానాం మధుసూదనః।
గ్రహాణాం ప్రవరశ్చంద్రః సరసాం మానసం వరమ్॥)
యథైతాని విశిష్టాని జాత్యాం జాత్యాం వృకోదర।
ఏవం యువా గుడాకేశః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్॥ 18
తపింపజేసే వారిలో సూర్యుడు శ్రేష్ఠుడు. మనుష్యుల్లో బ్రాహ్మణుడూ, సర్పాల్లో అనంతుడూ, తేజస్వులలో అగ్ని, ఆయుధాల్లో వజ్రమూ, గోవులలో మూపురంగల ఎద్దూ, జలాశయాలలో సముద్రమూ, వర్షించేవానిలో మేఘమూ శ్రేష్ఠాలు. అలాగే నాగులలో ధృతరాష్ట్రుడూ, ఏనుగులలో ఐరావతమూ శ్రేష్ఠాలు. ప్రియమైనవారిలో పుత్రుడు అధికుడు. స్నేహితులలో భార్య ఉత్తమురాలు. (పర్వతాల్లో మేరువు శ్రేష్ఠం. దేవతల్లో విష్ణువూ, గ్రహాల్లో చంద్రుడూ, సరస్సులలో మానస సరస్సూ విశిష్ఠాలు) ప్రతీజాతి లోనూ విశిష్టమైనవి ఉన్నట్లే విలుకాండ్రలో అర్జునుడు శ్రేష్ఠుడు. (15-18)
సోఽయ మింద్రాదనవరః వాసుదేవాన్మహాద్యుతిః।
గాండీవధన్వా బీభత్సుః శ్వేతాశ్వః కిం కరిష్యతి॥ 19
వైభవంలో ఇంద్రునికి తీసిపోనివాడూ, కృష్ణునితో సమానమైన తేజస్సుకలవాడూ, గాండీవధారీ, శ్వేతాశ్వుడూ (తెల్లని గుర్రాలు కలవాడు) అయిన అర్జునుడు (ఈ విరాటుని దగ్గర) ఏం చేస్తాడు? (19)
ఉషిత్వా పంచ వర్షాణి సహస్రాక్షస్య వేశ్మని।
అస్త్రయోగం సమాసాద్య స్వవీర్యాన్మానుషాద్భుతమ్॥
దివ్యాన్యస్త్రాణి చాప్తాని దేవరూపేణ భాస్వతా॥ 20
ఇంద్రుని యింట్లో అయిదేళ్ళుండి, మానవులను ఆశ్చర్య పరిచే అస్త్రయోగం తన పరాక్రమంతో పొంది, దేవరూపంతో ప్రకాశిస్తూ దివ్యాస్త్రాలు సాధించాడు అర్జునుడు. (20)
యం మన్యే ద్వాదశం రుద్రమ్ ఆదిత్యానాం త్రయోదశమ్।
వసూనాం నవమం మన్యే గ్రహాణాం దశమం యథా॥ 21
అర్జునుడు రుద్రులలో పన్నెండవవాడు. ఆదిత్యుల్లో పదమూడోవాడు. వసువుల్లో తొమ్మిదోవాడు. అట్లే గ్రహాల్లో పదోవాడు అని అనుకొంటాను. (21)
యస్య బాహూ సమౌ దీర్ఘౌ జ్యాఘాతకఠినత్వచౌ।
దక్షిణే చైవ సవ్యే చ గవామివ వహః కృతః॥ 22
అర్జునుని భుజాలు రెండూ దీర్ఘములై, సమానములై వింటినారిదెబ్బలతో కఠినచర్మం కలిగి ఉంటాయి. అంతేకాదు. రెండు చేతులకూ కిణాలు ఎద్దుమూపురాల వలె ఎత్తుగా ఉంటాయి. (22)
హిమవానివ శైలానాం సముద్రః సరితామివ।
త్రిదశానాం యథా శక్రః వసూనామివ హన్యవాట్॥ 23
మృగాణామివ శార్దూలః గరుడః పతతామివ।
వరః సన్నహ్యమానానాం సోఽర్జునః కిం కరిష్యతి॥ 24
పర్వతాల్లో హిమవంతునిలా, నదుల్లో సముద్రంలా, దేవతలలో ఇంద్రునిలా, అగ్నులలో హవ్యం మోసుకుని వెళ్ళే అగ్నిహోత్రునిలా, మృగాల్లో పెద్దపులిలాగా, పక్షులలో గరుత్మంతునిలాగా, యుద్ధవీరుల్లో అర్జునుడు శ్రేష్ఠుడు. అటువంటి అర్జునుడు విరాటుని దగ్గర ఏవిధంగా సేవచేస్తాడు? (23,24)
అర్జున ఉవాచ
ప్రతిజ్ఞాం షండకోఽస్మీతి కరిష్యామి మహీపతే।
జ్యాఘాతౌ హి మహాంతౌ మే సంవర్తుం నృప దుష్కరౌ॥ 25
వలయైశ్ఛాదయిష్యామి బాహూ కిణకృతావిమౌ।
అపుడు అర్జునుడిలా అన్నాడు. రాజా! రాజ సభలో నేను పేడి నని చెపుతాను. నాచేతుల కిణాంకాలు(వింటినారితో చేతికైన దెబ్బల కాయలు) చాలా పెద్దవి. దాచుకోవటం చాలా కష్టం. చేతులకున్న ఈ కిణాంకాలను గాజులతో దాచుకుంటాను. (25 1/2)
కర్ణయోః ప్రతిముచ్యాహం కుండలే జ్వలనప్రభే॥ 26
పినద్ధకంబుః పాణిభ్యాం తృతీయాం ప్రకృతిం గతః।
వేణీకృతశిరా రాజన్ నామ్నాచైవ బృహన్నలా॥ 27
అగ్నిలా ప్రకాశించే కుండలాలు చెవులనుండి తీసి వేసి చేతులకు శంఖాల గాజులు తొడుగుకొంటాను. తృతీయ ప్రకృతి(పేడితనం) పొందుతాను. శిరోజాలు జడ అల్లుకొని బృహన్నల అని పేరు చెప్పుకొంటాను. (26,27)
పఠన్నాఖ్యాయికా శ్చైవ స్త్రీభావేన పునః పునః।
రమయిష్యే మహీపాలమ్ అన్యాం శ్చాంతఃపురే జనాన్॥ 28
స్త్రీ భావంతో పలుమార్లు ఆఖ్యాయికలు (పూర్వరాజుల చరిత్రలు) పాడుతూ రాజునూ, ఇతర అంతఃపురజనుల్నీ సంతోషపెడతాను. (28)
గీతం నృత్యం విచిత్రం చ వాదిత్రం వివిధం తథా।
శిక్షయిష్యామ్యహం రాజన్ విరాటస్య పురస్త్రియః॥ 29
విరాటుని పురస్త్రీలకు గీతాలూ, విచిత్రమయిన నృత్యమూ, అనేక విధాలయిన వాద్యాలు - వీటిలో శిక్షణ ఇస్తాను. (29)
ప్రజానాం సముదాచారం బహుకర్మకృతం వదన్।
ఛాదయిష్యామి కౌంతేయ మాయయాత్మానమాత్మనా॥ 30
రాజా! బహువిధాలయిన కర్మల సదాచారం ప్రజలకు తెలుపుతూ మాయతో నన్ను నేను గోప్యంగా ఉంచుకొంటాను. (30)
యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యాః పరిచారికా।
ఉషితాస్మీతి వక్ష్యామి పృష్టో రాజ్ఞా చ పాండవ॥ 31
రాజా! రాజు అడిగితే "నేను పూర్వం ధర్మరాజు భవనంలో ద్రౌపదీ దేవికి పరిచారికగా ఉండేదాన్ని" అని చెపుతాను. (31)
ఏతేన విధినా ఛన్నః కృతకేన యథానలః।
విహరిష్యామి రాజేంద్ర విరాటభవనే సుఖమ్॥ 32
రాజా! ఈవిధంగా నివురు గప్పిన నిప్పులాగా విరాటుని అంతఃపురంలోని సుఖంగా సంచరిస్తాను. (32)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణీ పాండవప్రవేశపర్వణి యుధిష్ఠిరాది మంత్రణే ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశపర్వమను ఉపపర్వమున
యుధిష్ఠిరాదుల సమాలోచనము అను ద్వితీయాధ్యాయము. (2)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకము కలిపి మొత్తం 33 శ్లోకములు.)