9. తొమ్మిదవ అధ్యాయము

ద్రౌపది సైరంధ్రివేషములో విరాటుని రాణివాసము చేరుట.

వైశంపాయన ఉవాచ
తతః కేశాన్ సముత్ క్షిప్య వేల్లితాగ్రాననిందితాన్।
కృష్ణాన్ సూక్ష్మాన్ మృదూన్ దీర్ఘాన్ సముద్గ్రథ్య శుచిస్మితా॥ 1
జుగుహే దక్షిణే పార్శ్వే మృదూనసితలోచనా।
వాసశ్చ పరిధాయైకం కృష్ణా సమలినం మహత్॥ 2
కృత్వా వేషం చ నైరంధ్ర్యాః తతో వ్యచరదార్తవత్।
వైశంపాయనుడు చెప్పాడు. తెలినవ్వుతో.. కాటుక కనులుగల ద్రౌపది చిక్కుపడిన, చక్కని, నల్లని, సన్నని, మెత్తని, పొడవైన జుట్టును పైకి ముడికట్టుకొని, కుడివైపునకు మలచుకొన్నది. ఆమె బాగా మాసినచీర కట్టుకొని, సైరంధ్రివేషం దాల్చి కష్టాల్లో ఉన్నదానివలె సంచరిస్తోంది. (1,2)
తాం నరాః పరిధావంతీం స్త్రియశ్చ సముపాద్రవన్॥ 3
అపృచ్ఛంశ్చైవ తాం దృష్ట్వా కా త్వం కిం చ చికీర్షసి।
అలా తిరుగాడుతున్న ద్రౌపదిని నగరంలోని పురుషులూ, స్త్రీలూ సమీపించి 'నీవెవరివి? ఏమి చేయాలనుకుంటున్నావు?' అని అడిగారు. (3)
సా తానువాచ రాజేంద్ర సైరంధ్ర్యహమిహాగతాః॥ 4
కర్మ చేచ్ఛామి వై కర్తుం తస్య యో మాం యుయుక్షతి।
తస్యా రూపేణ వేషేణ శ్లక్ష్ణయా చ తథా గిరా।
న శ్రద్దధత తాం దాసీమ్ అన్నహేతోరుపస్థితామ్॥ 5
రాజేంద్రా! ఆమె వారితో ఇలా అంది. 'నేను సైరంధ్రిగా ఇక్కడకు వచ్చాను. నన్ను నియోగించిన వారు చెప్పిన పనిని చేయాలనుకుంటున్నాను'.
ఆమెయొక్క రూపం, వేషం, నేర్పుగల మాట గమనించి తిండికోసం వచ్చినదాసిగా ఆమెను వారు నమ్మలేకపోయారు. (4,5)
విరాటస్య తు కైకేయీ భార్యా పరమసమ్మతా।
ఆలోకయంతీ దదృశే ప్రాసాదాద్ ద్రుపదాత్మజామ్॥ 6
అపుడు విరాటుని ప్రియమైన భార్య, కేకయ రాజ కుమారి (సుదేష్ణ) మేడపైనుండి ద్రౌపదిని చూసింది. (6)
సా సమీక్ష్య తథారూపామ్ అనాథామేకవాససమ్।
సమూహూయాబ్రవీద్ భద్రే కా త్వం కిం చ చికీర్షసి॥ 7
అటువంటి రూపంతో దిక్కు లేనిదై, ఒకే వస్త్రం ధరించి యున్న ద్రౌపదిని ఆమె పిలిపించి 'కళ్యాణీ! నీవెవరవు? ఏమి చేయాలనుకొంటున్నావు?' అని అడిగింది. (7)
సా తామువాచ రాజేంద్ర సైరంధ్ర్యహముపాగతా।
కర్మచేచ్ఛామ్యహం కర్తుం తస్య యో మాం యుయుక్షతి॥ 8
రాజేంద్రా! అపుడు ద్రౌపది ఆమెతో ఇలా అంది. 'నేను సైరంధ్రిని. నన్ను పనిలో నియోగించిన వారిపనులు చేయాలనుకొంటున్నాను'. (8)
సుదేష్ణోవాచ
నైవంరూపా భవంత్యేవ యథా వదసి భామిని।
ప్రేషయంతీవ వై దాసీః దాసాంశ్చ వివిధాన్ బహూన్॥ 9
సుదేష్ణ అన్నది. 'భామినీ! నీవు చెప్పినట్లు నీ రూపం లేదు. ఇట్టి రూపం కలది సైరంధ్రి కాజాలదు. అనేక దాసదాసీ జనులకు పని చెప్పేటట్ట్లు నీ వున్నావు. (9)
నోచ్చగుల్ఫా సంహతోరుః త్రిగంభీరా షడున్నతా।
రక్తా పంచసు రక్తేషు హంసగద్గదభాషిణీ॥ 10
సుకేశీ సుస్తనీ శ్యామా పీనశ్రోణిపయోధరా।
తేన తేనైవ సంపన్నా కాశ్మీరివ తురంగమీ॥ 11
అరాలపక్ష్మనయనా బింబోష్ఠీ తనుమధ్యమా।
కంబుగ్రీవా గూఢశిరా పూర్ణచంద్రనిభావనా॥ 12
ఎత్తైనమడమలు లేకుండా ఒరసిన తొడలు, లోతైన నాభి, వాక్కు, బుద్ధి కల్గి ఉన్నావు. ముక్కు, చెవి, కళ్లు, స్తనాలు, గోళ్లు, పెడతల అనే ఆరూ ఉన్నతంగా ఉన్నాయి. అరచేతులు అరికాళ్లు, కనుకొలకులు, పెదవి, నాలుక, గోళ్లు ఐదూ ఎఱ్ఱగా ఉన్నాయి. హంసవలె గద్గదస్వరం ఉంది. చక్కని కేశాలు, చక్కని స్తనాలు కల్గి ఉన్నావు. నల్లని శరీరఛాయ కల్గి బలిసిన పిరుదులూ, స్తనాలు కల్గి ఉన్నావు. కాశ్మీరదేశపు గుఱ్ఱంవలె మంచి లక్షణాలు కల్గి, వంపుతిరిగిన కనుబొమలుగల నేత్రాలు, దొండపండువంటి ఎఱ్ఱని పెదవి, సన్నని నడుము, శంఖంవంటి కంఠం, బయటకు కనబడని నాడులు, పున్నమిచంద్రునివంటి ముఖమూ కల్గిన నీవు సైరంధ్రివి కాజాలవు. (10-12)
వి॥సం॥ త్రిగంభీరా = గంభీరమైన (లోతైన) స్వరం, సత్త్వం, నాభి గలది. 'నాభిః స్వరం సత్త్వమభిప్రశస్తం గంభీర మేత త్త్రితయం నరాణామ్' అని సాముద్రికశాస్త్రం. స్వరం, సత్త్వం, నాభి లోతుగా
ఉండటం ప్రశస్తం.
హంసగద్గద భాషిణీ = హంసివలె గద్గదంగా మాటాడునది.
గద్గద శబ్దానికి మధురంగ, కొంచెం గంభీరంగా అని అర్థం. (అర్జు)
వాక్యం గంభీరమధురం హంసగద్గదముచ్యతే(చతు)
మధురంగా, గంభీరంగా మాటాడటాన్ని హంసగద్గదమంటారు. (విరో)
హంసీచైవోచ్యతే వీణా గద్గదాస్తత్ర తంతవః।
సప్తస్వరసమాయోగాద్ధంసగద్గదభాషిణీ॥
హంసి అనగా వీణ. దాని తంత్రులే గద్గదాలు. సప్తస్వరాలను మేళవించి మాటాడగలగటం హంసగద్గదభాషణం. (విష)
త్రిగంభీరా = నాభి, రెండుచెవులు లోతుగా గలది. (లక్షా)
శారదోత్పలపత్రాక్ష్యా శారదోత్పలగంధయా।
శారదోత్పలసేవిన్యా రూపేణ సదృశీ శ్రియా॥ 13
శరత్కాలపు కలువరేకులవంటి కన్నులూ, పరిమళమూ ఆ కలువలతో సేవించిన లక్ష్మీతో సమానరూపమూ కల నీవు దాసివి కాజాలవు. (13)
కా త్వం బ్రూహి యథా భద్రే నాసి దాసీ కథంచన।
యక్షీ వా యది వా దేవీ గంధర్వీ యది వాప్సరాః॥ 14
దేవకన్యా భుజంగీ వా నగరస్యాథ దేవతా।
విద్యాధరి కిన్నరీ వా యది వా రోహిణీ స్వయమ్॥ 15
కళ్యాణీ! నీవెవరు? నిజం చెప్పు. ఎలాగైనా నీవు దాసివి కాజాలవు. యక్షకన్యవా? దేవతవా? గంధర్వ యువతివా? అప్సరసవా?
నీవు దేవకన్యవా? నాగకన్యవా? లేక ఈ నగరదేవతవా? విద్యాధరివా? కిన్నరివా? లేక సాక్షాత్తు రోహిణివా? (14,15)
అలంబుషా మిశ్రకేశీ పుండరికాథ మాలినీ।
ఇంద్రాణి వారుణీ వా త్వం త్వష్టుర్ధాతుః ప్రజాపతేః।
దేవ్యో దేవేషు విఖ్యాతాః తాసాం త్వం కతమా శుభే॥ 16
నీవు అలంబుసవా, మిశ్రకేశివా, పుండరీకవా, మాలినివా,(వీరు అప్సరసలు) ఇంద్రాణివా? లేక వరుణుని భార్యవా? విశ్వకర్మ భార్యవా? ధాత భార్యవా, ప్రజాపతి భార్యవా? ఎవరు నీవు? (16)
ద్రౌపద్యువాచ
నాస్మి దేవీ న గంధర్వీ నాసురీ న చ రాక్షసీ।
సైరంధ్రీ చ భుజిష్యాస్మి సత్యమేతద్ బ్రవీమి తే॥ 17
ద్రౌపది చెప్పింది. 'నేను దేవతాస్త్రీని కాను. గంధర్వస్త్రీని కాను. ఆసురస్త్రీని కాను. రాక్షసస్త్రీని కూడా కాను. నేను సేవచేసి జీవించే సైరంధ్రిని. నేను నీకు నిజం చెపుతున్నాను. (17)
వి॥సం॥ భుజిష్య-సజ్జనరక్షకురాలు. (విష)
కేశాన్ జానామ్యహం కర్తుం పింషే సాధు విలేపనమ్।
మల్లికోత్పలపద్మానాం చంపకానాం తథా శుభే॥ 18
గ్రథయిష్యే విచిత్రాశ్చ స్రజః పరమశోభనాః।
గంధాదివిలేపనాలు బాగా తయారుచేసి పూయ గలను. కేశాలను బాగా అలంకరించడం ఎరుగుదును. మల్లికలు, కలువలు, పద్మాలు, చంపకాలు, వీటిదండలు చిత్రవిచిత్రంగా అందంగా కూర్చగలను. (18 1/2)
ఆరాధయం సత్యభామాం కృష్ణస్య మహిషీం ప్రియామ్॥ 19
కృష్ణాం చ భార్యాం పాండూనాం కురూణామేకసుందరీమ్।
శ్రీకృష్ణుని ప్రియమయిన పట్టమహిషి సత్యభామను సేవించాను. కురువంశజులలో పాండవులభార్య, మిక్కిలి సౌందర్యవతి అయిన ద్రౌపదిని సేవించాను. (19 1/2)
తత్ర తత్ర చరామ్యేవం లభమానా సుభోజనమ్॥ 20
వాసాంసి యావంతి లభే తావత్ తావద్ రమే తథా।
మాలినీత్యేవ మే నామ స్వయం దేవీ చకార సా।
సాహమద్యాగతా దేవి సుదేష్ణే త్వన్నివేశనమ్॥ 21
ఇలా అక్కడక్కడ తిరుగుతూ, మంచిభోజనం, వస్త్రాలు లభించినంతకాలం అక్కడే ఆనందించేదాన్ని. ద్రౌపదీదేవి స్వయంగా 'మాలిని' అని నాకు పేరు పెట్టింది. సుదేష్ణాదేవీ! అటువంటి నేను ఇపుడు నీమందిరానికి వచ్చాను'. (20,21)
సుదేష్ణోవాచ
మూర్ధ్ని త్వాం వాసయేయం వై సంశయా మే న విద్యతే।
న చేదిచ్ఛతి రాజా త్వాం గచ్ఛేత్ సర్వేణ చేతసా॥ 22
సుదేష్ణ పలికింది. 'నిన్ను నా నెత్తిన పెట్టుకొంటాను. నాకెట్టి సందేహం లేదు. కాని రాజు తన మనసంతా నీమీద పెట్టి నిన్ను కోరకుండా ఉంటే నీవు ఇచట ఉండవచ్చు. (22)
స్త్రియో రాజకులే యాశ్చ యాశ్చేమా మమ వేశ్మని।
ప్రసక్తాస్త్వాం నిరీక్షంతే పుమాంసం కం న మోహయేః॥ 23
ఈ రాజకులంలో స్త్రీలు, ఈ నా మందిరంలో స్త్రీలూ నిన్నే ఆసక్తితో చూస్తున్నారు. ఇక పురుషుని మోహింపజేయకుంటావా? (23)
వి॥సం॥ ప్రసక్తాః = ఏకాగ్రతగలవారై (చతు)
వృక్షాంశ్చవస్థితాన్ పశ్య
య ఇమే మమ వేస్మని।
తేఽపి త్వాం సంవమంతీవ
పుమాంసం కం న మోహయేః॥ 24
నాయింట్లో ఈవృక్షాలను చూడు. అవి కూడా నిన్ను చూడటానికి వంగుతున్నట్టున్నాయి. ఇక ఏ పురుషుణ్ణి నీవు మోహింప జేయవు/ (24)
రాజా విరాటః సుశ్రోణి దృష్ట్వా వపురమానుషమ్।
విహాయ మాం వరారోహే గచ్ఛేత్ సర్వేణ చేతసా॥ 25
సుశ్రోణీ వరారోహా! మారాజు విరాటుడు మానవులలో లభ్యంకాని అందమైన నీశరీరం చూసి నన్ను వదలి నిండుమనస్సుతో నిన్ను కోరుతాడేమో! (25)
వి॥తె॥ తెలుగులో తిక్కన "విను నీరూపము చూచి మా నృపతి యువ్విళ్లూరు" అని వ్రాశాడు. (91-321)
యం హి త్వమనవద్యాంగి తరలాయతలోచనే।
ప్రసక్తమభివీక్షేథాః స కామవశగో భవేత్॥ 26
దోషంలేని శరీరసౌష్టవం నీది., చంచలములూ, విశాలములూ అయిన కళ్లతో నీవు చూస్తే ఏ పురుషుడైనా కామానికి వశం కావలసినదే. (26)
యశ్చ త్వాం సతతం పశ్యేత్ పురుషశ్చారుహాసిని।
ఏవం సర్వానవద్యాంగి స చానంగవశో భవేత్॥ 27
అందమైన నవ్వు, చక్కని శరీరసౌష్ఠవం కల నిన్ను ఎవరు చూసినా మన్మథునికి వశం కావలసిందే. (27)
అధ్యారోహేద్ యథా వృక్షాన్ వధాయైవాత్మనో నరః।
రాజవేశ్మని తే సుభ్రు గృహే తు స్యాత్ తథా మమ॥ 28
అందమైన కనుబొమలు కలదానా! తనచావుకోరి తానే వృక్షాలెక్కేవాడిలాగా ఈ నా రాజభవనంలో నిన్ను ఉంచుకొనడం నాకు కష్టం కలిగిస్తుంది. (28)
వి॥సం॥ తన్ను చంపే శత్రువున్న చెట్టే ఎక్కినవాడివలె. (లక్షా)
యథా చ కర్కటీ గర్భమ్ ఆధత్తే మృత్యుమాత్మనః।
తథావిధమహం మన్యే వాసం తవ శుచిస్మితే॥ 29
తెలినవ్వు కలదానా! కర్కటి(ఆడుపీత) తనకు చావు తెచ్చే గర్భం ధరించినట్లు నీవిచట ఉండటం మాకు మృత్యువు అవుతుంది.' (29)
ద్రౌపద్యువాచ
నాస్మి లభ్యా విరాటేన న చాన్యేన కదాచన।
గంధర్వాః పతయో మహ్యం యువానః పంచ భామిని॥ 30
ద్రౌపది అన్నది. 'భామినీ! నేను విరాటునిచేగాని, వేరొకనిచే గాని ఎప్పుడును పొందశక్యం కానిదాన్ని. నాకు యువకులయిన గంధర్వులు అయిదుగురు పతులున్నారు. (30)
వి॥సం॥ గంధర్వులు = భూమిని ధరించువారు. కోపించినపుడు భూమిని హింసించువారు. (విష)
పుత్రా గంధర్వరాజస్య మహాసత్త్వస్య కస్యచిత్।
రక్షంతి తే చ మాం నిత్యం దుఃఖాచారా తథాహ్యహమ్॥ 31
బలవంతుడైన ఒకానొక గంధర్వరాజుయొక్క కుమారులు నిత్యం నన్ను రక్షిస్తారు. నేను కఠినమయిన నియమం కలదానను. (31)
వి॥సం॥ గంధర్వరాజస్య = గంధర్వుని వంటి రాజు = పాండు రాజు, ఆయన కుమారులు. (నీల)
యో మే న దద్యాదుచ్ఛిష్టం న చ పాదౌ ప్రధావయేత్।
ప్రీణేరంస్తేన వాసేన గంధర్వాః పతయో మమ॥ 32
నాకు ఎంగిళి పదార్థం పెట్టరాదు. పాదాలు ఒత్తు మని చెప్పరాదు. అటువంటివారిదగ్గర నేను నివసిస్తే నాగంధర్వపతులు సంతోషిస్తారు. (32)
యో హి మాం పురుషో గృద్ధ్యేత్ యథావ్యాః ప్రాకృతాః స్త్రియః।
తామేవ నివసేద్ రాత్రిం ప్రవిశ్య చ పరాం తనుమ్॥ 33
ఇతర(సాధారణ) స్త్రీలనువలె నన్ను కోరితే వాడు ఆ రాత్రే మరో శరీరంలో ప్రవేశించవలసిందే. (ఈ శరీరం విడుస్తాడని అర్థం) (33)
న చాప్యహం చాలయితుం శక్యా కేనవిదంగనే।
దుఃఖశీలా హి గంధర్వాః తే చ మే బలినః ప్రియాః॥ 34
ప్రచ్ఛన్నాశ్చాపి రక్షంతి తే మాం నిత్యం శుచిస్మితే।
అమ్మా! నన్ను నాధర్మంనుండి ఎవరూ చలింప జేయలేరు. ఇపుడు కష్టాలలో ఉన్నా, బలవంతులయిన నాగంధర్వప్రియులు చాటుగా ఉండి నన్ను నిత్యమూ రక్షిస్తూ ఉంటారు.' (34 1/2)
వి॥తె॥ "దుఃఖశీలా హి గంధర్వాః రక్షంతి" అని సంగ్రహంగా వ్యాసుడు చెపితే తిక్కన 'సంధుల సంధులెడలించి చంపుదురు' అని భవిష్యత్ కీచకవధను సూచిస్తూ చెప్పాడు.
సుదేష్ణోవాచ
ఏవం త్వాం వాసయిష్యామి యథా త్వం నందినీచ్ఛసి॥ 35
న చ పాదౌ న చోచ్ఛిష్టం స్పృక్ష్యసి త్వం కథంచన।
సుదేష్ణ అంది.'ఆనందదాయినీ! అయితే నీవు కోరినట్లే ఇక్కడ ఉంచవచ్చు. పాదాలు కాని, ఎంగిలి గాని నీవు తాకనవసరంలేదు.' (35 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవం కృష్ణా విరాటస్య భార్యయా పరిస్యాంత్వితా॥ 36
ఉవాస నగరే తస్మిన్ అతిధర్మవతీ సతీ।
వైశంపాయసుడు చెప్పాడు. 'ద్రౌపది ఇలా విరాటుని భార్యచే ఓదార్పబడి పతివ్రతా ధర్మం ఆచరిస్తూ ఆ నగరంలో నివసించింది. (36 1/2)
న చైనాం వేద తత్రాన్యః తత్త్వేన జనమేజయ॥ 37
జనమేజయా! ఆమెను గూర్చిన యథార్థం అక్కడ ఎవరూ తెలుసుకోలేకపోయారు.' (37)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవపర్వేశ పర్వణి ద్రౌపదీ ప్రవేశో నామ నవమోఽధ్యాయః॥ 9 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవప్రవేశ పర్వమను ఉపపర్వమున ద్రౌపదీప్రవేశమను తొమ్మిదవ అధ్యాయము. (9)