22. ఇరువది రెండవ అధ్యాయము

భీమకీచకుల యుద్ధము, కీచకవధ.

భీమసేన ఉవాచ
తథా భద్రే కరిష్యామి యథా త్వం భీరు భాషసే।
అద్య తం సూదయిష్యామి కీచకం సహబాంధవమ్॥ 1
భీమసేనుడిట్లా అన్నాడు. 'ప్రియా! నేను నీవు చెప్పినట్లే చేస్తా. నేడే ఆ కీచకునీ, అతని బంధువుల్నీ చంపివేస్తాను. (1)
అస్యాః ప్రదోషే శర్వర్యాః కురుష్వానేన సంగతమ్।
దుఃఖం శోకం చ నిర్ధూయ యాజ్ఞసేని శుచిస్మితే॥ 2
యాజ్ఞసేనీ! నీవు శోకమూ, దుఃఖమూ విడిచి కీచకుణ్ణి ఈ రాత్రిమొదటి జాము నర్తనశాలకు రమ్మని ఒప్పందం కుదుర్చుకో. (2)
యైషా నర్తనశాలేహ మత్స్యరాజేన కారితా।
దివాత్ర కన్యా వృత్యంతి రాత్రౌ యాంతి యథాగృహమ్॥ 3
ఈనర్తనశాలను విరాటమహారాజు కట్టించాడు. ఇందులో స్త్రీలు (కన్యలు) పగలంతా నాట్యం చేస్తారు. రాత్రివేళ ఇళ్లకు పోతారు. (3)
తత్రాస్తి శయనం దివ్యం దృఢాంగం సుప్రతిష్ఠితమ్।
తత్రాస్య దర్శయిష్యామి పూర్వప్రేతాన్ పితామహాన్॥ 4
అక్కడ దృఢమైన చక్కని శయ్య ఒకటి అమర్చబడి ఉంది. అక్కడ ఆ కీచకుడికి చనిపోయిన వాడి తాతముత్తాతల్ని చూపిస్తాను. (4)
యథా చ త్వాం న పశ్యేయుః కుర్వాణా తేన సంవిదమ్।
కుర్వాస్తథా త్వం కల్యాణి యథా సంనిహితో భవేత్॥ 5
కల్యాణీ! నిన్నెవరూ చూడకుండ ఈ సంకేతాన్ని వాడికి తెలియచెయ్యి. ఎలాగైనా వాడు అక్కడికి వచ్చేటట్లు చెయ్యి.' (5)
వైశంపాయన ఉవాచ
తథా తౌ కథయిత్వా తు బాష్పముత్సృజ్య దుఃఖితౌ।
రాత్రిశేషం తమత్యుగ్రం ధారయామాసతుర్హృది॥ 6
వైశంపాయనుడు అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడు కొని, ఏడ్చి, కళ్లు తుడుచుకొని భయంకర మయిన మిగతా రాత్రి ఎలాగో అతికష్టంమీద గడిపారు. (వెళ్లబుచ్చారు.) (6)
వి॥తె॥ తెల్లవారినట్లు తెలుగులో తిక్కన ప్రభాతకాలవర్ణన చేస్తాడు. ద్రౌపదీ పరాభవానికి వేడి నిట్టూర్పులు విడుస్తున్నట్లు సరస్సులు తామరమొగ్గలు విచ్చుకుంటూ కొత్త తావులు జిమ్ముతున్నాయిట. ఇక్కడ తిక్కన చక్కని సీస మొకటి వ్రాశాడు సూర్యోదయాన్ని గురించి. ఆ పద్యం ఇది.
సీ॥ నీరజాకరములు నిష్ఠమైఁ జేసిన
భవ్య తవంబుల ఫల మనంగ
దివసముఖాభి నందిత చక్రయుగ్మకం
బుల యనురాగంపుఁ బ్రో వనంగ
హరి హర బ్రహ్మ మహానుభావంబు లొ
క్కటిగాఁగఁ గరఁగిన గట్టి యనఁగ
నతుల వేదత్రయ లతికాచయము పెను
పొందఁ బుట్టెడు మూలకంద మనఁగ.
తే॥ నఖిల జగముల కన్దెఱ యగుచు జనస
మాజ కరపుట హృదయ సరోజములకు
ముకుళనంబును, జృంభణంబును నొనర్చి
భాను బింబంబు పూర్వాద్రిపై వెలింగె. (2-241)
తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరుత్థాయ కీచకః।
గత్వా రాజకులాయైవ ద్రౌపదీమిదమబ్రవీత్॥ 7
రాత్రిగడిచింది. ప్రొద్దుటే కీచకుడు లేచి రాజ మందిరానికి వచ్చి ద్రౌపదితో ఇలా అన్నాడు. (7)
సభాయాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదాహనమ్।
న చైవాలభసే త్రాణమ్ అభిపన్నా బలీయసా॥ 8
ద్రౌపదీ! నేను సభలో మహారాజు చూస్తుండగానే నిన్ను కాలితో తన్ని క్రింద పడేశానుగదా! బలవంతుల్లో ఏ ఒక్కడైనా నిన్ను రక్షించగలిగాడా? (8)
ప్రవాదేనేహ మత్స్యానాం రాజా నామ్నాయముచ్యతే।
అహమేవ హి మత్స్యానాం రాజా వై వాహినీపతిః॥ 9
ఈ విరాటుడు మత్స్యదేశానికి పేరుకు మాత్రమే రాజు. సేనానాయకుణ్ణి. అసలైన రాజును నేనే. (9)
వి॥తె॥ ఇక్కడ తెలుగులో తిక్కన మరింత ముందుకు పోయాడు. "నేనే రాజ్యపాలన చేస్తాను. రాజనే నెపంతో విరాటునికి కూడు పెడుతున్నా" అంటాడు కీచకుడు. (2-254)
మాం సుఖం ప్రతిపద్యస్వ దాసో భీరు భవామి తే।
అహ్నాయ తవ సుశ్రోణి శతం నిష్కాన్ దదామ్యహమ్॥ 10
పిరికిదానా! నన్ను పొందు. సుఖాలు పొందు. నేను నీకు దాసుణ్ణి అవుతాను. సుశ్రోణీ! నేను నీకు రోజూ వంద బంగారు నాణెములు ఇస్తాను. (10)
దాసీశతం చ తే దద్యాం దాసానామపి చాపరమ్।
రథం చాశ్వతరీయుక్తమ్ అస్తు నౌ భీరు సంగమః॥ 11
వందలకొలది దాసీజనాన్ని, అలాగే సేవకుల్ని నీకిస్తాను. మంచి గుఱ్ఱాలున్న రథాలను నీకు కానుకగా ఇస్తాను. మనమిద్దరం తప్పక కలవాలి.' (11)
ద్రౌపద్యువాచ
ఏవం మే సమయం త్వద్య ప్రతిపద్యస్వ కీచక।
న త్వాం సఖా వా భ్రాతా వా జానీయాత్ సంగతం మయా॥ 12
అపుడు ద్రౌపది ఇలా అంది. 'కీచకా! నీకిష్టమైతే నేనొక నియమం చెబుతా. విను. నీవు నన్ను కలవాలంటే ఆ విషయం నీ స్నేహితులకుగాని, సోదరులకుగాని తెలియకూడదు. (12)
అనుప్రవాదాద్ భీతాస్మి గంధర్వాణాం యశస్వినామ్।
ఏవం మే ప్రతిజానీహి తతోఽహం వశగా తవ॥ 13
నా భర్తలైన గంధర్వులు ఎంతో పేరుగలవారు. ఈ విషయమై నిందకు నేను భయపడుతున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్ప నని ప్రమాణం చెయ్యి. అప్పుడే నేను నీకు వశమవుతాను.' (13)
కీచక ఉవాచ
ఏవమేతత్ కరిష్యామి యథా సుశ్రోణి భాషసే।
ఏకో భద్రే గమిష్యామి శూన్యమావసథం తవ॥ 14
కీచకుడన్నాడు. సుశ్రోణీ! నీవు చెప్పినట్లే నడుచుకుంటాను. ఎవ్వరూ లేనప్పుడు మీయింటికి నేనొక్కణ్ణే వస్తాను. (14)
సమాగమార్థం రంభోరు త్వయా మదనమోహితః।
యథా త్వాం నైవ పశ్యేయుః గంధర్వాః సూర్యవర్చసః॥ 15
రంభోరూ! కామమోహితుడనైన నేను సూర్యునితో సమానమైన తేజస్సుగల గంధర్వులు చూడకుండానే నిన్ను కలుసుకోవటానికి వస్తాను.' (15)
వి॥ సూర్యుడు ఎంతగొప్పవాడైనా రాత్రి జరిగేవి తెలుసుకోలేడు. కాబట్టి రాత్రి సమయానికి వాళ్ల కళ్లు గప్పి తెలియకుండానే వస్తానని తాత్పర్యం.
ద్రౌపద్యువాచ
యదేతన్నర్తనాగారం మత్స్యరాజేన కారితమ్।
దివాత్ర కన్యా నృత్యంతి రాత్రౌ యాంతి యథాగృహమ్॥ 16
'కీచకా! మత్స్యరాజు కట్టించిన నాట్యశాల ఉందిగదా! అక్కడ కన్యలందరు పగలంతా నాట్యం చేతారు. రాత్రి సమయంలో ఇళ్లకు పోతారు. (16)
తమిస్రే తత్ర గచ్ఛేథాః గంధర్వాస్తన్న జానతే।
తత్ర దోషః పరిహృతః భవిష్యతి న సంశయః॥ 17
చీకట్లో అక్కడకు రా. అది గంధర్వులు తెలుసు కోలేరు. అక్కడ కలుసుకొంటే దోషం ఉండదు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు.' (17)
(కీచక ఉవాచ
తథా భద్రే కరిష్యామి యథా త్వం భీరు మన్యసే।
ఏకః సన్ నర్తనాగారమ్ ఆగమిష్యామి శోభనే॥
సమాగమార్థం సుశ్రోణి శపే చ సుకృతేన మే।
కీచకుడు అన్నాడు. 'సుందరీ! నీవు ఎలా చెపితే అలా చేస్తాను. నీసమాగమంకోసం నేనొక్కణ్ణే నర్తనశాలకు వస్తాను. నేను నాపుణ్యంమీద ఒట్టేసి చెబుతున్నా.
యథా త్వాం నావబుధ్యంతే గంధర్వా వరవర్ణిని॥
సత్యం తే ప్రతిజానామి గంధర్వేభ్యో న తే భయమ్॥)
సుందరీ! నీపతులైన గంధర్వులకు తెలియకుండ ఉండేలాగ నేను ప్రయత్నం చేస్తా. ప్రతిజ్ఞ చేస్తున్నాను. గంధర్వులవలన నీకెటువంటి భయమూ లేదు.'
వైశంపాయన ఉవాచ
తమర్థమపి జల్పంత్యాః కృష్ణాయాః కీచకేన హ।
దివసార్ధం సమభవత్ మాసేనైవ సమం నృప॥ 18
వైశంపాయనుడన్నాడు. రాజా! ద్రౌపది కీచకుడితో ఆ విషయం చెప్పిన తర్వాత కీచకుడికి ఆ పూట ఒకమాసం అనిపించింది. (18)
కీచకోఽథ గృహం గత్వా భృశం హర్షపరిప్లుతః।
సైరంధ్రీరూపిణం మూఢః మృత్యుం తం నావబుద్ధవాన్॥ 19
కీచకుడు సంతోషంలో తేలియాడి ఇల్లు చేరుకున్నాడు. మృత్యువు సైరంధ్రిరూపంలో పొంచి ఉందని ఆ మూర్ఖుడు తెలుసుకోలేకపోయాడు. (19)
గంధాభరణమాల్యేషు వ్యాసక్తః సవిశేషతః।
అలంచక్రే తదాత్మానం సత్వరః కామమోహితః॥ 20
వెంటనే కామమోహితుడైన ఆ కీచకుడు గంధం పూసుకోవడం, ఆభరణాలు పెట్టుకోవడం, దండలు ధరించడం మొదలుగాగల అలంకరణలపట్ల ఆసక్తుడయ్యాడు. (20)
తస్య తత్ కుర్వతః కర్మ కాలో దీర్ఘ ఇవాభవత్।
అనుచింతయతశ్చాపి తామేవాయతలోచనామ్॥ 21
ఆ కీచకుడు విశాలమైన నేత్రాలుగల ఆ ద్రౌపదినే పదేపదే తలచుకొంటూ, అందంగా అలంకరించుకొంటూ ఉత్కంఠతో క్షణమొక యుగంలా గడిపాడు. (21)
వి॥తె॥ "మాయరవి ఏల గ్రుంకడొ" అనుకొన్నాడట.
ఆసీదభ్యధికా చాపి శ్రీః శ్రియం ప్రముముక్షతః।
నిర్వాణకాలే దీపస్య వర్తీమివ దిధక్షతః॥ 22
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువన్నట్లు రాజ్యాన్ని, ప్రాణాల్ని పోగొట్టుకోబోయే అతని శరీరం విశేషమైన కాంతితో ప్రకాశించింది. (22)
కృతసంప్రత్యయస్తస్యాః కీచకః కామమోహితః।
నాజానాద్దివసం యాంతం చింతయానః సమాగమమ్॥ 23
కాముకుడైన కీచకుడు ద్రౌపది యొక్కమాటలు పూర్తిగా నమ్మి ఆమెపొందునుగురించే ఆలోచిస్తూ ప్రొద్దుపోవడం కూడ గమనించలేక పోయాడు. (23)
తతస్తు ద్రౌపదీ గత్వా తదా భీమం మహానసే।
ఉపాతిష్ఠత కల్యాణీ కౌరవ్యం పతిమంతికమ్॥ 24
ఆ తరువాత ద్రౌపది వంటశాలలోనున్న తన భర్తయైన భీమునివద్దకు చేరుకుంది. (24)
తమువాచ సుకేశాంతా కీచకస్య మయా కృతః।
సంగమో నర్తనాగారే యథావోచః పరంతప॥ 25
అందమైన ముంగురులుగల ద్రౌపది భీమునితో 'శత్రుసంహారకా! నీవు చెప్పినట్లే నర్తనశాలకు రమ్మని కీచకుడితో అన్నాను. (25)
శూన్యం స నర్తనాగారమ్ ఆగమిష్యతి కీచకః।
ఏకో నిశి మహాబాహో కీచకం తం నిషూదయ॥ 26
మహాబాహూ! ఆ కీచకుడు నిర్మానుష్యంగా ఉన్న నర్తనశాలకు రాత్రికి ఒంటరిగా వస్తాడు. వాణ్ణి అక్కడ చంపు.
తం సూతపుత్రం కౌంతేయ మదదర్పితమ్।
గత్వా త్వం నర్తనాగారం నిర్జీవం కురు పాండవ॥ 27
కుంతీకుమారా! భీమా! నీవు నర్తనశాలకు వెళ్లి సూతపుత్రుడు, మదాంధుడు అయిన ఆ కీచకుణ్ణి చంపు. (27)
దర్పాచ్చ సూతపుత్రోఽసౌ గంధర్వానవమన్యతే।
తం త్వం ప్రహరతాం శ్రేష్ఠ హ్రదాన్నాగమివోద్ధర॥ 28
సూతపుత్రుడైనకీచకుడు గర్వంతో గంధర్వుల్ని కూడ లెక్కచెయ్యడం లేదు. మడుగునుండి పామును బయటకులాగి చంపేటట్లు నీవు కీచకుని చంపు. (28)
అశ్రుదుఃఖాభిభూతాయాః మమ మార్జస్వ భారత।
ఆత్మనశ్చైవ భద్రం తే కురు మానం కులస్య చ॥ 29
దుఃఖంతో విలపించే నాకన్నీరు అప్పుడు తుడిచి వెయ్యి. నీయొక్క, నీవంశంయొక్క గౌరవాన్ని నిలబెట్టు. నీకు శుభం కలుగుగాక.' (29)
భీమసేన ఉవాచ
స్వాగతం తే వరారోహే యన్మాం వేదయసే ప్రియమ్।
నహ్యన్యం కంచిదిచ్ఛామి సహాయం వరవర్ణిని॥ 30
భీమసేనుడు అన్నాడు. సుందరీ! 'నా కిష్టమైన మాటనే నీవు చెప్పావు. అందుకే నీ అభిప్రాయానికి స్వాగతం పలుకుతున్నాను. నీవు చెప్పినట్లే చేస్తాను. కీచకుణ్ణి చంపడానికి నాకు వేరొకరి సహాయం అవసరంలేదు. (30)
యామే ప్రీతిస్త్వయాఽఖ్యాతా కీచకస్య సమాగమే।
హత్వా హిడింబం సా ప్రీతిః మమాసీద్వరవర్ణిని॥ 31
వరవర్ణిని! పూర్వం నేను హిడింబాసురుని చంపినపుడు నాకు ఎటువంటి ఆనందం కల్గిందో నీవు కీచకుని చంపమని అడిగినపుడు కూడ అటువంటి ఆనందమే కల్గింది. (31)
సత్యం భ్రాతౄంశ్చ ధర్మం చ పురస్కృత్య బ్రవీమి తే।
కీచకం నిహనిష్యామి వృత్రం దేవపతిర్యథా॥ 32
నేను సత్యాన్ని, అన్నదమ్ముల్ని, ధర్మాన్ని ముందుంచుకొని ప్రతిజ్ఞ చేస్తున్నా, దేవేంద్రుడు వృత్రాసురుని చంపినట్లు కీచకుని చంపుతా. (32)
తం గహ్వరే ప్రకాశే వా పోథయిష్యామి కీచకమ్।
అథచేదపి యోత్స్యంతి హింసే మత్స్యానపి ధ్రువమ్॥ 33
వాడిని రహస్యంగా కానీ, బయలుగా కాని నేను చూర్ణంచేస్తాను. మత్స్యదేశప్రజలు కీచకుడి పక్షాన యుద్ధానికి వస్తే వాళ్ళని కూడా చంపుతాను. (33)
తతో దుర్యోధనం హత్వా ప్రతిపత్స్యే వసుంధరామ్।
కామం మత్స్యముపాస్తాం హి కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 34
ఆ తర్వాత దుర్యోధనుని చంపి రాజ్యాన్ని సంపాదిస్తూ, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు ఇష్టమై విరాటరాజు కొలువులో ఉండి అతని సేవలు చేస్తూ ఉన్నా సరే!' (34)
ద్రౌపద్యువాచ
యథా న సంత్యజేథాస్త్వం సత్యం వై మత్కృతే విభో।
నిగూఢస్త్వం తథా పార్థ కీచకం తం నిషూదయ॥ 35
ద్రౌపది అంది. 'ప్రభూ! నాకోసం నీవు సత్యాన్ని వదిలిపెట్టకుండ కార్యం నెరవేర్చు. కుంతీపుత్రా! నీవు రహస్యంగా ఉండి ఆ కీచకుణ్ణి చంపు.' (35)
భీమసేన ఉవాచ
ఏవమేతత్ కరిష్యామి యథా త్వం భీరు భాషసే।
అద్య తం సూదయిష్యామి కీచకం సహబాంధవైః॥ 36
భీమసేనుడన్నాడు.' భీరూ! నీవు ఎలా చెపుతావో నేను అలాగే చేస్తాను. నేడే నేను ఆ కీచకుణ్ణి అతని బంధువులను కూడ చంపుతాను. (36)
అదృశ్యమానస్తస్యాథ తమస్విన్యామనిందితే।
నాగో బిల్వమివాక్రమ్య పోథయిష్యామ్యహం శిరః॥
అలభ్యమిచ్ఛతస్తస్య కీచకస్య దురాత్మనః॥ 37
ఆ చీకటిలో నే నెవరికంట పడకుండ ఏనుగు మారేడుపండును చిదిపి వేసినట్లు కోరకూడనిదాన్ని కోరిన ఆ కీచకుని తలను చిదిపి ముద్దచేస్తాను. (37)
వి॥తె॥ ఇక్కడ తెలుగులో తిక్కన మరింత ఆలోచన చేశాడు. భీముడు "ఒక్కడూ వస్తాడా? ఎవరినైనా తీసుకువస్తాడా?" అంటాడు ద్రౌపదితో. అపుడు 'తప్పక ఒక్కడే నర్తనశాలకు వస్తాడు నాకోసం. నీకు యుద్ధం ఇస్తాడు' అంటుంది ద్రౌపది. భీముడు సంతోషించి నారౌద్రమంతా ప్రకటిస్తాను అంటాడు. దానికి ద్రౌపది నిగూఢంగా చంపగలిగితేనే చంపు. లేకపోతే ఇది బయటపడితే వాడు చచ్చినా ప్రయోజనం లేదు. అలాగయితే అసలే ఈ ప్రయత్నం వద్దు అంటుంది.(2-281-290) ఇది ద్రౌపది ఆలోచన పద్ధతి.
ఇక్కడ తెలుగులో కీచకుని విరహం వర్ణింపబడింది. ఆసమయంలో కీచకునికి అనుమానం వస్తుంది. ఇంతకూ ఆమె వస్తుందా? మోసగించదుకదా! అని అనుకుంటాడు. "అయినా ఆమెకు మాత్రం మనసెట్లా నిలుస్తుంది?" అనుకొని ఊరడిల్లుతాడు. కీచకుని విరహవర్ణన తెలుగులో తరువాతి ప్రబంధకవులకు త్రోవచూపింది.
వైశంపాయన ఉవాచ
భీమోఽథ ప్రథమం గత్వా రాత్రౌ ఛన్న ఉపావిశత్।
మృగం హరిరివాదృశ్యః ప్రత్యాకాంక్షత కీచకమ్॥ 38
వైశంపాయనుడు అన్నాడు. తరువాత భీముడు రాత్రి సమయంలో ముందు వెళ్ళి నర్తనశాలలో ఒంటరిగా దాక్కున్నాడు. సింహం ఎవరికీ తెలియకుండ లేడికోసం మాటువేసినవిధంగా కీచకుని కోసం ఎదురుచూస్తున్నాడు భీముడు. (38)
కీచకశ్చాప్యలంకృత్య యథాకామముపాగమత్।
తాం వేలాం నర్తనాగారం పాంచాలీసంగమాశయా॥ 39
కీచకుడుకూడా తనయిష్టానుసారం అలంకరించుకొని ద్రౌపదిని కలుసుకోవాలని ఆ సమయంలో నర్తనశాలకు వచ్చాడు. (39)
మన్యమానః స సంకేతమ్ ఆగారం ప్రావిశచ్చ తత్।
ప్రవిశ్య చ స తద్ వేశ్మ తమసా సంవృతం మహత్॥ 40
ఆ మందిరాన్ని సంకేతగృహంగా భావించి అందులో ప్రవేశించాడు. ఆ విశాలభవనం అంతటా అంధకారంతో నిండి ఉంది. (40)
పూర్వాగతం తతస్తత్ర భీమమప్రతిమౌజసమ్।
ఏకాంతావస్థితం చైనమ్ ఆససాద స దుర్మతిః॥ 41
శయానం శయనే తత్ర సూతపుత్రః పరామృశత్।
జాజ్వల్యమానం కోపేన కృష్ణా ధర్షణజేన హ॥ 42
అంతకుముందే అసమాన పరాక్రమవంతుడైన భీముడు అక్కడకు వచ్చి శయ్యమీద ఉన్నాడు. దుర్మతియైన కీచకుడు వచ్చి శయ్యపై పండుకొని ఉన్న భీమునిపై చెయ్యివేశాడు. ద్రౌపదికి కీచకుడు చేసిన అవమానాన్ని అప్పుడు భీముడు తలచుకొని కోపంతో రగిలిపోయాడు. (41,42)
ఉపసంగమ్య చైవైనం కీచకః కామమోహితః।
హర్షోన్మథితచిత్తాత్మా స్మయమానోఽభ్యభాషత॥ 43
కామమోహితుడైన కీచకుడు అక్కడకు చేరి సంతోషంతో మత్తెక్కి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. (43)
ప్రాపితం తే మయా విత్తం బహురూపమనంతకమ్।
యత్ కృతం ధనరత్నాఢ్యం దాసీశతపరిచ్ఛదమ్॥ 44
రూపలావణ్యయుక్తాభిః యువతీభిరలంకృతమ్।
గృహం చాంతఃపురం సుభ్రు క్రీడారతివిరాజితమ్।
తత్ సర్వం త్వాం సముద్దిశ్య సహసాహముపాగతః॥ 45
సుందరీ! అనేకవిధాలుగా సంపాదించిన అనంతధనాన్ని నీకిచ్చివేశాను. వివిధసంపదలతో రత్నాలతోనిండి, వందలకొలదీ పరిచారికలతో క్రీడాగృహాలతో కూడిన అంతఃపురం అంతా నీకు ఇవ్వడానికే త్వరగా నీ దగ్గరకు వచ్చాను. (44,45)
అకస్మాన్మాం ప్రశంసంతి సదా గృహగతాః స్త్రియః।
సువాసా దర్శనీయశ్చ నాన్యోఽస్తి త్వాదృశః పుమాన్॥ 46
ఎల్లపుడు మాఇంటిలోఉండే స్త్రీలు అకస్మాత్తుగా (నీవు వరించడంచేత) నన్ను 'నీవలె అందంగా వస్త్రాలు కట్టుకొనేవాడు. అందగాడు వేరొకడు లే'డని ప్రశంసిస్తున్నారు. (46)
భీమసేన ఉవాచ
దిష్ట్వా త్వం దర్శనీయోఽథ దిష్ట్వాత్మానం ప్రశంససి।
ఈదృశస్తు త్వయా స్పర్శః స్పృష్టపూర్వో న కర్హిచిత్॥ 47
భీమసేనుడు అన్నాడు. నీవు నిజంగా అంతటి అందగాడివే. నిన్ను నీవే పొగడుకుంటున్నావు. ఇటువంటి స్పర్శ నీవింతకు ముందెన్నడూ పొంది ఉండవు. (47)
వి॥తె॥ ఈ సంభాషణలో ద్రౌపది అన్నట్టుగా భీముడు "నీవు అంతటి వాడవే గనుక ఆత్మస్తుతి చేసుకొంటున్నావు. నావంటి ఆడది కావాలంటే మాత్రం దొరకుతుందా." అంటాడు నిగూఢంగా. (2-337)
స్పర్శం వేత్సి విదగ్ధస్త్వం కామధర్మవిచక్షణః।
స్త్రీణాం ప్రీతికరో నాన్యః త్వత్సమః పురుషస్త్విహ॥ 48
నీవు కామశాస్త్రంలో మంచి పండితుడివి. స్పర్శ సుఖం తెలుసుకోగల్గిన నేర్పరివి. స్త్రీలకు ప్రేమపాత్రులైన పురుషులలో నీ వంటివాడు మరొకడు లేడు. (48)
వి॥తె॥ ధ్వని గర్భితమైన ఈ భీమకీచకుల సంభాషణం నీశరీరం ఏమవుతుందో నీవే చెప్పాడు. "నాశరీరంతో కలిసినపుడు నీశరీరం ఏమవుతుందో నీవే చూస్తావు. వ్యాసుడు "ఈదృశస్తు త్వయా స్పర్శః స్పృష్ట పూర్వో న కర్హిచిత" అని సంగ్రహంగా అన్నాడు. తిక్కన దాన్ని ధ్వనితో సంశ్లేషించి చెప్పాడు.
క॥ నా యొడలు చేర్చినప్పుడు
నీ యొడ లెట్లగునొ దాని నీ వెఱిఁగెదు న
న్నే యబలల తోడిదిగాఁ
జేయఁ దలంచితివి తప్పుసేసితి గంటే! (3-38)
ఇంకా ఇలా నిగూఢసంభాషణం సాగింది. నన్ను ముట్టుకొన్నాక నీవు మళ్లీ మరో స్త్రీసాంగత్యానికి వెళ్లవు. అయినా నీవు శరీరం పొందినందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తావు. మన్మథ వికారాలు చూడు.
క॥ నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి పోవువాఁడవె యైనం
దనువేఁ బడసిన ఫలమే
కనియెద విదె చిత్తభవ వికారము లెల్లన్. (3-39)
అంటూ కీచకుని పట్టుకొంటాడు భీముడు.
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా తం మహాబాహుః భీమో భీమపరాక్రమః।
సహసోత్పత్య కౌంతేయః ప్రహస్యేదమువాచ హ॥ 49
వైశంపాయనుడు అన్నాడు. ఆ విధంగా చెప్పి మహాబాహువు. పరాక్రమవంతుడు అయిన భీముడు ఒక్కపెట్టున లేచి బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు. (49)
అద్య త్వాం భగినీ పాపం కృష్యమాణం మయా భువి।
ద్రక్ష్యతేఽద్రిప్రతీకాశం సింహేనేవ మహాగజమ్॥ 50
"ఓరీ! నీవు చాలపెద్దశరీరంతో పర్వతంలా ఉన్నావు. అయినప్పటికీ సింహం మదపుటేనుగును ఈడ్చినట్లుగా నిన్ను నేను నేలమీద ఈడ్చడం మీ అక్కకూడా చూస్తుంది. (50)
నిరాబాధా త్వయి హతే సైరంధ్రీ విచరిష్యతి।
సుఖమేవ చరిష్యంతి సైరంధ్ర్యాః పతయః సదా॥ 51
నీవు చస్తే సైరంధ్రి ఎటువంటి బాధాలేకుండా సుఖంగా తిరుగుతుంది. ఆమె భర్తలు కూడ సుఖంగా సంచరిస్తారు. (51)
తతో జగ్రాహ కేశేషు మాల్యవత్సు మహాబలః।
స కేశేషు పరామృష్టః బలేన బలినాం వరః॥ 52
ఆక్షిప్య కేశాన్ వేగేన బాహ్వోర్జగ్రాహ పాండవమ్।
బాహుయుద్ధం తయోరాసీత్ క్రుద్ధయోర్నరసింహయోః॥ 53
వసంతే వాసితాహేతోః బలవద్గజయోరివ।
మహాబలుడైన భీముడు అలా అని పూలమాలలతో నిండిన ఆ కీచకుని జుట్టు పట్టుకొన్నాడు. వాడు కూడ వెంటనే జుట్టు వదిలించుకుని భీముడి భుజాల్ని పట్టుకొన్నాడు. వారిద్దరికీ బాహుయుద్ధం జరిగింది. అది వసంతకాలంలో ఒక ఆడఏనుగుకోసం రెండు మదగజాలు పోట్లాడుకొంటున్నట్లుగా ఉంది. (52,53 1/2)
కీచకానాం తు ముఖ్యస్య నరాణాముత్తమస్య చ॥ 54
వాలిసుగ్రీవయోర్భ్రాత్రోః పురేవ కపిసింహయోః।
అన్యోన్యమపి సంరబ్ధౌ పరస్పరజయైషిణౌ॥ 55
కీచకశ్రేష్ఠునకు మానవోత్తముడైన భీమునకు జరిగిన ఆ యుద్ధం పూర్వం వాలిసుగ్రీవులకు జరిగిన యుద్ధంవలె ఉంది. వారిద్దరు పరస్పరం(ఒకరినొకరు) గెలవాలనే కోరికతో యుద్ధం చేశారు. (54,55)
తతః సముద్యమ్య భూజౌ పంచశీర్షావివోరగౌ।
నఖదంష్ట్రాభిరన్యోన్యం ఘ్నతః క్రోధవిషోద్ధతౌ॥ 56
వారిద్దరు చేతులు పైకెత్తి ఒకరినొకరు గోళ్ళతో గీరుతూ, పళ్లతో కరుస్తూ యుద్ధం చేస్తుంటే క్రోధమనే విషంతో నిండిన ఐదుతలల పాములవలె ఉన్నారు. (56)
వేగేనాభిహతో భీమః కీచకేన బలీయసా।
స్థిరప్రతిజ్ఞః స రణే పదాన్నచలితః పదమ్॥ 57
బలవంతుడైన కీచకుడు భీముణ్ణి గట్టిగా వేగంగా కొట్టాడు. అయినప్పటికీ దృఢప్రతిజ్ఞ గల భీముడు ఒక్క అడుగు కూడ కదలలేదు. (57)
తావన్యోన్యం సమాశ్లిష్య ప్రకర్షంతౌ పరస్పరమ్।
ఉభావపి ప్రకాశేతే ప్రవృద్ధౌ వృషభావివ॥ 58
వారిద్దరు ఒకరినొకరు లాగుతూ, తోస్తూ బాగా బలిసిన రెండు ఆబోతుల్లాగా ప్రకాశించారు. (58)
తయోర్హ్యాసీత్ సుతుములః సంప్రహారః సుదారుణః।
నఖదంతాయుధవతోః వ్యాఘ్రయోరివ దృప్తయోః॥ 59
గోళ్లు, దంతాలే వాళ్లిద్దరికి ఆయుధాలయ్యాయి. వాళ్ళిద్దరి మధ్యజరిగిన యుద్ధం రెండు మదించిన పెద్దపులుల మధ్య జరిగే యుద్ధంలా ఉంది. (59)
అభిపత్యాథ బాహుభ్యాం ప్రత్యగృహ్ణాదమర్షితః।
మాతంగ ఇవ మాతంగం ప్రభిన్నకరటాముఖమ్॥ 60
మదించిన ఏనుగు వేరొక మదించిన ఏనుగును తొండంతో పట్టుకొన్నట్లుగా కీచకుడు క్రోధంతో భీముని రెండు చేతులతోను పట్టుకున్నాడు. (60)
స చాప్యేనం తదా భీమః ప్రతిజగ్రాహ వీర్యవాన్।
తమాక్షిపత్ కీచకోఽథ బలేన బలినాం వరః॥ 61
బలవంతుడైన భీముడు కూడ కీచకుణ్ణి పట్టుకొన్నాడు. అయినా కీచకుడు బలంతో భీముణ్ణి విదుల్చుకొన్నాడు. (61)
తయోర్భుజవినిష్పేషాత్ ఉభయోర్బలినోస్తదా।
శబ్దః సమభవద్ ఘోరః వేణుస్ఫోటసమో యుధి॥ 62
మహాబలవంతులైన వాళ్ళిద్దరు ఒకరి నొకరు చేతులతో చరుచుకొంటుంటే వెదుళ్లు పగిలినప్పుడు వచ్చే శబ్దంలాంటి శబ్దం పుట్టింది. (62)
వి॥తె॥ ఇంత శబ్దం వస్తే రహస్య భంగం అవుతుందని తిక్కన తెలుగులో.
క॥ తన యగపా టొరు లెఱుఁగుదు
రని సూతుఁడు; సమయభంగ మగుటకు భీముం
డునుఁ గొంకుచుఁ జప్పుడు సే
యని గూఢ విమర్దన ప్రహారములఁ దగన్. (3-45)
తాను కనబడితే అందరికీ తన చాటుమాటు వ్యవహారం తెలుస్తుందని కీచకుడూ, అజ్ఞాతవాసం చెడిపోతుందని భీముడూ ఇద్దరూ భయపడి పెద్దగా చప్పుడు రాని పిడికిలి పోట్లతో యుద్ధం చేశారు అని వ్రాశాడు.
అథైనమాక్షిప్య బలాద్ గృహమధ్యే వృకోదరః।
ధూనయామాస వేగేన వాయుశ్చండ ఇవ ద్రుమమ్॥ 63
తర్వాత భీముడు నర్తనశాలయొక్క మధ్య ప్రదేశంలో కీచకుణ్ణి బలంగా పట్టుకొని, సుడిగాలి చెట్టును ఊపివేసిన విధంగా గిరగిరా త్రిప్పాడు. (63)
భీమేన చ పరామృష్టః దుర్బలో బలినా రణే।
ప్రాస్పందత యథాప్రాణం విచకర్ష చ పాండవమ్॥ 64
ఆయుద్ధంలో బలహీనుడైన కీచకుణ్ణి భీముడు పట్టుకొన్నప్పటికీ ప్రాణాలతో బయటపడి శక్తిమేరకు అతడు భీముణ్ణి పట్టుకొన్నాడు. (64)
ఈషదాకలితం చాపి క్రోధాద్ ద్రుతపదం స్థితమ్।
కీచకో బలవాన్ భీమం జానుభ్యామాక్షిపద్ భువి॥ 65
కొంచెం కాళ్లు వంచుకుని ముందుకు నిలబడి పైకి దూకబోతున్న భీముని రెండుకాళ్లు పట్టుకొనిలాగి పడేశాడు బలవంతుడైన కీచకుడు. (65)
పాతితో భువి భీమస్తు కీచకేన బలీయసా।
ఉత్పపాతాథ వేగేన దండపాణిరివాంతకః॥ 66
బలవంతుడైన కీచకుడు భీముణ్ణి నేలపై త్రోసి పడవేయగా భీముడు వెంటనే యమునివలె విజృంభించి పైకిలేచి కీచకునిపై పడ్డాడు. (66)
స్పర్ధయా చ బలోన్మత్తౌ తావుభౌ సూతపాండవౌ।
నిశీథే పర్యకర్షేతాం బలివౌ నిర్జనే స్థలే॥ 67
బలగర్వితులైన భీమసేన కీచకులిద్దరూ ఆ రాత్రి నిర్జనంగా ఉన్న నర్తనశాలలో పోటాపోటిగా యుద్ధం చేశారు. (67)
తతస్తద భవనం శ్రేష్ఠం ప్రాకంపత ముహుర్మహుః।
బలవచ్చాపి సంక్రుద్ధౌ అన్యోన్యం ప్రతి గర్జతః॥ 68
వారిద్దరు క్రోధంతో ఒకరిపై ఒకరు గర్జిస్తూ ఉంటే శ్రేష్ఠమైన ఆ నర్తనశాల భవనం బలిష్ఠమైనదైనా మాటిమాటికీ కంపించసాగింది. (68)
తాలాభ్యాం స తు భీమేన వక్షస్యభిహతో బలీ।
కీచకో రోషసంతప్తః పదాన్న చలితః పదమ్॥ 69
బలవంతుడైన భీముడు తన అరచేతులతో కీచకుణ్ణి గుండెలపై కొట్టాడు. రోషం గల కీచకుడు ఒక్క అడుగు కూడా కదలలేదు. (69)
ముహూర్తం తు స తం వేగం సహిత్వా భువి దుస్సహమ్।
బలాదహీయత తదా సూతో భీమబలార్దితః॥ 70
కీచకుడు దుస్సహమైన ఆ వేగాన్ని ఎలాగో సహించాడు. కాని తరువాత శక్తికోల్పోయి నేలపై కూలిపోయాడు. (70)
తం హీయమానం విజ్ఞాయ భీమసేనో మహాబలః।
వక్షస్యానీయ వేగేన మమర్దైనం విచేతసమ్॥ 71
కీచకుడు బలహీనపడడం, నిస్తేజంగా ఉండడం గమనించి మహాబలవంతుడైన భీముడు వేగంగా అతనిని ఈడ్చుకొనివచ్చి గుండెపై గుద్దాడు. (71)
క్రోధావిష్టో వినిఃశ్వస్య పునశ్చైనం వృకోదరః।
జగ్రాహ జయతాం శ్రేష్టః కేశేష్వేవ తదా భృశమ్॥ 72
చక్కని గెలుపు పొందినప్పటికి కోపంతో నిండిన భీమునికి ఆకోపం ఇంకా చల్లారలేదు. కోపంతో నిట్టూర్చి చాలాదారుణంగా జుట్టుపట్టుకొని ఈడ్చివేశాడు. (72)
గృహీత్వా కీచకం భీమః విరరాజ మహాబలః।
శార్దూలః పిశితాకాంక్షీ గృహీత్వేవ మహామృగమ్॥ 73
పెద్దపులు మాంసం కోసం పెద్దజింకను పట్టుకొన్నట్లుగా మహాబలశాలియైన భీముడు కీచకుని పట్టుకొని గొప్పగా శోభించాడు. (73)
తత ఏనం పరిశ్రాంతమ్ ఉపలభ్య వృకోదరః।
యోక్త్రయామాస బాహుభ్యాం పశుం రశనయా యథా॥ 74
తరువాత భీమసేనుడు అలిసిపోయిన కీచకుణ్ణి చేరి పశువును త్రాళ్లతో బంధించినట్లుగా తనరెండు చేతులతో బంధించాడు. (74)
నదంతం చ మహానాదం భిన్నభేరీసమస్వనమ్।
భ్రామయామాస సుచిరం విస్ఫురంతమచేతసమ్॥ 75
అప్పుడు కీచకుడు పగిలిపోయిన భేరీలాగ వికృతధ్వనితో అరుస్తూ, విడిపించుకొనడానికి గింజుకొనసాగాడు. అతని ప్రాణాలు మెల్లమెల్లగా పోతున్నాయి. అదే స్థితిలో భీముడు అతనిని చాలాసేపు గిరగిరా తిప్పాడు. (75)
ప్రగృహ్య తరసా దోర్భ్యాం కంఠం తస్య వృకోదరః।
అపీడయత కృష్ణాయాః తదా కోపోపశాంతయే॥ 76
భీమసేనుడు వెంటనే ద్రౌపదియొక్క కోపాన్ని శాంతింప చేయడానికి తనరెండుచేతులతో కీచకుని కంఠాన్ని పట్టుకొని గట్టిగా నొక్కేశాడు. (76)
అథ తం భగ్నసర్వాంగం వ్యావిద్ధనయనాంబరమ్।
ఆక్రమ్య చ కటీదేశే జానునా కీచకాధమమ్।
అపీడయత బాహుభ్యాం పశుమారమమారయత్॥ 77
కీచకుడి అన్నిఅవయవాలు విరిగి ముక్కలై పోయాయి. కళ్లు తేలేశాడు. బట్టలు చిరిగిపోయాయి. అతని నడుమును అప్పుడు మోకాళ్లతో నొక్కిపట్టి భీముడు జంతువును మెడవిరిచి చంపినట్లుగా చంపసాగాడు. (77)
తం విషీదంతమాజ్ఞాయ కీచకం పాండునందనః।
భూతలే భ్రామయామాస వాక్యం చేదమువాచ హ॥ 78
చావు దగ్గర పడుత్ విషణ్ణుడైన కీచకుణ్ణి చూసి భీముడు అతణ్ణి నేలపై పడవేసి దొర్లిస్తూ ఇలా అన్నాడు. (78)
అద్యాహమనృణో భూత్వా భ్రాతుర్భార్యాపహారిణమ్।
శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా సైరంధ్రికంటకమ్॥ 79
సైరంధ్రి పాలిటి కంటకుడు, నాసోదరుని భార్యను అపహరించినవాడు, దుష్టుడు అయిన కీచకుణ్ణి చంపి నేడు ఋణవిముక్తుణ్ణి అయి పరమశాంతి పొందాను. (79)
ఇత్యేవముక్త్వా పురుషప్రవీరః
తం కీచకం క్రోధసరాగనేత్రః।
ఆస్రస్తవస్త్రాభరణం స్ఫురంతమ్
ఉద్భ్రాంతనేత్రం వ్యసుముత్ససర్జ॥ 80
అలా అంటున్న మహావీరుడైన భీమునికళ్లు క్రోధంతో ఎర్రబడ్డాయి. అతడిని నేలపై ఎత్తిపడవేశాడు. అప్పటికే కీచకుని ఆభరణాలు బట్టలు ఊడిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కళ్లు తేలేశాడు. ప్రాణాలుకూడ పైకెగిరిపోయాయి. (80)
నిష్పిష్య పాణినా పాణిం సందష్టౌష్ఠపుటం బలీ।
సమాక్రమ్య చ సంక్రుద్ధః బలేన బలినాం వరః॥ 81
బలవంతుల్లో శ్రేష్ఠుడైన భీముడు ఇంకా కోపం తగ్గక పళ్లు కొరుకుతూ తనచేతితో అతని చేతిని మెలిపెట్టి, మళ్ళీ అతని పైకి ఎక్కాడు. (81)
తస్య పాదౌ చ పాణీ చ శిరో గ్రీవాం చ సర్వశః।
కాయే ప్రవేశయామాస పశోరివ పినాకధృక్॥ 82
పినాకపాణి అయిన శివుడు గయాసురుణ్ణి వలె భీంఉడు కీచకుని కాళ్లను, చేతుల్ని, తలను, మెడను మొండెం లోనికి చొప్పించాడు. (82)
తం సమ్మథితసర్వాంగం మాంసపిండోపమం కృతమ్।
కృష్ణాయాః దర్శయామాస భీమసేనో మహాబలః॥ 83
మహాబలుడైన భీముడు అతని అవయవాలన్నిటినీ నుగ్గుచేసి, అతనిని ఒక మాంసపిండంగా మార్చివేశాడు. దానిని ద్రౌపదికి చూపించాడు. (83)
ఉవాచ చ మహాతేజాః ద్రౌపదీం యోషితాం వరామ్।
పశ్యైనమేహి పాంచాలి కాముకోఽయం యథాకృతః॥ 84
అపుడు మహాతేజస్వి భీముడు వనితాశిరోమణియైన ద్రౌపదితో "పాంచాలీ! ఇలా రా. కాముకుడైన కీచకుణ్ణి ఏంచేశానో చూడు" అన్నాడు. (84)
ఏవముక్త్వా మహారాజ భీమో భీమపరాక్రమః।
పాదేన పీడయామాస తస్య కాయం దురాత్మనః॥ 85
మహారాజా! భయంకరమైన పరాక్రమంగల భీముడు అలా పల్కి ఆ దుర్మార్గుడి శరీరాన్ని కాలితో ఒక్కతన్ను తన్నాడు. (85)
తతోఽగ్నిం తత్ర ప్రజ్వాల్య దర్శయిత్వా తు కీచకమ్।
పాంచాలీం స తదా వీరః ఇదం వచనమబ్రవీత్॥ 86
తరువాత మహావీరుడైన భీముడు దీపం పెద్దది చేసి కీచకుడి శవాన్ని ద్రౌపదికి చూపించి ఆమెతో ఇలా అన్నాడు. (86)
వి॥తె॥ చచ్చిన కీచకుని చూపించటానికి అగ్నిని జ్వలింపచేశాడు భీముడు. అదికూడా గూఢంగా. తెలుగులో ఆ ద్రౌపది కీచకుని చూసి ముక్కుమీద వ్రేలు వేసికొని ఇలా అంటుంది. "దీనికోసమా కీచకా ఇంత చేశావు? సుఖపడు బాగా! అలా బాధిస్తే ఇలా కాక ఏమవుతుంది? అంటుంది. ఇది స్త్రీ సహజంగా ఉంది.
ప్రార్థయంతి సుకేశాంతే యే త్వాం శీలగుణాన్వితామ్।
ఏవం తే భీరు వధ్యంతే కీచకః శోభతే యథా॥ 87
'అందమైన కేశపాశంగల పాంచాలీ! మంచి గుణశీలాలు గల నిన్ను కామించే వారికి ఈ కీచకునకు పట్టిన గతియే పడుతుంది. (87)
తత్ కృత్వా దుష్కరం కర్మ కృష్ణాయాః ప్రియముత్తమమ్।
తథా స కీచకం హత్వా గత్వా రోషస్య వై శమమ్॥ 88
ఆమంత్ర్య ద్రౌపదీం కృష్ణాం క్షిప్రమాయాన్మహానసమ్।
కీచకం ఘాతయిత్వా తు ద్రౌపదీ యోషితాం వరా।
ప్రహృష్టా గతసంతాపా సభాపాలానువాచ హ॥ 89
ద్రౌపదికి చాలా ఇష్టమూ, కఠిననూ అయిన పనిని ఆ విధంగా పూర్తిచేసి కోపం తీరిన భీముడు ఆమెను విడిచి వెంటనే వంటశాలకు వెళ్ళిపోయాడు. స్త్రీలలో శ్రేష్ఠురాలైన ద్రౌపది కీచకుణ్ణి చంపించిన తర్వాత సంతోషంగాను, నిర్భయంగాను ఉంది. నర్తనశాలను కాపలాకాస్తున్న వారి దగ్గరకు వెళ్ళి ఇలా అంది. (88,89)
కీచకోఽయం హతః శేతే గంధర్వైః పతిభిర్మమ।
పరస్త్రీకామసమ్మత్తః తత్రాగచ్ఛత పశ్యత॥ 90
రండి చూడండి. పరస్త్రీని కామించిన ఈ కీచకుణ్ణి నాపతులైన గంధర్వులు చంపారు. ఇక్కడ చచ్చి పడి ఉన్నాడు. (90)
తచ్ఛ్రుత్వా భాషితం తస్యాః నర్తనాగారరక్షిణః।
సహసైవ సమాజగ్ముః ఆదాయోల్కాః సహస్రశః॥ 91
నర్తనశాలకు కాపలాకాసేవారు ఆమెమాటను విని వెంటనే చాలా కాగడాలు తీసుకొని అక్కడకు వచ్చారు. (91)
తతో గత్వాథ తద్ వేశ్మ కీచకం వినిపాతితమ్।
గతాసుం దదృశుర్భూమౌ రుధిరేణ సముక్షితమ్॥ 92
వారంతా నర్తనశాలలోపలకు వెళ్లి రక్తంతో తడిసి ముద్దయి నేలపై చచ్చిపడిఉన్న కీచకుణ్ణి చూశారు. (92)
పాణిపాదవిహీనం తు దృష్ట్వా చ వ్యథితాఽభవన్।
నిరీక్షంతి తతః సర్వే పరం విస్మయమాగతాః॥ 93
కాళ్లు చేతులు లేని, ఆ కీచకుణ్ణి చూసి వారు బాధ పడ్డారు. ఆశ్చర్యంతో అతణ్ణి చాలా పరీక్షగా చూశారు. (93)
అమానుషం కృతం కర్మ తం దృష్ట్వా వినిపాతితమ్।
క్వాస్య గ్రీవా క్వ చరణౌ క్వ పాణీ క్వ శిరస్తథా।
ఇతి స్మ తం పరీక్షంతే గంధర్వేణ హతం తదా॥ 94
కీచకుడు ఈ విధంగా చావడం చూసి వాళ్లు తమలో తాము ఇలా అనుకొన్నారు. ఇది మనుష్యులు చేసిన పనిగా కనిపించడంలేదు. చూశారా. వీడి మెడ చేతులు, కాళ్లు ఎక్కడకు పోయాయి? అలా అనుకుని పరీక్షగాచూసి గంధర్వులే అతడిని చంపారనే నిశ్చయానికి వచ్చారు. (94)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధ పర్వణి కీచకవధే ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున భీమకీచకుల యుద్ధము - కీచకవధ అను ఇరువది రెండవ అధ్యాయము. (22)
(దాక్షిణాత్య అధికపాఠము 2 1/2 శ్లోకములు కలుపుకొని మొత్తము 96 1/2 శ్లోకములు)