24. ఇరువదినాల్గవ అధ్యాయము

ద్రౌపది బృహన్నలతో సంభాషించుట.

వైశంపాయన ఉవాచ
తే దృష్ట్వా నిహతాన్ సూతాన్ రాజ్ఞే గత్వా న్యవేదయన్।
గంధర్వైర్నిహతా రాజన్ సూతపుత్రా మహాబలాః॥ 1
వైశంపాయనుడు అన్నాడు. ఆ నగరంలో జనమంతా ఉపకీచకుల మరణం చూసి రాజు దగ్గరకు వెళ్ళి 'రాజా! గంధర్వులు సూతపుత్రులైన ఉపకీచకుల్ని చంపేశారు' అని చెప్పారు. (1)
యథా వజ్రేణ వై దీర్ణం పర్వతస్య మహచ్ఛిరః।
వ్యతికీర్ణాః ప్రదృశ్యంతే తథా సూతా మహీతలే॥ 2
ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల శిఖరాల్ని చీల్చినప్పుడు ఎలా పడిపోతాయో అలాగే ఈ సూతపుత్రులు నేలపై అంతటా పడిఉన్నారు. (2)
సైరంధ్రీ చ విముక్తాసౌ పునరాయాతి తే గృహమ్।
సర్వం సంశయితం రాజన్ నగరం తే భవిష్యతి॥ 3
సైరంధ్రి బంధవిముక్తయై మళ్లీ మీఇంటికి వస్తోంది. ఆమె వస్తే నీనగరమంతా సంశయగ్రస్త మవుతుంది. (అసలు నీనగరమూ, ప్రజలూ దక్కుతారా అని సందేహం) (3)
యథారూపా చ సైరంధ్రీ గంధర్వాశ్చ మహాబలాః।
పుంసామిష్టశ్చ విషయః మైథునాయ న సంశయః॥ 4
ఆ సైరంధ్రి ఎంత అందగత్తెయో ఆ గంధర్వులు అంత బలవంతులు. పురుషులకు రతిక్రీడ అంటే ఇష్టం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. (4)
యథా సైరంధ్రిదోషేణ న తే రాజన్నిదం పురమ్।
వినాశమేతి వై క్షిప్రం తథా నీతిర్విధీయతామ్॥ 5
ఈసైరంధ్రివల్ల మన పట్టణం నశించి పోకుండా వెంటనే తగిన నీతిని అనుసరించండి. (5)
వి॥తె॥ ఈమాటలు ప్రజలు విరాటునితో చెప్పినట్లుంది. కాని తెలుగులో కొద్ది మార్చాడు తిక్కన. విరాటుడు సుదేష్ణతో అంటాడు. చక్కని పద్యం.
ఉ॥ ఆకమలాక్షిరూపమహిమాతిశయంబు మనోహరంబు, భో
గైకపరాయణుల్ పురుషు;లంగజుఁడప్రతికారచేష్టిత
స్వీకృతలోకుఁ;డట్లగుట చేటు పురంబున వారి కెప్పుడుం
గా కెటులుండు? నిట్టి యవగాఢపు పొత్తు మనంగ వచ్చునే? (3-33)
ఆ సైరంధ్రి సౌందర్యవిశేషం అందరిమనస్సులనూ ఆకర్షిస్తుంది. మగవాళ్లు భోగాసక్తులై ఉంటారు. మన్మథుడు తన చేష్టలతో లోకులందరినీ లొంగదీసుకొన్నవాడు. అందుచేత పురజనులకు చేటురాకుండా ఎలా ఉంటుంది? ప్రమాదకరమైన ఈపొత్తు ఉండవచ్చునా?
తేషాం తద్వచనం శ్రుత్వా విరాటో వాహినీపతిః।
అబ్రవీత్ క్రియతామేషాం సూతానాం పరమక్రియా॥ 6
ప్రజల మాటలు విని సైన్యాధిపతియైన విరాట మహారాజు వారితో 'ఆ సూతపుత్రులకు ఉత్తరక్రియలు చెయ్యండి' అన్నాడు. (6)
ఏకస్మిన్నేవ తే సర్వే సుసమిద్ధే హుతాశనే।
దహ్యంతాం కీచకాః శీఘ్రం రత్నైర్గంధైశ్చ సర్వశః॥ 7
రత్నాలు, మంచిగంధం మొదలయిన సుగంధ ద్రవ్యాలతో వెంటనే వారందరికీ ఒకే అగ్నితో దహనసంస్కారాలు చెయ్యండి. (7)
సుదేష్ణామబ్రవీద్ రాజా మహిషీం జాతసాధ్వసః।
సైరంధ్రీమాగతాం బ్రూయాః మమైవ వచనాదిదమ్॥ 8
ఆ తరువాత విరాటరాజు కంగారుగా భయంతో సుదేష్ణ దగ్గరికి వెళ్లాడు. ఆమెతో 'దేవీ! సైరంధ్రి ఇక్కడకు వచ్చాక ఆమెతో నామాటగా ఇలా చెప్పు. (8)
గచ్ఛ సైరంధ్రి భద్రం తే యథాకామం వరాననే।
బిభేతు రాజా సుశ్రోణి గంధర్వేభ్యః పరాభవాత్॥ 9
సైరంధ్రీ! నీకు శుభం కల్గుతుంది. నీకిష్టమైన చోటికి వెళ్లిపో. సుశ్రోణీ! గంధర్వులవల్ల పరాభవానికి రాజు చాలా భయపడుతున్నాడు. (9)
న హి త్వాముత్సహే వక్తుం స్వయం గంధర్వరక్షితామ్।
స్త్రియాస్త్వదోషస్తాం వక్తుమ్ అతస్త్వాం ప్రబ్రవీమ్యహమ్॥ 10
గంధర్వులు నిన్ను రక్షిస్తున్నారు. నేను మగవాణ్ణి అవడంవల్ల నీతో స్వయంగా మాట్లాడలేకపోతున్నా. కాని స్త్రీలు అటువంటి మాటలు నీతో మాట్లాడ్డం తప్పుకాదు. అందుచే నేను భార్యద్వారా ఈవిషయం చెపుతున్నా' అన్నాడు. (10)
వైశంపాయన ఉవాచ
అథ ముక్తా భయాత్ కృష్ణా సూతపుత్రాన్ నిరస్య చ।
మోక్షితా భీమసేనేన జగామ నగరం ప్రతి ॥ 11
వైశంపాయనుడు అన్నాడు. తరువాత భీమునిచే విడిపింపబడి సూతపుత్రులను దాటి ద్రౌపది భయంవదిలి నగరానికి బయలుదేరింది. (11)
త్రాసితేవ మృగీ బాలా శార్దూలేన మనస్వినీ।
గాత్రాణి వాససీ చైవ ప్రక్షాల్య సలిలేన సా॥ 12
మనస్వినియైన ఆమె నీటితో శరీరాన్ని, బట్టల్ని శుభ్రం చేసుకొని పెద్దపులివల్ల భయపడ్డ ఆడ లేడిపిల్ల వలె నగరాన్ని చేరుకుంది. (12)
తాం దృష్ట్వా పురుషా రాజన్ ప్రాద్రవంత దిశో దశ।
గంధర్వాణాం భయత్రస్తాః కేచిద్దృష్ట్వా న్యమీలయన్॥ 13
జనమేజయమహారాజా! ఆ సమయంలో గంధర్వులవల్ల భయపడ్డ పురుషులందరు ఆమెను చూసి దశదిశలకు పరుగెత్తారు. కొంతమంది భయపడి కళ్లు మూసుకొన్నారు. (13)
తతో మహానసద్వారి భీమసేనమవస్థితమ్।
దదర్శ రాజన్ పాంచాలీ యథా మత్తం మహాద్విపమ్॥ 14
రాజా! అపుడు పాంచాలి పాకశాలగుమ్మంలో మదపుటేనుగులా నిలుచున్న భీముణ్ణి చూసింది. (14)
తం విస్మయంతీ శునకైః సంజ్ఞాభిరిదమబ్రవీత్।
గంధర్వరాజాయ నమః యేనాస్మి పరిమోచితా॥ 15
అపుడు ద్రౌపది భీమునకు ఆశ్చర్యం కల్గించేటట్లు "నన్ను కష్టాలనుండి విడిపించిన గంధర్వరాజుకు నమస్కారం" అని మెల్లగా సైగలతో అంది. (15)
వి॥తె॥ ద్రౌపది భీముని వైపు చూడకుండా తనలో తాననుకొన్నట్లు ఇలా అంది. "కీచకులు చేసే పాపకృత్యం నుండి తప్పించి నన్ను కాపాడిన గంధర్వరాజుకు ఎల్లప్పుడూ భక్తి తాత్పర్యాలతో నమస్కరిస్తూ జీవిస్తాను. (3-40)
భీమసేన ఉవాచ
యే పురా విచరంతీహ పురుషా వశవర్తినః।
తస్యాస్తే వచనం శ్రుత్వా హ్యనృణా విహరంత్వతః॥ 16
అపుడు భీముడు అన్నాడు. 'పూర్వం నుండి నీకు వశమయి తిరిగే ఆ గంధర్వులు ఈనాడు నీ ఈ మాటవిని తమ ప్రతిజ్ఞను చెల్లించుకొని ఋణవిముక్తులై తిరుగుతారు.' (16)
వి॥తె॥ భీముడిలా అన్నాడు. భార్యను ఆపదనుండి రక్షింపని భర్త భర్తయేకాడు. రక్షించడం పురుషధర్మం. లోకన్యాయం. అలా చేస్తేనే భార్య సంతోషిస్తుంది. అది వారి ధర్మం కనుక వారిని ఆ పని చేసినందుకు ప్రశంసించవలసిన పని లేదు. (3-42)
వైశంపాయన ఉవాచ
తతః సా నర్తనాగారే ధనంజయ మపశ్యత।
రాజ్ఞః కన్యా విరాటస్య నర్తయానం మహాభుజమ్॥ 17
వైశంపాయనుడు అన్నాడు. తరువాత ద్రౌపది నర్తనశాల వద్దకువెళ్ళి విరాటకన్యలకు నాట్యం నేర్పుతున్న అర్జునుని చూసింది. (17)
తతస్తా నర్తనాగారాద్ వినిష్క్రమ్య సహార్జునాః।
కన్యా దదృశురాయాంతీం క్లిష్టాం కృష్ణామనాగసమ్॥ 18
అపుడు రాజకన్యలు అర్జునునితోకూడా నర్తనశాల నుండి బయటకువచ్చి నిరపరాధినియై కష్టాల ననుభవిస్తూ ఆ సమీపానికి వస్తున్న ద్రౌపదిని చూశారు. (18)
కన్యా ఊచుః
దిష్ట్వా సైరంధ్రి ముక్తాసి దిష్ట్వాసి పునరాగతా।
దిష్ట్వా వినిహతాః సూతాః యే త్వాం క్లిశ్యంత్యనాగసమ్॥ 19
కన్యలు అన్నారు. 'సైరంధ్రీ నీవు దైవవశంచేత బయటపడ్డావు. తిరిగి రాగలిగావు. ఏ పాపమెరుగని నిన్ను కష్టపెట్టిన కీచకుడూ, ఉపకీచకులూ మరణించారు.' (19)
బృహన్నలోవాచ
కథం సైరంధ్రి ముక్తాసి కథం పాపాశ్చ తే హతాః।
ఇచ్ఛామి వై తవ శ్రోతుం సర్వమేవ యథాతథమ్॥ 20
బృహన్నల అన్నాడు. 'సైరంధ్రీ నీవు ఎలా విడుదలయ్యావు. ఆ పాపాత్ము లెలా మరణించారు. నీ సంగతంతా ఉన్నదున్నట్లుగా వినగోరుతున్నాను.' (20)
సైరంధ్ర్యువాచ
బృహన్నలే కిం ను తవ సైరంధ్ర్యా కార్యమద్య వై।
యా త్వం వససి కల్యాణి సదా కన్యాపురే సుఖమ్॥ 21
సైరంధ్రి అంది. 'బృహన్నలా! నీకిప్పుడు సైరంధ్రితో పనేముంది? నీవు ఎల్లప్పుడు కన్యాంతఃపురంలో సుఖంగా ఉంటుంటావుగా. (21)
వి॥తె॥ 'నీ మాటల్లో వినాలని ఉంది' అని బృహన్నల అంటే దానికి సైరంధ్రి 'రాజకన్యలకు నృత్యం నేర్పుతూ సుఖంగా ఉండే నీకు ఈసైరంధ్రి ఏమయితే ఏమిటి?' అంటుంది. దానికి సమాధానంగా అర్జునుడు "ఈ అసహ్యపు పుట్టువు పుట్టిన నాబాధ ఎవరికి తెలుస్తుంది? నేనెంతబాధ పడుతున్నానో" అంటాడు.
న హి దుఃఖం సమాప్నోషి సైరంధ్రీ యదుపాశ్నుతే।
తేన మాం దుఃఖితామేవం పృచ్ఛసే ప్రహసన్నివ॥ 22
నాలాంటి పనివారు పొందే కష్టం నీవు పొందవవు కదా! అందుకే ఏడుస్తున్న నన్ను చూసి నీవు నవ్వుతూ మాట్లాడుతున్నావు.' (22)
బృహన్నలోవాచ
బృహన్నలాపి కల్యాణి దుఃఖమాప్నోత్యనుత్తమమ్।
తిర్యగ్యోనిగతా బాలే న చైనామవబుధ్యసే॥ 23
బృహన్నల అన్నాడు. 'కల్యాణీ! బృహన్నలకు కూడ చెప్పలేనంత బాధ కలుగుతున్నది. బాలా! బృహన్నల నీచపుట్టువు పుట్టుటచే ఏమిచేయలేని స్థితి ఉన్నది. ఈ విషయాన్ని నీవు తెలుసుకోలేక పోతున్నావు. (23)
వి॥ సం॥ 1. తిర్యగ్యోని యనగా నీచ శరీరము అని (నీల)
2. 'బాలే' అనుదానికి వాలే అని పాఠాంతమరమనియు వా+అలే = వా = ఇవార్థము. అలే = చెలియా! అనిసంబోధన (అర్జు)
వి॥ తె॥ తిర్యగ్యోని గతా అన్నదానికి తిక్కమ' ఎవపుపుట్టువు' అని తెనిగించాడు.(అసహ్యపు జన్మ)
త్వయా సహోషితా చాస్మి త్వం చ సర్వైః సహోషితా।
క్లిశ్యత్యాం త్వయి సుశ్రోణి కో ను దుఃఖం న చింతయేత్॥ 24
చాలాకాలంనుండి నీతో ఉంటున్నాను. నీవు కూడ చాలాకాలంనుండి అందరితో కలిసిఉంటున్నావు. సుశ్రోణీ! నీవు బాధపడుతుంటే ఎవరు బాధపడకుండా ఉంటారు? (24)
న తు కేనచిదత్యంతం కస్య చిద్ధృదయం క్వచిత్।
వేదితుం శక్యతే నూనం తేన మాం నావబుధ్యసే॥ 25
ఒకవ్యక్తి మరొకరి హృదయాన్ని ఎన్నడూ తెలుసుకోలేడు. అందుకే నన్ను అర్థం చేసుకోలేక పోతున్నావు.' (25)
వైశంపాయన ఉవాచ
తతః సహైవ కన్యాభిః ద్రౌపదీ రాజవేశ్మ తత్।
ప్రవివేశ సుదేష్ణాయాః సమీపముపగామినీ॥ 26
వైశంపాయనుడు అన్నాడు. తరువాత ద్రౌపదీ రాజకన్యలతో అంతఃపురంలో ప్రవేశించి మెల్లగా సుదేష్ణ సమీపానికి వెళ్లింది. (26)
తామబ్రవీద్ రాజపుత్రీ విరాటవచనాదిదమ్।
సైరంధ్రి గమ్యతాం శీఘ్రం యత్ర కామయసే గతిమ్॥ 27
రాజపుత్రియగు సుదేష్ణ విరాటరాజుమాటలుగా ఇలా అంది. "సైరంధ్రీ! నీవు వెంటనే నీకు నచ్చినచోటికి వెళ్లిపొమ్ము. (27)
రాజా బిభేతి తే భద్రే గంధర్వేభ్యః పరాభవాత్।
త్వం చాపి తరుణీ సుభ్రు రూపేణాప్రతిమా భువి।
పుంసామిష్టశ్చ విషయః గంధర్వాశ్చాతికోపనాః॥ 28
పూజ్యురాలా! రాజయిన విరాటుడు గంధర్వులేమి పరాభవిస్తారో అని భయపడుతున్నాడు. అందమైన కనుబొమలుగలదానా! నీవు ఈభూమిపై అపురూప సౌందర్యరాశివి. పురుషులు అందగత్తెల్ని చూస్తే మోహించడం సహజం. గంధర్వులేమో చాలాకోపం గలవాళ్ళు. (28)
వి॥తె॥ "గంధర్వాశ్చాతికోపనాః" అన్న మాటనాధారంగా చేసుకొని తిక్కన సుదేష్ణచేత సైరంధ్రితో ఇలా అనిపిస్తాడు.
బిరుదు గల మగలు గలరని
తరమిడి చంపింపఁ జూచెదవు; జనములు నీ
పొరువునఁ బో వెఱతురు; మా
పురమును రాష్ట్రంబు వెడలి పొ మ్మెందైనన్,
కీచక మరణం సుదేష్ణను ఎంతగా బాధించిందో ఈమాటలవల్ల తెలుస్తుంది.
సైరంధ్ర్యువాచ
త్రయోదశాహమాత్రం మే రాజా క్షామ్యతు భామిని।
కృతకృత్యా భవిష్యంతి గంధర్వాస్తే న సంశయః॥ 29
సైరంధ్రి అంది.' భామినీ! కేవలం ఇంక పదమూడు రోజులు మాత్రమే రాజు నాకు అనుమతి ఇవ్వాలి. (నేను ఇక్కడ ఉంటాను.) అప్పటికి గంధర్వులు కృతకృత్యు లౌతారు. ఇందులో నీకు ఎటువంటి సందేహం లేదు. (29)
తతో మాముపనేష్యంతి కరిష్యంతి చ తే ప్రియమ్।
ధ్రువం చ శ్రేయసా రాజా యోక్ష్యతే సహబాంధవైః॥ 30
తరువాత నన్ను గంధర్వులు తీసుకుపోతారు. నీకు తప్పక మేలు చేస్తారు. రాజునూ, బంధువులనూ క్షేమంగా నిలుపుతారు. ఇది నిజం. (30)
వి॥తె॥ ఇక్కడ సైరంధ్రి సుదేష్ణను పదుమూడు రోజులుండ నిమ్మని అర్థించినట్లు అంది. కాని ఆమె అంగీకరించి నట్లు చెప్పలేదు. తిక్కన దాన్ని వివరాలతో చెప్పాడు. సైరంధ్రి మరింత తెలివితేటలతో మాట్లాడినట్లు ఉంది. ఎదుటివారి మనసు తెలిసికొనగల ధీశక్తి మాత్రమే గాక సైరంధ్రికి వరుల మనసును నియంత్రించగల శక్తి కూడ ఉన్నట్లు కనిపిస్తుంది.
సైరంధ్రి ఇలా అంటోంది. "దానికి కారణం ఏమిటి? అని పరిపరివిధాలుగా ఆలోచించవద్దు. "ఏమయితే ఏమిటిలే. ఏమీ మునిగిపోదు. నాకీ ఆలోచన అనవసరం. ఏదో ప్రార్థిస్తోందిలే. అని ఉదాసీనంగా నిశ్చయించడం నీకు తగును" అన్నది. అపుడు సుదేష్ణ "అంత వరకు అయితే ఉండు. నాపిల్లలను భర్తను కని పెట్టిఉండు. నీమనసు శాంతించే ఏర్ఫాటుచేస్తాను" అంటుంది.
(రాజా కృతోపకారాశ్చ కృతజ్ఞాశ్చ సదా శుభే।
సాధవశ్చ బలోత్సిక్తాః కృతప్రతికృతేప్సవః।
అర్థినీ ప్రబ్రవీమ్యేషా యద్ వా తద్ వేతి చింతయ।
భరస్వ తదహర్మాత్రం తతః శ్రేయో భవిష్యతి॥
శుభప్రదమైనదానా! రాజువల్ల ఉపకారం పొందిన నాభర్తలు చేసిన మేలు మరువనివారు. వారు సత్పురుషులు. బలవంతులు. పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలనుకొనేవాళ్లు. నేను నిన్ను బ్రతిమాలుకొంటున్నాను. ఏదోవిధంగా అనుకో. అంతవరకు భరించు. ఆపై మేలు కల్గుతుంది.'
వైశంపాయన ఉవాచ
తస్యాస్తద్ వచనం శ్రుత్వా కైకేయీ దుఃఖమోహితా।
ఉవాచ ద్రౌపదీమార్తా భ్రాతృవ్యసనకర్శితా॥
వస భద్రే యథేష్టం త్వం త్వామహం శరణం గతా।
త్రాయస్వ మమ భర్తారం పుత్రాంశ్చైవ విశేషతః॥)
సోదరులు మరణించటంవల్ల ఎంతో బాధపడుతున్న సుదేష్ణ ఆ ద్రౌపది చేసిన దీనమైన ప్రార్థన విని ఆమెతో "పూజ్యురాలా! నీవు నీఇష్టం వచ్చినట్లుండు. నేను నిన్ను శరణువేడుకొంటున్నాను. ముఖ్యంగా నాభర్తను, పిల్లల్ని ఏకష్టం కలగకుండా రక్షించు." అంది.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి కీచకదాహే చతుర్వింసోఽధ్యాయః॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున కీచకదహనసంస్కారము అను ఇరువదినాల్గవ అధ్యాయము. (24)
(దాక్షిణాత్య అధికపాఠము 4 శ్లోకములు కలిసి మొత్తం 34 శ్లోకాలు.)
శోకస్థానసహస్రాణి బయస్థానశతాని చ।
దివసే దివసే మూఢమ్ ఆవిశన్తి న పండితమ్॥