33. ముప్పదిమూడవ అధ్యాయము
పాండవులు సుశర్మను ఓడించి విరాటుని విడిపించుట.
వైశంపాయన ఉవాచ
తమసాభిప్లుతే లోకే రజసా చైవ భారత।
అతిష్ఠన్ వై ముహూర్తం తు వ్యూఢానీకాః ప్రహారిణః॥ 1
వైశంపాయనుడు అన్నాడు. భారతా! అపుడు జనులంతా దుమ్ముతోనిండి చీకటిచే ఆవరింపబడ్డారు.
యుద్ధం చేసే సైనికులు వ్యూహంగా నిలిచి కొంచెం సేపు యుద్ధం నిలిపివేశారు. (1)
తతోఽంధకారం ప్రణుదన్ ఉదతిష్ఠత చంద్రమాః।
కుర్వాణో విమలాం రాత్రిం నందయన్ క్షత్రియాన్ యుధి॥ 2
ఇంతలో చీకటిని తొలగిస్తూ చంద్రుడుదయించి రణరంగంలో క్షత్రియులకానందమిస్తూ ఆ రాత్రిని చీకటిలేనిదిగా చేశాడు. (2)
తతః ప్రకాశ మాసాద్య పున ర్యుద్ధమవర్తత।
ఘోరరూపం తతస్తే స్మ నావైక్షంత పరస్పరమ్॥ 3
తరువాత వెలుగు వచ్చాక మరల ఘోర యుద్ధం ప్రారంభమయింది. ఆసమయంలో (యుద్ధావేశంలో) యోధులు ఒకరినొకరు చూడలేకపోయారు. (3)
తతః సుశర్మా త్రైగర్తః సహ భ్రాత్రా యవీయసా।
అభ్యద్రవన్మత్స్యరాజం రథవ్రాతేన సర్వశః॥ 4
తరువాత త్రిగర్తరాజు సుశర్మ తన తమ్మునితో కూడా రథికుల సమూహాన్ని వెంటబెట్టుకొని నాలుగు వైపులనుండి మత్స్యరాజు విరాటుని చుట్టుముట్టాడు. (4)
తతో రథాభ్యాం ప్రస్కంద్య భ్రాతరౌ క్షత్రియర్షభౌ।
గదాపాణీ సుసంరబ్ధౌ సమభ్యద్రవతాం రథాన్॥ 5
క్షత్రియులలో శ్రేష్ఠులయిన ఆ సోదరులిద్దరూ రథాల నుండి క్రిందికి దూకి, గదలు చేతితో పట్టుకొని క్రోధంతో శత్రువుల రథసైన్యంవైపు ఉరికారు. (5)
(మత్తావివ వృషావేతౌ గజావివ మదోద్ధతౌ।
సింహావివ గజగ్రాహౌ శక్రవృత్రావివోత్థితౌ॥
ఉభౌ తుల్యబలోత్సాహౌ ఉభౌ తుల్యపరాక్రమౌ।
ఉభౌ తుల్యాస్త్రవిదుషా ఉభౌ యుద్ధవిశారదౌ॥ )
వారిద్దరూ మదించిన ఎద్దులవలె, మదోన్మత్తా లయిన గజరాజులవలె, ఏనుగును పట్టుకొనే రెండు సింహాలవలె, యుద్ధసన్నద్ధులయిన ఇంద్ర వృత్రాసురుల వలె ఉన్నారు. వారిరువురి బలం, ఉత్సాహం సమానం. వారు సమాన పరాక్రమం కలవారు, సమానంగా అస్త్రసస్త్రాల నెరిగినవారు, యుద్ధనిపుణులు.
తథైవ తేషాంతు బలాని తాని
క్రుద్ఢాన్యథాన్యోన్యమభిద్రవంతి।
గదాసిఖడ్గైశ్చ పరశ్వథైశ్చ
ప్రాసైశ్చ తీక్ష్ణాగ్రసుపీతధారైః॥ 6
ఈ విధంగానే ఆసేనలన్నీ కోపగించి, గద, చురకత్తి, ఖడ్గం, గండ్రగొడ్డలి, పదునైన అంచు సూదిమొన కల బల్లెములతో ఒకరిని ఒకరు డీకొంటున్నారు. (6)
బలంతు మత్స్యస్య బలేన రాజా
సర్వం త్రిగర్తాధిపతిః సుశర్మా।
ప్రమథ్య జిత్వా చ ప్రసహ్య మత్స్యం
విరాటమోఝస్వినమభ్యధావత్॥ 7
తౌ నిహత్య పృథగ్ ధుర్యౌ ఉభౌ తౌ పార్ష్ణిసారథీ।
విరథం మత్స్యరాజానం జీవగ్రాహమగృహ్ణాతామ్॥ 8
త్రిగర్తదేశాధిపతి సుశర్మ మత్స్యరాజసేనను తన బలగంతో కలచివేసి, ఓడించి పరాక్రమ వంతుడైన విరాటరాజును డీకొన్నాడు. సుశర్మ, సోదరుడు వేరు వేరుగా విరాటుని రెండు గుర్రాలనూ చక్ర భాగాన్ని రక్షించే సైనికులనూ సారథినీ చంపారు. రథహీనుడైన విరాటుని ప్రాణాలతో పట్టుకొన్నారు. (7,8)
తమున్మథ్య సుశర్మాథ యువతీమివ కాముకః।
స్యందనం స్వం సమారోప్య ప్రయయౌ శీఘ్రవాహనః॥ 9
కాముకుడు యువతిని బలాత్కరించి పట్టు కొన్నట్టు సుశర్మ విరాటరాజును పట్టుకొన్నాడు. వేగంగా వెళ్ళే గుర్రాలు పూన్చిన తనరథంపై ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. (9)
తస్మిన్ గృహీతే విరథే విరాటే బలవత్తరే।
ప్రాద్రవంత భయాన్మత్స్యాః త్రిగర్తైరర్దితా భృశమ్॥ 10
బలవంతుడైన విరాటరాజు రథహీనుడై పట్టుబడగానే, త్రిగర్తులచే పీడింపబడుతున్న మత్స్యదేశ సైనికులు భయంతో పారిపోయారు. (10)
తేషు సంత్రస్యమానేషు కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ప్రత్యభాషన్మహాబాహుం భీమసేనమరిందమమ్॥ 11
వారు భయపడిపోతూ ఉండగా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు శత్రువులను శిక్షించే మహాబాహువైన భీమసేనునితో ఇలా అన్నాడు. (11)
మత్స్యరాజః పరామృష్టః త్రిగర్తేన సుశర్మణా।
తం మోచయ మహాబాహో న గచ్ఛేద్ ద్విషతాం వశమ్॥ 12
'మహాబాహూ! మత్స్యరాజు విరాటుణ్ణి త్రిగర్తరాజు సుశర్మ పట్టుకొన్నాడు. అతనిని వెంటనే విడిపించు. అతడు శత్రువులకు వశం కాకూడదు. (12)
ఉషితాః స్మ సుఖం సర్వే సర్వకామైః సుపూజితాః।
భీమసేన! త్వయా కార్యా తస్య వాసస్య నిష్కృతిః॥ 13
మనమందరం మత్స్యనగరంలో సుఖంగా నివసించాం. అతడు మనకు అన్ని విధాలా ఇష్టమయిన వస్తువు లిచ్చి మనసు చాలా బాగా సత్కరించాడు. భీమసేనా! అతని యింటిలో నివసించినందువల్ల అతనికి ప్రత్యుపకారం నీవు చేయాలి.' (13)
భీమసేన ఉవాచ
అహమేనం పరిత్రాస్యే శాసనాత్ తవ పార్థివ।
పశ్య మే సుమహత్ కర్మ యుధ్యతః సహ శత్రుభిః॥ 14
భీమసేనుడు అన్నాడు. 'మహారాజా! నీ ఆజ్ఞవల్ల విరాటుణ్ణి సుశర్మచేతులలోనుండి నేను విడిపించి రక్షితాను. ఇపుడు నేను శత్రువులతో యుద్ధం చేసే సమయంలో నా పరాక్రమాన్ని చూడు. (14)
స్వబాహుబలమాశ్రిత్య తిష్ఠత్వం భ్రాతృభిస్సహ।
ఏకాంత మాశ్రితో రాజన్ పశ్యమేఽద్యపరాక్రమమ్॥ 15
రాజా! తమరు బాహుబలాన్ని ఆశ్రయించి నిలిచి సోదరులతో కూడా ఏకాంతంలో ఉండి ఇపుడు నా పరాక్రమాన్ని చూడండి. (15)
సుస్కంధోఽయం మహావృక్షః గదారూప ఇవ స్థితః।
అహమేనమపారుజ్య ద్రావయిష్యామి శాత్రవాన్॥ 16
దగ్గర ఉన్న ఈ మహావృక్షానికి మ్రాను చాలా అందంగా గదవలె ఉంది. దీనిని నేను పెకలించి దీనితో శత్రుదళాలను తరుముతాను.' (16)
వైశంపాయన ఉవాచ
తం మత్తమివ మాతంగం వీక్షమాణం వనస్పతిమ్।
అబ్రవీద్ భ్రాతరం వీరం ధర్మరాజో యుధిష్ఠిరః॥ 17
వైశంపాయనుడు చెపుతున్నాడు. ఇలా చెపుతూ భీమసేనుడు మదోన్మత్తమయిన గజరాజువలె ఆ వృక్షం కేసి చూశాడు. అపుడు యుధిష్ఠిరుడు తన సోదరునితో ఇలా అన్నాడు. (17)
మా భీమ సాహసం కార్షీః తిష్ఠత్వేష వనస్పతిః।
మా త్వం వృక్షేణ కర్మాణి కుర్వాణమతిమానుషమ్॥ 18
జనాః సమవబుధ్యేరన్ భీమోఽయమితి భారత।
అన్యదేవాయుధం కించిద్ ప్రతిపద్యస్వ మానుషమ్॥ 19
'భీమసేనా! ఇలాంటి దుస్సాహసం చేయవద్దు.ఈ వృక్షాన్ని ఉండనీ. నీవీవృక్షాన్నీ పెకలించి మానవుల కసాధ్యమయిన పని చేస్తే జనులందరూ నీవు భీముడవు అని గుర్తిస్తారు. కాబట్టి నీవు మానవులకు తగిన మరో ఆయుధాన్ని తీసుకో. (18,19)
చాపం వా యది వా శక్తిం నిస్త్రింశం వా పరశ్వధమ్।
యదేవ మానుషం భీమ భవేదన్యైరలక్షితమ్॥ 20
తదేవాయుధ మాదాయ మోక్షయాశు మహీపతిమ్।
యమౌ చ చక్రరక్షౌ తే భవితారౌ మహాబలౌ॥ 21
సహితాః సమరే తత్ర మత్స్యరాజం పరీప్సతః।
ఇతరులకు నీవు భీమసేనుడవని తెలియని విధంగా ధనుస్సు, శక్తి, కత్తి, గొడ్డలి మొదలయిన మనుష్యోచితాలయిన ఆయుధాలతో యుద్ధం చేసి శీఘ్రంగా రాజును విడిపించు. మహాబలవంతులయిన నకుల సహదేవులు నీ రథచక్రరక్షకులుగా ఉంటారు. మీ ముగ్గురూ కలిసి యుద్ధం చేసి విరాటమహారాజును విడిపించండి.' (20,21 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు వేగేన భీమసేనో మహాబలః।
గృహీత్వా తు ధనుఃశ్రేష్ఠం జవేన సుమహాజవః॥ 22
వ్యముంచచ్ఛరవర్షాణి సతోయ ఇవ తోయదః॥ 23
వైశంపాయనుడు చెపుతున్నాడు - రాజా! యుధిష్ఠిరుడు ఇలా ఆదేశించాక మహావేగశాలి. బలవంతుడు అయిన భీమసేనుడు వేగంగా ఒక గొప్ప ధనుస్సును తీసుకొని మేఘం నీటిధారలను కురిపించినట్లు బాణవర్షం కురిపించాడు. (22,23)
తం భీమో భీమకర్మాణాం సుశర్మాణమథాద్రవత్।
విరాటం సమవీక్ష్యైనం తిష్ఠ తిష్ఠేతి చావదత్॥ 24
తరువాత భీమసేనుడు భయంకరుడయిన సుశర్మ వైపు పరుగుపెట్టాడు. విరాటుని వైపు చూస్తూ సుశర్మతో 'ఓయీ! ఆగు, ఆగు' అన్నాడు. (24)
సుశర్మా చింతయామాస కాలాంతకయమోపమమ్।
తిష్ఠ తిష్ఠేతి భాషంతమ్ పృష్ఠతో రథపుంగవః।
పశ్యతాం సుమహత్ కర్మ మహద్ యుద్ధముపస్థితమ్॥ 25
రథికులలో శ్రేష్ఠుడయిన సుశర్మ తనవెనుక వస్తూ 'ఆగు, ఆగు' అని అరుస్తూ, కాలాంతకుడయిన యమునితో సమానంగా భయంకరంగా ఉన్న వీరపురుషుని చూసి ఆలోచించాడు. తన తోటివారితో "చూడండి మరల పెద్దయుద్ధం వచ్చింది. ఇపుడు నా పరాక్రమం చూడండి" అన్నాడు. (25)
పరావృత్తో ధనుర్గృహ సుశర్మా భ్రాతృభిస్సహః।
నిమేషాంతరమాత్రేణ భీమసేనేన తే రథాః॥ 26
రథానాం చ గజానాం చ వాజినాం చ ససాదినామ్।
సహస్రశతసంఘాతాః శూరాణాముగ్రధన్వినామ్॥ 27
పాతితా భీమసేనేన విరాటస్య సమీపతః।
పత్తయో నిహతా స్తేషాం గదాం గృహ్య మహాత్మనా॥ 28
ఇలా చెపుతూ సుశర్మ సోదరులతో కూడా ధనుస్సులను పట్టుకొని వెనుదిరిగాడు. ఇటు మహాత్ముడయిన భీముడు నిమేషమాత్రంలో శత్రువులకు భయాన్ని కలిగించే ధనుర్ధరులైన రథికులను, గజవాహనులను, గుఱ్ఱపు రౌతులను ఒక లక్ష సైనికుల సమూహాలను విరాటరాజు ఎదుట సంహరించాడు. గద తీసుకుని చాలామంది పదాతులను కూడా చంపాడు. (26-28)
తద్దృష్ట్వా తాదృశం యుద్ధం సుశర్మా యుద్ధదుర్మదః।
చింతయామాస మనసా కిం శేషం హి బలస్య మే।
అపరో దృశ్యతే సైన్యే పురా మగ్నో మహాబలే॥ 29
ఇలాంటి భయానకమయిన యుద్ధాన్ని చూసి రణోన్మత్తుడయిన సుశర్మ మనస్సులో ఇలా విచారించాడు. 'నాసైన్యంలో ఏం మిగిలింది? నారెండో సోదరుడు ఈ విశాలసైన్యంలో ముందే మునిగి నట్లున్నాడు.' (29)
ఆకర్ణపూర్ణేన తదా ధనుషా ప్రత్యదృశ్యత।
సుశర్మా సాయకాం స్తీక్ష్ణాన్ క్షిపతే చ పునః పునః॥ 30
తత స్సమస్తా స్తే సర్వే తురగా నభ్యచోదయన్।
దివ్యమస్త్రం వికుర్వాణాః త్రిగర్తాన్ ప్రత్యమర్షణాః॥ 31
ఇలా విచారించి అతడు చెవివరకు లాగి ఎక్కుపెట్టిన ధనుస్సుతో యుద్ధానికి సిద్ధమై కనబడ్డాడు. సుశర్మ తీక్ష్ణమయిన బాణాలను మాటిమాటికి వేస్తున్నాడు. ఇది చూసి మత్స్యదేశయోధులందరూ త్రిగర్తులపై కోపగించి దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ రథాలను, గుఱ్ఱాలను ముందుకు నడిపారు. (30,31)
తాన్ నివృత్తరథాన్ దృష్ట్వా పాండవాన్ సా మహాచమూః।
వైరాటిః పరమక్రుద్ధః యుయుధే పరమాద్భుతమ్॥ 32
పాండవులు త్రిగర్తులవైపు వెళ్ళడం చూసి మత్స్య వీరుల విశాలసైన్యం కూడా త్రిగర్తులవైపు మళ్ళింది. విరాటరాజకుమారుడు శ్వేతుడు అత్యంతక్రోధంతో అద్భుతయుద్ధం చేశాడు. (32)
సహస్రమవధీత్తత్ర కుంతీపుత్త్రో యుధిష్ఠిరః।
భీమః సప్తసహస్రాణి యమలోకమదర్శయత్॥ 33
కుంతీపుత్త్రుడయిన యుధిష్ఠిరుడు వెయ్యి మంది త్రిగర్తులను చంపాడు. భీమసేనుడు ఏడువేలమంది యోధులకు యమలోకం చూపించాడు. (33)
నకులశ్చాపి సస్తైవ శతాని ప్రాహిణోచ్ఛరైః।
శతాని త్రీణి శూరాణాం సహదేవః ప్రతాపవాన్॥ 34
యుధిష్ఠిరసమాదిష్టః నిజఘ్నే పురుషర్షభః।
నకులుడు తన బాణాలతో ఏడువందల సైనికులను యమపురికి పంపాడు. పురుషులలో శ్రేష్ఠుడు, ప్రతాపవంతుడు అయిన సహదేవుడు ధర్మరాజు ఆజ్ఞచే మూడువందలమంది శూరులను సంహరించాడు. (34 1/2)
తతోఽభ్యపతదత్యుగ్రః సుశర్మాణముదాయుధః।
హత్వా తాం మహతీం సేనాం త్రిగర్తానాం మహారథః॥ 35
తరువాత మహారథియైన సహదేవుడు త్రిగర్తుల సైన్యాన్ని సంహరించడం కోసం మిక్కిలి ఉగ్రరూపాన్ని ధరించి ఆయుధంతో సుశర్మపైకి వెళ్ళాడు. (35)
తతో యుధిష్ఠిరో రాజా త్వరమాణో మహారథః।
అభిపత్య సుశర్మాణం శరైరభ్యాహనద్ భృశమ్॥ 36
మహారథుడైన ధర్మరాజు కూడా తొందరగా సుశర్మ మీదికి వెళ్ళి, అతనిని బాణాలతో మిక్కిలిగా కొట్టాడు. (36)
సుశర్మాపి సుసంరబ్ధః త్వరమాణో యుధిష్ఠిరమ్।
అవిధ్యన్నవభిర్బాణైః చతుర్భి శ్చతురో హయాన్॥ 37
అపుడు సుశర్మ కూడా మిక్కిలి కోపించి చాలా వేగంతో తొమ్మిది బాణాలతో ధర్మరాజును, నాలుగు బాణాలతో అతని నాలుగు గుఱ్ఱాలను కొట్టాడు. (37)
తతో రాజన్నాశుకారీ కుంతీపుత్రో వృకోదరః।
సమాసాద్య సుశర్మాణమ్ అశ్వానస్య వ్యపోథయత్॥ 38
పృష్ఠగోపాంశ్చ తస్యాథ హత్వా పరమసాయకైః।
అథాస్య సారథిం క్రుద్ధః రథోపస్థాదపాతయత్॥ 39
రాజా! శీఘ్రంగా యుద్ధం చేసే కుంతీపుత్రుడయిన భీముడు సుశర్మ దగ్గరకు వెళ్ళి అతని గుఱ్ఱాలను చంపాడు. అతని అంగరక్షకులయిన సైనికులను చంపి కోపంతో అతని సారథిని కూడా నొగలి నుండి పడ వేశాడు. (38,39)
చక్రరక్షశ్చ శూరో వై మదిరాక్షోఽతివిశ్రుతః।
సమాయాద్ విరథం దృష్ట్వా త్రిగర్తం ప్రాహరత్తదా॥ 40
సుశర్మకు రథం లేకపోవడంతో చక్రరక్షకుడు, సుప్రసిద్ధవీరుడు అయిన మదిరాక్షుడు, అక్కడకు వచ్చి త్రిగర్తరాజును బాణాలతో కొట్టాడు. (40)
తతో విరాటః ప్రస్కంద్య రథాదథ సుశర్మణః॥ 41
గదాం తస్య పరామృశ్య తమేవాభ్యద్రవద్బలీ।
స చచార గదాపాణిః వృద్ధోఽపి తరుణో యథా॥ 42
ఇంతలో బలవంతుడయిన విరాటరాజు సుశర్మ రథాన్నుండి క్రిందకు దూకి, అతని గదనే తీసుకొని సుశర్మ పైకి వెళ్ళాడు. గద పట్టిన విరాటరాజు ముసలివాడైనా యువకునితో సమానంగా రణభూమిలో సంచరించాడు. (41,42)
పలాయమానం త్రైగర్తం దృష్ట్వా భీమోఽభ్యభాషత।
రాజపుత్ర నివర్తస్వ న తే యుక్తం పలాయనమ్॥ 43
ఇంతలో పారిపోయే త్రిగర్తుని చూసి భీమసేనుడు "రాజకుమారా! వెనుదిరిగి రా. రణరంగంలో పారిపోవడం నీకు తగినది కాదు" అన్నాడు. (43)
అనేన వీర్యేణ కథం గాస్త్వం ప్రార్థయసే బలాత్।
కథం చానుచరాంస్త్యక్త్వా శత్రుమధ్యే విషీదసి॥ 44
ఈ పరాక్రమంతో నీవు విరాటుని గోవులను బలపూర్వకంగా ఎలా తీసుకువెళ్ళాలని కోరుకొన్నావు? నీ సేవకులను శత్రువులమధ్య వదిలి పారిపోతూ విషాదాన్ని ఎందుకు పొందుతున్నావు? (44)
ఇత్యుక్తః సతు పార్థేన సుశర్మా రథయూథపః।
తిష్ఠ తిష్ఠేతి భీమం సః సహసాభ్యద్రవద్ బలీ॥ 45
భీమస్తు భీమసంకాశః రథాత్ ప్రస్కంద్య పాండవః।
ప్రాద్రవత్ తూర్ణమవ్యగ్రః జీవితేప్సుః సుశర్మణః॥ 46
భీమసేనుడిలా చెప్పిన తరువాత రథయూథానికి అధిపతి, బలవంతుడూ అయిన సుశర్మ 'నిలు, నిలు' అంటూ భీమసేనుని మీదికి వచ్చాడు. భీముడు భీముని(రుద్రుని) వంటివాడే కనుక కొంచెం కూడా వ్యగ్రత పొందలేదు. రథాన్నుండి దిగి సుశర్మ ప్రాణాలు తీయడంకోసం వేగంగా అతనివైపు పరుగెత్తాడు. (45,46)
తం భీమసేనో ధావంతమ్ అభ్యధావత వీర్యవాన్।
త్రిగర్తరాజమాదాతుం సింహః క్షుద్రమృగం యథా॥ 47
చిన్న మృగాన్ని పట్టుకోవడానికి సింహం పరుగు పెడుతున్నట్లు పరాక్రమవంతుడైన భీముడు పారిపోతున్న సుశర్మ వెంట పడ్డాడు. (47)
అభిద్రుత్య సుశర్మాణం కేశపక్షే పరామృశత్।
సముద్యమ్య తు రోషాత్ తం నిష్పివేష మహీతలే॥ 48
ఒక్కదూకుతో అతని జుట్టు పట్టుకొని కోపంతో అతనిని ఎత్తి నేలపై పడవేసి గట్టిగా నొక్కివేశాడు. (48)
పదా మూర్ధ్ని మహాబాహుః ప్రాహరద్ విలపిష్యతః।
తస్య జానుం దదౌ భీమః జఘ్నే చైనమరత్నినా।
స మోహమగమద్ రాజా ప్రహారవరపీడితః॥ 49
సుశర్మ ఏడుస్తున్నా తలపై మోకాలు పెట్టి, భీముడు మోచేతితో కొట్టాడు. ఆపెద్ద దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. (49)
తస్మిన్ గృహీతే విరథే త్రిగర్తానాం మహారథే।
అభజ్యత బలం సర్వం త్రైగర్తం తద్ భయాతురమ్॥ 50
త్రిగర్తుల మహారథికుడు సుశర్మ రథహీనుడై శత్రువులకు పట్టుబడగా, త్రిగర్త సైన్యమంతా భయంతో వ్యాకులమయి భగ్నమయి పోయింది. (50)
నివర్త్య గా స్తతః సర్వాః పాండుపుత్రా మహారథాః।
అవజిత్య సుశర్మాణం ధనం చాదాయ సర్వశః॥ 51
తరువాత మహారథులయిన పాండుపుత్రులు సుశర్మ నోడించి, గోవుల నన్నింటిని మళ్ళించి సుశర్మ అపహరించిన ధనమంతా తీసుకొన్నారు. (51)
స్వబాహుబల సంపన్నాః హ్రీనిషేవా యతవ్రతాః।
విరాటస్య మహాత్మానః పరిక్లేశవినాశనాః॥ 52
పాండవులందరూ బాహుబలంతో కూడిన లజ్జాశీలులు, సంయమంతో వ్రతాలనుష్ఠించేవారు, మహాత్ములు, విరాటుని దుఃఖాలన్నీ దూరం చేసేవారు. (తరువాత శ్లోకంతో అన్వయం) (52)
స్థితాః సమక్షం తే సర్వే త్వథ భీమోఽభ్యభాషత।
నాయం పాపసమాచారః మత్తో జీవితు మర్హతి।
కింతు శక్యం మయా కర్తుం యద్ రాజా సతతం ఘృణీ॥ 54
వారందరూ రాజు ఎదుటికి వచ్చి నిలిచారు. అపుడు భీమసేనుడన్నాడు - 'ఈ పాపాత్ముడయిన సుశర్మ నా చేతులలో నుండి తప్పించు కోని జీవించడానికి యోగ్యుడుకాడు. కాని నేనేం చేయను? మా మహారాజు ఎల్లప్పుడూ దయాళువు.' (53,54)
గలే గృహీత్వా రాజానమ్ ఆనీయ వివశం వశమ్।
తత ఏనం విచేష్టంతం బద్ధ్వా పార్థో వృకోదరః॥ 55
రథ మారోపయామాస విసంజ్ఞం పాంసుగుంఠితమ్॥
తరువాత భీమసేనుడు సుశర్మను మెడ పట్టుకొని తీసుకువచ్చాడు. ఆ సమయంలో సుశర్మ శరీరంలో పట్టులేక భీమునికి వశమై ఉన్నాడు. తప్పించుకోవడంకోసం పెనగులాడుతీ శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి స్పృహపోతున్న సుశర్మను కుంతీ పుత్త్రుడయిన భీమసేనుడు త్రాటిలో బంధించి రథంపై ఎక్కించాడు. (55 1/2)
అభ్యేత్య రణమధ్యస్థమ్ అభ్యగచ్ఛద్ యుధిష్ఠిరమ్॥ 56
దర్శయామాస భీమస్తు సుశర్మాణం నరాధిపమ్।
తరువాత భీముడు రణభూమిలో ఉండే ధర్మరాజు దగ్గరకు వెళ్ళి సుశర్మను చూపించాడు. (56 1/2)
ప్రోవాచ పురుషవ్యాఘ్రః భీమమాహవశోభినమ్॥ 57
తం రాజా ప్రాహసద్ దృష్ట్వా ముచ్యతాం వై నరాధమః।
ఏవ ముక్తోఽబ్రవీద్ భీమః సుశర్మాణం మహాబలమ్॥ 58
పురుషశ్రేష్ఠు డయిన ధర్మరాజు సుశర్మను ఆ దశలో చూసి నవ్వి రణశోభితుడైన భీమసేనునితో "ఈనరాధముణ్ణి వదిలివెయ్యి!" అన్నాడు- అతడిలా చెప్పగా భీమసేనుడు మహాబలవంతుడైన సుశర్మతో ఇలా అన్నాడు. (57,58)
భీమ ఉవాచ
జీవితుం చేచ్ఛసే మూఢ హేతుం మే గదతః శృణు।
దాసోఽస్మీతి త్వయా వాచ్యం సంసత్సు చ సభాసు చ॥ 59
భీమసేనుడు అన్నాడు - మూర్ఖుడా! నీవు బ్రతికి ఉండాలని కోరితే దానికి ఉపాయం చెపుతాను. నామాట విను. నీవు సదస్సులకు, సభలకు వెళ్ళి 'నేను విరాటరాజు దాసుణ్ణి' అని చెప్పాలి. (59)
ఏవం తే జీవితం దద్యామ్ ఏష యుద్ధజితో విధిః।
తమువాచ తతో జ్యేష్ఠః భ్రాతా సప్రణయం వచః॥ 60
ఇలా చేయడానికి అంగీకరిస్తే నిన్ను బ్రతకనిస్తాను. యుద్ధంలో ఓడిన వారవలంబించదగిన పద్ధతి యిది. అపుడు యుధిష్ఠిరుడు భీమసేనునితో ప్రేమతో ఇలా అన్నాడు. (60)
యుధిష్ఠిర ఉవాచ
ముంచ ముంచాధమాచారం ప్రమాణం యది తే వయమ్।
దాసభావం గతో హ్యేషః విరాటస్య మహీపతేః।
అదాసో గచ్ఛ ముక్తోఽసి మైవం కార్షీః కదాచన॥ 61
అపుడు యుధిష్ఠిరుడు అన్నాడు - "సోదరా! నీవు నామాటను మన్నించి ఈపాపపునడత గలవాణ్ణి వదలు, ఇతడు విరాటమహారాజుకు దాసుడయ్యాడు" తరువాత సుశర్మతో ఇలా అన్నాడు. 'నీవు దాసుడవు కావు. వెళ్ళు. నిన్ను వదిలివేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి పని చేయకు.' (61)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి దక్షిణగోగ్రహే త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున దక్షిణ గోగ్రహణమున
సుశర్మ విడుదల అను ముప్పది మూడవ అధ్యాయము. (33)
(దాక్షిణాత్య ప్రతి అధికపాఠము 2 శ్లోకములు కలుపుకొని మొత్తం 63 శ్లోకాలు.)