39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము

ద్రోణాచార్యుడు అర్జునుని ప్రశంసించుట.

వైశంపాయన ఉవాచ
తం దృష్ట్వా క్లీబవేషేణ రథస్థం నరపుంగవమ్।
శమీమభిముఖం యాంతం రథమారోప్య చోత్తరమ్॥ 1
భీష్మద్రోణముఖాస్తత్ర కురవో రథిసత్తమాః।
విత్రస్తమనసః సర్వే ధనంజయకృతాద్ భయాత్॥ 2
నపుంసక వేషంతో రథంమీదున్న నరశ్రేష్ఠుడైన అర్జునుడు ఉత్తరుని రథంమీద ఎక్కించుకొని జమ్మిచెట్టు వైపు వెళ్ళటం చూసి, మహారథులైన భీష్మద్రోణాది కౌరవులందరూ అర్జునుడివల్ల ఏర్పడే భయానికి బెదిరిపోతున్నారు. (1,2)
తానవేక్ష్య హతోత్సాహాన్ ఉత్పాతానపి చాద్భుతాన్।
గురుః శస్త్రభృతాం శ్రేష్ఠః భారద్వాజోఽభ్యభాషత॥ 3
మేటి విలుకాడూ, విలువిద్యలో గురువూ, భరద్వాజమహర్షి కొడుకూ అయిన ద్రోణుడు ఉత్సాహం ఉడిగిపోయిన వాళ్ళనీ, ఉల్కాపాతం లాంటి అద్భుత అపశకునాలనూ చూసి ఇలా అన్నాడు. (3)
చండాశ్చ వాతాః సంవాంతి రూక్షాః శర్కరవర్షిణః।
భస్మవర్ణప్రకాశేన తమసా సంవృతం నభః॥ 4
కఠినమైన వడగళ్ళను కురిపిస్తూ ఈదురు గాలులు వీస్తున్నాయి. బూదిదరంగులో మెరిసే చీకటి ఆకాశమంతా అలుముకొంది. (4)
రూక్షవర్ణాశ్చ జలదాః దృశ్యంతేఽద్భుతదర్శనాః।
నిఃసరంతి చ కోశేభ్యః శస్త్రాణి వివిధాని చ॥ 5
కారుమబ్బులు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఒరల నుండి రకాల ఆయుధాలు బయటకు వస్తున్నాయి. (5)
వి॥సం॥ నిస్సరంతి చ కోశేభ్యః
ఒరలనుండి శస్త్రాలు జారిపడుతున్నాయి. ఇది ఒక ఘోరయుద్ధశకునమని వరాహమిహిరుని అభిప్రాయం
ఆయుధజ్వలనసమర్పణస్వనాః
కోశనిర్గమనవేపనాని చ
వైకృతాని యది వాఽఽయుధే పరా
ణ్యాశు రౌద్రరణసంకులం వదేత్॥ (విష)
శివాశ్చ వినదంత్యేతాః దీప్తాయాం దిశి దారుణాః।
హయాశ్చాశ్రూణి ముంచంతి ధ్వజాః కంపంత్యకంపితాః॥ 6
తోకచుక్క మొదలైనవి పడి మంటలు చెలరేగిన దిక్కున నక్కలు భయంకరంగా అరుస్తున్నాయి. గుర్రాలు కన్నీళ్ళు విడుస్తున్నాయి. ధ్వజాలు గాలి లేకుండానే కంపిస్తున్నాయి. (6)
యాదృశావ్యత్రరూపాణి సందృశ్యంతే బహూని చ।
యత్తా భవంతస్తిష్ఠంతు సాధ్వసం సముపస్థితమ్॥ 7
ఇక్కడ కనబడుతున్న దృశ్యాలు అన్నీ రాగల భయాన్ని సూచిస్తున్నాయి. మీరంతా జాగరూకులై ఉండండి. (7)
రక్షధ్వమపి చాత్మానం వ్యూహధ్వం వాహినీమపి।
వైశసం చ ప్రతీక్షధ్వం రక్షధ్వం చాపి గోధనమ్॥ 8
మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సైన్యాన్ని వ్యూహాలతో నడపండి. జననష్టం జరుగబోతుంది. గోధనాన్ని కూడా కాపాడండి. (8)
ఏష వీరో మహేష్వాసః సర్వశస్త్రభృతాం వరః।
ఆగతః క్లీబవేషేణ పార్థో నాస్త్యత్ర సంశయః॥ 9
ఆయుధాల్ని ధరించిన వారిలో శ్రేష్ఠుడు, గొప్ప ధనుస్సును ధరించిన ఈ వీరుడు అర్జునుడు. నపుంసక వేషంలో వచ్చాడు. ఏమాత్రం సందేహం లేదు. (9)
నదీజ లంకేశవనారికేతుః
నగాహ్వయో నామ నగారిసూనుః।
ఏషోఽంగనావేషధరః కిరీటీ
జిత్వాన యం నేష్యతి చాద్య గావః॥ 10
గాంగేయా! రావణుడి అశోకవనాన్ని ధ్వంసం చేసిన హనుమంతుడు ధ్వజంగా గలవాడు, చెట్టుపేరు (అర్జున-తెల్లమద్ది) కలవాడు, పర్వతాలకు శత్రువైన ఇంద్రుడి కొడుకు అర్జునుడే ఈ స్త్రీవేషధారి. దుర్యోధనుణ్ణి జయించి ఆవుల్ని తీసుకుపోదామనుకుంటున్న ఇతని బారినుండి దుర్యోధనుణ్ణి కాపాడు. (10)
వి॥తె॥ తిక్కన ఇక్కడ చక్కని సన్నివేశం కల్పించాడు. "అని చెప్పి తానప్పుడర్జును నెఱింగిన వాడు గావున నతనికి నజ్ఞాతవాస సమయ భంగం బగునో యను భయంబున సురనదీసూను వదనంబు వీక్షించి సన్నవాఱ నిట్లనియె.
చ॥వెరవరి గాక వీఁడు కురువీరులకుం బొడసూపువాఁడె! య
చ్చెరు వొక మ్రానిపేర నిట సేరఁగ వచ్చుచునున్న వాడహం కరణమ గాని యొండొకటి గానఁడు మూర్తివిశేషమారయన్
సురపతియట్ల వీనిమదిచొప్పదియెట్లొ యెఱుంగనయ్యెడున్." తెలివి తక్కువగా వీడు(అర్జునుడు) ఒక్కడూ ఇంతమంది కురుసైన్యానికి కనపడవచ్చునా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక చెట్టు పేరుతో వస్తున్నాడు.(అర్జున వృక్షం అని ఉంది. చెట్టుపేరు కలవాడు అర్జునుడు) అహంభావం తప్ప మరొకటి కనపడటం లేదు. (దానివల్ల ఎంత నష్టం వస్తుందో వాడికి తెలియడంలేదు) రూపం చూస్తే ఇంద్రుడిలాగా ఉన్నాడు. (తండ్రిరూపం గోచరిస్తుంది-అర్జునుడిలో) వీడే మనుకుంటున్నాడో తెలుసుకోవాలి.
ఇలా అనగానే ద్రోణుని మాటల్లోని అంతరార్థం తెలుసుకొని అతనికి సమాధానంగా భీష్ముడు కూడా నిగూఢంగానే దుర్యోధనునితో అన్నట్లు ఇలా అన్నాడు.
క॥ తలఁపఁగ రిపులకు నిమ్మగు
కొలఁది గడచి వచ్చితిమి, యకుంఠిత బాహా
బలము నెఱపఁ దఱి యయ్యెను,
జలింప వలదింక మనకు శత్రులవలనన్.
శత్రువులకు అనుకూలమయిన మేరను(కాలాన్ని) దాటి వచ్చాము. అమోఘమయిన బాహుబలం ప్రదర్శించే సమయం వచ్చింది. శత్రువుల వలన ఇంక భయపడవలసిన పనిలేదు. (అజ్ఞాతవాసం గడిచింది. ఇక అర్జునుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు) ఇందులోని అంతరార్థం ద్రోణుడు గ్రహించాడు. ఇక సంతోషం ఆపుకోలేకపోయాడు గురుడు. వెంటనే అర్జునుడు వచ్చేశాడు అని ప్రకటించేశాడు.
సింగం బాకటితో గుహాంతరమునన్ జేడ్పాటుమైనుండి మా తంగస్ఫూర్జిత యూథదర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్పేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (4-95)
రసవత్తరమైన ఈసన్నివేశం చాలాభాగం తిక్కన ఉపజ్ఞంగా కనిపిస్తుంది. కొంత దా.ప్రతిలో ఉంది. గురువుకు తెలివైన శిష్యునిపై ఎటువంటి వాత్సల్యం ఉంటుందో తెలుపుతుంది. ప్రక్కవారికి తెలియకుండా తెలివిగలవారు ఎట్లా మాట్లాడుకొంటారో తెలుస్తుంది.
స ఏష పార్థో విక్రాంతః సవ్యసాచీ పరంతపః।
నాయుద్ధేన నివర్తేత సర్వైరపి సురాసురైః॥ 11
(శత్రువులకు సంతాపాన్నిచ్చే సవ్యసాచి) ఈ అర్జునుడు దేవరాక్షసు లందరితోనైనా సరే యుద్ధం చెయ్యనిదే (యుద్ధభూమినుండి) వెనుదిరగడు. (11)
క్లేశితశ్చ వనే శూరః వాసవేనాపి శిక్షితః।
అమర్షవశమాపన్నః వాసవప్రతిమో యుధి।
వేహాస్య ప్రతియోద్ధారమ్ అహం పశ్యామి కౌరవాః॥ 12
కౌరవులారా! అడవిలో కష్టాలపాలైన ఈ వీరుడు ఇంద్రునివద్ద అస్త్రవిద్య నేర్చాడు. యుద్ధరంగంలో ఇంద్రునితో సమానంగా పోరాడుతాడు. ఇక్కడ అతనిని ఎదిరించగల వీరుడు కనపడడు. (12)
మహాదేవోఽపి పార్థేన శ్రూయతే యుధి తోషితః।
కిరాతవేశ్హప్రచ్ఛన్నః గిరౌ హిమవతి ప్రభుః॥ 13
హిమాలయ పర్వతంమీద కిరాత వేషంతో ప్రచ్ఛన్నంగా వచ్చిన మహాదేవునికూడ యుద్ధంలో అర్జునుడు సంతోషపెట్టాడని వింటున్నాం. (13)
కర్ణ ఉవాచ
సదా భవాన్ ఫాల్గునస్య గుణైరస్మాన్ వికత్థసే।
న చార్జునః కలాపూర్ణః మమ దుర్యోధనస్య చ॥ 14
అపుడు కర్ణుడు అన్నాడు. 'నీవెప్పుడూ మాముందు అర్జునుడి గుణాలను పొగడుతూ ఉంటావు. కాని అర్జునుడు నాలోగాని, దుర్యోధనుడిలో గాని పదహారో వంతు కూడా చెయ్యడు.' (14)
దుర్యోధన ఉవాచ
యద్యేష పార్థో రాధేయ కృతం కార్యం భవేన్మమ।
జ్ఞాతాః పునశ్చరిష్యంతి ద్వాదశాబ్దాన్ విశాంపతే॥ 15
వెంటనే దుర్యోధనుడు అన్నాడు.' రాధాకుమార! ఇతడే కనుక అర్జునుడైతే నేననుకున్న పని కరిగినట్లే. గుర్తింపబడిన పాండవులు మళ్లీ పన్నెండు సంవత్సరాలు అడవులు పట్టుకు తిరుగుతారు. (15)
అథైష కశ్చిదేవాన్యః క్లీబవేషేణ మానవః।
శరైరేనం సునిశితైః పాతయిష్యామి భూతలే॥ 16
లేదా వీడు మరివడైనా నపుంసకవేషంలో వచ్చి ఉంటే వీణ్ణి నాపదునైన బాణాలతో నేలకూలుస్తాను.' (16)
వి॥సం॥ అర్జునుడుకాక మరెవరైనా అయితే నాబాణాలతో పడగొడతానని సుయోధనుడనటంలో తనసేన అర్జునుని జయించలేదన్న భావన సుయోధనుని మనస్సులో ఉన్నదని అనిపిస్తుంది. (విష)
వైశంపాయన ఉవాచ
తస్మిన్ బ్రువతి తద్ వాక్యం ధార్తరాష్ట్రే పరంతప।
భీష్మో ద్రోణః కృపో ద్రౌణిః పౌరుషం తదపూజయన్॥ 17
వైశంపాయనుడు అన్నాడు. శత్రుసంతాపకారక! జనమేజయా! ఇలా ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు మాట్లాడుతుండగా అతని ఆ పౌరుషాన్ని భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు మెచ్చుకొన్నారు. (17)
వి॥తె॥ ఇక్కడ దుర్యోధనుడలా అంటే భీష్ముడు ద్రోణుడు, కృపుడు అశ్వత్థామ - వీరు పౌరుషాన్ని ప్రశంసించారు. అనడంలోని ఆంతర్యం అంతరార్థం తిక్కన చాలా అందంగా ఊహించాడు.
మేలని యియ్యకొనిరి. హృదయాననురూపములయిన తెలుపు లాస్యము, బొందన్ అని, బాగుంది అని, అంగీకరించాడు. ఎలా? 'మనసులోని భావానికి వ్యతిరేకమయిన ముఖకవళికలతో 'అని ముక్తాయింపు ఇచ్చాడు. తిక్కన.
ఇది ఒక విధమైన అసహ్యభావం. హేళన కూడా. వ్యాసమహర్షి "పౌరుషం తదపూజయన్" అన్నదానిలోని అంతరార్థం. ఏ వ్యాఖ్యాతయు సంస్కృతంలో వ్రాయలేదు. సంస్కృత వ్యాఖ్యాతల కంటె ముందుగానే తిక్కన చక్కని వ్యాఖ్యానం చేశాడు.
ఇతి శ్రీమహాభారతే విరాట పర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అర్జునప్రశంసాయా మేకోన చత్వారింశోఽధ్యాయః॥ 39 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున
అర్జునుని ప్రశంసించుట అను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39)