42. నలువదిరెండవ అధ్యాయము
పాండవుల ఆయుధములను వివరముగా చెప్పుమని ఉత్తరుడు కోరుట.
ఉత్తర ఉవాచ
బిందవో జాతరూపస్య శతం యస్మిన్ నిపాతితాః।
సహస్రకోటిసౌవర్ణాః కస్యైతద్ధనురుత్తమమ్॥ 2
వెనుకభాగాన బంగారు ఏనుగుబొమ్మలు మెరుస్తున్నాయి. మధ్యభాగం పట్టుకొనటానికి వీలుగా చక్కగా ఉంది. దానికి రెండు ప్రక్కలూ సుందరంగా ఉన్నాయి. ఈ ఉత్తమమైన ధనుస్సు ఎవరిది? (2)
తపనీయస్య శుద్ధస్య షష్టిర్యస్యేంద్రగోపకాః।
పృష్ఠే విభక్తా శోభంతే కస్యైతద్ ధనురుత్తమమ్॥ 3
వెనుక భాగంలో విడివిడిగా స్వచ్ఛమైన బంగారపు ఇంద్రగోపకాలు పొదిగిన ఈ ఉత్తమమైన ధనుస్సు ఎవరిది? (3)
సూర్యా యత్ర చ సౌవర్ణాః త్రయో భాసంతి దంశితాః।
తేజసా ప్రజ్వలంతో హి కస్యైతద్ ధనురుత్తమమ్॥ 4
మూడు బంగారు సూర్యప్రతిమ లుండి కాంతితో మెరిసే ఈ ఉత్తమమైన ధనుస్సు ఎవరిది? (4)
శలభా యత్ర సౌవర్ణాః తపనీయవిభూషితాః।
సువర్ణమణిచిత్రం చ కస్యైతద్ ధనురుత్తమమ్॥ 5
బంగారు మిడుత బొమ్మలు అందమైన మణులు పొదగడంతో విచిత్రంగా ఉన్న ఈ ఉత్తమమైన ధనుస్సు ఎవరిది? (5)
ఇమే చ కస్య నారాచాః సాహస్రా లోమవాహినః।
సమంతాత్ కలధౌతాగ్రాః ఉపాసంగే హిరణ్మయే॥ 6
విపాఠాః పృథవః కస్య గార్ ధ్రపత్రా శిలాశితాః।
హారిద్రవర్ణాః సుముఖాః పీతాః సర్వాయసాః శరాః॥ 7
బంగారుపొదిలో వేలసంఖ్యలో పదునైన ములుకులతో (కనలతో), బంగారు నీటితో కడుగబడిన అంచులతో, లావైన దండా (కర్ర) లతో, వెడల్పుగా నుండి, గ్రద్దరెక్కల అమరికతో, రాతిపై సానబెట్టబడిన, పసుపుపచ్చగానున్న, చక్కని చివరలు కలిగి, బంగారు నీటిచే పచ్చగా కనబడుతున్న, పూర్తిగా ఇనుముతో చేయబడిన ఈ బాణాలెవరివి? (6,7)
కస్యాయమసితశ్చాపః పంచశార్దూలలక్షణః।
వరాహకర్ణవ్యామిశ్రాన్ శరాన్ ధారయతే దశే॥ 8
ఐది పెద్దపులు గుర్తులున్న యీనల్లని విల్లెవరిది? పందిచెవులవంటి ములుకులతో నున్న పది బాణాలను ఒకేసారి ధరింపగలదు. (8)
కస్యేమే పృథవో దీర్ఘాః చంద్రబింబార్ధదర్శనాః।
శతాని సప్త తిష్ఠంతి నారాచాః రుధిరాశనాః॥ 9
తగిన పొడుగు వెడల్పులు కలిగి, అర్ధచంద్ర బింబాల్లా కనబడుతూ శత్రువుల రక్తం తాగే ఈ ఏడువందల బాణాలెవ్వరివి? (9)
కస్యేమే శుకపత్రాభైః పూర్వైరర్ధైః సువాససః।
ఉత్తరైరాయసైః పీతైః హేమపుంఖైః శిలాశితైః॥ 10
ముందుసగభాగం చిలుకరెక్కల లాగా, మెరిసే వెనుకసగభాగం బంగారంలా పచ్చగాను ఉండి సానబెట్టిన ఈ ఇనుప బాణా లెవ్వరివి? (10)
గురుభారసహో దివ్యః శాత్రవాణాం భయంకరః।
కస్యాయం సాయకో దీర్ఘః శిలీపృష్ఠః శిలీముఖః॥ 11
ముందువెనుక భాగాలు ఆడకప్పవలె ఉన్నాయి. చాలా బరువు మోయగలిగేటట్లుంది. శత్రుభయంకరంగా ఉన్న ఈ పొడవైన కత్తి ఎవరిది? (11)
వైయాఘ్రకోశే నిహితః హేమచిత్రో దురాసదః।
సుఫలశ్చిత్రకోశశ్చ కింకిణీసాయకో మహాన్।
కస్య హేమత్సరుర్దివ్యః ఖడ్గః పరమనిర్మలః॥ 12
ఈ కత్తి పులితోలు ఒరలో ఉంది. బంగారు బొమ్మలు చిత్రించారు. సామాన్యులు ఎత్తలేనట్లుంది. రంగుల పిడిఉంది. ఆ పిడికి చిరుగజ్జెలు కూడా ఉన్నాయి. ఈ కత్తి ఎవరిది? (12)
కస్యాయం విమలః ఖడ్గః గవ్యే కోశే సమర్పితః।
హేమత్సరురనాధృష్యః నైషధ్యో భారసాధనః॥ 13
ఆవుతోలు ఒరలోఉన్న స్వచ్ఛమైన ఈకత్తి ఎవరిది? దీనికి బంగారుపిడి ఉంది. ఎవరూ ఎత్తలేనట్లుంది. నిషధదేశంలో తయారు చేయబడిన యీ కత్తి ఎంత పనికైనా తగినది. (13)
కస్య పాంచనఖే కోశే సాయకో హేమవిగ్రహః।
ప్రమాణరూపసంపన్నః పీత ఆకాశసంనిభః॥ 14
మేకతోలు ఒరలోనున్న కత్తి ఎవరిది? దానికి బంగారు పిడి ఉంది. పెద్దదై ఆకాశంలా పచ్చగా ఉంది. బంగరుపూత పూయబడింది. (14)
కస్య హేమమయే కోశే సుతస్తే పావకప్రభే॥ 15
నిస్త్రింశోఽయం గురుః పీతః సాయకః పరనిర్ వ్రణః।
కస్యాయమసితః ఖడ్గః హేమబిందుభిరావృతః॥ 16
గురుభారసహో దివ్యః సపత్నానాం భయప్రదః॥ 17
అగ్నిలా మెరుస్తున్న మేలిమి బంగారు ఒరలోనున్న ఈకత్తి ఎవరిది? ఇది శత్రువుల ఆయుధాలకు లొంగ నట్లుంది. (ముప్పది అంగుళాలను మించి ఉన్న) బంగారు బొట్లతో నిండి పామును ముట్టుకున్నట్లుంది. శత్రువుల శరీరాల్ని చీల్చేటట్లుంది. ఎక్కువ బరువును మోయగల్గి దివ్యమై, శత్రుభయంకరమై ఉంది ఈ కత్తి. (15-17)
నిర్దిశస్వ యథా తత్త్వం మయా పృష్టా బృహన్నలే।
విస్మయో మే పరో జాతః దృష్ట్వా సర్వమిదం మహత్॥ 18
బృహన్నలా! ఇదంతా చూసి నాఖు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనడిగినది ఉన్నదున్నట్లుగా చెప్పు.' (18)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణీ ఉత్తరవాక్యం నామ ద్విచత్వారింశోఽధ్యాయః॥ 42 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
ఉత్తరుని సందేహము అను నలువది రెండవ అధ్యాయము. (42)