45. నలువది అయిదవ అధ్యాయము

అర్జునుడు యుద్ధసన్నద్ధుడై, ఉత్తరుని భయమును పోగొట్టుట.

ఉత్తర ఉవాచ
ఆస్థాయ రుచిరం వీర రథం సారథినా మయా।
కతమం యాస్యసేఽనీకమ్ ఉక్తో యాస్యామ్యహం త్వయా॥ 1
ఉత్తరుడు అన్నాడు. 'వీరుడా! సుందరమైన రథాన్నెక్కి ఏ సేనవైపు వెళ్ళ దలచావో సారథియైన నాతో చెప్పు. నీతో కలిసి ఆవైపే నేను వస్తాను.' (1)
అర్జున ఉవాచ
ప్రీతోఽస్మి పురుషవ్యాఘ్ర న భయం విద్యతే తవ।
సర్వాన్ మదామి తే శత్రూన్ రణే రణవిశారద॥ 2
అర్జునుడు చెపుతున్నాడు.
'పురుషసింహమా! నీకు భయం లేనందుకు సంతోషితున్నాను. యుద్ధ విశారదా! యుద్ధంలో నీ శత్రువులందర్నీ పారద్రోలుతాను. (2)
స్వస్తో భవ మహాబాహో పశ్య మాం శత్రుభిః సహ।
యుధ్యమానం విమర్దేఽస్మిన్ కుర్వాణాం భైరవం మహత్॥ 3
మహాబాహూ! నీవు నిశ్చింతగా ఉండు. యుద్ధ రంగంలో భయంకరమైన పరాక్రమాన్ని చూపుతూ శత్రువులతో తలపడే నన్ను చూడు. (3)
ఏతాన్ సర్వానుపాసంగాన్ క్షిప్రం బధ్నీహి మే రథే।
ఏకం చాహర నిస్త్రింశం జాతరూపపరిష్కృతమ్॥ 4
నా రథంలో ఈ అమ్ములపొదు లన్నింటినీ వెంటనే కట్టు. బంగారపు పిడిగల కత్తినొకదానిని తీసుకురా.' (4)
వైశంపాయన ఉవాచ
అర్జునస్య వచః శ్రుత్వా త్వరావానుత్తరస్తదా।
అర్జునస్యాయుధాన్ గృహ్య శీఘ్రేణావతరత్ తతః॥ 5
వైశంపాయనుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడి మాటలను విని ఉత్తరుడు తొందరగా అర్జునుడి ఆయుధాలను తీసికొని వెంటనే చెట్టు దిగాడు. (5)
అర్జున ఉవాచ
అహం వై కురుభిర్యోత్స్యా మ్యవజేష్యామి తే పశూన్॥ 6
అర్జునుడు అన్నాడు. నేను కౌరవులతో యుద్ధం చేస్తాను. నీ పశువుల్ని జయించి తెస్తాను. (6)
సంకల్ప పక్షవిక్షేపం బాహుప్రాకారతోరణమ్।
త్రిదండతూణసంబాధమ్ అనేకధ్వజసంకులమ్॥ 7
జ్యాక్షేపణం క్రోధకృతం నేమీనినదదుందుభి।
నగరం తే మయా గుప్తం రథోపస్థం భవిష్యతి॥ 8
నాచే రక్షింపబడే రథం పైభాగమే నీకు నగరం అవుతుంది. చక్కగా రథచక్రాదులను దృఢంగా అమర్చటమే నగర వీథులలో ఇళ్ళు విస్తరించుట; నా బాహువులే ప్రాకారపురద్వారాలు; రథాలు, ఏనుగులు, గుర్రాలే ఆయుధ సామగ్రి; మరెవ్వరికీ లేని వానరధ్వజమే అనేక ధ్వజపతాకాలతో నిండటం; అల్లెత్రాటి మోత నగరాలలో కలహాదులు; చక్రాల అంచుల మోత ఢక్కానాదం; ఇటువంటి నగరం నిన్ను రక్షిస్తుంది. (7,8)
అధిష్ఠితో మయా సంఖ్యే రథో గాండీవధన్వినా।
అజేయః శత్రుసైన్యానాం వైరాటే వ్యేతు తే భయమ్॥ 9
విరాటరాజకుమారా! గాండీవధనుస్సుతో యుద్ధరంగంలో నేను రథంపై ఉన్నాను. శత్రుసేనలకు నన్ను జయించటం కానిపని, నీభయం తొలగుగాక.' (9)
ఉత్తర ఉవాచ
బిభేమి నాహమేతేషాం జానామి త్వాం స్థిరం యుధి।
కేశవేనాపి సంగ్రామే సాక్షాదింద్రేణ వా సమమ్॥ 10
ఉత్తరుడు అన్నాడు. 'యుద్ధభూమిలో కృష్ణునితోనూ, ఇంద్రునితోనూ సమానమైన నీవు యుద్ధానికి సిద్ధమయ్యావు. ఇక నేను ఈసేనలకు భయపడటం లేదు. (10)
ఇదం తు చింతయన్నేవం పరిముహ్యామి కేవలమ్।
నిశ్చయం చాపి దుర్మేధాః న గచ్ఛామి కథంచన॥ 11
ఇది ఆలోచిస్తూనే భ్రాంతికి లోనవుతున్నాను. బుద్ధిచాలక ఏవిధంగానూ ఒక నిశ్చయానికి రాలేక పోతున్నాను. (11)
ఏవం యుక్తాంగరూపస్య లక్షణైః సూచితస్య చ।
కేన కర్మవిపాకేన క్లీబత్వమిదమాగతమ్॥ 12
తగిన అవయవాలూ, ఆకారమూ కలిగి మంచి శుభలక్షణాలు కలిగిన నీకు ఏ కర్మవశాత్తు ఈ నపుంసకత్వం ఏర్పడింది? (12)
మన్యే త్వాం క్లీబవేషేణ చరంతం శూలపాణినమ్।
గంధర్వరాజప్రతిమం దేవం వాపి శతక్రతుమ్॥ 13
నిన్ను నపుంసక వేషంలో తిరిగే శూలధారి శివుడవనో, గంధర్వరాజు వంటి వాడివనో, సాక్షాత్ దేవేంద్రుడివనో భావిస్తున్నాను.' (13)
అర్జున ఉవాచ
(ఊర్వశీశాపసంభూతం క్లైబ్యం మాం సముపస్థితమ్।
పురాహమాజ్ఞయా భ్రాతుః జ్యేష్ఠస్యాస్మి సురాలయమ్।
ప్రాప్తవా సుర్వశీ దృష్టా సుధర్మాయాం మయా తదా।
నృత్యంతీ పరమం రూపం బిభ్రతీ వజ్రిసంనిధౌ॥
అపశ్యం స్తామనిమిషం కూటస్థామన్వయస్య మే।
రాత్రౌ సమాగతా మహ్యం శయానం రంతుమిచ్ఛయా॥
అహం తామభివాద్యైవ మాతృసత్కారమాచరమ్।
సా చ మామశపత్ క్రుద్ధా శిఖండీ త్వం భవేరితి॥
శ్రుత్వా తమింద్రో మామాహ మా భైస్త్వం పార్థ షండతః।
ఉపకారో భవేత్ తుభ్యమ్ అజ్ఞాతవసతౌ పురా॥
ఇతీంద్రో మామనుగ్రాహ్య తతః ప్రేషితవాన్ వృషా।
తదిదం సమనుప్రాప్తం వ్రతం తీర్ణం మయానఘ॥)
ఊర్వశి శాపంవల్ల నాకీ నపుంసకత్వం ఏర్పడింది. పూర్వం నేను మాపెద్దన్న ధర్మరాజు ఆజ్ఞతో దేవలోకానికి వెళ్ళాను. అక్కడ దేవసభ సుధర్మలో ఇంద్రుడి సన్నిధిలో ఊర్వశి నాట్యం చేసింది. మావంశానికి మూలకారణమైన తల్లి ఆమె. రెప్పలు వాల్చకుండా ఆమె నాట్యమాడుతుండగా చూశాను. రాత్రి నేను నిదురించే వేళ నాతో రమించాలని వచ్చింది. నే నామెకు నమస్కరించి తల్లిని గౌరవించినట్లు గౌరవించాను. ఆమె కోపగించి నన్ను నపుంసకుడివి కమ్మని శపించింది. ఇంద్రుడు ఆ శాపం విని, "కుంతీకుమారా! నపుంసకత్వం వల్ల భయపడకు. నీకు అజ్ఞాతవాసంలో ఇది ఉపకరిస్తుంది" అని నన్ను అనుగ్రహించి పంపాడు. అదే నాకిప్పుడు సంప్రాప్తమైంది. నావ్రతమూ పూర్తయింది.
భ్రాతుర్నియోగా జ్జ్యేష్ఠస్య సంవత్సరమిదం వ్రతమ్।
చరామి వ్రతచర్యం చ సత్యమేతద్ బ్రవీమి తే॥ 14
నాస్మి క్లీబో మహాబాహో పరవాన్ ధర్మసంయుతః।
సమాప్తవ్రతముత్తీర్ణం విద్ధి మాం త్వం నృపాత్మజ॥ 15
నా పెద్దన్న ధర్మరాజు ఆజ్ఞానుసారం సంవత్సర కాలం ఈ వ్రతంలో ఉన్నాను. ఇది వ్రతదీక్ష మాత్రమే. నీకు నిజం చెప్తున్నాను. మహాబాహూ! రాజకుమారా! నేను నపుంసకుణ్ణి కాను. అన్న ఆజ్ఞకు బద్ధుణ్ణి. ధర్మానికి కట్టుబడ్డవాడిని. వ్రతం పూర్తి చేసి నపుంసక భావంనుండి బయటపడ్డానని తెలుసుకో.' (14,15)
ఉత్తర ఉవాచ
పరమోఽనుగ్రహో మేఽద్య యతస్తర్కో న మే వృథా।
న హీదృశాః క్లీబరూపాః భవంతి తు నరోత్తమ॥ 16
మానవోత్తమా! నేడు నన్ను గొప్పగా అనుగ్రహించారు. ఇటు వంటి వాళ్ళు నపుంసకులు కాజాలరన్న నా ఊహ వ్యర్థం కాలేదు. (16)
సహాయవానస్మి రణే యుధ్యేయమమరైరపి।
సాధ్వసం హి ప్రణష్టం మే కిం కరోమి బ్రవీహి మే॥ 17
అహం తే సంగ్రహీష్యామి హయాన్ శత్రురథారుజాన్।
శిక్షితోఽహ్యస్మి సారథ్యే తీర్థతః పురుషర్షభ॥ 18
ఇప్పుడు సహాయాన్ని పొందాను. ఇక యుద్ధ రంగంలో దేవతలతోనైనా యుద్ధం చేయగలను. నాభయమంతా తొలగిపోయింది. ఏం చెయ్యమంటావో చెప్పు. పురుషశ్రేష్ఠా! గురువు దగ్గర సారథ్యం చెయ్యటం నేర్చుకొన్నాను. శత్రురథాలను నాశనంచేసే నీగుర్రాల్ని నేను తగినవిధంగా ప్రవర్తించేలా చేస్తాను. (17,18)
దారుకో వాసుదేవస్య యథా శక్రస్య మాతలిః।
తథా మాం విద్ధి సారథ్యే శిక్షితం నరపుంగవ॥ 19
నరశ్రేష్ఠా! వాసుదేవుడికి దారుకుడివలె, ఇంద్రుడికి మాతలివలె సారథ్యంలో శిక్షణ పొందిన వాణ్ణిగా నన్ను గుర్తించు. (19)
యస్య యాతే న పశ్యంతి భూమౌ క్షిప్తం పదం పదమ్।
దక్షిణాం యో ధురం యుక్తః సుగ్రీవసదృశో హయః॥ 20
కదులుతున్నప్పుడు నేలపై అడుగు ఎప్పుడు ఉంచుతుందో, ఎప్పుడు అడుగు లేపుతుందో కనుక్కోలేరు కుడిప్రక్క బరువును మోయ కలిగి ఉంటుంది. అది (శ్రీకృష్ణుడి నాల్గు గుర్రాలలో ఒకటైన0 సుగ్రీవ మనబడే గుర్రంతో సమానమైనది. (20)
యోఽయం ధురం ధుర్యవరః వామాం వహతి శోభనః।
తం మన్యే మేఘపుష్పస్య జనేన సదృశం హయమ్॥ 21
బరువుమోయగలవాటిలో శ్రేష్ఠమై, అందమై, ఎడమప్రక్క బరువును మోయగల గుర్రం వేగంలో మేఘపుష్పమను గుర్రంతో సాటియైనదని నా అభిప్రాయం. (21)
యోఽయం కాంచనసంనాహః పార్ష్ణిం వహతి శోభనః।
సమం శైబ్యస్య తం మన్యే జవేన బలవత్తరమ్॥ 22
బంగారు జీనుతో అందమైన వెనుకభాగంలో బరువు మోయగల గుర్రాన్ని శైబ్యమను గుర్రంతో సమానమైనదిగా, వేగంతో చాలా బలమైనదిగా అనుకుంటున్నాను. (22)
యోఽయం వహతి మే పార్ష్ణిం దక్షిణామభితః స్థితః।
వలాహకాదపి మతః స జవే వీర్యవత్తరః॥ 23
నాముందుండి, కుడివైపుల వెనుక భాగంలో మోయ గల ఈగుర్రం వేగంలో వలాహకంకంటే చాలా బలం కలదిగా అనిపిస్తోంది. (23)
త్వామేవాయం రథో వోఢుం సంగ్రామేఽర్హతి ధన్వినమ్।
త్వం చేమం రథమాస్థాయ యోద్ధుమర్హో మతో మమ॥ 24
ధనుస్సును ధరించిన నిన్ను యుద్ధంలో భరించటానికి ఈ రథమే తగినది. ఈ రథాన్ని ఎక్కే నీవు యుద్ధం చెయ్య తగుదువని నా అభిప్రాయం.' (24)
వైశంపాయన ఉవాచ
తతో విముచ్య బాహుభ్యాం వలయాని స వీర్యవాన్।
చిత్రే కాంచనసంనాహే ప్రత్యముంచత్ తదా తలే॥ 25
వైశంపాయనుడు చెప్పాడు. తరువాత పరాక్రమవంతుడైన అతడు చేతుల నుండి కంకణాలను తీసివేసి అల్లెత్రాడి దెబ్బలనుండి కాపాడే విచిత్రాలైన బంగారపు తొడుగులను అమర్చుకొన్నాడు. (25)
కృష్ణాన్ భంగిమతః కేశాన్ శ్వేతేనోద్గ్రథ్య వాససా।
అథాసౌ ప్రాఙ్ముఖో భూత్వా శుచిః ప్రయతమానసః॥ 26
నల్లని ఉంగరాల జుట్టును తెల్లని గుడ్డతో ఎత్తి కట్టి, తూరుపువైపు తిరిగి, పవిత్రుడై ఏకాగ్రమనస్సుతో అజానుబాహువయిన అర్జునుడు రథంమీద కూర్చుని అన్ని అస్త్రాలను(అస్త్రాధిదేవతలను) ధ్యానించాడు. (26)
ఊచుశ్చ పార్థం సర్వాణి ప్రాంజలీని నృపాత్మజమ్।
ఇమే స్మ పరమోదారాః కింకరాః పాండునందన॥ 27
ఆ అధిదేవత లందరూ అర్జునునికి అంజలించి 'పాండుకుమారా! మేమందరమూ ఇదిగో నీకు వశమై ఉదారులమై ఉన్నాము' అన్నారు. (27)
ప్రణిపత్య తతః పార్థః సమాలభ్య చ పాణినా।
సర్వాణి మానసానీహ భవతేత్యభ్యభాషత॥ 28
తరువాత అర్జునుడు వాటిని చేతితో తాకి ప్రణామం చేసి, 'మీరంతా నామనసులో నివసించండి' అని అడిగాడు. (28)
ప్రతిగృహ్య తతో ఽస్త్రాణి ప్రహృష్టవదనోఽభవత్।
అధిజ్యం తరసా కృత్వా గాండీవం వ్యాక్షిపద్ ధనుః॥ 29
తరువాత అస్త్రములన్నింటిని స్వీకరించడంతో అతని ముఖం ప్రసన్నమైంది. వెంటనే గాండీవానికి అల్లెత్రాటిని బిగించి ధనుష్టంకారం చేశాడు. (29)
తస్య విక్షిప్టమాణస్య ధనుషో ఽభూన్మహాధ్వనిః।
యథా శైలస్య మహతః శైలేనైవావజఘ్నతః॥ 30
ఆ గాండీవంతో ధనుష్టంకారం చెయ్యగా గొప్ప ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్దకొండ మరో కొండతో ఢీకొన్నప్పుడు వచ్చిన ధ్వనిలా ఉంది. (30)
స నిర్ఘాతో ఽభవద్ భూభిద్ దిక్షు వాయుర్వవౌ భృశమ్॥
పపాత మహతీ చోల్కా దిశో న ప్రచకాశిరే।
భ్రాంతధ్వజం ఖం తదాసీత్ ప్రకపింతమహాద్రుమమ్॥ 31
తం శబ్దం కురవోఽజానన్ విస్ఫోటమశనేరివ।
యదర్జునో ధనుః శ్రేష్ఠం బాహుభ్యామాక్షిపద్ రథే॥ 32
ఆ భయంకరమైన ధ్వని భూమి బ్రద్దలు చేసేటట్లు ఉంది. అన్ని దిక్కులా ప్రచండమైన గాలులు వీచాయి. పెద్ద తోకచుక్క నేలరాలింది. దిక్కులు చీకటిలో మునిగిపోయాయి. ఆకాశంలో శత్రువుల ధ్వజాలు కారణం లేకుండా కదిలిపోయాయి. పెద్దచెట్లన్నీ ఊగి పోయాయి.
అర్జునుడు రథంనుండి తన బాహువులతో గాండీవంతో చేసిన ధనుష్టంకారశబ్దాన్ని కౌరవులు పిడుగుపాటులా తలచారు. (31,32)
ఉత్తర ఉవాచ
ఏకస్త్వం పాండవశ్రేష్ఠ బహూనేతాన్ మహారథాన్।
కథం జేష్యసి సంగ్రామే సర్వశస్త్రాస్త్రపారగాన్॥ 33
అపుడు ఉత్తరుడు ఇలా అడిగాడు. 'పాండవోత్తమా అర్జునా! శస్త్రాస్త్రాలన్నిమ్టిలో ఆరితేరిన ఇంతమంది మహారథుల్ని యుద్ధంలో నీవొక్కడివి ఎలా జయించగలవు? (33)
అసహాయో ఽసి కౌంతేయ ససహాయాశ్చ కౌరవాః।
అత ఏవ మహాబాహో భీతస్తిష్ఠామి తేఽగ్రతః॥ 34
కుంతీకుమారా! మహాబాహూ! నీకు సహాయకులెవరూ లేరు. కౌరవులా ఎంతోమంది సహాయకులతో ఉన్నారు. అందువల్లే నీముందున్న నాకెంతో భయంగా ఉంది.' (34)
ఉవచ పార్థో మాభైషీః ప్రహస్య స్వనవత్ తదా॥ 35
యుధ్యమానస్య మే వీర గంధర్వైః సుమహాబలైః।
సహాయో ఘోషయాత్రాయాం కస్తదాసీత్సఖా మమ॥ 36
తథా ప్రతిభయే తస్మిన్ దేవదానవసంకులే।
ఖాండవే యుధ్యమానస్య కస్తదాసీత్సఖా మమ॥ 37
అప్పుడు మేఘగంభీరమైన ధ్వనితో పగలబడి నవ్వి, భయపడకు అంటూ అర్జునుడిలా అన్నాడు. 'వీరుడా! ఘోషయాత్రలో ఎంతో బలంగల గంధర్వులతో తలపడినప్పుడు నాకే స్నేహితుడు సహాయకుడుగా ఉన్నాడు? అదేవిధంగా దేవదానవులతో నిండిన భయంకరమైన ఖాండవవనంలో నేను యుద్ధం చేసినపుడు నాకే స్నేహితుడు తోడున్నాడు? (35-37)
నివాతకవచైః సార్ధం పౌలోమైశ్చ మహాబలైః।
యుధ్యతో దేవరాజార్థే కః సహాయస్తదాభవత్॥ 38
కుమారా ఉత్తరా! ఇంద్రునికోసం మహాబలులైన నివాతకవచులతోను, పౌలోములతోను యుద్ధం చేస్తున్నపుడు నాకు సహాయకుడు ఎవరు? (38)
స్వయంవరే తు పాంచాల్యా రాజభిః సహ సంయుగే।
యుధ్యతీ బహుభిస్తాత కః సహాయస్తదాభవత్॥ 39
ద్రౌపదీస్వయంవరంలో రాజులతో యుద్ధం చేస్తున్నప్పుడు నాకెవ్వడు సహాయకుడయ్యాడు? (39)
ఉపజీవ్య గురుం ద్రోణం శక్రం వైశ్రవణం యమమ్।
వరుణం పావకం చైవ కృపం కృష్ణంచ మాధవమ్॥ 40
పినాకపాణినం చైవ కథమేతాన్ న యోధయే।
రథమ్ వాహయ మే శీఘ్రం వ్యేతు తే మానసో జ్వరః॥ 41
నాగురువయిన ద్రోణాచార్యుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అగ్ని, కృపుడు, కృష్ణుడు, శంకరుడు... వీరందరి అనుగ్రహమూ పొంది, వీళ్లతో యుద్ధం చేయలేకపోవడమేమిటి? నీ మానసికోద్వేగం విడిచి త్వరగా రథం తోలు.' (40,41)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే ఉత్తరార్జునయోర్వాక్యం నామ పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున
ఉత్తరార్జునుల సంభాషణ అను నలువది అయిదవ అధ్యాయము. (45)
(దాక్షిణాత్య అధికపాఠము 6 శ్లోకములతో కలిపి మొత్తం 47 శ్లోకములు.)