47. నలువది యేడవ ఆధ్యాయము
దుర్యోధనుడు యుద్ధము చేయుటకు నిశ్చయించుట.
వైశంపాయన ఉవాచ
అథ దుర్యోధనో రాజా సమరే భీష్మమబ్రవీత్।
ద్రోణం చ రథిశార్దూలం కృపం చ సుమహారథమ్॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. ఆ తర్వాత దుర్యోధనుడు రణరంగంలో భీష్మునితో, రథిశ్రేష్ఠుడైన ద్రోణునితో, మహారథుడైన కృపునితో ఇలా అన్నాడు. (1)
ఉక్తోఽయమర్థ ఆచార్యౌ మయా కర్ణేన చాసకృత్।
పునరేవ ప్రవక్ష్యామి న హి తృప్యామి తం బ్రువన్॥ 2
'గురువర్యులారా! నేనూ, కర్ణుడూ ఈ విషయాన్ని తమకు చాలాసార్లు చెప్పిఉన్నాము. మరలా అదే మాటను చెప్తున్నాను. ఆ విషయాన్ని ఎన్ని మార్లు చెప్పినా నాకు తృప్తి లేదు. (2)
పరాభూతైర్హి వస్తవ్యం తైశ్చ ద్వాదశవత్సరాన్।
వనే జనపదే జ్ఞాతైః ఏష ఏవ పణో హి నః॥ 3
జూదంలో ఓడిపోయినవారు పండ్రెండు సంవత్సరాలు వనంలో, ఒక సంవత్సరం అజ్ఞాతంగా జనపదంలో నివసించాలన్నది కదా మనం పెట్టుకొన్న పందెం. అజ్ఞాతవాసంలో గుర్తింపబడినా ఇదే పందెం. (3)
తేషాం న తావన్నిర్వృత్తం వర్తతే తు త్రయోదశమ్।
అజ్ఞాతవాసో బీభత్సుః అథాస్మాభిః సమాగతః॥ 4
ఇప్పటికింకా వారి పదమూడవ సంవత్సరం పూర్తి కాలేదు. అయినా అజ్ఞాతవాసముందున్న అర్జునుడు ఇప్పుడు మనలను సమీపించాడు. (4)
అనిర్వృతే తు నిర్వాసే యది బీభత్సురాగతః।
పునర్ద్వాదశ వర్షాణి వనే వత్స్యంతి పాండవాః॥ 5
అజ్ఞాతవాసం ముగియకమునుపే అర్జునుడు బయటకు వచ్చాడు. కాబట్టి పాండవులు మరల పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. (5)
లోభాద్వా తే న జానీయుః అస్మాన్ వా మోహ ఆవిశత్।
హీనాతిరిక్తమేతేషాం భీష్మో వేదితుమర్హతి॥ 6
రాజ్యకాంక్షతో పాండవులే ఆనాటి ఒప్పందాన్ని మరిచిపోయారా? లేక మనమే పొరపాటుపడుతున్నామా? ఈపదమూడు సంవత్సరాలు గడపటంలోని తక్కువ ఎక్కువలు భీష్మునికే తెలుస్తాయి. (6)
అర్థానాం తు పునర్ధ్వైధే నిత్యం భవతి సంశయః।
అన్యథా చింతితో హ్యర్థః పునర్భవతి సోఽన్యథా॥ 7
అర్థాలలో ఏకీభావం లేనప్పుడు (ఇదమిత్థమని నిర్ణయించటంలో ఒకే పద్ధతి లేనప్పుడు) ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఒక విధంగా ఒకప్పుడు తోచిన విషయం మరొకప్పుడు మరోవిధంగా కనిపిస్తుంది. (7)
ఉత్తరం మార్గమాణానాం మత్స్యాహం చ యుయుత్సతామ్।
యది బీభత్సురాయాతః తదా కస్యాపరాధ్నుమః॥ 8
మనం మత్స్యదేశంయొక్క ఉత్తరదిక్కునందు గోగ్రహణం చేస్తూ, మత్స్యదేశసైనికులతో యుద్ధం చేయటాన్ని కోరుకొంటున్నాం. అటువంటప్పుడు అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడంటే మనం ఎవరికి అపకారం చేసినట్లు? (8)
త్రిగర్తానాం వయం హేతోః మత్స్యాన్ యోద్ధుమిహాగతాః।
మత్స్యానాం విప్రకారాంస్తే బహూనస్మానకీర్తయన్॥ 9
మనం మత్స్యదేశస్థులతో పోరాడటానికి కూడా కారణం త్రిగర్తులు. వారికోసమే వారికోసమే మన యుద్ధం. మత్స్యదేశ సైనికులు తమను పెట్టిన బాధలెన్నింటిలో త్రిగర్తులు మనకు వినిపించారు. (9)
తేషాం భయాభిభూతానాం తదస్మాభిః ప్రతిశ్రుతమ్।
ప్రథమం తైర్గ్రహీతవ్యం మత్స్యానాం గోధనం మహత్।
సప్తమ్యా మపరాహ్ణే వై తథా తైస్తు సమాహితమ్॥ 10
త్రిగర్తులు భయానికి లోనయ్యారు. అట్టి వారికి మేము సహకరించటానికి మాట ఇచ్చాము. ముందుగా విరాటుని గోధనాన్ని వారే ఆక్రమించాలని నిర్ణయించాము. ఆ మేరకు సప్తమినాటి అపరాహ్ణకాలంలో వారు విరాటుని (దక్షిణ) గోసంపదను స్వాయత్తం చేసికొన్నారు. (10)
అష్టమ్యాం పునరస్మాభిః ఆదిత్యస్యోదయం ప్రతి।
ఇమా గావో గ్రహీతవ్యాః గతే మత్స్యే గవాం పదమ్॥ 11
ఆ సమయంలో విరాటుడు సుశర్మ(త్రిగర్తులు) ఆక్రమించిన గోవుల వెన్నంటి వెడతాడు కాబట్టి అష్టమినాడు సూర్యోదయానికి ఉత్తరదిక్కునందున్న ఈ గోవులను ఆక్రమించవలసి వచ్చింది. (11)
తే వా గా శ్చానయిష్యంతి యది వా స్యుః పరాజితాః।
అస్మాన్ వా హ్యుపసంధాయ కుర్యుర్మత్స్యేన సంగతమ్॥ 12
ఆ త్రిగర్తసేనలు గోవుల నిక్కడకు తోలుకొని వస్తాయి. ఒక వేళ ఓడిపోతే మనతో ఇక్కడ మత్స్యరాజుతో యుద్ధం చేస్తాయి. (12)
అథవా తానపాహాయ మత్స్యో జానపదైః సహ।
సర్వయా సేవయా సార్ధం సంవృతో భీమరూపయా।
ఆయాతః కేవలం రాత్రిమ్ అస్మాన్ యోద్ధుమిహాగతః॥ 13
కాకుంటే మత్స్యరాజు త్రిగర్తులను తరిమికొట్టి తనపౌరులతో, భయంకరరూపంగల తన సర్వసేనలతో కలిసి ఈ రాత్రియే మనతో యుద్ధం చేయాలన్న తలపుతో ఇక్కడకు వచ్చియుండవచ్చు. (13)
తేషామివ మహావీర్యః కశ్చిదేష పురఃసరః।
అస్మాన్ జేతుమిహాయాతః మత్స్యో వాపి స్వయం భవేత్॥ 14
ఆ సైనికులలోని మహాపరాక్రమశాలి అయిన ఒకానొకడు ముందు నడుస్తూ మనలను జయించాలని ఇక్కడకు వచ్చియుండవచ్చు. లేదా స్వయంగా విరాట మహారాజే ముందుకు వచ్చి యుండవచ్చు. (14)
యద్యేష రాజా మత్స్యానాం యది బీభత్సురాగతః।
సర్వైర్యోద్ధవ్యమస్మాభిః ఇతి నః సమయః కృతః॥ 15
ఒకవేళ మత్స్యరాజో, అర్జునుడో ఆ పక్షాన వచ్చినా మనందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలి. ఆమేరకు మనమంతా ప్రతిజ్ఞ చేసి ఉన్నాం. (15)
అథ కస్మాత్ స్థితా హ్యేతే రథేషు రథసత్తమాః।
భీష్మో ద్రోణః కృపశ్చైవ వికర్ణో ద్రౌణిరేవ చ॥ 16
సంభ్రాంతమనసః సర్వే కాలే హ్యస్మిన్ మహారథాః।
నాన్యత్ర యుద్ధాచ్ఛ్రేయోఽస్తి తథాఽఽత్మా ప్రణిధీయతామ్॥ 17
కానీ రథశ్రేష్ఠులు, మహారథులైన భీష్మ, ద్రోణ, కృప, వికర్ణ, అశ్వత్థామలు సరిగా ఈ సమయంలోనే భ్రాంతచిత్తులై రథాలపై నిలబడిపోయారు. ఇప్పుడు యుద్ధం కన్నా మరో మంచి దారి లేదు. కాబట్టి అందరూ స్వయం సన్నద్ధులు కావలసినది. (16,17)
ఆచ్ఛిన్నే గోధనేఽస్మాకమ్ అపి దేవేన వజ్రిణా।
యమేన వాపి సంగ్రామే కో హాస్తినపురం వ్రజేత్॥ 18
ఒకవేళ వజ్రధారియైన ఇంద్రుడుకాని, యముడు కాని వచ్చి యుద్ధం చేసినా గోధనాన్ని గ్రహించకుండా హస్తినకు ఎవ్వడూ వెళ్ళడు. (18)
శరైరేభిః ప్రణున్నానాం భగ్నానాం గహనే వనే।
కో హి జీవేత్ పదాతీనాం భవేదశ్వేషు సంశయః॥ 19
సైనికులలో ఎవడయినా పారిపోయి దుర్గమారణ్యాలను చేరినా నా ఈ బాణాలచే కొట్టబడి మరణించక తప్పదు. సైనికులను తీసికొనిపోయే గుఱ్ఱాలు బ్రతికితే బ్రతకవచ్చునేమో కాని పారిపోతున్న వారు జీవించే అవకాశమే లేదు.' (19)
దుర్యోధనవచః శ్రుత్వా రాధేయస్త్వబ్రవీద్ వచః।
ఆచార్యం పృష్ఠతః కృత్వా తథా నీతిర్విధీయతామ్॥ 20
దుర్యోధనుని మాటలు విని కర్ణుడిలా అన్నాడు. "ద్రోణాచార్యుని వెనుక నిలిపి యుద్ధానికి తగిన నడకను (రీతిని) ఏర్పాటుచేయి. (20)
జానాతి హి మతం తేషామ్ అతస్త్రాసయతీహ నః।
అర్జునే చాస్య సంప్రీతిమ్ అధికాముపలక్షయే॥ 21
ఆచార్యునకు పాండవుల అభిప్రాయం బాగా తెలుసు. అందుకే మనలనిప్పుడు భయపెడుతున్నాడు. అంతే కాదు. అర్జునునిపై ఆచార్యునకు మక్కువ ఎక్కువ అని కూడా నేను గమనించాను. (21)
తథా హి దృష్ట్వా బీభత్సుమ్ ఉపాయాంతం ప్రశంసతి।
యథా సేనా న భజ్యేత తథా నీతిర్విధీయతామ్॥ 22
అందుకే అర్జునుని రాకను గమనించగానే ఆయనను ప్రశంసిస్తున్నారు. కాబట్టి సేన కకావికలు కాకుండేటట్లు యుద్ధనీతిని నిర్ణయించు. (22)
హ్రేషితం హ్యుపశృణ్వానే ద్రోణే సర్వం విఘట్టితమ్।
అదేశికా మహారణ్యే గ్రీష్మే శత్రువశంగతాః।
యథా న విభ్రమేత్ సేనా తథా నీతిర్విధీయతామ్॥ 23
ద్రోణాచార్యుడు ముందుంటే అర్జునుని గుఱ్ఱాల సకిలింతలు విన్నంతనే బెదురుతాడు. సేన అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు ఊరుకాని ఊరిలో, మహారణ్యంలో, గ్రీష్మకాలంలో శత్రువుల చేతికి చిక్కినట్టయింది. మనసేన భయపపడని రీతిలో యుద్ధరీతిని నిర్ణయించు. (23)
ఇష్టా హి పాండవా నిత్యమ్ ఆచార్యస్య విశేషతః।
ఆసయన్నపరార్థాశ్చ కథ్యతే స్మ స్వయం తథా॥ 24
ద్రోణాచార్యునకు ఎప్పుడూ పాండవులే ప్రత్యేకించి ఇష్టమయినవారు. వారు తమపని సానుకూలం కావటం కోసమే ఆచార్యుని నీదగ్గర నిలిపినారు. ఈ ద్రోణాచార్యుడు తనంతతానుగా ఆ రీతిగా చెప్తుంటాడు కూడా. (24)
అశ్వానాం హ్రేషితం శ్రుత్వా కః ప్రశంసాపరో భవేత్।
స్థానే వాపి వ్రజంతో వా సదా హ్రేషంతి వాజినః॥ 25
గుఱ్ఱాల సకిలింతలు విన్నంతమాత్రాన ఎవరైనా ఎవరినైనా ప్రశంసించవచ్చా? గుఱ్ఱాలు నిలిచిఉన్నా, ప్రయాణిస్తున్నా ఎప్పుడూ సకిలిస్తూనే ఉంటాయి. (25)
సదా చ వాయవో వాంతి నిత్యం వర్షతి వాసవః।
స్తనయిత్నోశ్చ నిర్ఘోషః శ్రూయతే బహుశస్తథా॥ 26
కిమత్ర కార్యం పార్థస్య కథం వా స ప్రశస్యతే।
అన్యత్ర కామాత్ ద్వేషాద్వా రోషాదస్మాసు కేవలాత్॥ 27
గాలులు ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటాయి. ఇంద్రుడెప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. మేఘగర్జనలూ ఎన్నోమార్లు వినిపించేవే.
అర్జునునకు ఇక్కడేమిపని? అతనిని అంతగా ప్రశంసించవలసిన అవసరం ఆచార్యున కేమిటి? కేవలం పాండవులపై ప్రేమయో, లేకపోతే మనపై ద్వేషమో, రోషమో తప్ప మరే కారణమూ లేదు. (26,27)
ఆచార్యా వై కారుణికాః ప్రాజ్ఞాశ్చాపాపదర్శినః।
నైతే మహాభయే ప్రాప్తే సంప్రష్టవ్యాః కథంచన॥ 28
గురువులు సహజంగా దయామయులూ, బుద్ధిమంతులు. పాపకృత్యాలపై వైముఖ్యం గలవారు కాబట్టి భయం గొల్పే సంకటస్థితి ఏర్పడినపుడు ఎట్టి పరిస్థితిలోనూ వారిని సలహాలు అడగరాదు. (28)
ప్రాసాదేషు విచిత్రేషు గోష్ఠీషూపవనేషు చ।
కథా విచిత్రా కుర్వాణాః పండితాస్తత్ర శోభనాః॥ 29
పండితులు సుందరమందిరాలలో, పండిత గోష్ఠులలో, ఉద్యానవనాల్లో కూర్చొని విచిత్రకథలను వినిపిస్తుంటే అది అందంగా ఉంటుంది. (29)
బహూన్యాశ్చర్యరూపాణి కుర్వాణా జనసంసది।
ఇజ్యాస్త్రే చోపసంధానే పండితాస్తత్ర శోభనాః॥ 30
పండితులు జనసముదాయం మధ్యలో ఆశ్చర్యకరాలైన పనులు చేస్తున్నా, యాగం చేయటానికి ఆయుధాలైన స్రుక్సువాదులను సిద్ధం చేసుకొంటున్నా అప్పుడు అందంగా ఉంటుంది. (30)
పరేషాం వివర్జ్ఞానే మనుష్యచరితేషు చ।
హస్త్యశ్వరథచర్యాసు ఖరోష్ట్రాజావికర్మణి॥ 31
గోధనేషు ప్రతోళీషు వరద్వారముఖేషు చ।
అన్నసంస్కారదోషేషు పండితాస్తత్ర శోభనాః॥ 32
పండితులు పరులలో దోషాలను ఎన్నేటప్పుడూ; మనుష్యుల చరిత్రలను వర్ణించేటప్పుడూ; గజయాత్ర, అశ్వయాత్ర, రథ యాత్రలకు ముహూర్తాలు నిర్ణయించే టప్పుడూ; గాడిద, ఒంటె, మేక, గొఱ్ఱెలకు సంబంధించిన గుణదోషాది విమర్శలు చేసేటప్పుడూ; గోధన సంగ్రహ విషయంలో, వీధుల్లోనూ, ఇంటిగుమ్మాల దగ్గరను మంగళకృత్యాలు చేసేటప్పుడూ; అన్నసంస్కార దోషాలను పరిశీలించేటప్పుడూ అందగిస్తారు. (31,32)
పండితాన్ పృష్ఠతః కృత్వా పరేషాం గుణవాదినః।
విధీయతాం తథా నీతిః యథా వధ్యో భవేత్ పరః॥ 33
శత్రువుల గుణాలను ప్రశంసిస్తున్న పండితులను వెనక్కు నెట్టి శత్రువులను సంహరించడానికి అవసరమైన నీతిని ప్రయోగించు. (33)
గావశ్చ సంప్రతిష్ఠాప్య సేనాం వ్యూహ్య సమంతతః।
ఆరక్షాశ్చ విధీయంతాం యత్ర యోత్స్యామహే పరాన్॥ 34
గోవులను, మిమ్ములను కూడా పదిలపరచుకొని అన్ని వైపులా సేనలను మోహరించి శత్రువులతోయుద్ధమ్ చేయటానికి అనుగుణంగా రక్షకులను నియమించుకోవాలి.' (34)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరన పర్వణి ఉత్తరగోగ్రహే దుర్యోధనవాక్యే సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తర గోగ్రహణమున
దుర్యోధనుని అభిప్రాయము అను నలువది యేడవ అధ్యాయము. (47)