49. నలువది తొమ్మిదవ అధ్యాయము

కృపాచార్యుడు కర్ణుని అధిక్షేపించుట.

కృప ఉవాచ
సదైవ తవ రాధేయ యుద్ధే క్రూరతరా మతిః।
నార్థానాం ప్రకృతిం వేత్సి నానుబంధమవేక్షసే॥ 1
కృపుడు ఇట్లు అన్నాడు. రాధేయా! యుద్ధ విషయంలో నీ ఆలోచన ఎప్పుడూ క్రూరంగానే ఉంటుంది. అర్థస్వభావాన్ని కానీ, దాని పర్యవసానాన్ని కానీ నీవు గమనించవు. (1)
మాయా హి బహవస్సంతి శాస్త్రమాశ్రిత్య చింతితాః।
తేషాం యుద్ధం తు పాపిష్ఠం వేదయంతి పురావిదః॥ 2
రాజనీతిశాస్త్రాన్ని బట్టి ఆలోచిస్తే రాజకీయ తంత్రాలు చాలా ఉన్నాయి. వాటి అన్నింటిలో యుద్ధం పాపభూయుష్ఠమని పెద్దలు చెప్పుతూ ఉంటారు. (2)
వి॥సం॥ మాయను - వంచను - నమ్ముకొని జీవించే శకునివంటి వారి దృష్టిలో యుద్ధం పాపిష్ఠం. అయితే ఇప్పుడు మాయాద్యూతంతో అర్జునుని జయించటం సాధ్యంకాదు. (నీల)
'నయా హి బహవస్సన్తి' అని పాఠం.
నయాః = నీతులు, సామదానభేదదండోపాయాలు; మిత్రలాభ, మిత్రభేద, సంధి, విగ్రహాదులు చాలా ఉన్నాయి. వాటిలో యుద్ధం వినాశహేతువు కాబట్టి పాపిష్ఠం. ముందే యుద్ధం చేయటం మరీపాపిష్ఠం. (లక్షా, సర్వ)
దేశకాలేన సంయుక్తం యుద్ధం విజయదం భవేత్।
హీనకాలం తదేవేహ ఫలం న లభతే పునః।
దేశే కాలే చ విక్రాంతం కళ్యాణాయ విధీయతే॥ 3
దేశకాలాల ననుసరించి చేసిన యుద్ధం గెలుపు నిస్తుంది. తగని కాలంలో యుద్ధం చేస్తే ఫలితముండదు. అదేవిధంగా తగినచోట, తగినవేళ ప్రదర్శింపబడిన పరాక్రమం శుభప్రదమవుతుంది. (3)
ఆనుకూల్యేన కార్యాణామ్ అంతరం సవిధీయతే।
భారం హి రథకారస్య న వ్యవస్యంతి పండితాః॥ 4
దేశకాలాల ఆనుకూల్యం వలననే కార్యసిద్ధి జరుగుతుంది. రథకారునిపై భారముంచి జ్ఞానులెవ్వరూ యుద్ధసన్నద్ధులు కారు. (4)
వి॥సం॥ రథకారుడు రథాన్నిచేసి, దీనితో దేవతలనైనా జయించవచ్చని అర్థవాదాలు చెప్పినంత మాత్రాన ఆమాటలు నమ్మి దేశకాలాదులను గమనించక యుద్ధానికి దిగటం పండితలక్షణం కాదు. అలాగే నీమాటలమీదనే భారాన్ని పెట్టి దేశకాలాలు అనుకూలమా కాదా అని ఆలోచించకుండా మేమెలా యుద్ధం చేస్తాం. నీమాటలు ఆ రథకారుడి మాటలవంటివే అని కృపుని అభిప్రాయం. (నీల, సర్వ)
రథకారుడవైన నీకు యుద్ధానికి రెచ్చగొట్టడం తేలికయే. ఆ భారం రాజుపై పడుతుంది.
రథకారుడి భావాన్ని పండితులు పాటించరు. నీచులు చేసే పనిని పండితులు చేయరు. బలవద్విరోధం తగదు. అది నీచాచరణం. పండితాచరణం కాదు.
అర్జునుడు రథం. ద్రోణుడు రథకారుడు. కాబట్టి ద్రోణుడు అర్జునుని ఎదిరించాడు. (చతు)
'ఆనుపూర్వ్యేణ కార్యాణాం' అని పాఠం. ఇది దుర్యోధనుని మాటగా వివరణం.
సామాద్యుపాయాలను క్రమంగా అనుసరించాలి. అయితే అర్జునుడు సామసాధ్యుడు కాదు. "ఋజవో మృదవశ్చైవ నామసాధ్యాః ప్రకీర్తితాః" అర్జునుడు ఋజువూ కాదు, మృదువూ కాదు. "ఋజవో లోభయుక్తాశ్చ దానసాధ్యాః ప్రకీర్తితాః" అర్జునుడు లోభికూడా కాదు. కాబట్టి దానం పనికి రాదు. "సముత్పన్నభయాశ్చైవ భేదసాధ్యాః నరాః స్మృతాః" అర్జునుడు నిర్భయుడు. కాబట్టి భేదం పనిచేయదు. "అనివృత్తోపశమనా దండసాధ్యాః నరాధమాః" అర్జునుడు వెనుదిరిగినవాడో, శాంతించిన వాడో కాదు కాబట్టి దండం పనికిరాదు. అసాధ్యుడు కాబట్టి ఉపేక్షించవచ్చనే వీలు లేదు. తామే గదా యుద్ధాన్ని కొనితెచ్చుకొనినది. కాబట్టి దండోపాయం తప్పదు. అంటే యుద్ధం తప్పదు. అయితే ఎవరిని నమ్మి యుద్ధం చేయాలి? శిఖండి ఉన్నంతకాలం భీష్ముడు అజయ్యుడు కాదు. జాలిగల కర్ణుడు పనికిరాడు. అర్జునునితో సౌహార్దం కలవాడు కాబట్టి అశ్వత్థామ పనికిరాడు. కాబట్టి ద్రీణుడే ఈభారాన్ని వహించాలి. అతడే రథకారుడు. (దుర్ఘ)
రథకారుడు రథాన్ని తయారుచేస్తాడు. అయితే రథం భరించగల భారాన్ని రథకారుడు భరించలేడు. మనచేత పెరిగిన తయారుచేయబడిన అర్జునుడు మనకన్న అధికుడు. కాబట్టి అర్జునునితో మనం యుద్ధం చేయలేము. సంధియే ఉత్తమం. రథంపై నిలిచి యుద్ధం చేస్తున్నప్పుడు రథికుని సంగ్రామ సామర్థ్యాన్ని పండితులమనుకొనేవారు సైతం అంచనా వేయలేరు. పండితులమనుకొనేవారు అనటం కర్ణుని నిందించటం. నీవంటి వారని. (విష)
పరిచింత్య తు పార్థేన సన్నిపాతో న నః క్షమః।
ఏకః కురూనభ్యగచ్ఛేత్ ఏకశ్చాగ్నిమతర్పయత్॥ 5
సరిగా ఆలోచిస్తే ప్రస్తుతం మనం అర్జునునితో యుద్ధం చేయటం తగనిపని. తానొక్కడే కౌరవుల నెదిరింపగలడు. గతంలో ఒంటరిగానే అగ్నిని తృప్తి పరిచాడు. గదా! (5)
ఏకశ్చ పంచవర్షాణి బ్రహ్మచర్యమధారయత్।
ఏకః సుభద్రామారోప్య ద్వైరథే కృష్ణమాహ్వయత్॥ 6
అర్జునుడు ఒంటరిగానే అయిదు సంవత్సరాలు బ్రహ్మచర్యవ్రతాన్ని పాలించాడు. ఒంటరిగానే సుభద్రను అపహరించుకొనిపోతూ శ్రీకృష్ణునితోకూడా ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యాడు. (6)
ఏకః కిరాతరూపేణ స్థితం రుద్రమయోధయత్।
అస్మిన్నేవ వనే పార్థః హృతాం కృష్ణామవాజయత్॥ 7
అర్జునుడు ఒంటరిగానే కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరునితో యుద్ధం చేశాడు. ఈ వనంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించినప్పుడు ఒంటరిగానే సైంధవుని ఓడించి ద్రౌపదిని విడిపించుకొనినాడు. (7)
ఏకశ్చ పంచవర్షాణి శక్రాదస్త్రాణ్యశిక్షత।
ఏకస్సోఽయ మరిం జిత్వా కురూణామకరోద్ యశః॥ 8
ఏకో గంధర్వరాజానం చిత్రసేనమరిందమః।
విజిగ్యే తరసా సంఖ్యే సేనాం ప్రాప్య సుదుర్జయామ్॥ 9
అర్జునుడు ఒంటరిగానే అయిదు సంవత్సరాలు ఇంద్రుని దగ్గర అస్త్రవిద్య నభ్యసించాడు. ఒంటరిగానే శత్రువును జయించి కురువంశస్థులకు కీర్తి కల్గించాడు. జయింపశక్యం కాని సేనగల చిత్రసేనుని ఒంటరిగానే ఎదిరించి ఆ గంధర్వ రాజును చిటికెలో యుద్ధంలో ఓడించాడు. (8,9)
తథా నివాతకవచాః కాలఖంజాశ్చ దానవాః।
దైవతైరప్యవధ్యాస్తే ఏకేన యుధి పాతితాః॥ 10
అట్లే దేవతలకు కూడా వధింపశక్యంకాని నివాతకవచులు, కాలఖంజులు మొదలయిన రాక్షసులను ఒంటరిగానే యుద్ధంలో పడగొట్టాడు. (10)
ఏకేన హి త్వయా కర్ణ కిం నామేహ కృతం పురా।
ఏకేనైవ యథా తేషాం భూమిపాలా వశే కృతాః॥ 11
కర్ణా! ఇంతవరకు నీవు ఒంటరిగా సాధించిన గొప్ప పని ఏదయినా ఉందా? చెప్పు. పాండవులు ఒక్కొక్కరుగానే విభిన్నదిక్కులలో రాజులను వశం చేసికొన్నారు. (11)
ఇంద్రోఽపి హి న పార్థేన సంయుగే యోద్ధుమర్హతి।
యస్తేనాశంసతే యోద్ధుం కర్తవ్యం తస్య భేషజమ్॥ 12
ఇంద్రుడైనను అర్జునునితో యుద్ధంచేయలేడు. అర్జునునితో ఒంటరిగా పోరాడలని ఎవడయినా ముచ్చటపడితే అతనికి ఔషధాన్ని (చికిత్సను) ఏర్పాటు చేయకతప్పదు. (12)
ఆశీవిషస్య క్రుద్ధస్య పాణిముద్యమ్య దక్షిణమ్।
అవముచ్య ప్రదేశిన్యా దంష్ట్రామాదాతుమిచ్ఛసి॥ 13
సూతపుత్రా! అర్జునునితో ఒంటరిగా పోరాడటమంటే కోపించిన పామునోటిని కుడిచేతితో తెరిచి చూపుడు వ్రేలితో దాని దంతాలను లెక్కించడమే. (13)
అథవా కుంజరం మత్తమ్ ఏక ఏవ చరన్ వనే।
అనంకుశం సమారుహ్య నగరం గంతుమిచ్ఛసి॥ 14
లేదా అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ అంకుశం కూడా లేకుండా మదపుటేనుగుపై కూర్చొని నగరానికి ప్రయాణించటం వంటిది. (14)
సమిద్ధం పావకం చైవ ఘృతమేదోవసాహుతమ్।
ఘృతాక్తశ్చీరవాసాస్త్వం మధ్యేనోత్తర్తు మిచ్ఛసి॥ 15
నేతిలో మునిగి. నారచీరలు కట్టిన నీవు నెయ్యి. మేదస్సు, వసలచే ప్రజ్వలించే అగ్నిమధ్యలో నిలిచి బయటకు రావాలనుకోవడం వంటిది. (15)
ఆత్మానం కః సముద్బద్ధ్య కంఠే బద్ధ్వా మహాశిలామ్।
సముద్రం తరతే దోర్భ్యాం తత్ర కిం నామ పౌరుషమ్॥ 16
తనను తాను బంధించుకొని, మెడలో గండ శిలను కట్టుకొని చేతులతో ఈదుతీ ఎవడు సముద్రాన్ని దాటగలడు? దానివలన సాధించేది మాత్ర మేముంటుంది? (16)
అకృతాస్త్రః కృతాస్త్రం వై బలవంతం సుదుర్బలః।
తాదృశం కర్ణ యః పార్థం యోద్ధుమిచ్ఛేత్ స దుర్మతిః॥ 17
కర్ణా! విలువిద్య నేర్వనివాడు విలువిద్యలో నిష్ణాతుడైనవానినీ, పరమదుర్బలుడైనవాడు బలవంతునీ ఎదిరించటం ఎటువంటిదో అర్జునునితో యుద్ధం చేయగోరటం అటువంటిదే. అటువంటి ఆలోచన చేసినవాడు బుద్ధిహీనుడు. (17)
అస్మాభిర్హ్యేష నికృతః వర్షాణీహ త్రయోదశ।
సింహః పాశవినిర్ముక్తః న నః శేషం కరిష్యతి॥ 18
ఏకాంతే పార్థమాసీనం కూపేఽగ్నిమివ సంవృతమ్।
అజ్ఞానా దభ్యవస్కంద్య ప్రాప్తాః స్మోఽభయముత్తమమ్॥ 19
మనం పదమూడుసంవత్సరాలు వనవాస, అజ్ఞాతవాసాల పేరుతో అర్జునుని విషయంలో కపటంగా వ్యవహరించాము. బంధనంనుండి విడిపించుకొన్న సింహంలాగా అర్జునుడు మనలను మిగులుస్తాడా? బావిలో కప్పబడియున్న అగ్నిని ఎగదోసినట్లు ఏకాంతవాసంలోనున్న అర్జునుని మన అజ్ఞానంతో ఉసి కొల్పాము. పెద్ద భయాన్ని కొని తెచ్చుకొన్నాము. (18,19)
సహయుధ్యామహే పార్థమ్ ఆగతం యుద్ధదుర్మదమ్।
సైన్యాస్తిష్ఠంతు సన్నద్ధాః వ్యూఢానీకాః ప్రహారిణః॥ 20
కాబట్టి మనమంతా కలసి యుద్ధోన్మాదం గల ఈ అర్జునుని ఎదిరిద్దాం. మనసేన కవచాలు ధరించి, వ్యూహంగా ఏర్పడి ఎదురుకోలుకు సిద్ధమవుతుంది. (20)
ద్రోణో దుర్యోధనో భీష్మః భవాన్ ద్రౌణిస్తథా వయమ్।
సర్వే యుధ్యామహే పార్థం కర్ణ మా సాహసం కృథాః॥ 21
వయం వ్యవసితం పార్థం వజ్రపాణిమివోద్యతమ్।
షడ్రథాః ప్రతియుధ్యేను తిష్ఠేమ యది సంహతాః॥ 22
ద్రోణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, అశ్వత్థామ, నీవు, నేను కలిసి అర్జునునితో పోరాడుదాము. కర్ణా! తొందరపాటు తగదు. దృఢనిశ్చయంతో వజ్రపాణి అయిన దేవేంద్రునివలె ఎత్తివస్తున్న అర్జునుని మనం ఆరుగురం కలిసి పోరాడితేనే నిలువరించగలం. (21,22)
వ్యూఢానీకాని సైన్యాని యత్తాః పరమధన్వినః।
యుధ్యామహేఽర్జునం సంఖ్యే దానవా ఇవ వాసవమ్॥ 23
మోహరించిన సేనలు, సంసిద్ధులయిన గొప్ప విలుకాండ్రూ, మనమూ కలిసి దానవులు దేవేంద్రుని ఎదిరించినట్లు అర్జునుని యుద్ధంలో ఎదిరిద్దాం. (23)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే కృపవాక్యం నామ ఏకోన పంచాశత్తమోఽధ్యాయః॥ 49 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
ఉత్తరగోగ్రహణమున కృపవచనమను నలువది తొమ్మిదవ అధ్యాయము. (49)