51. ఏబదియొకటవ అధ్యాయము

భీష్ముడు అందరిని శాంతింపజేయుట, ద్రోణుడు దుర్యోధనుని రక్షింపవలెనని చెప్పుట.

భీష్మ ఉవాచ
సాధు పశ్యతి వై ద్రౌణిః కృపః సాధ్వనుపశ్యతి।
కర్ణస్తు క్షత్రధర్మేణ కేవలం యోద్ధుమిచ్ఛతి॥ 1
భీష్ముడు ఇట్లు అన్నాడు.
దుర్యోధనా! అశ్వత్థామ చక్కగా ఆలోచిస్తున్నాడు. కృపాచార్యుడూ సరిగానే గమనిస్తున్నాడు. కర్ణుడు మాత్రం కేవలం క్షత్రియధర్మంతో యుద్ధం చేయగోరుతున్నాడు. (1)
ఆచార్యో నాభివక్తవ్యః పురుషేణ విజానతా।
దేశకాలౌ తు సంప్రేక్ష్య యోద్ధవ్యమితి మే మతిః॥ 2
యుక్తాయుక్తాలు తెలిసిన వాడెవ్వడూ గురునిమ్ద చేయరాదు. దేశకాలాలను గమనించియే యుద్ధానికి సిద్ధం కావాలన్నదే నా అభిప్రాయం. (2)
యస్య సూర్యసమాః పంచ సపత్నాః స్యుః ప్రహారిణః।
కథమభ్యుదయే తేషాం న ప్రముహ్యేత పండితః॥ 3
దుర్యోధనునకు సూర్యతేజస్సు కలిగి పోటుగాండ్రయిన।
కథమభ్యుదయే తేషాం న ప్రముహ్యేత పండితః॥ 3
దుర్యోధనునకు సూర్యతేజస్సు కలిగి పోటుగాండ్రయిన అయిదుగురు శత్రువులు, పాండవులు ఉన్నారు. ఆ శత్రువుల అభ్యుదయాన్ని చూచినపుడు పండితుడైనా మోహంలో పడకుండా ఎలా ఉంటాడు. (3)
స్వార్థే సర్వే విముహ్యంతి యేఽపి ధర్మవిదో జనాః।
తస్మాద్రాజన్ బ్రవీమ్యేషః వాక్యం తే యది రోచతే॥ 4
ధర్మవేత్తలు సైతం తమ విషయాలను ఆలోచించే సమయంలో పొరపాటుపడుతుంటారు. కాబట్టి రాజా! నీకిష్టమయితే నా సలహాను కూడా ఇవ్వగలను. (4)
కర్ణో హి యదవోచత్ త్వాం తేజస్సంజననాయ తత్।
ఆచార్యపుత్రః క్షమతాం మహత్ కార్యముపస్థితమ్॥ 5
కర్ణుని మాటలు పరాక్రమాన్నీ, ఉత్సాహాన్నీ రగిలించటానికి చెప్పినవే. అశ్వత్థామ ఆ మాటలను క్షమించాలి. ఇక్కడ, ఇప్పుడు పెద్దపని వచ్చిపడినది. (5)
నాయం కాలో విరోధస్య కౌంతేయే సముపస్థితే।
క్షంతప్యం భవతా సర్వమ్ ఆచార్యేణ కృపేణ చ॥ 6
కౌంతేయుడైన అర్జునుడే ఎత్తివచ్చిన ఈ సమయం విరోధాలకు, అంతఃకలహాలకు తగినది కాదు. నీవూ, ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ జరిగిన దానిని క్షమించాలి. (6)
వి॥సం॥ స్వయమాచరతే యస్మాదాచారం స్థాపయత్యపి।
ఆచినోతి చ శాస్త్రాణి హ్యాచార్యస్తేన చోచ్యతే॥
తాను ఆచరిస్తూ, ఇతరులచే ఆచరింపజేస్తూ, శాస్త్రజ్ఞానాన్ని సమీకరించుకొనువాడు ఆచార్యుడు.
ద్రోణుడు నాలుకపై నాలుగువేదాలు, చేతిలో ధనుర్బాణాలు కలవాడు. శాపమైనా శరసంధానమైనా సమానసామర్థ్యం కలవాడు. (విష)
భవతాం హి కృతాస్త్రత్వం యథాఽఽదిత్యే ప్రభా తథా।
యథా చంద్రమసో లక్ష్మీః సర్వథా నాపకృష్యతే॥ 7
సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని శోభ ఎప్పుడూ తగ్గనట్లు మీలోని ధనుర్విద్యాపాండిత్యం ఎన్నడూ తక్కువ గాదు(లోటుకాదు). (7)
ఏవం భవత్సు బ్రాహ్మణ్యం బ్రహ్మాస్త్రం చ ప్రతిష్ఠితమ్।
చత్వార ఏకతో వేదాః క్షాత్రమేకత్ర దృశ్యతే॥ 8
ఈ తీరున మీలో బ్రాహ్మణత్వం. బ్రహ్మాస్త్రం రెండూ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఒకవైపు చతుర్వేద విజ్ఞానం, మరొకవైపు క్షాత్రధర్మం. (8)
నైతత్ సమస్తముభయం కస్మింశ్చిదనుశుశ్రుమ।
అన్యత్ర భారతాచార్యాత్ సపుత్రాదితి మే మతిః॥ 9
ఈ రెండూనూ - వేదమూ, ధనుర్వేదమూ - సంపూర్ణంగా ఒకే వ్యక్తి యందున్నట్టు ఇంతకు ముందెప్పుడూ వినలేదు. భరతవంశస్థులకు ఆచార్యులయిన కృప, ద్రోణ, అశ్వత్థామలయందు మాత్రమే ఈ రెండు శక్తులీ కలిసి యున్నట్టు నా విశ్వాసం. (9)
వేదాంతాశ్చ పురాణాని ఇతిహాసం పురాతనమ్।
జామదగ్న్యమ్ ఋతే రాజన్ కో ద్రోణాదధికో భవేత్॥ 10
రాజా! వేదాంతమైనా, పురాణమైనా, ప్రాచీనేతిహాసమైనా సరే! వీటి విజ్ఞానంలో ఆనాటి పరశురాముడు తప్ప మరెవ్వరు ద్రోణుని మించిపోగలరు? (10)
బ్రహ్మాస్త్రం చైవ వేదాశ్చ నైతదన్యత్ర దృశ్యతే।
ఆచార్యపుత్రః క్షమతాం నాయం కాలో విభేదనే॥ 11
సర్వే సంహత్య యుధ్యామః పాకశాసనిమాగతమ్॥ 12
వేదవిజ్ఞానం, బ్రహ్మాస్త్రం - ఈరెండును మన ఈ ఆచార్యులలో తప్ప మరెక్కడా కనిపించవు. అశ్వత్థామ క్షమించాలి. ఇది అభిప్రాయభేదాలకు అదనుకాదు. అందరమూ కలిసి ఎత్తివచ్చిన అర్జునుని ఎదిరిద్దాం. (11,12)
బలస్య వ్యసనానీహ యాన్యుక్తాని మనీషిభిః।
ముఖ్యో భేదో హి తేషాం తు పాపిష్ఠో విదుషాం మతః॥ 13
మహనీయులు సేనావినాశహేతువులుగా చెప్పిన ఇబ్బందులలో ప్రదానమైనది భేదం. (అంతఃకలహం) విద్వాంసులు దీనిని మహాపాపంగా భావిస్తారు.' (13)
అశ్వత్థామోవాచ
నైవ న్యాయ్యమిదం వాచ్యమ్ అస్మాకం పురుషర్షభ।
కింతు రోషపరీతేన గురుణా భాషితా గుణాః॥ 14
అశ్వత్థామ ఇలా అన్నాడు.' మహాత్మా! న్యాయోచితాలయిన మా మాటలను నిందింపదగదు. ఇంతకుముందు పాండవులకు జరిగిన అన్యాయాలను తలచుకొని కోపంతో ద్రోణాచార్యుడు అర్జునుని గుణాలను ప్రస్తావించాడు. అంతే. (14)
శత్రోరపి గుణా గ్రాహ్యాః దోషా వాచ్యా గురోరపి।
సర్వథా సర్వయత్నేన పుత్రే శిష్యే హితం వదేత్॥ 15
గురువు గారి వయినా దోషాలు చెప్పాలి. శత్రువుల నుండి అయినా గుణాలను గ్రహించాలి. గురువు సర్వవిధాలుగా సమస్త ప్రయత్నాలలో పుత్రులకూ, శిష్యులకూ కూడా హితబోధ చేయాలి.' (15)
దుర్యోధన ఉవాచ
ఆచార్య ఏవ క్షమతాం శాంతిరత్ర విధీయతామ్।
అభిద్యమానే తు గురౌ తద్ వృత్తం రోషకారితమ్॥ 16
దుర్యోధను డన్నాడు. 'ఆచార్యా! క్షమించండి. ఇప్పుడు శాంతాన్ని వహించాలి. ద్రోణాచార్యుల మనస్సులో భేదబుద్ధి లేదు. ఇంతకుముందు పలికిన పలుకులు రోషం వలన పుట్టినవే.' (16)
వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనో ద్రోణం క్షమయామాస భారత।
సహ కర్ణేవ భీష్మేణ కృపేణ చ మహాత్మనా॥ 17
వైశంపాయనుడు ఇట్లు చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణునితోను, భీష్మునితోను, మహాత్ముడైన కృపునితోను కలిసి ద్రోణుని శాంతపరిచాడు. (17)
ద్రోణ ఉవాచ
యదేతత్ ప్రథమం వాక్యం భీష్మః శాంతనవోఽబ్రవీత్।
తేనైవాహం ప్రసన్నో వై నీతిరత్ర విధీయతామ్॥ 18
యథా దుర్యోధనం పార్థః నోపసర్పతి సంగరే।
సాహసాద్ యది వా మోహాత్ తథా నీతిర్విధీయతామ్॥ 19
ద్రోణుడు ఇట్లన్నాడు. శంతనుకుమారుడైన భీష్ముడు పలికిన తొలిమాటతోనే నేను చల్లబడ్డాను. ఇక యుద్ధరీతిని గురించి ఆలోచించండి. యుద్ధంలో అర్జునుడు సాహసం వల్ల గానీ పొరపాటుగా గానీ దుర్యోధనుని సమీపించి ఆక్రమించకుండా ఉండేటట్లు యుద్ధరీతిని(నడకను) నిర్ణయించండి. (18,19)
వనవాసే హ్యనిర్వృత్తే దర్శయేన్న ధనంజయః।
ధనం చాలభమానోఽత్ర నాద్య తత్ క్షంతుమర్హతి॥ 20
వనవాసం(అజ్ఞాతవాసంతోసహా) ముగియనట్లైతే అర్జునుడు బయటపడి ఉండేవాడు కాదు. ఈనాడు గోవులను స్వాధీనం చేసికొనక మనలను క్షమించే ప్రసక్తికూడాలేదు. (20)
యథా నాయం సమాయుంజ్యాత్ ధార్తరాష్ట్రాన్ కథంచన।
న చ సేనాః పరాజయ్యాత్ తథా నీతిర్విధీయతామ్॥ 21
అర్జునుడు ఎట్టి పరిస్థితిలోనూ ధృతరాష్ట్రకుమారుల మీదికి రాకుండేటట్లు, కౌరవసేనను ఓడింపకుండేటట్లు రణవ్యూహాన్ని నిర్ణయించండి. (21)
ఉక్తం దుర్యోధనేనాపి పురస్తాద్ వాక్యమీదృశమ్।
తదనుసృత్య గాంగేయ యథావద్ వక్తు మర్హసి॥ 22
దుర్యోధనుడు కూడా పాండవుల అజ్ఞాతవాస పరిసమాప్తి విషయంలో ముందే సందేహించాడు. కాబట్టి గాంగేయా! అజ్ఞాతవిషయంలో ఉన్నదున్నట్లు చెప్పగల వాడవు నీవే. (22)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి ఉత్తరగోగ్రహే ద్రోణవాక్యే ఏకపంచాశత్తమోఽధ్యాయః॥ 51 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున ద్రోణవాక్యమను ఏబదియొకటవ అధ్యాయము. (51)