72. డెబ్బదిరెండవ అధ్యాయము

ఉత్తరాభిమన్యుల వివాహము.

విరాట ఉవాచ
కిమర్థం పాండవశ్రేష్ఠ భార్యాం దుహితరం మమ।
ప్రతిగృహీతుం నేమాం త్వం మయా దత్తమిహేచ్ఛసి॥ 1
విరాటుడు అడిగాడు. 'పాండవశ్రేష్ఠా! నేను స్వయంగా నాకూతురిని నీకు ఇస్తున్నాను. అయినా నీవు భార్యగా ఆమెను ఎందుకు స్వీకరించడంలేదు?' (1)
అర్జున ఉవాచ
అంతఃపురేఽ హముషితః సదా పశ్యన్ సుతాం తవ।
రహస్యం చ ప్రకాశం చ విశ్వస్తా పితృవన్మయి॥ 2
ప్రియో బహుతమశ్చాసం నర్తకో గీతకోవిదః।
ఆచార్యవచ్చ మాం నిత్యం మన్యతే దుహితా తవ॥ 3
అర్జునుడిలా చెప్పాడు. 'నేను చాలాకాలం మీ అంతః పురంలో ఉన్నాను. మీ కుమార్తెను ఏకాంతంలోనూ, అందరి ఎదుటా కూడా పుత్రీభావంతోనే చూస్తూ వచ్చాను. ఆమెకూడా నన్ను తండ్రిలాగే విశ్వసించింది. నేను నాట్యం చేయడమేకాదు. గానవిద్యలోనూ నేర్పరినే. కాబట్టి ఆమెకు నాయందమితమైన ప్రేమ. కాని ఆమె నన్ను ఎప్పుడూ ఆచార్యునిగానే భావించింది. (2,3)
వయఃస్థయా తయా రాజన్ సహ సంవత్సరోషితః।
అతిశంకా భవేత్ స్థానే తవ లోకస్య వా విభో॥ 4
రాజా! యుక్తవయస్కురాలు అయిన ఆమెతో నేను సంవత్సరంపాటు ఉన్నాను. ప్రభూ! ఇట్టి పరిస్థితిలో నేను ఆమెను వివాహమాడితే మీకు గాని ఇతరులకు గాని మా నడవడి విషయంలో సందేహం రావచ్చును. (4)
తస్మాన్నిమంత్రయేఽహం తే దుహితాం మనుజాధిప।
శుద్ధో జితేంద్రియో దాంతః తస్యాః శుద్ధిః కృతా మయా॥ 5
మహారాజా! అలాంటి సందేహం లేకుండా నేను మీకుమార్తెను కోడలిగా అర్థిస్తున్నాను. అలా చేస్తేనే నేను శుద్ధచరితుడిని, జితేంద్రియుడిని, మనోనిగ్రహం కలవాడినని తెలుస్తుంది. పైగా దీనివల్లనే నాద్వారా మీ కుమార్తె నడవడిలోని శుద్ధత స్పష్టమవుతుంది. (5)
స్నుషాయాం దుహితుర్వాపి పుత్రే చాత్మని వా పునః।
అత్ర శంకాం న పశ్యామి తేన శుద్ధిర్భవిష్యతి॥ 6
కోడలికి, కూతురికి, అలాగే కొడుకుకి తనకు భేదం లేదు. కాబట్టే ఆమెను కోడలిగా స్వీకరిస్తేనే కళంకశంక ఉండదనిపిస్తోంది. పైగా దీనివలన మా ఇద్దరి పవిత్రత కూడా అందరికీ స్పష్టమవుతుంది. (6)
అభిశాపాదహం భీతః మిథ్యావాదాత్ పరంతప।
స్నుషార్థముత్తరాం రాజన్ ప్రతిగృహ్ణామి తే సుతామ్॥ 7
పరంతపా! నేను అభిశాపానికి అపనిందకు భయపడుతున్నాను. కబట్టి రాజా! నేను మీకుమార్తె ఉత్తరను కోడలిగానే స్వీకరిస్తాను. (7)
వి॥సం॥ అభిశాపాత్ - లోఖప్రవాదంవలన
ఉత్తరను అర్జునుడు భార్యగా స్వీకరిస్తే అంతకుముందునుండి వారిద్దరికీ సంబంధమున్నరేమో అని శంకించి లోకం చెడుగా మాట్లాడవచ్చు. (నీల)
స్వస్రీయో వాసుదేవస్య సాక్షాద్ దేవశిశుర్యథా।
దయితశ్చక్రహస్తప్య సర్వాస్త్రేషు చ కోవిదః॥ 8
నకొడుకు దేవపుత్రునితో సమానుడు. అతడు సాక్షాత్తు భగవంతుడైన వాసుదేవునికి మేనల్లుడు. చక్రధారి అయిన శ్రీకృష్ణునికి అతడు మిక్కిలి ఇష్టుడు. అంతేగాదు. అతడు అన్నిరకముల అస్త్రవిద్యలలో కుశలుడు. (8)
అభిమన్యుర్మహాబాహుః పుత్రో మమ విశాంపతే।
జామాతా తవ యుక్తో వై భర్తా చ దుహితుస్తవ॥ 9
మహారాజా! మహాబాహువైన నాపుత్రునిపేరు అభిమన్యుడు. మీకు అతడు మిక్కిలి యోగ్యుడైన అల్లుడు. మీకుమార్తెకు తగిన భర్త అవుతాడు.' (9)
విరాట ఉవాచ
ఉపపన్నం కురుశ్రేష్ఠే కుంతీపుత్ర ధనంజయే।
య ఏవం ధర్మనిత్యశ్చ జాతజ్ఞానశ్చ పాండవః॥ 10
యత్ కృత్యం మన్యసే పార్థ క్రియతాం తదనంతరమ్।
సర్వే కామాః సమృద్ధా మే సంబంధీ యస్య మేఽర్జునః॥ 11
విరాటుడన్నాడు - 'పార్థా! మీరు కౌరవులలో శ్రేష్ఠులు. కుంతీపుత్రులు. ధనంజయుడు ఈ విధంగా ధర్మచర్చ చేయడం ఉచితమే. పాండుపుత్రుడైన అర్జునుడే ఈ రకమైన నిత్యధర్మాపరాయణుడు. జ్ఞానసంపన్నుడు కాగలడు. ఇటుపిమ్మట ఏమి చేస్తే మంచిది అని
అనుకొంటారో అది చేయవచ్చును. అర్జునునితో సంబంధం నెరపిన నాకోరికలన్నీ నెరవేరాయి. (10,11)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువతి రాజేంద్రే కుంతీపుత్రో యుధిష్ఠిరః।
అన్వశాసత్ స సంయోగం సమయే మత్స్యపార్థయోః॥ 12
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! విరాటమహారాజు ఇలా అన్నమీదట కుంతీనందను డయిన యుధిష్ఠిరుడు మత్స్య పార్థుల సంబంధాన్ని ఆమోదించాడు. (12)
తతో మిత్రేషు సర్వేషు వాసుదేవం చ భారత।
ప్రేషయామాస కౌంతేయః విరాటశ్చ మహీపతిః॥ 13
జనమేజయా! తదనంతరం కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు, రాజు విరాటుడు తమ మిత్రులకు బంధువులకు అందరికీ భగవంతుడైన వాసుదేవునికీ ఆహ్వానాలు పంపారు. (13)
తతస్త్రయోదశే వర్షే నివృత్తే పంచ పాండవాః।
ఉపప్లవ్యం విరాటస్య సమపద్యంత సర్వశః॥ 14
పంచపాండవులు తమ పదమూడవ సంవత్సరం పూర్తి కావడంతో అందరూ విరాటుని ఉపప్లవ్యమనే నగరానికి వచ్చి నివసించసాగారు. (14)
వి॥తె॥ ఉపప్లావ్యమని తిక్కన
ఇక్కడ తెలుగులో ఒక విశిష్ట సన్నివేశం ఉంది.
యుద్ధంలో ఓడిపోయి వెళ్లిపోతున్న దుర్యోధనుడు మధ్య మధ్య మజిలీలలో కర్ణశకునుల దుర్బోధలవల్ల భీష్ముని మాటలు ప్రమాణం కాదని అనుకున్నాడు. దుర్యోధనుడికి ధర్మరాజు అసత్యమాడడని తెలుసు. అందుచేత ధర్మరాజు దగ్గరకు ఒక దూతను పంపి "అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తికాకుండానే బయటపడ్డాడు. ఇపుడు ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి" అన్నాడు. అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు.
నిండె సమయాబ్దములు; నిం
కొండన లే; దిపుడ చని సుయోధనుతో భీ
ష్ముండును గురుఁడును వినఁగా
నిండె ననుము; నిండె నిండె నిక్కంబునకున్. (5-370)
ఆ దూత వెళ్లి విషయం దుర్యోధనుడికి చెప్పాడు. ఈవిషయం బయటపెట్టకుండా దుర్యోధనుడు ఆరాత్రి అందరూ వింటూ ఉండగా "మనం అర్జునుని ఎదిరించాం కాని అసలు అజ్ఞాతవాసం అయ్యాక వచ్చాడా? అర్జునుడు పూర్తి కాకుండానే బయట పడ్డాడా?" అన్నాడు. ఆమాటకు భీష్ముడు "ఏం మాట్లాడుతున్నావు. ఎవరయినా వింటే నవ్వుతారు. అపుడే చెప్పానుగదా! అజ్ఞాతవాసం పూర్తయిందని" అన్నాడు. అందరూ ఆమాటకు సమ్మతించి" అయినా అర్జునుడంత తెలివి తక్కువవాడా? ముందు కనపడటానికి?" అన్నారు. ఈసన్నివేశం ధర్మరాజు సత్యసంధతను, దుర్యోధనుని కుటిలతను బయట పెడుతుంది. (ఇదివావిళ్లవారి పి.పి.యస్.శాస్త్రి ప్రతిలో కనిపిస్తుంది)
అభిమన్యుం చ బీభత్సుః ఆనినాయ జనార్ధనమ్।
ఆనర్తేభ్యోఽపి దాశార్హాన్ ఆనయామాస పాండవాHఆ॥ 15
అర్జునుడు ఆనర్తదేశంనుండి అభిమన్యుని, వాసుదేవుని, దశార్హవంశానికి చెందిన తన ఇతర బంధువులను కూడా అక్కడికి పిలిపించాడు. (15)
కాశిరాజశ్చ శైబ్యశ్చ ప్రీయమాణౌ యుధిష్ఠిరే।
అక్షౌహినీభ్యాం సహితౌ ఆగతౌ పృథివీపతీ॥ 16
యుధిష్ఠిరుని పట్ల ప్రీతి గలిగిన కాశీరాజు, శైబ్యుడు అనే రాజులు ఇద్దరు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో ఉపప్లవ్యనగరానికి వచ్చారు. (16)
అక్షౌహిణ్యా చ సహితః యజ్ఞసేవో మహాబలః।
ద్రౌపద్యాశ్చ సుతా వీరాః శిఖండీ చాపరాజితః॥ 17
ధృష్టద్యుమ్నశ్చ దుర్ధర్షః సర్వశస్త్రభృతాం వరః।
సమస్తాక్షౌహిణీపాలాః యజ్వానో భూరిదక్షిణాః।
వేదావభృథసంపన్నాః సర్వే శూరాస్తనుత్యజః॥ 18
మహాబలుడైన ద్రుపదమహారాజు ఒక అక్షౌహిణి సేనతో విచ్చేశాడు. అతనితో పాటు ద్రౌపదియొక్క వీరులైనపుత్రులూ ఓటమిఎరుగని శిఖండి, శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు, దుర్ధర్షుడు అయిన ధృష్టద్యుమ్నుడు కూడా వచ్చారు. వీరే కాకుండా ఒక్కొక్క అక్షౌహిణిసైన్యంతో పాండవులకోసం ప్రాణాలుఇచ్చే అనేక రాజులు కూడా అక్కడికి వచ్చారు. వారు భూరిదక్షిణ లిచ్చి యజ్ఞాలు చేసి అవభృథస్నానం చేసిన వీరులు. (17,18)
తానాగతానభిప్రేక్ష్య మత్స్యో ధర్మభృతాం వరః।
పూజయామాస విధివత్ సభృత్యబలవాహనాన్॥ 19
ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన విరాటరాజు ఆ వచ్చిన వారిని చూసి సేవకులు, సైన్యం, వాహనాలతో సహితంగా వారందరికీ యథావిధిగా స్వాగతసత్కారాలు చేశాడు. (19)
ప్రీతోఽభవద్ దుహితరం దత్త్వా తామభిమన్యవే।
తతః ప్రత్యుపయాతేషు పార్థివేషు తతస్తతః॥ 20
తత్రాగమద్ వాసుదేవః వనమాలీ హలాయుధః।
కృతవర్మా చ హార్దిక్యః యుయుధానశ్చ సాత్యకిః॥ 21
అనాదృష్టి స్తథాక్రూరః సాంబో నిశఠ ఏవ చ।
అభిమన్యుముపాదాయ సహ మాత్రా పరంతపాః॥ 22
అభిమన్యునికి తన కూతురును ఇస్తానని మాట ఇచ్చి విరాటరాజు చాలా ఆనందించాడు. తరువాత ఆవచ్చిన రాజులందరూ తమకు తమకు నియమితమైన స్థానాలకు
వెళ్లి విశ్రమించారు. అప్పుడక్కడికి వనమాలాధారి అయిన వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు, హలాయుధధారి అయిన బలరాముడు, హృదీకుని పుత్రుడైన కృతవర్మ, యుయుధానుడు (సాత్యకి) అక్రూరుడు, సాంబుడు, నిశరుడు, శత్రుసంహారం చేయగల వీరులందరూ అభిమన్యుని, అతని తల్లిని కూడా వెంటపెట్టుకొని వచ్చారు. (20-22)
ఇంద్రసేనాదయశ్చైవ రథైస్తైః సుసమాహితైః।
ఆయయుః సహితాః సర్వే పరిసంవత్సరోషితాః॥ 23
ఒకసంవత్సరంపాటు ద్వారకలో ఉండిపోయిన ఇంద్రసేనాది సారథులు కూడా చక్కగా సమస్తసామగ్రితో నిండియున్న రథాలతో అక్కడికి వచ్చారు. (23)
దశనాగసహస్రాణి హయానాం ద్విగుణం తథా।
రథానామయుతం పూర్ణం నియుతం చ పదాతినామ్॥ 24
వృష్ణ్యంధకాశ్చ బహవః భోజాశ్చ పరమౌజసః।
అన్వయుర్వృష్ణిశార్దూలం వాసుదేవం మహాద్యుతిమ్॥ 25
పరమతేజస్వి, వృష్ణివంశశిరోమణి అయిన వాసుదేవుని పదివేల ఏనుగులు, అంతకు రెట్టింపు గుఱ్ఱాలు, పదివేల రథాలు, పదిలక్షల కాల్బలం కల సైన్యం అనుసరించింది. అంతేకాక వృష్ణి, భోజ, అంధక వంశాలకుచెందిన మహాపరాక్రమ వంతులైన వీరులు కూడా అతనితోపాటు వచ్చారు. (24,25)
పారిబర్హం దదౌ కృష్ణః పాండవానాం మహాత్మనాం।
స్త్రియో రత్నాని వాసాంసి పృథక్ పృథగనేకశః॥ 26
తతో వివాహో విధివద్ వవృధే మత్స్యపార్థయోః।
శ్రీకృష్ణుడు మహాత్ములైన పాండవులకు దాసీలను, అనేక రత్నాలను, వస్త్రాలను వేర్వేరుగా కానుకలుగా ఇచ్చాడు. అనంతరం మత్స్యపార్థవంశాల మధ్య వైవాహికక్రతువు విధిపూర్వకంగా ప్రారంభ మయింది. (26 1/2)
వి॥తె॥ సంస్కృతంలో వివాహానికి సంబంధించిన లౌకిక ప్రక్రియ, ఉత్సవం వివరింపబడినవి. తెలుగులో ఆంధ్రుల యిండ్లలో జరిగే వైదిక ప్రక్రియకూడ కొద్దిగా తిక్కన వర్ణించాడు.
1. ఆడపెళ్లివారు మగపెళ్ళివారు తెరపట్టారు. వధువు గౌరీపూజ చేసిన తరువాత కల్యాణవేదిక మీదకు తెచ్చేటప్పుడు ఆవరణ వస్త్రం(తెర)పడతారు. వధూవరుల తలలమీద జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత సుముహూర్తసమయానికి తెరతీసివేస్తారు.
2. ముహూర్త సమయంలో తెర తొలగిస్తారు.
ధ్రువం తే రాజా మొ॥ మంత్రాలతో వధూవరుల శిరస్సులమీద జీలకర్ర బెల్లం ఉంచుతారు. సుమూహూర్త సమయంలో "అభ్రాతృఘ్నీం" మొ॥ మంత్రాన్ని జపిస్తారు "అఘోరచక్షుః" ఇత్యాది మంత్రంతో వధువును చూడాలి.
3. అన్యోన్యావలోకనం చేశారు.
4. అక్షతారోపణం చేస్తారు. దీన్ని తలంబ్రాలు అంటారు.
ఒండొరుల దోయిళుల నినుపొందఁ జేయు
నక్షతప్రకరంబు లన్యోన్యమస్త
కములఁ బోసిరి, మందారకల్పలతలు
విరులగముల నొండొంటిపైఁ గురియు నట్లు. (5-397)
వధూవరులు తమ శరీరాల సొగసులను ఓరచూపులతో స్వేచ్ఛగా చూసుకోలేకపోయారు. తలంబ్రాలు పోసుకొనేటప్పుడు చక్కని అవకాశం కలిగిందట. (5-398)
పాణిగ్రహణం-
గృహ్ణామి తే మొ॥ మంత్రాలతో వరుడు వధువు హస్తాన్ని గ్రహిస్తాడు.
మనసులోని గాఢమయిన ప్రేమను చేతిలో చూపుతున్నాడా అన్నట్లుగా ఉత్తర పాణిని అభిమన్యుడు చివురుటాకును మదగజం పట్టుకున్నట్లు నేర్పుగా పట్టుకొన్నాడు. (5-399)
హోమాదులు చేయటానికి ఒకే పోటమీద కూర్చుంటారు. అలాగే ఉత్తరాభిమన్యులు కూర్చున్నారు. అపుడు వారిరువురూ ఒకే కుదుట్లో పెట్టిన గున్నమామిడిచెట్టూ విరజాజితీగ లాగా ప్రకాశించారు.
పెనుఁగుదుట నిడిన చూతం
బును నవమాలికయుఁ బోలెఁ బొలుపొంది రతం
డును నమ్ముగ్ధయు నేకా
సనమున నున్నపుడు నూత్నసౌభాగ్యమునన్. (5-401)
ఒకే పీట మీద కూర్చున్నపుడు వారిరువురికీ గాఢమయిన శరీర స్పర్శ కలిగింది. పులకింతలతో శరీరాలు నిండిపోయాయి. ఇద్దరి చూపులీ అవకాశం కోసం ఎదురుచూసి ఒకేసారి ముందుకు పోయి తడబడి ప్రక్కకు తొలగిపోయాయి. సుగంధపూరితాలయిన ఇరువురి చెమటలు కలిసి మరో సుగంధం కలిగి ఇరువురికీ పరవశత్వం కలిగింది. సౌఖ్యరస ప్రవాహం విజృంభించి ఇరువురూ ఆనందసముద్రంలో ఓలలాడారు. తెలుగువారు వైదికప్రక్రియ అంతా ఇక్కడ తిక్కన వివరించాడు.
తతః శంఖాశ్చ భేర్యశ్చ గోముఖా డంబరాస్తథా॥ 27
పార్థైః సంయుజ్యమానస్య నేదుర్మత్స్యస్య వేశ్మని।
భక్ష్యాన్నభోజ్యపానాని ప్రభూతాన్యభ్యహారయన్॥ 28
అనంతరం కుంతీపుత్రులతో సంబంధం కలుపుకొన్న విరాటరాజు భవనంలో శంఖభేరీలు, గోముఖాలు, డంబరాలు మొదలైన వివిధవాద్యాలు మారుమ్రోగాయి. తినడానికి త్రాగడానికి యోగ్యమైన అన్నపానీయాలను ఎక్కువ పరిమాణంలో సమకూర్చారు. (27,28)
గాయనాఖ్యానశీలాశ్చ నటవైతాలికాస్తథా।
స్తువంతస్తానుపాతిష్ఠన్ సూతాశ్చ సహ మాగధైః॥ 29
గాయకులు, ప్రాచీనగాథలు వినిపించేవారు, నటులు వైతాళికులు, సూతమాగధులు అందరూ వచ్చి పాండవులను ప్రస్తుతించారు. (29)
సుదేష్ణాం చ పురస్కృత్య మత్స్యానాం చ వరస్త్రియః।
ఆజగ్ముశ్చారుసర్వాంగ్యః సుమృష్టమణికుండలాః॥ 30
సర్వాంగీణమైన సౌందర్యంతో విశుద్ధమణిమయ కుండలాలు ధరించి మత్స్యనరేశుని రాణివాసంలోని సుందరీమణులు సుదేష్ణను పురస్కరించుకొని ద్రౌపది దగ్గరకు వచ్చారు. (30)
వర్ణోపపన్నాస్తా నార్యః రూపవత్యః స్వలంకృతాః।
సర్వాశ్చాభ్యభవన్ కృష్ణా రూపేణ యశసా శ్రియా॥ 31
ఆ స్త్రీలందరూ మంచిరంగుతో, రూపవతులై రకరకాల సుందరమైన నగలు ధరించి ప్రకాశిస్తున్నారు. అయినా ద్రౌపది తన దివ్యరూపంచేత, యశస్సు చేత, కాంతిచేత వారందరినీ మించి ఉంది. (31)
పరివార్యోత్తరాం తాస్తు రాజపుత్రీమలంకృతామ్।
సుతామివ మహేంద్రస్య పురస్కృత్యోపతస్థిరే॥ 32
ఆసమయంలో రాజకుమారి ఉత్తర వస్త్రాభరణాల చేత అలంకృతమై దేవేంద్రుని కూతురయిన జయంతి వలె ప్రకాశిస్తూ ఉంది. రాజపరివారస్త్రీలు ఆమెకు ఇరువైపులా చేరి ఆమెను అక్కడికి తీసుకొని వచ్చారు. (32)
తాం ప్రత్యగృహ్ణాత్ కౌంతేయః సుతస్యార్థే ధనంజయః।
సౌభద్రస్యానవద్యాంగీం విరాటతనయాం తదా॥ 33
అప్పుడు కుంతీనందనుడు అర్జునుడు తన కొడుకు సౌభద్రునికోసం సలక్షణాంగి అయిన విరాటకుమారి ఉత్తరను స్వీకరించాడు. (33)
తత్రాతిష్ఠన్మహారాజః రూపమింద్రస్య ధారయన్।
స్నుషాం తాం ప్రతిజగ్రాహ కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 34
ఇంద్రునిరూపంతో సమానమైన రూపం గల కుంతీపుత్రుడు యుధిష్ఠిరమహారాజుకూడా అక్కడ ఉన్నాడు. అతడు కూడా ఉత్తరను కోడలిగా అంగీకరించి స్వీకరించాడు. (34)
ప్రతిగృహ్య చ తాం పార్థః పురస్కృత్య జనార్దనమ్।
వివాహం కారయామాస సౌభద్రస్య మహాత్మనః॥ 35
ఈ రీతిగా పార్థుడు ఉత్తరను స్వీకరించి, శ్రీకృష్ణుని సమక్షంలో మహాత్ముడైన అభిమన్యునికి, ఉత్తరకు వివాహం జరిపించాడు. (35)
తస్మై సప్త సహస్రాణి హయానాం వాతరంహసామ్।
ద్వే చ నాగశతే ముఖ్యే ప్రాదాద్ బహుధనం తదా॥ 36
హుత్వా సమ్యక్ సమిద్ధాగ్నిమ్ అర్చయిత్వా ద్విజన్మనః।
రాజ్యం బలం చ కోశం చ సర్వమాత్మానమేవ చ॥ 37
వివాహసమయంలో విరాటుడు చక్కగా మండుతున్న అగ్నిలో వారిచే విధిపూర్వకంగా హోమం చేయించి బ్రాహ్మణులను పూజింపచేశాడు. అనంతరం వరునికి వాయువేగం గల ఏడువేలగుఱ్ఱాలను రెండువందల పెద్దపెద్దఏనుగులను అంతులేని ధనాన్ని కానుకగా ఇచ్చాడు. ఇంకా రాజ్యం, సైన్యం, కోశంతో పాటుగా తన్ను తాను కూడా వారిసేవకు అర్పించుకొన్నాడు. (36,37)
కృతే వివాహే తు తదా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం యదుపాహరదచ్యుతః॥ 38
వివాహం అయిన తరువాత ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు అచ్యుతుడిచ్చిన ధనం చాలావరకు బ్రాహ్మణులకు దానం చేశాడు. (38)
వి.సం: వాసుదేవానుగ్రహం పవిత్రం, అక్షయ్యం కాబట్టి ఆ దానంవలన బ్రాహ్మణులకు అమందానందం కలుగుతుందనీ, తనకుకూడా భవిష్యత్తులో లోటుండదనీ యుధిష్ఠిరుని భావం. (చతు)
గోసహస్రాణి రత్నాని వస్త్రాణి వివిధాని చ।
భూషణాని చ ముఖ్యాని యానాని శయనాని చ॥ 39
భోజనాని చ హృద్యాని పానాని వివిధాని చ।
తన్మహోత్సవసంకాశం హృష్టపుష్టజనాయుతమ్।
నగరం మత్స్యరాజస్య శుశుభే భరతర్షభ॥ 40
వేలకొద్దీ గోవులు, రత్నాలు, వివిధములైన వస్త్రాలు, ఆభరణాలు ముఖ్యవాహనాలు, శయ్యలు, భోజనసామగ్రి హృద్యాలైన అనేకవివిధపానీయాలు కూడా ఇచ్చాడు. జనమేజయా! ఆ సమయంలో తుష్టి పుష్టి పొందిన వేలు లక్షల మందితో నిండి మత్స్యనగరం ఒక గొప్ప మహోత్సవంతో శోభించినట్లు ఉంది. (39,40)
ఇతి శ్రీమహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం విరాటపర్వణి వైవాహికపర్వణి ఉత్తరావివాహే ద్విసప్తతితమోఽధ్యాయః॥ 72 ॥
ఇది వ్యాసనిర్మితమైన శ్రీమహాభారతమనే లక్షశ్లోకాల (పరిమితిగల) సంహితలో విరాట పర్వమున వైవాహికపర్వమను ఉపపర్వమున ఉత్తరావివాహ విషయక మైన డెబ్బదిరెండవ అధ్యాయము. (72)
ఇది విరాట పర్వము

విరాటపర్వశ్రవణమహిమ

శ్రుత్వా తు చరితం పుణ్యం పాండవానాం మహాత్మనామ్।
నాదివ్యాధిభయం తేషాం జాయతే పుణ్యకర్మణామ్॥ 1
మహాత్ములయిన పాండవుల పుణ్య చరిత విన్న పుణ్యాత్ములకు శారీరక మానసిక వ్యాధుల వల్ల భయం కల్గదు. (1)
దుర్గతేస్తరణే తేషామ్ ఆయతం తరణం భవేత్।
సుభిక్షం క్షేమమారోగ్యం పుణ్యవృద్ధిః ప్రజాయతే॥ 2
దుర్గతి నుండి తరించడంతో వారికి సంపూర్ణ మయిన తరణం కలుగుతుంది. (కష్టాల నుండి పూర్తిగా గట్టెక్కుతారు.) సస్యశ్యామలత్వమూ, క్షేమమూ, ఆరోగ్యమూ కలిగి పుణ్యం వృద్ధి చెందుతుంది. (2)
సర్వపాపాని నశ్యంతి జాయంతే సర్వసంపదః।
ఏకాకీ విజయేచ్ఛత్రూన్ స్మృత్వా
ఫాల్గునకర్మచ॥ 3
ఈతయః సంప్రణశ్యంతి న వియోగః ప్రియేజనే॥ 4
పాపాలన్నీ నశిస్తాయి - సర్వసంపదలూ కలుగుతాయి - అర్జునుని అద్భుత కర్మ తలచుకొంటే ఒంటరిగానే శత్రువులను జయిస్తాడు. ఈతి బాధలు తొలగి పోతాయి - ప్రియులయిన ప్రజలతో వియోగం కలగదు. (3,4)
శ్రుత్వా వైరాటికం పర్వ వాసాంసి వివిధాని చ।
హిరణ్యం ధాన్యం గావశ్చ దద్యాత్ విత్తానుసారతః॥ 5
ప్రీతయే దేవతానాం వై దద్యాత్ వై ద్విజముఖ్యకే।
వాచకే తు సుసంతుష్టే తుష్టాః స్యుః సర్వదేవతాః॥ 6
బ్రాహ్మణాన్ భోజయేచ్ఛక్త్వా పాయసైః సర్పిషా సితైః।
ఏవం శ్రుతే చ వైరాటే సమ్యక్ ఫలమవాప్నుయాత్॥ 7
ఈ విరాట పర్వం విన్నవారు అనేక విధాలయిన వస్త్రాలూ, బంగారమూ, ధాన్యమూ, గోవులనూ తమతమ భాగ్యాలను అనుసరించి దానం చేయాలి - ఇది దేవతా ప్రీతి కోసం ఒక విప్రునికి దానం చేయాలి - చెప్పిన వారు సంతోషిస్తే సర్వదేవతలూ సంతోషించినట్లు - తమ శక్తి ననుసరించి పాయసాలతో, నేతులతో కూడిన భోజనాన్ని బ్రాహ్మణులకు పెట్టాలి - ఇలా విరాట పర్వం వింటే చక్కని ఫలం పొందుతారు. (5-7)
విరాటపర్వ విషయమై తెలుగునాట రెండు విశిష్ట సంప్రదాయాలు ఉన్నాయి.
1. శ్రీ మహా భారతం విరాటపర్వంతో మొదలు పెట్టి పురాణం పఠిస్తారు.
2. విరాట పర్వం చదివితే చక్కగా వర్షాలు పడతాయని ఈ నాటికీ చాలామంది విశ్వసిస్తారు. ఈ నమ్మకం లేని వారు కూడా తిక్కన గారి విరాట పర్వం రసామృత వర్షిణి అని విశ్వసిస్తారు.
॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥