8. ఎనిమిదవ అధ్యాయము
శల్యుడు దుర్యోధనునికి మాట ఇచ్చి ధర్మరాజు దగ్గరకు వచ్చుట.
వైశంపాయన ఉవాచ
శల్యః శ్రుత్వా తు దూతానాం సైన్యేన మహతా వృతః।
అభ్యయాత్ పాండవాన్ రాజన్ సహ పుత్రైర్మహారథైః॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
జనమేజయా! పాండవుల దూతల ద్వారా వారి సందేశాన్ని విన్న శల్యుడు పెద్ద సైన్యంతో మహారథులైన పుత్రులతో కలిసి పాండవుల వద్దకు బయలుదేరాడు. (1)
తస్య సేనానివేశోఽభూత్ అభ్యర్థమివ యోజనమ్।
తథా హి విపులాం సేనాం బిభర్తి స నరర్షభమ్॥ 2
ఒకటిన్నర యోజనాలు వ్యాపించిన విపులమైన సైన్యంతో శల్యమహారాజు పాండవుల వద్దకు కదిలాడు. (2)
అక్షౌహినీపతీ రాజన్ మహావీర్యపరాక్రమః।
విచిత్రకవచాః శూరాః విచిత్రధ్వజకార్ముకాః॥ 3
విచిత్రస్రగ్ధరాః సర్వే విచిత్రాంబరభూషణాః॥ 4
స్వదేశవేషాభరణా వీరాః శతసహస్రశః।
తస్య సేనాప్రణేతారః బభూవుః క్షత్రియర్షభాః॥ 5
రాజా! మహాపరాక్రమవంతుడైన శల్యుడు అక్షౌహిణీ సైన్యానికి అధిపతి. అతని సైన్యంలోని వారందరు శూరులు. విచిత్రమైన కవచాలు, జెండాలు, ధనుస్సులు, ఆభరణాలు, రథాలు, వాహనాలు, మాలికలు, వస్త్రాలు, ధరించారు.
స్వదేశవేషాభరణాలు ధరించిన మహావీరులు, సుక్షత్రియులు వందలూ, వేల, సంఖ్యలో శల్యునికి సేనాపతులుగా ఉన్నారు. (3,4,5)
వ్యథయన్నివ భూతాని కంపయన్నివ మేదినీమ్।
శనైర్విశ్రామయన్ సేనాం స యయౌ యేన పాండవః॥ 6
ప్రాణులన్నీ భయపడుతూ ఉండగా, భూమి కంపిస్తూ ఉండగా, నెమ్మదిగా సైన్యానికి అక్కడక్కడ విశ్రాంతినిస్తూ, శల్యుడు తన సైన్యంతో ధర్మరాజువద్దకు వెళుతున్నాడు. (6)
తతో దుర్యోధనః శ్రుత్వా మహాత్మానం మహారథమ్।
ఉపాయాంతమభిద్రుత్య స్వయమానర్చ భారత॥ 7
రాజా! మహారథుడైన శల్యుడు సైన్యంతో పాండవుల వద్దకు వెళుతున్నాడని విన్న దుర్యోధనుడు వేగంగా అతనికి ఎదురువెళ్లి మార్గమధ్యంలోనే విశేషమైన సేవా సత్కారాలు చేశాడు. (7)
కారయామాస పూజార్థం తస్య దుర్యోధనః సభాః।
రమణీయేషు దేశేషు రత్నచిత్రాః స్వలంకృతాః॥ 8
శల్యుని పూజించటానికి దుర్యోధనుడు ఎన్నో సభాభవనాలను, సభలను ఏర్పరిచాడు. వానిలో అందమైన ప్రదేశాలలో రత్నాలతో చక్కగా అలంకరించబడిన చిత్రాలను ఏర్పాటు చేశాడు. (8)
శిల్పిభిర్వివిధైశ్చైవ క్రీడాస్తత్ర ప్రయోహితాః।
తత్ర వస్త్రాణి మాల్యాని భక్ష్యం పేయం చ సత్కృతమ్॥ 9
నేర్పరులైన శిల్పులు పలురకాలైన క్రీడా విహార ప్రదేశాలను నిర్మించారు. అక్కడ విలువైన వస్త్రాలు, దండలు, ఆహార పానీయాలతో సత్కారాలు సమకూర్చారు. (9)
కూపాశ్చ వివిధాకారాః మనోహర్షవివర్ధనాః।
వాప్యశ్చ వివిధాకారాః ఔదకాని గృహాణి చ॥ 10
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే రకరకాల నీటి చెలమలు, బావులు, చలివేంద్రాలు ఏర్పరిచారు.(10)
స తాః సభాః సమాసాద్య పూజ్యమానో యథావరః।
దుర్యోధనస్య సచివైః దేశే సమంతతః॥ 11
శల్యుడు ఆయా ప్రదేశాలకు చేరినప్పుడు దుర్యోధనుని మంత్రులు, ఉద్యోగులు, దేవతలను పూజించినట్లు శల్యుని పూజించి మర్యాదలు చేశారు. (11)
ఆజగామ సభామన్యాం దేవావసథవర్చసమ్।
స తత్ర విషయైర్యుక్తః కల్యాణైరతిమానుషైః॥ 12
ఇలా ముందుకు సాగుతున్న శల్యుడు దేవాలయ వైభవంతో, శుభప్రదాలై, అలౌకికాలయిన భోగాలతో అలరారుతున్న ఒక సభా ప్రాంగణానికి చేరుకొన్నాడు. (12)
మేనేఽభ్యధిక మాత్మానమ్ అవమేనే పురందరమ్।
పప్రచ్ఛ స తతః ప్రేష్యాన్ ప్రహృష్టః క్షత్రియర్షభః॥ 13
సుక్షత్రియుడైన శల్యుడు ఆ వైభవంతో ఇంద్రుని కన్నా తానే అధికుడనని భావించాడు. ఆ ఆనందంతో సేవకులను ఇలా ప్రశ్నించాడు. (13)
యుధిష్ఠిరస్య పురుషాః కేఽత్ర చక్రుః సభా ఇమాః।
ఆనీయంతాం సభాకారాః ప్రదేయార్హా హి మే మతాః॥ 14
"ఇంత చక్కని సభలు నిర్మించిన యుధిష్ఠిరుని ఉద్యోగులు ఎవరో వారిని పిలవండి. వారిని సత్కరించాలనుకొంటున్నాను. (14)
ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రోఽనుమన్యతామ్।
దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః॥ 15
నా ఆనందానికి తగినట్లు వారిని అనుగ్రహిస్తాడు. దీనిని ధర్మరాజు ఒప్పుకుంటాడు."
శల్యుని ఈ మాటలకు ఆశ్చర్యపడిన సేవకులు ఇదంతా దుర్యోధనునికి విన్నవించారు. (15)
సంప్రహృష్టో యదా శల్యః దిదిత్సురపి జీవితమ్।
గూఢో దుర్యోధనస్తత్ర దర్శయామాస మాతులమ్॥ 16
శల్యుడు తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధమైనంత సంతోషంతో ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు మేనమామ ఎదుటికి వచ్చాడు. (16)
తం దృష్ట్వా మద్రరాజశ్చ జ్ఞాత్వా యత్నం చ తస్య తమ్।
పరిష్వజ్యాబ్రవీత్ ప్రీతః ఇష్టోఽర్థో గృహ్యతామితి॥ 17
దుర్యోధనుని చూడగానే శల్యుడు అతని ప్రయత్నాన్ని అర్థం చేసుకొన్నాడు. ప్రేమతో కౌగిలించుకొని 'నీకు ఏంకావాలో కోరుకో ఇస్తాను' అన్నాడు. (17)
దుర్యోధన ఉవాచ
సత్యవాగ్ భవ కల్యాణ వరో వై మమ దీయతామ్।
సర్వసేనాప్రణేతా వై భవాన్ భవితుమర్హతి॥ 18
దుర్యోధనుడు ఇలా అన్నాడు.
మహాత్మా! సత్యవాక్కువై నాకు మాట ఇవ్వు. నీవు సర్వసైన్యానికి అధ్యక్షుడివి కాదగినవాడవు. (18)
(యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యహమ్।
అనుమాన్యం చ పాల్యం చ భక్తం చ భజ మాం విభో॥
నీకు పాండవులు ఎలాంటివారో నేనూ అంతే. నేను నీ భక్తుణ్ణి. ఆదరింపదగినవాణ్ణి. సహాయం పొందతగినవాణ్ణి. కనుక నా అభ్యర్థనను అంగీకరించు.
శల్య ఉవాచ
ఏవమేతన్మహారాజ యథా వదసి పార్థివ।
ఏవం దదామి తే ప్రీతః ఏవమేతద్ భవిష్యతి॥)
శల్యుడు ఇలా అన్నాడు-
దుర్యోధన మహారాజా! నీవు అడిగినట్లే జరుగుతుంది. సంతుష్టుడవై నీవు అడిగింది ఇస్తున్నాను. అలాగే జరుగుతుంది.
వైశంపాయన ఉవాచ
కృతమిత్యబ్రవీచ్ఛల్యః కిమన్యత్ క్రియతామితి।
కృతమిత్యేవ గాంధారిః ప్రత్యువాచ పునః పునః॥ 19
వైశంపాయనుడు ఇలా అన్నాడు -
జనమేజయా! శల్యుడు 'సరే! ఇంకా ఏంకావాలి' అని అడిగాడు. దుర్యోధనుడు 'నా కోరిక పూర్తిగా తీరింది' అన్నాడు. (19)
శల్య ఉవాచ
గచ్ఛ దుర్యోధన పురం స్వకమేవ నరర్షభ।
అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరమరిందమమ్॥ 20
శల్యుడు ఇలా అన్నాడు -
దుర్యోధన మహారాజా! నీవు నీ హస్తినాపురానికి వెళ్లు. నేను శత్రువిజేత అయిన ధర్మరాజును చూడటానికి వెళతాను. (20)
దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ క్షిప్రమేష్యే నరాధిప।
అవశ్యం చాపి ద్రష్టవ్యః పాండవః పురుషర్షభః॥ 21
యుధిష్ఠిరుని చూచి నేను వెంటనే వచ్చేస్తాను. మహాపురుషుడైన అతనిని తప్పక చూడాలి. (21)
దుర్యోధన ఉవాచ
క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష్య పార్థివ।
త్వయ్యధీనాః స్మ రాజేంద్ర వరదానం స్మరస్వ నః॥ 22
దుర్యోధనుడు ఇలా అన్నాడు -
మహారాజా! ధర్మరాజును చూచి త్వరగా రావాలి. మేము నీ అధీనంలో ఉన్నాం. మాకు మాట ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకో. (22)
శల్య ఉవాచ
క్షిప్రమేష్యామి భద్రం తే గచ్ఛస్వ స్వపురం నృప।
పరిష్వజ్య తథాన్యోన్యం శల్యదుర్యోధనావుభౌ॥ 23
శల్యుడు ఇలా అన్నాడు.
"దుర్యోధనా! త్వరగా వచ్చేస్తాను. నీ నగరానికి నీవు వెళ్లు. నీకు శుభమగుగాక" ఆపై శల్యదుర్యోధనులు ఇద్దరూ కౌగిలించుకొన్నారు. (23)
స తథా శల్యమామంత్ర్య పునరాయాత్ స్వకం పురమ్।
శల్యో జగామ కౌంతేయాన్ ఖ్యాతుం కర్మ చ తస్య తత్॥ 24
దుర్యోధనుడు శల్యునికి వీడ్కోలు పలికి హస్తినాపురానికి చేరాడు. శల్యుడు తాను చేసిన పనిని చెప్పటానికి పాండవుల వద్దకు వెళ్లాడు. (24)
ఉపప్లవ్యం స గత్వా తు స్కంధావారం ప్రవిశ్య చ।
పాండవానథ తాన్ సర్వాన్ శల్యస్తత్ర దదర్శ హ॥ 25
శల్యుడు ఉపప్లవ్యం చేరుకొని, సైనిక శిబిరంలోకి ప్రవేశించి, పాండవులందరిని చూశాడు. (25)
సమేత్య చ మహాబాహుః శల్యః పాండుసుతైస్తదా।
పాద్యమర్ఘ్యం చ గాం చైవ ప్రత్యగృహ్ణాద్ యథావిధి॥ 26
శల్యుడు పాండవులను కలుసుకొని యథావిధిగా పాద్యం, అర్ఘ్యం గోదానం మొదలైన అతిథి మర్యాదలను అందుకొన్నాడు. (26)
తతః కుశలపూర్వం హి మద్రరాజోఽరిసూదనః।
ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యద్ యుధిష్ఠిరమ్॥ 27
తథా భీమార్జునౌ హృష్టౌ స్వస్రీయో చ యమావుభౌ।
అప్పుడు మద్రదేశాధిపతియైన శల్యుడు పాండవుల యోగక్షేమాలు అడిగి, పరమ ప్రేమతో ధర్మరాజును, ఆలింగనం చేసుకొన్నాడు - అలాగే భిమార్జునులనూ, మేలల్లుళ్లు నకుల సహదేవులనూ కౌగిలించుకొన్నాడు. (27)
(ద్రౌపదీ చ సుభద్రా చ అభిమన్యుశ్చ భారత।
సమేత్య చ మహాబాహుం శల్యం పాండుసుతస్తదా॥
కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్।
(జనమేజయా! ద్రౌపదిని, సుభద్రను, అభిమన్యుని వెంట బెట్టుకొని ధర్మరాజు శల్యునికి నమస్కరించి ఇలా పలికాడు.
యుధిష్ఠిర ఉవాచ
స్వాగతం తేఽస్తు వై రాజన్ ఏతదాసనమాస్యతామ్॥
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు.
శల్యరాజా! నీకు స్వాగతం ఈ ఆసనంపై కూర్చో.
వైశంపాయన ఉవాచ
తతో న్యషీదచ్ఛల్యశ్చ కాంచనే పరమాసనే।
కుశలం పాండవోఽపృచ్ఛత్ శల్యం సర్వసుఖావహమ్॥)
స తైః పరివృతః సర్వైః పాండవైర్ధర్మచారిభిః।
ఆసనే చోపవిష్టస్తు శల్యః పార్థమువాచ హ॥ 28
వైశంపాయనుడు ఇలా అన్నాడు. శల్యుడు బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ధర్మరాజు శల్యుని కుశలప్రశ్నలు అడిగాడు. ధర్మాత్ములైన పాండవులందరూ తన చుట్టూ ఉండగా శల్యుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. (28)
కుశలం రాజశార్దూల కచ్చిత్ తే కురునందన।
అరణ్యవాసాద్ దిష్ట్యాసి విముక్తో జయతాం వర॥ 29
రాజశ్రేష్ఠా! నీవు, నీవారు క్షేమమే కదా! దైవానుగ్రహం వల్ల అరణ్యవాసం నుండి బయటపడ్డావు. (29)
సుదుష్కరం కృతం రాజన్ నిర్జనే వసతా త్వయా।
భ్రాతృభిః సహ రాజేంద్ర కృష్ణయా చానయా సహ॥ 30
నిర్జనమైన అడవిలో తమ్ముళ్లు. ఈ ద్రౌపదితో కలిసి నీవు ఎన్నో కష్టాలు పడ్డావు. (30)
అజ్ఞాతవాసం ఘోరం చ వసతా దుష్కరం కృతమ్।
దుఃఖమేవ కుతః సౌఖ్యం భ్రష్టరాజ్యస్య భారత॥ 31
ధర్మరాజా! కష్టభరితమూ, భయంకరమూ అయిన అజ్ఞాతవాసాన్నికూడా పూర్తిచేశావు. రాజ్యం కోల్పోయిన వానికి దుఃఖం కాక సుఖం ఎలా లభిస్తుంది? (31)
దుఃఖస్యైతస్య మహతః ధార్తరాష్ట్రకృతస్య వై।
అవాప్స్యసి సుఖం రాజన్ హత్వా శత్రూన్ పరంతప॥ 32
వీరాగ్రణీ! దుర్యోధనుడు కల్పించిన ఈ మహాదుఃఖానికి తగిన సుఖాన్ని శత్రుసంహారం చేసి పొందుతావు. (32)
విదితం తే మహారాజ లోకతంత్రం నరాధిప।
తస్మాల్లోభకృతం కించిత్ తవ తాత న విద్యతే॥ 33
యుధిష్ఠిరమహారాజా! లోకం తీరు నీకు బాగా తెలుసు. అందు వలన లోభచింతన నీలో కొంచెం కూడా కనిపించటం లేదు. (33)
రాజర్షీణాం పురాణానాం మార్గమన్విచ్ఛ భారత।
దానే తపసి సత్యే చ భవ తాత యుధిష్ఠిర॥ 34
భారతా! ప్రాచీన రాజఋషుల మార్గాన్ని అనుసరించు. యుధిష్ఠిరా! దానం, తపస్సు, సత్యం వీనియందు లగ్నమైన బుద్ధితో ఉండు. (34)
క్షమా దమశ్చ సత్యం చ అహింసా చ యుధిష్ఠిర।
అద్భుతశ్చ పునర్లోకః త్వయి రాజన్ ప్రతిష్ఠితః॥ 35
రాజా! యుధిష్ఠిరా! క్షమ, ఇంద్రియ నిగ్రహం, సత్యం, అహింస, అద్భుతమైన ముందుచూపు అన్నీ నీయందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. (35)
మృదుర్వదాన్యో బ్రాహ్మణ్యః దాతా ధర్మపరాయణః।
ధర్మాస్తే విదిత రాజన్ బహవో లోకసాక్షికాః॥ 36
రాజా! నీవు మృదుస్వభావుడవు, ఉదారుడవు-, బ్రహ్మణ్యుడవు, దాతవు, ధర్మపరాయణుడవు. లోక సమ్మతమైన ఎన్నో ధర్మాలు నీకు తెలుసు. (36)
సర్వం జగదిదం తాత విదితం తే పరంతప।
దిష్ట్యా కృచ్ఛ్రమిదం రాజన్ పారితం భరతర్షభ॥ 37
నాయనా! పరంతపా! ఈ జగత్తు తీరు అంతా నీకు తెలుసు. అదృష్టవశాత్తు నీవు ఈ పెద్దకష్టం నుండి బయటపడ్డావు. (37)
దిష్ట్వా పశ్యామి రాజేంద్ర ధర్మాత్మానం సహానుగమ్।
విస్తీర్ణం దుష్కరం రాజన్ త్వాం ధర్మనిచయం ప్రభో॥ 38
రాజేంద్రా! అదృష్టవశాత్తు ధర్మనిలయుడవు, ధర్మాత్ముడవైన నిన్ను సోదరసహితంగా చూడగలుగుతున్నాను. దుష్కరమైన ప్రతిజ్ఞలను నీవు పూర్తిచేయగలిగావు. (38)
వైశంపాయన ఉవాచ
తతోఽస్యాకథయద్ రాజా దుర్యోధనసమాగమమ్।
తచ్చ శుశ్రూషితం సర్వం వరదానం చ భారత॥ 39
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
జనమేజయా! తరువాత శల్యుడు దుర్యోధనుడు వచ్చి తనను కలవటం, అతను చేసిన సేవలు, తాను ఇచ్చిన మాట అన్నీ ధర్మరాజుకు చెప్పాడు. (39)
యుధిష్ఠిర ఉవాచ
సుకృతం తే కృతం రాజన్ ప్రహృష్టేనాంతరాత్మనా।
దుర్యోధనస్య యద్ వీర త్వయా వాచా ప్రతిశ్రుతమ్॥ 40
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు.
శల్యమహారాజా! ప్రసన్నచిత్తంతో నీవు దుర్యోధనునికి సహాయం చేస్తానని వాగ్దానం చేయటం చాలా మంచిపని అయింది. (40)
ఏకం త్విచ్ఛామి భద్రం తే క్రియమాణం మహీపతే।
రాజన్నకర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమ॥ 41
మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామి తే।
భవానిహ చ సారథ్యే వాసుదేవసమో యుధి॥ 42
మహారాజా! నీవు చేయదగిన మేలు ఒకటి నీనుంచి కోరుతున్నాను. అది చేయరానిదే అయినా చేసిపెట్టాలి. ఆ పని నీకు తెలియజేస్తాను. విను. నా పరిశీలనను బట్టి యుద్ధరంగంలో రథం నడపటంలో వాసుదేవునితో సమానమైన వాడివి నీవే. (41-42)
కర్ణార్జునాభ్యాం సంప్రాప్తే ద్వైరథే రాజసత్తమ।
కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయః॥ 43
రాజసత్తమా! కర్ణార్జునులు ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం వచ్చినపుడు నిస్సందేహంగా నీవు కర్ణునికి సారథ్యం చేయవలసి ఉంటుంది. (43)
తత్ర పాల్యోఽర్జునో రాజన యది మత్ప్రియమిచ్ఛసి।
తేజోవధశ్చ తే కార్యః సౌతేరస్మజ్జయావహః॥ 44
అకర్తవ్యమపి హ్యేతత్ కర్తుమర్హసి మాతుల।
రాజా! నీవు మా మేలుకోరే వాడివైతే అర్జునుని రక్షించాలి. మాకు జయం కలిగేటట్లు నీవు సూథపుత్రునికి ఉత్సాహభంగం చేస్తూ ఉండాలి. మామా! ఇది చేయతగనిపని అయినా మాకోసం చెయ్యాలి. (44 1/2)
శల్య ఉవాచ
శృణు పాండవ తే భద్రం యద్ బ్రవీషి మహాత్మనః।
తేజోవధనిమిత్తం మాం సూతపుత్రస్య సంగమే॥ 45
అహం తస్య భవిష్యామి సంగ్రామే సారథిర్ధ్రువమ్।
వాసుదేవేన హి సమం నిత్యం మాం స హి మన్యతే॥ 46
శల్యుడు ఇలా అన్నాడు.
ధర్మరాజా! నీకు శుభమగుగాక! మహావీరుడైన కర్ణుని నిరుత్సాహపరచమని నీవు పలికిన విధంగా యుద్ధంలో అతనికి నేనే సారథిని అవుతాను. నేను వాసుదేవునితో సమానమైన సారథిని కర్ణుడు అనుకొంటూ ఉంటాడు. (45,46)
తస్యాహం కురుశార్దూల ప్రతీపమహితం వచః।
ధ్రువం సంకథయిష్యామి యోద్ధుకామస్య సంయుగే॥ 47
యథా స హృతదర్పశ్చ హృతతేజాశ్చ పాండవ।
భవిష్యతి సుఖం హంతుం సత్యమేతద్ బ్రవీమి తే॥ 48
కురుశ్రేష్ఠా! యుద్ధరంగంలో నేను కర్ణునికి తప్పకుండా ప్రతికూల, నిరుత్సాహకర వాక్యాలు పలుకుతాను. అతని పొగరు, తేజస్సు అణిగిపోతాయి. అత్నిని తేలికగా చంపవచ్చు. నేను నీకు సత్యం చెపుతున్నాను. (47,48)
ఏవమేతత్ కరిష్యామి యథా తాత త్వమాత్థ మామ్।
యచ్చాన్యదపి శక్ష్యామి తత్ కరిష్యామి తే ప్రియమ్॥ 49
నాయనా! ధర్మరాజా! నీవు నాకు చెప్పింది చెప్పినట్లు చేస్తాను. ఇంతకంటె ఎక్కువగా నయినా నేను చేయగల ప్రియం నీకు చేస్తాను. (49)
యచ్చ దుఃఖం త్వయా ప్రాప్తం ద్యూతే వై కృష్ణయా సహ।
పరుషాణి చ వాక్యాని సూతపుత్రకృతాని వై॥ 50
జటాసురాత్ పరిక్లేశః కీచకాచ్చ మహాద్యుతే।
ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథాశుభమ్॥ 51
సర్వం దుఃఖమిదం వీర సుఖోదర్కం భవిష్యతి।
నాత్ర మన్యుస్త్వయా కార్యః విధిర్హి బలవత్తరః॥ 52
యుధిష్ఠిరా! జూదంలో నీవు ద్రౌపదితోపాటు పొందిన దుఃఖం, అప్పుడు కర్ణుడు పలికిన పరుష వాక్యాలు, జటాసురుని వలన, కీచకునివలన ద్రౌపది దమయంతివలె పడిన ఈ కష్టాలు అన్నీ సుఖదాయకాలు అవుతాయి. జరిగినదానికి నీవు దుఃఖించనవసరంలేదు. విధియే బలవత్తరమైనది. (50,51,52)
దుఃఖాని హి మహాత్మానః ప్రాప్నువంతి యుధిష్ఠిర।
దేవైరపి హి దుఃఖాణి ప్రాప్తాని జగతీపతే॥ 53
యుధిష్ఠిరా! మహాత్ములైనా దుఃఖాలను పొందుతారు. దేవతలు కూడా దుఃఖాలను అనుభవించారు. (53)
ఇంద్రేణ శ్రూయతే రాజన్ సభార్యేణ మహాత్మనా।
అనుభూతం మహద్ దుఃఖం దేవరాజేన భారత॥ 54
భారతా! దేవతల రాజైన ఇంద్రుడు భార్యతోసహా మహా దుఃఖాన్ని అనుభవించినట్లు వింటున్నాం. (54)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగపర్వణి శల్యవాక్యే అష్టమోఽధ్యాయః॥ 8 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున
శల్యవాక్యమను ఎనిమిదవ అధ్యాయము (8)
(దాక్షిణాత్య అధికపాఠం 5 శ్లోకాలు కలిపి మొత్తం 59 శ్లోకాలు)