22. ఇరువది రెండవ అధ్యాయము
ధృతరాష్ట్రుడు పాండవుల కడకు సంజయుని పంపుట.
ధృతరాష్ట్ర ఉవాచ
ప్రాప్తానాహుః సంజయ పాండుపుత్రాన్
ఉపప్లవ్యే తాన్ విజానీహి గత్వా।
అజాతశత్రుం చ సభాజయేథాః
దిష్ట్వా నహ్యస్థానముపస్థితస్త్వమ్॥ 1
ధృతరాష్ట్రుడు చెపుతున్నాడు. సంజయా! పాండవులు ఉపప్లావ్యనగరానికి చేరినట్లు చెపుతున్నారు. నీవు అక్కడకు వెళ్లి వారిని తెలుసుకో. అజాతశత్రువైన ధర్మరాజును గౌరవించు. 'భాగ్యవశం వల్ల మీరు మీకు తగినస్థానానికి చేరుకొన్నారు'అని చెప్పు. (1)
సర్వాన్ వదేః సంజయ స్వస్తిమంతః
కృచ్ఛ్రం వాసమతదర్హాన్ నిరుష్య।
తేషాం శాంతి ర్విద్యతేఽస్మాసు శీఘ్రం
మిథ్యాపేతానా ముపకారిణాం సతామ్॥ 2
సంజయా! మనమంతా కుశలమని వారందరికీ చెప్పు. కపటం లేనివారు. పరోపకారం చేసేవారూ, సత్పురుషులూ ఐన పాండవులు కష్టమైన అరణ్యవాసం చేయ దగ్గవారు కాదు. అయినా వాళ్లు నియమం ప్రకారం వనవాసం పూర్తి చేశారు. నీవిలా చెప్తే వారికి మనపట్ల ఉన్న కోపం త్వరగా శాంతిస్తుంది. (2)
నాహం క్వచిత్ సంజయ పాండవానాం
మిథ్యావృత్తిం కాంచన జాత్వపశ్యమ్।
సర్వాం శ్రియం హ్యాత్మవీర్యేణ లబ్ధాం
పర్యాకార్షుః పాండవా మహ్యమేవ॥ 3
సంజయా! పాండవులు అసత్యమాడడం నేనెప్పుడూ చూడలేదు. వారు తమ పరాక్రమంతో సంపాదించిన సంపదనంతా నా అధీనం చేశారు. (3)
దోషం హ్యేషాం నాధ్యగచ్ఛం పరీచ్ఛన్
నిత్యం కంచిత్ యేన గర్హేయ పార్థాన్।
ధర్మార్థాభ్యాం కర్మ కుర్వంతి నిత్యం
సుఖప్రియే నానురుధ్యంతి కామాత్॥ 4
నేను నిత్యం వెతుకుతూ ఉన్నామ్ నిందింపదగిన దోషం ఒక్కటి పాండవులలో కనబడటం లేదు. వారు నిత్యం ధర్మార్థాలలో కూడిన పనినే చేస్తారు. కామంతో సుఖాన్ని, ప్రియాన్ని అనుసరించరు. (4)
ఘర్మం శీతం క్షుత్పిపాసే తథైవ
నిద్రాం తంద్రీం క్రోధహర్షౌ ప్రమాదమ్।
ధృత్వా చైవ ప్రజ్ఞయా చాభిభూయ
ధర్మార్థయోగాత్ ప్రయతంతి పార్థాః॥ 5
పాండవులు శీతోష్ణాలు, ఆకలిదప్పులు, నిద్రాలసతలు క్రోధహర్షాలు, ప్రమాదం అనేవానిని ధైర్యంతో, వివేకంతో జయించి, ధర్మార్థాలకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. (5)
త్యజంతి మిత్రేషు ధనాని కాలే
న సంవాసాజ్జీర్యతి తేషు మైత్రీ।
యథార్హామానార్థకరా హి పార్థాః
తేషాం ద్వేష్టా నాస్త్వాజమీఢస్య పక్షే॥ 6
అన్యత్ర పాపాద్ విషమాన్మందబుద్ధేః
దుర్యోధనాత్ క్షుద్రతరాచ్చ కర్ణాత్।
(పుత్రో మహ్యం మృత్యువశం జగామ
దుర్యోధనః సంజయ రాగబుద్ధిః।
భాగం హర్తుం ఘటతే మందబుద్ధిః
మహాత్మనాం సంజయ దీప్తతేజసామ్॥)
తేషాం హీమౌ హీనసుఖప్రియాణాం
మహాత్మనాం సంజనయతో హి తేజః॥ 7
వారు తగిన సమయంలో మిత్రులకు ధనాన్ని ఇస్తారు. వాళ్లు ప్రవాసంలో ఉన్నా వారిమైత్రి క్షీణించదు. పాండవులు అందరిని వారికి తగినట్లుగ సత్కరిస్తారు. పాపాత్ముడు, వక్రంగా ఉండేవాడు, మందబుద్ధి అయిన దుర్యోధనుడు, మిక్కిలి నీచుడైన కర్ణుడూ తప్ప ఈ కౌరవ పక్షంలోని ఇంకెవరూ పాండవులను ద్వేషించేవారు కారు. (సంజయా! నా కొడుకి దుర్యోధనుడు కామానికి లొంగిపోయి మృత్యువుకు వశమయ్యాడు. మూర్ఖుడైన దుర్యోధనుడు తేజస్వులూ, మహాత్ములూ, అయిన పాండవుల రాజ్యభాగాన్ని హరించాలనుకొంటున్నాడు.) ఈకర్ణ సుయోధనులిద్దరూ సుఖానికీ, ఇష్టమైనవారికీ దూరమైన పాండవులకు కోపం కలిగిస్తున్నారు. (6,7)
ఉత్థాన వీర్యః సుఖమేధమానః
దుర్యోధనః సుకృతం మన్యతే తత్।
తేషాం భాగం యచ్చ మన్యేత బాలః
శక్యం హర్తుం జీవతాం పాండవానామ్॥ 8
ఎగిసే పరాక్రమం గల దుర్యోధనుడు సుఖంలో పెరిగినవాడై పాండవులు జీవించి ఉండగానే వారి భాగాన్ని బాలునిలా హరించగల ననుకొంటున్నాడు. దాన్నే మంచిపనిగా భావిస్తున్నాడు. (8)
యస్యార్జునః పదవీం కేశవశ్చ
వృకోదరః సాత్యకో ఽజాతశత్రోః।
మాద్రీపుత్రౌ సృంజయాశ్చాపి యాంతి
పురా యుద్ధాత్ సాధు తస్య ప్రదానమ్॥ 9
అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీమసేనుడు, సాత్యకి, నకుల సహదేవులు, సృంజయ వంశవీరులును అజాతశత్రువైన యుధిష్ఠిరుని మార్గాన్ని అనుసరిస్తున్నారు. కావున యుద్ధ ప్రసక్తి మాని ముందు రాజ్యభాగమివ్వడం మంచిది. (9)
సహ్యేవైకః పృథివీం సవ్యసాచీ
గాండీవధన్వా ప్రణుదేద్ రథస్థః।
తథా జిష్ణుః కేశవో ఽప్యప్రధృష్యః
లోకత్రయస్యాధిపతిర్మహాత్మా॥ 10
తిష్ఠేత కస్తస మర్త్యః పురస్తాద్
యః సర్వలోకేషు వరేణ్య ఏకః।
పర్జన్యఘోషాన్ ప్రవపన్ శరౌఘాన్
పతంగసంగానివ శీఘ్రవేగాన్॥ 11
గాండీవాన్ని ధరించిన అర్జునుడొక్కడూ రథాన్ని అధిరోహించి ఈ భూమినంతా జయింపగలడు. అదే విధంగా జయశీలుడు, త్రికోకాధిపతి, మహాత్ముడూ ఐన శ్రీకృష్ణుఉ కూడా ఎదిరింప శక్యంకానివాడు. మేఘంలా గర్జిస్తూ పక్షుల సమూహంలా శీఘ్రవేగంతో వచ్చే బాణాలను కురిపిస్తూ, సర్వలోలాలలో ఏకైక వీరుడైన అర్జునుని ఎదిరించి ఎవడు నిలబడగలడు?. (10,11)
దిశం హ్యుదీచీమపి చోత్తరాన్ కురూన్
గాండీవధన్వైకరథో జిగాయ।
ధనం చైషామాహరత్ సవ్యసాచీ
సేనానుగాన్ ద్రవిడాంశ్చైవ చక్రే॥ 12
గాండీవాన్ని ధరించిన అర్జునుడొక్కడూ రథాన్ని అధిరోహించి ఉత్తరదిక్కును, ఉత్తర కురురాజ్యాలను కూడా జయించాడు. వారి సంపదనంతా స్వాధీనం చేసికొన్నాడు. సవ్యసాచి ద్రవిడులను జయించి వారు తన సేనను అనుసరించేటట్లు చేశాడు. (12)
యశ్చైవ దేవాన్ ఖాండవే సవ్యసాచీ
గాండీవధన్వా ప్రజిగాయ సేంద్రాన్।
ఉపాహరత్ పాండవో జాతవేదసే
యశోమానం వర్ధయన్ పాండవానామ్॥ 13
గాండీవాన్ని ధరించిన అర్జునుడు ఖాండవవనంలో ఇంద్రునితో బాటు దేవతలందర్నీ జయించాడు. పాండవుల కీర్తిని, గౌరవాన్ని పెంపుచేస్తూ, ఆ వనాన్ని అగ్నిదేవునికి ఉపహారంగా ఇచ్చాడు. (13)
గదాభృతాం నాస్తు సమోఽత్ర భీమాత్
హస్త్యారోహో నాస్తి సమశ్చ తస్య।
రథే ఽర్జునాదాహురహీనమేనం
బాహ్వోర్బలేనాయుతనాగవీర్యమ్॥ 14
బాహుబలంలో పదివేల ఏనుగుల బలం కలవాడు. గదాధరులలో అతనితో సమానమైనవాడు లేడు. అలాగే ఏనుగుపై స్వారీ చేయడంలోనూ అతనితో సమానమైన వాడు ఈ భూతలంమీద లేడు. రథారూఢుడై యుద్ధం చేయడంలో కూడా ఇతడు అర్జునునికేమీ తీసిపోడంటారు భీమసేనుడు. (14)
సుశిక్షితః కృతవైరస్తరస్వీ
దహేత్ క్షుద్రాంస్తరసా ధార్తరాష్ట్రాన్।
సదాత్యమర్షీ న బలాత్ స శక్యః
యుద్ధే జేతుం వాసవేనాపి సాక్షాత్॥ 15
అస్త్రవిద్యలో సుశిక్షితుడైన భీముడు కౌరవుల పట్ల గల వైరంతో వేగంగా నీచులైన కౌరవులను దహించివేస్తాడు. నిత్యం అసహనంతో ఉన్న భీముడు యుద్ధంలో బలం వల్ల ఇంద్రునిచే కూడ జయింపశక్యం కానివాడు. (15)
సుచేతసౌ బలినౌ శీఘ్రహస్తౌ
సుశిక్షితౌ భ్రాతరౌ ఫాల్గునేన।
శ్యేనౌ యథా పక్షిపూగాన్ రుజంతౌ
మాద్రీపుత్రౌ శేషయేతాం న శత్రూన్॥ 16
మాద్రి కొడుకులి నకులసహదేవులిద్దరూ మంచి మనస్సు కలవారు, బలవంతులు, అస్త్రప్రయోగంలో శీఘ్రవేగం కలవారు. స్వయంగా అర్జునుడు వారికి అస్త్రవిద్యలో శిక్షణనిచ్చాడు. డేగలు పక్షి సమూహాన్ని నష్టపరిచినట్లుగా వారిద్దరూ ఇక శత్రువులను మిగలనివ్వరు. (16)
ఏతద్ బలం పూర్ణమస్మాకమేవం
యత్ సత్యం తాన్ ప్రాప్య నాస్తీతి మన్యే।
తేషాం మధ్యే వర్తమాన స్తరస్వీ
ధృష్టద్యుమ్నః పాండవానా మిహైకః॥ 17
సహామాత్యః సోమకానాం ప్రబర్హః
సంత్యక్తాత్మా పాండవార్థే శ్రుతో మే।
అజాతశత్రుం ప్రసహేత కోఽన్యః
యేషాం స స్యాదగ్రణీర్వృష్ణిసింహః॥ 18
మన బలం పరిపూర్ణమైనప్పటికీ, పాండవులకెదురైనపుడు వారితో సమానం కాదనిపిస్తోంది. పాండవుల పక్షంలో ధృష్టద్యుమ్నుడనే యోధుడున్నాడు. అతడు సోమవంశంలో శ్రేష్ఠుడు. పాండవులకోసం అతడు తన శరీరంమీద ఆశ వదులుకున్నాడు. వృష్ణిసింహుడు శ్రీకృష్ణుడు ముందుండి నడిపిస్తూ ఉండగా, ధర్మరాజుధాటికి ఎవడు తట్టుకొనగలడు? (17,18)
సహోషితశ్చరితార్థో వయఃస్థః
మాత్స్యేయానామధిపో వై విరాటః।
స వై సపుత్రః పాండవార్థే చ శశ్వద్
యుధిష్ఠిరం భక్త ఇతి శ్రుతం మే॥ 19
మత్స్యదేశాధిపతి ఐన విరాటరాజు వృద్ధుడైనప్పటికీ తన పుత్రులతో కూడ పాండవులకు సహాయంకోసం సదా సిద్ధంగా ఉంటాడు. అతడు యుధిష్ఠిరునికి గొప్ప భక్తుడని విన్నాను. (19)
అవరుద్ధా రథినః కేకయేభ్యః
మహేష్వాసా భ్రాతరః పంచ సంతి।
కేకయేభ్యో రాజ్యమాకాంక్షమాణాః
యుద్ధార్థినశ్చానువసంతి పార్థాన్॥ 20
కేకయదేశంనుండి బహిష్కరింపబడిన కేకయ రాజు కుమారులైదుగురూ గొప్ప ధనుర్ధారులు, రథికులు, వీరులూను. వారు కేకయరాజులనుండి రాజ్యాన్ని పొందగోరి యుద్ధం చేయాలనే తలంపుతో పాండవులతోపాటు ఉంటున్నారు. (20)
సర్వాంశ్చ వీరాన్ పృథివీపతీనాం
సమాగతాణ్ పాండవార్థే నివిష్టాన్।
శూరానహం భక్తిమతః శృణోమి
ప్రీత్యా యుక్తాన్ సంశ్రితాన్ ధర్మరాజమ్॥ 21
పాండవ పక్షాన వచ్చిన భూపతులందరూ శూరులూ, వీరులూ, ధర్మరాజు పట్ల భక్తితో, ప్రీతితో ఆశ్రయించిన వారూ అన్నీ నేను విన్నాను. (21)
గిర్యాశ్రయా దుర్గనివాసినశ్చ
యోధాః పృథివ్యాం కులజాతిశుద్ధాః।
మ్లేచ్ఛాశ్చ నానాయుధవీర్యవంతః
సమాగతాః పాండవార్థే నివిష్టాః॥ 22
కొండలలోనూ, అడవులలోనూ నివసిస్తున్నవారూ, తమ వంశంచేత, జాతిచేత పరిశుద్ధులైన యోధులూ, అనేక విధాలైన ఆయుధాలూ, బలమూ, కలిగిన మ్లేచ్ఛులు పాండవులకోసం సిద్ధంగా వచ్చి ఉన్నారు. (22)
పాండ్యశ్చ రాజా సమితీంద్రకల్పః
యోధప్రవీరైర్బహుభిః సమేతః।
సమాగతః పాండవార్థే మహాత్మా
లోకప్రవరో ఽప్రతివీర్యతేజాః॥ 23
యుద్ధంలో ఇంద్రునితో సమానమని, లోకప్రసిద్ధి పొందిన, ఎదురులేని పరాక్రమం కలవాడు పాండ్యరాజు. అతడు యోధ వీరులతో కలిసి పాండవుల కోసం వచ్చి సిద్ధంగా ఉన్నాడు. (23)
అస్త్రం ద్రోణాదర్జునాద్ వాసుదేవాత్
కృపాద్ భీష్మాద్ యేన వృత్తం శృణోమి।
యం తం కార్ష్ణిప్రతిమమాహురేకం
స సాత్యకిః పాండవార్థే నివిష్టః॥ 24
ద్రోణుడు, అర్జునుడు, వాసుదేవుడు, కృపుడు, భీష్ముడు మున్నగువారి నుండి అస్త్రవిద్యను నేర్చి, ప్రద్యుమ్నునితో సమానమైన సాత్యకి కూడ పాండవుల కొరకు సిద్ధంగా ఉన్నాడు. (24)
ఉపాశ్రితాశ్చేదికరూషకాశ్చ
సర్వోద్యోగైర్భూమిపాలాః సమేతాః।
తేషాం మధ్యే సూర్యమివాతపంతం
శ్రియా వృతం చేదిపతిం జ్వలంతమ్॥ 25
అస్తంభనీయం యుధి మన్యమానః
జ్యాం కర్షతాం శ్రేష్ఠతమం పృథివ్యామ్।
సర్వోత్సాహం క్షత్రియాణాం నిహత్య
ప్రసహ్య కృష్ణస్తరసా సమ్మమర్ద॥ 26
యుధిష్ఠిరుని రాజసూయ యాగానికి చేది కరూషదేశాల రాజులందరూ అన్ని విధాలైనా ప్రయత్నాలతో కలిసి వచ్చారు. వారి మధ్యలో చేదిరాజు సూర్యునివలె ప్రకాశించాడు. యుద్ధంలో అతనిని నిలువరించడం సాధ్యం కాదని భావించి శ్రీకృష్ణుడు ఆ క్షత్రియుల ఉత్సాహాన్ని హరిస్తూ ఈ భూమండలం మీది ధనుర్ధారులలో మిక్కిలి శ్రేష్ఠుడైన ఆ శిశుపాలుని సంహరించాడు. (25,26)
యశోమానౌ వర్ధయన్ పాండవానాం
పురా భినచ్ఛిశుపాలం సమీక్ష్య।
యస్య సర్వే వర్ధయంతి స్మ మానం
కరూషరాజప్రముఖాః నరేంద్రాః॥ 27
ప్రముఖులైన కరూష రాజులందరూ ఎవని గర్వాన్ని పెంపొందిస్తున్నారో, ఆ శిశుపాలుని ముందుగానే చంపి, శ్రీకృష్ణుడు పాండవుల కీర్తి గౌరవాలను పెంపొందించాడు. (27)
తమసహ్యం కేశవం తత్ర మత్వా
సుగ్రీవయుక్తేన రథేన కృష్ణమ్।
సంప్రాద్రవంశ్చేదిపతిం విహాయ
సింహం దృష్ట్వా క్షుద్రమృగా ఇవాన్యే॥ 28
సుగ్రీవాది అశ్వాలు పూన్చబడిన రథాన్ని ఎక్కి ఉన్న కృష్ణుని ఎదిరింపలేక, శిశుపాలుని అక్కడనే వదిలి, సింహాన్ని చూసి పరుగెత్తే చిన్న మృగాల్లా తక్కిన రాజులంతా అక్కడనుండి పారిపోయారు. (28)
యస్తం ప్రతీపస్తరసా ప్రత్యుదీయాత్
ఆశంసమానో ద్వైరథే వాసుదేవమ్।
సో ఽశేత కృష్ణేన హతః పరాసుః
వాతేనేవోన్మథితః కర్ణికారః॥ 29
ద్విరథయుద్ధంలో ద్వేషంతో శ్రీకృష్ణుని మీదికి దాడి చేసిన శిశుపాలుడు గాలిచేత పెకలించబడిన కర్ణికారవృక్షం వలె శ్రీకృష్ణునిచేత దెబ్బకు మరణించాడు. (29)
పరాక్రమం మే యదవేదయంత
తేషామర్థే సంజయ కేశవస్య।
అనుస్మరంస్తస్య కర్మాణి విష్ణోః
గావల్గణే నాధిగచ్ఛామి శాంతిమ్॥ 30
సంజయా! పాండవులకొఱకు శ్రీకృష్ణుడు చూపిన పరాక్రమ వృత్తాంతమంతా నాకు తెలిసింది. ఆ శ్రీకృష్ణుని పనులను తలచుకొంటూంటే నేను శాంతిని పొందలేక పోతున్నాను. (30)
న జాతు తాన్ శత్రురన్యః సహేత
యేషాం స స్యాదగ్రణీర్వృష్ణిసింహః।
ప్రవేపతే మే హృదయం భయేన
శ్రుత్వా కృష్ణావేకరథే సమేతౌ॥ 31
వృష్ణిసింహుడైన శ్రీకృష్ణుడు అగ్రనేతగా ఉంటే, ఆ పాండవులను ఎదిరింపగల శత్రువు వేరొకడుండడు. ఒకే రథం మీదున్న కృష్ణార్జునులను గురించి వింటేనే నా హృదయం భయంతో వణికిపోతోంది. (31)
న చేత్ గచ్ఛేత్ సంగరం మందబుద్ధిః
తాభ్యాం లభేచ్ఛర్మ తదా సుతో మే।
నో చేత్ కురూన్ సంజయ నిర్దహేతామ్
ఇంద్రావిష్ణూ దైత్యసేనాం యథైవ॥ 32
సంజయా! తెలివితక్కువవాడైన నా కుమారుడు వారిరువురితో యుద్ధానికి వెళ్ళాకపోతే, శుభాన్ని పొందుతాడు. వెడితే ఇంద్రుడు, విష్ణువూ రాక్షససేనను సంహరించినట్లుగా వారిరువురూ కౌరవుల నందర్నీ దహించి వేస్తారు. (32)
మతో హి మే శక్రసమో ధనంజయః
సనాతనో వృష్ణివీరశ్చ విష్ణుః।
ధర్మారామో హ్రీనిషేవస్తరస్వీ
కుంతీపుత్రః పాండవో ఽజాతశత్రుః॥ 33
దుర్యోధనేన నికృతో మనస్వీ
నో చేత్ క్రుద్ధః ప్రదహేద్ ధార్తరాష్ట్రాన్।
నాహం తథా హ్యర్జునాద్ వాసుదేవాద్
భీమాద్ వాహం యమయోర్వా బిభేమి॥ 34
యథా రాజ్ఞః క్రోధదీప్తస్య సూత
మన్యోరహం భీతతరః సదైవ।
మహాతపా బ్రహ్మచర్యేణ యుక్తః
సంకల్పోఽయం మానసస్తస్య సిద్ధ్యేత్॥ 35
అర్జునుడు ఇంద్రసమానుడు. వృష్ణివీరుడైన శ్రీకృష్ణుడు సనాతనుడైన శ్రీమహావిష్ణువు. వినయమూ, బలమూ కల, అజాతశత్రువు ధర్మరాజు ధర్మాచరణంలోనే ఆనందిస్తాడు. అని నా అభిప్రాయం. అలా కాకపోతే అభిమానధనుడైన యుధిష్ఠిరుడు తనను దుర్యోధనుడు ఎంతగానో అవమానించి నందులకు, క్రుద్ధుడై కౌరవులను ఎపుడో దహించివేసేవాడు.
సంజయా! క్రోధంతో ఉడికిపోతున్న యుధిష్ఠిరుని కోపానికి భయపడినంతగా, అర్జునుడి వల్లగాని, వాసుదేవుని వల్లగాని, భీమునివల్లగాని, నకుల సహదేవుల వల్లగాని నేను భయపడను. బ్రహ్మచర్యంతో ఉన్నవాడు, మహాతపస్వి ధర్మరాజు యొక్క మనస్సంకల్పం సిద్ధిస్తుంది. (33,34,35)
తస్య క్రోధం సంజయాహం సమీక్ష్య
స్థానే జానన్ భృశమస్మ్యద్య భీతః।
స గచ్ఛ శీఘ్రం ప్రహితో రథేన
పాంచాలరాజస్య చమూనివేశనమ్॥ 36
అజాతశత్రుం కుశలం స్మ పృచ్ఛేః
పునః పునః ప్రీతియుక్తం వదేస్త్వమ్।
జనార్దనం చాపి సమేత్య తాత
మహామాత్రం వీర్యవతాముదారమ్॥ 37
అనామయం మద్వచనేన పృచ్ఛేః
ధృతరాష్ట్రః పాండవైః శాంతిమీప్సుః।
న తస్య కించిద్ వచనం న కుర్యాత్
కుంతీపుత్రో వాసుదేవస్య సూత॥ 38
సంజయా! అతనికోసం చూసి ఇపుడు నేను భయపడడం యుక్తమే. నీవు త్వరగా రథంపై పాంచాలరాజు యొక్క సైన్యం విడిది చేశిన చోటికి వెళ్లు. అజాతశత్రువైన ధర్మరాజును కుశలమడుగు. మళ్లీ మళ్లీ ఇచ్చకంగా మాట్లాడు. నాయనా! బలవంతులలో శ్రేష్ఠుడు, మహాత్ముడూ ఆ జనార్దనుని కలిసి నా మాటగా కుశలమడుగు. ధృతరాష్ట్రుడు పాండవులతో శాంతిని కోరుకొంటున్నాడని చెప్పు. సంజయా! ధర్మరాజు వాసుదేవుడు చెప్పిన మాటనే తప్పక ఆచరిస్తాడు. (36,37,38)
ప్రియశ్పైషామాత్మసమశ్చ కృష్ణః
విద్వాంశ్పైషాం కర్మణి నిత్యయుక్తః।
సమానీతాన్ పాండవాన్ సృంజయాంశ్చ
జనార్దనం యుయుధానం విరాటమ్॥ 39
అనామయం మద్వచనేన పృచ్ఛేః
సర్వాంస్తథా ద్రౌపదేయాంశ్చ పంచ।
యద్ యత్ తత్ర ప్రాప్తకాలం పరేభ్యః
త్వం మన్యేథా భారతానాం హితం చ।
తద్ భాషేథాః సంజయ రాజమధ్యే
న మూర్ఛయేద్ యన్న చ యుద్ధహేతుః॥ 40
శ్రీకృష్ణుడు వారికి ఆత్మసముడైన ఇష్టుడు. పండితుడు. ఎల్లపుడూ పాండవులకు హితం చేస్తాడు. సంజయా! నీవు అక్కడున్న పాండవులను, సృంజయవంశీయులను, శ్రీకృష్ణుని, సాత్యకిని, విరాటరాజును, ఉపపాండవులనూ నామాటగా క్షేమసమాచారం అడుగు. ఇంతేకాక ఇంకా నీకు భరత వంశీయులకు హితమని తోచిన మాటలను పాండవులకు చెప్పు. క్రోధానికికాని, యుద్ధానికిగాని కారణమయ్యే మాటలనేమీ మాట్లాడవద్దు. (39,40)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి ధృతరాష్ట్రసందేశే ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున
ధృతరాష్ట్ర సందేశమను ఇరువది రెండవ అధ్యాయము. (22)
(దాక్షిణాత్యపాఠములోని ఒక అధికశ్లోకముతో కలిపి 41 శ్లోకములు)