33. ముప్పది మూడవ అధ్యాయము
(ప్రజాగరపర్వము)
ధృతరాష్ట్ర విదుర సంవాదము.
వైశంపాయన ఉవాచ
ద్వాఃస్థం ప్రాహ మహాప్రాజ్ఞః ధృతరాష్ట్రో మహీపతిః।
విదురం ద్రష్టుమిచ్ఛామి తమిహానయ మా చిరమ్॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. ధృతరాష్ట్రమహారాజు ద్వారపాలకునితో "విదురుని చూడాలనుకొంటున్నాను. అతనిని ఇక్కడకు త్వరగా తీసుకురా" అన్నాడు. (1)
ప్రహితో ధృతరాష్ట్రేణ దూతః క్షత్తారమబ్రవీత్।
ఈశ్వరస్త్వాం మహారాజః మహాప్రాజ్ఞ దిదృక్షతి॥ 2
ధృతరాష్ట్రుడు పంపిన దూత విదురునితో "మహాప్రాజ్ఞా! ప్రభువైన మహారాజు నిన్ను చూడాలను కొంటున్నాడు" అన్నాడు. (2)
ఏవముక్తస్తు విదురః ప్రాప్య రాజనివేశనమ్।
అబ్రవీద్ ధృతరాష్ట్రాయ ద్వాఃస్థ మాం ప్రతివేదయ॥ 3
ఆ మాట విని విదురుడు రాజభవనానికి చేరుకుని "ద్వారపాలకా! ధృతరాష్ట్రునికి నా రాక గురించి చెప్పు" అన్నాడు. (3)
ద్వాఃస్థ ఉవాచ
విదురోఽయ మనుప్రాప్తః రాజేంద్ర తవ శాసనాత్।
ద్రష్టుమిచ్ఛతి తే పాదౌ కిం కరోతు ప్రశాధి మామ్॥ 4
ద్వారపాలకుడు చెప్పాడు. మహారాజా! నీ ఆజ్ఞతో విదురుడు వచ్చాడు. నీ పాదాలను దర్శించుకోవాలనుకొంటున్నాడు. ఏమి చెయ్యాలో నన్నాదేశించు. (4)
ధృతరాష్ట్ర ఉవాచ
ప్రవేశయ మహాప్రాజ్ఞం విదురం ధీర్ఘదర్శినమ్।
అహం హి విదురస్యాస్య నాకల్పో జాతు దర్శనే॥ 5
ధృతరాష్ట్రుడు చెప్పాడు. గొప్ప తెలివి, ముందు చూపూ కల విదురుని ప్రవేశపెట్టు. నేను ఈ విదురుని చూడటానికి ఎప్పుడూ అడ్డు చెప్పను. (కాదనను) (5)
ద్వాఃస్థ ఉవాచ
ప్రవిశాంతఃపురం క్షత్తః మహారాజస్య ధీమతః।
న హి తే దర్శనే కల్పః జాతు రాజాబ్రవీద్ధి మామ్॥ 6
ద్వారపాలకు డన్నాడు. విదురా! బుద్ధిశాలి అయిన మహారాజుయొక్క అంతఃపురంలోనికి ప్రవేశించు. రాజు నిన్ను చూడటానికి ఎప్పుడూ అడ్డు చెప్పనని నాతో అన్నాడు. (6)
వైశంపాయన ఉవాచ
తతః ప్రవిశ్య విదురః ధృతరాష్ట్రనివేశనమ్।
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం చింతయానం వరాధిపమ్॥ 7
వైశంపాయనుడు చెప్పాడు - విదురుడు ధృతరాష్ట్రుడి మందిరంలో ప్రవేశించి చేతులు జోడించి, చింతిస్తున్న రాజుతో ఇలా అన్నాడు. (7)
విదురోఽహం మహాప్రాజ్ఞ సంప్రాప్తస్తవ శాసనాత్।
యది కించన కర్తవ్యమ్ అయమస్మి ప్రశాధి మామ్॥ 8
మహామనీషీ! నేను విదురుణ్ణి. నీ ఆజ్ఞ వల్ల వచ్చాను. కర్తవ్యమేమిటో ఆజ్ఞాపించు. ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. (8)
ధృతరాష్ట్ర ఉవాచ
సంజయో విదుర ప్రాజ్ఞః గర్హయిత్వా చ మాం గతః।
అజాతశత్రోః శ్వో వాక్యమ్ సభామధ్యే స వక్ష్యతి॥ 9
ధృతరాష్ట్రుడు ఇట్లన్నాడు. విదురా! బుద్ధిశాలి అయిన సంజయుడు నన్ను నిందించి వెళ్ళాడు. అతడు రేపు సభలో అజాతశత్రువు (ధర్మరాజు) మాటల్ని చెప్తాడట. (9)
తస్యాద్య కురువీరస్య న విజ్ఞాతం వచో మయా।
తన్మే దహతి గాత్రాణి తదకార్షీత్ ప్రజాగరమ్॥ 10
ఆ కురువీరుడైన ధర్మరాజు మాటలేవో నాకు ఇప్పటికీ తెలియలేదు. అది నా అవయవాలను కాల్చివేస్తోంది. నిద్ర పట్టనియ్యటం లేదు. (10)
జాగ్రతో దహ్యమానస్య శ్రేయో యదమపశ్యసి।
తద్ బ్రూహి త్వం హి నస్తాత ధర్మార్థకుశలో హ్యసి॥ 11
నాయనా! నీవు ధర్మార్థములలో నిపుణుడివి. నిద్రపట్టక తపిస్తున్న నాకు మేలయినది చెప్పు. (11)
యతః ప్రాప్తః సంజయః పాండవేభ్యః
న మే యథావన్మనసః ప్రశాంతిః।
సర్వేంద్రియాణ్యప్రకృతిం గతాని
కిం వక్ష్యతీత్యేవ మేఽద్య ప్రచింతా॥ 12
సంజయుడు పాండవుల దగ్గర నుండి వచ్చింది మొదలు నా మనస్సుకు మునుపటి ప్రశాంతత లేదు. ఇంద్రియాలన్నీ సరిగా పనిచెయ్యడంలేదు. ఏం చెప్తాడో అని నాకిప్పుడెంతో చింతగా ఉంది. (12)
విదుర ఉవాచ
అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనమ్।
హృతస్వం కామినం చోరమ్ ఆవిశంతి ప్రజాగరాః॥ 13
విదురుడు ఇలా చెప్పాడు. బలవంతుడు పై బడుతున్న బలహీనుడికి, సొమ్ము పోగొట్టుకొన్న వానికి, కాముకుడికి, దొంగకు నిద్ర పట్టదు. (13)
కచ్చిదేతైర్మహాదోషైః న స్పృష్టోఽసి నరాధిప।
కచ్చిచ్చ పరవిత్తేషు గృధ్యన్ న పరితప్యసే॥ 14
ఈ పెద్ద తప్పు లేవైనా చేయలేదు కదా! ఇతరుల సొమ్ముకు ఆశపడి పరితపించటం లేదు కదా! (14)
ధృతరాష్ట్ర ఉవాచ
శ్రోతు మిచ్ఛామి తే ధర్మ్యం పరం నైఃశ్రేయసం వచః।
అస్మిన్ రాజర్షివంశే హి త్వమేకః ప్రాజ్ఞసమ్మతః॥ 15
ధృతరాష్ట్రుడు చెప్పాడు. ధర్మబద్ధమై, ఉత్తమశుభాన్ని కలిగించే నీ మాటను వినాలనుకొంటున్నాను. ఈ రాజర్షి వంశంలో నీవొకడివే పండితులమన్నన పొందినవాడివి. (15)
విదుర ఉవాచ
(రాజా లక్షణ సంపన్నః త్రైలోక్యస్యాధిపో భవేత్।
ప్రేష్యస్తే ప్రేషితశ్పైవ ధృతరాష్ట్ర యుధిష్ఠిరః॥
విదురుడు ఇలా అన్నాడు. ధృతరాష్ట్రా! మంచి లక్షణాలు గల యుధిష్ఠిర మహారాజు మూడులోకాలకు ప్రభువు కాదగినవాడు. నీ ఆదేశాన్ని పాలించేవాడు. అలాంటివాడిని అడవులకు పంపావు.
విపరీతతరశ్చ త్వం భాగధేయే న సమ్మతి।
అర్చిషాం ప్రక్షయాచ్పైవ ధర్మాత్మా ధర్మకోవిదః॥
నీవు ధర్మాత్ముడివి, ధర్మతత్త్వమెరిగినవాడివి. కంటి చూపు లేకపోవటంతో (అతనిని గుర్తించలేక అతని విషయంలో) ఎంతో విపరీతంగా ప్రవర్తించావు. రాజ్యభాగం ఇవ్వటానికి సమ్మతించలేదు.
ఆనృశంస్యాదనుక్రోశాద్ ధర్మాత్ పత్యాత్ పరాక్రమాత్।
గురుత్వాత్ త్వయి సంప్రేక్ష్య బహూన్ క్లేశాంస్తితిక్షతే॥
క్రూరత్వం లేని దయ, ధర్మం, సత్యం, పరాక్రమం, నీ యందు పెద్దరికం, వీని వల్ల ధర్మరాజు చాలా కష్టాల్ని ఓర్చుకొంటున్నాడు.
దుర్యోధనే సౌబలే చ కర్ణే దుఃశాసనే తథా।
ఏతేష్వైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్ఛసి॥
దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు - వీళ్ళమీద రాజ్యభారాన్ని పెట్టి మేలు కలగాలని నీవెలా అనుకొంటున్నావు?
ఆత్మజ్ఞానం సమారంభః తితిక్షా ధర్మనిత్యతా।
యమర్థాన్నాపకర్షంతి స వై పండిత ఉచ్యతే॥)
ఆత్మజ్ఞానం, ప్రయత్నం, దుఃఖాలను ఓర్చుకొనేశక్తి, ధర్మానికే కట్టుబడి ఉండటం, ఇవి ఎవనిని పురుషార్థం నుండి మళ్ళించవో అతడు పండితుడు.
నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే।
అనాస్తికః శ్రద్దధానః ఏతత్ పండితలక్షణమ్॥ 16
మంచిపనులను చేస్తాడు. నిందింపదగిన పనులను చెయ్యడు. నాస్తికుడు కాడు. శ్రద్ధకలిగి ఉంటాడు. ఇది పండితుని లక్షణం. (16)
క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీః స్తంభో మాన్యమానితా।
యమర్థాన్నాపకర్షంతి స వై పండిత ఉచ్యతే॥ 17
కోపం, సంతోషం, గర్వం, సిగ్గు, బిగుసుకుపోవటం, తనకు తానే పూజ్యుణ్ణనుకోవటం - ఇవి ఎవనిని పురుషార్థం నుండి దూరం చెయ్యవో, అతడే పండితుడు. (17)
యస్య కృత్యం న జానంతి మంత్రం వా మంత్రితం పరే।
కృతమేవాస్య జానంతి స వై పండిత ఉచ్యతే॥ 18
తాను చెయ్యాలనుకున్న పనిని, ఆలోచనను ఇతరులు తెలుసుకొనలేరు. అతడు చేసిన పనిని మాత్రమే తెలుసుకోగలరు. అతడే పండితుడు. (18)
యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।
సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే॥ 19
తాను చేయబోయే పనిని చలి-వేడి; భయం-రాగం; కలిమి-లేమి; అనేవి ఆటంక పరచలేవు. అతడే పండితుడు. (19)
యస్య సంసారిణీ ప్రజ్ఞా ధర్మార్థావనువర్తతే।
కామాదర్థం వృణీతే యః స వై పండిత ఉచ్యతే॥ 20
ప్రసరించే అతని బుద్ధి ధర్మాన్ని అర్థాన్ని అనుసరిస్తుంది. శారీరక సుఖానుభవం కన్నా పురుషార్థాన్నే అతడు కోరుతాడు. అతడే పండితుడు. (20)
యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే।
న కించిదవమన్యంతే నరాః పండితబుద్ధయః॥ 21
వివేకంతో పండిన బుద్ధి గల మానవులు తమశక్తిననుసరించి చెయ్యాలనుకొంటారు. తమశక్తికి తగ్గట్లు చేస్తారు కూడా. దేనినీ చులకన చెయ్యరు. (21)
క్షిప్రం విజానాతి చిరం శృణోతి
విజ్ఞాయ చార్థం భజతే న కామాత్।
నాసంపృష్టో వ్యుపయుంక్తే పరార్థే
తత్ ప్రజ్ఞానం ప్రథమం పండితస్య॥ 22
(ఏ విషయాన్నైనా) వెంటనే అర్థం చేసుకొంటాడు. ఎంతసేపైగా వింటాడు. ప్రయోజనాన్ని కోరికతో కాక, చక్కగా గమనించి పొందగోరతాడు. ఇతరులు అడుగకుండా ఇతరుల విషయంలో మాటలాడడు. పండితు డనటానికి ఇది మొదటి గుర్తు. (22)
నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుమ్।
ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండితబుద్ధయః॥ 23
పండితబుద్ధిగల మానవులు పొందదగని దాన్ని కోరరు. పోయినదాన్ని గూర్చి ఏడవరు. ఆపదల్లో చిక్కుకొన్నప్పుడు కంగారు పడరు. (23)
నిశ్చిత్య యః ప్రక్రమతే నాంతర్వసతి కర్మణః।
అవంధ్యకాలో వాశ్యాత్మా స వై పండిత ఉచ్యతే॥ 24
తాను సాధించగలనని నిశ్చయించుకొని ఆ పనికి పూనుకొంటాడు. పనిని మధ్యలో విడువడు. సమయాన్ని వృథా కానియ్యడు. మనసును అదుపులో ఉంచుకొంటాడు. అతడే పండితుడు. (24)
ఆర్యకర్మణి రజ్యంతే భూతికర్మాణి కుర్వతే।
హితం చ నాభ్యసూయంతి పండితా భరతర్షభ॥ 25
భరతవంశోత్తమా! పండితులు శుభకర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపదలనిచ్చే పనుల్ని చేస్తారు. మంచి చేసే వారిని తప్పుపట్టరు. (25)
న హృష్యత్యాత్మసమ్మానే నావమానేన తప్యతే।
గాంగో హ్రద ఇవాక్షోభ్యః యః స పండిత ఉచ్యతే॥ 26
తనను సత్కరించినప్పుడు పొంగిపోడు. అవమానానికి కుంగిపోడు. గంగమడుగులా నిశ్చలంగా ఉంటాడు. అలాంటివాడు పండితుడు. (26)
తత్త్వజ్ఞః సర్వభూతానాం యోగజ్ఞః సర్వకర్మణామ్।
ఉపాయజ్ఞో మనుష్యాణాం నరః పండిత ఉచ్యతే॥ 27
అన్నిప్రాణుల యథార్థస్థితి తెలిసినవాడు,అ న్ని పనులు చేసే నేర్పు తెలిసినవాడు, ఉపాయమెరిగిన వాడు పండితుడు. (27)
ప్రవృత్తవాక్ చిత్రకథః ఊహవాన్ ప్రతిభానవాన్।
ఆశుగ్రంథస్య వక్తా చ యః స పండిత ఉచ్యతే॥ 28
మాటలు ఆగకుండా సాగేవాడు. జనంలో ప్రచారంలో ఉన్న కథలు తెలిసి, ఊహ, సమయస్ఫూర్తి కలవాడు. అప్పటికప్పుడు ఏగ్రంథాన్నైనా చెప్పగలవాడు పండితుడు. (28)
శ్రుతం ప్రజ్ఞానుగం యస్య ప్రజ్ఞా చైవ శ్రుతానుగా।
అసంభిన్నార్యమర్యాదః పండితాఖ్యాం లభేత సః॥ 29
శాస్త్రజ్ఞానం బుద్ధిని, బుద్ధి శాస్త్రజ్ఞానాన్ని అనుసరిస్తూ, పెద్దవారి కట్టడిని అతిక్రమించనివాడు పండితుడనే పేరు పొందుతాడు. (29)
అశ్రుతశ్చ సమున్నద్ధః దరిద్రశ్చ మహామనాః।
అర్థాంశ్చాకర్మణా ప్రేప్సుః మూఢ ఇత్యుచ్యతే బుధైః॥ 30
చదువులేకుండా, మిడిసి పడుతూఉంటాడు. పేదవాడయి గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు. పనిచెయ్యకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు. ఇలాంటి వాడు పండితులచే మూఢుడు అనిపించుకొంటాడు. (30)
స్వమర్థం యః పరిత్యజ్య పరార్థమనుతిష్ఠతి।
మిథ్యాచరతి మిత్రార్థే యశ్చ మూఢః స ఉచ్యతే॥ 31
తన పని వదిలిపెట్టి ఇతరుల పని చేసేవాడు, స్నేహితుడిని మోసగించేవాడు మూఢు డనబడతాడు. (31)
అకామాన్ కామయతి యః కామయానాన్ పరిత్యజేత్।
బలవంతం చ యో ద్వేష్టి తమాహుర్మూఢ చేతసమ్॥ 32
తనను ఇష్టపడని వాళ్ళను ఇషటపడతాడు. ఇష్టపడేవాళ్ళను దూరం చేసుకుంటాడు. బలవంతుడితో విరోధం పెట్టుకుంటాడు. అతణ్ణి మూఢబుద్ధి అంటారు. (32)
అమిత్రం కురుతే మిత్రం మిత్రం ద్వేష్టి హినస్తు చ।
కర్మ చారభతే దుష్టం తమాహుర్మూఢచేతసమ్॥ 33
శత్రువును మిత్రుడిగా భావిస్తాడు. మిత్రుణ్ణి ద్వేషిస్తాడు. హింసిస్తాడు. చెడ్డపని మొదలుపెడతాడు. అలాంటివాణ్ణి మూఢబుద్ధి అంటారు. (33)
సంసారయతి కృత్యాని సర్వత్ర విచికిత్సతే।
చిరం కరోతి క్షిప్రార్థే స మూఢో భరతర్షభ॥ 34
భరతవంశోత్తమా! తన పనుల్ని ఇతరులకు పురమాయిస్తాడు. అన్నిచోట్ల సందేహిస్తూంటాడు. తొందరగా ముగిసే పనిని సాగదీస్తాడు. అతడు మూఢుడు. (34)
శ్రాద్ధం పితృభ్యో న దదాతి దైవతాని న చార్చతి।
సుహృన్మిత్రం న లభతే తమాహుర్మూఢచేతసమ్॥ 35
పితరులకు శ్రాద్ధం పెట్టడు. దేవతల్ని పూజించడు. మంచి హృదయం గల మిత్రుణ్ణి పొందడు. అలాంటివాణ్ణి మూఢబుద్ధి అంటారు. (35)
అనాహూతః ప్రవిశతి అపృష్టో బహు భాషతే।
అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః॥ 36
పిలవకుండా లోపలికి ప్రవేశిస్తాడు. అడగకుండానే ఎక్కువగా మాట్లాడతాడు. నమ్మ తగని వాళ్లను నమ్ముతాడు. ఇలాంటి నరాధముడు మూఢుడు. (36)
పరం క్షిపతి దోషేణ వర్తమానః స్వయం తథా।
యశ్చ క్రుధ్వత్యనీశానః స చ మూఢతమో వరః॥ 37
తాను తప్పుచేస్తూ ఆ తప్పును ఇతరులలో ఎత్తిచూపుతాడు. అసమర్థుడైకూడా కోపం ప్రదర్శిస్తాడు. అలాంటి మనిషి మహామూర్ఖుడు. (37)
ఆత్మనో బలమజ్ఞాయ ధర్మార్థ పరివర్జితమ్।
అలభ్యమిచ్ఛన్ నైష్కర్మ్యాత్ మూఢబుద్ధిరిహోచ్యతే॥ 38
తన బలమెంతో గుర్తించడు. పని చెయ్యకుండానే దుర్లభమైన దాన్ని కోరుతాడు. ధర్మార్థములకు విరుద్ధమైనది కోరేవాడు ఈ లోకంలో ముఢుడు. (38)
అశిష్యం శాస్తి యో రాజన్ యశ్చ శూన్యముపాపతే।
కదర్యం భజతే యశ్చ తమాహుర్మూఢచేతసమ్॥ 39
రాజా! అర్హత లేనివాడికి ఉపదేశిస్తాడు. దరిద్రుని సేవిస్తాడు. లోభిని పట్టుకుని వ్రేలాడుతాడు. అలాంటివానిని మూఢుడు అంటారు. (39)
అర్థం మహాంతమాసాద్య విద్యామైశ్వర్య మేవ వా।
విచరత్యసమున్నద్ధః యః స పండిత ఉచ్యతే॥ 40
చాలా ధనాన్నీ, చదువునూ, అధికారాన్నీ పొందికూడ మిడిసిపాటు లేకుండా సంచరించేవాడు పండితుడనబడతాడు. (40)
ఏకః సంపన్న మశ్నాతి వస్తే వాసశ్చ శోభనమ్।
యోఽసంవిభజ్య భృత్యేభ్యః కో నృశంసతరస్తతః॥ 41
తాను పోషించవలసిన వాళ్ళకు కల్పించకుండా తానొక్కడు చక్కగా భోంచేస్తాడు. ఒక్కడే అందమైన గుడ్డలు కడతాడు. తన్ను ఆశ్రయించిన వారికి కూడా విదపడు. వాడికన్న గొప్ప క్రూరుడెవడుంటాడు? (41)
ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః।
భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే॥ 42
ఒకడు పాపాలు చేస్తాడు. చాలామంది ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అనుభవించినవారు విడుదలౌతారు. చేసిన వాణ్ణి మాత్రం ఆ దోషం అంటుకొనే ఉంటుంది. (42)
ఏకం హన్యాన్న వా హన్యాద్ ఇషుర్ముక్తో ధనుష్మతా।
బుద్ధిర్బుద్ధిమతోత్సృష్టా హన్యాద్ రాష్ట్రం సరాజకమ్॥ 43
విలుకాడు విడచిన బాణం ఒకణ్ణి చంపుతుందో లేదోగాని తెలివైనవాడు ప్రయోగించిన బుద్ధి(నీతి) రాజుతోపాటు దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. (43)
ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్యశే కురు।
పంచ జిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ॥ 44
ఒకదానితో(బుద్ధితో) రెండు(చెయ్యతగినది, చెయ్యతగనిది) నిశ్చయించుకుని ముగ్గురిని(శత్రువు, మిత్రుడు, తటస్థుడు) నాలిగింటితో (సామ, దాన, భేద, దండోపాయాములతో)(మనసును) అదుపులోకి తెచ్చుకో. ఐదింటిని(ఇంద్రియములను) జయించి, ఆరింటిని(సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయములను) తెలుసుకొని, ఏడింటిని(స్త్రీ, జూదం, వేట, మద్యపానం, పరుషముగా మాట్లాడుట, కఠినంగా దండించుట, డబ్బును చ్డుగా ఖార్చు చేయుట) విడచి సుఖం కలవాడివగుము. (44)
ఏకం విషరసో హంతి శస్త్రేణైకశ్చ వధ్యతే।
సరాష్ట్రం సప్రజం హంతి రాజానం మంత్రవిప్లవః॥ 45
విషరసం ఒక్కణ్ణి(తాగినవాణ్ణి) చంపుతుంది. ఆయుధం ఒక్కణ్ణి(ఎవడిమీద పడితే వాణ్ణి) చంపుతుంది. రాజు-మంత్రుల రహస్యాలోచన(మంత్రివర్గ నిర్ణయం) దేశం, ప్రజలతో సహా రాజును నశింపజేస్తుంది. (45)
ఏకః స్వాదు న భుంజీత ఏకశ్చార్థాణ్ న చింతయేత్।
ఏకో న గచ్ఛేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్॥ 46
రుచిగల పదార్థం ఒక్కడే తినరాదు. ఏ విషయాలయినా ఒక్కడే నిశ్చయించరాదు. ఒంటరిగా మార్గంలో పోకూడదు. అందరూ నిద్రిస్తూ ఉండగా తనొక్కడే మేలుకోరాదు. (46)
ఏకమేవాద్వితీయం తద్ యద్ రాజన్ నావబుధ్యసే।
సత్యం స్వర్గస్య సోపానం పారావారస్య నౌరివ॥ 47
రాజా! సముద్రం దాటటానికి నావలాగా సత్యమొక్కటే స్వర్గానికి మెట్టు. రెండవది లేదు. దాన్ని తెలుసుకోకుంఢా ఉన్నావు. (47)
ఏకః క్షమావతాం దోషః ద్వితీయో నోపపద్యతే।
యదేనం క్షమయా యుక్తమ్ అశక్తం మన్యతే జనః॥ 48
ఓర్పుగలవారిని ప్రజలు చేతకానివాడంటారు. ఓర్పుగల వారి విషయంలో తప్పు ఇది ఒక్కటే. రెండోది దొరకదు. (48)
సోఽస్య దోషో న మంతవ్యః క్షమా హి పరమం బలమ్।
క్షమా గుణో హ్యశక్తానాం శక్తానాం భూషణం క్షమా॥ 49
ఆ తప్పు ఓర్పుకలవాడి దనుకోకూడదు. ఎందుకంటే ఓర్పు గొప్పబలం. అసమర్థులకు ఓర్పు గుణం. (మంచిది). సమర్థులకు ఓర్పు అలంకారం. (49)
క్షమా వసీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే।
శాంతిఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః॥ 50
ఈ ప్రపంచంలో ఓర్పు వశీకరణ మంత్రం లాంటిది. ఓర్పుతో దేన్నయినా సాధించవచ్చు. చేతిలో శాంతి రూపమైన కత్తి ఉన్నవానిని దుర్జనుడు ఏమీ చెయ్యలేడు. (50)
అతృణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి।
అక్షమావాన్ పరం దోషైః ఆత్మానమ్ చైవ యోజయేత్॥ 51
గడ్డి మొలవని చోట పడ్డ నిప్పు దానంతటదే చల్లారుతుంది. ఓర్పులేనివాడు తననూ, ఇతరులనూ తప్పులతో జతపరుస్తాడు. (51)
ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాంతిరుత్తమా।
విద్యైకా పరమా తృప్తిః అహింసైకా సుఖావహా॥ 52
ధర్మమొక్కటే పరమ శ్రేయస్సును కలిగిస్తుంది. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తినిస్తుంది. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూరుస్తుంది. (52)
(పృథివ్యాం సాగరాంతాయాం ద్వావిమౌ పురుషాధమౌ।
గృహస్థశ్చ నిరారంభః సారంభశ్పైవ భిక్షుకః॥
సముద్రం దాకా ఉన్న ఈ భూమిమీద అధములైన పురుషు లీ ఇద్దరే. గృహస్థుడై పనిచేయక కాలక్షేమం చేసేవాడొకడు. సన్యాసియై పనులలో మునిగి తేలే వాడింకొకడు.)
ద్వావిమౌ గ్రసతే భూమిః సర్పో బిలశయానివ।
రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినమ్॥ 53
పుట్ట(కన్నం)లో ఉండే ప్రాణుల్ని(ఎలుకలను) పాములాగా, శత్రువుపై పగసాధించనిరాజును, ఇతర దేశాలను చూడని బ్రాహ్మణునీ ఈ భూమి మింగేస్తుంది. (పుట్టినచోటే నశిస్తారు. కీర్తిని పొందరు.) (53)
ద్వే కర్మణీ నరః కుర్వన్ అస్మింల్లోకే విరోచతే।
అబ్రువన్ పరుషం కించిద్ అసతోఽనర్చయంస్తథా॥ 54
కొంచెంకూడా కఠినంగా మాట్లాడకపోవటం, అట్లాగే చెడ్డవాళ్లను సేవించక పోవటం ఈ రెండు పనులు చేసే మానవుడు లోకంలో ఎంతో ప్రకాశిస్తారు. (54)
దురితంబులు వొరయు పనులు దొఱఁగుట కతసన్-
ద్వానిమౌ పురుషవ్యాఘ్ర పరప్రత్యయకారిణౌ।
స్త్రియః కామితకామిన్యః లోకః పూజిత పూజకః॥ 55
పురుషశ్రేష్ఠా! ఇతర స్త్రీలు కోరిన వారిని కోరే స్త్రీలు, ఇతరులు పూజించిన వానిని పూజించే వ్యక్తి - ఈ ఇద్దరూ ఇతరుల నమ్మకాన్ని బట్టి నడుచుకొంటారు. (55)
ద్వావిమౌ కంటకౌ తీక్ష్ణౌ శరీరపరిశోషిణౌ।
యశ్చాధనః కామయతే యశ్చ కుప్యత్యనీశ్వరః॥ 56
డబ్బులేకుండా కోరుకొంటాడు. అసమర్థుడై కోపగిస్తాడు. వీళ్లిద్దరూ పదునైన ముళ్ళలాగా, తమ శరీరాల్ని తామే శుష్కింప చేసికొంటారు. (56)
ద్వావేవ న విరాజేతే విపరీతేన కర్మణా।
గృహస్థశ్చ నిరారంభః కార్యవాంశ్పైవ భిక్షుకః॥ 57
పనిచేయని గృహస్థుడు, పనులుగల సన్యాసి - ఈ ఇద్దరూ తమ విపరీత ప్రవృత్తి చేత ప్రకాశించరు. (57)
ద్వావిమౌ పురుషా రాజన్ స్వర్గస్యోపరితిష్ఠతః।
ప్రభుశ్చ క్షమయా యుక్తః దరిద్రశ్చ ప్రదానవాన్॥ 58
రాజా! శక్తిమంతుడై ఓర్పుకలవాడు, దాతయైన దరిద్రుడు - ఈ ఇద్దరూ స్వర్గానికి పైన నిలుస్తారు. (58)
న్యాయాగతస్య ద్రవ్యస్య బోద్దవ్యౌ ద్వావతిక్రమౌ।
అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చాప్రతిపాదనమ్॥ 59
న్యాయంగా కూడబెట్టిన డబ్బుకు రెండు విధాల చేటు కలుగుతుంది. అనర్హుడికి ఇవ్వటం, అర్హుడికి ఇవ్వకపోవటం. (59)
ద్వావంభసి నివేష్టవ్యౌ గలే బద్ధ్వా దృఢాం శిలామ్।
ధనవంతమదాతారం దరిద్రం చాతపస్వినమ్॥ 60
దానం చెయ్యని ధనవంతుని, తపస్సు చేయని దరిద్రుని ఈ ఇద్దరినీ మెడకు బండరాయికట్టి నీళ్లలో ముంచెయ్యాలి. (60)
ద్వావిమౌ పురుషవ్యాఘ్ర సూర్యమండల భేదినౌ।
పరివ్రాడ్ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః॥ 61
పురుషశ్రేష్ఠా! యోగరతుడైన సన్యాసి, యుద్ధంలో శత్రువుకెదురొడ్డి పోరాడి చనిపోయినవాడు - ఈ ఇద్దరూ సూర్యమండలమును భేదించుకొని ఉత్తమగతిని చేరుకొంటారు. (61)
త్రయో న్యాయో మనుష్యాణాం శ్రూయంతే భరతర్షభ।
కనీయాన్ మధ్యమః శ్రేష్ఠః ఇతి వేదవిదో విదుః॥ 62
భరతవంశోత్తమా! మనుష్యులకు పని సాధించడంలో ఉత్తమ, మధ్యమ, అధమాలనే మూడు ఉపాయా లున్నవని వేదవేత్తలంటారు. (62)
త్రివిధాః పురుషా రాజన్ ఉత్తమాధమ మధ్యమాః।
నియోజయేద్యథావత్తాన్ త్రివిధేష్వేవకర్మసు॥ 63
రాజా! ఉత్తములు, మధ్యములు, అధములు అని మానవులు మూడు రకాలుగా ఉంటారు. వారిని వారి అర్హత ననుసరించి మూడు విధాలైన ఆయాపనుల్లోనే నియమించాలి. (63)
త్రయ ఏవాధనా రాజన్ భార్యా దాస స్తథా సుతః।
యత్ తే సమధిగచ్ఛంతి యస్య తే తస్య తద్ ధనమ్॥ 64
రాజా! భార్య, సేవకుడు, కొడుకు ఈ ముగ్గురు ధనానికి అధికారులు కారు. ఎవరి అధీనంలో వారున్నారో అతడికి వారు సంపాదించుకొన్నది చెందుతుంది. (64)
హరణం చ పరస్వానాం పరదారాభిమర్శనమ్।
సుహృదశ్చ పరిత్యాగః త్రయో దోషాః క్షయావహాః॥ 65
ఇతరుల సొమ్మును దొంగిలించటం, ఇతరుల భార్యలతో సంపర్కం, మంచి మనసుగల స్నేహితులను వదులుకొనడం, ఈ మూడు దోషాలు మానవుని క్షీణింపచేస్తాయి. (65)
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః।
కామః క్రోధ స్తథా లోభః తస్మాదేతత్ త్రయం త్యజేత్॥ 16
కామం, క్రోధం, లోభం - ఇవి తనను నశింపచేస్తాయి. ఇవి మూడు నరక ద్వారాలు. కావున ఈ మూడింటిని విడిచిపెట్టాలి. (66)
వరప్రదానం రాజ్యం చ పుత్రజన్మ చ భారత।
శత్రోశ్చ మోక్షణం కృచ్ఛ్రాత్ త్రీణి చైకం చ తత్సమమ్॥ 67
వరమివ్వడం, రాజ్యపాలనం, కొడుకును పొందటం ఈ మూడింటితో "శత్రువును కష్టం నుండి తప్పించటం" అనేది సమానం. (67)
భక్తం చ భజమానం చ తవాస్మీతి చ వాదినమ్।
త్రీనేతాన్ శరణం ప్రాప్తాన్ విషమేఽపి న సంత్యజేత్॥ 68
భక్తుడు, సేవిస్తున్నవాడు, నీవాడ నన్నవాడు - తన శరణు చేరిన ఈ ముగ్గురిని తాను కష్టంలో ఉన్నప్పుడు కూడ విడువరాదు. (68)
చత్వారి రాజ్ఞా తు మహాబలేన
వర్జ్యాన్యాహుః పండితస్తాని విద్యాత్।
అల్పప్రజ్ఞైః సహ మంత్రం న కుర్యాత్
న దీర్ఘసూత్రై రభసై శ్చారణైశ్చ॥ 69
తెలివి తక్కువవారితో, పని సాగదీసేవారితో, తొందరపాటుతో చేసేవారితో, స్తోత్రపాఠకులతో రహస్య సమాలోచన చెయ్యకూడదు. ఈ నలుగురిని బలవంతుడైన రాజు విడిచిపెట్టాలి. పండితుడు వాళ్ళను గుర్తించాలి. (69)
చత్వారి తే తాత గృహే వసంతు
శ్రియాభిజుష్టస్య గృహస్థధర్మే।
వృద్ధో జ్ఞాతిరవసన్నః కులీనః
సఖా సదా దరిద్రో భగినీ చానపత్యా॥ 70
తండ్రీ! సంపదకలిగి గృహస్థధర్మంలో ఉన్న నీ ఇంట 1) ముసలివాడైన దాయాది, 2) కష్టంలో ఉన్న ఉత్తమ కులజుడు. 3) పేదయైన మిత్రుడు, 4) సంతానం లేని సోదరి - ఈ నలుగురూ ఉండాలి. (70)
చత్వార్యాహ మహారాజ సాద్యస్కాని బృహస్పతిః।
పృచ్ఛతే త్రిదశేంద్రాయ తానీమాని నిబోధ మే॥ 71
మహారాజా! ఇంద్రుడు అడిగితే అప్పటికప్పుడు ఫలాన్నిచ్చే నాలిగింటిని బృహస్పతి పేర్కొన్నాడు. వాటిని చెపుతా విని. (71)
దేవతానాం చ సంకల్పమ్ అనుభావం చ ధీమతామ్।
వినయం కృతవిద్యానాం వినాశం పాపకర్మణామ్॥ 72
దేవతల సంకల్పం, బుద్ధిమంతుల ప్రభావం, విద్వాంసుల అణకువ, పాపుల వినాశం ఈ నాలుగూ సద్యః ఫలితాన్ని ఇస్తాయి. (72)
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయజ్ఞః॥ 73
నాలుగు పనులు భయాన్ని తొలగిస్తాయి. కూడని విధంగా ఆచరిస్తే భయాన్ని కలుగజేస్తాయి. (అవి) ఆదరంతో అగ్నిని ఉపాసించటం, ఆదరంతో మౌనం వహించటం, ఆదరంతో అధ్యయనం చెయ్యటం, ఆదరంతో యజ్ఞాన్ని ఆచరించటం. ఇవే ఆర్భాటంతో, అనాదరంతో చేస్తే భయం కలిగిస్తాయి. (73)
పంచాగ్నయో మనుష్యేణ పరిచర్యాః ప్రయత్నతః।
పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ భరతర్షభ॥ 74
భరతవంశోత్తమా! తండ్రి, తల్లి, అగ్ని, ఆత్మ, గురువు ఈ ఐదు అగ్నులను మానవుడు ప్రయత్న పూర్వకంగా సేవించాలి. (74)
పంచైవ పూజయంల్లోకే యశః ప్రాప్నోతి కేవలమ్।
దేవాన్ పితౄన్ మనుష్యాంశ్చ భిక్షూనతిథిపంచమాన్॥ 75
దేవతలను, పితరులను, మనుష్యులను, సన్యాసులను, అతిథులను, ఈ ఐదుగురినీ పూజిస్తే చాలు, మానవుడు ఈ లోకంలో కీర్తిని పొందుతాడు. (75)
పంచ త్వానుగమిష్యంతి యత్ర యత్ర గమిష్యసి।
మిత్రాణ్యమిత్రా మధ్యస్థా ఉపజీవ్యోపజీవినః॥ 76
స్నేహితులు, శత్రువులు, తటస్థులు, ఆశ్రయమిచ్చేవారు, ఆశ్రయం పొందేవారు - ఈ ఐదుగురు నీ వెంట వస్తారు. (76)
పంచేంద్రియస్య మర్త్యస్య ఛిద్రం చేదేక మింద్రియమ్।
తతోఽస్య స్రవతి ప్రజ్ఞా దృతేః పాత్రాదివోదకమ్॥ 77
ఐదు జ్ఞానేంద్రియాలు గల మానవుడికి ఒక్క ఇంద్రియం పాడైనా దానివల్ల అతని తెలివి అంతా తోలు తిత్తి నుండి కారే నీళ్ళలా కారిపోతుంది. (77)
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతి మిచ్ఛతా।
నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్ఘసూత్రతా॥ 78
ఈ లోకంలో ఐశ్వర్యాన్ని కోరే వ్యక్తి నిద్ర, కునికిపాట్లు, భయం, కోపం, సోమరితనం, సాచివేత - ఈ ఆరు దోషాలూ విడవాలి. (78)
షడిమాన్ పురుషో జహ్యాద్ భిన్నాం నావమివార్ణవే।
అప్రవక్తారమాచార్యమ్ అనధీయానమృత్విజమ్॥ 79
అరక్షితారం రాజానం భార్యాం చాప్రియవాదినీమ్।
గ్రామకామం చ గోపాలం వనకామం చ నాపితమ్॥ 80
పగిలిననావను సముద్రంలో వదిలేసినట్లు బోధించని గురువును, మంత్రోచ్చారణ చెయ్యని ఋత్విక్కును, ప్రజలను కాపాడని రాజును, ప్రియంగా మాట్లాడని భార్యను, గ్రామంలో ఉండాలనుకొనే గోపాలకుని, (ఆవులను మేపేవాడు) అడవిలో ఉండగోరే మంగలిని - ఈ ఆరుగురినీ మానవుడు విడిచి పెట్టాలి. (79,80)
షడేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన।
సత్యం దానమనాలస్యమ్ అనసూయా క్షమా ధృతి॥ 81
నిజం చెప్పటం, దానం చేయటం, సోమరితనం లేక పోవడం, అసూయ లేకపోవడం, ఓర్పు, చాంచల్ల్యం లేక పోవడం, అనే ఆరుగుణాలను మనిషి ఎప్పటికీ విడువరాదు. (81)
అర్థాగమో నిత్యమరోగితా చ
ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ।
వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా
షడ్ జీవలోకస్య సుఖాని రాజన్॥ 82
రాజా! ధనలాభం, ఆరోగ్యం, అనుకూలవతియైన భార్య, ప్రియంగా మాట్లాడే భార్య, అదుపులో ఉండే కుమారుడు, ధనమిచ్చే చదువు - ఈ ఆరూ మనుష్య లోకంలో సుఖకరాలు. (82)
షణ్ణామాత్మని నిత్యానామ్ ఐశ్వర్యం యోఽధిగచ్ఛతి।
న స పాపైః కుతోఽనర్థైః యుజ్యతే విజితేంద్రియః॥ 83
మనస్సులో ఎల్లవేళలా ఉండే ఆరింటిపై (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములపై) అదుపు కలిగిన ఇంద్రియనిగ్రహ సంపన్నుని పాపాలు దరిచేరవు. ఇక పాపాల వల్ల కలిగే అనర్థాలు ఎలా కలుగుతాయి? (83)
షడిమే షట్ సు జీవంతి సప్తమో నోపలభ్యతే।
చౌరాః ప్రమత్తే జీవంతి వ్యాధితేషు చికిత్సకాః॥ 84
ప్రమదాః కామయానేషు యజమానేషు యాజకాః।
రాజా వివదమానేషు నిత్యం మూర్ఖేషు పండితాః॥ 85
ఆరుగురు ఉన్నందువల్ల ఈ ఆరుగురు ఎప్పుడూ బ్రతుకుతున్నారు. ఏడవవాడు దొరకటం లేదు. ఏమరుపాటు వాడివల్ల దొంగలు, రోగులవల్ల వైద్యులు, కాముకులవల్ల కామినులు, యజ్ఞకర్తల వల్ల పురోహితులు, తగవులాడుకొనేవారి వల్ల రాజులు, మూర్ఖులవల్ల పండితులు జీవిస్తున్నారు. (84,85)
షడిమాని వినశ్యంతి ముహూర్తమనవేక్షణాత్।
గావః సేవా కృషిర్భార్యా విద్యా వృషలసంగతిః॥ 86
గోవులు, సేవకవృత్తి, వ్యవసాయం, భార్య, చదువు, అధర్మపరులతో కలయిక -ఈ ఆరు ముహూర్తకాలం పట్టించుకొనకుండా ఉంటే చాలు నశిస్తాయి. (86)
షడేతే హ్యవమన్యంతే నిత్యం పూర్వోపకారిణమ్।
ఆచార్యం శిక్షితాః శిష్యాః కృతదారాశ్చ మాతరమ్॥ 87
నారీం విగతకామాస్తు కృతార్థాశ్చ ప్రయోజకమ్।
నావం నిస్తీర్ణకాన్తారా ఆతురాశ్చ చికిత్సకమ్॥ 88
చదువు పూర్తిచేసిన శిష్యులు గురువును, పెళ్ళయిన కొడుకులు తల్లిని, కోరికలు తీరిన వాళ్ళు స్త్రీని, పనిసాధించినవాళ్ళు సహాయపడ్డవాళ్లను, ఏరుదాటిన వారు పడవను, రోగం నయమైనవారు వైద్యుణ్ణి - (ఈ ఆరుగురు ముందు ఉపకారం చేసిన వారిని) విడిచిపెడతారు. (87,88)
ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః
సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః।
స్వప్రత్యయావృత్తిరభీతవాసః
షడ్ జీవలోకస్య సుఖాని రాజన్॥ 89
రాజా! రోగాలేవీ లేకపోవటం, అప్పు లేకపోవటం, దేశంకాని దేశంలో నివసించకపోవటం, మంచి మనుషులతో కలయిక, స్వతంత్ర వృత్తితో జీవించటం, భయం లేకుండా నివసించడం - ఈ ఆరూ ఈ లోకంలో సుఖకరాలు. (89)
ఈర్ష్యీ ఘృణీ న సంతుష్టః క్రోధనో నిత్యశంకితః।
పరభాగ్యోపజీవీ చ షడేతే నిత్యదుఃఖితాః॥ 90
ఈర్ష్యపడేవాడు, దీనుడు, సంతోషం లేనివాడు, ముక్కోపి, ఎప్పుడూ శంకించేవాడు, ఇతరుల భాగ్యంమీద ఆధారపడి బ్రతికేవాడు - ఈ ఆరుగురూ ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు. (90)
సప్తదోషాః సదా రాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాః।
ప్రాయశో యైర్వినశ్యంతి కృతమూలా ఆపీశ్వరాః॥ 91
స్త్రియోఽక్షా మృగయా పానం వాక్పారుష్యం చ పంచమమ్।
మహచ్చ దండపారుష్యమ్ అర్థదూషణమేవ చ॥ 92
దుఃఖాల్ని కలిగించే స్త్రీలపై ఆసక్తి, జూదం, వేటాడటం, మద్యపానం, కఠినంగా మాట్లాడటం, చాలా కఠినంగా శిక్షించటం, డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యటం అనే ఏడు దోషాలనూ రాజు విడిచిపెట్టాలి. బాగా స్థిరపడ్డ రాజులు కూడా తరచుగా వీటివల్ల నశిస్తారు. (91,92)
అష్టౌ పూర్వనిమిత్తాని నరస్య వినశిష్యతః।
బ్రాహ్మణాన్ ప్రథమం ద్వేష్టి బ్రాహ్మణైశ్చ విరుధ్యతే॥ 93
బ్రాహ్మణస్వాని చాదత్తే బ్రాహ్మణాంశ్చ జిఘాంసతి।
రమతే నిందయా చైషాం ప్రశంసాం నాభినందతి॥ 94
నైనాన్ స్మరతి కృత్యేషు యాచితశ్చాభ్యసూయతి।
ఏతాన్ దోషాన్ వరః ప్రాజ్ఞః బుధ్యేద్ బుద్ధ్వా విసర్జయేత్॥ 95
నశించబోయే మానవుడికి, ముందు శకునాల్లాంటివి ఎనిమిది ఉన్నాయి. 1) మొదట బ్రాహ్మణులను ద్వేషిస్తాడు. 2) బ్రాహ్మణులతో తగవుపడతాడు. 3) బ్రాహ్మణుల సొమ్ము కాజేస్తాడు. 4) బ్రాహ్మణులను చంపాలనుకొంటాడు. 5) వారినిందచే ఆనందిస్తాడు. 6) వారి ప్రశంసను మెచ్చుకొనలేడు. 7) యజ్ఞయాగాదులందు వారిని స్మరించడు. 8) ఏదైనా అడిగినప్పుడు దోషారోపణ చేస్తాడు. బుద్ధిశాలి అయిన మానవుడు వీటిని దోషాలుగా గుర్తించాలి. గుర్తించి విడిచి పెట్టాలి. (93,94,95)
అష్టావిమాని హర్షస్య నవనీతాని భారత।
వర్తమానాని దృశ్యంతే తాన్యేవ స్వసుఖాన్యపి॥ 96
సమాగమశ్చ సఖిభిః మహాంశ్పైవ ధనాగమః।
పుత్రేణ చ పరిష్వంగః సంనిపాతశ్చ మైథునే॥ 97
సమయే చ ప్రియాలాపః స్వయూథ్యేషు సమున్నతిః।
అభిప్రేతస్య లాభశ్చ పూజా చ జనసంసది॥ 98
భరతవంశీయుడా! మిత్రులతో కలయిక, ధనలాభం, కొడుకు కౌగిలింత, రతి సుఖం, సమయానికి తగినట్లు ప్రియంగా మాటలాడటం, జన సమూహంలో సత్కరింపబడటం - ఈ ఎనిమిదీ సంతోష కారణాలు. అవే తనకు సుఖకరాలు కూడా. (96,97,98)
అష్టౌ గుణాః పురుషం దీపయంతి
ప్రజ్ఞా చ కౌల్యం చ దమః శ్రుతం చ।
పరాక్రమ శ్చాబహుభాషితా చ
దానం యథాశక్తి కృతజ్ఞతా చ॥ 99
తెలివితేటలు, సత్కులంలో పుట్టడం, ఇంద్రియ నిగ్రహం, శాస్త్రజ్ఞానం, పరాక్రమం, మితంగా మాట్లాడటం, శక్తిననుసరించి దానం చేయడం, చేసిన మేలు మరువకపోవడం - అనే ఈ ఎనిమిది గుణాలూ మానవుని కీర్తిని పెంచుతాయి. (99)
నవద్వారమిదం వేశ్మ త్రిస్థూణం పంచసాక్షికమ్।
క్షేత్రజ్ఞాధిష్ఠితం విద్వాన్ యో వేద స పరః కవిః॥ 100
తొమ్మిది ద్వారములు (తొమ్మిది రంధ్రములు), మూడు స్తంభములు (సత్త్వ, రజ, స్తమోగుణములు మూడు), ఐదుగురు సాక్షులు(ఐదు జ్ఞానేంద్రియములు) కల, ఆత్మకు(క్షేత్రజ్ఞునకు) నివాసమైన ఈ శరీరరూపమైన ఇంటిని తెలుసుకొన్నవాడు గొప్ప జ్ఞాని. (100)
దశ ధర్మం న జానంతి ధృతరాష్ట్ర నిబోధ తాన్।
మత్తః ప్రమత్త ఉన్మత్తః శ్రాంతః క్రుద్ధో బుభుక్షితః॥ 101
త్వరమాణశ్చ లుబ్ధశ్చ భీతః కామీ చ తే దశ।
తస్మాదేతేషు సర్వేషు న ప్రసజ్జేత పండితః॥ 102
ధృతరాష్ట్రా! మత్తక్కినవాడు, జాగరూకత లేనివాడు, పిచ్చివాడు, అలసిపోయినవాడు, కోపంతో ఉన్నవాడు, ఆకలిగొన్నవాడు, తొందరపాటు కలవాడు, పిసినారి, భయస్థుడు, కాముకుడు - ఈ పదిమంది ధర్మాన్ని గుర్తించలేరు. కాబట్టి పండితుడు వీరితో కలవకూడదు. (101,102)
అత్రైవోదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
పుత్రార్థమసురేంద్రేణ గీతం చైవ సుధన్వనా॥ 103
ఈ విషయంలోనే రాక్షసరాజు ప్రహ్లాదుడు సుధన్వుడితో కలిసి తన కొడుకు కోసం చెప్పిన పురాతనమైన ఇతిహాసాన్ని ఉదహరిస్తున్నారు. (103)
యః కామమన్యూ ప్రజహాతి రాజా
పాత్రే ప్రతిష్ఠాపయతే ధనం చ।
విశేషవిచ్ఛ్రుతవాన్ క్షిప్రకారీ
తం సర్వలోకః కురుతే ప్రమాణమ్॥ 104
కామక్రోధాల్నీ విడిచిన రాజును, అర్హత కలవాడికి ధనమిచ్చేవానిని, విశేషంగా తెలిసిన వానిని, శాస్త్రాలు తెలిసిన వానిని, కర్తవ్యాన్ని త్వరగా పూర్తిచేసే వానిని లోకమంతా ప్రమాణంగా పెట్టుకొంటుంది. (104)
జానాతి విశ్వాసయితుం మనుష్యాన్
విజ్ఞాతదోపేషు దధాతి దండమ్।
జానాతి మాత్రాం చ తథా క్షమాం చ
తం తాదృశం శ్రీర్జుషతే సమగ్రా॥ 105
మనుష్యుల్ని నమ్మించటం తెలిసిన వానిని, నేరం రుజువైన వాళ్ళకు తగినశిక్ష విధించే వానిని, శిక్ష యొక్క స్థాయి తెలిసిన వానిని, అలాగే ఓర్పు గురించి తెలిసిన వానిని సమగ్రమైన సంపద చేరుకుంటుంది. (105)
సుదుర్బలం నానజానాతి కంచిద్
యుక్తో రిపుం సేవతే బుద్ధి పూర్వమ్।
న విగ్రహం రోచయతే బలస్థైః
కాలే చ యో విక్రమతే స ధీరః॥ 106
బలహీనుని అవమానించడు. జాగరూకుడై బుద్ధిపూర్వకంగా శత్రువుతో వ్యవహరిస్తాడు. బలవంతులతో వైరం ఇష్టపడడు. తగిన సమయంలో పరాక్రమం చూపుతాడు. ఇలాంటి వాడు ధీరుడు. (106)
ప్రాప్యాపదం న వ్యథతే కదాచిత్
ఉద్యోగమన్విచ్ఛతి చాప్రమత్తః।
దుఃఖం చ కాలే సహతే మహాత్మా
ధురంధరస్తస్య జితాః సపత్నాః॥ 107
కార్యభారం గల మహాత్ముడు ఆపదలో చిక్కుకొన్నా ఎపుడూ బాధ పడడు. జాగరూకుడై కార్యసాధనకై ప్రయత్నిస్తాడు. సమయాన్ని బట్టి దుఃఖాన్ని అదుపు చేసుకొంటాడు. అతడు శత్రువులను జయించి తీరుతాడు. (107)
అనర్థకం విప్రవాసం గృహేభ్యః
పాపైః సంధిం పరదారాభిమర్శమ్।
దంభం స్తైన్యం పైశునం మద్యపానం
న సేవతే యశ్చ సుఖీ సదైవ॥ 108
ఇల్లు విడచి ప్రయోజనం లేకుండా విదేశాల్లో నివసించడం, పాపులతో కలవటం, పరస్త్రీల పొంది, డాంబికత(డాబు), దొంగతనం, పిసినారితనం, మద్యపానం - వీటికి దగ్గరకాని వాడు(సదాసుఖి) ఎప్పుడూ సుఖపడేవాడే. (108)
న సంరంభేణారభతే త్రివర్గం
ఆకారితః శంసతి తత్త్వమేవ।
న మిత్రార్థే రోచయతే వివాదం
నాపూజితః కుప్యతి చాప్యమూఢః॥ 109
న యోఽభ్యసూయత్యనుకంపతే చ
న దుర్బలః ప్రాతిభావ్యం కరోతి।
నాత్యాహ కించిద్ క్షమతే వివాదం
సర్వత్ర తాదృగ్ లభతే ప్రశంసామ్॥ 110
కోపంతో ధర్మ, అర్థ, కామాల్ని మొదలుపెట్టనివాడు, అడిగినప్పుడు యథార్థమునే చెప్పేవాడు. స్నేహితులతో వివాదం పెట్టుకోనివాడు, గౌరవింపబడకపోయినా కోపగించు కోనివాడు, వివేకం కోల్పోనివాడు, ఇతరుల తప్పు లెన్ననివాడు, అందరిపై దయ చూపేవాడు, బలహీనుడై ఇతరులతో తగవు పడని వాడు, కొంచెంకూడ అధిక ప్రసంగం చెయ్యనివాడు, వివాదంలో ఓర్పు చూపేవాడు అంతటా ప్రశంసింపబడతాడు. (109,110)
యో నోద్ధతం కురుతే జాతు వేషం
న పౌరుషేణాపి వికత్థతేఽన్యాన్।
న మూర్ఛితః కటుకాన్యాహ కించిత్
ప్రియం సదా తం కురుతే జనో హి॥ 111
ఒకప్పుడైనా ఠీవిని ప్రదర్శించే వేషం వెయ్యని వానిని, పరాక్రమం కలిగి కూడ ఇతరుల ఎదుట ఆత్మస్తుతి చేసుకొనని వానిని, ఓళ్ళు తెలియనివాడై కఠినమైన మాటలు కొద్దిగా కూడా మాట్లాడని వానిని జనం ఎప్పుడూ ప్రేమిస్తారు. (111)
న వైరముద్దీపయతి ప్రశాంతం
న దర్పమారోహతి నాస్తమేతి।
న దుర్గతోఽస్మీతి కరోత్యకార్యం
తమార్యశీలం పరమాహురార్యామ్॥ 112
చల్లారిన వైరం రగిలించని వానిని, పొగరెక్కని, వానిని క్రుంగిపోని వానిని, నాకు చెడుదాపురించిందనుకొంటూ చెయ్యకూడని పని చెయ్యని వానిని, శుభమైన ప్రవర్తన కలవానిని పెద్దలు అందరితోను శ్రేష్ఠుడంటారు. (112)
న స్వే సుఖే వై కురుతే ప్రహర్షం
నాన్యస్య దుఃఖే భవతి ప్రహృష్టః।
దత్త్వా న పశ్చాద్ కురుతేఽనుతాపం
స కథ్యతే సత్పురుషార్యశీలః॥ 113
తన సుఖానికి పొంగిపోడు. ఇతరుల దుఃఖానికి పొంగిపోడు. దానం చేసి పశ్చాత్తాపపడడు. అతడు సజ్జనులలో సత్ప్రవర్తన కలవాడు. (113)
దేశాచారాన్ సమయాన్ జాతిధర్మాన్
బుభూషతే యః స పరావరజ్ఞః।
స యత్ర తత్రాభిగతః సదైవ
మహాజనస్యాధిపత్యం కరోతి॥ 114
ఆయా దేశాచారాలను, కట్టుబాట్లను, జాతుల ధర్మాలను (మాతాల్ని) అవగాహన చేసుకొన్నవాడు హెచ్చుతగ్గు తేడా తెలుసుకొన్న వాడు ఎక్కడికి వెళ్లినా, ఎప్పుడూ జనసమూహంపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకోగలుగుతాడు. (114)
దంభం మోహం మత్సరం పాపకృత్యం
రాజద్విష్టం పైశునం పూగవైరమ్।
మత్తోన్మతైర్దుర్జవైశ్చాపి వాదం
యః ప్రజ్ఞావాన్ వర్జయేత్ స ప్రధానః॥ 115
ఆడంబరం, భ్రాంతి, ద్వేషం, పాపపుపని చెయ్యటం, రాజద్రోహం తలపెట్టడం, పిసినారితనం, సంఘవైరం, పొగరుబోతులతో, పిచ్చివాళ్ళతో చెడ్డవాళ్ళతో వాదం - ఇవన్నీ వదులుకొన్నవాడు ప్రజ్ఞాశాలి. (115)
దానం హోమం దైవతం మంగలాని
ప్రాయశ్చిత్తాన్ వివిధాన్ లోకవాదాన్।
ఏతాని యః కురుతే నైత్యకాని
తస్యోత్థానం దేవతా రాధయంతి॥ 116
దానం, హోమం, దేవతార్చన, శుభకార్యాలు, ప్రాయశ్చిత్తాలు, అనేకవిధాలైన లోకాచారాలను దైనందిన కార్యక్రమాలుగా పెట్టుకొన్న వాడికి దేవతలు దీప్తి నిస్తారు. (116)
సమైర్వివాహం కురుతే న హీనైః
సమైః సఖ్యం వ్యవహారం కథాం చ।
గుణైశిష్టాంశ్చ పురో దధాతి
విపశ్చితస్తస్య నయాః సునీతాః॥ 117
హీనులను విడిచి సమానులతోనే వివాహం, స్నేహం, వ్యవహారం, సంభాషణ చేస్తూ, విశిష్టవ్యక్తులను ముందుంచుకొనే పండితుని నీతులు ప్రయోజనాలను సిద్ధింపచేస్తాయి. (117)
మితం భుంక్తే సంవిభజ్యాశ్రితేభ్యః
మితం స్వపిత్యమితం కర్మ కృత్వా।
దదాత్యమిత్రేష్వపి యాచితస్సన్
తమాత్మవంతం ప్రజహాత్యనర్థాః॥ 118
తనను ఆశ్రయించిన వాళ్ళకు పంచి ఇచ్చి మితంగా తింటాడు. ఎక్కువ పనిచేసి తక్కువ నిద్రిస్తాడు. అడిగితే శత్రువులకైనా ఇస్తాడు. అలాంటి ఆత్మగుణ సంపన్నుణ్ణి అనర్థాలు విడిచిపెడతాయి. (118)
చికీర్షితం విప్రకృతం చ యస్య
నాన్యో జనాః కర్మ జానంతి కించిత్।
మంత్రే గుప్తే సమ్యగనుష్ఠితే చ
నాల్పోఽప్యస్య చ్యవతే కశ్చిదర్థః॥ 119
ఆ ఆత్మవంతుడు తనకు ఇష్టమైన దానికి పూనుకొన్నా, శత్రువుకు అనిష్ట కార్యం చేయదలచుకొన్నా ఎవరికీ తెలియనివ్వడు. అతని మంత్రాలోచనం కాని, ఆచరణం కాని కొద్దిగా కూడా వ్యర్థం కాదు. (119)
యః సర్వభూతప్రశమే నివిష్టః
సత్యో మృదుర్మానకృచ్ఛుద్ధభావః।
అతీవ స జ్ఞాయహే జ్ఞాతిమధ్యే
మహామణిర్జాత్య ఇవ ప్రసన్నః॥ 120
ప్రాణులన్నింటికి శాంతిని కలిగించే ఆసక్తితో, నిజమునే పలుకుతూ, మృదు స్వభావంతో ఇతరులను గౌరవిస్తూ, పవిత్రమైన ఆశయం కలవాడు సాటివారిలో జాతి రత్నం వలె చాలా ప్రసిద్ధిని పొందుతాడు. (120)
య ఆత్మనాపత్రపతే భృశం నరః
స సర్వలోకస్య గురుర్భవత్యుత।
అనంతతేజాః సుమనాః సమాహితః
స తేజసా సూర్య ఇవావభాసతే॥ 121
(ఇతరులచే గుర్తింపబడనివైనా) తన తప్పులకు తానే మిక్కిలి సిగ్గుపడు మానవుడు లోకమంతటికీ గురువౌతాడు. అంతులేని తేజస్సు, శుద్ధమైన మనస్సు, ఏకాగ్రత కల అతడు తన కాంతితో సూర్యుడిలా ప్రకాశిస్తాడు. (121)
వనే జాతాః శాపదగ్ధస్య రాజ్ఞః
పాండోః పుత్రాః పంచ పంచేంద్రకల్పాః।
త్వయైవ బాలా వర్ధితాః శిక్షితాశ్చ
తవాదేశం పాలయంత్యాంబికేయ॥ 122
అంబికా! కుమారా! (మృగరూపాన్ని ధరించిన కిందముడు అను ఋషి) శాపదగ్ధుడయిన పాండురాజు కుమారులైదుగురు అడవిలో పుట్టారు. ఐదుగురు ఇంద్రుల్లాంటివారు. చిన్నతనంలో నీవే పెంచావు. విద్యాబుద్ధులు నేర్పించావు. నీ ఆజ్ఞను వారు పాటిస్తున్నారు. (122)
ప్రదాయైషాముచితం తాత రాజ్యం
సుఖీ పుత్రైః సహితో మోదమానః।
న దేవానాం నాపి చ మానుషాణాం
భవిష్యసి త్వం తర్కణీయో నరేంద్రః॥ 123
తండ్రీ! అలాంటి వాళ్ళకు తగిన విధంగా రాజ్యమిచ్చి నీ కొడుకులతో కలసి ఆనందిస్తూ సుఖపడు. రాజా! అలా చేస్తే నిన్ను దేవతలూ, మనుషులూ కూడ శంకింపరు. (123)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురనీతివాక్యే త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదురనీతివాక్యమను ముప్పది మూడవ అధ్యాయము. (33)
(దాక్షిణాత్య అధికపాఠం 6 శ్లోకాలు కలిపి మొత్తం 129 శ్లోకాలు)