35. ముప్పది ఐదవ అధ్యాయము

విదురుడు నీతి నుపదేశించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
బ్రూహి భూయో మహాబుద్ధే ధర్మార్థసహితం వచః।
శృణ్వతో నాస్తి మే తృప్తిః విచిత్రాణీహ భాషసే॥ 1
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. తెలివైనవాడా! మళ్ళీ ధర్మం, అర్థం కలబోసుకొన్న మాటలు చెప్పు. వింటున్న నాకు తనివి తీరటం లేదు. విలక్షణమైన మాటలు చెప్తున్నావు. (1)
విదుర ఉవాచ
సర్వతీర్థేషు వా స్నానం సర్వభూతేషు చార్జవమ్।
ఉభే త్వేతే సమే స్యాతామ్ ఆర్జవం వా విశిష్యతే॥ 2
విదురుడు చెపుతున్నాడు.
పుణ్యజలా లన్నింటిలో స్నానం చెయ్యడం, అన్ని ప్రాణులపట్ల సరళంగా ప్రవర్తించడం, ఈ రెండూ సమానమే అయినా అందరిపట్ల సరళ భావం విశిష్టమైంది. (2)
ఆర్జవం ప్రతిపద్యస్వ పుత్రేషు సతతం విభో।
ఇహ కీర్తిం పరాం ప్రాప్య ప్రేత్య స్వర్గమవాప్స్యసి॥ 3
ప్రభూ! కుమారుల విషయంలో ఎల్లప్పుడూ సమభావాన్ని పాటించు. ఈ లోకంలో కీర్తిని పొంది, మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందగలుగుతావు. (3)
యావత్కీర్తిర్మనుష్యస్య పుణ్యా లోకే ప్రగీయతే।
తావత్ స పురుషవ్యాఘ్ర స్వర్గలోకే మహీయతే॥ 4
పురుషశ్రేష్ఠా! మనిషియొక్క కీర్తి ఈ లోకంలో కొనియాడబడినంత కాలం అతడు స్వర్గలోకంలో గొప్పగా ఉంటాడు. (4)
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
విరోచనస్య సంవాదం కేశిన్యర్థే సుధన్వనా॥ 5
పూర్వం కేశినికోసం సుధన్వునితో విరోచనుడికి జరిగిన సంభాషణను, ఈ విషయంలో ఉదాహరణగా చెపుతున్నారు. (5)
స్వయంవరే స్థితా కన్యా కేశినీ నామ నామతః।
రూపేణాప్రతిమా రాజన్ విశిష్టపతికామ్యయా॥ 6
సాటిలేని అందం కల కేశిని అనే కన్య విశిష్టమైన వ్యక్తిని భర్తగా పొందాలని స్వయంవరంలో నిలిచింది. (6)
విరోచనోఽథ దైతేయః తదా తత్రాజగామ హ।
ప్రాప్తుమిచ్ఛంస్తతస్తత్ర దైత్యేంద్రం ప్రాహ కేశినీ॥ 7
అప్పుడక్కడికి ఆమెను పొందాలనే కోరికతో విరోచనుడనే రాక్షసుడు వచ్చాడు. అపుడామె రాక్షసునితో ఇలా అంది. (7)
కేశిన్యువాచ
కిం బ్రాహ్మణాః స్విచ్ఛ్రేయాంసః దితిజాః స్విద్ విరోచన।
అథ కేన స్మ పర్యంకం సుధన్వా నాధిరోహతి॥ 8
కేశిని ఇలా అన్నది. విరోచనా! బ్రాహ్మణులు శ్రేష్ఠులా? రాక్షసులు శ్రేష్ఠులా? అయితే, ఏ కారణం చేత సుధన్వుడు నా పానువు ఎక్కకూడదు? (8)
విరోచన ఉవాచ
ప్రాజాపత్యాస్తు వై శ్రేష్ఠా వయం కేశిని సత్తమాః।
అస్మాకం ఖల్విమే లోకాః కే దేవాః కే ద్విజాతయః॥ 9
విరోచనుడు చెప్తున్నాడు. కేశినీ! మేం ప్రజాపతి సంతానం కాబట్టి శ్రేష్ఠులం, అందరికన్న ఉత్తములం. ఈలోకాలన్నీ మావి కదా! (మాముందు) దేవతలెవరు? బ్రాహ్మణులెవరు? (9)
కేశిన్యువాచ
ఇహైవానాం ప్రతీక్షావః ఉపస్థానే విరోచన।
సుధన్వా ప్రాతరాగంతా పశ్యేయం వాం సమాగతౌ॥ 10
కేశిని అన్నది - విరోచనా! మనమిద్దరం ఇక్కడే ఎదురుచూద్దాం. సుధన్వుడు రేపు ప్రొద్దుటే వస్తాడు. ఒక చోట కలిసిన మీ ఇద్దర్నీ చూస్తాను. (10)
విరోచన ఉవాచ
తథా భద్రే కరిష్యామి యథా త్వం భీరు భాషసే।
సుధన్వానం చ మాం చైవ ప్రాతర్ ద్రష్టాసి సంగతౌ॥ 11
విరోచనుడన్నాడు. పిరికిదానా! నీ వన్నట్లే చేస్తాను. ఒకే చోట కలిసిన సుధన్వునీ, నన్నూ రేపు ప్రొద్దున చూద్దువుగానిలే. (11)
విదుర ఉవాచ
అతీతాయాం చ శర్వర్యామ్ ఉదితే సూర్యమండలే।
అథాజగామ తం దేశం సుధన్వా రాజసత్తమ।
విరోచనో యత్ర విభో కేశిన్యా సహితః స్థితః॥ 12
విదురుడు ఇలా అన్నాడు. రాజశ్రేష్ఠా! ప్రభూ! రాత్రి గడిచి సూర్యుడు ఉదయించిన పిమ్మట కేశిని, విరోచనుడూ ఉన్న చోటుకు సుధన్వుడు వచ్చాడు. (12)
సుధన్వా చ సమాగచ్ఛత్ ప్రాహ్లాదిం కేశినీం తథా।
సమాగతం ద్విజం దృష్ట్వా కేశినీ భరతర్షభ।
ప్రత్యుత్థాయాసనం తస్మై పాద్యమర్ఘ్యం దదౌ పునః॥ 13
భరతవంశోత్తమా! సుధన్వుడు విరోచనునీ, కేశినినీ చేరుకొన్నాడు. వచ్చిన బ్రాహ్మణుని చూసి కేశిని లేచి ఎదురుగా వెళ్లి ఆసనాన్ని, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు, పూజా ద్రవ్యాలు సమర్పించింది. (13)
సుధన్వోవాచ
అన్వాలభే హిరణ్మయం ప్రాహ్లాదే తే వరాసనమ్।
ఏకత్వ ముపసంపన్నః న త్వా సేఽహం త్వయా సహ॥ 14
సుధన్వుడు ఇలా అన్నాడు. ప్రహ్లాదకుమారా! నీకు శ్రేష్ఠమైన బంగారు ఆసనాన్ని అమరుస్తాను. సమానుడననే భావంతో నీతో కలిసి కూర్చోను. (14)
విరోచన ఉవాచ
తవార్హతే తు ఫలకం కూర్చం వాప్యథవా బృసీ।
సుధన్వన్ న త్వమర్హోఽసి మయా సహ సమాసనమ్॥ 15
విరోచనుడన్నాడు. సుధన్వా! నీకు చెక్కపీటగాని దర్భాసనంగాణి సరిపోతుంది. నాతో కలసి సమానంగా ఆసనం మీద కూర్చోటానికి నీవు తగవు. (15)
సుధన్వోవాచ
పితాపుత్రౌ సహాసీతాం ద్వౌ విప్రౌ క్షత్రియావపి।
వృద్ధౌ వైశ్యౌ చ శూద్రౌ చ న త్వన్యావితరేతరమ్॥ 16
సుధన్వుడన్నాడు. తండ్రీకొడుకులు, ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు ముసలి వైశ్యులు, ఇద్దరు ముసలి శూద్రులు కలసి కూర్చోవచ్చు. ఇతరులు ఇద్దరు కలిసి కూర్చోకూడదు. (16)
పితా హి తే సమాసీనం ఉపాసీతైవ మామధః।
బాలః సుఖైధితో గేహే న త్వం కించన బుధ్యసే॥ 17
ఆసనంపై కూర్చున్న నన్ను నీ తండ్రి క్రింద కూర్చొని సేవిస్తాడు. పసివాడివి ఇంట్లో సుఖంగ పెరిగావు. ఈ విషయం కొంచెం కూడా నువ్వేరగవు. (17)
హిరణ్యం చ గవాశ్వం చ యద్విత్తమసురేషు నః।
సుధన్వన్ విపణే తేన ప్రశ్నం పృచ్ఛావ యే విదుః॥ 18
సుధన్వా! మారాక్షసుల దగ్గరున్న సేన, గోహయాది ధనాన్ని అంతా పందెం పెడుతున్నాను. మన మిద్దరం వెళ్లి ఈ విషయం తెలిసిన వారిని "మా యిద్దరిలో ఎవరు గొప్ప" అని అడుగుదాం. (18)
సుధన్వోవాచ
హిరణ్యం చ గవాశ్వం చ తవైవాస్తు విరోచన।
ప్రాణయోస్తు పణం కృత్వా ప్రశ్నం పృచ్ఛావ యే విదుః॥ 19
సుధన్వుడన్నాడు. విరోచనా! బంగారం, ఆవులు, గుర్రాలు, నీకే ఉండనీ, మన ఇద్దరి ప్రాణాల్ని పందెంగా పెట్టి తెలిసిన వారి నడుగుదాం. (19)
విరోచన ఉవాచ
ఆవాం కుత్ర గమిష్యావః ప్రాణయోర్విపణే కృతే।
న తు దేవేష్వహం స్థాతా న మనుష్యేషు కర్హిచిత్॥ 20
విరోచనుడు అన్నాడు. మన మిద్దరం ప్రాణాలను పందెం పెట్టిన తర్వాత ఎక్కడకు వెడదాం? నేనా దేవతల దగ్గరికి, ఎవరో మనుష్యుల దగ్గరికి ఎప్పటికీ వెళ్ళను. (20)
సుధన్వోవాచ
పితరం తే గమిష్యావః ప్రాణయోర్విపణే కృతే।
పుత్రస్యాపి స హేతోర్హి ప్రహ్లాదో నానృతం వదేత్॥ 21
సుధన్వుడన్నాడు. ప్రాణాల్ని పందెం పెట్టిన మన మిద్దరం నీ తండ్రి దగ్గరికి వెడదాం. ఆ ప్రహ్లాదుడు కొడుకుకోసం కూడా అబద్ధం చెప్పడు. (21)
విదుర ఉవాచ
ఏవం కృతపణౌ క్రుద్ధౌ తత్రాభిజగ్మతుస్తదా।
విరోచనసుధన్వానౌ ప్రహ్లాదో యత్ర తిష్ఠతి॥ 22
విదురుడు చెప్పాడు. ఇలా పందెం వేసుకుని ఒకరిమీద మరొకరు కోపంతో విరోచన సుధన్వులిద్దరూ ప్రహ్లాదుడున్న చోటికి వెళ్ళారు. (22)
ప్రహ్లాద ఉవాచ
ఇమౌ తౌ సంప్రదృశ్యేతే యాభ్యాం న చరితం సహ।
ఆశీవిషావివ క్రుద్ధౌ ఏకమార్గా విహాగతౌ॥ 23
ప్రహ్లాదుడు అన్నాడు...ఎన్నడూ కలిసి తిరుగని ఈ ఇద్దర్రూ కలిసి త్రాచుపాముల లాగా కోపంతో ఒకే దారిలో ఇక్కడికి వచ్చారు. (23)
కిం వై సహైవం చరథః న పురా చరథః సహ।
విరోచనైతత్ పృచ్ఛామి కిం తే సఖ్యం సుధన్వనా॥ 24
విరోచనా! ఇంతకు ముందెప్పుడూ కలిసి మీరిద్దరీ తిరుగలేదు. ఇలా కలిసి త్రిరుగుతున్నా రేమిటని అడుగుతున్నాడు. సుధన్వుడితో నీకు స్నేహం ఏర్పడిందేమిటి? (24)
విరోచన ఉవాచ
న మే సుధన్వనా సఖ్యం ప్రాణయోర్విపణావహే।
ప్రహ్లాద తత్త్వం పృచ్ఛామి మా ప్రశ్న మనృతం వదేః॥ 25
విరోచనుడన్నాడు. తండ్రీ ప్రహ్లాదా! నాకు సుధన్వుడితో స్నేహం లేదు. మేమిద్దరం ప్రాణాలను పందెంగా పెట్టుకున్నాం. నిజం(తెలుసుకోవాలని) అడుగుతున్నాను. నేను వేసిన ప్రశ్నకు అబద్ధం చెప్పకు. (25)
ప్రహ్లాద ఉవాచ
ఉదకం మధుపర్కం వాప్యానయంతు సుధన్వనే।
బ్రహ్మన్నభ్యర్చనీయోఽసి శ్వేతా గౌః పీవరీ కృతా॥ 26
ప్రహ్లాదుడన్నాడు - సుధన్వుడికోసం నీళ్ళను, మధుపర్కాన్ని తీసుకురండి. బ్రహ్మస్వరూపా! పూజింపతగిన వాడివి. బలిసిన తెల్లని ఆవు నీకోసం(దానమివ్వటానికి) సిద్ధం చెయ్యబడింది. (26)
సుధన్వోవాచ
ఉదకం మధుపర్కం చ పథిష్వేవార్పితం మమ।
ప్రహ్లాద త్వం తు మే తథ్యం ప్రశ్నం ప్రబ్రూహి పృచ్ఛతః।
కిం బ్రాహ్మణాః స్విచ్ఛ్రేయాంసః ఉతాహో స్విద్ విరోచనః॥ 27
సుధన్వుడడిగాడు. ప్రహ్లాద! నాకు నీళ్ళు, మధుపర్కం దారిలోనే అందాయి. నీవు నేనడిగే ప్రశ్నకు నిజమ్గా సమాధానం చెప్పు. బ్రాహ్మణులు శ్రేష్ఠులా? లేక విరోచనుడా? (27)
ప్రహ్లాద ఉవాచ
పుత్ర ఏకో మమ బ్రహ్మన్ త్వం చ సాక్షాదిహాస్థితః।
తయోర్వివదతోః ప్రశ్నం కథమస్మద్విధో వదేత్॥ 28
ప్రహ్లాదుడు చెప్పాడు - బ్రహ్మస్వరూపా! నాకు ఒక్కడే కొడుకు. నీవు స్వయంగా ఇక్కడ ఉన్నావు. తగవులాడుకొంటున్న మీఇద్దరిప్రశ్నకు నాలాంటివాడు ఎలా సమాధానం చెప్పగలడు? (28)
సుధన్వోవాచ
గాం ప్రదద్యాస్థౌరసాయ యద్వాన్యత్ స్యాత్ ప్రియం ధనమ్।
ద్వయోర్వివదతోస్తథ్యం వాచ్యం చ మతిమంస్త్వయా॥ 29
సుధన్వుడన్నాడు - బుద్ధిమంతుడా! ఆవునూ లేదా ఇష్టమైన సంపదను నీ కన్న కొడుక్కిఇచ్చుకో. కాని తగవు లడుకొంటున్న మా ఇద్దరికీ నీవు నిజమే చెప్పాలి. (29)
ప్రహ్లాద ఉవాచ
అథ యో నైవ ప్రబ్రూయాత్ సత్యం వా యది వానృతమ్।
ఏతత్ సుధన్వన్ పృచ్ఛామి దుర్వివక్తా స్మ కిం వసేత్॥ 30
ప్రహ్లాదుడడిగాడు - సుధన్వా! ఒకవేళ నిజమో, అబద్ధమో ఏదీ చెప్పడనుకో - అలా చెడుగా చెప్పేవాడు ఏమౌతాడో అడుగుతున్నాను. (30)
సుధన్వోవాచ
యాం రాత్రిమధివిన్నా స్త్రీ యాం చైవాక్షపరాజితః।
యాం చ భారాభితప్తాంగః దుర్వివక్తా స్మ తాం వసేత్॥ 31
సుధన్వుడు చెప్పాడు - (వేరొక స్త్రీ మోజులో పడ్డ) భర్త యొక్క నిరాదరణకు గురియైన స్త్రీ, జూదంలో ఓడిపోయినవాడు, బరువు మోసి జ్వరం వచ్చినవాడూ పొందే వేదనాభరితమైన రాత్రిని దుర్వక్త, అసత్యవాది పొందుతాడు. (31)
నగరే ప్రతిరుద్ధః సన్ బహిర్ద్వారే బుభుక్షితః।
అమిత్రాన్ భూయసః పశ్యేద్ యః సాక్ష్యమనృతం వదేత్॥ 32
తప్పుడు సాక్ష్యం చెప్పేవాడు నగరంలో నిర్బంధించబడి, వెలుపల వాకిలి వద్ద ఆకలి బాధతో నిలిచి శత్రువుల్ని చూసే వాని దురవస్థను పొందుతాడు. (32)
పంచ పశ్వనృతే హంతి దశ హంతి గవానృతే।
శతమశ్వానృతే హంతి సహస్రం పురుషానృతే॥ 33
పశువుల కోసం అబద్ధమాడేవాడు ఐదుతరాలను ఆవులకోసం అబద్ధమాడేవాడు పదితరాలను, గుర్రాలకోసం అబద్ధం ఆడేవాడు వంద తరాలను, మనుషులకోసం అబద్ధమాడేవాడు వెయ్యి తరాలను నరకంలో పడేస్తాడు. (33)
హంతి జాతానజాతాంశ్చ హిరణ్యార్థేఽవృతం వదన్।
సర్వం భూమ్యనృతే మాస్మ భూమ్యనృతం వదేః॥ 34
బంగారం కోసం అబద్ధమాడేవాడు పుట్టినవాళ్ళను, పుట్టనివాళ్ళను కూడా నరకంలో పడేస్తాడు. భూమికోసం అబద్ధమాడేవాడు అంతా నాశనం చేసుకుంటాడు. (కేశిని భూమి లాంటిది). భూమికోసం అబద్ధం చెప్పకు. (34)
ప్రహ్లాద ఉవాచ
మత్తః శ్రేయానంగిరా వై సుధన్వా త్వద్విరోచన।
మాతాస్య శ్రేయసీ మాతుః తస్మాత్ త్వం తేన వై జితః॥ 35
ప్రహ్లాదుడు చెప్పాడు - విరోచనా! అంగిరుడు నాకంటె గొప్పవాడు. నీ కన్న సుధన్వుడు గొప్పవాడు. ఇతని తల్లి నీ తల్లికన్న గొప్పది. కాబట్టి నీవు సుధన్వుడికి ఓడిపోయావు. (35)
విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్తవ।
సుధన్వన్ పునరిచ్ఛామి త్వయా దత్తం విరోచనమ్॥ 36
విరోచనా! నీ ప్రాణాలకే సుధన్వుడు అధిపతి. సుధన్వా! నీవిస్తే విరోచనుని తిరిగి పొందాలనుకొంటున్నాను. (36)
సుధన్వోవాచ
యద్ ధర్మమవృణీథాస్త్వం న కామాదనృతం వదేః।
పునర్దదామి తే పుత్రం తస్మాత్ ప్రహ్లాద దుర్లభమ్॥ 37
సుధన్వుడన్నాడు - ప్రహ్లాదా! నీవు ధర్మాన్ని వరించావు. కోరికలకు లోనై అబద్ధం చెప్పలేదు. అందువల్ల దుర్లభుడయిన కొడుకును మళ్ళీ నీకు ఇస్తున్నాను. (37)
ఏష ప్రహ్లాద పుత్రస్తే మయా దత్తో విరోచనః।
పాదప్రక్షాళనం కుర్యాత్ కుమార్యాః సంనిధౌ మమ॥ 38
ప్రహ్లాదా! నీకు నేనిచ్చిన కుమారుడి విరోచనుడు. కుమారి కేశిని సమక్షంలో నాపాదాలను కడగాలి. (38)
విశేషం: నా సమక్షంలో కుమారి కేశిని పాదాలకు పసుపురాయాలి. అనే భావాన్ని నీలకంఠుడు వెలిబుచ్చాడు.
విదుర ఉవాచ
తస్మాద్ రాజేంద్ర భూమ్యర్థే నానృతం వక్తుమర్హసి।
మాగమః ససుతామాత్యః నాశం పుత్రార్థమబ్రువన్॥ 39
విదురుడు చెప్పాడు - కాబట్టి రాజేంద్రా! భూమికోసం అబద్ధం చెప్పకు. కొడుకు కోసం (మంచిమాట చెప్పటం మాని) కొడుకులు, మంత్రులతో కలసి నాశనంకావద్దు. (39)
న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్।
యం తు రక్షితుమిచ్ఛంతి బుద్ధ్యా సంవిభజంతి తమ్॥ 40
పశువులకాపరిలాగా కర్ర పట్టుకుని దేవతలు కాపాడరు. రక్షించాలనుకున్నవాడికి మంచిబుద్ధినిచ్చి (ఇతరుల నుండి) వేరుచేస్తారు. (40)
యథా యథా హి పిరుషః కల్యాణే కురుతే మనః।
తథా తథాస్య సర్వర్థాః సిద్ధ్యంతే నాత్ర సంశయః॥ 41
మానవుడు ఎలా మంచి విషయంలో మనసు లగ్నం చేస్తాడో అతడికి అలాగే అన్ని ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. (41)
నైనం ఛందాంసి వృజినాత్ తారయంతి
మాయావినం మాయయా వర్తమానమ్।
నీడం శకుంతా ఇవ జాతపక్షాః
ఛందాంస్యేనం ప్రజహాత్యంతకాలే॥ 42
కపటంతో మెలగే మాయావిని వేదాలు పాపం నుండి విడిపించవు. రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదలి వెళ్ళినట్లు మరణకాలంలో వేదాలు అతణ్ణి వదలిపోతాయి. (42)
మద్యపానం కలహం పూగవైరం
భార్యాపత్యోరంతరం జ్ఞాతిభేదమ్।
రాజద్విష్టం స్త్రీపుంసయోర్వివాదం
వర్జ్యాన్యాహుర్యశ్చ పంథాః ప్రదుష్టః॥ 43
కల్లుత్రాగడం, తగవులాడటం, పదిమందితో వైరం, భార్యాభర్తలను విడదీయడం, దాయాదుల మధ్య పొరపొచ్చాలను సృష్టించడం, రజుతో వైరం, స్త్రీ పురుషుల మధ్య కలహం పెట్టడం, చెడుమార్గంలో ప్రవర్తించటం వీటిని విడువ తగినవిగా చెప్తారు. (43)
సాముద్రికం వణిజం చోరపూర్వం
శలాకధూర్తం చ చికిత్సకం చ।
అరిం చ మిత్రం చ కుశీలవం చ
నైతాన్ సాక్ష్యే త్వధికుర్వీత సప్త॥ 44
చేతిరేఖలు చూసి జోస్యం చెప్పేవాడు, దొంగిలించిన సొత్తుతో వ్యాపారం చేసేవాడు, పుల్లమొదలైనవాటితో మోసగించి జూదమాడేవాడు, వైద్యుడు, శత్రువు, స్నేహితుడు, నాట్యమాడేవాడు ఈ ఏడుగురిని సాక్ష్యానికి ఉపయోగించుకోరాదు. (44)
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయజ్ఞః।
ఏతాని చత్వార్యభయంకరాణి
భయం ప్రయచ్ఛంత్యయథాకృతాని॥ 45
ఆదరంతో అగ్నిహోత్రాన్ని అనుష్ఠించటం, ఆదరంతో మౌనాన్ని వహించటం, ఆదరంతో వేదాధ్యయనం, ఆదరంతో యజ్ఞాలను అనుష్ఠించటం - ఈ నాలుగు అభయాన్ని కలిగిస్తాయి. (భయాన్ని దూరం చేస్తాయి.) (ఆదరమ్ లేక శ్రద్ధగా అనుష్ఠించక పోతే భయాన్ని కలుగచేస్తాయి. (45)
అగారదాహీ గరదః కుండాశీ సోమవిక్రయీ।
పర్వకారశ్చ సూచీ చ మిత్రధ్రుక్ పారదారికః॥ 46
భ్రూణహా గురుతల్పీ చ యశ్చ స్యాత్ పానపో ద్విజః।
అతితీక్ష్ణశ్చ కాకశ్చ నాస్తికో వేదనిందకః॥ 47
స్రువప్రగ్రహణో వ్రాత్యః కీనాశశ్చాత్మవానపి।
రక్షేత్యుక్తశ్చ యో హింస్యాత్ సర్వే బ్రహ్మహభిః సమాః॥ 48
ఇంటికి నిప్పుపెట్టేవాడు, విషంపెట్టేవాడు, అక్రమసంతానం యొక్క సంపాదన తినేవాడు, సోమ రసాన్ని అమ్మేవాడు, ఆయుధాలు తయారుచేసేవాడు, చాడీలు చెప్పేవాడు, స్నేహితుడికి ద్రోహం చేసేవాడు, పర భాఱ్యాలోలుడు, కడుపులోని పిండాన్ని చంపేవాడు, గురువు భార్యతో గడిపేవాడు, బ్రాహ్మణుడై ఉండి మద్యపానం చేసేవాడు, ఎంతో దుడుకు స్వభావం కలవాడు,(కాకి ముక్కుతో పుండును పొడుచునట్లు, బాధలో ఉన్నవారిని బాధించేవాడు) కాకిలాంటివాడు, పరలోకం లేదనేవాడు, వేదాలను నిందించేవాడు, గ్రామ పురోహితుడు (సదాచారం లేక అందరికీ పౌరోహిత్యం చేయించేవాడు), వ్రాత్యుడు(సకాలంలో ఉపనయన సంస్కారం జరుగనివాడు). పాపపు పనివల్ల లభించే దానితో తిని బ్రతికేవాడు, రక్షింపగల శక్తి ఉన్నా శరణన్నవాడిని చంపేవాడు - వీరంతా బ్రహ్మహత్యచేసిన వాడితో సమానులు. (46,47,48)
తృణోల్కయా జ్ఞాయతే జాతరూపం
వృత్తేన భద్రో వ్యవహారేణ సాధుః।
శూరో భయేష్వర్థకృచ్ఛ్రేషు ధీరః
కృచ్ఛ్రేష్వాపత్సు సుహృదశ్చారయశ్చ॥ 49
చీకటిలో గడ్డిమంటతో వస్తు స్వరూపం
వృత్తేన భద్రో వ్యవహారేణ సాధుః।
శూరో భయేష్వర్థకృచ్ఛ్రేషు ధీరః
కృచ్ఛ్రేష్వాపత్సు సుహృదశ్చారయశ్చ॥ 49
చీకటిలో గడ్డిమంటతో వస్తు స్వరూపం తెలుస్తుంది. శీలంతో/ప్రవర్తనతో ధర్మం తెలుస్తుంది. వ్యవహారం చేత మంచితనం బయట పడుతుంది. భయ సందర్భాల్లో శూరుడు తెలుస్తాడు. కష్టాల్లో ధీరుడు తెలుస్తాడు. మిత్రులు - శత్రువులూ ఆపదల్లో బయట పడతారు. (49)
వి॥సం॥ జాతరూపం అంటే బంగారం అని(లక్షా)
జరా రూపం హారతి హి ధైర్యమాశా
మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యామసూయా।
క్రోధః శ్రియం శీలమనార్యసేవా
హ్రియం కామః సర్వమేవాభిమానః॥ 50
ముసలితనం అందాన్ని హరిస్తుంది. ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాలనూ, అసూయ ధర్మాచరణాన్నీ, క్రోధం సంపదను, నీచసేవ శీలాన్ని, కామం సిగ్గునూ, అభిమానం అన్నిటినీ హరిస్తుంది. (50)
వి॥సం॥ ఈ అభిమాన దోషం కౌరవుల్లో ఉంది(నీల)
శ్రీర్మంగళాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే।
దాక్ష్యాత్తు కురుతే మూలం సంయమాత్ ప్రతితిష్ఠతి॥ 51
శుభప్రవర్తన నుండి సంపద పుడుతుంది. ఆ సంపద నేర్పుతో పెరుగుతుంది. సామర్థ్యం వల్లన్ వేళ్లూనుతుంది. సంయనం వల్ల స్థిర పడుతుంది. (51)
అష్టౌ గుణాః పురుషం దీపయంతి
ప్రజ్ఞా చ కౌల్యం చ దమః శ్రుతం చ।
పరాక్రమ శ్చాబహుభాషితా చ
దానం యథాశక్తి కృతజ్ఞతా చ॥ 52
ఎనిమిదిగుణాలు మానవుని ప్రకాశింపచేస్తాయి. అవి ఇవి 1. ప్రజ్ఞ, 2. సద్వంశంలో జన్మించడం, 3. ఇంద్రియ నిగ్రహం, 4. చదువు, 5. పరాక్రమం, 6. మితంగామాట్లాడటం, 7. యథాశక్తిగా దానం చేయడం, 8. కృతజ్ఞత కలిగిఉండటం. (52)
ఏతాన్ గుణాంస్తాత మహానుభావాన్
ఏకో గుణః సంశ్రయతే ప్రసహ్య।
రాజా యదా సత్కురుతే మనుష్యం
సర్వాన్ గుణానేష గుణో విభాతి॥ 53
నాయనా! ఈ ఎనిమిది మహాగుణాలనూ ఒక్క సుగుణమ్ వెంటనే ఆశ్రయిస్తుంది. అది రాజసత్కారం - రాజు సత్కరిస్తే ఈ గుణాలన్నీ వెలుగు చూస్తాయి. బాగా రాణిస్తాయి. (53)
వి॥సం॥ కర్ణాదులను మీరు సత్కరించినపుడు కనపడిన గుణాలు స్వాభావికాలు కావు - అందుకే అవి పనికి రావటం లేదు. (నీల)
అష్టౌ నృపేమాని మనుష్యలోకే
స్వర్గస్య లోకస్య నిదర్శనాని।
చత్వార్యేషామన్వవేతాని సద్భిః
చత్వారి చైషామనుయాంతి సంతః॥ 54
రాజా! ఇపుడు చెప్పబోయే ఈ ఎనిమిది గుణాలూ ఈమర్త్యలోకంలోనే స్వర్గం చూపిస్తాయి. వీటిలో నాల్గు సజ్జనులను అవే అనుసరిస్తాయి. మిగిలిన నాల్గింటిని సజ్జనులు అనుసరిస్తారు. (54)
యజ్ఞో దాన మధ్యయనం తపశ్చ
చత్వార్యేతాన్యన్వవేతాని సద్భిః।
దమః సత్యమార్జవమానృశంస్యం
చత్వార్యేతాన్యమయాంతి సంతః॥ 55
యజ్ఞం, దానం, అధ్యయనం, తపస్సు - ఈ నాలుగూ సజ్జనులను అనుసరిస్తాయి. నిగ్రహం, సత్యం, ఆర్జవం, దయ - ఈ నాలుగు సజ్జనులు ప్రయత్నంతో అనుసరిస్తారు/ సాధిస్తారు. (55)
ఇజ్యాధ్యయన దానాని తపః సత్యం క్షమా ఘృణా।
అలోభ ఇతి మార్గోఽయం ధర్మస్యాష్టవిధః స్మృతః॥ 56
యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, సహనం, జాలి, లోభం లేకపోవడం - ఈ ఎనిమిదీ ధర్మసాధనకు లక్షణాలు, మార్గాలు. (56)
తత్ర పూర్వచతుర్వర్గః దంభార్థమపి సేవ్యతే।
ఉత్తరశ్చ చతుర్వర్గః నామహాత్మసు తిష్ఠతి॥ 57
అందులో మొదటి నాల్గింటిని కొంతమంది ఆడంబరంకోసం ఆచరిస్తారు. కాని చివరినాల్గు గుణాలు మాత్రం సద్బుద్ధిలేని వారి దగ్గర ఉండవు. (57)
న సా సభా యత్ర న సంతి వృద్ధాః
న తే వృద్ధా యే న వదంతి ధర్మమ్।
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి
న తత్ సత్యం యచ్ఛలేనాభ్యుపేతమ్॥ 58
వృద్ధులు లేని సభ సభకాదు. ధర్మం చెప్పకపోతే వారు వృద్ధులేకారు. సత్యం లేకపోతే అది ధర్మం కాదు. కపటంతో కూడిన సత్యం సత్యమూ కాదు. (58)
సత్యం రూపం శ్రుతం విద్యా కౌల్యం శీలం బలం ధనమ్।
శౌర్యం చ చిత్రభాష్యం చ దశేమే స్వర్గయోనయః॥ 59
సత్యం, రూపం, అధ్యయనం, ఉపాసన, ఉన్నతవంశంలో పుట్టడం, సత్ప్రవర్తన, బలం, ధనం, పరాక్రమం, యుక్తియుక్తంగా మాట్లాడటం - ఈ పదీ స్వర్గానికి నిచ్చెనలు. (59)
పాపం కుర్వన్ పాపకీర్తిః పాపమేవాశ్నుతే ఫలమ్।
పుణ్యం కుర్వన్ పుణ్యకీర్తిః పుణ్యమత్యంతమశ్నుతే॥ 60
పాపాసక్తి కల మానవుడు పాపమే చేస్తాడు. పాప ఫలితాన్నే అనుభవిస్తాడు. పుణ్యాసక్తి కల మానవుడు పుణ్యమే చేసి దాని ఉత్తమ ఫలం పొందుతాడు. (60)
తస్మాత్ పాపం న కుర్వీత పురుషః శంసితవ్రతః।
పాపం ప్రజ్ఞాం నాశయతి క్రియమాణం పునః పునః।
నష్టప్రజ్ఞః పాపమేవ నిత్యమారభతే నరః॥ 61
అందుచేత నియమప్రవర్తన కల మానవుడు పాపం చేయకూడదు. ఎందుచేతనంటే పాపకృత్యం మనిషి యొక్క తెలివిని నశింపచేస్తుంది. పలుమారులు అదే మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అలా ప్రజ్ఞ పోగొట్టుకుని నిత్యమూ పాప కార్యమే చేస్తూ ఉంటాడు. (61)
పుణ్యం ప్రజ్ఞాం వర్ధయతి క్రియమాణం పునః పునః।
వృద్ధప్రజ్ఞః పుణ్యమేవ నిత్యమారభతే నరః॥ 62
పుణ్యకార్యం తెలివితేటల్ని పెంచుతుంది. నిత్యమూ పుణ్యకార్యాలు చేసేవాని ప్రతిభ పెరుగుతూ ఉంటుంది. దానితో నిత్యమూ అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తాడు. (62)
పుణ్యం కుర్వన్ పుణ్యకీర్తిః పుణ్యం స్థనం స్మ గచ్ఛతి।
తస్మాత్ పుణ్యం నిషేవేత పురుషః సుసమాహితః॥ 63
పుణ్యాసక్తి కలవాడు పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యస్థానమయిన స్వర్గం పొందుతాడు. అందుచేత మానవుడు సతతమూ ఏజాగ్రతతో పుణ్యమే చేయాలి. (63)
అసూయకో దందశూకః నిష్ఠురో వైరకృచ్ఛఠః।
స కృచ్ఛ్రం మహదాప్నోతి న చిరాత్ పాపమాచరన్॥ 64
అసూయ కలవాడు, మర్మస్థానాల్లో కొట్టేవాడు, నిష్ఠురంగా మాట్లాడేవాడు, కలహాలు పెట్టేవాడు, మోసగాడు - వీళ్లు పాపం చేస్తూ ఎంతో దుఃఖం పొందుతూ ఉంటారు. (64)
అనసూయః కృతప్రజ్ఞః శోభనాన్యాచరన్ సదా।
న కృచ్ఛ్రం మహదాప్నోతి సర్వత్ర చ విరోచతే॥ 65
అసూయలేనివాడు, ప్రజ్ఞ కలవాడు, సదా సత్కృత్యాలు చేసేవాడు-అందరికీ ఇష్టుడై ఎంతో సుఖాన్ని పొందుతాడు. (65)
ప్రజ్ఞామేవాగమయతి యః ప్రాజ్ఞేభ్యః స పండితః।
ప్రజ్ఞో హ్యవాప్య ధర్మార్థౌ శక్నోతి సుఖమేధితుమ్॥ 66
ప్రజ్ఞ కలవారినుండి ప్రజ్ఞనే తీసుకునేవాడ్ ఉ పండితుడు-అతడు ఆ ప్రజ్ఞతో ధర్మార్థాలను సాధించే సుఖం పెంచుకొంటాడు. (66)
దివసేవైవ తత్కుర్యాత్ యేన రాత్రౌ సుఖం వసేత్।
అష్టమాసేన తత్ కుర్యాత్ యేన వర్షాః సుఖం వసేత్॥ 67
పూర్వే వయసి తత్కుర్యాత్ యేన వృద్ధః సుఖం వసేత్।
యావజ్జీవేన తత్కుర్యాత్ యేన ప్రేత్య సుఖం వసేత్॥ 68
రాత్రిపూట సుఖపడటం కోసం పగటి పూటనే ప్రయత్నించాలి. వర్షాకాలంలో సుఖపడటం కోసం మిగిలిన ఎనిమిది నెలలూ కష్టించాలి. ముసలి తనంలో సుఖపడటం కోసం వయసులో పరిశ్రమించాలి. మరణానంతరం సుఖపడటం కోసం యావజ్జీవం పరిశ్రమ చేయాలి. (67,68)
జీర్ణమన్నం ప్రశంసంతి భార్యాం చ గతయౌవనామ్।
శూరం విజితసంగ్రామం గతసారం తపస్వినమ్॥ 69
చక్కగా జీర్ణమయిన అన్నాన్ని మంచిదని ప్రశంసిస్తారు. యౌవనం గడచిన భార్యను అంతా ప్రశంసిస్తారు. యుద్ధంలో జయించిన వీరుని అంతా శ్లాఘిస్తారు. పారంగతుడై తత్త్వమెరిగిన తపస్విని ప్రశంసిస్తారు. (69)
ధనేనాధర్మలబ్ధేన యచ్ఛిద్రమపి ధీయతే।
అసంవృతం తద్భవతి తతోఽన్యదవదీర్యతే॥ 70
అధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో దోషం దాచుదామన్నా దాగదు సరిగదా మిగిలిన తప్పు కూడా బయటపడుతుంది. (70)
గురురాత్మవతాం శాస్తా శాస్తా రాజా దురాత్మనామ్।
అథ ప్రచ్ఛన్నపాపానాం శాస్తా వైవస్వతో యమః॥ 71
మనసు అదుపులో ఉన్నవాడిని గురువు శాసిస్తాడు. దుర్మార్గులను రాజు శాసిస్తాడు. రహస్యంగా పాపాలు చేసేవాడిని యముడు శాసిస్తాడు. (71)
ఋషీణాం చ నదీనాం చ కులానాం చ మహాత్మనామ్।
ప్రభవో నాధిగంతవ్యః స్త్రీణాం దుశ్చరితస్య చ॥ 72
ఋషులు, నదులు, వంశాలు, మహాత్ములు, స్త్రీల దుశ్చరితలు - వీని పుట్టుకలు ఎవరికీ తెలియవు. (72)
ద్విజాతిపూజాభిరతః దాతా జ్ఞాతిషు చార్జవీ।
క్షత్రియః శీలభాక్ రాజన్ చిరం పాలయతే మహీమ్॥ 73
ద్విజ పూజారతుడైనవాడు, దాత, జ్ఞాతులను వంచింపనివాడు, సత్ప్రవర్తన కలవాడు అయిన క్షత్రియుడు చిరకాలం రాజ్యం పాలిస్తాడు. (73)
వి॥సం॥ దుర్యోధనుడు జ్ఞాతుల విషయంలో ఆర్జవం లేని వాడు - మోసగాడు(నీల)
సువర్ణపుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః।
శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్॥ 74
శూరుడు, చక్కని విద్యలు నేర్చినవాడు, సేవించే నేర్పుకలవాడు - వీరుల్ ముగ్గురూ భూమి మీద బంగారు పూలను పండిస్తారు. (74)
బుద్ధిశ్రేష్ఠాని కర్మాణి బాహుమధ్యాని భారత।
తాని జంఘాజఘన్యాని భారప్రత్యవరాణి చ॥ 75
మానవుల కృత్యాలు నాళుగు రకాలు. అందులో బుద్ధితో చేసే పనులు శ్రేష్ఠములు, బాహుబలంతో చేసే పనులు మద్యమాలు - పిక్కలతో కాళ్లతో చేసేవి అధమాలు - మోత మోసేవి బరువులుమోయడం మొదలయినవి అదమాధమాలు. (75)
దుర్యోధనేఽథ శకునౌ మూఢే దుశ్శాసనే తథా।
కర్ణే చైశ్వర్య మాధాయ కథం త్వం భూతి మిచ్ఛసి॥ 76
దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు-వీరిమీద ఐశ్వర్యమంతా పెట్టి నీవెట్లా వైభవం పొందాలని భావిస్తున్నావు? (76)
వి॥సం॥ వారు కేవలం భారవాహకులు - అని భావం.
సర్వైర్గుణైరుపేతాస్తు పాండవా భరతర్షభ।
పితృవత్ త్వయి వర్తంతే తేషు వర్తస్వ పుత్రవత్॥ 77
పాండవులయితే సర్వసద్గుణాలూ కలవారు. భరతవంశోత్తమా! నీ పట్ల వారు తండ్రివలె ప్రవర్తిస్తున్నారు. అందుచేత నీవు వారి పట్ల పుత్రభావంతో ప్రవర్తించు. (77)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగరపర్వణి విదురహిత వాక్యే పంచత్రింశోఽధ్యాయః॥ 35 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగర పర్వమను ఉప పర్వమున
విదురుని హితవాక్యమను ముప్పది అయిదవ అధ్యాయము. (35)