49. నలువది తొమ్మిదవ అధ్యాయము

భీష్ముడు సభలో కృష్ణార్జునులను ప్రశంసించుట.

వైశంపాయన ఉవాచ
సమవేతేషు సర్వేషు తేషు రాజసు భారత।
దుర్యోధనమిదం వాక్యం భీష్మః శాంతనవోఽబ్రవీత్॥ 1
వైశంపాయనుడిట్లన్నాడు. రాజులంతా కూడి ఉన్నపుడు భీష్ముడు దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1)
బృహస్పతిశ్చోశనా చ బ్రహ్మాణం పర్యుపస్థితౌ।
మరుతశ్చ సహేంద్రేణ వసవశ్చాగ్నినా సహ॥
ఆదిత్యాశ్పైవ గంధర్వః శుభాశ్చాప్సరసాం గణాః॥
ఒకసారి బృహస్పతి, శుక్రుడు, మరుత్తులు, ఇంద్రుడు, వసువులు, అగ్ని, ఆదిత్యులు, సాధ్యులు, సప్తర్షులు, విశ్వావసుడనే గంధర్వుడు, అప్సరసల సముదాయాలు బ్రహ్మదేవుని - సేవిస్తూ ఉన్నారు. (2,3)
నమస్కృత్యోపజగ్ముస్తే లోకవృద్ధం పితామహమ్।
పరివార్య చ విశ్వేశం పర్యాసత దివౌకసః॥ 4
వారంతా లోకవృద్ధుడయిన బ్రహ్మదేవునికి నమస్కరించి, విశ్వేశుని పరివేష్టించి కూర్చున్నారు. (4)
తేషాం మనశ్చ తేజశ్చాప్యాదదానావివౌజసా।
పూర్వదేవౌ వ్యతిక్రాంతౌ నరనారాయణావృషీ॥ 5
తమ శక్తితో అందరి మనస్సులనూ, తేజస్సునూ ఆకర్షిస్తున్నట్లు సనాతనులయిన నరనారాయణులు అందరినీ మించి ఉన్నారు. (5)
బృహస్పతిస్తు పప్రచ్ఛ బ్రహ్మాణం కావిమావితి।
భవంతం నోపతిష్ఠేతే తౌ నః శంస పితామహ॥ 6
అపుడు బ్రహ్మతో బృహస్పతి "పితామహా! వీరిద్దరూ ఎవరు? నిన్ను ఎందుకు సేవించటం లేదు? నాకు చెప్పు" అని అడిగాడు. (6)
బ్రహ్మోవాచ
యావేతౌ పృథివీం ద్యాంచ భావయంతౌ తపస్వినౌ।
జ్వలంతౌ రోచమానౌ చ వ్యాప్యాతీతౌ మహాబలౌ॥ 7
నరనారాయణావేతౌ లోకాల్లోకం సమాస్థితౌ।
ఊర్జితౌ స్వేన తపసా మహాసత్త్వపరాక్రమౌ॥ 8
బ్రహ్మ ఇట్లన్నాడు - భూమ్యాకాశాలను వెలిగిస్తూ, బలంతో కాంతితో ప్రకాశిస్తూ, అందరికీ ఇష్టులై, అందరినీ మించిన ఈ తాపసులు నరనారాయణులు. మానవలోకంనుండి బ్రహ్మలోకానికి వచ్చారు. తపోమహిమ, మహాసత్త్వం, పరాక్రమం కలిగినవారు. (7,8)
ఏతౌ హి కర్మణా లోకం నందయామాసతుర్ధ్రువమ్।
ద్విధాభూతౌ మహాప్రాజ్ఞౌ విద్ధి బ్రహ్మన్ పరంతపౌ।
అసురాణాం వినాశాయ దేవగంధర్వపూజితౌ॥ 9
వీరిద్దరూ తమ సత్కృత్యాలతో లోకాన్ని ఆనందపరచారు.. ఒక్కరే నిజానికి - అయినా ఇద్దరుగా అయ్యారు. మహాప్రాజ్ఞులు, శత్రు సంహారకులు, రాక్షసులను సంహరించమని దేవతలచేత, గంధర్వులచేత పూజింపబడినవారు. (9)
వైశంపాయన ఉవాచ
జగామ శక్రస్తచ్ఛ్రుత్వా యత్ర తౌ తేపతుస్తపః।
సార్థం దేవగణైః సర్వైః బృహస్పతిపురోగమైః॥ 10
వైశంపాయనుడు చెపుతున్నాడు - అది విని ఇంద్రుడు, బృహస్పతిని ముందుంచుకొని దేవతలందరితోనూ వారు తపస్సు చేసుకొనే చోటికి వెళ్లాడు. (10)
తదా దేవాసురే యుద్ధే భయా జాతే దివౌకసామ్।
అయాచత మహాత్మానౌ నరనారాయణౌ వరమ్॥ 11
దేవదానవ యుద్ధంలో దేవతలకు భయం వేసింది. మహాత్ములయిన నరనారాయణులను అపుడు ఇంద్రుడు ఒకవరం కోరాడు. (11)
తావబ్రూతాం వృణీష్వేతి తదా భరత సత్తమ।
అథైతావబ్రవీచ్ఛక్రః సాహ్యం నః క్రియతామితి॥ 12
భరతసత్తమా! వారిరువురూ "కోరుకో" అన్నారు. అపుడు ఇంద్రుడు "మాకు సహాయం చేయండి" అని నరనారాయణులను అడిగాడు. (12)
తతస్థౌ శక్రమబ్రూతాం కరిష్యావో యదిచ్ఛసి।
తాభ్యాం చ సహితః శక్రః విజిగ్యే దైత్యదానవాన్॥ 13
అపుడు వారిద్దరూ "నీవు కోరినది చేస్తాం" అన్నారు. వారితో కలిసి ఇంద్రుడు దితి సంతతిని, దనువు సంతతిని జయించాడు.(13)
నర ఇంద్రస్య సంగ్రామే హత్వా శత్రూన్ పరంతపః।
పౌలోమాన్ కాలఖంజాంశ్చ సహస్రాణి శతాని చ॥ 14
నరుడు ఇంద్రుని యుద్ధంలో పౌలోములు, కాలఖంజులు అనే వారిని వందలు వేలమందిని సంహరించాడు. (14)
ఏష భ్రాంతే రథే తిష్ఠన్ భల్లేనాపాహరచ్ఛిరః।
జంభస్య గ్రసమానస్య తదా హ్యర్జున ఆహవే॥ 15
యుద్ధంలో జంభుడు తనను మింగబోతుంటే రథంమీద ఉన్న ఈ అర్జునుడు భల్లంతో వాని శిరసును ఖండించాడు. (15)
ఏష పారే సముద్రస్య హిరణ్యపురమారుజత్।
జిత్వా షష్టిం సహస్రాణి నివాతకవచాన్ రణే॥ 16
ఇతడు సముద్రతీరాన్ ఆరువేల మంది నివాత కవచుల్ని యుద్ధంలో ఓడించి, హిరణ్యపురాన్ని బాధించాడు. (16)
ఏష దేవాన్ సహేంద్రేణ జిత్వా పరపురంజయః।
అతర్పయన్మహాబాహుః అర్జునో జాతవేదసమ్॥ 17
శత్రుపురాలను గెలిచే ఈ అర్జునుడు ఆజానుబాహువు - ఇంద్రునితో సహా దేవతలను జయించి అగ్నిహోత్రుని సంతృప్తి పరిచాడు. (17)
నారాయణస్తథైవాత్ర భూయసాఽన్యాన్ జఘాన హ।
ఏవమేతౌ మహావీర్యౌ తౌ పశ్యత సమాగతౌ॥ 18
అపుడు అలాగే ఈ నారాయణుడూ చాలామంది శత్రువులను సంహరించాడు. అలా మహావీర్యులయిన వీరిద్దరూ ఇపుడు కలిసి వచ్చారు - చూడు. (18)
వాసుదేవార్జునౌ వీరౌ సమవేతౌ మహారథౌ।
నరనారాయణౌ దేవౌ పూర్వదేవావితి శ్రుతిః॥ 19
కృష్ణార్జునులు మహారథులు - కలిసి ఉంటారు. పూర్వం నరనారాయణులని ప్రసిద్ధులయిన దేవతలే వీరు అని వింటున్నాం. (19)
అజేయౌ మానుషే లోకే సేంద్రైరపి సురాసురైః।
ఏష నారాయణః కృష్ణః ఫాల్గునశ్చ నరః స్మృతః।
నారాయణో నరశ్పైవ సత్త్వమేకం ద్విధా కృతమ్॥ 20
వీరు మానవలోకంలో కాని, ఇంద్రాది దేవతలకు, రాక్షసులకు కాని జయింపశక్యం కాని వారు. ఈ కృష్ణుడే నారాయణుడు - అర్జునుడే నరుడు - నిజానికి నరనారాయణులు ఒకేతత్త్వం. రెండు రూపాలుగా అయింది అంతే. (20)
ఏతౌ హి కర్మణా లోకాన్ అశ్నువాతేఽక్షయాన్ ధ్రువాన్।
తత్ర తత్రైవ జాయేతే యుద్ధకాలే పునః పునః॥ 21
వీరిద్దరూ తమ కర్మతో అక్షయములు స్థిరములూ అయిన లోకాలను వ్యాపించి ఉంటారు. యుద్ధ సమయాల్లో మళ్ళీ మళ్లీ పుడుతూ ఉంటారు. (21)
తస్మాత్ కర్మైవ కర్తవ్యం ఇతిహోవాచ నారదః।
ఏతద్ధి సర్వమాచష్ట వృష్ణిచక్రస్య వేదవిత్॥ 22
అందుచేత యుద్ధ కర్మయే కర్తవ్యమని వేదవేత్త అయిన నారదుడు వృష్ణి వంశస్థులకు దీనినంతా చెప్పాడు. (22)
శంఖచక్రగదాహస్తం యదా ద్రక్ష్యసి కేశవమ్।
పర్యాదదానం చాస్త్రాణి భీమధన్వానమర్జునమ్॥ 23
సనాతనౌ మహాత్మానౌ కృష్ణావేకరథే స్థితౌ।
దుర్యోధన తదా తాత స్మర్తాసి వచనం మమ॥ 24
శంఖం, చక్రం, గద చేతుల్లో దాల్చిన కేశవునీ, భయంకరమైన వింటితో అస్త్రాలు వెదజల్లే అర్జునునీ అనగా సనాతనులయిన నరనారాయణులను ఇద్దరినీ ఒకే రథం మీద చూస్తే... అపుడు దుర్యోధనా! నా మాట గుర్తుకువస్తుంది. (23,24)
నో చేదయమభావః స్యాత్ కురూణాం ప్రత్యుపస్థితః।
అర్థాశ్చ తాత ధర్మాచ్చ తవ బుద్ధిరుపప్లుతా॥ 25
అలాగే గుర్తుకు రాకపోతే ఈ కౌరవ నాశనం దగ్గర పడినట్లే - అందుకే నీ బుద్ధి అర్థం నుండి, ధర్మం నుండి కప్పదాట్లు వేస్తోంది. (25)
న చేద్గ్రహీష్యసే వాక్యం శ్రోతాఽసి సుబహూన్ హతాన్।
తవైవ హి మతం సర్వే కురవః పర్యుపాసతే॥ 26
నా మాట వినకపోతే నీ వారు చాలామంది చచ్చినట్లు వింటావు - మరి ఈ కౌరవులంతా నీ మాటనే పట్టుకు వ్రేలాడుతున్నారు కదా! (26)
త్రయాణామేవ చ మతం తత్త్వమేకోఽను మన్యసే।
రామేణ చైవ శప్తస్య కర్ణస్య భరతర్షభ॥ 27
దుర్జాతేః సూతపుత్రస్య శకునేః సౌబలస్య చ।
తథా క్షుద్రస్య పాపస్య భ్రాతుః దుశ్శాసనస్య చ॥ 28
పరశురాముని చేత శపింపబడిన సూతపుత్రుడు కర్ణుడు - సుబలపుత్రుడు శకుని - నీచుడు, పాపి అయిన నీ తమ్ముడు దుశ్శాసనుడు - ఈ ముగ్గురి మతాన్నే నీవు అనుసరిస్తున్నావు. (27,28)
కర్ణ ఉవాచ
నైవ మాయుష్మతా వాచ్యం యన్మమాత్థ పితమహ।
క్షత్రధర్మే స్థితో హ్యస్మి స్వధర్మాదనపేయివాన్॥ 29
అపుడు కర్ణుడిట్లా అన్నాడు - తాతా! నీవు నన్ను అన్న మాటలు ఆయుష్మంతుడు పలుక దగినవి కావు. నేను క్షత్రియ ధర్మంలోనే నిల్చి, స్వధర్మం నుండి తొలగనివాడను. (29)
కించాన్యన్మయి దుర్వృత్తం యేన మాం పరిగర్హసే।
న హి మే వృజినం కించిత్ ధార్తరాష్ట్రాః విదుః క్వచిత్॥ 30
నాచరం వృజినం కించిద్ ధార్తరాష్ట్రస్య నిత్యశః।
నాలో ఏ తప్పుడు పని చూసి నన్ను నిందిస్తున్నావు? కొద్దిపాటి పాపం కూడా నాలో ధార్తరాష్ట్రులు చూసి ఎరగరు - దుర్యోధనునికి నేను ఎప్పుడూ ఏ కొద్దిపాటి ద్రోహమూ చేయలేదు. (30 1/2)
అహం హి పాండవాన్ సర్వాన్ హనిష్యామి రణే స్థితాన్।
ప్రాగ్విఉద్ధైః శమం సద్భిః కథం వా క్రియతే పునః॥ 31
యుద్ధంలో నిలిస్తే పాంఢవులందరినీ నేనే చంపగలను. ఎంత సజ్జనులయినా పూర్వమే విరోధించిన వారితో మళ్లీ శాంతి ఎలా చేకూరుతుంది? (31)
రాజ్ఞో హి ధృతరాష్ట్రస్య సర్వం కార్యం ప్రియం మయా।
తథా దుర్యోధనస్యాపి న హి రాజ్యే సమాహితః॥ 32
రాజయిన ధృతరాష్ట్రుని పని అంతా నాకు ఇష్టమే. అలాగే దుర్యోధనుని కార్యం కూడా అతడే కదా రాజ్యమందు నిలువబడినాడు. (32)
వైశంపాయన ఉవాచ
కర్ణస్య తు వచః శ్రుత్వా భీష్మః శాంతనవః పునః।
ధృతరాష్ట్రం మహారాజ సంభాష్యేదం వచోఽబ్రవీత్॥ 33
వైశంపాయనుడిలా అంటున్నాడు - కర్ణుని మాటలు విని భీష్ముడు ధృతరాష్ట్రుని సంబోధించి మళ్లీ ఇలా అన్నాడు. (33)
యదయం కత్థతే నిత్యం హంతాహం పాండవా నితి।
నాయం కలాపి సంపూర్ణా పాండవానాం మహాత్మనామ్॥ 34
పాండవులను నేనే చంపుతానని వీడు నిత్యమూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు - మహాత్ములయిన పాండవుల పదహారో వంతుకు కూడా వీడు పోలడు. (34)
వి॥తె॥ ఒకటైనను, వారియందొకరిలోని
చిదురపాలును పోలండు సిగ్గులేక
పాండవుల గెల్తు నేనని పలుకుచుండు.
ఉద్యో - 2 -160
అనయో యోఽయమాగంతా పుత్రాణాం తే దురాత్మనామ్।
తదస్య కర్మ జానీహి సూతపుత్రస్య దుర్మతేః॥ 35
దుర్మతులయిన నీ కొడుకులకు వచ్చిన చేటు అంతా దుష్టుడయిన ఈ సూతపుత్రుని పని అని తెలుసుకో. (35)
ఏతమాశ్రిత్య పుత్రస్తే మందబుద్ధిః సుయోధనః।
అవామన్యత తాన్ వీరాన్ దేవపుత్రా నరిందమాన్॥ 36
వీడిని నమ్ముకొనే మందబుద్ధి అయిన దుర్యోధనుడు దేవపుత్రులూ, శత్రుసంహారకులూ అయిన పాండవులను అవమానించాడు. (36)
కిం చాప్యేతేన తత్కర్మ కృతపూర్వం సుదుష్కరమ్।
తైర్యథా పాండవైః సర్వైః ఏకైకేన కృతం పురా॥ 37
ఆ పాండవులలో ఒక్కొక్కరు చేసిన ఘనకార్య మొక్కటయినా ఈ కర్ణుడు పూర్వం చేసిన దాఖలా ఉందా? (37)
దృష్ట్వా విరాటనగరే భ్రాతరం నిహతం ప్రియమ్।
ధనంజయేన విక్రమ్య కిమనేన తదా కృతమ్॥ 38
విరాటుని నగరంలో తన ముద్దుల తమ్ముడు అర్జునునిచేత చస్తే అపుడు వీడేమి పరాక్రమం చూపించాడు? (38)
స హి తాన్ హి కురూన్ సర్వాన్ అభియాతో ధనంజయః।
ప్రమథ్య చాచ్ఛినద్ వాసః కిమయం ప్రోషితస్తదా॥ 39
ఆ అర్జునుడు కౌరవుల నందరినీ వెంటాడి చావగొట్టి తలపాగలు కోసుకుపోయాడు. అపుడు అక్కడ లేడా వీడు? (39)
గంధర్వై ర్ఘోషయాత్రాయాం హ్రియతే యత్ సుతస్తవ।
క్వ తదా సూతపుత్రోఽభూద్ ఉఅ ఇదానీం వృషాయతే॥ 40
గంధర్వులు ఘోషయాత్రలో నీ కొడుకును అపహరించుకొని పోయినపుడు ఈ సూతపుత్రుడు ఎక్కడకు పోయాడు? ఇక్కడ ఇపుడు ఎద్దులాగా రెంకెలు వేస్తున్నాడు. (40)
నను తత్రాపి భీమేన పార్థేన చ మహాత్మనా।
యమాభ్యామేవ సంగమ్య గంధర్వాస్తే పరాజితాః॥ 41
అక్కడ కూడా భీమార్జునులు, నకుల సహదేవులు కలిసి కదా గంధర్వులను ఓడించారు. (41)
ఏతాన్యస్య మృషోక్తాని బహూని భరతర్షభ।
వికత్థనస్య భద్రం తే సదా ధర్మార్థలోపినః॥ 42
రాజా! ఇవన్నీ అసత్య ప్రగల్భాలు. వీటిలో ధర్మార్థాలు రెండూ లేవు. నీకు శుభమగు గాక. (42)
భీష్మస్య తు వచః శ్రుత్వా భారద్వాజో మహామవాః।
ధృతరాష్ట్రమువాచేదం రాజమధ్యేఽభిపూజయన్॥ 43
భీష్ముని మాట విని ఉదాత్తమనస్వి అయిన ద్రోణుడు సభామధ్యంలో ఆ మాటలను ప్రశంసిస్తూ ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. (43)
యదాహ భరతశ్రేష్ఠః భీష్మస్తత్ క్రియతాం నృప।
న కామమర్థలిప్సూనాం వచనం కర్తుమర్హసి॥ 44
రాజా! భరతవంశోత్తముడయిన భీష్ముడు చెప్పినట్లు చెయ్యి. ధనలోభం కలవారి మాటలు ఏమాత్రం లెక్క చేయకు. (44)
పురా యుద్ధాత్ సాధు మన్యే పాండవైః సహ సంగతమ్।
యద్వాక్య మర్జునేనోక్తం సంజయేన నీవేదితమ్॥ 45
సర్వం తదపి జానామి కరిష్యతి చ పాండవః।
న హ్యస్య త్రిషు లోకేషు సదృశోఽస్తి ధనుర్ధరః॥ 46
యుద్ధానికి పూర్వం పాండవులతో సంధి మంచిదని అనుకొంటున్నాను. అర్జునుని వాక్యాలుగా సంజయుడు చెప్పిన దానిలోని విశేషం నేనెరుగుదును. అర్జునుడు చెప్పినంతా చేస్తాడు. వానితో సమానుడయిన విలుకాడు మూడు లోకాల్లోనూ లేడు. (45,46)
అనాదృత్య తు తద్వాక్యమ్ అర్థవద్ ద్రోణభీష్మయోః।
తతః స సంజయం రాజా పర్యపృచ్ఛత పాండవాన్॥ 47
అర్థవంతమయిన ద్రోణ భీష్ముల మాటలను అనాదరించి ధృతరాష్ట్రుడు పాండవుల గురించి సంజయుని అడగడం మొదలు పెట్టాడు. (47)
వి॥తె॥ అనాదృత్య - అన్న పదాన్ని తిక్కన "భీష్మద్రోణుల పలుకులు ఆదరింపక వారికి సదుత్తరంబు లీక, వారల తోడం దదనురూపంబుగా సంభాషింపక" అని వ్యఖ్యానించాడు.
తదైవ కురవః సర్వే నిరాశా జీవితేఽభవన్।
భీష్మద్రోణౌ యదా రాజా న సమ్యగనుభాషతే॥ 48
భీష్మద్రోణులతో మాట్లాడక సంయయునితో మాట్లాడటంతోనే కౌరవులందరికీ జీవితం మీద ఆశ పోయింది. (48)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యాన సంధి పర్వణి భీష్మద్రోణ వాక్యే ఏకోఽన పంచాశత్తమోఽధ్యాయ॥ 49 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున భీష్మద్రోణ వాక్యము అను నలుబది తొమ్మిదవ అధ్యాయము. (49)