51. ఏబదియొకటవ అధ్యాయము

ధృతరాష్ట్రుడు భీముని బలమును గురించి పరితపించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
సర్వ ఏతే మహోత్సాహాః యే త్వయా పరికీర్తితాః।
ఏకతస్త్వేవ తే సర్వే సమేతా భీమ ఏకతః॥ 1
ధృతరాష్ట్రుడిట్లనినాడు - నీవు చెప్పిన వారంతా మంచి ఉత్సాహపరులు - కాని వీరంతా ఒక ఎత్తు, భీముడొక్కడూ ఒక ఎత్తు. (1)
భీమసేనాద్ధి మే భూయః భయం సంజాయతే మహత్।
క్రుద్ధా దమర్షణాత్ తాత వ్యాఘ్రాదివ మహారురోః॥ 2
అణచరాని కోపంతో మీదపడే పెద్దపులి వల్ల పెద్ద (దయినా) మృగానికి దడపుట్టినట్లు భీముని వల్ల నాకు మాటిమాటికి భయం కలుగుతోంది. (2)
జాగర్మి రాత్రయః సర్వాః దీర్ఘముష్ణం చ నిఃశ్వసన్।
భీతో వృకోదరాత్ తాత సింహాత్ పశురివాపరః॥ 3
సింహానికి భయపడిన మృగం లాగా భీముడికి భయపడి వేడిగా నిట్టూరుస్తూ ఎన్నో రాత్రులు నిద్రపట్టక జాగరణం చేస్తున్నాను. (3)
న హి తస్య మహాబాహోః శక్రప్రతిమతేజసః।
సైన్యేఽస్మిన్ ప్రతిపశ్యామి య ఏనం విషహేద్యుధి॥ 4
ఇంద్రతేజస్వి అయిన ఆ దీర్ఘభుజుడిని యుద్ధంలో నిలువరింపగలవాడు ఈ సేనలో నాకు కనపడటంలేదు. (4)
అమర్షణశ్చ కౌంతేయో దృఢవైరశ్చ పాండవః।
అనర్మహాసీ సోన్మాదః తిర్యక్ప్రేక్షీ మహాస్వనః॥ 5
ఆ భీముడు మహా కోపి, 9నా కొడుకులపై) తరగని పగ - పెద్దగా ఉన్మాదంతో వికటాట్టహాసం చేస్తాడు. వంకర/ప్రక్క చూపులు చూస్తాడు. (5)
మహావేగో మహోత్సాహః మహాబాహు ర్మహాబలః।
మందానాం మమ పుత్రాణాం యుద్ధేనాంతం కరిష్యతి॥ 6
గొప్పవేగం, ఉత్సాహం, బలం కలవాడు, దీర్ఘభుజుడు భీముడు. నా తెలివి తక్కువ కొడుకులను ఈ యుద్ధంతో అంతం చేస్తాడు. (6)
ఉరుగ్రాహగృహీతానాం గదాం బిభ్రత్ వృకోదరః।
కురూణామృషభో యుద్ధే దండపాణిరివాంతకః॥ 7
కురువంశ పుంగవుడయిన భీముడు దండం ధరించిన యమునిలాగా గదను దాల్చి పెద్దౌచ్చులో చిక్కుకున్న నా తనయులను యుద్ధంలో అంతమొందిస్తాడు. (7)
అష్టాస్రియాయసీం ఘోరాం గదాం కాంచనభూషణామ్।
మనసాహం ప్రపశ్యామి బ్రహ్మదండమివోద్యతమ్॥ 8
ఎత్తిన బ్రహ్మదండంలా ఉన్న, బంగారం పొదిగిన, ఎనిమిది కోణాలు/అంచులు కల ఉక్కు గదను దాల్చిన భీముడు సదా నా మనసులో కనిపిస్తున్నాడు. (8)
యథా మృగాణాం యూథేషు సింహో జాతబలశ్చరేత్।
మామకేషు తథా భీమః బలేషు విచరిష్యతి॥ 9
బలంతో ఉప్పొంగే సింహం మృగసమూహాల మీద విహరించినట్లు మా సైన్యాలమీద భీముడు సంచరిస్తాడు. (9)
సర్వేషాం మమ పుత్రాణాం స ఏకః క్రూరవిక్రమః।
బహ్వాశీ విప్రతీపశ్చ బాల్యేఽపి రభసః సదా॥ 10
నా పుత్రులందరిలో వాడొక్కడే కఠిన పరాక్రమం కలవాడు. బాగా తినగలవాడు - చిన్నప్పటి నుండి మాకు వ్యతిరేకి - ఎప్పుడూ దుడుకూ, దూకుడూ కలవాడు. (10)
ఉద్వేపతే మే హృదయం యే మే దుర్యోధనాదయః।
బాల్యేఽపి తేన యుధ్యంతః వారణేనేవ మర్దితాః॥ 11
చిన్నప్పుడు కూడా భీముడు నా దుర్యోధనాదులను ఏనుగులాగా యుద్ధంలో మర్దించేవాడు. ఆ విషయం నా మనసుకు దడ పుట్టిస్తోంది. (11)
తస్య వీర్యేన సంక్లిష్టాః నిత్యమేవ సుతా మమ।
స ఏవ హేతు ర్భేదస్య భీమో భీమపరాక్రమః॥ 12
నాకుమారులు నిత్యమూ వాని వీరత్వంతో ఎంతో కష్టపడేవారు - భయంకర పరాక్రమం కల ఆ భీముడే అసలు భేదానికి కారణం. (12)
గ్రసమానమనీకాని నరవారణ వాజినామ్।
పశ్యామివాగ్రతో భీమం క్రోధమూర్ఛిత మాహవే॥ 13
ఒళ్లు తెలియని కోపంతో యుద్ధంలో యోధులనూ ఏనుగులనూ, గుర్రాలనూ మ్రింగి వేస్తున్న భీముడు నా ముందు నిల్చినట్లుంటాడు. (13)
అస్త్రే ద్రోణార్జున సమం వాయువేఫ సమం జవే।
మహేశ్వరసమం క్రోధే కో హన్వా ద్భీమమాహవే॥ 14
సంజయాచక్ష్వ మే శూరం భీమసేనమమర్షణమ్।
అసలే కోపి - పైగా భయంకరసైన్యం ఉంది ఇపుడు - ఆ భీముడు అస్త్ర విద్యలో ద్రోణునితో, అర్జునునితో సమానుడు. వేగంలో వాయు సమానుడు. క్రోధంలో మహేశ్వర సముడు - అటువంటి భీముని యుద్ధంలో కొట్టగల వాడెవడు? (14)
అతిలాభంతు మన్యేఽహం యత్ తేన రిపుఘాతినా॥ 15
తదైవ న హతాః సర్వే మమ పుత్రా మనస్వినా।
యేన భీమబలా యక్షాః రాక్షసాశ్చ పురా హతాః॥ 16
కథం తస్య రణే వేగం మానుషః ప్రసహిష్యతి।
వెనుకటికి ఘోషయాత్రలో యక్షులనూ, రాక్షసులనూ మాత్రమే చంపాడు ఆ శత్రుఘాతి - నా కొడుకులను చంపలేదు. అదే పెద్ద లాభం - ఆ క్రోధి ధాటికి సామాన్య మానవుడు తట్టుకోలేడు. (15,16)
న స జాతు వశే తస్థౌ మమ బాల్యేఽపి సంజయ॥ 17
కిం పునర్మమ దుష్పుత్రైః క్లిష్టః సంప్రతి పాండవః।
వాడు చిన్నతనంలోనే ఎపుడూ నా వశంలో లేడు - ఇపుడు దుర్మార్గులయిన నా పుత్రులు ఇంకా కష్టపెట్టారు. వేరుగా ఇక చెప్పాలా? (17)
విష్ఠురో రోషణోఽత్యర్థం భజ్యేతాపి న సంనమేత్।
తిర్యక్ ప్రేక్షీ సంహతభ్రూః కథం శామ్యేత్ వృకోదరః॥ 18
కఠినుడు, అతి క్రోధనుడు - విరుగుతాడే కాని వంగడు - ప్రక్క చూపులు, చూస్తూ ఉంటాడు. కనుబొమలు ముడిపడి ఉంటాయి ఎప్పుడూ, ఆ భీముడు ఎలా శాంతిస్తాడు? (18)
శూర స్తథాప్రతిబలః గౌరస్తాల ఇవోన్నతః।
ప్రమాణతో భీమసేనః ప్రాదేశే నాధికోఽర్జునాత్॥ 19
శూరుడు ఎదురు లేనివాడు. తెలుపు - పసుపు కలిసిన రంగు. తాటి చెట్టంత ఎత్తయిన వాడు - అర్జునుని కంటె 12 అంగుళాలు ఎత్తయిన వాడు. (19)
వి॥ ప్రాదేశము = చాచిన బొటనవ్రేలు, చూపుడువ్రేళ్ళ మధ్య దూరము.
జవేన వాజినోఽత్యేతి బలేనాత్యేతి కుంజరాన్।
అవ్యక్తజల్పీ మధ్వక్షః మధ్యమః పాండవో బలీ॥ 20
వేగంలో గుర్రాలనూ, బలంతో ఏనుగులనూ మించిపోతాడు - తెలియకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు - తేనెవంటి(మెరిసే) కనులు కల భీముడు చాలా బలవంతుడు. (20)
ఇతి బాల్యే శ్రుతః పూర్వం మయా వ్యాసముఖాత్ పురా।
రూపతో వీర్యతశ్పైవ యాథాతథ్యేన పాండవః॥ 21
పూర్వం వాడి చిన్నతనంలో వ్యాసుడు ఇలా చెపితే విన్నాను. రూపంలోను, పరాక్రమంలోనూ భీముడు సరిగా అలాగే ఉన్నాడిపుడు. (21)
ఆయసేన చ దండేన రథాన్నాగాన్ నరాన్ హయాన్।
హవిష్యతి రణే క్రుద్ధః రౌద్రః క్రూరపరాక్రమః॥ 22
యుద్ధంలో కోపంతో క్రూరపరాక్రమం కల భీముడు రథాలనూ ఏనుగులనూ, వీరులనూ, గుర్రాలను ఇనుప గుదియతో చావబాదుతాడు. (22)
అమర్షీ నిత్యసంరబ్ధః భీమః ప్రహరతాం వరః।
మయా తాత ప్రతీపాని కుర్వన్ పూర్వం విమానితః॥ 23
క్రోధం కలిగి, సదా ఉద్రేకంతో ఉండే యోధుడు భీముడు. సంజయా! అతనికి వ్యతిరేకపు పనులు చేసి పూర్వం అవమానించాను. (23)
నిష్కర్ణామాయసీం స్థూలాం సుపార్శ్వీం కాంచనీం గదామ్।
శతఘ్నిం శతనిర్హ్రాదాం కథం శక్ష్యంతి మే సుతాః॥ 24
నిటారుగా బరువుగా ఉండి, చక్కని బంగారు అంచులు కలిగి, వందల మందిని చంపే పిడుగుల శబ్దం కల భీముని ఉక్కు గదను నా కొడుకు లెట్లా తట్టుకోగలరు? (24)
అపార మప్లవాగాథం సముద్రం శరవేగివమ్।
భీమసేనమయం దుర్గం తాత మందాస్తితీర్షవః॥ 25
భీమసేన మయమయిన సముద్రం అంతులేనిది- దాటలేనిది - లోతయినది - బాణాల పోట్లు కలిగినది - సంజయా! ఈ మందబుద్ధులు ఆ సముద్రాన్ని దాటాలనుకొంటున్నారు. (25)
క్రోశతో మే న శృణ్వంతి బాలాః పండితమానినః।
విషమం న హి మన్యంతే ప్రపాతం మధుదర్శినః॥ 26
నేను మొరపెడుతున్నా వినటం లేదు. చిన్నవాళ్లు తెలివిగల వాళ్లమనుకొంటున్నారు. తేనెపట్టు మీదనే చూపుకాని లోయలో పడిపోతున్నాం(మధ్యలో) అనుకోవటం లేదు. (26)
సంయుగం యే గమిష్యంతి నరరూపేణ మృత్యునా।
నియతం చోదితా ధాత్రా సింహేనేవ మహామృగాః॥ 27
మహామృగాలు సింహంతో తలపడినట్లు, బ్రహ్మ తోలుతూ ఉంటే నరరూపంలో ఉన్న మృత్యువుతో వీళ్లు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. (27)
శైక్యాం తాత చతుష్కిష్కుం షడశ్రిమమితౌజసమ్।
ప్రహితాం దుఃఖసంస్పర్శాం కథం శక్ష్యంతి మే సుతాః॥ 28
ఆరు అంచులు, మిక్కిలి గట్టిదనం కలిగి, తగిలితే చాలి బాధ కలిగిస్తూ, చిక్కంలో ఉండే నాలుగు మూరల గదను నాకుమారులు ఎలా తట్టుకోగలరు సంజయా! (28)
గదాం భ్రామయతస్తస్య భిందతో హస్తిమస్తకాన్।
సృక్విణీ లేలిహానస్య బాష్పముత్సృజతో ముహుః॥ 29
ఉద్దిశ్య నాగాన్ పతతః కుర్వతో భైరవాన్ రవాన్।
ప్రతీపం పతతో మత్తాన్ కుంజరాన్ ప్రతిగర్జతః॥ 30
విగాహ్య రథమార్గేషు వరానుద్దిశ్య నిఘ్నతః।
అగ్నేః ప్రజ్వలితస్యేవ అపి ముచ్యేత మే ప్రజాః॥ 31
గద త్రిప్పుకొంటూ దానితో ఏనుగుల తలలు పగులగొడుతూ పెదవుల మూలలు నాకుతీ మాటిమాటికీ ఆనందబాష్పాలు విడుస్తూ ఉంటాడు(భీముడు). (29)
ఏనుగుల మీద పడుతూ భయంకర ధ్వనులు చేస్తూ, మీదకు వచ్చే మదపు టేనుగుల మీదుకి గర్జిస్తూ దుముకుతీ ఉంటాడు భీముడు. (30)
యోధులను చంపాలని రథమార్గాల్లో ప్రవేశించి ప్రజ్వలించే అగ్నిలాంటి భీముని నుండి నా సంతతి తప్పించుకోగలదా? (31)
వీథీం కుర్వన్ మహాబాహుః ద్రావయన్ మమ వాహినీమ్।
నృత్యన్నివ గదాపాణిః యుగాంతం దర్శయిష్యతి॥ 32
త్రోవ చేసుకుంటూ ముందుకు పోతూ, నా సేనను తరుముతూ గద చేతబట్టి నాట్యం చేస్తున్నట్లు భీముడు ప్రళయం చూపిస్తాడు. (32)
ప్రభిన్న ఇవ మాతంగః ప్రభంజన్ పుష్పితాన్ ద్రుమాన్।
ప్రవేక్ష్యతి రణే సేనాం పుత్రాణాం మే వృకోదరః॥ 33
మదించిన ఏనుగులాగా పూచిన చెట్లను విరుగ గొట్టుతూ యుద్ధంలో భీముడు నా కుమారుల సేనలో ప్రవేశిస్తాడు. (33)
కుర్వన్ రథాన్ విపురుషాన్ విసారథిహయధ్వజాన్।
ఆరుజన్ పురుషవ్యాఘ్రః రథినః సాదినస్తథా॥ 14
గంగావేగ ఇవానూపాన్ తీరజాన్ వివిధాన్ ద్రుమాన్।
ప్రభంక్ష్యతి రణే సేనాం పుత్రాణాం మమ సంజయ॥ 35
సంజయా! రథాల మీద పురుషులనూ, సారథులనూ, గుర్రాలను, ధ్వజాలను లేకుండా చేస్తూ, రథికులను, సారథులను మట్టుపెడుతూ, నీటిలోను, ఒడ్డున ఉన్న వివిధ వృక్షాలను గంగా ప్రవాహం కూలద్రోసినట్లు యుద్ధంలో ఆ పురుషశ్రేష్ఠుడు భీముడు నా పుత్రుల సేనను కూలద్రోస్తాడు. (34,35)
దిశో నూనం గమిష్యంతి భీమసేనభయార్దితాః।
మమ పుత్రాశ్చ భృత్యాశ్చ రాజానశ్పైవ సంజయ॥ 36
సంజయా! నా పుత్రులు, సేవకులు, రాజులు భీమసేనుని వల్ల భయంతో దిక్కులు పట్టి పారిపోతారు - తప్పదు. (36)
యేన రాజా మహావీర్యాః ప్రవిశ్యాంతఃపురం పురా।
వాసుదేవసహాయేన జరాసంధో నిపాతితః॥ 37
పూర్వం వీడు వాసుదేవ సహాయంతో అంతఃపురంలో ప్రవేశించి జరాసంధుని వధించాడు. (37)
కృత్స్నేయం పృథివీ దేవీ జరాసంధేన ధీమతా।
మాగధేంద్రేన బలినా వశే కృత్వా ప్రతాపితా॥ 38
తెలివి తేటలు, బలమూ కల మగధరాజు జరాసంధుడు భూదేవి నంతటినీ తన వశం చేసుకొన్నాడు. అలా భూమి తపించింది. (38)
భీష్మప్రతాపాత్ కురవః నయేనాంధకవృష్ణయః।
యన్న తస్య వశే జగ్ముః కేవలం దైవమేవ తత్॥ 39
భీష్మప్రతాపం వల్ల కురువంశం వారూ, నీతి వల్ల అంధక వృష్ణి వంశాల వారూ ఆ జరాసంధునికి వశం కాలేదు. అది కేవలం అదృష్టమే. (39)
స గత్వా పాండుపుత్రేణ తరసా బాహుశాలినా7.
అనాయుధేన వీరేణ నిహతః కిం తతోఽధికమ్॥ 40
ఆ జరాసంధుడు ఆయుధం లేని బాహు బలశాలి అయిన భీమునిచేత చంపబడ్డాడు. అంటే... అంతకంటె గొప్ప ఏమిటి? (40)
దీర్ఘకాలసమాసక్తం విషమాశీవిషో యథా।
స మోక్ష్యతి రణే తేజః పుత్రేషు మమ సంజయ॥ 41
సంజయా! చాలాకాలంగా నిలుపుకొన్న విషాన్ని పాము ఒక్కసారిగా కక్కినట్లు భీముడు తన పరాక్రమం అంతా నా పుత్రుల మీద కక్కుతాడు. (41)
మహేంద్ర ఇవ వజ్రేణ దానవాన్ దేవసత్తమః।
భీమసేనో గదాపాణిః సూదయిష్యతి మే సుతాన్॥ 42
దేవేంద్రుడు వజ్రంతో రాక్షసులను సంహరించినట్లు భీముడు గద చేతధరించి నా పుత్రులను చావమోదుతాడు. (42)
అవిషహ్యమనావార్యం తీవ్రవేగపరాక్రమమ్।
పశ్యామీవాతితామ్రాక్షమ్ ఆపతంతం వృకోదరమ్॥ 43
ఆ భీముని పరాక్రమంవేగం తట్టుకోలేము. ఆపలేము, ఎర్రని కళ్లతో భీముడు మీద పడుతున్నట్లే అనిపిస్తుంది. (43)
అగదస్యాప్యధనుషోః విరథస్య వివర్మణః।
బాహుభ్యాం యుధ్యమానస్య కస్తిష్ఠేదగ్రతః పుమాన్॥ 44
గద లేకుండా ధనుస్సు లేకుండా, రథం, కవచం లేకుండా కేవలం భుజబలంతోనే పోరాడే ఆ భీముని ముందు నిలవగల వాడెవడుంటాడు? (44)
భీష్మో ద్రోణశ్చ విప్రోఽయం కృపః శారద్వతస్తథా।
జానంత్యేతే యథైవాహం వీర్యజ్ఞ స్తస్య ధీమతః॥ 45
భీష్ముడూ, విప్రుడయిన ద్రోణుడూ, కృపుడూ కూడ నా వలెనే ధీమంతుడైన భీముని పరాక్రమం ఎరుగుదురు.(45)
ఆర్యవ్రతం తు జానంతః సంగరాంతం విధిత్సవః।
సేనాముఖేషు స్థాప్యంతి మామకానాం నరర్షభాః॥ 46
ఉత్తములయిన వీరంతా ఆర్యప్రవృత్తి నెరిగినవారు. నా వారయిన వీరులంతా సేనాముఖాన నిలిచి మాకోసం ప్రాణాలయినా అర్పించుతారు. (46)
బలీయః సర్వతో దిష్టం పురుషస్య విశేషతః।
పశ్యన్నపి జయం తేషాం న నియచ్ఛామి యత్సుతాన్॥ 47
దైవమే అంతటా బలీయమైనది. పురుషుని విషయంలో మరీను - ఆ పాండవుల విజయం గమనిస్తూ ఉన్నా నా కుమారులను అదుపు చేయలేక పోతున్నాను. (47)
తే పురాణం మహేష్వాసాః మార్గమైంద్రం సమాస్థితాః।
త్యక్ష్యంతి తుములే ప్రాణాన్ రక్షంతః పార్థివం యశః॥ 48
గొప్ప ధనుర్ధరులైన ఈ వీరులు ప్రాచీనమయిన స్వర్గ మార్గాన్ని అనుసరిస్తారు. క్షత్రియ ధర్మం రక్షించుకొంటూ ప్రాణాలయినా విడుస్తారు. (48)
యథైషాం మామకా స్తాత తథైషాం పాండవా అపి।
పౌత్రా భీష్మస్య శిష్యాశ్చ ద్రోణస్య చ కృపస్య చ॥ 49
సంజయా! వీరికి మా వారెట్లో పాండవులూ అట్లే. భీష్మునికి మనుమలు - ద్రోణునికీ, కృపునికీ శిష్యులు. (49)
యే త్వస్మదాశ్రయం కించిద్ దత్తమిష్టం చ సంజయ।
తస్యాపచితిమార్యత్వాత్ కర్తారః స్థవిరాష్ట్రయః॥ 50
సంజయా! వారికి మేము ఆశ్రయమిచ్చాము. వారికిష్టమయినదీ కొద్దిగా ఇచ్చాము. సజ్జనులు కాబట్టి పెద్దవాళ్లు ముగ్గురూ ఆ ఋణం తీర్చుకోవాలని(మా పక్షాన) ఉన్నారు. (50)
ఆదదానస్య శస్త్రం హి క్షత్రధర్మం పరీప్సతః।
నిధనం క్షత్రియస్యాజౌ వరమేవాహురుత్తమమ్॥ 51
శస్త్రం పట్టి క్షత్రియ ధర్మం కోరుకొనే క్షత్రియుడికి యుద్ధంలో మరణించడమే ఉత్తమమని, మేలని అంటారు. (51)
స వై శోచామి సర్వాన్ వై యే యుయుత్సంతి పాండవైః।
విక్రుష్టం విదురేణాదౌ తదేతద్భయమాగతమ్॥ 52
పాండవులతో యుద్ధం చేయాలనుకొంటున్న వారందరి కోసం నేను ఏడుస్తున్నాను. మొదట్టి నుండీ విదురుడు మొరపెడూతూనే ఉన్నాడు. ఆ భయం రానే వచ్చింది. (52)
న తు మన్యే విఘాతాయ జ్ఞానం దుఃఖస్య సంజయ।
భవత్యతిబలం హ్యేతత్ జ్ఞానస్యాప్యుపఘాతకమ్॥ 53
సంజయా! జ్ఞానం దుఃఖాన్ని పోగొట్టుతుందని నేను భావించను. దుఃఖం బలీయమైనది. జ్ఞానాన్ని కూడ అది చంపుతుంది. (53)
ఋషయో హ్యపు నిర్ముక్తాః పశ్యంతో లోకసంగ్రహాన్।
సుఖైర్భవంతి సుఖినః తథా దుఃఖేన దుఃఖితాః॥ 54
జీవన్ముక్తులై లోక వ్యవహారం గమనించే ఋషులు కూడ సుఖాలతో సుఖపడుతున్నారు. దుఃఖాలతో దుఃఖపడుతున్నారు. (54)
కిం పున ర్మోహమాసక్తః తత్ర తత్ర సహస్రధా।
పుత్రేషు రాజ్యదారేషు పౌత్రేష్వపి చ బంధుషు॥ 55
ఇక కొడుకులు, రాజ్యం, భార్యలు, మనుమలు, బంధువులు, అని వేయి విధాల మోహంతో పడిపోతున్న వారి గురించి వేరే చెప్పడమెందుకు? (55)
సంశయే తు మహత్యస్మిన్ కిం ను మే క్షమముత్తరమ్।
వినాశం హ్యేవ పశ్యామి కురూణామనుచింతయన్॥ 56
పెద్ద సందేహ సమయమయిన ఇప్పుడు నేను చేయగల అనంతర కృత్యం ఏమిటి? ఎంత ఆలోచించినా నాకు కౌరవుల నాశనమే గోచరిస్తోంది. (56)
ద్యూతప్రముఖమాభాతి కురూణాం వ్యసనం మహత్।
మందే నైశ్వర్యకామేబ లోభాత్పాపమిదం కృతమ్॥ 57
జూదం దగ్గర నుండే కౌరవులకు గొప్ప భయం/ కష్టం కనపడుతోంది. ఐశ్వర్యం కోరుతున్న నా తెలివితక్కువ కొడుకు యొక్క లోభంతో ఈ పాపం చేయబడింది. (57)
మన్యే పర్యాయ ధర్మోఽయం కాలస్యాత్యంతగామినః।
చక్రే ప్రధిరివాసక్తః నాస్య శక్యం పలాయితుమ్॥ 58
నిరంతరంగా నడిచే కాలంయొక్క క్రమధర్మం ఇది అనుకుంటాను - చక్రానికి అంటుకొన్న పట్టా లాగా కాలానికి తగుల్కొన్నవాడు(దాని నుండి) పారిపోలేడు. (58)
వి॥సం॥ పర్యాయ ధర్మః = విపరీత ధర్మం (నీల); క్రమంగా సుఖదుఃఖాల ననుభవించటం పర్యాయం, ఆ ధర్మమే పర్యాయధర్మం. (సర్వ)
కిం ను కుర్యాం కథం కుర్యాం క్వను గచ్ఛామి సంజయ।
ఏతే నశ్యంతి కురవః మందాః కాలవశం గతాః॥ 59
ఏం చెయ్యను? ఎలా చెయ్యను? ఎక్కడకు పోను? సంజయా! ఈ తెలివి తక్కువ కౌరవులు కాలానికి వశులయి నశించిపోతారు. (59)
అవశోఽహం తదా తాత పుత్రాణాం నిహతే శతే।
శ్రోష్యామి నినదం స్త్రీణాం కథం మాం మరణం స్పృశేత్॥ 60
సంజయా! నా వందమంది కొడుకులూ చనిపోయాక అవశుడనైన నేను కౌరవస్త్రీల ఏడుపులను ఎలా వినగలను? నాకు(ఇపుడే) మరణం సంభవించునుగాక. (60)
యథా నిదాఘే జ్వలినః సమిద్ధః
దహేత్ కక్షం వాయునా చోద్యమానః।
గదాహస్తః పాండవో వై తథైవ
హంతా మదీయాన్ సహితోఽర్జునేన॥ 61
వేసవికాలంలో గాలితో విజృంభించే అగ్ని అడవిని దహించి వేశినట్లు భీముడు గద చేతపట్టి అర్జునునితో కలిసి నా కుమారుల నందరినీ చంపి వేస్తాడు. (61)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వాక్యే ఏకపంచాశత్తమోఽధ్యాయ॥ 51 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వాక్యమను ఏబది యొకటవ అధ్యాయము. (51)