59. ఏబది తొమ్మిదవ అధ్యాయము

కృష్ణుని మాటలను సంజయుడు చెప్పుట.

ధృతరాష్ట్ర ఉవాచ
యదబ్రూతాం మహాత్మానౌ వాసుదేవ ధనంజయౌ।
తన్మే బ్రూహి మహాప్రాజ్ఞ శుశ్రూషీ వచనం తవ॥ 1
సంజయా! ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. మహాప్రాజ్ఞా విదురా! మహాత్ములయిన కృష్ణార్జునులు ఏమన్నారు? చెప్పు. నాకు నీనోట వినాలని ఉంది. (1)
సంజయ ఉవాచ
శృణు రాజన్ యథా దృష్టౌ యథా కృష్ణ ధనంజయౌ।
ఊచతు శ్చాపి యద్వీరౌ తత్తే వక్ష్యామి భారత॥ 2
సంజయుడు చెప్పాడు. రాజా! ఆ కృష్ణార్జునులను ఎలా దర్శించానో వాళ్లు ఏమన్నారో చెపుతా విను. (2)
పాదాంగుళీ రభిప్రేక్షన్ ప్రయతోఽహం కృతాంజలిః।
శుద్ధాంతం ప్రావిశం రాజన్ ఆఖ్యాతుం నరదేవయోః॥ 3
రాజా! ఆ కృష్ణార్జునుల పాదాలవ్రేళ్లు పవిత్రదృష్టితో చూస్తూ అంజలించి, వారితో మాట్లాడటానికి అంతఃపురంలోకి ప్రవేశించాను. (3)
నైవాభిమన్యు ర్న యమౌ తం దేశమభియాంతి వై।
యత్ర కృష్ణౌ చ కృష్ణా చ సత్యభామా చ భామినీ॥ 4
కృష్ణార్జునులు, సత్యభామ, ద్రౌపది ఉన్న ఆ ప్రదేశానికి అభిమన్యుడు కాని నకుల సహదేవులు కాని వెళ్లరాదు. (4)
ఉభౌ మధ్వాసవక్షీబౌ ఉభౌ చందనరూషితౌ।
స్రగ్విణౌ వరవస్త్రౌ తౌ దివ్యాభరణభూషితౌ॥ 5
ఆ యిద్దరూ మధుపానంతో మదించి ఉన్నారు. మంచి గంధం పూసుకొని, మాలలు, దాల్చి, చక్కని వస్త్రాలు దివ్యాభరణాలు దాల్చి ఉన్నారు. (5)
నైకరత్నం విచిత్రం తు కాంచనం మహదాసనమ్।
వివిధాస్తరణాకీర్ణం యత్రాసాతామరిందమౌ॥ 6
కృష్ణార్జునులున్నచోట పెద్ద బంగారు ఆసనం ఉంది. అది చాలా రత్నాలు పొదిగిన విచిత్ర వర్ణం కలది. దానిమీద ఎన్నో పరుపులు పరిచారు. (6)
ర్జునోత్సంగగౌ పాదౌ కేశవస్యోపలక్షయే।
అర్జునస్య చ కృష్ణాయాం సత్యాయాం చ మహాత్మనః॥ 7
కృష్ణుడు తన పాదాలను అర్జునుని ఒడి మీదుగా చాచుకొని సత్యభామ ఒడిలో ఉంచుకొన్నాడు. అర్జునుడు తన పాదాలను ద్రౌపది ఒడిలో ఉంచుకొన్నాడు. (7)
కాంచనం పాదపీఠం తు పార్థో మే ప్రాదిశత్తదా।
తదహం పాణినా స్పృష్ట్వా తతో భూమావుపావిశమ్॥ 8
సువర్ణ ఖచితమయిన పాదపీఠం అర్జునుడు నాకు చూపించాడు. దాన్ని నేను చేతితో తాకి నేలమీదనే కూర్చున్నాను. (8)
ఊర్ధ్వరేఖాతలౌ పాదౌ పార్థస్య శుభలక్షణౌ।
పాదపీఠాదపహృతౌ తత్రాపశ్యమహం శుభౌ॥ 9
శుభలక్షణాలు, ఊర్ధ్వరేఖలు కల అర్జునుని పాదాలను అతడు పాదపీఠం నుండి తీస్తున్నపుడు చూశాను. (9)
శ్యామౌ బృహంతౌ తరుణౌ శాలస్కంధావివోద్గతౌ।
ఏకాసనగతౌ దృష్ట్వా భయం మాం మహదావిశత్॥ 10
కృష్ణార్జునులిద్దరూ, నీల వర్ణంతో నిండయిన రూపంతో, సాలవృక్షపు కొమ్మలవలె ఎగుబుజాలు కలిగి ఉన్నారు. ఒకే ఆసనం మీద ఉన్న వారిద్దరినీ చూచేసరికి నాకు చాలా భయం వేసింది. (10)
ఇంద్రవిష్ణుసమావేతౌ మందాత్మా నావబుద్ధ్యతే।
సంశ్రయాద్ద్రోణ భీష్మాభ్యాం కర్ణస్య చ వికత్థనాత్॥ 11
ద్రోణ భీష్ముల ఆశ్రయం వల్లనూ, కర్ణుని ప్రగల్భాలతోను మందబుద్ధి అయిన దుర్యోధనుడు ఇంద్ర, విష్ణు సమానులయిన నరుని, కృష్ణునీ తెలిసికొన లేకపోతున్నాడు. (11)
నిదేశస్థావిమౌ యస్య మానసస్తస్య సేత్స్యతే।
సంకల్పో ధర్మరాజస్య నిశ్చయో మే తదా భవత్॥ 12
"ఈకృష్ణార్జునులు వశవర్తులయి ఉన్న ధర్మరాజు యొక్క సంకల్పం నెరవేరక ఏమవుతుంది?" అనిపించింది నాకు. (12)
సత్కృతశ్చాన్నపానాభ్యామ్ ఆసీనో లబ్ధసత్క్రియః।
అంజలిం మూర్ధ్నిసంధాయ తౌ సందేశమచోదయమ్॥ 13
ఆహార పానీయాలిచ్చి నన్ను సత్కరించారు. ఆ మన్నన పొంది కూర్చున్నాను. చేతులెత్తి వారికి నమస్కరించి వారు సందేశం ఇచ్చేటట్లు ఎదురుచూస్తూ నిలిచాను. (13)
వి॥ దేవతలకు చేతులెత్తి నమస్కరించడం సంప్రదాయం.
ధనుర్గుణకిణాంకేన పాణినా శుభలక్షణమ్।
పాదమానమయన్ పార్థః కేశవం సమచోదయత్॥ 14
వింటినారి దెబ్బలతో కాయలు కాచిన చేతితో శుభ లక్షణాలు కల కృష్ణుని పాదాలకు మ్రొక్కిస్తూ అర్జునుడు కృష్ణుని (మాట్లాడటానికి) ప్రేరేపించాడు. (14)
ఇంద్రకేతురివోత్థాయ సర్వాభరణ భూషితః।
ఇంద్రవీర్యోపమః కృష్ణః సంవిష్టో మాభ్యభాషత॥ 15
సర్వాభరణాలూ అలంకరించుకొని, ఇంద్ర సమానమయిన శక్తి గల కృష్ణుడు ఇంద్ర ధనుస్సులాగా వంగి లేచి చక్కగా కూర్చుని నాతో ఇలా అన్నాడు. (15)
వాచం స వదతాం శ్రేష్ఠః హ్లాదినీం వచనక్షమామ్।
త్రాసినీం ధార్తరాష్ట్రాణాం మృదుపూర్వాం సుదారుణామ్॥ 16
వాచం తాం వచనార్హస్య శిక్షాక్షర సమన్వితామ్।
అశ్రౌషమహమిష్టార్థాం పశ్చాత్ హృదయహారిణీమ్॥ 17
వాక్చతురుడైన కృష్ణుడు ఆహ్లాదకరమూ, సముచితమూ అయినట్లు మాట్లాడాడు. ఆమాట మొదట్లో మృదువుగానూ, రానురాను దారుణంగానూ కౌరవులకు భయం కలిగేటట్లు ఉంది. ఎలా మాట్లాడాలో నేర్పుతున్నట్లున్న ఆ మాటలు అతడే చెప్ప దగినవాడు. ఇష్టమైన అర్థం కలిగి మనోహరమైన మాట కృష్ణుని నుండి విన్నాను. (16,17)
వాసుదేవ ఉవాచ
సంజయేదం వచో బ్రూయాః ధృతరాష్ట్రం మనీషిణమ్।
కురుముఖ్యస్య భీష్మస్య ద్రోణస్యాపి చ శృణ్వతః॥ 18
వాసుదేవుడు అన్నాడు. సంజయా! కురువంశంలో ముఖ్యుడు భీష్ముడు, ద్రోణుడూ వినేటట్లు గొప్ప తెలివిగల ధృతరాష్ట్రునితో ఈ మాట చెప్పు. (18)
ఆవయోర్వచనాత్ సూత జ్యేష్ఠానప్యభివాదయన్।
యవీయసశ్చ కుశలం పశ్చాత్ పృష్ట్వైవముత్తరమ్॥ 19
సంజయా! పెద్దలకు నమస్కారాలు చెపుతూ, పిన్నలను కుశలమడుగుతూ మా యిద్దరి మాటగా ఇలా చెప్పు. (19)
యజధ్వం వివిధైర్యజ్ఞైః విప్రేభ్యో దత్తదక్షిణాః।
పుత్రదారైశ్చ మోదధ్వం మహద్వో భయమాగతమ్॥ 20
విప్రులకు భూరి దక్షిణలిచ్చి చేయగలిగి నన్ని యజ్ఞాలు చేయండి. భార్యాపుత్రులతో ఆనందంతో గడపండి. మీకు పెద్ద ముప్పు వచ్చి పడింది. (20)
అర్థాం స్త్యజత పాత్రేభ్యః సుతాన్ ప్రాప్నుత కామజాన్।
ప్రియం ప్రియేభ్యశ్చరత రాజా హి త్వరతే జయే॥ 21
పాత్రులకు ధనం దానం చెయ్యండి - కోరినట్లు అనుభవించి కొడుకులను పొందండి - ఇష్టులకు ప్రియం చెయ్యండి. ధర్మరాజు విజయంకోసం త్వరపడుతున్నాడు. (21)
ఋణమేతత్ ప్రవృద్ధం మే హృదయాన్నాపసర్పతి।
యద్గోవిందేతి చుక్రోశ కృష్ణా మాం దూరవాసినమ్॥ 22
ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ద్రౌపది గోవిందా! అని మొరపెట్టుకొంది కదా! ఆ అప్పు పెరిగిపోయి నామనసు లోంచి పోవటం లేదు. (22)
తేజోమయం దురాధర్షం గాండీవం యస్య కార్ముకమ్।
మద్ద్వితీయేన తేనేహ వైరం వః సవ్యసాచినా॥ 23
అర్జునుని గాండీవం అసలే తేజోమయం, ఆపలేము. పైగా అతడు సవ్యసాచి, నాతో కలిసి వస్తున్నాడు. ఇంతవైరం వచ్చిపడింది మీకిప్పుడు. (23)
మద్ద్వితీయం పునః పార్థం కః ప్రాథయితు మిచ్ఛతి।
యోఽపి కాలపరీతో వాఽప్యపి సాక్షాత్పురందరః॥ 24
నాతో కలిసిన అర్జునుని ఎదుర్కొనాలని అనుకొనేవాడు కాలం చెల్లినవాడేనా అయి ఉండాలి లేదా సాక్షాత్తు వాని తండ్రి ఇంద్రుడైనా కావాలి కాని మరొకడు ఉండడు. (24)
బాహుభ్యాముద్వహే ద్భూమిం దహేత్ క్రుద్ధ ఇమాః ప్రజాః।
పాతయే త్త్రిదివాద్దేవాన్ యోఽర్జునం సమరే జయేత్॥ 25
యుద్ధంలో అర్జునుని జయింపగలవాడు చేతులతో భూమి నెత్తిపట్టుకోగలడు. ఈ ప్రజలందరినీ దహించి వేయగలడు. దేవతలను నేలమీదకు పడగొట్టగలడు. (25)
దేవాసుర మనుష్యేషు యక్ష గంధర్వ భోగిషు।
న తం పశ్యామ్యహం యుద్ధే పాండవం యోఽభ్యయాద్రణే॥ 26
యుద్ధంలో అర్జునుని ఎదిరించగల వానిని దేవతలలోకాని, రాక్షసులలో కాని, మనుష్యుల్లోకాని, యక్ష, గంధర్వుల్లోకాని, నాగుల్లో కాని, ఎవరినీ ఇంతవరకు నేను చూడలేదు. (26)
యత్త ద్విరాట నగరే శ్రూయతే మహదద్భుతమ్।
ఏకస్య చ బహూనాం చ పర్యాప్తం తన్నిదర్శనమ్॥ 27
ఎందుచేతనంటే విరాటనగరంలో పెద్ద అద్భుతం - ఒక నరునికి ఎంతోమంది ఓడిపోయారని విన్నాం గదా! ఆ నిదర్శనం ఒకటి చాలు. (27)
ఏకేన పాండుపుత్రేన విరాటనగరే యదా।
భగ్నాః పలాయత దిశః పర్యాప్తం తన్నిదర్శనమ్॥ 28
పాండురాజు పుత్రులలో ఒక్కనికి - అర్జునునికి - మహామహులంతా ఓడి దిక్కులు పట్టి పరిపోయిన సంగతి చాలును. (28)
బలం వీర్యం చ తేజశ్చ శీఘ్రతా లఘుహస్తతా।
అవిషాదశ్చ ధైర్యం చ పార్థాన్నాన్యత్ర విద్యతే॥ 29
బలం, ఉత్సాహం, శక్తి, చురుకుదనం, లాఘవం, స్తిమితత్వం, ధైర్యం ఇవి అన్ని అర్జునునిలో తప్ప, మరెక్కడా కనిపించవు. (29)
ఇత్యబ్రవీ ద్ధృషీకేశః పార్థముద్ధర్షయన్ గిరా।
గర్జన్ సమయవర్షీవ గగనే పాకశాసనః॥ 30
మాటలతో అర్జునుని వేడెక్కిస్తూ, తగినకాలంలో వర్షించే ఇంద్రునిలాగా కృష్ణుడు గర్జిస్తూ ఇలా అన్నాడు. (30)
కేశవస్య వచః శ్రుత్వా కిరీటీ శ్వేతవాహనః।
అర్జునస్తన్మహ ద్వాక్యమ్ అబ్రవీద్రోమహర్షణమ్॥ 31
కృష్ణుని మాటలు విని శ్వేతవాహనుడూ, కిరీటీ అయిన అర్జునుడు ఆ మహాత్ముని మాటలనే ఒళ్లు పులకరించేటట్లు అనువదించాడు/మళ్లీ అన్నాడు. (31)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయే శ్రీకృష్ణవాక్యకథనే ఏకోన షష్టితమోఽధ్యాయ॥ 59 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వము అను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమును సంజయుడు చెప్పుట అను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)