66. అరువది ఆరవ అధ్యాయము

అర్జునుని మాటలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట.

అర్జునుని మాటలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహాప్రాజ్ఞః ధృతరాష్ట్రః సుయోధనమ్।
పునరేవ మహాభాగః సంజయం పర్యపృచ్ఛత॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మిక్కిలి తెలివైన ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఇలా చెప్పి మళ్లీ సంజయుని ఇలా అడిగాడు. (1)
బ్రూహి సంజయ య్చ్ఛేషం వాసుదేవాదనంతరమ్।
యదర్జున ఉవాచ త్వం పరం కౌతూహలం హి మే॥ 2
సంజయా! వాసుదేవుని తర్వాత అర్జునుడు చెప్పినది ఏమిటో చెప్పు. వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది(2)
సంజయ ఉవాచ
వాసుదేవవచః శ్రుత్వా కుంతీపుత్రో ధనంజయః।
ఉవాచ కాలే దుర్ధర్షః వాసుదేవస్య శృణ్వతః॥ 3
సంజయుడు ఇలా అన్నాడు. వాసుదేవుని మాటలు విని అర్జునుడు కృష్ణుడు వినేటట్లు సమయోచితంగా ఇలా అన్నాడు. (3)
పితామహం శాంతనవం ధృతరాష్ట్రం చ సంజయ।
ద్రోణం కృపం చ కర్ణం చ మహారాజం చ బాహ్లికమ్॥ 4
ద్రౌణిం చ సోమదత్తం చ శకునిం చాపి సౌబలమ్।
దుశ్శాసనం శలం చైవ పురుమిత్రం వివింశతిమ్॥ 5
వికర్ణం చిత్రసేనం చ జయత్సేనం చ పార్థివమ్।
విందానువిందా వావంత్యౌ దుర్ముఖం చాపి కౌరవమ్॥ 6
సైంధవం దుస్సహం చైవ భూరిశ్రవసమేవ చ।
భగదత్తం చ రాజానం జలసంధం చ పార్థివమ్॥ 7
యేచాప్యన్యే పార్థివా స్తత్ర యోద్ధుం
సమాగతాః కౌరవాణాం ప్రియార్థమ్।
ముమూర్షవః పాండవాగ్నౌ ప్రదీప్తే
సమానీతా ధార్తరాష్ట్రేణ హోతుమ్॥ 8
యథాన్యాయం కౌశలం వందనం చ
సమాగతా మద్వచనేన వాచ్యాః।
ఇదం బ్రూయాః సంజయ రాజమధ్యే
సుయోధనం పాపకృతాం ప్రధానమ్॥ 9
సంజయా! తాతగారయిన భీష్ముని, ధృతరాష్ట్రుని, ద్రోణుని, కృపుని, కర్ణుని, దుశ్శాసనుని, శలుని, పురుఇత్రుని, వివింశతిని, వికర్ణుని, చిత్రసేనుని, జయత్సేనుని, అవంతిరాజకుమారులు విందాను విందులను, కౌరవుడయిన దుర్ముఖుని, సైంధవుని, దుస్సహుని, భూరిశ్రవుని, భగదత్తుని, జరాసంధుని మొ॥ వారందరికీ వారికి తగినట్లు నమస్కారాలు చెప్పు. కుశలమడిగినట్లు చెప్పు. ఇక కౌరవుల ప్రియంకోరి, దుర్యోధనుడు హోమం చేసే పాండవాగ్నిలో పడాలని
వచ్చిన రాజులందరికీ తగినట్లు నామాటగా, కుశలమడుగు పాపులకు మూలాయిన ఆ దుర్యోధనునితో రాజసభలో ఇలా చెప్పు. (4-9)
1. బాహ్లికుడు = శంతనుని సోదరుడు.
2. సోమదత్తుడు; భూరిశ్రవుడు - బాహ్లికుని కొడుకు; మనుమడు
3. పురుమిత్రుడు - ధృతరాష్ట్రుని కొడుకు
4. వివింశతి, వికర్ణుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు వీరంతా దుర్యోధనుని తమ్ములు.
5. జయత్సేనుడు : జరాసంధుని పుత్రుడు - ఒక అక్షౌహిణి సేనతో కౌరవపక్షంలో చేరాడు.
6. భగదత్తుడు : ప్రాగ్జ్యోతిషనగరరాజు ఇతనికి సుప్రతీక మనే ఏనుగు ఉంది. ఇతనిని భారతయుద్ధంలో అర్జునుడు చంపాడు.
7. జలసంధుడు : ఒక మగధరాజు, ద్రౌపది స్వయంవరంలో ఉన్నాడు. యుద్ధంలో దుర్యోధనుని పక్షంలో చేరాడు. భారత రణ మృతుల్లో వ్యాసుడు చూపించాడు.
అమర్షణం దుర్మతిం రాజపుత్రం
పాపాత్మానం ధార్తరాష్ట్రం సులుబ్ధమ్।
సర్వం మమైతద్వచనం సమగ్రం
సహామాత్యం సంజయ శ్రావయేథాః॥ 10
సహనంలేని దుష్టబుద్ధి, పాపాత్ముడు లోభి అయిన దుర్యోధనునికి, మంత్రులతో సహా సంజయా! నేను చెప్పే మాటలన్నీ వినిపించు. (10)
ఏవం ప్రతిష్ఠాప్య ధనంజయో మాం
తతోఽర్థవద్ధర్మవచ్చాపి వాక్యమ్।
ప్రోవాచేదం వాసుదేవం సమీక్ష్య
పార్థో ధీమాన్ లోహితాంతాయతాక్షః॥ 11
ఇలా నన్ను నిలిపి అర్జునుడు కృష్ణుని వైపు చూసి ధర్మార్థ సహితంగా ఇలా అన్నాడు. అపుడా బుద్ధిమంతుని విశాలనేత్రాల తుదలలో ఎఱ్ఱజీరలు కనపడ్డాయి. (11)
యథా శ్రుతం తే వదతో మహాత్మనః
మధుప్రవీరస్య వచః సమీహితమ్।
తథైవ వాచ్యం భవతా హి మద్వచః
సమాగతేషు క్షితిపేషు సర్వశః॥ 12
కృష్ణుని మాట సమాహిత మనస్సుతో విన్నావుగా, రాజులంతా ఉన్న కొలువుతో నా మాటను కూడ అలాగే చెప్పాలి. (12)
శరాగ్నిధూమే రథనేమినాదితే
ధనుఃస్రువేణాస్త్రబలప్రసారిణా।
యథా న హోమః క్రియతే మహామృధే
సమేత్య సర్వే ప్రయతధ్వమాదృతాః॥ 13
బాణాలనే అగ్నుల పొగలతో, రథ చక్రాల మంత్ర నాదంతో, అస్త్రబలంతో ముందుకు సాగే ధనుస్సు అనే హోమపాత్రతో మేము యుద్ధమనే యజ్ఞం చేయకుండా మీరంతా కలిసి ప్రయత్నించండి. (13)
న చేత్ప్రయచ్ఛధ్వమమిత్రఘాతినః
యుధిష్ఠిరస్యాంశ మభీప్సితం స్వకమ్।
నయామి వః సాశ్వపదాతికుంజరాన్
దిశం పితౄణా మశినాం శితైః శరైః॥ 14
శత్రు సంహారకుడయిన యుధిష్ఠిరుని భాగం అతడు కోరినట్లుగా ఇవ్వకపోతే మిమ్మల్నీ మీ గజతురగ పదాతి దళాలనూ నా వాడి బాణాలతో అశుభంకరమయిన దక్షిణ దిక్కుకు తోలుతాను.(చంపి పారేస్తాను) (14)
తతోఽహ మామంత్ర్య తదా ధనంజయం
చతుర్భుజం చైవ నమస్య సత్వరః।
జవేన సంప్రాప్త ఇహామరద్యుతే
తవాంతికం ప్రాపయితుం వచో మహత్॥ 15
ఆ తరువాత ధనంజయుని వీడ్కొని, కృష్ణునికి నమస్కరించి, వేగంగా వారి మాటలు నీకు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే షట్ షష్టితమోఽధ్యాయ॥ 66 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయ వాక్యమను అరువది ఆరవ అధ్యాయము. (66)