82. ఎనుబది రెండవ అధ్యాయము
ద్రౌపది శ్రీకృష్ణునితో తన కష్టమును చెప్పుట.
వైశంపాయన ఉవాచ
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మార్థసహితం హితమ్।
కృష్ణా దాశార్హమాసీనమ్ అబ్రవీచ్ఛోకకర్శితా॥ 1
సుతా ద్రుపదరాజస్య స్వసితాయతమూర్ధజా।
సంపూజ్య సహదేవం చ సాత్యకిం చ మహారథమ్॥ 2
వైశంపాయనుడిలా అంటున్నాడు.
(జనమేజయా!) ధర్మార్థ సహితమూ, హితకరమూ అయిన ధర్మరాజు మాటలు విని నల్లగా పొడవుగా వ్రేలాడుతున్న కురులు గల ద్రౌపది దుఃఖిస్తూ, సహదేవునీ, మహారథుడైన సాత్యకినీ ప్రశంసించి అక్కడే కూర్చుని ఉన్న శ్రీకృష్ణునితో ఇలా అన్నది. (1,2)
భీమసేనం చ సంశాంతం దృష్ట్వా పరమదుర్మనాః।
అశ్రుపూర్ణేక్షణా వాక్యమ్ ఉవాచేదం మనస్వినీ॥ 3
భీమసేనుడు కూడా శాంతంగా ఉండటాన్ని చూచిన ద్రౌపది మనస్సు వికలమయింది. ఆ అభిమానవతి కళ్ళలో నీళ్ళు నింపుకొని ఇలా మాటాడింది. (3)
విదితం తే మహాబాహో ధర్మజ్ఞ మధుసూదన।
యథా నికృతిమాస్థాయ భ్రంశితాః పాండవాః సుఖాత్॥ 4
ధృతరాష్ట్రస్య పుత్రేణ సామాత్యేన జనార్దన।
యథా చ సంజయో రాజ్ఞా మంత్రం రహసి శ్రావితః॥ 5
యుధిష్ఠిరస్య దాశార్హ తచ్చాపి విదితం తవ।
యథోక్తః సంజయశ్పైవ తచ్చ సర్వం శ్రుతం త్వయా॥ 6
ధర్మజ్ఞా! మహాబాహుడవైన మధుసూదనా! మంతులతో కలసి ధృతరాష్ట్రుని కొడుకు సుయోధనుడు మోసంతో పాండవులను ఏవిధంగా సుఖాలకు దూరం చేశాడో నీకు తెలిసినదే. జనార్దనా! ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో సంప్రతించటానికి సంజయునితో ఎటువంటి రహస్య సమాలోచన జరిపాడో నీఖు తెలిసినదే! దాశార్హా! యుధిష్ఠిరుడు సంజయునితో ఏవిధంగా మాట్లాడాడో అదంతా నీ వెరిగినదే! (4,5,6)
పంచ నస్తాత దీయంతాం గ్రామా ఇతి మహాద్యుతే।
అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతమ్॥ 7
అవసానం మహబాహో కంచిదేకం చ పంచమమ్।
ఇతి దుర్యోధనో వాచ్యః సుహృదశ్చాస్య కేశవ॥ 8
తేజోమూర్తీ! కేశవా! సంజయా! అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం - ఐదవదిగా మరేదైనా గ్రామం మాకిస్తే చాలునని దుర్యోధనునితో, ఆయన సహచరులతో చెప్పవలసినది. (7,8)
న చాపి హ్యకరోద్ వాక్యం శ్రుత్వా కృష్ణ సుయోధనః।
యుధిష్ఠిరస్య దాశార్హ శ్రీమతః సంధిమిచ్ఛతః॥ 9
కృష్ణా! దాశార్హా! సంధిని కోరుతున్న శ్రీమంతుడైన యుధిష్ఠిరుడు చెప్పిన ఆ మాటను కూడా సుయోధనుడు లెక్క చేయలేదు. (9)
అప్రదానేన రాజ్యస్య యది కృష్ణ సుయోధనః।
సంధిమిచ్ఛేన్న కర్తవ్యం తత్ర గత్వా కథంచన్॥ 10
కృష్ణా! అక్కడకు నీవు వెళ్ళిన తర్వాత రాజ్యభాగమివ్వకుండా సుయోధనుడు సంధికి సమ్మతిస్తే ఎట్టి పరిస్థితులలోనూ సంధికి అంగీకరించవద్దు. (10)
శక్షంతి హి మహబాహో పాండవాః సృంజయైః సహ।
ధార్తరాష్ట్రబలం ఘోరం క్రుద్ధం ప్రతిసమాసితుమ్॥ 11
మహాబాహూ! సృంజయులతో కలిసిన పాండవులు కోపించిన ఆ భీకరసుయోధనసేనను ఎదిరించుటకు సమర్థులే. (11)
న హి సామ్నా న దానేన శక్యోఽర్థస్తేషు కశ్చన।
తస్మాత్ తేషు న కర్తవ్యా కృపా తే మధుసూదన॥ 12
మధుసూదనా! కౌరవుల విషయంలో సామం కానీ దానం కానీ అర్ధసిద్ధికి సహకరించవు. కాబట్టి వారి విషయంలో నీవు దయ చూప నవసరం లేదు. (12)
సామ్నా దానేన చా కృష్ణ యే న శామ్యంతి శత్రవః।
యోక్తవ్యస్తేషు దండః స్యాత్ జీవితం పరిరక్షతా॥ 13
కృష్ణా! తన జీవితాన్ని రక్షించుకొన వలసినవాడు సామదానోపాయాలతో శాంతించని శత్రువుల విషయంలో దండనీతినే ఉపయోగించాలి. (13)
తస్మాత్ తేషు మహాదండః క్షేప్తవ్యః క్షిప్రమచ్యుత।
త్వయా చైవ మహబాహో పాండవైః సహ సృంజయైః॥ 14
కాబట్టి అచ్యుతా! ఆ ధార్తరాష్ట్రుల విషయంలో నీవూ సృంజయైః॥ 14
కాబట్టి అచ్యుతా! ఆ ధార్తరాష్ట్రుల విషయంలో నీవూ, సృంజయులూ, పాండవులూ కలిసి వెంటనే తీవ్రంగా దండాన్నే ప్రయోగించాలి. (14)
ఏతత్ సమర్థం పార్థానాం తవ చైవ యశస్కరమ్।
క్రియమాణం భవేత్ కృష్ణ క్షత్రస్య చ సుఖకరమైనది. (15)
క్షత్రియేణ హి హంతవ్యః క్షత్రియో లోభమాస్థితః।
అక్షత్రియో వా దాశార్హ స్వధర్మ మనుతిష్ఠతా॥ 16
దాశార్హా! స్వధర్మాన్ని పాటిస్తున్నా క్షత్రియుడు, లోభానికి లోనయినవాడు క్షత్రియుడు అయినా కాకపోయినా సరే వాడిని సంహరించాలి. (16)
అన్యత్ర బ్రాహ్మణాత్ తాత సర్వపాపేష్వవస్థితాత్।
గురుర్హి సర్వవర్ణానాం బ్రాహ్మణః ప్రసృతాగ్రభుక్॥ 17
తండ్రీ! బ్రహ్మణుల విషయంలో తప్పమిగిలిన జాతులకు ఈ నియమం వర్తిస్తుంది. బ్రాహ్మణుడు సర్వ పాపాలలో మునిగిఉన్నా ప్రాణదండనకు తగదు. ఎందుకంటే బ్రాహ్మణుడు సర్వవర్ణాలకూ గురువు, సమస్తదానాలకు ప్రథమ ప్రతిగ్రహీత అతడే. (అనుభవించవలసినవాడు) (17)
యథావధ్యే వధ్యమానే భవేద్ దోషో జనార్దన।
స వధ్యస్యావధే దృష్ట ఇతి ధర్మవిదో విదుః॥ 18
జనార్దనా! చంపదగనివానిని చంపటమెంత తప్పో చంపదగిన వానిని చంపకుండుట కూడా అంతే తప్పని ధర్మవేత్తలు భావిస్తారు. (18)
యథా త్వాం న స్పృశేదేషః దోషః కృష్ణ తథా కురు।
పాండవైః సహ దాశార్హైః సృంజయైశ్చ ససైనికైః॥ 19
కృష్ణా! అటువంటి దోషానికి నీవు పాత్రుడవు కాని విధంగా సేనతో కూడిన సృంజయులతో యాదవులతో పాండవులతో కార్యాన్ని నిర్వహించు. (19)
పునరుక్తం చ వక్ష్యామి విస్రంభేణ జనార్దన।
కా తు సీమంతినీ మాదృక్ పృథివ్యామస్తి కేశవ॥ 20
జనార్దనా! కేశవా! నీమీద ఉన్న చనువుతో చెప్పిన విషయాన్ని మరల చెప్తున్నాను. ఈ లోకంలో నావంటి స్త్రీ మరొకతె ఉండదు. (20)
సుతా ద్రుపదరాజస్య వేదిమధ్యాత్ సముత్థితా।
ధృష్టద్యుమ్నస్య భగినీ తవ కృష్ణ ప్రియా సఖే॥ 21
కృష్ణా! నేను యజ్ఞవేది మధ్యనుండి పుట్టిన దానను. ద్రుపదరాజుకుమార్తెను. ధృష్టద్యుమ్నుని సోదరిని, నీకు ప్రియసోదరిని. (21)
ఆజమీఢకులం ప్రాప్తా స్నుషా పాండోర్మహాత్మనః।
మహిషీ పాండుపుత్రాణాం పంచేంద్రసమవర్చసామ్॥ 22
ఆజమీఢ వంశంలో అడుగుపెట్టినదానను మహాత్ముడైన పాండురాజుకు కోడలను, ఇంద్ర సమాను లయిన అయిదుగురు పాండవులకు పట్టమహిషిని. (22)
సుతా మే పంచభిర్వీరైః పంచ జాతా మహారథాః।
అభిమన్యుర్యథా కృష్ణ తథా తే తవ ధర్మతః॥ 23
కృష్ణా! వీరులైన అయిదుగురు భర్తలద్వారా మహారథులయిన అయిదుగురు కొడుకులు నాకు పుట్టారు. అభిమన్యుడు నీకు మేనల్లుడు అయినట్లు నా అయిదుగురు కొడుకులు కూడా నీకు మేనల్లుళ్ళ వంటివారే. (23)
సాహం కేశగ్రహం ప్రాప్తా పరిక్లిష్టా సభాం గతా।
పశ్యతాం పాండుపుత్రాణాం త్వయి జీవతి కేశవ॥ 24
కేశవా! అటువంటి నన్ను కూడా పాండవులు చూస్తుండగా నీవు బ్రతికి ఉండగా జుట్టుపట్టుకొని కొలువులోనికీడ్చి పరాభవించారు. (24)
జీవత్సు పాండుపుత్రేషు పంచాలేష్వథ వృష్ణిషు।
దాసీభూతాస్మి పాపానాం సభామధ్యే వ్యవస్థితా॥ 25
పాండురాజకుమారులు, పాంచాలురు, యాదవులు జివించి ఉండగానే పాపాత్ములయిన కౌరవులకు దాసినై కొలువుకూటంలో ఆ రీతిగా నిలవవలసివచ్చింది. (25)
నిరమర్షేష్వచేష్టేషు ప్రేక్షమాణేషు పాండుషు।
పాహి మామితి గోవింద మనసా చింతితోఽసి మే॥ 26
పాండవులు కోపాన్ని కోల్పోయి నిశ్చేష్టులై చూస్తుండగా "గోవిందా నన్ను రక్షించు" అని మనసా నిన్నే తలచుకొన్నాను. (26)
యత్ర మాం భగవాన్ రాజా శ్వశురో వాక్యమబ్రవీత్।
వరం వృణీష్వ పాంచాలి వరార్హాసి మతా మమ॥ 27
ఆ సభలో పూజ్యుడయిన మా మామ ధృతరాష్ట్ర మహారాజు "పాంచాలి! వరాలను పొందటానికి తగిన దానినిగా నిన్ను భావిస్తున్నాను. వరం కోరుకో" అని అన్నారు. (27)
అదాసాః పాండవాః సంతు సరథాః సాయుధా ఇతి।
మయోక్తే యత్ర నిర్ముక్తాః వనవాసాయ కేశవ॥ 28
కేశవా! "పాండవులు రథాలు ఆయుధాలతో పాటు దాస్యం నుండి విముక్తులు కావాలి" అని నా కోరిక మేరకు వనవాసంకోసం దాస్యం నుండి విముక్తులయ్యారు. (పాండవులు) (28)
ఏవం విధానాం దుఃఖానామ్ అభిజ్ఞోఽసి జనార్దన।
త్రాయస్వ పుండరీకాక్ష సభర్తృజ్ఞాతి బాంధవాన్॥ 29
జనార్దనా! మేము పడిన ఇటువంటి పాట్లు అన్నీ నీకు తెలుసు. పుండరీకాక్ష! నా భర్తలను, దాయాదులను, బంధువులను నీవే కాపాడాలి. (29)
నన్వహం కృష్ణ భీష్మస్య ధృతరాష్ట్రస్య చోభయోః।
స్నుషా భవామి ధర్మేణ సాహం దాసీకృతా బలాత్॥ 30
కృష్ణా! నేను భీష్మునకూ, ధృతరాష్ట్రునికీ కూడా వరసకు కోడలినే గదా! అయినా కూడా(వారి సన్నిధిలోనే) నేను బలాత్కారంగా దాసిని చేయబడ్డాను. (30)
ధిక్ పార్థస్య ధనుష్మత్తాం భీమసేనస్య ధిగ్ బలమ్।
యత్ర దుర్యోధనః కృష్ణ ముహూర్తమపి జీవతి॥ 31
కృష్ణ! ఈ స్థితిలో దుర్యోధనుడు ఇక ఒక్క క్షణం బ్రతికి ఉన్నా అర్జునుడు వింటిని పట్టడం, భీమసేనుని బలం రెండూ చీదరించుకొనదగినవే. (31)
యది తేఽహమనుగ్రాహ్యా యది తేఽస్తి కృపా మయి।
ధార్థరాష్ట్రేషు వై కోపః సర్వః కృష్ణ విధీయతామ్॥ 32
కృష్ణా! నేను నీ అనుగ్రహానికి తగినదాన ననిపిస్తే, నామీద నీకు దయ ఉంటే ధార్తరాష్ట్రులపై పూర్తిగా కోపాన్ని ప్రకటించు. (32)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తా మృదుసంహారం వృజినాగ్రం సుదర్శనమ్।
సునీలమసితాపాంగీ సర్వగంధాధివాసితమ్॥ 33
సర్వలక్షణసంపన్నం మహాభుజగవర్చసమ్।
కేశపక్షం వరారోహా గృహ్య వామేన పాణినా॥ 34
పద్మాక్షీ పుండరీకాక్షమ్ ఉపేత్య గజగామినీ।
అశ్రుపూర్ణేక్షణా కృష్ణా కృష్ణం వచన మబ్రవీత్॥ 35
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ విధంగా మాటాడి సుందరశరీరావయవాలు గలిగి శ్యామలోచన, కమలనయన, గజగామిని అయిన ద్రౌపది చూడముచ్చటై, ఉంగరాలు తిరిగినవీ, నల్లనివీ, కొసముడివేసినా కోమలమైనవి, సర్వసుగంధపరిమళాలు గలవీ, సర్వసులక్షణాలతో ప్రకాశిస్తున్నవీ, మహాసర్పం వంటి కాంతి గలవీ అయిన తన కురులను ఎడమచేతితో పట్టుకొని పుండరీకాక్షుడయిన శ్రీకృష్ణుని సమీపించి కళ్ళనీరు గ్రుక్కుకొని ఇలా అన్నది. (33,34,35)
అయం తే పుండరీకాక్ష దుశ్శాసనకరోద్ధృతః।
స్మర్తవ్యః సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్ఛతా॥ 36
పుండరీకాక్ష! శత్రువులతో సంధిని కోరుతున్న నీవు ఏ ప్రయత్నం చేస్తున్నా దుశ్శాసనుడు చేతబట్టిలాగిన ఈ కురులను గుర్తుంచుకోవాలి. (36)
యది భీమార్జునౌ కృష్ణ కృపణౌ సంధికాముకౌ।
పితా మే యోత్స్యతే వృద్ధః సహపుత్రై ర్మహారథైః॥ 37
కృష్ణా! ఒకవేళ దీనులై భీమార్జునులు సంధినే కోరుతున్నా నా తండ్రి వృద్ధుడైనా మహారథులైన తన కొడుకులతో కలిసి యుద్ధం చేస్తాడు. (37)
పంచ చైవ మహావీర్యాః పుత్రా మే మధుసూదన।
అభిమన్యుం పురస్కృత్య యోత్స్యంతే కురుభిస్సహ॥ 38
మధుసూదనా! మహాపరాక్రమవంతులైన నా అయిదుగురు కొడుకులూ అభిమన్యుని ముందుంచుకొని కౌరవులతో యుద్ధం చేస్తారు. (38)
దుశ్శాసనభుజం శ్యామం సంఛిన్నం పాంసుగుంఠితమ్।
యద్యహం తు న పశ్యామి కా శాంతిర్హృదయస్య మే॥ 39
దుశ్శాసనుని నల్లని భుజం విరిగి దుమ్ములో పొర్లటాన్ని నేను చూడలేకపోతే నా మనస్సుకి శాంతి ఉండదు. (39)
త్రయోదశ హి వర్షాణి ప్రతీక్షంత్యా గతాని మే।
విధాయ హృదయే మన్యుం ప్రదీప్తమివ పావకమ్॥ 40
మండుతున్న నిప్పులాంటి నా కోపాన్ని హృదయంలో నిలుపుకొని నిరీక్షిస్తున్న నాకు పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి. (40)
విదీర్యతే మే హృదయం భీమవాక్ఛల్యపీడితమ్।
యోఽయమద్య మహాబాహుః ధర్మమేవానుపశ్యతి॥ 41
మహాబాహువైన భీమసేనుడు ఈనాడు ధర్మాన్ని గురించి మాత్రమే మాటాడుతుంటే (సంధికి సన్నద్ధమవు తుంటే) ఆ మాట లనే బాణాలు తగిలి నా హృదయం బ్రద్దలవుతోంది. (41)
ఇత్యుక్త్వా బాష్పరుద్ధేన కంఠేనాయతలోచనా।
రురోద కృష్ణో సోత్కంపం సస్వరం బాష్పగద్గదమ్॥ 42
స్తనౌ పీనాయతశ్రోణి సహితావభివర్షతీ।
ద్రవీభూతమివాత్యుష్ణం ముంచంతీ వారి నేత్రజమ్॥ 43
అపుడు విశాలనేత్రాలు, విశాల నితంబం గల ద్రౌపది కన్నీరు కంఠస్వరాన్ని అడ్డగించగా కంపిస్తున్న స్వరంతో ఏడవసాగింది. ఆమె కన్నీరు రొమ్ములను తడిపేస్తోంది. మనస్సులోని క్రోధాగ్ని ద్రవీభవించిందన్నట్లు ఆమె వేడి కన్నీరు విడుస్తోంది. (42,43)
తామువాచ మహాబాహుః కేశవః పరిసాంత్వయన్।
అచిరాద్ ద్రక్ష్యసే కృష్ణే రుదతీర్భరతస్త్రియః॥ 44
మహాబాహువయిన శ్రీకృష్ణుడు ఆమెను అనునయిస్తూ ఇలా అన్నాడు. "ద్రౌపదీ! తొందరలోనే భరతవంశంలోని స్త్రీలు కూడా ఈ విధంగా దుఃఖించటాన్ని చూడగలవు" (44)
ఏవం తా భీరు రోత్స్యంతి నిహతజ్ఞాతిబాంధవాః।
హతమిత్రా హతబలా యేషాం క్రుద్ధాసి భామిని॥ 45
"పిరికిదానా! ఎవరిమీద నీవు కోపాన్ని ప్రదర్శిస్తున్నావో వారంతా దాయాదులను, బంధువులను పోగొట్టుకొని మిత్రులనూ బలాలనూ కోల్పోయి ఇలాగే రోదిస్తారు. (45)
అహం తు తత్ కరిష్యామి భీమార్జునయమైస్సహ।
యుధిష్ఠిరనియోగేన దైవాచ్చ విధినిర్మితాత్॥ 46
యుధిష్ఠిరుని ఆవేశంతో విధిలిఖితమైన అదృష్టంతో భీమార్జుననకుల సహదేవులతో కలిసి నేనే నీకిష్టమైన ఆ పని చేస్తాను. (46)
ధార్తరాష్ట్రాః కాలపక్వాః న చేచ్ఛృణ్వంతి మే వచః।
శేష్యంతే నిహతా భూమౌ శ్వశృగాలాదనీకృతాః॥ 47
ఒకవేళ పోగాలం సమీపించిన ధార్తరాష్ట్రులు నామాట లెక్కచేయకపోతే యుద్ధంలో చచ్చి కుక్కలకు నక్కలకూ ఆహారంగా రణభూమిపై పడిపోతారు. (47)
చలేద్ధి హిమవాన్ శైలః మేదినీ శతథా ఫలేత్।
ద్యౌః పతేచ్చ సనక్షత్రా న మే మోఘం వచో భవేత్॥ 48
హిమాలయం చలించినా, భూమి నూరు ముక్క లయినా, నక్షత్రాలతో కూడా మిన్ను విరిగి పడినా నా మాట తప్పిపోదు. (48)
సత్యం తే ప్రతిజానామొ కృష్ణే బాష్పో నిగృహ్యతామ్।
హతామిత్రాన్ శ్రియా యుక్తాన్ అచిరాద్ ద్రక్ష్యసే పతీన్॥ 49
ద్రౌపదీ! కన్నిటిని ఆపుకో, సత్యప్రమాణంగా చెపు తున్నాను, శత్రువులను చంపి సంపదలను సమకూర్చుకొన్న నీ భర్తలను త్వరలోనే చూస్తావు. (49)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి ద్రౌపదీకృష్ణసంవాదే ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున ద్రౌపదీకృష్ణ సంవాదమను ఎనుబది రెండవ అధ్యాయము. (82)