95. తొంబది అయిదవ అధ్యాయము
శ్రీకృష్ణుడు పాండవుల మాటలను సభలో చెప్పుట.
వైశంపాయన ఉవాచ
తేష్వాసీనేషు సర్వేషు తూష్ణీంభూతేషు రాజసు।
వాక్యమఖ్యదదే కృష్ణః సుదంష్ట్రో దుందుభీస్వనః॥ 1
జీమూత ఇవ ఘర్మాంతే సర్వాం సంశ్రవయన్ సభామ్।
ధృతరాష్ట్రమభిప్రేక్ష్య సమభాషత మాధవః॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ సభలో ఆసీనులయిన రాజులందరూ మౌనంగా ఉండగా చక్కని పలువరస గలిగిన శ్రీకృష్ణుడు దుందుభి ధ్వనివంటి స్వరంతో మాట్లాడనారంభించాడు.
గ్రీష్మఋతువు చివరలో మేఘం గర్జించినట్టుగా, ధృతరాష్ట్రుని వైపు చూస్తూ అందరికీ వినిపించేటట్టు ఇలా అన్నాడు. (1-2)
శ్రీ భగవానువాచ
కురూణాం పాండవానాం చ శమః స్యాదితి భారత।
అప్రణాశేన వీరాణామ్ ఏతద్ యాచితుమాగతః॥ 3
శ్రీ కృష్ణుడిలా అన్నాడు. భారతా! క్షత్రియవీరులు నశించకుండానే కౌరవపాండవులలో శాంతిని కల్పించాలని భావించి దానిని ప్రార్థించటానికి నీ దగ్గరకు వచ్చాను. (3)
రాజన్ నాన్యత్ ప్రవక్తవ్యం తవ నైఃశ్రేయసం వచః।
విదితం హ్యేవ తే సర్వం వేదితవ్యమరిందమ॥ 4
అరిందమా! రాజా! ఇంతకన్నా నేను చెప్పదగిన మంచి మాట మరొకటి లేదు. నీవు తెలియవలసినదంతా తెలిసినవాడవు. (4)
ఇదం హ్యద్య కులం శ్రేష్ఠం సర్వరాజసు పార్థివ।
శ్రుతవృత్తోపసంపన్నం సర్వైః సముదితం గుణైః॥ 5
రాజా! సమస్తరాజవంశాలలో ఇప్పుడు ఈ కురువంశమే శ్రేష్ఠమైనది. ఇది శాస్త్రజ్ఞాన సదాచారాలతో సంపన్నమైనది. సద్గుణాలన్నింటితో కూడినది. (5)
కృపానుకంపా కారుణ్యమ్ ఆనృశంస్యం చ భారత।
తథాఽఽర్జవం క్షమా సత్యం కురుష్వేతద్ విశిష్యతే॥ 6
భారతా! దయ, జాలి, కరుణ, క్రౌర్య రాహిత్యం, ఋజుత్వం, ఓర్పు, సత్యం ఈ సద్గుణాలన్నీ ఇతర రాజవంశాలలో కన్న కురువంశంలో ఎక్కువ. (6)
తస్మిన్నేవంవిధే రాజన్ కులే మహతి తిష్ఠతి।
త్వన్నిమిత్తం విశేషేణ సహ యుక్తమసాంప్రతమ్॥ 7
రాజా! ఇటువంటి ఉన్నతగుణసంపన్నమైన, ప్రతిష్ఠగల వంశం నీ కారణంగా అనుచిత కార్యాలవైపు నడవటం తగినది కాదు. (7)
త్వం హి ధారయితా శ్రేష్ఠః కురూణాం కురుసత్తమ।
మిథ్యా ప్రచరతాం తాత బాహ్యేష్వాభ్యంతరేషు చ॥ 8
తండ్రీ! కురుశ్రేష్ఠా! కౌరవులలో ఎవరయినా ప్రత్యక్షంగా కానీ రహస్యంగా కానీ తగనిరీతిగా ప్రవర్తిస్తే కురువంశ శ్రేష్ఠుడవైన నీవే వారిని మంచి మార్గం వైపు మరలించాలి. (8)
తే పుత్రాస్తవ కౌరవ్య దుర్యోధనపురోగమాః।
ధర్మార్థౌ పృష్ఠతః కృత్వా ప్రచరంతి నృశంసవత్॥ 9
కురునందనా! దుర్యోధనుడు మొదలుగా గల నీ కుమారులు ధర్మార్థాలను వెనక్కునెట్టి క్రూరులవలె ప్రవర్తిస్తున్నారు. (9)
అశిష్టా గతమర్యాదాః లోభేన హృతచేతసః।
స్వేషు బంధుషు ముఖ్యేషు తద్ వేత్థ పురుషర్షభ॥ 10
పురుషశ్రేష్ఠా! నీకుమారులు లోభానికి లొంగి, మర్యాదల నతిక్రమించి సన్నిహిత బంధువులతో కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నీ కా విషయం తెలిసినదే. (10)
సేయమాపన్మహాఘోరా కురుష్వేవ సముత్థితా।
ఉపేక్ష్యమాణా కౌరవ్య పృథివీం ఘాతయిష్యతి॥ 11
కురునందనా! ఈ ప్రమాదకరమైన ఆపద కౌరవులలోనే పుట్టింది. దీనిని నిర్లక్ష్యం చేస్తే మొత్తం భూమండలాన్ని నాశనం చేస్తుంది. (11)
శక్యా చేయం శమయితుం త్వం చేదిచ్ఛసి భారత।
న దుష్కరో హ్యత్ర శమః మతో మే భరతర్షభ॥ 12
భరతశ్రేష్ఠా! నీవు తలచుకొంటే ఈ ఆపదను నివారించవచ్చు. ఈ ఉభయపక్షాల మధ్య సంధిని కూర్చటం దుష్కరకార్యమని నేను భావించటంలేదు. (12)
త్వయ్యధీనః శమో రాజన్ మయి చైవ విశాంపతే।
పుత్రాన్ స్థాపయ కౌరవ్య స్థాపయిష్యామ్యహం పరాన్॥ 13
నరపాలా! రాజా! కురునందనా! సంధిని చేయటం నీ చేతుల్లోనూ, నా చేతుల్లోనూ ఉంది. నీవు నీ కుమారులను నిలువరిస్తే, ఇతరులను(పాండవులను) నేను నియంత్రిస్తాను. (13)
ఆజ్ఞా తవ హి రాజేంద్ర కార్యా పుత్రైః సహాన్వయైః।
హితం బలవదప్యేషాం తిష్ఠతాం తవ శాసనే॥ 14
రాజేంద్రా! నీ పుత్రులు తమ అనుయాయులతో పాటు నీ ఆజ్ఞను పాటించాలి. నీ శాసనాన్ని పరిపాలిస్తే వీరికి ఎంతో గొప్ప మేలు జరుగుతుంది. (14)
తవ చైవ హితం రాజన్ పాండవానామథో హితమ్।
శమే ప్రయతమానస్య తవ శాసనకాంక్షిణః॥ 15
రాజా! సంధికోసం ప్రయత్నిస్తూ నీవు నీ కుమారులను శాసించదలచినచో అది నీకూ, పాండవులకూ కూడా హితకారి అవుతుంది. (15)
స్వయం నిష్ఫలమాలక్ష్య సంవిధత్స్వ విశాంపతే।
సహాయభూతా భరతాః తవైవ స్యుర్జనేశ్వర॥ 16
నరనాథా! పాండవులలో వైరం నిష్ఫలం. ఏవిధంగానూ మంచి పరిణామం కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేయి. జనపాలా! ఆ విధంగా చేస్తే పాండవులు నీకే సహాయకులు కాగలరు. (16)
ధర్మార్థయోస్తిష్ఠ రాజన్ పాండవైరభిరక్షితః।
న హి శక్యాస్తథాభూతాః యత్నాదపి నరాధిప॥ 17
రాజా! నీవు పాండవుల సంరక్షణలో ధర్మార్థాలను ఆచరించు. నరపాలా! ఎంత ప్రయత్నం చేసినా అటువంటి సంరక్షకులను మరో రీతిగా పొందలేవు. (17)
న హి త్వాం పాండవైర్జేతుం రక్ష్యమాణం మహాత్మభిః।
ఇంద్రోపి దేవైః సహితః ప్రసహేత కుతో నృపాః॥ 18
మహాత్ములయిన పాండవులచే నీవు రక్షింపబడుతూ ఉంటే దేవతలందరితో కూడిన ఇంద్రుడైనా నిన్నెదిరించలేడు. ఇక మామూలు రాజులను గురించి చెప్పవలసిన దేముంది? (18)
యత్ర భీష్మశ్చ ద్రోణశ్చ కృపః కర్ణో వివింశతిః।
అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తోఽథ బాహ్లికః॥ 19
సైంధవశ్చ కలింగశ్చ కాంబోజశ్చ సుదక్షిణః।
యుధిష్ఠిరో భీమసేనః సవ్యసాచీ యమౌ తథా॥ 20
సాత్యకిశ్చ మహాతేజా యుయుత్సుశ్చ మహారథః।
కో ను తాన్ విపరీతాత్మా యుద్ధ్యేత భరతర్షభ॥ 21
భరతశ్రేష్ఠా! భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, వివింశతి, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, సైంధవుడు, కలింగుడు, కాంబోజుడు, సుదక్షిణుడు, యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు, తేజోమూర్తి అయిన సాత్యకి, మహారథుడు యుయుత్సుడు ఉన్న పక్షంతో యుద్ధం చేసే విపరీత బుద్ధి ఎవ్వడూ ఉండడు. (19-21)
లోకస్యేశ్వరతాం భూయః శత్రుభీశ్చాప్యధృష్యతామ్।
ప్రాప్స్యసి త్వమమిత్రఘ్న సహితః కురుపాండవైః॥ 22
శత్రుసంహారా! ధృతరాష్ట్రా! కౌరవ పాండవులతో కూడిన నీవు మరల సమస్త లోకానికీ రాజువు కాగలవు. శత్రువులకు అజేయుడవు కూడా కాగలవు. (22)
తస్య తే పృథివీ పాలాఃత్వత్సమాః పృథివీపతే।
శ్రేయాంసశ్పైవ రాజానః సంధాస్యంతే పరంతప॥ 23
పరంతపా! రాజా! ఆస్థితిలో ఉన్న నీతో, నీతో సమానులైన రాజులు, నిన్నుమించిన రాజులు కూడా సంధిచేసికొంటారు. (23)
స త్వం పుత్రైశ్చ పితృభిర్భ్రాతృభిస్తథా।
సుహృద్భిః సర్వతో గుప్తః సుఖం శక్ష్యసి జీవితుమ్॥ 24
అటువంటి నీవు పుత్ర పౌత్రులతో, పితరులతో, సోదరులతో, మిత్రులతో కూడా అన్ని విధాలా సురక్షితుడవై జీవితాన్ని సుకంగా గడపవచ్చు. (24)
ఏతానేవ పురోధాయ సత్కృత్య చ యథా పురా।
అఖిలాం భోక్ష్యసే సర్వాం పృథివీం పృథివీపతే॥ 25
రాజా! ఇంతకుముందు వలె ఆదరించి వారినే ముందుంచు కొనగలిగితే సమస్త భూమండలాన్ని నీవు అనుభవించవచ్చు. (25)
ఏతైర్హి సహితః సర్వైః పాండవైః స్వైశ్చ భారత।
అన్యాన్ విజేష్యసే శత్రూన్ ఏష స్వార్థస్తవాఖిలః॥ 26
భారతా! ఈ పాండవులందరితోనూ, నీ కుమారులతోనూ కూడా నీవు ఇతర శత్రువులను జయించగలవు. ఇది నీకు పూర్తిగా స్వప్రయోజన సిద్ధి అవుతుంది. (26)
తైరేవోపార్జితాం భూమిం భోక్ష్యసే చ పరంతప।
యది సంవత్స్యసే పుత్రైః సహామాత్యైర్నరాధిప॥ 27
నరాధిపా! అమాత్యులతో సహా నీ పుత్రులందరితో కలసి ఉంటే వారు సంపాదించిపెట్టిన భూమిని నీవు అనుభవించవచ్చు. (27)
సంయుగే వై మహారాజ దృశ్యతే సుమహాన్ క్షయః।
క్షయే చోభయతః రాజన్ కం ధర్మమనుపశ్యసి॥ 28
మహారాజా! యుద్ధం జరిగితే ఎంతో నాశనం జరుగుతుంది. రాజా! ఇరుపక్షాలూ నశిస్తే ఇకనీవు పాటించే ధర్మమేముంటుంది? (28)
పాండవైర్నిహతైః సంఖ్యే పుత్రైర్వాపి మహాబలైః।
యద్ విందేథాః సుఖం రాజన్ తద్ బ్రూహి భరతర్షభ॥ 29
భరతశ్రేష్ఠా! యుద్ధంలో పాండవులు మరణించినా, బలసంపన్నులయిన నీ కుమారులే మరణించినా నీవు సుఖపడేది ఏముంటుంది? ఆ విషయం చెప్పు. (29)
శూరాశ్చ హి కృతాస్త్రాశ్చ సర్వే యుద్ధాభికాంక్షిణః।
పాండవాస్తావకాశ్పైవ తాన్ రక్ష మహతో భయాత్॥ 30
పాండవులూ, నీ కుమారులూ కూడా అందరూ శూరులు, అస్త్రవిద్యాపారంగతులు, యుద్ధాన్ని కోరుకొంటున్న వారిని ఆ భయం నుండి నీవే రక్షించాలి. (30)
న పశ్యేమ కురూన్ సర్వాన్ పాండవంశ్పైవ సంయుగే।
క్షీణానుభయతః శూరాన్ రథినో రథిభిర్హతాన్॥ 31
యుద్ధాన్ని గురించి ఆలోచిస్తే సమస్తకురు పాండవులూ నశించే అవకాశం కనిపిస్తోంది. ఉభయ పక్షాలలోనూ శూరులయిన రథికులు రథికులచే చంపబడి నశించి పోవచ్చు. (31)
సమవేతాః పృథివ్యాం హి రాజానో రాజసత్తమ।
అమర్షవశమాపన్నాః నాశయేయురిమాః ప్రజాః॥ 32
రాజశ్రేష్ఠా! భూమండలంలోని రాజులందరూ అసహనానికి లోనయి ఒక్కచోట గుమిగూడారు. ప్రజల నందరినీ నాశనం చేస్తారు. (32)
త్రాహి రాజన్నిమం లోకం న నశ్యేయురిమాః ప్రజాః।
త్వయి ప్రకృతి మాపన్నే శేషః స్యాత్ కురునందన॥ 33
రాజా! ఈ ప్రజలు నశించకూడదు. ఈ లోకాన్ని కాపాడు. నీవు కుదుటపడితే అందరూ కాపాడబడతారు. (33)
శుక్లా వదాన్యా హ్రీమంతః ఆర్యాః పుణ్యాభిజాతయః।
అన్యోన్యసచివా రాజన్ తాన్ పాహి మహతో భయాత్॥ 34
రాజా! ఈ రాజులందరూ నిర్మలులు, వదాన్యులు, లజ్జాశీలులు, పూజ్యులు, పవిత్రవంశ సంజాతులూ, పరస్పర సహాయకులు. అటువంటి వారిని ఈ భయం నుండి కాపాడు. (34)
శివేనేమే భూమిపాలాః సంఆగమ్య పరస్పరమ్।
సహ భుక్త్వా చ పీత్వా చ ప్రతియాంతు యథాగృహమ్॥ 35
ఈ రాజులందరూ స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు కలిసి, కలిసి భుజించి, త్రాగి, ఎవరి ఇంటికి వారు మరలిపోవాలి అని నా అభిలాష. ఆ విధంగా ప్రయత్నం చేయి. (35)
సువాసనః స్రగ్విణశ్చ సత్కృతా భరతర్షభ।
అమర్షం చ నిరాకృత్య వైరాణి చ పరంతప॥ 36
భరతశ్రేష్ఠా! పరంతపా! ఈ రాజులందరూ మంచి బట్టలు ధరించి, మంచి హారాలను అలంకరించుకొని అమర్షాన్నీ వైరాన్నీ కాలదన్ని సత్కారపూర్వకంగా మరలిపోవాలి. (36)
హార్దం యత్ పాండవేష్వాసీత్ ప్రాప్తేఽశ్మిన్నాయుషః క్షయే।
తదేవ తే భవత్వద్య సంధత్స్వ భరతర్షభ॥ 37
భరతశ్రేష్ఠా! నీ ఆయుష్షు కూడా తగ్గుతోంది. ఈ స్థితిలో పాండవులపై నీకు పూర్వమున్న స్నేహభావమే ఇప్పుడు కూడా ఉండాలి. కాబట్టి సంధి సమకూర్చు. (37)
బాలా విహీనాః పిత్రా తే త్వయైవ పరివర్ధితాః।
తాన్ పాలయ యథాన్యాయం పుత్రాంశ్చ భరతర్షభ॥ 38
భరతశ్రేష్ఠా! చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయిన వారిని నీవే పెంచి పోషించావు. కాబట్టి వారినీ, నీకుమారులనూ కూడ న్యాయంగా పాలించు. (38)
భవతైవ హి రక్ష్యాస్తే వ్యసనేషు విశేషతః।
మా తే ధర్మస్తథైవార్థః నశ్యేత భరతర్షభ॥ 39
భరతశ్రేష్ఠా! పాండవులను నీవు ఎల్లప్పుడూ కాపాడాలి. ప్రత్యేకించి ఇబ్బందులలో ఉన్నప్పుడు రక్షించాలి. అలా చేయనట్లయితే నీకు ధర్మహానీ, అర్థహానీ కూడా ఏర్పడుతుంది. (39)
ఆహుస్త్వాం పాండవా రాజన్ అభివాద్య ప్రసాద్య చ।
భవతః శాసనాద్ దుఃఖమ్ అనుభూతం సహానుగైః॥ 40
రాజా! పాండవులు, నీకు నమస్కరించి, ప్రసన్నుని చేసికొని ఈ విధంగా చెప్పమన్నారు. తండ్రీ! నీ ఆదేశాన్ని అనుసరించి అనుచరులతో సహా కష్టాల ననుభవించాము. (40)
ద్వాదశేమాని వర్షాణి వనే నిర్వ్యుషితాని నః।
త్రయోదశం తథాజ్ఞాతైః సజనే పరివత్సరమ్॥ 41
పండ్రెండు సంవత్సరాలు మాకు వనవాసంలో గడిచి పోయాయి. పదమూడవ సంవత్సరం జనడముదాయంలో అజ్ఞాతంగా గడిచిపోయింది. (41)
స్థాతా నః సమయే తస్మిన్ పితేతి కృతనిశ్చయాః।
నాహాస్మ సమయం తాత తచ్చ నో బ్రాహ్మణా విదుః॥ 42
తండ్రీ! నీవు మా పెదతండ్రివి. మాట మీద నిలుస్తావని నమ్మి ఉన్నాము. ఆ నమ్మకంతోనే అరణ్యవాస అజ్ఞాతవాసనియమాల నెప్పుడూ అతిక్రమించలేదు. మాతో ఉన్న బ్రాహ్మణులకు ఆ విషయం తెలుసు. (42)
తస్మిన్ నః సమయే తిష్ఠ స్థితానాం భరతర్షభ।
నిత్యం సంక్లేశితా రాజన్ స్వరాజ్యాంశం లభేమహి॥ 43
భరతశ్రేష్ఠా! మాట మీద నిలబడిన మా విషయంలో నీవు కూడా మాటను కాపాడుకో, రాజా! మేము ఎప్పుడూ కష్టాలనే అనుభవిస్తున్నాం. మా రాజ్యభాగాన్ని మా కివ్వు.(43)
త్వం ధర్మమర్థం సంజానన్ సమ్యగ్ నస్త్రాతుమర్హసి।
గురుత్వం భవతి ప్రేక్ష్య బహూన్ క్లేశాన్ తితిక్ష్మహే॥ 44
స భవాన్ మాతృపితృవద్ అస్మాసు ప్రతిపద్యతామ్।
నీవు ధర్మార్థాలు చక్కగా తెలిసినవాడవు. కాబట్టి మమ్ములను కాపాడాలి. నీలో గురుత్వాన్ని చూచి మేమెన్నో కష్టాలను మౌనంగా భరించాము. ఇప్పుడు నీవు కూడా తల్లిదండ్రుల వలె మాతో ప్రవర్తించాలి. (44 1/2)
గురోర్గరీయసీ వృత్తిః యా చ శిష్యస్య భారత॥ 45
వర్తామహే త్వయి చ తాం త్వం చ వర్తస్వ నస్తథా।
భారతా! గురుజనుల విషయంలో శిష్యులు ఎలా ప్రవర్తించాలో అలా మేము నీపట్ల ప్రవర్తించాము. నీవు కూడా శిష్యులపై గురువు ప్రవర్తించవలసిన రీతిగా మాతో ప్రవర్తించు. (45 1/2)
పిత్రా స్థాపయితవ్యా హి వయముత్పథమాస్థితాః॥ 46
సంస్థాపయ పథిష్వస్మాన్ తిష్ఠ ధర్మే సువర్త్మని।
పిల్లలము మేము తప్పు చేస్తే తండ్రి వయిన నీవు సరియైన దారిలో పెట్టాలి. కాబట్టి మమ్ములను సరి అయిన దారిలో నిలిపి, ధర్మబద్ధమయిన సన్మార్గంలో నీవు కూడా నిలువు. (46 1/2)
ఆహుశ్చేమాం పరిషదం పుత్రాస్తే భరతర్షభ॥ 47
ధర్మజ్ఞేషు సభాసత్సు నేహ యుక్తమసాంప్రతమ్।
భరతశ్రేష్ఠా! నీ కుమారులు ఈ సభాసదులకు కూడా ఒక విన్నపం చేస్తున్నారు. మీరు సభలో ఉండగా అనుచిత కార్యాలకు అవకాశమివ్వటం తగదు. (47 1/2)
యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్రానృతేన చ॥ 48
హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసదః।
అందరూ చూస్తుండగా అధర్మం చేత ధర్మమూ, అసత్యం చేత సత్యమూ బాధింపబడుతుంటే, ప్రేక్షకులయిన ఆ సభాసదులు కూడా నశించిపోయినట్టే! (48 1/2)
విద్ధో ధర్మో హ్యధర్మేణ సభాం యత్ర ప్రపద్యతే॥ 49
న చాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసదః।
ధర్మ ఏతానారుజతి యథా నద్యనుకూలజాన్॥ 50
అధర్మంచేత భంగపడిన ధర్మమ్ పదిమంది మధ్యకు వచ్చినపుడు అక్కడున్న సభ్యులు అధర్మరూపమైన ఆ ముల్లును విరిచి పైకి తీయక పోతే ఆ ముల్లుతో ఆ సభ్యులు కూడా గాయపడినట్లే.
నది ఒడ్డున ఉన్న చెట్లను పెకలించి వేసినట్లు ఆ భంగపడ్డ ధర్మమే సభాసదులను నశింపజేస్తుంది. (49-50)
యే ధర్మమనుపశ్యంతః తూష్ణీం ధ్యాయంత ఆసతే।
తే సత్యమాహు ర్ధర్మ్యం చ న్యాయ్యం చ భరతర్షభ॥ 51
భరతశ్రేష్ఠా! ఆ పాండవులు ధర్మం మీదనే దృష్టి నుంచి ఎప్పుడూ దానినే ఆలోచిస్తూ మిన్న కున్నారు. వారు రాజ్యాన్ని తిరిగి పొందటం సత్యమూ, ధర్మసమ్మతమూ, న్యాయ సమ్మతమూ కూడా. (51)
శక్యం కిమన్యద్ వక్తుం తే దానాదన్యజ్జనేశ్వర।
బ్రువంతు తే మహీపాలాః సభాయాం యే సమాసతే॥ 52
ధర్మార్థౌ సంప్రధార్యైవ యది సత్యం బ్రవీమ్యహమ్।
ప్రముంచేమాన్ మృత్యుపాశాత్ క్షత్రియాన్ పురుషర్షభ॥ 53
నరపతీ! పాండవులకు రాజ్యాన్ని తిరిగి ఇమ్మని తప్ప నీకు మరేమి చెప్పగలను? ధర్మార్థాలను విచారించి ఈ సభలోని భూపాలురు ఎవరైనా నేను సత్యం చెపుతున్నానో లేదో చెప్పవచ్చు. పురుషశ్రేశ్హ్ఠా! ఈ క్షత్రియులను మృత్యుపాశం నుండి రక్షించు. (52-53)
ప్రశామ్య భరతశ్రేష్ఠ మా మన్యువశమన్వగాః।
పిత్ర్యం తేభ్యః ప్రదాయాంశం పాండవేభ్యో యథోచితమ్॥ 54
తతః సపుత్రః సిద్ధార్థః భుంక్ష్వ భోగాన్ పరంతప।
పరంతపా! భరతశ్రేష్ఠా! క్రోధానికి లొంగకుండా శాంతంగా ఉండు. పాండవులకు పైతృక మైన రాజ్యభాగాన్ని యథోచితంగా ఇచ్చి, ఆపై నీవూ, నీకుమారుడూ సఫలమనోరథులై స్వేచ్ఛగా భోగాలను అనుభవించండి. (54 1/2)
అజాతశత్రుం జనీషే స్థితం ధర్మే సతాం సదా॥ 55
సపుత్రే త్వయి వృత్తిం చ వర్తతే యాం నరాధిప।
దాహితశ్చ నిరస్తశ్చ త్వామేవోపాశ్రితః పునః॥ 56
నరేశ్వరా! అజాతశత్రువైన యుధిష్ఠిరుడు ఎప్పుడూ సత్పురుషుల ధర్మమార్గం లోనే నడుస్తాడు. ఆయన నీతో నీకుమారులతో ప్రవర్తించే తీరుకూడా నీకు తెలుసు. లక్క ఇంటిలో తగులబెట్టబడ్డాడు. రాజ్యం నుండి వెళ్ళ గొట్ట ఇంటిలో తగులబెట్టబడ్డాడు. రాజ్యం నుండి వెళ్ళ గొట్ట బడ్డాడు. అయినా మరలా నిన్నే ఆశ్రయిస్తున్నాడు. (55-56)
ఇంద్రప్రస్థం త్వయైవాసౌ సపుత్రేణ వివాసితః।
స తత్ర వివసన్ సర్వా వశమానీయ పార్థివాన్॥ 57
త్వన్ముఖానకరోద్ రాజన్ న చ త్వామత్యవర్తత।
రాజా! నీకుమారులతో కలిసి నీవే ఆ యుధిష్ఠిరుని ఇక్కడ నుండి తప్పించి ఇంద్రప్రస్థానికి పంపావు. అక్కడ ఆ యుధిష్ఠిరుఉ నివసిస్తూ సమస్త రాజులనూ లొంగదీసికొని నీవైపు త్రిప్పాడు. అయినా కూడా యుధిష్ఠిరుడెప్పుడూ నీ ఆదేశాన్ని అతిక్రమించలేదు. (57 1/2)
తస్యైవం వర్తమానస్య సౌబలేన జిహీర్షతా॥ 58
రాష్ట్రాణి ధనధాన్యం చ ప్రయుక్తః పరమోపధిః।
ఈ విధంగా ప్రవర్తిస్తూ యుధిష్ఠిరుని రాజ్యాన్నీ, ధనధాన్యాలనూ అపహరించాలని సుబల పుత్రుడయిన శకుని జూదవు. పేరుతో గొప్ప ఎత్తు వేశాడు. (58 1/2)
స తామవస్థాం సంప్రాప్య కృష్ణాం ప్రేక్ష్య సభాగతామ్॥ 59
క్షత్రధర్మాదమేయాత్మా నాకంపత యుధిష్ఠిరః।
అటువంటి దయనీయస్థితిలో ఉండి సభలోనికి ఈడ్చుకొనిరాబడిన ద్రౌపదిని చూచికూడా మహాత్ముడైన ఆ యుధిష్ఠిరుడు క్షత్రధర్మాన్ని తప్ప లేదు. (59 1/2)
అహం తు తవ తేషాం చ శ్రేయ ఇచ్ఛామి భారత॥ 60
ధర్మాదర్థాత్ సుఖాచ్చైవ మా రాజన్ నీనశః ప్రజాః।
అనర్థమర్థం మన్వానోఽప్యర్థం చానర్థమాత్మనః॥ 61
భారతా! నేను మీకూ, పాండవులకూ శుభాన్నే కొరుకొంటున్నాను. ప్రజలను ధర్మ - అర్థ సుఖాలకు దూరం చేయవద్దు. ప్రస్తుతం అనర్థాన్ని అర్థంగానూ, అర్థాన్ని అనర్థంగానూ భావిస్తున్నావు. (60-61)
లోభేఽతిప్రసృతాన్ పుత్రాన్ నిగృహ్ణీష్వ విశాంపతే।
స్థితాః శుశ్రూషితం పార్థాః స్థితా యోద్ధుమరిందమాః॥
యత్ తే పథ్యతమం రాజన్ తస్మింస్తిష్ఠ పరంతప॥ 62
రాజా! లోభంలో తగుల్కొన్న నీ కుమారులను అదుపు చేయి. అరిందము లయిన పాండవులు నీకు సేవ చేయటానికైనా సిద్ధమే. యుద్ధం చేయటానికయినా సిద్ధమే. నీకు హితకరమైన మార్గాన్ని నీవు అవలంబించు. (62)
వైశంపాయన ఉవాచ
తద్ వాక్యం పార్థివాః సర్వే హృదయైః సమపూజయన్।
న తత్ర కశ్చిద్ వక్తుం హి వాచం ప్రాక్రామదగ్రతః॥ 63
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! శ్రీకృష్ణుని మాటను అక్కడున్న రాజులందరూ మనసా అభినందించారు. అక్కడ ఎవరూ మరేమీ మాట్లాడటానికి ముందుకు రాలేదు. (63)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణవాక్యే పంచనవతితమోఽధ్యాయః॥ 95 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమను తొంబది అయిదవ అధ్యాయము. (95)