107. నూట ఏడవ అధ్యాయము
గాలవుడు చింతించుట - గరుడుడు ఊరడించుట.
నారద ఉవాచ
ఏవముక్తస్తదా తేన విశ్వామిత్రేణ ధీమతా।
నాస్తే న శేతే నాహారం కురుతే గాలవస్తదా॥ 1
నారదుడిలా అన్నాడు - ధీమంతుడయిన విశ్వామిత్రుడు ఆ విధంగా గురుదక్షిణ అడుగగా గాలవముని అప్పటి నుండి ఎక్కడా నిలవలేకపోయాడు, శయనించలేక పోయాడు. ఆహారాన్ని కూడా స్వీకరింలేకపోయాడు. (1)
త్వగస్థిభూతో హరిణః చింతాశోకపరాయణః।
శోచమానోఽతిమాత్రం సః దహ్యమానశ్చ మన్యునా।
గాలవో దుఃఖితో దుఃఖాద్ విలలాప సుయోధన॥ 2
సుయోధనా! చింతలో, శోకంలో మునిగిపోయిన ఆ గాలవుడు పాలిపోయాడు. శరీరంపై చర్మం ఎముకలు మాత్రం మిగిలాయి. ఎక్కువగా చింతతో రగిలిపోతూ గాలవుడు దుఃఖంతో విలపించనారంభించాడు. (2)
కుతః పుష్టాని మిత్రాణి కుతోఽర్థాః సంచయః కుతః।
హయానాం చంద్రశుభ్రాణాం శతాన్యష్టౌ కుతో మమ॥ 3
ధనవంతులయిన మిత్రులు నాకెవ్వరున్నారు. నాకు డబ్బెక్కడిది? నాకోసం ఎవరు కూడబెట్టి ఉన్నారు. చంద్రునిలాగా తెల్లగా ఉన్న ఎనిమిది వందల గుఱ్ఱాలు నాకెలా లభిస్తాయి? (3)
కుతో మే భోజనే శ్రద్ధా సుఖశ్రద్ధా కుతశ్చ మే।
శ్రద్ధా మే జీవితస్యాపి ఛిన్నా కిం జీవితేన మే॥ 4
నాకు భోజనంపై ఆసక్తి లేదు. సుఖపడాలన్న ఆశ ఎక్కడనుండి వస్తుంది? జీవితం మీదకూడ నాకు శ్రద్ధ నశించిపోయింది. ఇక నా జీవితమెందుకు? (4)
అహం పారే సముద్రస్య పృథివ్యా వా పరంపరాత్।
గత్వాఽఽత్మానం విముంచామి కిం ఫలం జీవితేన మే॥ 5
నేను సముద్రతీరానికి కానీ, భూమండలంలో ఎక్కడికో గానీ పోయి శరీరత్యాగం చేస్తాను. ఇక నేను బ్రతికి ఉండీ ప్రయోజనమేముంది? (5)
అధనస్యాకృతార్థస్య త్యక్తస్య వివిధైః ఫలైః।
ఋణం ధారయమాణస్య కుతః సుఖమనీహయా॥ 6
డబ్బులేని వాడు, కోరికలు తీరనివాడు, వివిధ కర్మఫలవంచితుడు, ఋణగ్రస్తుడూ అనాసక్తతతో జీవింమాత్రం సుఖమేముంది?(6)
సుహృదాం హి ధనం భుక్త్వా కృత్వా ప్రణయమీప్సితమ్।
ప్రతికర్తుమశక్తస్య జీవితాన్మరణం వరమ్॥ 7
ఇష్టానుసారంగా ప్రణయసంబంధాన్ని ఏర్పరచుకొని, మిత్రుల ధనాన్ని అనుభవించి, ప్రత్యుపకారం చేయలేనివాడు జీవించటం కంటె మరణించటం మంచిది. (7)
ప్రతిశ్రుత్య కరిష్యేతి కర్తవ్యం తదకుర్వతః।
మిథ్యావచనదగ్ధస్య ఇష్టాపూర్తం ప్రణశ్యతి॥ 8
'చేస్తాను' అని ప్రతిజ్ఞ చేసి, పనిని చేయటానికి ఒప్పుకొని అది చేయలేని వాడు అసత్యభాషణచే దహింపబడినవాడు. అటువంటి మనుష్యుని ఇష్టాపూర్తాలు కూడా నశిస్తాయి. (8)
న రూపమనృతస్యాస్తి నానృతస్యాస్య సంతతిః।
నానృతస్యాధిపత్యం చ కుత ఏవ గతిః శుభా॥ 9
మాట తప్పినవాడు ఉండికూడా లేనట్లే. అసత్యభాషికి సంతానం కూడా ఉండదు. అసత్యవాదికి ఆధిపత్యం లభించదు. ఇక పుఞగతులకు అవకాశమెక్కడిది? (9)
కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతస్సుఖమ్।
అశ్రద్ధేయః కృత్ఘ్నో హి కృతఘ్నే నాస్తి నిష్కృతి॥ 10
కృతఘ్నుడికి కీర్తిలేదు. స్థానం లేదు. సుఖంలేదు. కృతఘ్నుడు నమ్మదగని వాడవుతాడు. కృతఘ్నుడికి నిష్కృతి లేదు. (10)
న జీవత్యధనః పాపః కుతః పాపస్య తంత్రణమ్।
పాపో ధ్రువమవాప్నోతి వినాశం నాశయన్ కృతమ్॥ 11
ధనహీనుడూ, పాపి అయిన వాడికి జీవితం లేనట్లే. పాపికి కుటుంబనిర్వహణ కూడా కష్టమే. పాపాత్ముడు ఆర్జించిన పుణ్యాన్ని నశింపజేసికొంటూ తానుకూడా తప్పక నశిస్తాడు. (11)
సోఽహం పాపః కృతఘ్నశ్చ కృపణశ్చానృతోఽపి చ।
గురోర్యః కృతకార్యః సన్ తత్ కరోమి న భాషితమ్॥ 12
నేను పాపిని, కృతఘ్నుణ్ణి, కృపణుణ్ణి, అసత్యవాదిని కూడా, గురువు దగ్గర నా పనిని పూర్తి చేసికొని స్వయంగా గురు దక్షిణ నిస్తానని మాట ఇచ్చి దానిని పూర్తిచేయలేకపోతున్నాను. (12)
సోఽహం ప్రాణాన్ విమోక్ష్యామి కృత్వా యత్నమనుత్తమమ్।
అర్థితా న మయా కాచిత్ కృతపూర్వా దివౌకసామ్।
మానయంతి చ మాం సర్వే త్రిదశా యజ్ఞసంస్తరే॥ 13
కాబట్టి నేను ఏదైనా గట్టి ప్రయత్నమే చేసి ప్రాణత్యాగం చేస్తాను. ఇంతవరకు నేను దేవతలను ఏమీ అడగలేదు. దేవతలందరూ కూడా యజ్ఞంలో నన్నెంతో ఆదరంగా చూస్తారు. (13)
అహం తు విబుధశ్రేష్ఠం దేవం త్రిభువనేశ్వరమ్।
విష్ణుం గచ్ఛామ్యహం కృష్ణం గతిం గతిమతాం వరమ్॥ 14
ఇప్పుడు నేను త్రిభూవనేశ్వరుడై జంగమజీవులకందరకూ ఉత్తమాశ్రయమై, దేవత శ్రేష్ఠుడై, సచ్చిదానంద ఘనుడైన విష్ణుభగవానుని శరణుకోరుతాను. (14)
భోగా యస్మాత్ ప్రతిష్ఠంతే వ్యాప్య సర్వాన్ సురాసురాన్।
ప్రణతో ద్రష్టుమిచ్ఛామి కృష్ణం యోగినమవ్యయమ్॥ 13
సురాసురులకందరకూ ఎవని దయ భోగాలను కల్పిస్తుందో, ఆయనను - అవ్యయుడూ, పరమయోగి అయిన విష్ణువును - వినయభవంతో సందర్శించాలనుకొంటున్నాను. (15)
ఏవముక్తే సఖా తస్య గరుడో వినతాత్మజః।
దర్శయామాస తం ప్రాహ సంహృష్టః ప్రియకామ్యయా॥ 16
గాలవుడిలా భావింగగానే ఆయన మిత్రుడూ, వినతాపుత్రుడూ ఆయన గరుడుడు ప్రసన్నుడై గాలవునకు మేలు చేయాలని భావించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. (16)
సుహృద్ భవాన్ మమ మతః సుహృదాం చ మతః సుహృత్।
ఈప్సితేనాభిలాషేణ యోక్తవ్యో విభవే సతి॥ 17
నీవు నాకు ప్రియమిత్రుడవు. నా మిత్రులకు కూడా ప్రియమిత్రుడవు. తన దగ్గర డబుఉ ఉంటే తన మిత్రుల కోరికలను తీర్చటం మిత్రుల కర్తవ్యం. (17)
విభవశ్చాస్తి మే విప్ర వాసవావరజో ద్విజ।
పూర్వముక్తస్త్వదర్థం చ కృతః కామశ్చ తేన మే॥ 18
బ్రాహ్మణా! నాకున్న గొప్పసంపద ఇంద్రసోదరుడైన విష్ణుమూర్తియే. నేను నీకోసం ఇంతకుముందే ఆయనను అభ్యర్థించాను. ఆయన కూడా నా ప్రార్థనను మన్నించి నా కోరిక తీర్చాడు. (18)
స భవానేతు గచ్ఛావః నయిష్యే త్వాం యథా సుఖమ్।
దేశం పారం పృథివ్యా వా గచ్ఛ గాలవ మా చిరమ్॥ 19
కాబట్టి బయలుదేరు. ఇద్దరం వెళదాం. గాలవా! సముద్రానికి ఆవలపైపునకైనా, భూమిలోనికి అయినా నిన్ను సుఖంగా తీసికొని వెళ్ళగలను. లే! ఆలస్యం చేయవద్దు. (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే సప్తాధికశతతమోఽధ్యాయః॥ 107 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూట ఏడవ అధ్యాయము. (107)