114. నూటపదునాలుగవ అధ్యాయము

గరుడ గాలవులు యయాతి దగ్గరకు వెళ్ళుట.

నారద ఉవాచ
అథాహ గాలవం దీనం సుపర్ణః పతతాం వరః।
నిర్మితం వహ్నినా భూమౌ వాయునా శోధితం తథా।
యస్మాద్ధిరణ్మయం సర్వం హిరణ్యం తేన చోచ్యతే॥ 1
పక్షిశ్రేష్ఠుడైన గరుడుడు దీనంగా ఉన్న గాలవునితో ఇలా అన్నాడు - భూమిలోపల గల భూసారతత్త్వాన్ని తపింపజేసి అగ్ని తయారు చేసినదాన్ని వాయువు శుభ్రం చేశాడు. అదే హిరణ్యం(బంగారం). ఈ జగత్తంతా హిరణ్మయం అందుకే దీనికి హిరణ్యమని పేరు. (1)
ధత్తే ధారయతే చేదమ్ ఏతస్మాత్ కారణాత్ ధనమ్।
తదేతత్ త్రిషు లోకేషు దనం తిష్ఠతి శాశ్వతమ్॥ 2
ఈ జగత్తు ధరించేదీ, ధరింపజేసేది కూడా ధనమే. అందుకే సువర్ణానికి ధనమని వ్యవహారం. ఈ ధనం మూడులోకాలలోనూ స్థిరంగా ఉంటుంది. (2)
నిత్యం ప్రోష్ఠదాభ్యాం చ శుక్రే ధనపతౌ తథా।
మనుష్యేభ్యః సమాదత్తే శుక్రశ్చిత్తార్జితం ధనమ్॥ 3
అజైకసాదహిర్బుధ్న్యైః రక్ష్యతే ధనదేన చ।
ఏవం న శక్యతే లబ్ధుమ్ అలబ్ధవ్యం ద్విజర్షభ॥
ఋతే చ ధనమశ్వానాం నావాప్తిర్విద్యతే తవ॥ 4
ద్విజశ్రేష్ఠా! పూర్వాభాద్రా ఉత్తరాభాద్ర నక్షత్రాలలో దేనితో అయినా శుక్రవారం కలిసినరోజు అగ్నిదేవుడు కుబేరునికోసం సంకల్పించి ధనాన్ని తయారుచేసి మనుష్యులకిస్తాడు. పూర్వాభాద్ర కధిపతియైన అజైకపాదుడూ, ఉత్తరాభాద్రకధిపతి అయిన అహిర్భూధ్న్యుడూ, కుబేరుడూ దాన్ని సంరక్షిస్తారు. ఎవరికైనా ఆధనం లభించకపోతే అది ప్రారబ్ధఫలమే. ధనం లేకపోతే నీకిప్పుడు నీవు కోరుతున్న గుఱ్ఱాలు దొరకవు. (3-4)
స త్వం యాచాత్ర రాజానం కంచిద్ రాజర్షివంశజమ్।
అపీడ్య రాజా పౌరాన్ హి యో నౌ కుర్యాత్ కృతార్థినౌ॥ 5
కాబట్టి నీవు రాజర్షి వంశంలో పుట్టిన ఏ రాజునయినా ధనంకోసం యాచించు. ప్రజలను బాధించకుండానే ధనమిచ్చి మనలను కృతార్థులను చేయవచ్చు. (5)
అస్తి సోమాన్వవాయే మే జాతః కశ్చిన్నృపః సఖా।
అభిగచ్ఛావహే తం వై తస్యాస్తి విభవో భువి॥ 6
మిత్రమా! చంద్రవంశంలో పుట్టిన ఒకరాజు - నా మిత్రుడున్నాడు. అతని దగ్గరకు మనం వెళదాం ఆయన సంపన్నుడు. (6)
యయాతిర్నామ రాజర్షిః నాహుఃః సత్యవిక్రమః।
స దాస్యతి మయా చోక్తః భవతా చార్థితః స్వయమ్॥ 7
ఆ రాజర్షిపేరు యయాతి. నహుషుని పుత్రుడు. సత్యవిక్రముడాయన. నీవు స్వయంగా యాచించి, నేను వివరంగా చెపితే తానే ధనాన్ని ఇవ్వగలడు. (7)
విభవశ్చాస్య సుమహాన్ ఆసీద్ ధనపతేరివ।
ఏవం గురుధనం విద్వన్ దానేనైవ విశోధయ॥ 8
ఆయన కుబేరుడంత ధనవంతుడు. పండితుడా! ఈ విధంగా దానం పట్టి గురుదక్షిణా ఋణవిముక్తుడివి కమ్ము! (8)
తథా తే కథయంతౌ చ వింతయంతౌ చ యత్ క్షమమ్।
ప్రతిష్ఠానే నరపతిం యయాతిం ప్రత్యుపస్థితౌ॥ 9
ఆ విధంగా వారు మాటాడుకొంటూ, తగిన ఉపాయాన్ని గురించి ఆలోచించుకొంటూ, ప్రతిష్ఠానపురమందలి యయాతి మహారాజు సన్నిధికి వచ్చారు. (9)
ప్రతిగృహ్య చ సత్కారైః అర్ఘ్యపాద్యాదికం వరమ్।
పృష్టశ్చాగమనే హేతుమ్ ఉవాచ వినతాసుతః॥ 10
శ్రేష్ఠమయిన అర్ఘ్యపాద్యాదికాలతో కూడిన అతిథిసత్కారాన్ని స్వీకరించాడు. గరుడుడు, యయాతి అడుగగా తన రాకకు కారణాన్ని ఇలా వివరించారు. (10)
అయం మే నాహుష సఖా గాలవస్తపసో విధిః।
విశ్వామిత్రస్య శిష్యోఽభూద్ వర్షాణ్యయుతశో నృప॥ 11
మిత్రమా! యయాతీ! ఇతడు నా మిత్రుడు గాలవుడు. ఈయన తపోనిధి, విశ్వామిత్రుని శిష్యుడుగా వేల సంవత్సరాలు గడిపాడు. (11)
సోఽయం తేనాభ్యుపజ్ఞాతః ఉపకారేప్సయా ద్విజః।
తమాహ భగవన్ కిం తే దదాని గురుదక్షిణామ్॥ 12
ఇతని సేవలందిన విశ్వామిత్రుడు తగిన ఉపకారం చేద్దామని ఇంటికి వెళ్ళమని అనుమతించాడు. అప్పుడు స్వామీ! గురుదక్షిణగా ఏమివ్వమంటారని విశ్వామిత్రుని అడిగాడు. (12)
అసకృత్ తేన చోక్తేన కించిదగతమన్యునా।
అయముక్తః ప్రయచ్ఛేతి జానతా విభవం లఘు॥ 13
ఏకతః శ్యామకర్ణానాం శుభ్రాణాం శుద్ధజన్మనామ్।
అష్టౌ శతాని మే దేహి హయానాం చంద్రవర్చసామ్॥ 14
గుర్వర్థో దీయతామేషః యది గాలవ మన్యసే।
ఇత్యేవమాహ సక్రోధః విశ్వామిత్రస్తపోధనః॥ 15
పదేపదే అలా అడగగా కొంచెం కోపించిన విశ్వామిత్రుడు గాలవుడు ధనవంతుడు కాదని తెలిసి కూడా "తీసికొనిర గురుదక్షిణ! మేలు జాతి గుఱ్ఱాలను ఎనిమిది వందలు తీసికొని రా! అవి చంద్రవర్చస్సుతో ప్రకాశిస్తూ ఉండాలి. వాటి చెవి ఒకవైపు నల్లగా ఉండాలి. నామాటను మన్నించదలిస్తే ఈ గురుదక్షిణను తెచ్చి ఇయ్యి" అని కోపంతో ఆదేశించాడు. (13-15)
సోఽయం శోకేన మహతా తప్యమానో ద్విజర్షభః।
అశక్తః ప్రతికర్తుం తద్ భవంతం శరణం గతః॥ 16
ఈ విప్రశ్రేష్ఠుడు గాలవుడు వానిని సంపాదించుటంలో అశక్తుడై ఎంతో బాధపడిపోతున్నాడు. నీ శరణుకోరి వచ్చాడు. (16)
ప్రతిగృహ్య నరవ్యాఘ్ర త్వత్తో భిక్షాం గతవ్యథః।
కృత్వాపవర్గం గురవే చరిష్యతి మహత్తపః॥ 17
పురుష శ్రేష్ఠా! నీనుండి ఆ భిక్షను స్వీకరించి, గురుదక్షిణను సమర్పించి ఆ పై నిశ్చింతగా ఎంతో తపస్సు చేసికొంటాడు ఈ గాలవుడు. (17)
తపసః సంవిభాగేన భవంతమపి యోక్ష్యతే।
స్వేన రాజర్షితపసా పూర్ణం త్వాం పూరయిష్యతి॥ 18
తన తపస్సులో కొంతభాగాన్ని నీకు కూడా ఇస్తాడు. నీవు రాజర్షిగా తపస్సు చేసినవాడవే. ఇప్పుడు ఈ బ్రహ్మర్షితపోభాగం కూడా దానికి కలుస్తుంది. (18)
యావంతి రోమాని హయే భవంతీహ నరేశ్వర।
తావంతో వాజినో లోకాన్ ప్రాప్నుయంతి మహీపతే॥ 19
మహారాజా! దానం చేసిన అశ్వం శరీరంపై ఎన్నిరోమాలుంటాయో అన్ని గుఱ్ఱాలు పరలోకంలో దాతకు లభిస్తాయి. (19)
పాత్రం ప్రతుగ్రహస్యాయం దాతుం పాత్రం తథా భవాన్।
శంఖే క్షీరమివాసిక్తం భవత్వేతత్ తథోపమమ్॥ 20
స్వీకరించటానికి తగిన ప్రతిగ్రహీత ఈయన. ఈయదగిన దాతవు నీవు. శంఖంలో పాలను పోసినట్టు ఈయన చేతబెట్టిన దానానికి కూడా శోభకలుగుతుంది. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే చతుర్దశాధికశతతమోఽధ్యాయః॥ 114 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునాలుగవ అధ్యాయము. (114)