133. నూట ముప్పది మూడవ అధ్యాయము

విదులా వృత్తాంతము.

కుంత్యువాచ
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్।
విదులాయాశ్చ సంవాదం పుత్రస్య చ పరంతప॥ 1
కుంతీదేవి ఇలా చెప్పింది. ఈ విషయంలో పూర్వం జరిగినదాన్ని గురించి ఇలా చెపుతారు. ఇది విదులకూ ఆమెపుత్రునకూ జరిగిన సంవాదం. (1)
అత్ర శ్రేయశ్చ భూయశ్చ యథావద్వక్తుమర్హసి।
యశస్వినీ మన్యుమతీ కులే జాతా విభావరీ॥ 2
క్షత్రధర్మరతా దాంతా విదులా దీర్ఘదర్శినీ।
విశ్రుతా రాజసంసత్సు శ్రుతవాక్యా బహుశ్రుతా॥ 3
విదులా నామ రాజన్యా జగర్హే పుత్రమౌరసమ్।
నిర్జితం సింధురాజేన శయానం దీనచేతసమ్॥ 4
ఇందులో మిక్కిలి శ్రేయస్కరమయిన ఉపదేశం ఉంది. అది నీవు యుధిష్ఠిరునికి తగినట్లు చెప్పాలి. విదుల అని ఒక క్షత్రియ వనిత ఉండేది. ఆమె చక్కని పేరుకలది. అభిమానవతి. సద్వంశంలో పుట్టింది. క్షత్రియ ధర్మం మీద ఆసక్తి కలది. ఇంద్రియ నిగ్రహంతో పాటు చక్కని ముందు చూపు కలది. రాజసభల్లో మంచి ప్రఖ్యాతి పొందింది. ఎన్నో వేద, శాస్త్ర విశేషాలు విన్నది. పట్టాభిషిక్తురాలయిన విదుల తనకొడుకు సింధురాకు చేతిలో ఓడిపోయి దిగులతో ఉండగా ఆమె కొడుకును ఇలా నిందించింది. (2,3,4)
విదులోవాచ
అనందన మయా జాత ద్విషతాం హర్షవర్ధన।
న మయా త్వం న పిత్రా చ జాతః క్వాభ్యాగతో హ్యసి॥ 5
విదుల ఇలా అంది. నాకు చెడపుట్టావు గదరా! శత్రువులకు సంతోషం కలిగిస్తావురా! నాకూ, నీ తండ్రికీ ఏపోలికా లేకుండా పుట్టావు. ఎక్కడినుండి వచ్చిపడ్డావురా! (5)
నిర్మన్యుశ్చాప్యసంఖ్యేయః పురుషః క్లీభసాధనః।
యావజ్జీవం నిరాశోఽసి కల్యాణాయ ధురం వహ॥ 6
మనిషికి ఉండవలసిన కోపం లేదు. మగతనం లేదు. అసలు మనుష్యుల్లో లెక్కింపదగినవాడవు కాదు. నీ వల్ల జీవితమంతా నిరాశయే. కొద్దిగా మంచిగా ఉండే బాధ్యత వహించరా! (6)
మాత్మానమవమన్యస్వ మైనమల్పేన బీభరః।
మనః కృత్వా సుకల్యాణం మా భైస్త్వం ప్రతిసంహర॥ 7
నిన్ను నీవు అవమానపరచుకోకు. అల్ప సంపదతో జీవితం సరిపెట్టుకోకు. శుభప్రదమయిన మనసు పెట్టు. భయపడకు. అసలు ఆ భయాన్ని ముందు పోగొట్టుకో. (7)
ఉత్తిష్ఠ హే కాపురుష మా శేష్వైవం పరాజితః।
అమిత్రాన్ నందయన్ సర్వాన్ నిర్మానో బంధుశోకదః॥ 8
ఓరి నీచుడా! శత్రువును సంతోష పరుస్తూ, నిరుత్సాహంతో చుట్టాలకు శోకం కలిగిస్తూ, ఓడిపోయి ఇంట్లో ఇలా పడుకోకు. లే! (8)
సుపూరా వై కునదికా సుపూరో మూషికాంజలిః।
సుసంతోషః కాపురుషః స్వల్పకేనైవ తుష్యతి॥ 9
చిన్నవాగు కొద్ది నీటితోనే నిండిపోతుంది. దొంగయొక్క దోసిలికూడా కొద్ది ధనంతోనే నిండుతుంది. అలాగే నీచుడు అల్పమైన పనులతోనే తృప్తిపడుతాడు. (9)
వి॥సం॥ మూషికాంజలిః = ఎలుక కన్నము.(నీల)
అప్యహేరారుజన్ దంష్ట్రామ్ ఆశ్వేవ నిధనం వ్రజ।
అపి వా సంశయం ప్రాప్య జీవితేఽపి పరాక్రమేః॥ 10
పాము కోరలను పీకి అయినా సరే త్వరగా చావు. బ్రతుకు మీద సంశయం పొంది అయినా సరే పరాక్రమించు. (10)
వి॥సం॥ ఇచట "అరేః" అనిపాఠం(దేవ) అపుడు శత్రువు కోరలను అని అర్థం.
అప్యరేః శ్యేనవచ్ఛిద్రం పశ్యేస్త్వం విపరిక్రమన్।
వినదన్ వాథవా తూష్ణీం వ్యోమ్నీవాపరిశంకితః॥ 11
ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే డేగలాగా మౌనంగా కాని మాట్లాడుతూ కాని(శత్రుశిబిరాల్లో) తిరుగుతూ శత్రువులకు అనుమానం రాకుండా వారి బలహీనతలను కనిపెట్టాలి. (11)
త్వమేవం ప్రేతవత్ శేషే కస్మాద్వజ్రహతో యథా।
ఉత్తిష్ఠ హే కాపురుష మా స్వాప్సీః శత్రునిర్జితః॥ 12
వజ్రాయుధం దెబ్బతిన్న వాని వలె ఇలా చచ్చినట్లు పడుకొంటూ వేమిరా? నీచుడా! శత్రువులకు ఓడిపోయి నిద్రపోకురా! ముందు లేవరా! (12)
మాస్తంగమస్త్వం కృపణః విశ్రూయస్వ స్వకర్మణా।
మా మధ్యే మా జఘాన్యే త్వం మాఽధోభూస్తిష్ఠ గర్జితః॥ 13
దైన్యంతో చచ్చిపోకు. విధినిర్వహణంతో ప్రసిద్ధికెక్కు. సామాన్యుడిగా కాని, అల్పుడిగా కాని, అధముడుగా కాని జీవించకు. ఉరుముతూ వెలుగుతూ జీవించు. (13)
వి॥సం॥ మధ్యమములయిన సామ, భేదోపాయములను, అధమమయిన దానోపాయం వదలి దండోపాయాన్నే స్వీకరించు. (నీల)
అలాతం తిందుకస్యేవ ముహూర్తమపి విజ్వల।
మా తుషాగ్నిరివానర్చిః ధూమాయస్వ జిజీవిషుః॥ 14
కొద్దిసేపయినా తుమ్మికి కొరవిలాగా వెలుగులు చిమ్ముతూ బ్రతుకు. ఊక నిప్పులాగా మంటలేకుండా పొగలు కక్కుతూ జీవించాలనుకోకు. (14)
వి॥ ఊకనిప్పు లోపలలోపల కుములుతుంది.
ముహూర్తం జ్వలితం శ్రేయః న చ ధూమాయితం చిరమ్।
మాహ స్మ కస్యచిద్గేహే జని రాజ్ఞః ఖరో మృదుః॥ 15
చాలాసేపు పొగలు కక్కడం కంటె కొద్ది కాలమయినా వెలుగులు చిమ్మటం శ్రేయస్కరం. ఎవడో ఒక రాజు ఇంట్లో గాడిదలాగా(బరువు మోస్తూ) పుట్టకు. (15)
కృత్వా మానుష్యకం కర్మ సృత్వాజిం యావదుత్తమమ్।
ధర్మస్యనృణ్యమాప్నోతి న చాత్మానం విగర్హతే॥ 16
వీరుడు యథాశక్తిగా యుద్ధం చేసి అయినా సరే పురుష ప్రయత్నం చేస్తే ధర్మానికి అప్పు పడకుండా ఉంటాడు. తనను తాను అపుడు నిందించుకోవలసిన పనిలేదు. (16)
అలబ్ధ్వా యది వా లబ్ధ్వా నానుశోచతి పండితః।
ఆనంతర్యం చారభతే న ప్రాణానాం ధనాయతే॥ 17
ఫలితం పొందినా పొందకపోయినా జ్ఞాని విచారించడు. అనంతర కార్యాలు వెంటనే ప్రారంభిస్తాడు. ధనంకోసం ప్రాకులాడడు. (17)
ఉద్భావయస్వ వీర్యం వా తాం వా గచ్ఛ ధ్రువాం గతిమ్।
ధర్మం పుత్రాగ్రతః కృత్వా కిం నిమిత్తం హి జీవసి॥ 18
పౌరుషాన్ని మనసులో నిలుపుకో లేదా ధర్మాన్ని ముందుంచుకొని శాశ్వతగతిని పొందు.(రెండూ లేకుండా) నీవెందుకు జీవిస్తున్నావురా? (18)
ఇష్టాపూర్తం హి తే క్లీబ కీర్తిశ్చ సకలా హతా।
విచ్ఛిన్నం భోగమూలం తే కిం నిమిత్తమ్ హి జీవసి॥ 19
పౌరుషహీనుడా! నీకు ఇష్టానుపూర్తాలు లేనే లేవు. కీర్తి అంతా నశించింది. భోగానికి మూలం రాజ్యం పోనేపోయింది. ఇంకా ఎందుకు జీవిస్తున్నావురా? (19)
శత్రుర్నిమజ్జతా గ్రాహ్యః జంఘాయాం ప్రపతిష్యతా।
విపరిచ్ఛిన్నమూలోఽపి న విషీదేత్ కథంచన॥ 20
ఉద్యమ్య ధురముత్కర్షేద్ ఆజానేయ కృతం స్మరన్।
తాను మునిగిపోతున్నా, పడిపోతున్నా శత్రువును పిక్క అయినా పుచ్చుకొని లాక్కుపోవాలి. మూలం చెడిపోయినా సరే ఎప్పుడూ శోకింపరాదు. ఉత్తమజాతి గుర్రాన్ని మనసులో పెట్టుకొని భారం వహించాలి. ప్రయత్నించాలి. (20 1/2)
కురు సత్త్వం చ మానం చ విద్ధి పౌరుష మాత్మనః॥ 21
ఉద్భావయ కులం మగ్నం త్వత్కృతే స్వయ మేవ హి।
బలాన్ని ప్రయోగించు. అభిమానాన్ని కూడ గట్టుకో. నీపౌరుషం ఎంతటిదో తెలుసుకో. నీ వల్ల దిగజారిపోతున్న వంశప్రతిష్ఠను ఉద్ధరించు. (21 1/2)
యస్య వృత్తం న జల్పంతి మానవా మహదద్భుతమ్॥ 22
రాశివర్ధనమాత్రం స నైవ స్త్రీ న పునః పుమాన్।
ఎవని ప్రవర్తనను మానవులు ఉత్తమమూ, అద్భుతమూ అని ప్రశంసించరో వాడు కేవలం సంఖ్యాపూర్తికే పనికి వస్తాడు కాని వాడు స్త్రీ కాదు పురుషుడూ కాదు. (22 1/2)
దానే తపసి సత్యే చ యస్య నోచ్చరితం యశఆHఅ॥23
విద్యాయామర్థలాభే వా మాతురుచ్చార ఏవ సః।
దానంలో తపస్సులో, సత్యంలో, విద్యలో, ధన సంపాదనంలో పేరు తెచ్చుకొనని వాడు తల్లి వదలిన మలం వంటివాడు. (23 1/2)
శ్రుతేన తపసా వాపి శ్రియా వా విక్రమేణ వా॥ 24
జవాన్ యోఽభిభవత్యన్యాన్ కర్మణా హి స వై పుమాన్।
జ్ఞానంతో, తపస్సుతో, సంపదతో, పరాక్రమంతో ఇతర మానవులను దాటిపో గలవాడే పురుషుడు. (24 1/2)
న త్వేవ జాల్మీం కాపాలీం వృత్తిమేషితుమర్హసి॥ 25
నృశంస్యామయశస్యాం చ దుఃఖాం కాపురుషోచితామ్।
అంతేకాని నీచులకూ, క్రూరులకూ, మూర్ఖులకూ, తగిన భిక్షవృత్తి నీ వంటి వారికి తగదు. అది అపకీర్తి తెస్తుంది. (25 1/2)
యమేనమభినందేయుః అమిత్రాః పురుషం కృశమ్॥ 26
లోకస్య సమవజ్ఞాతం నిహీనాసనవాససమ్।
అహోలాభకరం హీనమ్ అల్పజీవనమల్పకమ్॥ 27
నేదృశం బంధుమాసాద్య బాంధవః సుఖమేధతే।
కృశించిపోయి ఉండటానికీ, కట్టుకోవటానికీ లేనివాడని లోకమంతటా తెలిసినవాడు, స్వల్పలాభంతో ఆహా! ఎంతలాభించిందో అని పొంగి పోయేవాడు, హీనుడు, స్వల్పమయిన జీవనం కలవాడు, శత్రువులకు సంతోషం కలిగించువాడు అయిన బంధువు వల్ల ఎవరూ సుఖపడరు. (26 27 1/2)
అవృత్త్యైవ విపత్స్యామః వయం రాష్ట్రాత్ప్రవాసితాః॥ 28
సర్వకామరసైర్హీనాః స్థానభ్రష్టా అకించనః।
రాష్ట్ర నుండి మనం నిర్వాసితుల మవుతాం. ఏకోరికా తృప్తీ ఉండదు. స్థానభ్రష్టులమై, దరిద్రులమై ఏ వృత్తిలేక చచ్చిపోతాము. (28 1/2)
అవల్గుకారిణం సత్సు కులవంశస్య నాశనమ్॥ 29
కలిం పుత్రప్రవాదేన సంజయ త్వామజీజనమ్।
సంజయా! సజ్జనుల్లో అనుచిత కార్యం చేశావు. జ్ఞాతులకూ, వంశానికీ అప్రతిష్ఠ తెస్తూ ఉన్న నిన్ను కొడుకుగా కన్నాను. (29 1/2)
నిరమర్షం నిరుత్సాహం నిర్వీర్యమరినందనమ్॥ 30
మా స్మ సీమంతినీ కాచిత్ జనయేత్ పుత్రమీదృశమ్।
ఒక పట్టుదల లేదు, ఉత్సాహం లేదు, పరాక్రమం లేదు, శత్రువులకు సంతోషం కలిగిస్తావు. ఇటువంటి పుత్రుని ఏ మగనాలూ కనదు. (30 1/2)
మా ధూమాయ జ్వలాత్యంతం ఆక్రమ్య జహి శాత్రవాన్॥ 31
జ్వల మూర్ధన్యమిత్రాణాం ముహూర్తమపి వా క్షణమ్।
ఊరికే పొగచూరిపోకు, శత్రువు పై పడి భగ్గుమని మండిపోయి వారిని చంపు. ముహూర్తకాలం చివరకు క్షణమయినా శత్రువు తల మీద మండిపో. (31 1/2)
ఏతావానేవ పురుషః యదమర్షీ యదక్షమీ॥ 32
క్ష్మావాన్ నిరమర్షశ్చ నైవ స్త్రీ న పునః పుమాన్।
ఇలా శత్రువులపై కోపమూ అసహనమూ కలవాడే పురుషుడు. అలా కాక శత్రువుపట్ల సహనంతో కోపం లేనివాడు పురుషుడూ కాదు స్త్రీయూ కాదు. (నపుంసకుడు)(32 1/2)
సంతోషో వై శ్రియం హంతి తథానుక్రోశ ఏవ చ॥ 33
అనుత్థానభయే చోభే నిరీహో నాశ్నుతే మహత్।
సంతృప్తి సంపదను నశింపజేస్తుంది. అలాగే అనవసరమయిన కారుణ్యం కూడా. పౌరుషం లేకపోవడం, భయమూ ఈ రెండూ సంపదను నశింపజేస్తాయి. అందుచేత కోరికలేకపోతే గొప్పదనం కలగదు. (33 1/2)
ఏభ్యో నికృతి పాపేభ్యః ప్రముంచాత్మానమాత్మనా॥ 34
ఆయసం హృదయం కృత్వా మృగయస్వ పునః స్వకమ్।
ఇలా పరాభవం కలిగించే పాపాల నుండి నిన్ను నీవు విడిపించుకో - మనసు రాయి(ఇనుపముద్ద) చేసికొని నీ సొమ్మును నీవు వెదకికొనుము. (34 1/2)
పరం విషహతే యస్మాత్ తస్మాత్ పురుష ఉచ్యతే॥ 35
తమాహుర్వ్యర్థనామానం స్త్రీవద్ య ఇహ జీవతి।
శత్రువును తట్టుకోగలవాడే పురుషుడనిపించుకొంటాడు. అలా కాకుండా ఆడదానిలాగా బ్రతికేవాడిని వ్యర్థుడంటారు. (35 1/2)
శూరస్యోర్జితసత్త్వస్య సింహవిక్రాంతచారిణః॥ 36
దిష్టభావం గతస్యాపి విషయే మోదతే ప్రజా।
శూరుడయిన బలవంతుడు సింహపరాక్రమంతో సంచరిస్తూ ఒకవేళ మరణించినా వాని విషయంలో సంతానం కూడా సంతోషిస్తుంది. (36 1/2)
వి॥ సం॥ దిష్టభావం = మరణము(అర్జు)
య ఆత్మనః ప్రియసుఖే హిత్వా మృగయతే శ్రియమ్॥ 37
అమాత్యానామథో హర్షమ్ ఆదధాత్యచిరేణ సః॥ 38
తన ప్రియాన్నీ, సుఖాన్నీ, విడిచి సంపదలకై అన్వేషించేవాడు త్వరలోనే తన వారికి సంతోషం కలిగిస్తాడు. (37,38)
పుత్ర ఉవాచ
కింను తే మామపశ్యంత్యాః పృథివ్యా అపి సర్వయా।
కిమాభరణకృత్యం తే కిం భోగైర్జీవితేన వా॥ 39
అపుడు(సంజయుడు) కొడుకు ఇట్లు అన్నాడు. అమ్మా! నేను లేకపోయాక నీకు ఈ భూమి అంతా లభించినా ప్రయోజనం ఏముంది? ఈ ఆభరణాలు లభించినా ప్రయోజనం ఏముంది? ఈ ఆభరణాలు ఎందుకు? ఈ భోగాలెందుకు? ఈ జీవితం ఎందుకు? (39)
మాతోవాచ
కిమద్యకానాం యే లోకాః ద్విషంతస్తానవాప్నుయుః।
యే త్వాదృతాత్మనాం లోకాః సుహృదస్తాన్ వ్రజంతు నః॥ 40
వెంటనే తల్లి(విదుల) ఇట్లన్నది. సోమరుల లోకాలను శత్రువులు పొందాలి. ఆత్మ గౌరవం కలవారి లోకాలను మన స్నేహితులు పొందాలి. (40)
వి॥సం॥ అద్యకానాం = సోమరుల యొక్క(నీల)
॥ = దైవం మీద భారం మోపే నిష్క్రియుల యొక్క(అర్జు)
భృత్యైర్విహీయమానానాం పరపిండోపజీవినామ్।
కృపణానామసత్త్వానాం మా వృత్తిమనువర్తిథాః॥ 41
సేవకులందరూ విడిచిపోతూఉంటే పరాన్నం తింటూ, దీనులై, దుర్బలు లైన వారి ప్రవృత్తిని అనుసరించకు. (41)
అను త్వాం తాత జీవంతు బ్రాహ్మణాః సుహృదస్తథా।
పర్జన్యమివ భూతాని దేవా ఇవ శతక్రతుమ్॥ 42
తండ్రీ! జీవులన్నీ వానదేవునీ, దేవతలంతా ఇంద్రునీ ఆశ్రయించి జీవిస్తున్నారు. అలాగే బ్రాహ్మణులూ, స్నేహితులీ నిన్ను ఆశ్రయించుకొని జీవించాలి. (42)
యమాజీవంతి పురుషం సర్వభూతాని సంజయ।
పక్వం ద్రుమమివాసాద్య తస్య జీవిత మర్థవత్॥ 43
సంజయా! పక్షులు ఫలాలు కల చెట్టును ఆశ్రయించి బ్రతుకుతాయి. అలాగే అందరూ అన్ని ప్రాణులూ ఎవనిని ఆశ్రయించి బ్రతుకుతాయో వాని జీవితం సార్థకం. (43)
యస్య శూరస్య విక్రాంతైః ఏధంతే బాంధవాః సుఖమ్।
త్రిదశా ఇవ శక్రస్య సాధు తస్యేహ జీవితమ్॥ 44
దేవతలు ఇంద్రుని పరాక్రమంతో సుఖం పొందుతున్నట్లు తన పరాక్రమంతో బంధువులు సుఖపడితే ఆ శూరుని జీవితమే గొప్పది, మంచిది. (44)
స్వబాహుబలమాశ్రిత్య యోఽభ్యుజ్జీవతి మానవః।
స లోకే లభతే కీర్తిం పరత్ర చ శుభాం గతిమ్॥ 45
తన భుజబలంతో జీవించే మానవునికి ఈ లోకంలో కీర్తి లభిస్తుంది. పరలోకంలో శుభగతి కలుగుతుంది. (45)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి విదులాపుత్రానుశాసనే త్రయస్త్రింశదధిక శతతమోఽధ్యాయః॥ 133 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విదులాపుత్రానుశాసనమను నూట ముప్పది మూడవ అధ్యాయము. (133)