147. నూట నలువది యేడవ అధ్యాయము

భీష్ముని పలుకులను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వినిపించుట.

వైశంపాయన ఉవాచ
ఆగమ్య హస్తినపురాత్ ఉపప్లవ్య మరిందమః।
పాండవానాం యథావృత్తం కేశవః సర్వముక్తవాన్॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు - కేశవుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి జరిగిన దంతా పాండవులకు తెలిపాడు. (1)
సంభాష్య సుచిరం కాలం మంత్రయిత్వా పునః పునః।
స్వమేవ భవనం శౌరిః విశ్రామార్థం జగామ హ॥ 2
మళ్లీ మళ్లీ చాలా సేపు చెప్పి, వారిని విడిచి కృష్ణుడు విశ్రాంతి కోసం తన భవనానికి వెళ్లాడు. (2)
విసృజ్య సర్వాన్ నృపతీన్ విరాటప్రముఖాంస్తదా।
పాండవా భ్రాతరః పంచ భానా ఽ వస్తంగతే సతి॥ 3
సంధ్యాముపాస్య ధ్యాయంతః తమేవ గతమానసాః।
ఆనాయ్య కృష్ణం దాశార్హం పునర్మంత్రమమంత్రయన్॥ 4
విరాటుడు మొదలయిన రాజులందరినీ వారి భవనాలకు పంపి పాండవులయిదుగురూ సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందన మాచరించారు. కృష్ణునే భావిస్తూ అతని మీదనే మనసు నిలిపి కృష్ణుని రప్పించి మళ్లీ ఆలోచింపసాగారు. (3,4)
యుధిష్ఠిర ఉవాచ
త్వయా నాగపురం గత్వా సభాయాం ధృతరాష్ట్రజః।
కిముక్తః పుండరీకాక్ష తన్నః శంసితుమర్హసి॥ 5
యుధిష్ఠిరుడిలా ఆరంభించాడు - పుండరీకాక్షా! హస్తినాపురానికి వెళ్లి నీవు సభలో దుర్యోధనునితో ఏమన్నావో చెప్పు. (5)
వాసుదేవ ఉవాచ
మయా నాగపురం గత్వా సభాయాం ధృతరాష్ట్రజః।
తథ్యం పథ్యం హితం చోక్తః న చ గృహ్ణాతి దుర్మతిః॥ 6
వాసుదేవుడిట్లు చెప్పాడు. హస్తినాపురం వెళ్లి నేను ఆ దుర్యోధనునికి న్యాయసహితమూ, హితమూ అయిన వాస్తవం చెప్పాను. కాని ఆ దుర్మతి అది గ్రహించలేదు. (6)
యుధిష్ఠిర ఉవాచ
తస్మిన్నుత్పథమాపన్నే కురువృద్ధః పితామహః।
కిముక్తవాన్ హృషీకేశ దుర్యోధనమమర్షణమ్॥ 7
అపుడు యుధిష్ఠిరుడిలా అన్నాడు. వాడు అలా దారి తప్పుతుంటే కురువృద్ధుడు భీష్ముడు సహనం లేని దుర్యోధనునితో ఏమన్నాడు? (7)
ఆచార్యో వా మహాభాగ భారద్వాజః కిమబ్రవీత్।
పితా వా ధృతరాష్ట్రస్తం గాంధారీ వా కిమబ్రవీత్॥ 8
ఆచార్య ద్రోణుడేమన్నాడు? తండ్రి ధృతరాష్ట్రుడే మన్నాడు? గాంధారి ఏమన్నది? (8)
పితా యనీయానస్మాకం క్షత్తా ధర్మవిదాం వరః।
పుత్రశోకాభిసంతప్తః కిమాహ ధృతరాష్ట్రజమ్॥ 9
మా పినతండ్రి విదురుడు ధర్మవేత్తలలో ఉత్తముడు. కొడుకుల గురించి ఆవేదన చెందుతూ ఉంటాడు. అతడు దుర్యోధనునితో ఏమన్నాడు? (9)
కిం చ సర్వే నృపతయః సభాయాం యే సమాసతే।
ఉక్తవంతో యథాతత్త్వం తద్బ్రూహి త్వం జనార్దన॥ 10
సభలోని రాజులంతా ఏమన్నారు? జనార్దనా! అదంతా ఉన్నదున్నట్లు చెప్పు. (10)
ఉక్తవాన్ హి భవాన్ సర్వం వచనం కురుముఖ్యయోః।
ధార్తరాష్ట్రస్య తేషాం హి వచనం కురుసంసది॥ 11
కామలోభాభిభూతస్య మందస్య ప్రాజ్ఞమానినః।
అప్రియం హృదయే మహ్యం తన్న తిష్ఠతి కేశవ॥ 12
కౌరవ సభలో నీవూ, కురుముఖ్యులూ ఆ దుర్యోధనునికి అంతా చెప్పి ఉంటారు. కాని ఆ దుర్యోధనుడు కామలోభాలతో నిండిపోయాడు. తెలివి తక్కువ వాడు. పైగా తానే తెలివైన వాడి ననుకొంటాడు. మీ మాటలు వానికి అప్రియంగా ఉంటాయి. వాని మనసులో నిలవవు. (11,12)
తేషాం వాక్యాని గోవింద శ్రోతుమిచ్ఛామ్యహం విభో।
యథా చ నాభిపద్యేత కాలస్తాత తథా కురు।
భవాన్ హి నో గతిః కృష్ణ భవాన్నాథో భవాన్ గురుః॥ 13
వారి వాక్యాలు కూడా వినాలని ఉంది. గోవిందా! కాలం మించిపోకుండా చేయవలసిన దేదో అది చెయ్యి. మాకు గతి నీవే - మాకు నాథుడవు, గురువు కూడా నీవే. (13)
వాసుదేవ ఉవాచ
శృణు రాజన్ యథావాక్యమ్ ఉక్తో రాజా సుయోధనః।
మధ్యే కురూణాం రాజేంద్ర సభాయాం తన్నిబోధ మే॥ 14
అపుడు వాసుదేవుడు ఇలా అన్నాడు? రాజా! కౌరవ సభలో ఆ దుర్యోధనునికి నేను చెప్పిన మాట ఎటువంటిదో విను. (14)
మయా విశ్రావితే వాక్యే జహాస ధృతరాష్ట్రజః।
అథ భీష్మః సుసంక్రుద్ధః ఇదం వచనమబ్రవీత్॥ 15
నేను చెప్పిన మాట విని దుర్యోధనుడు బిగ్గరగా నవ్వాడు. అపుడు భీష్ముడు కోపించి ఇలా అన్నాడు. (15)
దుర్యోధన నిబోధేదం కులార్థం యద్బ్రవీమి తే।
తచ్ఛ్రుత్వా రాజశార్దూల స్వకులస్య హితం కురు॥ 16
దుర్యోధనా! వంశాన్ని రక్షించడం కోసం నేను చెప్పే మాట విను - విని మన వంశానికి హితం చేకూర్చు. (16)
మమ తాత పితా రాజన్ శంతనుర్లోకవిశ్రుతః।
తస్యాహమేక ఏవాసం పుత్రః పుత్రవతాం వరః॥ 17
నాయనా! నా తండ్రి శంతనుడు లోక విఖ్యాతుడు. ఆయనకు నేనొక్కడినే కొడుకును అయ్యాను. (17)
తస్య బుద్ధిః సముత్పన్నా ద్వితీయః స్యాత్ కథం సుతః।
ఏకపుత్రమపుత్రం వై ప్రవదంతి మనీషిణః॥ 18
ఆయనకు "మరో కొడుకు నాకు ఎలా పుడతాడా" అని ఆలోచన కలిగింది. ఒకే పుత్రుడు కల వానిని పుత్రులు లేని వానిగానే శాస్త్రకారులు చెపుతారు. (18)
న చోచ్ఛేదం కులం యాయాద్ విస్తీర్యేచ్చ కథం యశః।
తస్యాహ మీప్సితం బుద్ధ్యా కాలీం మాతరమావహమ్॥ 19
"వంశం-విచ్ఛేదం కాకూడదు - నాకీర్తి ఎలా విస్తరిస్తుంది?" అని ఆయన ఆలోచన - దానిని నేను తెలిసికొని సత్యవతిని తల్లిగా తీసుకువచ్చాను. (19)
ప్రతిజ్ఞాం దుష్కరాం కృత్వా పితురర్థే కులస్య చ।
అరాజా చోర్థ్వరేతాశ్చ యథా సువిదితం తవ।
ప్రతీతో నివసామ్యేష ప్రతిజ్ఞామనుపాలయన్॥ 20
తండ్రి కోసం వంశం కోసం నేను దుష్కరమైన ప్రతిజ్ఞ చేసి ఆమెను తెచ్చాను. రాజ్యాన్ని, వివాహాన్ని త్యజించినట్లు నీకు తెలుసును. ఆ ప్రతిజ్ఞను కాపాడుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను. (20)
తస్యాం జజ్ఞే మహాబాహుః శ్రీమాన్ కురుకులోద్వహః।
విచిత్రవీర్యో ధర్మాత్మా కనీయాన్ మమ పార్థివ॥ 21
ఆమెకు మహాబాహువయిన విచిత్రవీర్యుడు పుట్టాడు. అతడు శ్రీమంతుడు - ధర్మాత్ముడు - కురువంశాన్ని ఉద్ధరించాడు. (21)
స్వర్యాతేఽహం పితరి తం స్వరాజ్యే సన్న్యవేశయమ్।
విచిత్రవీర్యం రాజానం భృత్యో భూత్వా హ్యధశ్చరః॥ 22
నా తండ్రి స్వర్గస్థుడు కాగానే నేను వానిని రాజుగా నిలిపి, వానికి సేవకుడ నయ్యాను. (22)
తస్యాహం సదృశాన్ దారాన్ రాజేంద్ర సముపాహరమ్।
జిత్వా పార్థివ సంఘాతమ్ అపి తే బహుశః శ్రుతమ్॥ 23
చాలామంది రాజులను జయించి వానికి తగిన భార్యలను తెచ్చాను. బహుశః అదినీవు వినే ఉంటావు. (23)
తతో రామేణ సమరే ద్వంద్వయుద్ధముపాగమమ్।
స హి రామభయాదేభిః నాగరైర్విప్రవాసితః॥ 24
ఆ తరువాత పరశురామునితో నాకు ద్వంద్వ యుద్ధం కలిగింది. పరశురాముని వల్ల భయంతో నగరంలోని వారంతా నా తమ్ముని దూరంగా తీసుకుపోయారు. (24)
దారేష్వప్యతిసక్తశ్చ యక్ష్మాణం సమపద్యత।
యదా త్వరాజకే రాష్ట్రే న వవర్ష సురేశ్వరః॥
తదాభ్యధావన్మామేవ ప్రజాః క్షుద్భయపీడితాః॥ 25
భార్యాలోలత్వంతో అతనికి క్షయరోగం సంక్రమించింది. రాజ్యం అరాజకమయిపోయింది. వర్షాలు కురవలేదు. అపుడు ప్రజలంతా ఆకలితో, భయంతో బాధపడుతూ నా దగ్గరకు వచ్చారు. (25)
ప్రజా ఊచుః
ఉపక్షీణాః ప్రజా సర్వా రాజా భవ భవాయ నః।
ఈతీః ప్రణుద భద్రం తే శాంతనోః కులవర్ధన॥ 26
ప్రజలు ఇలా చెప్పారు. శంతను వంశ వర్ధనా! ప్రజలంతా క్షీణించి పోతున్నారు. జనహితం కోరి మాకు రాజువు కమ్ము. మా ఈతిబాధలు పోగొట్టు. నీకు శుభమగుగాక! (26)
వి॥సం॥ ఈతి బాధలు = అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దగ్గరగా ఉన్న రాజులు. (ఇవి ఆరు)(నీల)
పీడ్యంతే తే ప్రజాః సర్వాః వ్యాధిభిర్భృశదారుణైః।
అల్పావశిష్టా గాంగేయ తాః పరిత్రాతుమర్హసి॥ 27
గాంగేయా! ప్రజలంతా భయంకర వ్యాధులతో బాధపడుతున్నారు - ఇంక కొద్దిమందే మిగిలిఉన్నారు - వారిని నీవే రక్షించాలి. (27)
వ్యాధీన ప్రణుద వీరత్వం ప్రజా ధర్మేణ పాలయ।
త్వయి జీవతి మా రాష్ట్రం వినాశముపగచ్ఛతు॥ 28
వ్యాధుల్ని పారద్రోలి ప్రజలను ధర్మపూర్వకంగా పరిపాలించు. నీవు జీవించి ఉండగా రాష్ట్రం వినాశం చెందకూడదు. (28)
భీష్మ ఉవాచ
ప్రజానాం క్రోశతీనాం వై నైవాక్షుభ్యత మే మనః।
ప్రతిజ్ఞాం రక్షమాణస్య సద్వృత్తం స్మరత స్తథా॥ 29
అపుడు భీష్ముడిలా అన్నాడు - ప్రతిజ్ఞను నిలుపుకుంటూ, సత్ప్రవర్తనను స్మరించే నా మనస్సు ప్రజలు మొరపెట్టుకొంటున్నా కలత పడలేదు. (29)
తతః పౌరా మహారాజ మాతా కాలీ చ మే శుభా।
భృత్వాః పురోహితాచార్యాః బ్రాహ్మణాశ్చ మహాశ్రుతాః।
మామూచుర్భృశ సంతప్తాః భవ రాజేతి సంతతమ్॥ 30
మహారాజా! అపుడు పౌరులు, తల్లి సత్యవతి, సేవకులు, పురోహితులు, గురువులు, బ్రాహ్మణులు, విద్వాంసులూ చాలా బాధపడుతూ నన్ను రాజుకమ్మని సతతమూ చెప్పసాగారు. (30)
ప్రతీపరక్షితం రాష్ట్రం త్వాం ప్రాప్య వినశిష్యతి।
స త్వమస్మద్ధితార్థం వై రాజా భవ మహామతే॥ 31
పూర్వం ప్రతీపుడు రక్షించిన ఈ రాజ్యం నీ తరంలో నశించిపోతోంది. మహామతీ! ఇపుడు నీవు మా హితం కోసం రాజువు కావాలి. (31)
ఇత్యుక్తః ప్రాంజలిర్భూత్వా దుఃఖితో భృశమాతురః।
తేభ్యో న్యవేదయం తత్ర ప్రతిజ్ఞాం పితృగౌరవాత్॥ 32
ఇలా వారు చెప్పేటప్పటికి నేను చాలా బాధపడ్డాను. వారికి అంజలించి తండ్రి మీది గౌరవంతో పూర్వం నేను చేసిన ప్రతిజ్ఞను వారికి చెప్పాను. (32)
ఊర్థ్వరేతా హ్యరాజా చ కులస్యార్థే పునః పునః।
విశేషత స్త్వదర్థం చ ధురి మా మాం నియోజయ॥ 33
నేను బ్రహ్మచారిని, రాజును కాను. ఈ వంశం కోసం ముఖ్యంగా నీకోసం తల్లీ! ఈ ప్రతిజ్ఞ చేశాను. ఈ భారం వహించమని నన్ను ఆజ్ఞాపించకు. (33)
తతోఽహం ప్రాంజలిర్భూత్వా మాతరం సంప్రసాదయమ్।
నామ్బ శాంతమనా జాతః కౌరవం వంశముద్వహన్॥ 34
ప్రతిజ్ఞాం వితథాం కుర్యామ్ ఇతి రాజన్ పునః పునః।
విశేషతస్త్వదర్థం చ ప్రతిజ్ఞాం కృతవానహమ్॥ 35
మళ్లీ నేను అంజలించి తల్లి సత్యవతిని ఇలా ప్రార్థించాను. తల్లీ! నేను శంతమని కుమారుడిని. కురువంశభారం వహించి చేసిన ప్రతిజ్ఞను వ్యర్థం చేయలేను. ముఖ్యంగా ఆ ప్రతిజ్ఞ నీకోసమే చేశాను కదా. (34,35)
అహం ప్రేష్యశ్చ దాసశ్చ తవాద్య సుతవత్సలే।
ఏవం తామనునీయాహం మాతరం జనమేవ చ॥ 36
అయాచం భ్రాత్ఱ్ఱ్య్దారేషు తదా వ్యాసం మహామునిమ్।
సహమాత్రా మహారాజ ప్రసాద్య తమృషిం తదా॥ 37
అపత్యార్థం మహారాజ ప్రసాదం కృతవాంశ్చ సః।
త్రీన్ స పుత్రానజనయత్ తదా భరతసత్తమ॥ 38
నేను నీ సేవకుడిని, దాసుడిని, పుత్రప్రేమ కల తల్లీ అంటూ ఆమెను, ప్రజలను పునః పునః ప్రార్థించాను. వ్యాసుని ప్రార్థించి సోదరక్షేత్రాలలో సంతానం పొందుమని యాచించాను. సంతానం కోసం అతడు అంగీకరించి ముగ్గురు పుత్రులను అనుగ్రహించాడు. (36,37, 38)
అంధః కరణహీనత్వాత్ న వై రాజా పితా తవ।
రాజా తు పాండురభవత్ మహాత్మా లోకవిశ్రుతః॥ 39
నీ తండ్రి గ్రుడ్డివాడవడం చేత రాజు కాలేదు. మహాత్ముడై లోక విఖ్యాతుడైన పాండుడు రాజయ్యాడు. (39)
స రాజా తస్య తే పుత్రాః పితుర్దాయాద్యహారిణః।
మా తాత కలహం కార్షీః రాజ్యస్యార్ధం ప్రదీయతామ్॥ 40
అతడు రాజు కావడం చేత అతని పుత్రులు తండ్రి రాజ్యానికి ఉత్తరాధికారులు. అందుచేత నాయనా! వారితో కలహం పెట్టుకోకు. రాజ్యంలో సగభాగం వారికియ్యి. (40)
మయి జీవతి రాజ్యం కః సంప్రశాసేత్ పుమానిహ।
మావమంస్థా వచో మహ్యం శమమిచ్ఛామి వః సదా॥ 41
నేను జీవించి ఉండగా రాజ్యం పాలించగల మగవాడెవ్వడున్నాడు? నామాటను అవమానించకు. నేను సదా మీ శాంతిని కోరేవాడిని. (41)
న విశేషోఽస్తి మే పుత్ర త్వయి తేషు చ పార్థివ।
మతమేతత్ పితుస్తుభ్యం గాంధార్యా విదురస్య చ॥ 42
కుమారా! నీ మీద, పాండవుల మీద నాకు ఏమాత్రం తేడా లేదు. ఇది నీ తండ్రికీ, తల్లికీ, విదురునికీ కూడా ఇష్టం. (42)
శ్రోతవ్యం ఖలు వృద్ధానాం నాభిశంకీర్వచో మమ।
నాశయిష్యసి మా సర్వమ్ ఆత్మానం పృథివీం తతా॥ 43
పెద్దల మాట వినాలి కదా! నా మాటను శంకించకు. నిన్నూ, భూమినీ, సర్వాన్నీ నాశనం చేసుకోకు. (43)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భగవద్వాక్యే సప్తచత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 147 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భగవద్వాక్యమను నూట నలువది ఏడవ అధ్యాయము. (147)