159. నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము

ధృతరాష్ట్ర సంజయ సంవాదము.

జనమేజయ ఉవాచ
తథా వ్యూఢేష్వనీకేషు కురుక్షేత్రే ద్విజర్షభ।
కిమకుర్వంశ్చ కురవః కాలేనాభిప్రచోదితాః॥ 1
జనమేజయుడు ఇలా ప్రశ్నించాడు. ద్విజోత్తమా! ఆ విధంగా కురుక్షేత్రంలో సైన్యాలు మోహరించాక కాలచోదితులైన కౌరవులు ఏం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
తథా వ్యూఢేష్వనీకేషు యత్తేషు భరతర్షభ।
ధృతరాష్ట్రో మహారాజ! సంజయం వాక్యమబ్రవీత్॥ 2
వైశంపాయనుడు ఇట్లు చెప్పాడు. భరతకుల భూశ్హణా! ఇలా ఉభయ సైన్యాలు వ్యూహరచనలతో కురుక్షేత్రంలో పోరుకు సిద్ధమయ్యాయి. అపుడు ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా పలికాడు. (2)
ఏహి సంజయ సర్వం మే ఆచక్ష్వానవశేషతః।
సేనానివేశే యద్వృత్తం కురుపాండవసేనయోః॥ 3
సంజయా! ఇలా రా! కురుపాండవుల సేనలు కురుక్షేత్రంలో మోహరించాక ఏం జరిగిందో పూర్తిగా నాకు చెప్పు. (3)
దిష్టమేవ పరం మన్యే పౌరుషం చాప్యనర్థకమ్।
యదహం బుద్ధ్యమానోఽపి యుద్ధదోషాన్ క్షయోదయాన్॥ 4
తథాపి నికృతిప్రజ్ఞం పుత్రం దుర్ద్యూతదేవినమ్।
న శక్నోమి నియంతుం వ కర్తుమ్ వా హితమాత్మనః॥ 5
దైవమే చాలా బలీయమైనదని అనుకుంటున్నా. దాని ముందు పురుషప్రయత్నాలు వ్యర్థమౌతాయి. నాకు యుద్ధం వల్ల కలిగే అనర్థాలు పూర్తిగా తెలుసును. ద్యూతక్రీడలో ఆరితేరి కపట బుద్ధితో దుష్టద్యూతం ఆడే నా కుమారుని నేను నిరోధించలేను. నేను (నా) ధర్మమైన హితాన్నీ సాధించలేను. (4-5)
భవత్యేవ హి మే సూత! బుద్ధిర్దోషానుదర్శినీ।
దుర్యోధనం సమాసాద్య పునః సా పరివర్తతే॥ 6
సూతా! నా బుద్ధి పై దోషాల్ని గమనిస్తూనే ఉంది. ఎంత గుర్తించినా దుర్యోధనుని కలిసేటప్పటికి మరల మారిపోతోంది. (6)
ఏవం గతే వై యద్భావి తద్భవిష్యతి సంజయ।
క్షత్రధర్మః కిల రణే, తనుత్యాగో హి పూజితః॥ 7
సంజయా! ఈ పరిస్థితిలో జరుగనున్నది తప్పక జరిగి తీరుతుంది. కాని యుద్ధంలో శరీరాన్ని సమర్పణ చేసే క్షత్రధర్మ ఆచరణ ద్వారా క్షత్రియునకు గొప్ప గౌరవం కలుగుతుంది కదా॥ (7)
సంజయ ఉవాచ
త్వద్యుక్తోఽయమనుప్రశ్నః మహారాజ యథేచ్ఛసి।
న తు దుర్యోధనే దోషమ్ ఇనుమాధాతుమర్హసి॥ 8
సంజయుడు పలుకుతున్నాడు - మహారాజా! నీకు తగిన విధంగానే నీవు ప్రశ్నించావు. అది నీకు తగినదే. నీవు తెలుసుకోవాలనుకొంటున్న ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉంది. కాని దోషమంతా దుర్యోధనునిపై నెట్టవద్దు. (8)
శృణుష్వానవశేషేణ వదతో మమ పార్థివ।
య ఆత్మనో దుశ్చరితాత్ అశుభం ప్రాప్నుయాన్నరః।
న స కాలం న వా దేవాః నేనసా గంతుమర్హతి॥ 9
రాజా! నేను దాచకుండా చెప్పే మాట విను. మానవుడు తన చెడుప్రవర్తన ద్వారా పొందే ఫలితాలను కాలంపైనా దేవతలపైనా మోపడం, నిందారోపణ చేయడం తగదు. (9)
మహారాజ మనుష్యేషు నింద్యం యస్సర్వమాచరేత్।
స వధ్యః సర్వలోకస్య నిందితాని సమాచరన్॥ 10
మహారాజ! ఇతరులతో కలసి చెడుప్రవర్తన కలిగి నింద్యవృత్తిని కలిగి ఉండే మానవుడు పాపాత్ముడు. అతడు అందరిచేత సంహరించదగినవాడే. (10)
నికారా మనుజశ్రేష్ఠ పాండవై స్త్వత్ప్రతీక్షయా।
అనుభూతాస్సహామాత్యైః నికృతై రధిదేవనే॥ 11
నీ ఉపేక్ష్య చేత అపుడు పాండవులూ వారి అమాత్యులూ జూదంలో ఎన్నో అవమానాలు పొందారు. (11)
హయానాం చ గజానాం చ రాజ్ఞాం చామితతేజసామ్।
వైశసం సమరే వృత్తం యత్ తన్మే శృణు సర్వశః॥ 12
ఇపుడు జరిగే యుద్ధంలో అశ్వాలు, గజాలు, పరాక్రమవంతులైన రాజులు వినాశం పొందుతారు. ఈ విషయాలన్నిటినీ తెలియజేస్తాను. (12)
స్థిరో భూత్వా మహాప్రాజ్ఞ! సర్వలోకక్షయోదయమ్।
యథాభూతం మహాయుద్ధే! శ్రుత్వా చైకమనా భవ॥ 13
మహామతీ! ఈ మహాయుద్ధంలో సంపూర్ణ వినాశం కానుంది. ఆ వృత్తాంతాలు సంఘటనలు ఉన్నవున్నట్లు చెపుతాను. నీవు స్థిరచిత్తంతో సావధానుడవై వినటానికి సిద్ధంగా ఉండు. (13)
న హ్యేవ కర్తా పురుషః కర్మణో శుభపాపయోః।
అస్వతంత్రో హి పురుషః కార్యతే దారుయంత్రవత్॥ 14
మానవుడు పుణ్యపాపాలకు తాను కర్తకాడు. స్వతంత్రుడు కాడు. అతడు ప్రారబ్ధ కర్మకు అధీనుడు. కేవలం చెక్కబొమ్మవలె యంత్రారూఢుడై గిరగిర తిరుగుతున్నాడు. (14)
కేచిదీశ్వరనిర్దిష్టాః కేచిదేవ యదృచ్ఛయా।
పూర్వకర్మభిరప్యన్యే త్రైధమేతత్ ప్రదృశ్యతే॥
తస్మాదనర్థమాపన్నః స్థిరో భూత్వా నిశామయ॥ 15
కొందరు పరమేశ్వర ప్రేరణచే కార్యాలు సాగిస్తారు. మరికొందరు తమకు తోచినట్లు కర్మల నాచరిస్తారు. మరికొందరు తమ తమ పూర్వకర్మలు తిప్పినట్లు తిరుగుతారు. ఇలా ఇది మూడు విధాలుగా కనిపిస్తుంది. అందుచేత అనర్థం పొందిన నీవు స్థిరుడవై విను. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణపర్వణి సంజయవాక్యే ఏకోనషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 159 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సైన్యనిర్యాణపర్వమను ఉపపర్వమున
సంజయ వాక్యమను నూట ఏబది తొమ్మిదవ ఆధ్యాయము. (159)