161. నూట అరువది యొకటవ అధ్యాయము
ఉలూకుడు దుర్యోధనుని సందేశమును పాండవులకు వినిపించుట.
సంజయ ఉవాచ
సేనానివేశం సంప్రాప్తః కైతవ్యః పాండవస్య హ।
సమాగతః పాండవేయైః యుధిష్ఠిరమభాషత॥ 1
సంజయుడు ఇట్లన్నాడు - ఉలూకుడు పాండవుల శిబిరంలోకి వెళ్లి పాండవులను కలిసి ధర్మరాజుతో ఇలా అన్నాడు.(1)
అభిజ్ఞో దూతవాక్యానాం యథోక్తం బ్రువతో మమ।
దుర్యోధన సమాదేశం శ్రుత్వా న క్రోద్ధుమర్హసి॥ 2
దూతల మాటలు ఎలా ఉంటాయో బాగా తెలిసినవాడవు. దుర్యోధనుడు ఆజ్ఞాపించినట్లు చెప్పే నా మాటలు విని నీవు కోపపడరాదు. (2)
యుధిష్ఠిర ఉవాచ
ఉలూక న భయం తేఽస్తి బ్రూహి త్వం విగతజ్వరః।
యన్మతం ధార్తరాష్ట్రస్య లుబ్ధస్యాదీర్ఘదర్శినః॥ 3
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. ఉలూకా! నీకేమీ భయంలేదు. ఆవేశపడకుండా చెప్పు. ముందు చూపులేని లుబ్ధుడు ఆ దుర్యోధనుని అభిప్రాయం చెప్పు. (3)
తతో ద్యుతిమతాం మధ్యే పాండవానాం మహాత్మనామ్।
సృంజయానాం చ మత్స్యానాం కృష్ణస్య చ యశస్వినః॥ 4
ద్రుపదస్య సపుత్రస్య విరాటస్య చ సన్నిధౌ।
భూమిపానాం చ సర్వేషాం మధ్యే వాక్యం జగాద హ॥ 5
తేజస్వులు, మహాత్ములూ అయిన పాండవులూ, సృంజయులూ, మత్స్యులు, యశస్వి అయిన కృష్ణుడు, పుత్ర సహితులయిన విరాట ద్రుపదులూ, మిగిలిన రాజులూ అందరి మధ్య ఉలూకుడు ఇలా అన్నాడు. (4,5)
ఉలూక ఉవాచ
ఇదం త్వామబ్రవీద్రాజా ధార్తరాష్ట్రో మహామనాః।
శృణ్వతాం కురువీరాణాం తన్నిబోధ యుధిష్ఠిర॥ 6
ఉలూకుడిట్లన్నాడు. యూధిష్ఠిరా! కౌరవ వీరులంతా వింటూ ఉండగా మహామనస్వి అయిన దుర్యోధనుడు నీతో చెప్పమన్నాడు - విను. (6)
పరాజితోఽసి ద్యూతేన కృష్ణా చావాయితా సభామ్।
శక్యోఽమర్షో మనుష్యేణ కర్తుం పురుషమానినా॥ 7
నీవు జూదంలో ఓడింపబడ్డావు - ద్రౌపదిని సభలోకి లాక్కువచ్చాం. మగతనం ఉన్న మానవుడెవరికయినా అపుడు కోపం వచ్చి తీరుతుంది. (7)
ద్వాదశైవ తు వర్షాణి వనే ధిష్ణ్యాద్వివాసితః।
సంవత్సరం విరాటస్య దాస్యమాస్థాయ చోషితః॥ 8
పన్నెండేళ్ళు మిమ్మల్ని ఇంటినుండి అడవులకు వెడలగొట్టాము - సంవత్సరం పాటు విరాటునికి దాస్యం చేస్తూ పడి ఉన్నారు. (8)
అమర్షం రాజ్యహరణం వనవాసం చ పాండవ।
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం సంస్మరన్ పురుషో భవ॥ 9
పాండుపుత్రా! రాజ్యాపహరణం, అరణ్యవాసం, ద్రౌపదీ పరాభవం వీటినన్నిటినీ తలచుకొంటూ అయినా కోపంతో పురుషుడివిగా ప్రవర్తించు. (9)
అశక్తేన చ యచ్ఛస్తం భీమసేనేన పాండవ।
దుశ్శాసనస్య రుధిరం పీయతాం యది శక్యతే॥ 10
అసమర్థుడయిన భీముడు ప్రతిజ్ఞ చేశాడుగా! చేతనైతే దుశ్శాసనుని రక్తం త్రాగమను. (10)
లోహాభిసారో నిర్వృత్తః కురుక్షేత్ర మకర్దమమ్।
సమః సంథా భృతాఽస్తేఽశ్వాః శ్వో యుధ్యస్వ సకేశవః॥ 11
ఆయుధ పూజ జరిగింది. కురుక్షేత్రం అంతా బురద లేకుండా తయారైంది. మార్గాలన్నీ సమంగా చేశారు. గుర్రాలు చక్కగా బలిసి ఉన్నాయి. కృష్ణునితో సహా రేపు యుద్ధానికి రా! (11)
అసమాగమ్య భీష్మేణ సంయుగే కిం వికత్థసే।
ఆరురుక్షుర్యథా మందః పర్వతం గంధమాదనమ్॥ 12
కుంటివాడు గంధమాదన పర్వతం ఎక్కాలనుకున్నట్లు భీష్మునితో యుద్ధంలో తలపడకుండానే బడాయి మాటలు పలుకుతున్నావే! (12)
ఏవం కత్థసి కౌంతేయ అకత్థన్ పురుషో భవ।
సూతపుత్రం సుదుర్థర్షం శల్యం చ బలినాం వరమ్॥ 13
ద్రోణం చ బలినాం శ్రేష్ఠం శచీపతిసమం యుధి।
అజిత్వా సంయుగే పార్థ రాజ్యం కథమిహేచ్ఛసి॥ 14
ఎందుకిలా వాగుతావు భీమా! మాటలు ఆపి మగవాడికమ్ము - అణచరాని కర్ణునీ, బలవంతుల్లో ఉత్తముడయిన శల్యునీ, మహేంద్ర సమానుడయిన ద్రోణునీ జయించకుండానే రాజ్యం ఎలా ఆశిస్తున్నావు? (13-14)
బ్రాహ్మే ధనుషి చాచార్యం వేదయోరంతగం ద్వయోః।
యది ధుర్యమవిక్షోభ్యమ్ అనీకచరమచ్యుతమ్॥ 15
ద్రోణం మహాద్యుతిం పార్థ జేతుమిచ్ఛసి తన్మృషా।
న హి శుశ్రుమ వాతేన మేరుమున్మథితం గిరిమ్॥ 16
ద్రోణుడు వేదంలోనూ, ధనుర్వేదంలోనూ ఆచర్యుడు. రెండింటి అంతం చూసినవాడు, యుద్ధంలో సర్వభారమూ వహిస్తాడు. చలనంలేకుండా స్థిరంగా సేనలో తిరుగుతూ పొరబడనివాడు. అటువంటి మహాతేజస్విని జయించాలనుకుంటున్నావు కాని అది జరిగేదికాదు. మేరు పర్వతాన్ని గాలి కుదిపినట్లు ఎప్పుడూ మనం వినలేదు కదా! (15-16)
అనిలో వా వహేన్మేరుం ద్యౌర్వాపి నిపతేన్మహీమ్।
యుగం వా పరివర్తేత యద్యేవం స్యాద్యథాత్థ మామ్॥ 17
నన్ను నీవు అన్నట్లే జరిగితే మేరు పర్వతాన్ని గాలి ఎగురకొట్టుతుంది. ఆకాశం నేలకూలుతుంది. కాలచక్రం వెనక్కు తిరుగుతుంది. (17)
కోహ్యస్తి జీవితాకాంక్షీ ప్రాప్యేమమరిమర్దనమ్।
గజో వాజీ రథో వాఽపి పునః స్వస్తి గృహాన్ వ్రజేత్॥ 18
బ్రతుకుమీద ఆశ ఉన్న వాడెవడయినా సరే-ఏనుగు నెక్కికానీ, గుర్రమెక్కికానీ, రథమెక్కికానీ ద్రోణుని ఎదిరించి సుఖంగా యింటికి చేరగలడా? (18)
కథమాభ్యామభిధ్యాతః సంస్పృష్టో దారుణేన వా।
రణే జీవన్ విముచ్యేత పదా భూమిముపస్పృశన్॥ 19
ఈ భీష్మద్రోణులు, ఎవరినయినా చంపాలనుకుంటే దారుణ మయినవారి అస్త్రం తాకిన తరువాత వాడు ప్రాణాలతో బయట పడతాడా? వాడి కాళ్లు నేల మీద నిలుస్తాయా.? (19)
కిం దర్దురః కూపశయో యథేమాం
న బుధ్యసే రాజచమూం సమేతామ్।
దురాధర్షాం దేవచమూప్రకాశాం
గుప్తాం నరేంద్రైస్త్రిదశైరివ ద్యామ్॥ 20
ఇక్కడి మాసేనను ఎవరూ ఎదుర్కొనలేరు - దేవతల సేనలాగా వెలిగిపోతోంది. స్వర్గాన్ని దేవతల లాగా రాజులంతా రక్షిస్తున్నారు. ఇంతటి సేనను నూతిలో కప్పలాగా తెలుసుకోలేక పోతున్నావు. (20)
ప్రాచ్యైః ప్రతీచ్యైరథ దాక్షిణాత్యైః
ఉదీచ్యకాంబోజశకైః ఖశైశ్చ।
శాల్వైః స్మత్స్యైః కురుముఖ్యదేశ్యైః
మ్లేచ్ఫైః పులిందైః ద్రవిడాంధ్ర కాంచ్యైః॥ 21
నాలుగు దిక్కుల రాజులూ, కాంబోజులు, శకులు, ఖశులు, శాల్వులు, మత్స్యులు, కురుమధ్య దేశీయులు, మ్లేచ్ఛులు, పుళిందులు, ద్రావిడులు, ఆంధ్రులు, కాంచీ దేశీయులు - అంతా నా సేనను రక్షిస్తున్నారు. (21)
నానాజనౌఘం యుధి సంప్రవృద్ధం
గాంగం యథా వేగమపారణీయమ్।
మాం చ స్థితం నాగబలస్య మధ్యే
యుయుత్ససే మంద కిమల్పబుద్ధే॥ 22
వివిధ దేశస్థులతో పెరిగిపోయి ఉన్న నా సేన గంగా వేగంలాగా దాటశక్యం కాకుండా ఉంది. ఏనుగుల యూథం మధ్యలో ఉన్న నాతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు - ఎంత తెలివి తక్కువతనమో! (22)
ఇత్యేవముక్త్వా రాజానం ధర్మపుత్రం యుధిష్ఠిరమ్।
అభ్యావృత్య పునర్జిష్ణుమ్ ఉలూకః ప్రత్యభాషత॥ 23
యుధిష్ఠిరునితో ఇలా అని ఉలూకుడు మళ్లీ అర్జునుని వైపు తిరిగి ఇలా అన్నాడు. (23)
అకత్థమానో యుధ్యస్య కత్థసేఽర్జున కిం బహు।
పర్యాయాత్సుద్ధిరేతస్య నైతత్సిధ్యతి కత్థనాత్॥ 24
అర్జునా! ఎక్కువ గొప్పలెందుకు? మాటలు మాని యుద్ధం చెయ్యి. విజయం అనేది మానవ ప్రయత్నంతో కలుగుతుంది కాని ఇలా గొప్పలు చెప్పుకుంటే రాదు.
యదీదం కత్థానాల్లోకే సిధ్యేత్ కర్మ ధనంజయ।
సర్వే భవేయుః సిద్ధార్థాః కత్థనే కో హి దుర్గతః॥ 25
అర్జునా! కేవలం గొప్పలు చెప్పుకొంటేనే పనులు జరిగితే అందరికీ ప్రయోజనం సమకూరినట్లే. గొప్పలు చెప్పుకోవటం చేతకానిదెవరికి? (25)
జానామి తే వాసుదేవం సహాయం
జానామి తే గాండివం తాలమాత్రమ్।
జానామ్యేతత్ త్వాదృశో నాస్తి యోద్ధా
జానానస్తే రాజ్యమేతద్ధరామి॥ 26
నీకు కృష్ణుడు తోడున్నాడనీ తెలుసు - తాటిచెట్టంత విల్లు నీకుందనీ తెలుసు - నీలాంటి యోద్ధ లేకపోవడమూ తెలుసు - అంతా తెలిసే నీరాజ్యం హరిస్తున్నాను. (26)
న తు పర్యాయధర్మేణ రాజ్యం ప్రాప్నోతి మానుషః।
మనసైవానుకూలాని విధాతా కురుతే వశే॥ 27
మానవుడు పర్యాయ ధర్మంతో కూడా రాజ్యం పొందలేడు. బ్రహ్మ తనమనస్సంకల్పానికి అనుకూలంగా పనులు నెరవేరేటట్లు చేస్తాడు. (27)
త్రయోదశసమా భుక్తం రాజ్యం విలపతస్తవ।
భూయశ్పైవ ప్రశాసిష్యే నిహత్య త్వాం సబాంధవమ్॥ 28
నీవు ఏడుస్తూ ఉంటే పదమూడేళ్లూ రాజ్యం మేము అనుభవించాము. ఇపుడు నిన్ను బంధుసహితంగా చంపి మరీ అనుభవిస్తాను. (28)
క్వ తదా గాండివం తేఽభూద్ యత్త్వం దాసపణైర్జితః।
క్వ తదా భీమసేనస్య బలమాసీచ్చ ఫాల్గున॥ 29
అర్జునా! నిన్ను జూదంలో ఓడించి దాసుని చేసినవాడు ఈ గాండివం ఎక్కడికి పోయింది? భీమసేనుని బలం ఎక్కడుంది? (29)
సగదాద్భీమసేనాద్వా పార్థాద్వాఽపి సగాండివాత్।
న వై మోక్షస్తదా వోఽభూద్ వినా కృష్ణామనిందితామ్॥ 30
గద దాల్చిన భీముని వల్లగాని, గాండివం దాల్చిన అర్జునుని వల్లగాని ఆనాడు మీకు ముక్తి లభించలేదు - పాపం ఏమీ ఎరగని ఆ ద్రౌపది గతి అయింది. (30)
సా వో దాస్యే సమాపన్నాన్ మోక్షయామాస పార్షతీ।
అమానుష్యం సమాపన్నాన్ దాసకర్మణ్యవస్థితాన్॥ 31
పౌరుషం విడిచి దాస్యం చేసే మిమ్మల్ని ఆనాడు ద్రౌపది విడిపించింది. (31)
అవోచం యత్ షండతిలాన్ అహం వస్తథ్యమేవ తత్।
ధృతా హి వేణీ పార్థేన విరాటనగరే తదా॥ 32
నపుంసకులని నేను ఆనాడు సభలో మిమ్మల్ని అన్నమాట నిజమే అయింది. విరాట నగరంలో అర్జునుడు సిగచుట్టాడు కదా! (32)
సూదకర్మణి చ శ్రాంతం విరాటస్య మహానసే।
భీమసేనేన కౌంతేయ యచ్చ తన్మమ పౌరుషమ్॥ 33
విరాటుని వంటశాలలో భీమసేనుడు వంటలు చేసి అలసిపోయాడు గదా - అదికూడా నా పనితనమే. (33)
ఏవమేతత్ సదా దండం క్షత్రియాః క్షత్రియే దధుః।
వేణీం కృత్వా షండవేషః కన్యాం వర్తితవానసి॥ 34
ఇలా రాజులు తమ శత్రువుల మీద దండాన్ని ఎల్లప్పుడూ ప్రయోగిస్తారు. అందుచేతనే నీవుకూడా నపుంసకుడివై సిగచుట్టి కన్యలకు ఆటలు నేర్పావు. (34)
న భయాద్వాసుదేవస్య న చాపి తవ ఫాల్గున।
రాజ్యం ప్రతిప్రదాస్యామి యుధ్యస్వ సహకేశవః॥ 35
కృష్ణుని మీద భయంతోనో, నీమీది భయంతోనో నేను రాజ్యం ఇవ్వను - ఆ కేశవునితో వచ్చి యుద్ధం చెయ్యి. (35)
న మాయాహీంద్రజాలం వా కుహకా వాపి భీషణా।
ఆత్తశస్త్రస్య మే యుద్ధే వహంతి ప్రతిగర్జనాః॥ 36
నేను ఆయుధం ధరించి యుద్ధంలో నిలిస్తే ఎదుర్కొనడమే తప్ప అక్కడ మాయలూ, ఇంద్రాజాలాలూ, మోసాలూ, బెదిరింపులూ పని చెయ్యవు. (36)
వాసుదేవసహస్రం వా ఫాల్గునానాం శతాని వా।
ఆసాద్య మామమోఘేషుం ద్రవిష్యంతి దిశో దశ॥ 37
అమోఘమైన ఆయుధంతో నిలిచిన నన్ను ఎదిరించటానికి వేయిమంది కృష్ణులయినా, వందల కొద్దీ అర్జునులయినా సరే దిక్కుల వెంట పారిపోవలసిందే! (37)
సంయుగం గచ్ఛ భీష్మేణ భింధి వా శిరసా గిరిమ్।
తరేమం వా మహాగాధం బాహుభ్యాం పురుషోదధిమ్॥ 38
భీష్మునితో యుద్ధానికయినా సిద్ధపడు లేదా కొండతో తలను పగులగొట్టుకో - లేదూ అగాధమయిన సేవా సముద్రాన్ని చేతులతో ఈది దాటు తెలుస్తుంది. (38)
శారద్వతమహామీనం వివింశతిమహోరగమ్।
బృహద్బలమహోద్వేలం సౌమదత్తితిమింగిలమ్॥ 39
ఆ మహాసముద్రంలో కృపుడనే పెద్దచేప ఉంది. వివింశతి అనే సర్పం ఉంది - బృహద్బలుడనే పెద్ద కెరటాలు, భూరిశ్రవుడనే తిమింగిలమూ ఉన్నాయి. (39)
భీష్మవేగమపర్యంతం ద్రోణగ్రాహదురాసదమ్।
కర్ణశల్యఝుషావర్తం కాంబోజవడవాముఖమ్॥ 40
భీష్ముడనే ఆగని ప్రవాహవేగం, ద్రోణుడనే మొసలి ఉన్న ఈ సేనా సముద్రంలో ఎవరూ ప్రవేశించలేరు పైగా కర్ణుడనే మత్స్యం ఉంది. శల్యుడనే సుడిగుండం ఉంది. కాంబోజరాజు అనే బడబాగ్ని ఉంది. (40)
దుశ్శాసనౌఘం శలశల్యమత్స్యమ్
సుషేణచిత్రాయుధనాగనక్రమ్।
జయద్రథాద్రిం పురుమిత్రగాథం
దుర్మర్షణోదం శకునిప్రపాతమ్॥ 41
దుశ్శాసనుడనే ప్రవాహం, శలుడు, శల్యుడు, అనే చేపలూ, సుషేణుడు, చిత్రాయుధుడు అనే ఏనుగు మొసలి ఉన్నాయి. సైంధవుడనే పర్వతం ఉంది. పురుమిత్రుడనే అగాధం ఉంది. దుర్మర్షణుడనే నీరుంది. శకుని అనే జలపాతం ఉంది. (41)
శస్త్రౌఘమక్షయ్యమతిప్రవృద్ధం
యదావగాహ్య శ్రమనష్టచేతాః।
భవిష్యసి త్వం హతసర్వబాంధవః
తదా మనస్తే పరితాపమేష్యతి॥ 42
ఈ సేనా సముద్రంలో శస్త్రాలనే ప్రవాహాలున్నాయి. అవి పెరుగుతాయే కాని తరగవు. దాంట్లో దిగితే ఎంతో శ్రమ, మనసు నశిస్తుంది. బంధువులంతా చచ్చిపోతారు. అపుడు నీ మనసుకు పరితాపం కలుగుతుంది. (42)
తదా మనస్తే త్రిదివాదివాశుచేః
నివర్తితా పార్థ మహీప్రశాసనాత్।
ప్రశామ్య రాజ్యం హి సుదుర్లభం త్వయా
బుభూషితః స్వర్గ ఇవాతపస్వినా॥ 43
అర్జునా! అపవిత్రుడు స్వర్గం నుండి గెంటివేయ బడినట్లుగా నీ మనస్సు రాజ్యపాలనం నుండి వెనుదిరుగుతుంది. తపస్సు చేయనివానికి స్వర్గం దుర్లభం. అలాగే నీకూ రాజ్యం దుర్లభం. (43)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ ఉలూకదూతాగమన పర్వణి ఉలూక వాక్యే ఏకషష్ట్యుత్తర శతతమోఽధ్యాయః ॥ 161 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున ఉలూకదూతాగమన పర్వమను ఉపపర్వమున
ఉలూకవాక్యమను నూట అరువదిఒకటవ ఆధ్యాయము. (161)